1. మంగళాచరణము మరియు ఇష్టదేవతా స్తుతి
1. కృత్యాది మంగళాచరణ పద్యము (శ్రీకారము చుట్టుట):
శా. శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో
ద్రేక స్తంభకుఁ గేళివిలసద్ దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్.(1-1)
2. శివస్తుతి :
ఉ. వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికిన్
బాల శశాంకమౌళికిఁ గపాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్ సరసీరుహాళికిన్.(1-2)
3. బ్రహ్మస్తుతి
ఉ. ఆతత సేవ సేసెద సమస్త చరాచర భూతసృష్టి వి
జ్ఞాతకు భారతీహృదయ సౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికర నేతకుఁ గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్.(1-3)
వ. అని నిఖిల ప్రధానదేవతా వందనంబు సేసి,(1-4)
4. విఘ్నేశ్వరస్తుతి :
ఉ. ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషకసాదికి సుప్రసాదికిన్.(1-5)
5. సరస్వతీస్తుతి :
ఉ. క్షోణితలంబు నెన్నుదురు సోఁకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితానత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజపాణికి రమ్యపాణికిన్.(1-6)
శా. పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ ! యో యమ్మ ! మేల్
పట్టున్ మానకుమమ్మ ! నమ్మితిఁ జుమీ ! బ్రాహ్మీ ! దయాంభోనిధీ !(1-7)
6. కనకదుర్గాస్తుతి
ఉ. అమ్మలఁ గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి వుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.(1-8)
7. శ్రీమహాలక్ష్మీ స్తుతి :
మ. హరికిం బట్టపు దేవి పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క చం
దురు తోఁబుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూఁబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.(1-9)