11. శ్రీమన్మహాభాగవత స్వరూపము మఱియు శ్రీమన్నారాయణుని నిరంజనత్వము
వ. అయ్యవసరంబున. (254)
కం|| ఆ నళినాసన నందను, లైన సనందాది మునుల | కగ్రేసరుఁడున్
మానుగఁ బ్రియతముఁడు నగు, నా నారదుఁ డేఁగుఁదెంచె | నబ్జజు కడకున్. (255)
కం|| చనుదెంచి తండ్రికిం బ్రియ, మొనరఁగ శుశ్రూషణము | లొనరిచి యతఁడున్
దన దెసఁ బ్రసన్నుఁ డగుటయుఁ, గని భగవన్మాయఁ దెలియఁ | గా నుత్సుకుఁడై. (256)
సీ|| అవనీశ ! నీవు న | న్నడిగిన పగిది న, తఁడు తండ్రి నడుగఁ బి | తామహుండు
భగవంతుఁ డాశ్రిత | పారిజాతము హరి, కృపతోడఁ దన కెఱిం | గించినట్టి
లోకమంగళ చతుః | శ్లోక రూపంబును, దశలక్షణంబులఁ | దనరు భాగ
వతము నారదున కు | న్నతిఁ జెప్పె నాతఁడు, చారు సరస్వతీ | తీరమునను
తే|| హరిపద ధ్యాన పారీణుఁ | డాత్మవేది, ప్రకట తేజస్వి యగు బాద | రాయణునకుఁ
గోరి యెఱిఁగించె నమ్మహో | దారుఁ డెలమి, నాకు నెఱిఁగించె నెఱిఁగింతు | నీకు నేను. (257)
వ. అదియునుం గాక యిపుడు విరాట్పురుషుని వలన నీ జగంబు లే విధంబున జనియించె ననియెడి మొదలైన ప్రశ్నలు నన్నడిగితివి. ఏ నన్నింటికి
నుత్తరంబగునట్లుగా నమ్మహాభాగవతం బుపన్యసించెద. ఆకర్ణింపుము. (258)
అధ్యాయము - ౧౦
మార్చువ. అమ్మహాపురాణంబు చతుఃశ్లోక రూపంబున దశ లక్షణంబుల సంకుచిత మార్గంబుల నొప్పు. అందుఁ దన లక్షణంబు లెయ్యవి ? యనిన సర్గంబును, విసర్గంబును,
స్థానంబును, బోషణంబును, ఊతులును మన్వంతరంబులును, ఈశాను చరితంబును, నిరోధంబును, ముక్తియు, నాశ్రయంబు ననం బది తెఱంగులయ్యె. దశమ
విశుద్ధ్యర్థంబు తక్కిన తొమ్మిది లక్షణంబులు సెప్పంబడె. అవి యెట్టివనిన. (259)
తే||| మహదహంకార పంచ త | న్మాత్ర గగన, పవన శిఖి తోయ భూభూత | పంచ కేంద్రి
య ప్రపంచంబు భగవంతు | నందు నగుట, సర్గమందురు దీనిని | జన వరేణ్య. (260)
కం|| సరసిజ గర్భుండు వి, రాట్పురుషుని వలనం జనించి | భూరితర చరా
చర భూతసృష్టిఁ జేయుట, పరువిడిని విసర్గమండ్రు | భరత కులేశా ! (261)
కం|| లోకద్రోహి నరేంద్రా, నీకముఁ బరిమార్చి జగము | నెఱి నిల్పిన యా
వైకుంఠనాథు విజయం, బాకల్పస్థానమయ్యె | నవనీనాథా ! (262)
కం|| హరి సర్వేశుఁ డనంతుఁడు, నిరుపమ శుభమూర్తి చేయు | నిజభక్త జనో
ద్ధరణము పోషణ మవనీ, వర ! యూరులనంగఁ గర్మ | వాసనలరయన్. (263)
తే|| జలజనాభ దయా కటా | క్ష ప్రసాద, లబ్ధి నిఖిలైక లోకపా | లన విభూతి
మహిమఁ బొందినవారు ధ | ర్మములు విస్త,రమునఁ బలుకుట మన్వంత | రములు భూప ! (264)
కం|| వనజోదరు నవతార క,థనము దదీయానువర్తి | తతి చారిత్రం
బును విస్తరించి పలుకం, జను నవి యీశాను కథలు | సౌజన్యనిధీ ! (265)
సీ|| వసుమతీనాథ ! స | ర్వ స్వామియైన గో, విందుండు చిదచిదా | నందమూర్తి
సలిలత స్వోపాధి | శక్తి సమేతుఁడై, తనరారు నాత్మీయ | ధామమందు
ఫణిరాజ మృదుల త | ల్పంబుపై సుఖలీల, యోగనిద్రా రతి | నున్న వేళ
నఖిల జీవులు నిజ | వ్యాపార శూన్యులై, యున్నత తేజంబు | లురలుకొనఁగ
తే|| జఱుగు నయ్యవస్థావిశేషంబులెల్ల, విదితమగునట్లు వల్కుట | యది విరోధ
మన నిది యవాంతర ప్రళ | యం బనంగఁ బరఁగు నిఁక ముక్తిగతి విను | పార్థివేంద్ర. (266)
సీ|| జీవుండు భగవత్కృ | పా వశంబునఁ జేసి, దేహధర్మంబులై | ధృతి ననేక
జన్మానుచరిత దృ | శ్యములైన యజ్జరా, మరణంబు లాత్మ ధ | ర్మంబులైన
ఘన పుణ్యపాప ని | కాయ నిర్మోచన, స్థితి నొప్పి పూర్వ సం | చితములైన
యపహత పాప్మవ | త్త్వాద్యష్ట తద్గుణ, వంతుఁడై తగ భగ | వచ్ఛరీర
తే|| భూతుఁడై పారతంత్ర్యాత్మ | బుద్ధి నొప్పి, దివ్యమాల్యానులేపన | భవ్యగంధ
కలిత మంగళ దివ్య వి | గ్రహ విశిష్టుఁ , డగుచు హరిరూప మొందుటే | యనఘ ! ముక్తి. (267)
వ. మఱియు నుత్పత్తి స్థితిలయంబులెందు నగుచుఁ బ్రకాశింపఁబడు నది యాశ్రమం బనఁబడు. అదియ పరమాత్మ. బ్రహ్మశబ్దవాచ్యంబు నదియ. ప్రత్యక్షానుభవంబున
విదితంబు సేయు కొఱకు నాత్మయు నాధ్యాత్మికాది విభాగంబును జెప్పఁబడియె. అది యెట్లనిన నాత్మ యాధ్యాత్మికాధిదైవికాధిభౌతికంబులఁ ద్రివిధంబులయ్యె. అందు
నాధ్యాత్మికంబు చక్షురాది గోళకాంతర్వర్తియై యెఱుంగంబడు. చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవికుం డనందగు. చక్షురాద్యధిష్ఠానాభిమాన
దేవతయు, సూర్యాది తేజో విగ్రహుండు నగుచు నెవ్వనియందు నీ యుభయ విభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండును, విరాడ్విగ్రహుండు నగుం గావున
ద్రష్టయు, దృక్కు, దృశ్యంబు ననందగు మూఁటియందు నొకటి లేకున్న నొకటి కానరాదు. ఈ త్రితయంబు నెవ్వఁ డెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండై యుండు. అతండె
పరమాత్మయు. అమ్మహాత్ముండు లీలార్థంబై జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపేక్షించి మొదల శుద్ధంబులగు
జలంబుల సృజియించె. స్వతః పరిశుద్ధుండు గావున స్వసృష్టంబగు నేకార్ణవాకారంబైన జలరాశియందు శయనంబు సేయుటం జేసి.
శ్లో|| ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరమానవః |
తా యదస్యాయనం పూర్వం తేన నారాయణః స్మృతః ||
అను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు గావున నతని ప్రభావంబు వర్ణింప దుర్లభంబు. ఉపాదాన భూతంబైన ద్రవ్యంబును, ద్రివిధంభైన కర్మంబును,
గళాకాష్ఠాద్యుపాధిభిన్నంబైన కాలంబును, జ్ఞానాధికంబగు జీవస్వభావంబును, భోఖ్త యగు జీవుండును, నెవ్వని యనుగ్రహంబునం జేసి వర్తింపుచుండు, నెవ్వని
యుపేక్షం జేసి వర్తింపకుండు, నట్టి ప్రభావంబు గల సర్వేశ్వరుండు తా నేకమయ్యు ననేకంబు కాఁదలంచి యోగతల్పంబునం బ్రబుద్ధుండై యుండు. అట మీఁద
స్వసంకల్పంబునం జేసి తన హిరణ్మయంబైన విగ్రహంబు నధిదైవంబు నధ్యాత్మకంబు నధిభూతంబు నను సంజ్ఞాయుతంబైన త్రివిధంబుగా సృజియించె. (268)
సీ|| అట్టి విరాడ్విగ్ర | హాంతరాకాశంబు, వలన నోజస్సహో | బలములయ్యెఁ
బ్రాణంబు సూక్ష్మరూ | ప క్రియాశక్తిచే, జనియించి ముఖ్యాసు | వనఁగఁ బరఁగె
వెలువడి చను జీవి | వెనుకొని ప్రాణముల్, చనుచుండు నిజనాథు | ననుసరించు
భటుల చందంబునఁ | బాటిల్లు క్షుత్తును, భూరితృష్ణయు మఱి | ముఖము వలనఁ
తే|| దాలు జిహ్వాదికంబు లు | ద్భవమునొందె, నందు నుదయించె జిహ్వయు | నందు రసము
లెల్ల నుదయించి జిహ్వచే | నెఱుఁగఁబడును, మొనసి పలుక నపేక్షించు | ముఖము వలన. (269)
వ. (మఱియు) వాగింద్రియంబు వుట్టె. దానికి దేవత యగ్ని. ( ఆ రెంటి వలన భాషణంబు వొడమె. ఆ యగ్నికి మహాజల వ్యాప్తంబగు జగంబున నిరోధంబు కలుగుటం జేసి
యా జలంబె ప్రతిబంధకంబయ్యె.) దోదూయమానంబైన మహావాయువు వలన ఘ్రాణంబు వుట్టెం గావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ
సమర్థంబయ్యె. (నిరాలోకంబగు నాత్మ నాత్మయందుఁ జూడంగోరి) తేజంబు వలన నాదిత్య దేవతాకంబై రూపగ్రాహకంబైన యక్షియుగళంబు వుట్టె. ఋషిగణంబు చేత
బోధితుండగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును నైన శ్రోత్రేంద్రియంబుఁ బుట్టించె. సర్జనంబు సేయు పురుషుని వలన మృదుత్వ కాఠిన్యంబులు,
లఘుత్వ గురుత్వంబులు, నుష్ణత్వ శీతలత్వంబులునుం జేసెడు త్వగింద్రియాధిష్ఠానంబగు చర్మంబు వుట్టె. దాని వలన రోమంబు లుదయించె. వానికి మహీరుహంబు
లధిదేవతలయ్యె. అందు నధిగత స్పర్శగుణుండును, అంతర్బహిఃప్రదేశంబుల నావృతుండును నగు వాయువు వలన (బలవంతంబులు నింద్రదేవతాకంబులును, నాదాన
సమర్థంబులును, నానాకర్మ కరణ దక్షంబులును నగు హస్తంబు లుదయించె.) స్వేచ్ఛావిషయగతి సమర్థుండగు నీశ్వరుని వలన విష్ణుదేవతాకంబులగు పాదంబు
లుదయించె. ప్రజానందామృతార్థి యగు భగవంతుని వలనఁ బ్రజాపతిదేవతాకంబులై స్త్రీ (పురుష) సంభోగాది కామ్యసుఖంబులు కార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు
లుదయించె. మిత్రుం డధిదైవతంబుగాఁ గలిగి భుక్తాన్నాద్యసారాంశ త్యాగోపయోగంబగు పాయువనెడి గుదం బుద్భవించె. దాని కృత్యం బుభయ మల మోచనంబు.
దేహంబున నుండి దేహాంతరంబుఁ జేఱంగోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించె. అట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానం బనంబడు.
తద్బంధ విశ్లేషంబె మృత్యువగు. అదియు యూర్ధ్వాధో దేహ భేదకంబనియుఁ జెప్పంబడు. అన్నపానాది ధారణార్థంబుగా నాంత్ర కుక్షి నాడీచయంబులు కల్పింపంబడియె.
వానికి నదులును, సముద్రంబులును నధిదేవతలయ్యె. (వాని వలన) తుష్టిపుష్టులను నుదర భరణ రస పరిణామంబులును గలిగియుండు. ఆత్మీయ మాయా చింతనం
బొనర్చునపుడు కామసంకల్పాది స్థానంబగు హృదయంబు కలిగె. దానివలన మనంబును, జంద్రుండును, గాముండును, సంకల్పంబును నుదయించె. అంతమీఁద
జగత్సర్జనంబు సేయు విరాడ్విగ్రహంబు వలన సప్తధాతువులును, పృథివ్యప్తేజోమయంబులైన సప్తప్రాణంబులును, వ్యోమాంబు వాయువులచే నుత్పన్నంబులయి
గుణాత్మకంబులైన యింద్రియంబులును. నహంకార ప్రభవంబులైన గుణంబులును, సర్వవికార స్వరూపంబగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియుఁ బుట్టు.
వివిధంబగు నిది యంతయు సర్వేశ్వరుని స్థూలవిగ్రహంబు. మఱియును. (270)
కం|| వరుసఁ బృథివ్యాదృష్టా, వరణావృతమై సమగ్ర | వైభవములఁ బం
క రుహ భవాండాతీత, స్ఫురణం జెలువొందు నతి వి | భూతి తలిర్పన్. (271)
కం|| పొలుపగు సకల విలక్షణ, ము లెసఁగ నాద్యంత శూన్య | మును నిత్యమునై
లలి సూక్ష్మమై మనో వా, క్కులకుం దలపోయఁగా న | గోచరమగుచున్. (272)
సీ|| అలఘు తేజోమయం | బైన రూపం బిది, క్షితినాథ ! నాచేతఁ | జెప్పఁబడియె
మానిత స్థూల సూ | క్ష్మ స్వరూపంబుల, వలన నొప్పెడు భగ | వత్ స్వరూప
మమ్మహాత్మకుని మా | యా బలంబునఁ జేసి, దివ్యమునీంద్రులు | తెలియలేరు
వసుధేశ వాచ్యమై | వాచకంబై నామ, రూపముల్, క్రియలును | రూఢిఁ దాల్చి
ఆ|| యుండునట్టి యీశ్వ | రుండు నారాయణుం, డఖిల ధృతి జ | గన్నియంత యైన
చిన్మయాత్మకుండు | సృజియించు నీ ప్రజా, పతుల ఋషులను బితృ | తతుల నపుడు. (273)
వ. మఱియును. (274)
సీ|| సుర సిద్ధ సాధ్య కి | న్నరవర చారణ, గరుడ గంధర్వ రా | క్షస పిశాచ
భూత బేతాళ కిం | పురుష కూశ్మాండ గు, హ్యక డాకినీ యక్ష | యాతుధాన
విద్యాధరోఽప్సరో | విషధర గ్రహ మాతృ, గణ వృక హరి ఘృష్టి | ఖగ మృగాళి
భల్లూక రోహిత | పశువృక్ష యోనుల, వివిధ కర్మంబులు | వెలయఁ బుట్టి
తే|| జల నభో భూతలంబుల | సంచరించు, జంతు చయంబుల సత్త్వ ర | జస్తమో గు
ణములఁ దిర్యక్సురాసుర | నర ధరాది, భావముల భిన్నులగుదురు | పౌరవేంద్ర ! )275)
మ|| ఇరవొందన్ ద్రుహిణాత్మకుండయి రమా | ధీశుండు విశ్వంబు సు
స్థిరతన్ జేసి హరిస్వరూపుఁడయి ర | క్షించున్ సమస్త ప్రజో
త్కర సంహారము సేయునప్పుడు హరాం | తర్యామియై యింతయున్
హరియించున్ బవనుండు మేఘముల మా | యం జేయు చందంబునన్. (276)
కం|| ఈ పగిదిని విశ్వము సం, స్థాపించును మనుచు నణఁచు | ధర్మాత్మకుఁడై
దీపిత తిర్యఙ్నర సుర, రూపంబులఁ దానె తాల్చి | రూఢి తలిర్పన్. (277)
సీ|| హరియందు నాకాశ | మాకాశమున వాయు, వనిలంబు వలన హు | తాశనుండు
హవ్యవాహనునందు | నంబువు లుదకంబు, లుదకంబు వలన వసుంధర | గలిగె ధాత్రి
వలన బహుప్రజా | వళి యుద్భవంబయ్యె, నింతకు మూలమై | యెసఁగునట్టి
నారాయణుఁడు చిదా | నంద స్వరూపకుం, డవ్యయుం డజరుఁ డ | నంతుఁ డాఢ్యుఁ
తే|| డాది మధ్యాంత శూన్యుం డ | నాది నిధనుఁ , డతని వలనను సంభూత | మైనయట్టి
సృష్టిహేతు ప్రకార మీ | క్షించి తెలియఁ , జాలరెంతటి మునులైన | జన వరేణ్య ! (278)
వ. అదియునుం గాక. (279)
మ|| ధరణీశోత్తమ ! భూతసృష్టి నిటు సం | స్థాపించి రక్షించు నా
హరి కర్తృత్వము నొల్లఁ డాత్మగత మా | యారోపితం జేసి తా
నిరవద్యుండు నిరంజనుండు పరుఁడున్ | నిష్కించనుం డాఢ్యుఁడున్
నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ | నిత్యత్వమున్ బొందెడిన్. (280)
వ. బ్రహ్మసంబంధి అగు నీ కల్పప్రకారం బవాంతర కల్పంబుతోడి సంకుచిత ప్రకారంబున నెఱిఁగించితి. ఇట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్పప్రకారంబులును,
దత్పరిణామంబులును గాలకల్ప లక్షణంబులును, నతివిస్తారంబుగ ముందెఱిఁగింతు, వినుము. అదియును బద్మకల్పం బనందగు. అని భగవంతుఁడయిన శుకుండు
పరీక్షిత్తునకుఁ జెప్పె నని సూతుండు మహర్షులకు నెఱిఁగించిన. (281)