19. అర్జునుండు ద్వారక నుండి వచ్చి ధర్మరాజునకుఁ గృష్ణనిర్యాణమును గూర్చి తెలియజెప్పుట
క. భేదమున నింద్రసూనుడుఁ, యాదవపురినుండి వచ్చి, యగ్రజుఁ, గని, త
త్పాదముల నయన సలిలో, త్పాదకుడై పడియె దీనుభంగి నరేంద్రా ! (343)
క. పల్లటిలిన యుల్లముతోఁ దల్లడపడుచున్న పిన్న తమ్మునిఁ గని వె
ల్వెల్ల నగు మొగముతో జని, లెల్లన విన ధర్మపుత్రుఁ డిట్లని పలికెన్. (344)
సీ. మాతామహుండైన మన శూరఁ డన్నాఁడె ? మంగళంమే మన మాతులునకు ?
మోదమే నలుగురు ముగురు మేనత్తల ? కానందమే వారి యాత్మజులకు ?
నక్రూర కృతవర్మ లాయుస్స మేతులే ? జీవితుఁడే యుగ్రసేన విభుఁడు
గల్యాణ యుక్తులే గద సారణాదులు మాధవు తమ్ములు మానధనులు ?
తే. నందమే? మన సత్యక నందనునకు, భద్రమే ? శంబరాసుర భంజనునకుఁ
గుశలమే? బాణాదనుజేంద్రు కూఁతుపతికి, హర్షమే? పార్థ ! ముసలికి హలికి బలికి. (345)
వ. మఱియును నంధక మధు యదు భోజ దాశార్హ వృష్ణి సాత్వతు లనియెడి వంశంబుల వీరులును, హరి కుమారులై న సాంబ సుషేణ ప్రముఖులును, నారాయణాను చరులైన యుద్ధావాదులును, కృష్ణసహచరులై న సునందాదులును సుఖానందులే? యని యందఱ నడిగి ధర్మజుండు గ్రమ్మఱ నిట్లనియె. (346)
సీ. వైకుంఠవాసుల వడువున నెవ్వని బలమున నానంద భరితులగుచు
వెఱవక యాదవవీరులు వర్తింతు, రమరులు గొలువుండు నట్టి కొలువు
చవికె నాకర్షించి చరణ సేవకులై న బంధు మిత్రాదుల పదతుగమున
నెవ్వఁడు ద్రొక్కించె, నింద్రపీఠము మీఁద, వజ్రంబు జళిపించి వ్రాలువాని
తే. ప్రాణవల్లభ కెంగేలఁ బాదుచేసి, యమృతజలములఁ బోషింప నలరు పారి
జాత మెవ్వఁడు కొనివచ్చి సత్యభాను, కిచ్చె, నట్టి మహాత్మున కిపుడు శుభమె ? (347)
శా.అన్నా ! ఫల్గున ! భక్తవత్సలుఁడు బ్రహ్మణ్యుండు గోవిందుఁ డా
పన్నానీక శరణ్యుఁ డీశుఁడు జగద్భద్రానుసంధాయి శ్రీ
మన్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు సుధర్మమధ్య పీఠంబునం
దున్నాఁడా ! బలభద్రుఁగూడి, సుఖియై, యుత్సాహియై, ద్వారకన్. (348)
క. ఆ రామ కేశవులకును, సారామల భక్తి నీవు సలుపుదువు గదా ?
గారాములు సేయుదురా ? పోరాముల బంధు లెల్లప్రొద్దు జితారీ ! (349)
శా. మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో
సన్నాహంబునఁ గాలకేయుల వడిం బక్కాడుచోఁ బ్రాభవ
స్కన్నుండై చనుకౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచోఁ
గన్నీ రెన్నఁ డుఁ దేవు తండ్రి ! చెపుమా ! కల్యాణమే ? చక్రికిన్. (350)
వ. అదియునుం గాక. (351)
క. ఓడితివో శత్రువులకు, నాడితివో సాధు దూష ణాలాపంబుల్
గూడితివో పరసతులను, వీడితివో మానధనము వీరుల నడుమన్. (352)
క. తప్పితివో ? యిచ్చెద నని, చెప్పితివో ? కపటసాక్షి, చేసిన మేలుం
దెప్పితివో ? శరణార్థుల, రొప్పితివో ! ద్విజులఁ బసుల రోగుల సతులన్. (353)
క. అడిచితివో ?భూసురులనఁ గుడిచితివో ? బాల వృద్ద గురువిలు వెలిగా
విడిచితివో ? యాశ్రితులను, ముడిచితివో ? పరల విత్తములు లోభమునన్. (354)
"అధ్యాయము-15"
వ. అని పలికినం గన్నీరు కరతలమునం దుడిచికొనుచు, గద్గదస్వరంబున మహానిధిఁ గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పుల నిగుడింపుచు, నర్జునుండన్న కిట్లనియె. (355)
క. మనసారథి, మన సచివుడు మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుఁడున్
మన విభుఁడు, గురువు, దేవర మనలను దిగనాడి చనియె, మనజాధీశా ! (356)
క. కంటకపు నృపులు సూడఁగ మింటం గంపించు యంత్రమీనముఁ గోలన్
గెంటించి మనము వాలుం, గంటిం జేకొంటి మతని కరణన కాదే ! (357)
క. దండి ననేకులతో నా, ఖండలుఁ డెదురైన గెలిచి భాండవ వనముం
జండార్చికి నర్పించిన, గాండీవము నిచ్చెఁ జక్రి గలుగుటఁ గాదే ? (358)
క. దిక్కుల రాజుల నెల్లను, మక్కించి ధ్నంబు గొనుట, మయకృతసభ ము
న్నెక్కుట, జన్నము సేయుట, నిక్కము హరి మనకు దండ నిలిచినఁగాదే ? (359 )
మ. ఇభజిద్వీర్య ! మఖాభిషిక్తమగు నీ యుల్లాలి ధమ్మిల్లమున్
సభలో శాత్రవు లీడ్చినన్ ముడువ కా చంద్రాస్య దుఃఖింపఁగా
నభయం బిచ్చి ప్రతిజ్ఞచేసి భవదీయారాతికాంతా శిరో
జ భరశ్రీలు హరింపఁడే ? విధవలై సౌభాగ్యముల్ వీడఁగన్. (360)
శా. వైరుల్ గట్టిన పుట్టముల్ విడువఁగా వారింప నా వల్లభుల్
రారీవేళ, ను పేక్షసేయఁ దగవే? రావే/ నివారింపవే ?
లేరే ? పత్రాతలు కృష్ణ ! యందు సభలో లీనాంగియై కుయ్యడన్
గారుణ్యంబున భూరి వస్త్రకలితంగాఁ జేయుఁడు ? ద్రౌపదిన్. (361)
సీ. దుర్వాసుఁ డొసనాఁడు దుర్యోధనుఁడు వంప పదివేల శిష్యులు భక్తిఁ గొలుపఁ
జనుదెంచి మనము పాంచాలియుఁ గిడిచిన వెనక నాహారంబు వేఁడుకొనినఁ
బెట్టద ననపుడుఁ బెట్టకున్న శపింతు ననుచుఁ దో యావగాహమున కేగఁ
గడవల నన్నశాకములు దీఱుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాల
తే. లోన వెఱచిన, విచ్చేసి లోవిలోని, శిష్ట శాకాన్న లవము ప్రాశించి, తపసి
కోప ముడిగించి, పరిపూర్ణ కుక్షిఁజేసె, నిట్టి త్రైలోక్య సంతర్పియెందుఁగలఁడు ? (362)
సీ. పందికై పోరాడి ఫాలాక్షుఁ డేవ్వని బలమున నా కిచ్చెఁ బాశుపతము !
నెవ్వని లావున నీ మేన దేవేంద్రు పీఠార్థమున నుండు పెంపుఁ గంటిఁ !
గాలకేయ నివాత కవచాది దైత్యులఁ జంపితి నెవ్వని సంస్మరించి !
గోగ్రహణమునాఁడు కురుకులాంభోనిధిఁ గడచితి ! నెవ్వని కరుణఁ జేసి
ఆ. కర్ణ సింధురాజు కౌరవేంద్రాదుల, తలల పాగలెల్లఁ దడవి తెచ్చి
యే మహాత్ము బలిమి నిచ్చితి ! విరటుని, పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు. (363)
మ. గురు భీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో
గురుశక్తిన్ రథయంతయై, నొగలపైఁ , గూర్చుండి, యా మేటి నా
శరముల్ వాఱకమున్న వారల బలోత్సాహాయు రుద్యోగ త
త్పరతముల్ చూడ్కుల సమ్హరించె నమితోత్పాహంబు నాకిచ్చుచున్. (364)
మ. అసురేంద్రుం డొసరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె
ల్వ సమర్థంబులు గాని కైవడిఁ గృపాశ్వత్థామ గాంగేయ సూ
ర్యసుతు ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా
దెసకున్ రాక తొలంగ మాధవు దయా దృష్టిన్ నరేంద్రోత్తమా ! (365)
చ. వసుమతి, దివ్యబాణముల ప్రక్కలువాపి, కొలంకుసేసి, నా
రసముల మాతాగాఁ బఱపి, రథ్యములన్ రిపులెల్లఁ ,జూడ, సా
హసమున నీట బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు నా
కసురవిరోధి భద్రగత నండయి వచ్చినఁగాదె ? భూవరా ! (366)
చెలికాఁడ ! రమ్మని చీరు న న్నొకవేళ మఱఁది ! యనుచు
బంధుభావంబునఁ బాటించు నొకవేళ దాతయై యుకవేళ ధనము లిచ్చు
మత్రమై యొకవేళ మంత్ర మాదేశించు బోద్దయై యొకవేళ బుద్దిసెప్పు
సారథ్య మొనరించుఁ జనివిచ్చు నొకవేళఁ గ్రీడించు నొకవేళ గేలిసేయు
తే. నొక్క శయ్యాసనంబున నుండుఁ గన్న, తండ్రికైవడిఁ చేసినత్తప్పుఁ గాఁచు
హస్తములువట్టి పొత్తున నారగించు, మనుజవల్లభ ? మాధవు మఱవరాదు . (367)
క. విజయ ! ధనంజయ ! హనుద్ద్యజ ! ఫల్గున ! పాండురాజతనయ ! నర ! మహేం
ద్రజ ! మిత్రర్జున ! యచును, భుజములు తలకడవ రాకపోకలఁ జీరున్ (368)
క. వారిజగంధులు దమలో, వారింపఁగరాని ప్రేమ వాదము సేయున్
వారిజనేత్రుఁడు ననుఁ దగ, వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా ! (369)
క. నిచ్చలు లోపలి కాంతలు, మచ్చికఁ దనతోడ నాడు మాతలు నాకున్
మువ్వటల సెప్పు మెల్లన, విచ్చలవిడిఁ దొడలమీద విచ్చేసి నృపా ! (370)
చ. అటమటమయ్యె నాభజన మంతయు భూవర ! నేఁడు చూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటన్
బటుతర దేహలోభ్మునఁ బ్రాణము లున్నవి వెంటఁ బోక, నే
గటాకట ! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో ! (371)
శా. కాంతారంబున నొంటిఁ దోడుకొన రాఁగాఁ జూచి, గోవింద శు
ద్ధాంతస్త్రీలఁ బదాఱువేల మద రాగాయత్తులై, తాఁకి, నా
చెంతన్ బోయలు మూఁగిపట్టికొన, సీమంతినీసంఘమున్
భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక, ధాత్రీశ్వరా ! (372)
శా. ఆ తేరా రథకుండు నా హయము లా యస్త్రాసనం బా శర
వ్రాతం బన్యలఁ దొల్లిఁ జంపును, దుదిన్ వ్యర్థంబులై పోయె మ
చ్చేతోధీశుఁడు చక్రి లేమి, భసితక్షిప్తాజ్య మాయావి మా
యాతంత్రోషరభూమి బీజముల మర్యాద న్ని మేషంబునన్. (373)
మ. యదువీరుల్ మినినాథు శాపమునఁ గాలాధీనులై, యందఱున్
మదిరాపాన వివర్థమాన మద సమ్మర్దోగ్ర రోషాంధులై ,
కదనంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి, న
ష్టదశం జిక్కిరి నల్గు రేవు రచటన్ సర్వంసహావల్లభా ! (374)
క. భూతములవలన్ నెప్పుడు భూతములకు జన్మ మరణ పోష్ణములు ని
ర్ణీతములు సేయుచుండును, భూతమయుం డిశ్వరుండు భూపవరేణ్యా ! (375)
క. బలములుగల మీనంబులు, బలవిరహిత మీనములను భక్షించుక్రియన్
బలవంతులైన యదువులు, బలరహితులఱై జంపి రహితభావముల నృపా ! (376)
మ. బలహీనాంగులకున్ బలాధీకులకుం బ్రత్యర్థి భావోద్యమం
బులు గల్పించి, వినాశము న్నెఱపి యీ భూభారముం బాపి, ని
శ్చలబుద్ధిన్ గృతకార్యుఁడై చనియె నా సర్వేశ్వరుం డచ్యుతుం
డలఘుం డేమని చెప్పుదున్ ! భగవదీ యాయత్త ముర్వీశ్వర ! (377)
వ. మఱియు దేశ కాలార్థ యుక్తంబులు, నంతఃకరణ సంతాపశమనంబులు నైన హరి వచనంబులం దలంచి, చిత్తంబు పరాయత్తంబై యున్నది. అని యన్నకుం జెప్పి. నిరుత్తరుండై దలంచి చరణారవింద చింతామలబుద్ధియై, శోకంబు వర్ణంచి, సదా ధ్యాన భక్తవిశేషంబులం గామక్రోధాదుల జయించి తొల్లి తన కుభయసేనా మధ్యంబున ననంతం డానతిచ్చిన గీతలు దలంచి, కాలకర్మ భోగాభినివేశంబుల చేత నావృత్తంబైన విజ్ఞానంబు గ్రమ్మఱ నధిగమించి, శోక హేతు వహంకార మమకారాత్మకంబైన ద్వైతభ్రమం బనియును, ద్వైత భ్రమంబులకుఁ గారణంబు దేహంబనియును, దేహంబునకు బీజంబు లింగం బనియును, లింగంబునకు మూలంబు గుణంబు లనియును, గుణములకు నిదానము ప్రకృతియనియును, బ్రహ్మాహ మనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండుననియు ( ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబువలనః గార్యలింగ నాశంబనియును గార్య లింగ నాశంబున నసంభవం బగు ననియును ) ప్రకృతిం బాసి క్రమ్మఱ స్థూలశరీర ప్రాప్తుండు గాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండు ననియును, నిశ్చయించి , యర్జునుండు విరక్తుండై యూరకుండె. ధర్మజుండు భగవదీయ మార్గంబు దెలిసి, యాదవుల సాశంబు విని, నారదు వచనంబు దలంచి. నిశ్చలచిత్తుండై స్వర్గగమనంబునకు యత్నంబు సేయుచుండె, ఆ సమయంబున, (378)
క. యదువుల నాశము మాధవు, పదవియు విని కుంతి విమలభక్తిన్ భగవ
త్పదచింతా తత్పరయై, ముదమున సంసార మార్గమునకుం బాసెన్. (379)
వ. ఇట్లు కంటకంబునం గంట కోన్మూలనంబు సేసి కంటకంబులు రెంటినిం బరిహరించు నిన్నాణి తెఱంగున, యావరూప శరీరంబునంజేసి యీశ్వరుండు లోకకంటక శరీరంబులు సంహరించి నిజశరీరంబు విడిచె. సంహారమునకు నిజశరీర పరశరీరములు రెండు నీశ్వరునకు సమంబులు, నిజరూపంబున నుండుచు, రూపాంతరంబుల ధరించి క్రమ్మఱ నంతర్థానంబు నొందు నటునికైవడి లీలాపరాయణుండైన నారాయణుండు మీన కూర్మాది రూపంబులు ధరియించుం బరిహరించునని చెప్పి మఱియు నిట్లనియె. (380)
క. ఏ దినమున వైకుంఠుఁడు, మేదినిపైఁ దాల్చినట్టి మేను విడిచినాఁ
డా దినమున నశుభ ప్రతి, పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యెన్. (381)