హేమలత/ఇరువదవ ప్రకరణము

ఇరువదవ ప్రకరణము

ఆమఱునాడు మధ్యాహ్నము దర్బారు జరగు నని భీమసింగు ప్రకటించెను. రాజపుత్రులెల్ల నియమిత కాలమునకు సభామంటాపమున కరిగి యుచితాసనముల గూర్చుండిరి. భీమసింగును మహారాణాయును వచ్చి కొలువు దీర్చి యుద్ధమునందు వీరస్వర్గమునకు జన్న శూర శిఖామణులను గూర్చి విచారము దెలిపి శరీరముల కాశింపక యుద్ధ మొనర్చిన విక్రమ శాలుర కనేక బహమానములను బిరుదులనునిచ్చి వారిని మిగుల గౌరవించిరి. అందు ముఖ్యముగ మదనసింగు సాహసధైర్యములకు రాణా మెచ్చికొని శౌర్యవిధియగు ప్రతాపసింగు సేనానాయకత్వమునకు నాతని నియోగించిరి. రాజపుత్ర సేనానాయకత్వము నందుటకు మదనసింగు మహానందము నొందినను నాడు చిత్తూరు సభామంటమున బినతండ్రి లేకుండుటయు, సభయెల్ల జిన్న వోవుటయు నాతని యుద్యోగమును దాను స్వీకరించుటయు నాతనికి గొంత దుఃఖముగల్గించెను. ఆయుత్సవము దాదాపుగ ముగియునప్పటికి నలుబదియేండ్ల వయస్సుగల యొక చామనచాయమనుష్యు డుత్తమరసపుత్రులు ధరించుకొను వస్త్రాలంకారములతో సభ కరుదెంచి రాణా యెదుట నిలిచెను. అతడారీతిగ మున్నెన్న డాకొలువునకు రానందున నాతని నెవ్వరు నానవాలు పట్టి తగు గౌరవమునొనర్పక విస్మయమొందుచుండ భీమసింగాతని నుచితాసనమున గూర్చుండ బనిచెను. మదనసింగు మొదలగు వారీతని మొగము మున్ను జూచినట్లున్నదని తమలో దాము గుసగుసలాడ నారంభించిరి. అప్పుడానూతన పురుషుడు లేచి సభా సదులను తన వృత్తాంతమును విన నవధరింపుడని వేడికొని యిట్లు పలికెను. “రాజపుత్రులారా! నా చరిత్రముతిదీనమయినది. నేనొకపరువుగల రాజపుత్ర వంశమునం దుదయించితిని. నా బాల్యముననే నా తల్లి మృతినొందుటచే నేను బ్రయాగలో నా మేనమామలవద్ద బెరిగితిని. మా కాపురము రాజస్థానమున నున్న జయపురమైనను నేను ఢిల్లీ చక్రవర్తుల పాలనము క్రింద నున్న దేశములో నుండుటచే జలాలుద్దీను చక్రవర్తియొద్ద సేనాధిపత్యమును గ్రహించి, యిరువదియేండ్లు దాటకముందే సేనాచక్రవర్తి యను గ్రహమునకు బాత్రుడనై గొప్పవాడనైతిని. జయపురమునందు నా తండ్రి నాతల్లి పోయిన తరువాత మరల వివాహమాడి ద్వితీయ భార్యయు బిడ్డలును మృతినొందుటచే వైరాగ్యముగలవాడై ప్రయాగకువచ్చి మా మేనమామల ప్రోత్సాహముచే జక్రవర్తి యొద్ద సైన్యాధిపత్యమును సంపాదించెను. అలాయుద్దీను దక్షిణదేశమునుండి వచ్చి జలాలుద్దీనును జంపించి తానె చక్రవర్తి కాదలంచి యాకార్యమున దోడ్పడుమని నన్నును నాతండ్రిని నడుగ మేము నిరాకరించితిమి. అందుచే మాపై నాగ్రహముగల్గి మాతండ్రికన్నులను దనచేతికత్తితో పొడిచివైచి నన్ను వధించుటకు యత్నింపగా నే నామహాపద దప్పించికొని పాఱిపోతిని. నాభర్యయునంతకు ముందే రెండు సంవత్సరముల క్రిందట పరలోక గతురాలై నందున నప్పటికి నేడెనిమిదేండ్ల వయసుగల నా చిన్న కుమారికను శిబిరమున విడిచి నేదేశాంతరములకు మారువేషముతో నరుగ బూనితి. తురకలవలన నాకింత ద్రోహము జరుగుటచే నెట్లయిన నల్లాయుద్దీనుపై హిందూ రాజుల బ్రేరేపించి దండెత్తించి కసిదీర్చికొన దలచి నేను దక్షిణహిందూదేశమునకుబోయి మహారాష్ట్ర రాజగు రామదేవుని మీతో గలియున ట్లొడబఱచి వారియొద్దనుండి మీకుత్తరములగూడ దెచ్చితినికాని మధురానగరమున నేనొక పాడు దేవాలయమున యోగివేషముతోనుండ రహిమానుఖాను సేవకులునన్ను యమునానదిలో బడద్రోసి యాకాగితముల నపహరించిరి. ఈత వచ్చినవాడ నగుటచే దైవానుగ్రహమున నే నాజలగండమునుండి బైటబడి, గోసాయి వేషముతో బాలిగ్రామమున కరిగి యచ్చట మా తండ్రియగునారాయణ సింగును నా ముద్దుకూతురగు హేమలతయు బ్రతికియుండుటకు సంతసించి రహిమాను ఖాను హేమలతను చెరబెట్ట నుంకించుచుండ నామెను రక్షించి కుల్వానగరమునకు దోడ్కొనిపోయి నా స్నేహితుడగు శివప్రసాదునింట నుంచితిని. తరువాత రాజస్థానముపై జక్రవర్తి దండెత్తు ననుమాట విని ఢిల్లీనగరమున జరుగుచర్యలను గ్రహించి రాజపుత్రుల కెఱిగింప గోరి కులందరు ఫకీరుగా రహిమానువద్దనుండి రహస్యములు బైటకు దీసితిని. అంతటనుండియు నేనీగరమున జిదానందయోగి వేషముతో నుండి రాజపుత్రుల సేమమునకు నాతపస్సునెల్ల ధార వోసితిని. ఆరాత్రి మహారాణా లక్ష్మణసింగుగారిని మదనసింగు సాహాయము వలచిన రక్షించిన వసంత భట్టును, జ్ఞానానంద స్వాములవారి వేషము వైచికొని యుత్తరముల దెచ్చిన పాండురంగనాధుని బట్టికొని వసంత భట్టును జంపించి పాండురంగనాధుని మీకప్పగించితిని. నే ననేక సేవకుల నుంచుకొని వారిని నానాభాగముల కంపి వసంతభట్టాదుల రహస్యముల నెఱిగి నేడుతురకల నోడించి సఫల మనోరధుడనైతిని. నా పేరు జనార్ధనసింగు. హేమలత నాకూతురు. అంధుడగు నారాయణసింగు నాతండ్రి. హేమలత నావద్దకు వచ్చినది. కాని నాతండ్రిజాడలు దెలియలేదు. ఎఱిగిన నన్ను ధన్యునిజేయుడు. నా కుమార్తెను మదనసింగునకిచ్చి వివాహము చేసెదను. ఇట్లు జనార్ధనసింగు తనపూర్వవృత్తాంతమును సభ్యులకు దెలియజేయ వారాశ్చర్యపడి యందఱు నాతనివంక దృష్టినిలిపి చూచుచుండ హేమలత చిత్తూరు నగరమున నున్న దనియు నామెను దనకిచ్చి వివాహము చేయుట నిశ్చయమనియు జనార్ధన సింగు పలుకుటచే మొదట మదనసింగు మిగుల నుప్పొంగుచు నారాయణసింగు తనగృహమున నున్నట్లా తనితో జెప్పి తనతో రమ్మని పిలిచెను. పాలిగ్రామము నుండి రాజస్థానమున కాయంథుడు వచ్చుట కాశ్చర్యము నొంది జనార్ధనసింగు చిరకాలము క్రిందట జూచిన తనతండ్రిని దర్శింపగోరి రాణా యొద్దను సభ్యులకడను సెలవుగైకొని తన మఠమునకుజని యొక పల్లకిలో హేమలతను గూర్చుండబెట్టి వెంటబెట్టికొని మదనసింగుతో నరిగెను. చిరకాలము నుండి పరస్పర వియోగముగల యాప్తబంధువుల విచిత్రసమ్మేళనమును నేత్రోత్సవముగ జూడగోరి భీమసింగును సభ్యులును మహారాణాతో బయలుదేఱి మదనసింగు గృహమునకు జేరిరి. మదనసింగు తనయదృష్ట వరమున దనగృహమునలంకరించిన మహారాణా ప్రభృతులను యధాశక్తిని గౌరవించి యర్హాసనములిడ వారందరు గూర్చుండిరి. మనుమరాలు గన బడనందులకు దుఃఖించుచున్న నారాయణసింగు నొద్దకు జని, మదనసింగు “తాతా! మీ హేమలత వచ్చినది సుమీ!” యని పలికెను. తోడనే నారాయణ సింగదరిపడి “నాయనా! ఏదీ? మాహేమలతా! ఏదీ? నాయనా! నిజమేనా చెప్పచెప్పు” మని వేగిరపడుచుండ నంతలో హేమలత మేఘములచాటున మెఱపువలెవచ్చి “దాదా! దాదా!” అని పలుకుచు నానందాతిశయమున నన్యపురుషులుండి రనుమాట మఱచి యానందభాష్పములతో ముసలివాని యొడిలో గూర్చుండి యతనికంఠమును గట్టిగ గౌగలించుకొని విలపింప సాగెను. నారాయణసింగును మనుమరాలిపై జేయివైచి కనులనుండి భాష్పము లామెశిరము పైబడ “అమ్మా! నాటికి నేడు నిన్ను జూచితిని. నిన్ను జూచి యానందించుటకు నీతండ్రి లేడు గదా తల్లీ” యని పరిపరిభంగుల దనసంతాపసంతోషములను మాటలచేతను జేష్టలచేతను దెలుపుచుండెను. అప్పుడు మదనసింగు వృద్ధునితో “తాతా! నీకుమారుడు వచ్చినాడు చూచెదవా?” యని పలుక నారాయణసింగు తనపుత్రుడావఱకె యలాయుద్దీను చక్రవర్తిచే జంపపడినట్లు దృఢమగునమ్మకముగలవా డగుటచే నామాట నమ్మక “నాయనా! మీరు నన్నేల పరిహసించెదరు! నాకొడుకెక్కడ! నాకగపడుటెక్కడ? జలాలుద్దీను చచ్చుటకుముం దారాత్రి నాకును నా కుమారునకు ఋణము తీరినది. అటువంటి పుత్రరత్నము నావంటిపాపకర్ముల కేలదక్కును? నాయనా! జనార్ధనసింగూ! ఇక నాకగపడవుగద!” అని విలపించుచున్న నారాయణసింగుమాటల కడ్డమువచ్చి “దాదా! నామాటల నానవాలు పట్టజాలవా! నేను జనార్ధనసింగును, ఆరాత్రి నేనల్లాయుద్దీను చేత బడకుండ దైవానుగ్రహమున బ్రతికి శిబిరమును విడిచి యింత కాలమును మారువేషముతో బహుదేశముల దిరిగి సమస్తయాత్రలు సేవించి తుదకు బాలిగ్రామమునకు వచ్చి మీరు బ్రతికియుండుట నెరిగి మనశ్శాంతి గలిగి యుండి నేడుగలిసికొన్నాను” అని జనార్ధనసింగు తన పూర్వాశ్రమవృత్తాంతమును నెరిగింప నారాయణసింగు వానికంఠమును బట్టి తనకుమారుడని తెలిసికొని యక్కున జేర్చి యనిర్వాచ్యానందము నొంది. నాయనా! చక్రవర్తి నాకన్నులను బొడిచివేయకముందు నిన్ను గన్నులార జూచినాడను. నేడు నిన్ను జూచి సంతోషింపక నాకు గన్నులు లేవు. అయినను నీవును హేమ లతయు నాకు రెండుకన్నులయి యున్నారు. మీరు దొరకుటె నాకు గనులు లభించుట” యని పలికి సంతోషమున వెఱ్ఱివానివలె నుండెను. జనార్ధనసింగు హేమలతను శివప్రసాదుగృహమునకు గొనిపోవునాడు గాని యీరెండు దినములలో దనయొద్దనున్నపుడుగాని, తానామెకు దండ్రి యగుటజెప్ప నందున దనకు జ్వరము తగిలినప్పుడు రక్షరేఖ గట్టిన గోసాయియే తన తండ్రియని హేమలత ప్రథమపర్యాయమున విని విస్మయమొందెను. తానామెను విడిచిపోవు నాటి కెనిమిది సంవత్సరముల బాలికగ నుండి నేడు సంప్రాప్తయౌవనయై యుండుటచే జనార్ధ సింగు చాలకాలమున కగపడిన కూతును ముద్దు పెట్టుకొని యొడిలో గూర్చుండబెట్టుకొనెను. తరువాత సువర్ణ బాయి హేమలతను జూడగోరినందున జనార్ధనసింగామెను లోని కంపెను. సువర్ణయు హేమలత సౌందర్యాదులను, మొగమున రసపుత్ర కళను, సత్కులజాత చిహ్నములను వినయసంపత్తినిజూచి యామె యెట్లయిన దన కుమారున కిల్లాలైన చాలునని కోరుచుండెను. అప్పుడు మదనసింగు జనార్ధనసింగును జూచి “అయ్యా! హేమలతకు సహోదరుడైన కుమారసింగెచట నున్నాడు? అత డాదినమున మీమఠమునకు వచ్చెగద” అని యడుగ “నాయనా! ఆ కుమారసింగే యీ హేమలతయయ్యెను. యుద్ధమునందు జరిగిన కలకలములో హేమలత దుష్టుల పాలబడకుండ బురుషవేషము వైచికొని యా పేరు పెట్టుకొన్నది.” అని జనార్ధనసింగుత్తరము చెప్పెను. హేమలత యొక్క సమయోజిత బుద్ధికిని యుక్తికిని మదనసిం గాశ్చర్యపడుచుండ నపుడు భీమసింగు లక్ష్మణసింగునెదుట జనార్ధనసింగు హేమలతను మదనసింగునకిచ్చి వివాహము చేసెదనని చెప్పి, తన తండ్రికిని నావివాహ మిష్ట మగుటచే దద్విషయ ప్రయత్నముల నొనర్పు డని భీమసింగుతోడను దక్కిన రసపుత్రులతోడను చెప్పెను. ప్రతాపసింగు మృతినొందుటచే బెద్దలెవ్వరు లేరని మదనసింగుపక్షమున భీమసింగు సర్వ ప్రయత్నములను జేయించి పందిళ్ళు వేయించెను. నారాయణసింగు జనార్ధనసింగును హేమలత వివాహ మగువఱకును దమమందిరమునకు రండిని భీమసింగు పిలిచికొని పోయెను. సంపూర్ణ శరత్కాల చంద్రమండలము నపహసించు హేమలత ముఖము నవలోకించి ముద్దు పెట్టుకొని మెఱుపు దీగబోలు నామె దేహమును బిగ్గ గౌగలించికొను నిమిష మెన్నడు వచ్చునాయని మదనసింగు నిమిషమొక గడియవలె గడువుచుండెను. రూపొందిన మన్మధునివలె నల్లపట్టు కుచ్చుల బోలు మీసముతోడను సంపూర్ణచంద్రబింబమువంటి ముఖముతోడను దనహృదయమును బాయకున్న మదనసింగునుదలచి కొని హేమలతయు వాని గలిసికొను సుదిన మెదురు చూచుచుండెను. అంతట నొక సుదినమున సుముహూర్త మేర్పఱచి జనార్ధనసింగు హేమలతా మదనసింగులకు సకల రాజపుత్రముఖ్యులసన్నిధిని మహావిభవముతో భేరీమృదంగాది మంగళధ్వనులతో వివాహము గావించెను. పద్మినిదేవి హేమలత యొక్క వినయాది సుగుణముల మెచ్చియో, పుత్రసమానుడైన మదనసింగుపై గల ప్రేమ నెంచియో, యామెకు సమస్తాభరణములను బెట్టి తనయింట బెండ్లికుమార్తెను జేసెను. చూచినవారందరు నది యనుకూలదాంపత్యమని పొగడ హేమలత మదనసింగును వివాహమాడెను. వివాహమహోత్సవ మైదునాళ్ళును మహా వైభవముతో నడిచెను. మదనసిం గేకపత్నీ వ్రతస్థుడై విద్యావంతురాలయిన యామె సాంగత్యముచే నపార సౌఖ్యము నొందుచు నారాయణసింగుతోడను మామగారితోడను సుఖముగా గాలక్షేపము చేయుచుండెను. వివాహమైన నెలదినముల కబ్దుల్ ఖరీము మౌలవిని మదనసింగు భీమసింగునకు జూపి యాతడు మ్లేచ్ఛరాజ్యమును బాసి చిత్తూరు రాజ్యమున నుండుట కనుజ్ఞ వేడుచుండుట దెలియ జేయ భీమసింగందులకు సంతోషించి యాతనికి నెలకు బదియైదువరాలవేతనముగలయుద్యోగమునిచ్చి యాతని కుటుంబమును గూడ రప్పించెను. ఆనాటనుండియు మౌలవి చిత్తూరు వాస్తవ్యుడై మహారాణా కొలువులో నుండెను.

తరువాత హేమలత సుఖముగనున్న వార్తను శివప్రసాదునకు జంద్రసేనునకు దెలియజేయుటకు మదనసింగు వారికడకు మనుష్యుల నంపెను. హేమలత తనకు గడుసహాయ మొనర్చిన చంద్రావతికుత్తరము వ్రాసి యా మనుష్యులచేతి కిచ్చెను. హేమలతా మదనసింగుల యనురాగఫలమై, వివాహమైన రెండు సంవత్సరములనాటికి వారి కొక కుమారుడదయించెను. అతనికి మదనసింగు మాధవసింగని తన తండ్రి పేరు పెట్టెను. తరువాత వారి కనేకులు కుమారులు గుమార్తెలం జనించిరి. మదనసింగు రాజభక్తియుక్తుడై తనతండ్రికంటెను బినతండ్రికంటెను బరాక్రమమున బేరు గాంచి శత్రువులకు బక్కలో బల్లెమై రాణాకు గుండెకాయ యై పుత్రపౌత్రాభి వృద్ధి గలిగి వర్ధిల్లుచుండెను.

—సంపూర్ణము—