15. శ్రీకృష్ణుండు ద్వారకా నగరమున కేగుట
వ. అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయు కొఱకును, సుభద్రకుం బ్రియంబు సేయు కొఱకును గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయందలంచి ధర్మనందనునకుం గృతాభివందనుండగుచు నతనిచే నాలింగితుండై యామంత్రణంబు వడసి కొందఱు తనకు నమస్కరించినం గౌఁగలించుకొని, కొందఱు తనుం గౌఁగిలింప నానందించుచు రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు, ద్రౌపదియుఁ , గుంతియు నుత్తరయు, గాంధారియు, ధృతరాష్ట్రుండును, విదురుండును, యుధిష్ఠిరుండును, యుయుత్సుండును, గృపాచార్యుండును నకుల-సహదేవులును, వృకోదరుండును, ధౌమ్యుండును (సత్సంగంబు వలన ముక్త దుస్సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువనోపఁ డట్టి) హరితోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబుల వలన నిమిషమాత్రంబును హరికి నెడలేనివారలైన పాండవులం గూడికొని, హరి మఱలవలెనని కోరుచు హరి సనిన మార్గంబుఁ జూచుచు, హరివిన్యస్తచిత్తులై లోచనంబుల బాష్పంబులొలుక నంతనంత నిలువంబడిరి. అయ్యవసరంబున. (1-232)
సీ. కనక సౌధములపైఁ గౌరవ కాంతలు, కుసుమ వర్షంబులు కోరి కుఱియ
మౌక్తిక దామ సమంచిత ధవళాత,పత్త్రంబు విజయుండు పట్టుచుండ
నుద్ధవ సాత్యకు లుత్సాహవంతులై, రత్నభూషిత చామరములు వీవ
గగనాంతరాళంబుఁ గప్పి కాహళభేరి, పణవ శంఖాది శబ్దములు మొరయ
ఆ.వె. సకల విప్ర జనులు సగుణ నిర్గుణ రూప, భద్రభాషణములు పలుకుచుండ
భువనమోహనుండు పుండరీకాక్షుండు, పుణ్యరాశి హస్తిపురము వెడలె. (1-233)
వ. తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాద శిఖరభాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి మార్గంబుల రెండు దెసలఁ గరారవిందంబులు సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం, "దొల్లిటం బ్రళయంబున గుణంబులం గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబునఁ బ్రపంచాత్మకుండు నద్వితీయుండు నగుచు మేలై దీపించు పురాణపురుషుం డీతం"డనువారును, "జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యె"ట్లనువారును, "జీవనోపాధిభూతంబులైన సత్త్వాది శక్తుల లయంబు జీవలయం"బనువారును, "గ్రమ్మఱ నప్పరమేశ్వరుండు నిజవీర్య ప్రేరితయై నిజాంశ భూతంబులైన జీవులకు మోహినియైన సృష్టి సేయ నిశ్చయించి నామరూపంబులు లేని జీవులందు నామరూపంబులు గల్పించు కొఱకు వేదంబుల నిర్మించి మాయానుసరణంబు సేయు"ననువారును "నిర్మల భక్తి సముత్కంఠా విశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహాభావు నిజరూపంబు దర్శింతు"రనువారును, "యోగమార్గంబులం గాని దర్శింపరా"దనువారు నై. (1-234)
మ. రమణీ ! దూరము వోయెఁ గృష్ణు రథమున్ రాదింక వీక్షింప ; నీ
కమలాక్షుం బొడఁగానలేని దినముల్ కల్పంబులై తోఁచు ; గే
హములం దుండఁగ నేల ? పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం
దము రమ్మా ! యనె నొక్క చంద్రముఖి కందర్పాశుగ భ్రాంతయై. (1-235)
మ. తరుణీ ! యాదవరాజు కాఁ డితఁడు ; వేదవ్యక్తుఁడై యొక్కఁడే
వరుసన్ లోక భవస్థితి ప్రళయముల్ వర్తింపఁగాఁజేయు దు
స్తర లీలారతుఁడైన యీశుఁ ; డితనిన్ దర్శించితిన్ బుణ్య భా
సుర నేనంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్. (1-236)
కం. తామస గుణులగు రాజులు, భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స
త్త్వామల తనుఁడై యీతఁడు, భామిని ! వారల వధించుఁ బ్రతికల్పమునన్. (1-237)
సీ. ఈ యుత్తమ శ్లోకుఁ డెలమి జన్మించిన, యాదవ కులమెల్ల ననఘమయ్యె
నీ పుణ్య వర్తనుం డే ప్రొద్దు నుండిన, మథురాపురము దొడ్డ మహిమ గనియె
నీ పురుషశ్రేష్ఠు నీక్షించి భక్తితో, ద్వారకావాసులు ధన్యులైరి
యీ మహాబలశాలి యెఱిఁగి శాసింపఁగా, నిష్కంటకంబయ్యె నిఖిల భువన
తే.గీ. మీ జగన్మోహనాకృతి నిచ్చగించి, పంచశర భల్లజాల విభజ్యమాన
వివశ మానసమై వల్లవీ సమూహ, మితని యధరామృతముఁ గ్రోలు నెల్ల ప్రొద్దు. (1-238)
ఉ. ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁ గాఁ
జేకొని వేడ్కఁ గాపురము సేయుచు నుండెడి రుక్మిణీ ముఖా
నేక పతివ్రతల్ నియతి నిర్మల మానసలై జగన్నుతా
స్తోక విశేష తీర్థములఁ దొల్లిటి బాముల నేమి నోఁచిరో ! (1-239)
వ. అని యిట్లు నానావిధంబులైన పురసుందరీ వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు నగరంబు వెడలె. ధర్మజుండును హరికి రక్షకంబులై కొలిచి నడువం జతురంగంబులం బంపిన దత్సేనా సమేతులై తన తోడి వియోగంబునకు నోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మఱలించి, కరుజాంగల, పాంచాల, శూరసేన, యామున భూములం గడచి బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీరాభీర విషయంబు లతిక్రమించి తత్తద్దేశ నివాసు లిచ్చిన కానుకలు గొనుచు నానర్త మండలంబు సొచ్చి పద్మబంధుండు పశ్చిమసింధు నిమగ్నుండైన సమయంబునఁ బరిశ్రాంతవాహుండై చని చని. (1-240)
అధ్యాయము - ౧౧
మ.జలజాతాక్షుడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్ర శృంగారకన్
గలహంసావృత హేమపద్మ పరిఘా కాసారకన్ దోరణా
వళి సంఛాదిత తారకన్ దురు లతా వర్గానువేలోదయ
త్ఫల పుష్పాంకుర కోరకన్ మణిమయ ప్రాకారకన్ ద్వారకన్ (1-241)
వ.ఇట్లు తన ప్రియపురంబు డగ్గఱి. (1-242)