12. కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట
కం. పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ , బరుఁ డవ్యయుఁ డఖిల భూత బహిరంతర్ భా
సురుఁడు నవలోకనీయుఁడు, పరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ ! (1-185)
వ. మఱియు జవనిక మఱువున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా జవనికాంతరాళంబున నిలువంబడి మహిమచేఁ బరమహంసలు నివృత్త రాగద్వేషులు నిర్మలాత్ములు నైన మునులకు నదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు గాని నీవు మూఢదృక్కులుఁ గుటుంబవతులు నగు మాకు నెట్లు దర్శనీయుండవయ్యెదు ? శ్రీకృష్ణ ! వాసుదేవ ! దేవకీనందన ! నందగోప కుమార ! గోవింద ! పంకజనాభ ! పద్మమాలాలంకృత ! పద్మలోచన ! పద్మసంకాశ చరణ ! హృషీకేశ ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము. (1-186)
సీ. తనయుల తోడనే దహ్యమానంబగు, జతుగృహంబందును జావకుండఁ
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల, మారుత పుత్త్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ, ద్రౌపది మానంబు దలఁగకుండ
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే, నా బిడ్డ లనిలోన నలఁగకుండ
తే.గీ. విరటు పుత్త్రిక కడుపులో వెలయు చూలు, ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ
మఱియు రక్షింతివి పెక్కు మార్గములను, నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష ! (1-187)
మత్తకోకిలము :- బల్లిదుండగు కంసు చేతను బాధ నొందుచునున్న మీ
తల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రుల చేత నేఁ
దల్లడంబునఁ జిక్కకుండఁగ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన జగత్పతీ ! (1-188)
కం. జననము నైశ్వర్యంబును ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం
చన గోచరుఁడగు నిన్నున్, వినుతింపఁగ లేరు నిఖిల విబుధస్తుత్యా ! (1-189)
వ. మఱియు భక్తిధనుండును, నివృత్త ధర్మార్థ కామ విషయుండును, ఆత్మారాముండును, రాగాది రహితుండును, కైవల్యదాన సమర్థుండును, కాలరూపకుండును, నియామకుండును, నాద్యంత శూన్యుండును, విభుండును, సర్వసముండును, సకలభూత నిగ్రహానుగ్రహకరుండు నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము. మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు ? నీకుఁ బ్రియాప్రియులు లేరు ; జన్మ కర్మశూన్యుండవైన నీవు తిర్యగాది జీవులయందు వరాహాది రూపంబులను మనుష్యులందు రామాది రూపంబులను ఋషులయందు వామనాది రూపంబులను, జలచరంబులయందు మత్స్యాది రూపంబులను నవతరించుట లోక విడంబనార్థంబు గాని జన్మకర్మసహితుండవగుటం గాదు. (1-190)
ఉ. కోపము తోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక త్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం
బాఁపఁడవై నటించుట కృపాపర ! నా మదిఁ జోద్యమయ్యెడున్. (1-191)
కం. మలయమునఁ జందనము క్రియ, వెలయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
యిలపై నభవుఁడు హరి యదు, కులమున నుదయించె నండ్రు కొంద ఱనంతా ! (1-192)
కం. వసుదేవ దేవకులు తా,పస గతి గతభవమునందుఁ బ్రార్థించిన సం
తసమునఁ బుత్త్రత నొందితి, వసురుల మృతికంచుఁ గొంద ఱండ్రు మహాత్మా ! (1-193)
కం. జలరాశిలో మునింగెడి, కలము క్రియన్ భూరిభార కర్శిత యగు నీ
యిలఁ గావ నజుఁడు కోరినఁ , గలిగితివని కొంద ఱండ్రు గణనాతీతా ! (1-194)
తే.గీ. మఱచి యజ్ఞాన కామకర్మములఁ దిరుగు, వేదనాతురునకుఁ దన్నివృత్తిఁ జేయ
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు, కొఱకు నుదయించితండ్రు నిన్ గొంద ఱభవ ! (1-195)
మ. నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచు న్నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురు గాక లోకు లితరాన్వేషంబులం జూతురే ?
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వాగ్
వినుతంబైన భవత్‌పదాబ్జ యుగమున్ విశ్వేశ ! విశ్వంభరా ! (1-196)
వ. దేవా ! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందముల నాశ్రయించి నీవారలమైన మమ్ము విడిచి విచ్చేయనేల ? నీ కరుణావలోకనంబుల నిత్యంబును జూడవేని యాదవ సహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల అచందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు. కల్యాణ లక్షణ లక్షితంబులైన నీ యడుగుల చేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబు గాదు. నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు కుసుమ ఫలభరితంబులు నోషధి తరు లతా గుల్మ నద నదీ నగ సాగర సమేతంబులునై యుండు. (1-197)
ఉ. యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర ! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య ! ఘనసింధువుఁ జేరెడి గంగ భంగి నీ
పాద సరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి న
త్యాదర వృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁగదయ్య ! యీశ్వరా ! (1-198)
శా. శ్రీకృష్ణా ! యదుభూషణా ! నరసఖా ! శృంగార రత్నాకరా !
లోకద్రోహినరేంద్రవంశదహనా !లోకేశ్వరా ! దేవతా
నీక బ్రాహ్మణ గో గణార్తి హరణా ! నిర్వాణ సంధాయకా !
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ ! (1-199)