హేమలత/పదునేనవ ప్రకరణము
పదునేనవ ప్రకరణము
ఆ మఱునాడు పద్మినినైన పద్మినిప్రతిబింబమునైన నొక పర్యాయము రాజపుత్రులు తను జూడనిచ్చినయెడ ముట్టడిమాని పోవుటకు జక్రవర్తి సమ్మతించిన వర్తమానమునంపెను. అందువిషయమై దర్బారుజరుగ నందుజేరి సామంతులతో గొందఱదియు నవమానకరమని వాదించిరి. మఱి కొందరద్దములో బద్మినీదేవినీడను జూపుట యవమానకరము కాదని యభిప్రాయపడిరి. స్వకులక్షయమునకును దేశనాశనమునకును భీమసింగు వెఱచి తనభార్యయొక్కనీడను జక్రవర్తికి జూపుటకు నియ్యకొనెను. కాని యా చక్రవర్తి యొకడె రావలయునని కట్టడిచేసెను. రాజపుత్రులు నిరాయుధుడుగను నిస్సహాయుడుగ నున్నవానిని వధింపరన్న దృఢవిశ్వాసముతో జక్రవర్తి కామాంధకారముచే గనులు కానక రహిమానుఖాను నొక్కని వెంటబెట్టుకొని కోటజొచ్చెను. చక్రవర్తికి దగిన గౌరవముల నొనర్చి భీమసింగు తన భార్యనీడ నొక యద్దములో బ్రతిబింబమగునట్లుచేసి యాతనికి జూపెను. నీడనో జగన్మోహనాకరము దాల్చియున్న యా త్రిలోకసుందరియగు పద్మిని నిజముగ నెట్లుండునోయని యద్భుతపడి సంతుష్టాంతరంగుడై పిమ్మట గోటవెడలిపోవుటకు జక్రవర్తి సిద్ధమైయుండెను. ఆసమయమున జక్రవర్తియు భీమసింగును నిట్లు మాటాడిరి.
చక్ర – నేను మీరుచేసిన మర్యాదలకు జాల సంతోషించి నాడను. ఈ వఱకు నేను మిమ్ముజేసిన యవమానములకు నాకు విచారమగుచున్నది. ఇక ముందు మీరును మేమును స్నేహితులమై యుండవచ్చును.
భీమ – మీ చిత్తమువచ్చినట్లు చేయవచ్చును. మానహానికంటె బ్రాణహాని మేలు. మేమెవరికైనను వెఱచువారముకాము.
చక్ర – అవును. నేను మీసంగతి నెఱుగక దుర్మార్గుల యోజనమువలన మీదేశముపై దండెత్తినాడను. క్షమింపవలెను.
భీమ – క్షమించుట యేల? పొరపాటునకు నెవ్వరేమి చేయగలరు?
ఇట్లు చక్రవర్తియు భీమసింగును మాటాడుచుండ నొంటిగ దొరికిన మహమ్మదీయుని వధింపవలెనను కోరిక యేరికిని జనింపదయ్యె. అంతట జక్రవర్తి శిబిరమునకు మరల బ్రయాణమగుటచే భీమసింగు చక్రవర్తిని సాగనంపుటకు దనకోట విడిచి కొంతదూర మొంటరిగాసాగిపోయెను. అప్రస్తుతములగు కొన్ని మాటల జెప్పుచు జక్రవర్తికి భీమసింగును దనసేనా నివేశముదాక గొనిపోయెను. అప్పుడాకస్మికముగ నదివఱకు జక్రవర్తిచే నియమితులై పొంచుండియుండిన కఱకుతురకసైనికులు భీమసింగురాజుపై నొక్కపెట్టునబడిరి. మనోధైర్యమున హిమాద్రిమగు భీమసింగు ఘోరమైన యీమోసము నకు నాశ్చర్యపడి తనకత్తితో ననేకభటుల నాపెను కాని సైన్యము లపారముగనుండబట్టియు రసపుత్రులు దూరముగానుండబట్టియు భీమసింగు విజయమొందజాలక యలసియుండ రహిమానుఖాను వచ్చి యాతని పైజేయివైచి నిన్ను ఖైదిగ బట్టుకొన్నాము రారమ్ము అని లాగెను. అప్పుడు మహమ్మదీయ ప్రభువులు వచ్చి రాజపుత్ర సింహమును జెఱబట్టిరి. పద్మినిని సమర్పించినగాని బంధవిమోచనము జేయుట లేదని చక్రవర్తి స్పష్టముగ నుడివెను. భీమసింగు మ్లేచ్ఛులచే జిక్కిన వార్త చిత్తూరు కోటలో దెలిసినపుడు కోటలోనున్న వారి దుఃఖమింతింతయని చెప్పనలవి కాదు. దుర్నిరీక్ష్య ప్రతాపుడగు భీమసింగును సూర్యుడు శాత్రవసైన్యమును పశ్చిమాంబుధి నడగిపోవుటచే నప్పుడప్పద్మినీ ముఖారవిందంబు వికాసహీనతనొందెను. నగరమున నాబాలగోపాలముగ జనులు భోజనములు మాని దుఃఖావేశముచే మాటలాడ జాలరైరి. కత్తివాటువైచిన నొకరిమొగమునను నెత్తుటి చుక్క లేకుండెను. కోటను, మేడలు నుద్యానవనములు, మందిరములు వెలవల బాఱుచు జిన్నవోయెను. సైనికులెల్ల నుస్సురుస్సురనుచు దిగులు నొందుచుండిరి. మదనసింగు తనబోటి సాహసికులు కొందఱితో జక్రవర్తి సైన్యముపై బోవ దలంచెనుగాని యాడపడుచుదనపు బ్రయత్నమును గోరాసింగు మాన్పెను. అనంతరము రాజపుత్రవీరులు నిజమందిరములకరిగి యారాత్రి కర్తవ్యమూహించు చుండిరి. ప్రతాపసింగును మదనసింగును విచారముతో నింటికిజనిరి. మదనసింగు దనప్రియురాలి సేమముగనుగొని తరువాత నొక కుర్చీమీద గూర్చుండినపుడు మెల్లగ సువర్ణబాయి వానికడకువచ్చి కూర్చుండి యిట్లని చెప్ప నారంభించెను. “నాయనా! నాదొక చిన్నమాట కలదు, నీకీబీద బాలికపై నెట్లు ప్రేమకుదిరెనో నేనెరుగుదును గాని యిది దౌర్భాగ్యురాలని తోచుచున్నది. మేలిముసుగు దీసిచూడ నిది నాకంత యందముగ గనపడలేదు. అందమట్లుండ దీనిదగ్గర దొంగతనముగూడనున్నది. ఈ దినమున నావజ్రపుటుంగరము పోయినది. అదితీసినట్లు దాసీజనులు చెప్పినారు. అది నీ ప్రియురాలగుటచే వారేమియు ననజాలకూరకుండిరి. అని తల్లి వచించిన మాటలు శూలములవడువున దనచెవులబడ మదనసింగు దుఃఖమునకు మితము లేకపోయెను. గాని తల్లి యబద్ధమెన్నడు దనతో బలుకదని తానెఱింగి యది సేవకులు చేసిన మాయ యనినమ్మి తల్లితో అమ్మా! హేమలతపయి నీకు నిష్కారణముగ దురభిప్రాయము కలిగినది. ఆమె సద్గుణపుంజము సుమీ. నీకు నిలకడమీద నిజము దెలియును నీ మాటలచే నన్ను బాధింపకుము” అని పలికెను. ఎట్లయిన నీవు దీనిని వివాహమాడ వలనుగాదుసుమీ యని సువర్ణాబాయి లోపలి కరిగెను. మదనసింగు సందేహాస్పదహృదయముతో దన ప్రియురాలున్న గదిలోనికిబోయెను. అచట మంచపుపై బవ్వళించియున్న యాబాలిక మేలిముసుగు వెంటనే మొగమున వైచికొని రోదన మొనర్చుచు మదనసింగు పాదములపైబడి యిట్లు చెప్పసాగెను. “ప్రాణేశ్వరా! మీతల్లి గారును సేవకులును నన్నవమానించుచున్నారు. నేనెందైన బడి మృతినొందుటకు సిద్ధముగ నున్నాను. మీదర్శనము జేసిపోవలెనని జీవించితినిగాని యిదివఱకే నేనుమృతినొందవలసినది. నామీద మీరింత నిర్దయబూనుట ధర్మముగాదు. మాతాత మీకు జేతిలో జేయివైచి నన్నప్పగించినాడు గదా, యని విలపించుచున్న ప్రియురాలి మాటలకు హృదయముకరగ మదనసింగు నిరుత్తరుడయ్యెను. ఆమె యంతటితో నిలువక మూడుత్తరములదీసి నా విషయమై మౌలవి నాజరుజంగు ప్రముఖులకు వ్రాసిన యుత్తరములుజూడుడు. అందు నాసత్ప్రవర్తనముగూర్చి యాయన యెట్లుశాఘించినాడో మీరెరుగుదురు. అని యుత్తరముల జేతికిచ్చెను. మదనసింగు వానింజదువుకొనిన తరువాత నారాత్రి తన ప్రియురాలి విషయమగు విచారమును భీమసింగునుగూర్చిన వింతయు దన్ను బాధింప జిదానంద యోత్రోదన కాలము గడుపుట యుచితమని యెంచి యాతనిమఠమున కరిగెను. యాతనిమొగముజూచి యోగికారణమును జాలసారులు తఱచితఱచియడుగ మదనసింగు తన ప్రియురాలి విషయమున చర్య నెఱిగించెను. హేమలత మదనసింగునియింట వసించుచున్నదని యోగివిని యామెపయి నపనింద వచ్చినందులకు జింతించి మదనసింగుతో “ఆమెవచ్చినదా? తల్లిదండ్రులు లేని యాపిల్లపై నెట్టి నిందవచ్చెను. ఆమెను నేనుజూచి మాటలాడవలెనని యున్నది. నీకేమయిన నభ్యంతరముకలదా? అని పలికెను. తనకెట్టి యభ్యంతరము లేదని మదనసింగుత్తరముజెప్ప యోగి తక్షణమే వారియింటికారాత్రి పయనమయ్యెను. మదనసింగు యోగితో గృహమును బ్రవేశించి బాలిక యున్న గది జేరి యామెను జూపెను. ఆమెతో గొన్ని రహస్యములు మాటలాడవలసియున్నదని యోగి చెప్పి మదనసింగు వెలుపలికరిగెను. తరువాత యోగి బాలికకడ కరిగి “అమ్మా! జ్వరము నింపాదిగా నున్నదా? యని యడిగెను. దాని కామె యుత్తరము నీయక యోగిపై నూరకచూచుచుండ నతడును నీవెందుండి యిక్కడకు వచ్చినావుకుమారీ” యనియడుగ నామె మాటలాడదయ్యె. యోగి యామెహస్తమునబట్టుకొని నీవు నాపుత్రికవు. సిగ్గుపడకుము” అని ప్రియములాడ నామె సిగ్గువదలి మాటలాడుటకు సమ్మతించెను. వారిట్లు మాటాడిరి.
చిదా – నీవు నేటిదాక నెందున్నావు? ఎవరి సంరక్షణమున నున్నావు.
బాలి – నే నాయలీఘరులో రాజులయింట నుంటిని.
చిదా – నిన్ను పాలినుండి యెవరు తీసికొనివచ్చినారు?
బాలి – ఆగడబిడనుండి నేనే వచ్చినాను నన్నెవరు దేలేదు.
ఈ పలుకులువిని చిదానందయోగి యనుమానపడి యామె మేలిముసుగుదీసి మొగమువైపు పాఱజూచి మరల ముసుగిడి యీవలకు వచ్చి మదనసింగుతో నీమెకు నీనడుమ గలిగినకష్టములచే మతిచాంచల్యము సంప్రాప్తమైనది. నాకడకంపుము, నేను మందులనిచ్చి రెండుదినములలో జాఢ్యముకుదురునట్లు చేసెదను. అని లోనికరిగి బాలికతో అమ్మా! నీకు మదనసింగు తప్పక భర్త కాగలడు. నీకు శరీరమునగొంచెము రుగ్మత గలదు. నామఠమున నిన్ను రెండుదినములంచుకొని మందిచ్చి పంపెదనురా యని చెప్పి మదనసింగు సమ్మతిమీదనామెను గొనిపోయెను. మదనసింగును జింతాక్రాంతుడై యారాత్రి పండుకొని నిద్రరాక కలవలపడుచుండెను. యోగి మఠమునకు బాలికను గొనిపోయి యామెను నిద్రపుచ్చి తన ప్రియశిష్యుడైన సదాశివుని బిల్చి యాచిన్నదాని విషయమును నాతనితో నేమో చెప్పి యారాత్రి తానును సుఖముగ నిద్రించెను.