హేమలత/ఏడవ ప్రకరణము
ఏడవ ప్రకరణము
ఆనాఁటి రాత్రి కొలవుకూటమున దర్బారు జరిగెను. నానాభాగములనుండి ఖిల్లాదారులు, జమీందారులు, పౌజుదారులు వచ్చి చక్రవర్తికిఁ దమతమ యధికార గౌరవంబుల నుచిత రీతి నజీరులనర్పించి యర్హమర్యా దల నొందిరి. చక్రవర్తి వలన ననేక బిరుదములఁ బొందిన ఢిల్లీనగరవాసులగు మహమ్మదీయ ప్రభువులుఁ గూడ వచ్చి దర్బారు నలంకరించిరి. అంతట నాజరుజంగు వచ్చి యుచితాసనమున గూర్చుండెను. సభ పూర్ణమైన వెనుక చక్రవర్తి రాజపుత్రస్థాన దండయాత్రను గూర్చి తన యభిప్రాయమును బూర్ణముగ నెఱిఁగించి సైన్యములును, సేనానాయకులను యుద్ధసన్నద్ధులై యుండవలయునని యాజ్ఞ యొఁసగెను. అదివఱకెప్పుడును దర్బారులయందు నాజరుజంగు నతిగౌరవముతోఁ జూచి యాతని యాలోచన నడిగెడి చక్రవర్తి యాదిన మాతనివంకఁ జూడక, దర్బారు ముగిసెడువేళ కోపముతో మనలో ననేకులు రాజద్రోహులున్నారు. మాసొమ్ముదినుచు మాశత్రుపక్షమునఁ జేరి మాప్రాణముల దీయ గోరుచున్న వారీ సభలో ననేకులు గలరని పలుక సభాస్థలమెల్ల నిశ్శబ్దమయ్యెను. అచటఁ జేరిన సామంతు లందఱు నొకరిమొగమువంక నొకరుజూడ నారంభించిరి. అప్పుడు జరుగుతున్న కలవరపాటు నవలోకించిన చక్రవర్తి సభ నుద్దేశించి,
మీరందఱు నిట్లనుమాన మొందవలదు. మాకిట్టి యనుమానమునకు వెడ మొసఁగినవాడు మాకత్యంతాప్తుడని మేమిదివఱకెంచు కొనుచు వచ్చిన నాజరుజంగు. అతఁడు రాజపుత్రులతో జేరి మనపైఁ గుట్రలు జేయుచున్నాఁడఁట. అతని కుటుంబమునకు మేము సలిపిన మహోపకారమునకు మాకతడుచేసిన ప్రత్యుపకారమిది” యని యెలుగెత్తి చక్రవర్తి పలుక నాజరుజంగు గుండెలు ఝల్లు మనియెను. రహిమానుఖాను ముఖము మందహాసముతో గూడుకొనియుండెను. మహమ్మదీయ సామంతుల హృదయము లాశ్చర్యముతోను విచారముతోను నిండినవి. పిడుగువలె దనపైబడిన యపనింద భరింపలేక నాజరుజంగు ధైర్యము దెచ్చుకొని చక్రవర్తి కభిముఖుడై “మహాప్రభూ! నాచేసిన యపరాధ మేదియు నేనెఱిగినంతవఱకు లేదు. నాయపరాధము నాకెఱిఁగించి యది యిందు ఋజువుచేసి యీమహాజన మధ్యమున నన్ను శిక్షించుట యుచితముగాని నిష్కారణముగ శూలముల వంటి మాటలతో నన్ను బాధపెట్టతగదు. నేను నారాజునకు నాదేశమునకును వ్యతిరేకముగ నెన్నఁడు బ్రవర్తింపలేదు” సభ్యులకెల్ల జాలిజనియింప బలికిన నాజరుజంగు వచనంబులు చక్రవర్తి లక్ష్యపెట్టక మహాకోపమున “నీవింక మాటలాడవలదు. నీవు చేసిన యపరాధమునకు నీయుద్యోగము నూడఁదీసినారము. నీవు సేనకధిపతిగ నుండదగవు. నీతండ్రి తాతలయందలి గౌరవమునుబట్టి నిన్ను మేమింతటితో విడిచినాము పొమ్ము” అని తక్షణము సభనుండి సాగఁదోలెను. నాజరుజంగు పరువుగల యుత్తరహిందూస్థాన మహమ్మదీయ కుటుంబము లోనివాడు. అతని తండ్రి బానిసవంశము నాటనుండియుఁ జక్రవర్తుల కొలువుననుండి యావంశనాశనానంతరమున జలాలుద్దీనువద్ద సేనానాయకుడుగ నుండెను. ఈ కాలమున వృద్ధుఁడై పనిజేయజాలక తన కుమారుని రాజసేనయందు నియోగించి తానింటివద్ద సుఖముగఁ గాలక్షేపముఁ జేయుచుండెను. చక్రవర్తి నాజరుజంగుపై నీవఱకును నమ్మకము దయయు నుండెనుగాని రహిమానుఖానుని దుర్భోధవలన నిప్పు డలుక పుట్టెను. అట్లు పరాభవము నొంది నాజరుజంగు తనగృహమున కరిగి జరిగినవృత్తాంతమును జనకున కెఱిఁగింప నత డావార్తవిని యద్భుతపడి రాజభక్తికి బుట్టినిల్లని ప్రజలచే స్తోత్రమునందిన తనకుటుంబమున కది గౌరవహీనతయని చింతాక్రాంతుడయ్యెను. ఇచటఁ జక్రవర్తి దర్బారునం దున్నవారిని జూచి “యీకొలువు లోని సరదారు లెవ్వరును లోలోపల గుట్రలు సలుపక నాకుఁ బ్రతిపక్షులుగా నుండువారు నిరాటంకముగ నా కొలువు విడిచిపోవచ్చు” నని సెలవిచ్చెను. ఆమాట నాలకించి సభాసదు లెవ్వరును లేవరైరి గాని యొక పురుషుఁడు మాత్రము లేచెను. మాయలమారియగు వసంతభట్టను మహారాష్ట్రుడు తన యాసనము నుండి లేచి నిర్భయంబుగ గళమెత్తి యేలికతో నిట్లనియెను. “ఓ మహాప్రభూ! ఈవఱకుఁ జాలకాలమునుండి తమ వద్ద సేవజేసినవాడను. నేనింకఁ దమవద్ద నుండజాలను. ప్రభువు వారి క్రూరస్వభావమును జూడ నాకిం దుండుట కష్టముగ నున్నది. నాకు సెలవు నొసంగుడు” అని మహారాష్ట్రుఁడాడిన తోడనే పండ్లు పటపటఁ గొఱకుచు దురాత్మ! మాకొలువు నీకు భారముగ నుండినఁ బోఁదగును. కాని యిట్టి కారుకూతలఁ గూయనేల? మాప్రతిపక్షులు నిర్భయముగ గొలువువిడిచి పోవచ్చునని మేమభయ హస్త మిచ్చియుండుటచే నిట్టికాఱు లఱచియును బ్రాణముతోఁ బోఁ గలిగితివి పొమ్ము” అని చక్రవర్తి “ఈతఁడు మాకిదివఱకు జేసినసేవఁబట్టి వధింపక విడిచినారము. వెంటనే యీతని దీసికొనిపోయి కారాగృహమున బంధింపుడు” అని భటుల కాజ్ఞాపింప వారట్లుజేసిరి. ఇట్లు రాజస్థాన దండయాత్రను బ్రకటించి చక్రవర్తి దర్బారు చాలించెను. అందఱును దమతమ నిలయముల కరిగిరి. నాజరుజంగు తండ్రి మహావిచారమున మునిఁగి తన కుమారుని వెంటబెట్టుకొని యారాత్రి చక్రవర్తి దర్శనముచేసి యుచితసత్కారమునొంది వేడుకొనఁగా జక్రవర్తి దండయాత్రతోఁ దనసైన్యముతో గూడ నాజరుజంగు వచ్చుటకు మాత్రము సెలవొసంగెను. అంతటితో దృప్తినొంది నాజరుజంగు దండ్రియు నింటికింజనిరి. మఱునాఁడు సూర్యోదయకాలమున ఢిల్లీనగరమునందు వసంతభట్టు చెఱలోనుండి పాఱిపోయెనని యొకవాడుక పడెను. అట్టిమహాద్భుత మిదివఱకు నెన్నఁడుఁ గనివిని యెఱుఁగమని జనులు పరిపరివిధములఁ జెప్పుకొనసాగిరి. కారాగృహాధికారి భయముచే వడకుచువచ్చి పాదుషా పాదముపైబడి యేడ్చుచు నావార్తదెలిపి క్షమియింప వేడుకొనెను. చక్రవర్తియు నాశ్చర్యమునొంది యాతనికభయమిచ్చి వసంతభట్టును బట్టి తెచ్చినవారికి నూఱువఱహాలు బహుమానముగ నిచ్చెదమని పట్టణమున జాటియించి యతనిని వెదకుటకై యనేకులను బంపెను.
అక్కడనట్లు నారాయణసింగు చెఱలో నుంచబడిన రాత్రి వర్ణింపనలవిగాని మహాదుఃఖము నంది తెల్లవారిన తరువాత నిద్రలేక తనకు సంభవించిన మహాపదకంటె మనుమరాలి సంగతి యేమయ్యెనా యని యొక్కవ సంతాపము నొందనారంభించెను. మఱునాడుదయమున హేమలత యెచ్చటగనబడ లేదని తెలిసినప్పు డామె మృతినొందియుండునని నిశ్చయించుకొని యతడు కంటికి నేలకు నేకధారగా నేడ్చుచు నడుమ నడుమ మూర్ఛిల్లి యామూర్ఛలో హేమలతా! మందులసంచి తెమ్మని కలువరించుచు గలతనిద్రగలిగినప్పుడు మనుమరాలిపై దుస్స్వప్నముల గనుచు లేచి విలపించుచు, మెలకువగనుండు నప్పుడు అమ్మా! హేమలతా! చిన్నతనము నుండియు దల్లిదండ్రులులేని పసి పిల్లను నిన్నుబెంచి నేడు నేలపాలు చేసినాను. అమ్మా! నీవేనూతిలో బడిచచ్చినావు నాకడుపుమీదదలపెట్టు కొని నీవిక నెన్నడును నిద్రపోవుగదా! కథలను జెప్పమని నన్నికరాత్రి బలవంత పెట్టువారెవరు? అయ్యయ్యో! ఆనాటి రాత్రియే మనకు గడసారి కాబోలును అని పరిపరివిధముల హేమలత చేసిన చేష్టలను నామె ముద్దుమాటలను దియ్యనిపాటలను దలచితలచి విలపించుచుండెను. ఆమఱునాటి మధ్యాహ్న మతనికి గోవిందశాస్త్రి భోజనమును దెచ్చిపెట్టెను. ఈ ప్రకారమొక వారము గతించునప్పటికి ఖాను ఢిల్లీకి బోవలసి వచ్చెను. ఖానుస్థానమునం దంతకంటె గర్కోటకుండొకడు నియమింపబడెను. అతడు ఖానుచేతిక్రింద నున్న చిన్న యుద్యోగస్థు డేయైనను నధికారి యైనతోడనే గర్వముగలవాడై జనసామాన్యముతో మాటలాడుట తన గౌరవమునకు దగదనియు దనతో సమానులు లేరనియు దురభిప్రాయమునొంది తనకంటె వెనుకటి ఖానే గుణవంతుం డని జనులనుకొనునట్లు వర్తించుచుండెను. అతడాయుద్యోగమునకు వచ్చిన నాల్గుదినములకు జెఱసాల పరీక్షచేసి నారాయణసింగును మౌలవినిజూచి నారాయణసింగు బ్రాహ్మణులు తెచ్చి యిచ్చిన భోజనమును దినకూడదు. ఇచ్చట మహమ్మదీయులు వండిన యన్నముదినవలయు నని యాజ్ఞనొసంగెను. ఈయుత్తరవు వలన మహమ్మదీయుడగు తనకు బాధలేకపోయినను పరమత సహనము గలవా డగుటచే మౌలవి నారాయణసింగు స్థితికి మిగుల దుఃఖింప నారంభించెను. మఱునాడు మధ్యాహ్నము తురక లిద్దఱన్నము వండి చిప్పలోవైచితెచ్చి నారాయణ సింగును భుజింపుమనిరిగాని యాతడు తినక నుపవాసములు చేయుచుండగా నతనికి బ్రాణాపాయము వచ్చినయెడల జక్రవర్తిచే దనకు మాటవచ్చునని భయపడి యీ క్రొత్త యధికారి యాతనికెప్పటియట్లు బ్రాహ్మణు లన్నము పెట్టవచ్చునని యుత్తరువుచేసెను. వారాప్రకారముగా జేయుచుండిరి. ఈసాహేబు మతవిషయమైన పట్టుదలగలవాడని మహమ్మదీయులెఱిగి మౌలవిని గారాగృహమునుండి విడువమని సాహెబును బలవంత పెట్టసాగిరి. వారి ప్రోత్సాహమునకును స్తోత్రములకును సాహేబు మిగులనుప్పొంగియొకనాడు చక్రవర్తి వద్దనుండి తనకు త్తరువు వచ్చెనని మౌలవిని విడుదలచేసెను. తోడివానిని విడిచి తన్ను బాధించుచు నారాయణ సింగునకు గష్టముగనుండుటకు మాఱుగ మౌలవి స్వేచ్ఛగా పక్షమున దనవిషయమై పనిచేసి తనకు బంధవిమోచన గల్గించునని సింగు సంతోషించుచుండెను. మౌలవియును విడువ బడినతోగనే త ముసలినెచ్చెలికి సాయము చేయుదునని వాగ్దానముచేసి తద్విషయమయి ప్రయత్నము చేయుచుండెను.