హిమబిందు/చతుర్థ భాగం



చతుర్థభాగం



1. నాగబంధునిక

నాగబంధునిక తల్లితో, చెల్లెలితో కలిసి ధర్మనంది శిబిరమునకు వచ్చినది. అన్నగారిని తొలుత కలుసుకొన్నప్పు డామె పొందిన యానందమునకు మేరలేదు. కాని ఎప్పుడు శిల్పభావముల నాలోచించుకొను సువర్ణుని మో మిప్పుడు తీక్షణకాంతి యుతమై ఆమెకు భయముకొల్పినది.

ఒకనాడు నాగబంధునిక అన్న రూపమును పరిశీలనా దృష్టితో చూచినది. ఆతడు బవిరిగడ్డము పెంచికొనినాడు. మీసము తుమ్మెదరెక్కలవలె మిలమిలలాడుచు గడ్డమున గలిసిపోవుచుండెను. స్నాన మాచరించునప్పు డతని కండరములు వింధ్య పర్వతాగ్రముల వలె ఉబికిపోవుచుండెను. ఆతని వెడద యురము మానుతున్న గాయములతో విశాల తామ్ర పర్వత సానువువలె కాంతిల్లుచు తోచినది.

అతని ప్రతిఅంగము వజ్రశక్తిని మూర్తించుకొని ఆమెకు ప్రత్యక్ష మైనది. తన అన్న కన్నులలో నేడు స్వప్నములులేవు. మనోహరరూప దర్శన జనితానంద కాంతి తరంగములులేవు. యౌవనస్పృష్ట మధుమాస మత్తతలు లేవు. ఆ కన్నులలో నిశితకరవాల ధారా రోచిస్సులు, వజ్రనిపాత తళత్తళలు పరవడులై ప్రత్యక్షమైనవి. ఆ కాంతితెరలవెనుక ఏది నిశ్చయము, ఏదియో నిస్పృహా, ఏదియో భగ్నస్వప్నము దూరాన నడయాడు చున్నట్లా బాలలకు తోచినవి.

అన్న దేహమును మర్ధించుచు మార్జనకుని ఆవలకుబంపి వీరవ్యవసాయకుశల యైన నాగబంధునిక సువర్ణశ్రీ శరీరము తానే ఉద్వర్తనము చేయుచు, “అన్నా!” యుద్ధమునందు మనవారు ఎక్కువజాగ్రత్త వహించుచున్నారేమి? యని ప్రశ్నించెను.

“చక్రవర్తి జననష్టమున కియ్యకొనడు. సైనికులు అనవసరముగ ప్రాణముల బలి యీయరాదు. విరోధుల ప్రాణముల బలిగొనరాదు, సాధ్యమగునంతవరకు బందీల చేయవలయును.”

“కోటలో భోజనాది వస్తువుల తగ్గించి పాటలీపుత్ర పురవాసుల లోబరచు కొనవలయిననియా?”

“అదే మాయుద్ధేశము. చక్రవర్తి ఆజ్ఞ లట్టివి. అమృతపాదాచార్యుల వారి ఆదేశ మట్టిది.”

“ఉజ్జయిని యుద్ధమందును ఇట్టి యుద్ధనీతియే గమనించిరా?”

“ఆ!”

“మహాబలగోండుడు మన శిబిరమునకు వచ్చినప్పుడు నిన్ను గురించి అన్నియు నడిగితిని.”

“అవును, ఆతడు నాకు తెలిపినాడు నాగూ!....”

“ఎందుకు అన్నా, నీ హృదయములోని బాధ నాకు వ్యక్తమైనదిలే!”

“నీ హృదయములో నేదియో యున్నది. అది నా కర్థమగుటలేదు.”

“నా హృదయమున నే మున్నది అన్నా?” “నీవు హిమబిందుకుమారిని చూచితివా? యని అడుగదలచితివి. ఆమె యేమనినది? ఎట్లున్నది? ఇవీ నీ ప్రశ్నలు, నిజముకాదూ?”

సువర్ణుడు మెత్తని సెల్లాలచే దేహము తుడుచుకొని, నాగబంధునిక వస్త్రము లందీయ ధరించుచుండెను.

“అవును చెల్లీ! హిమబిందు పై ప్రేమ వదలలేను. ఆ దేవి యువరాణి కాబోవుచున్నది. అదియు నాకు సంతోషము. ఆమె ఆనందమే నాకు కడుగూర్చునది.” .

“ఓహో ఎంతటి ఉదారహృదయము అన్నది!”

“నామాట అటు లుంచు. నీహృదయమున ఉన్న ప్రశ్న నేను గ్రహించితిని.”

“అది వట్టి ఊహమాత్రమే యగును.”

“కానిమ్ము, నీవు సమవర్తిని గురించి యడుగదలచితివి. తథాగతుని తలచి నిజముచెప్పు, అవునా కాదా?”

“అవును అన్నా! చిన్నతనాననుండియు నాకు నీవే ఎక్కువ స్నేహితుడవు. నా స్నేహితురాం డ్రెవ్వరికిని చెప్పని రహస్యములునీకు గదా చెప్పుచుంటిని.”

“సమవర్తి ఉత్తమవీరుడు, మహాపురుషుడును. ఉజ్జయినికోట నాతడు రక్షించిన విధానము, ఆ నగరప్రజల నాతడు కాపాడిన రీతి, వారిపై ఆ వీరుడు వర్షముకురిపించిన ప్రేమ, ఆంధ్రసైనికుల ఆ సైన్యాధ్యక్షుడు తండ్రివలె కాపాడిన చరిత్ర-ఒక్క మహా ప్రబంధమునకు విషయమయి తీరును.”

“మగధదేశములో నుంటిమి, నీవు మాగధుడవై పోయితివా ఏమి?”

“ఓసి వెఱ్ఱిపిల్లా! మంచివారినిగురించి చెప్పుటలో మాగధులైన నేమి, వందులైన నేమి? సమవర్తికి ఉత్తమస్థితి నందవలెనని కాంక్ష యున్నది. ఆతడు హిమబిందును వివాహమాడ సంకల్పించుకొనుటయు తన ఆశలకు సిద్ధిని సమకూర్చుకొనుటకే!”

“హిమబిందుకు ఆయనకు వివాహ మెట్లు?”

“హిమబిందు నాతడు ప్రేమింపలేదు. సమవర్తి ధర్మహృదయుడు. ఆతనికి ఎవ్వరి పైనను ప్రేమ కలగనేలేదు. ఆతడు ఒకరిని ప్రేమించి, వేరొక బాలిక నుద్వాహమగు అధర్మ చిత్తవృత్తి కలవాడుకాడు. ఆర్య గృహస్థునివలె వివాహమాడిన భార్యను తన ప్రేమచే ముంచివేయును.”

“ప్రేమింపక, వివాహమాడినవెనుక ప్రేమ కలుగుటెట్లు అన్నా!”

“ప్రేమ రెండువిధములు చెల్లీ! ఒక పురుషుడు, ఒక స్త్రీయు ఒక మహాప్రేమ ఫలభాగులై జన్మింతురు. వారుకలుసుకొందురు, ప్రేమింతురు ఆమెకు అతడే దైవము, ఆతనికి ఆమెయే దేవి. ఆమె వినా ఆతడు పర వనితను కన్నెత్తి చూడలేడు. ఆమె తన సహధర్మచారిణి కానినాడు ఆతడు భిక్షుకుడే! ఆమెయు నంతియే.”

“అవును అన్నా!”

“ఇంక రెండవ జాతివారు. ఆజాతి యువతీయువకులు వివాహితాత్పూర్వము ఎవరిని ప్రేమింపరు. వారు ప్రేమోన్ముఖులై మాత్ర ముందురు. వారు వివాహమాడిన వెనుక యువతులు తమ భర్తలను, యువకులు తమ భార్యలను గాఢముగ ప్రేమింప ప్రారంభింతురు.” “అన్నా! కామసూత్రములకు నింత గంభీరవ్యాఖ్యానము లెప్పుడాలోచించు కొంటివి! ఇంక నా హృదయము దర్శింపుము. ఎద్దుబండి పందెముల నాటినుండి పందెమున రెండవవాడుగ వచ్చిన యా మహాపురుషుని యందు మనస్సు లగ్నమైనది. అది ప్రేమయన్న భావమే నా కుద్భవింప లేదు. ఆయన వెంటనే యుజ్జయినికి యుద్ధయాత్రకై వెడలిపోయెను అంతకన్న అంతకన్న ఆ వీరపురుషుని మూర్తి నా జీవితమంతయు ప్రసరించి నిండిపోయినది. అన్నా! ఆయన వినా నాకు ఇంకొకరి తలపేలేదు.”

“అదా తల్లీ! ధాన్యకటకమున అమ్మను తొందరచేసి, పాటలీ పుత్రమునకు పోవలెనని ఊదరకొట్టి, ఇక్కడకు లాగుకొనివచ్చితివి!”

“అవును. ఉజ్జయినిలో వారు విజయమందుదురని నా కెందులకో ధైర్యము. వారు ఇచ్చటకు వత్తురనియు ఊహించితిని!”

“ఏమియు లేదు. నేను నీ సైన్యమున అంగరక్షక ఉపచమూపతిగ జేరుదును. నాకు సమవర్తి సైన్యమున జేర మహా సైన్యాధ్యక్షుల అనుమతిని సంపాదింపుము.”

“అమ్మ ఏమనును? నాయన ఏమనుకొందరు?”

“అది వారి కేల తెలియవలెను? నేను పురుష వేషమున, వీర పురుషోచి తాలంకారముల నీతో ఇచ్చటకు, అచ్చటకు పోవుట నాయనగా రెరిగి ఊరకుండుటయు, అమ్మ నవ్వుచు ఒప్పుకోనుటయు నీవు ఎరుగవా?”

“చెల్లీ, నా ప్రేమయు, నీ ప్రేమయు ఫలరహితములే యగునో, ప్రేమ మహాశ్రుతిలో స్వరములే యగునో! అటులనే కానిమ్ము. ఏదీ సిద్ధ?”

“అది సార్వభౌముల మహాశిబిరమున రాజపుత్రికలతో నాడుకోన బోయినది.”

“అందుకా మన శిబిరము నిమ్మకు నీరువోసినట్లున్నది.”

2. ఎవ్వరీ వీరుడు?

సువర్ణశ్రీ తనవెంట నొకబాలవీరుని గొని స్వైత్రులవారి దర్శనము చేసికొని “మహాప్రభూ! ఈ బాలుడు మా బంధువు. ఈతడు శ్రీసమవర్తి సేనానుల కంగరక్షాధిపతిగ నుండ ఆజ్ఞ దయచేయ వేడుకొనుచున్నాను. అంగరక్షక శిక్షణ నంది, అంగరక్షకులలో ఇట్టివా డింకొక్కడు లేడని ప్రసిద్ధినందినాడు” అని మనవిచేసెను.

“సేనాధ్యక్షా! ఈ బాలకుడు సమవర్తి సైన్యాధ్యక్షులనే ఎన్నుకొనుటకు కారణ మేమి?”

“సమవర్తికి చురుకు పాలెక్కువ. నిర్భయముగ ముందుకు చొచ్చుకుపోవును. అట్టివానివెంట నుండుట కీ బాలుడు కోరుచున్నాడు.”

“కానిమ్ము. ఏది కారణమై నేమి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి యందు ఎక్కువ గౌరవము, ప్రీతియు కలుగును”

వెంటనే సర్వసైన్యాధ్యక్షులు సమవర్తికి కమ్మ లిఖించినారు. వారి ముద్ర ఆయన అంగరక్షకాధికారి అందు అచ్చువేసి, ఆ పత్రము సువర్ణ శ్రీకి అందిచ్చెను. సువర్ణశ్రీయు, ఆ బాలుడును సర్వసైన్యాధ్యక్షులకు వీర నమస్కారము లిడి సమవర్తి శిబిరమునకు బోయిరి.

సమవర్తి ఆవేళయందు మహాగోపురముకడ ప్రచండయుద్ధ మొనరించుచుండెనని వార్త తెలియవచ్చినది. వెంటనే ఆ బాలవీరుడు సువర్ణశ్రీ మోముచూచి, “అన్నా! నీవు నీ పనిపై వెడలిపొమ్ము. నేను సమదర్శి ప్రభువును దర్శించి యీ యాజ్ఞాపత్రము వారికి సమర్పింతును” అని తెలిపినాడు.

“పొమ్ము. నాగూ, నీతో మనవీరులను పదిమంది గోండునాయకులను కొని పొమ్ము .”

ఆ బాలవీరుడు సంపూర్ణ కవచధారియై ఉత్తమాజానేయు మధివసించి, కతిపయ వీరులను తీసికొని, మహాగోపురముకడ జరుగు యుద్ధమును జేర బోయెను.

ఆ బాలుని హృదయము ప్రథమమున ఆ భీకరయుద్ధమునుగాంచి కొంచెము వెరపునందెను. కాని యాతడు వెంటనే సమ్మాళించుకొని, ఆంధ్రదళపతులకు, చమూ పతులకు, ముఖపతులకు సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞాపత్రము చూపించుచు, కోటనుండి సువ్వున ప్రాణబలికోరివచ్చు నిశిత శరముల తప్పించుకొనుచు, ఫలకమును ఒడ్డుచు, తన గుర్రమును విచిత్ర గతుల నడుపుకొనుచు, ముందునకు పోయినాడు.

సమవర్తి తాత్కాలికముగ నక్క డేర్పరచిన ఒకచిన్న మట్టి బురుజుపై నుండి యుద్ధము నడుపుచుండెను. ఇంతలో ఆతని చారు డొకడు సమవర్తిని డాసి, “మహాప్రభూ! సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞకొని యొకవీరు డరుదెంచినాడు” అని మనవిచేసినాడు.

“ప్రవేశపెట్టు” మని సమవర్తి ఆజ్ఞనిడి యుద్ధయంత్రముల ప్రయోగించు యాంత్రికులకు నాజ్ఞలిడు పనిలో మునిగిపోయెను.

“మహాప్రభూ! జయము, జయము!” అను మధురస్వరము వెంటనే వినవచ్చెను. మధురము, గంభీరము, నిషాదస్వరపూరితమైన యా మాట విని సమవర్తి యాశ్చర్యమంది యావైపునకు జూచెను.

ఎదుట చిరునవ్వుతో సంభ్రమగౌరవపూరితదృష్టుల బరపు సుందరుడగు బాలవీరుడు సర్వాయుధోపేతుడై, కవచధారియై నమస్కార మిడుచు నిలిచియుండెను.

“ఎవరయ్యా నీవు?”

“మహాప్రభూ! తమ సేవకుడను. సర్వసైన్యాధ్యక్షుల యాజ్ఞాపత్రం గొనివచ్చితిని” అని ఆ బాలకుడా పత్రము సవినయముగ సమవర్తి కందించెను. సమవర్తి ఆ పత్రము చుట్టవిప్పి, చదువుకొని “ఏమయ్యా, నిన్ను నాకడ నంగరక్షకాధికారులలో నొకనిగ నియమించినారు. నీ వయసు పదునేను వత్సరములకు మించియుండదు. నీవు నన్నెట్లు రక్షించగలవు?” అని ప్రశ్నించినాడు.

“మహాప్రభూ! నేను అంగరక్షకులలో మేటిని.”

“మాటలు వేరు, పనులు వేరు. నీవుబాలుడవు, ముక్కుపచ్చ లారలేదు. ఆ చెంపలనుండి పాలింకను స్రవించుచున్నట్లే యున్నది.”

“సైన్యాధ్యక్షా! నా పనిని పరిశీలించుడు. నేను తమకు ఉపయోగించుచో ఉంచుకొనుడు, లేనిచో పంపివేయుడు.”

“ఒకసారి నీవు చేరినవెనుక పంపివేయుట ఉండదు. సరే, పని యందు ప్రవేశింపుము.

“కృతజ్ఞుడను.”

వెంటనే ఆ బాలవీరుడు సమవర్తి అంగరక్షకులలో నొకడయ్యెను. ఆ బాలకుడు సమవర్తిపై ఈగనైన వాలనీయడు. తన్ను తోడివీరులు పరిశీలించుచుండ ఆతడు తన చిన్నవిల్లును సువ్వునలాగి కోటగోడల నుంచి బాణములు, అగ్నివర్షములు కురిపించు గండల నొక్కొక్కరి తనబాణముల, కెరసేయుచుండెను.

ఆ బాలుని బాణములు ఎందరిప్రాణముల గొన్నవో! సమవర్తి యా బాలుని కౌశలమున కచ్చెరువందుచు సాయంకాల మగుటచేత యుద్ధము మరొక సైన్యాధ్యక్షున కప్పగించి, తనశిబిరమున కా బాలవీరునితో వెడలిపోయెను. 

3. చిన్న చెల్లెలి మాటలు

ఆ బాలుని యందము బాలికల యందము. ఆ విశాలనేత్రముల ఏవో స్వప్నము లున్నవి. ఆ స్వప్నములు యుద్ధసమయమున గరగి వీర కాంతుల బ్రజ్వరిల్లును. యుద్ధమునందు ఎదిరి వాని ప్రాణముగొనక, కాలినో, చేతినో నొవ్వనేయును, లేనిచో నిరాయుధుని చేయు ఆ బాలుని హృదయమును మెత్తదనము సగపాలు పంచుకొని యుండనోపునని సమవర్తి యా నూత్నబాలకుని గూర్చి ఆనా డనుకొనెను.

ఆ బాలుడు శిరస్త్రాణమైన తొలగింపక, ఏవేవో మాటలు గొణుగు కొని, వరువాతనే మరల వచ్చెదనని వెడలిపోయెను.

ఆ బాలకుడు మాటలాడడు. మాటలో బాలికాకంఠము ప్రతిధ్వనించినది. ఎవరీ బాలకుడు? తన్నా బాలకుడు భక్తి పూరిత దృష్టుల చూచునేమి? ఇందేదియో రహస్యమున్నది. సువర్ణశ్రీ సేనాధిపతి పోలిక లెన్నియో యున్నవి. రెండు మూడు పర్యాయము లీ బాలకుని ధాన్యకటకమున నెప్పుడో చూచినట్లున్నది. ఎవరై యుండును?

ఈ ప్రశ్నతో సమవర్తి యుద్ధమునకు బోవువాడు. ఆ బాలకుడు కూడవచ్చుచు ఒక దివ్యశక్తి మనుష్యుని రక్షించునట్లు తన సేనాపతిని రక్షించుచు, విరోధుల గర్వమణచుచు మహాయుద్ధ మొనర్చుచున్నాడు.

నాగబంధునిక ఇంటికివచ్చి తన శిరస్త్రాణాదికము విసర్జించి, సుగంధము కలిపిన వేడినీటిస్నానము చేసి, పాటలు పాడుకొనుచు సమవర్తిని తలపోయుచు ఏదియో మహానందమున తాండవించిపోవుచుండును.

ఒకప్పుడామె దాపుననేయున్న యన్నగారి శిబిరమునకు చెల్లెలితో పోవును. అన్న తన గాయములకు చికిత్సచేయించుకొనునప్పు డామె వైద్యునకు సహాయముచేయును. సిద్ధార్థినిక “అన్నా, హిమబిందు నేను వెళ్ళగనే నన్నంత గాఢముగ హృదయమున కదుముకొని పెదవులపై ముద్దు పెట్టునేమి?” యని ప్రశ్నించెను.

నాగ: నువ్వందకత్తెవని.

సిద్ధా: అయిన నీ వేల నన్ను కౌగిలించుకొని నాకు ముద్దులీయవు?

నాగ: నువ్వు నా చెల్లెలివి. నేను నీ యందమును మెచ్చుకొన కూడదు.

సిద్ధా: నీవును అందమైనదానవే. ని న్నెవరు కౌగిలించి ముద్దు గొందురు?

సువర్ణశ్రీ: మంచిప్రశ్న వేసినావు చిట్టితల్లీ!

నాగ: ఓయి వెర్రిఅన్నా, నీ చెల్లెలు కాదామరి! మంచి ప్రశ్నలును వేయును, మనకు అతిసన్నిహితము లగు విషయములును జెప్పును.

సువర్ణ: నీ విషయములు చెప్పలే దని నీకు కోపము.

వైద్యులైన శ్వేతకేతు లప్పుడు పకపకనవ్వుచు, “ఈ అన్నా చెల్లెళ్ళకు ఒక విచిత్రరోగ మావహించినది. పాప మిరువురును ఆ చిన్న బిడ్డను బాధించుచున్నారు. నాగబంధునికా! నీవును అన్నవలె వీరవిక్రమ విహారము చేయుచుంటివటగదా” యని కన్ను గీటుచు ప్రశ్నించెను.

నాగబంధునిక తెల్లబోయి, “ఈ రహస్య మెట్లు తెలిసినది, మామయ్యగారూ!” యని ప్రశ్నించెను.

శ్వేతకేతు: ఏ రహస్యము? నీ విహారవిషయమా, నీ విచిత్ర రోగ విషయమా?

సిద్ధార్థినిక: అక్కకు రోగమా? అమ్మతో చెప్పవలెను. ఎక్కడే అక్కా నీకు రోగము?

శ్వేత: వేళాకోళమున కన్నాను సిద్ధూ! అక్కకు రోగము లేదు, గీగము లేదు.

సిద్ధార్థినిక: “అమ్మయ్యా! భయమువేసింది అక్కకు రోగ మని మీ రనగానే మామగారూ!” యని తన అక్కనుబోయి కౌగిలించుకొనెను. నాగబంధునిక చెల్లెలిని గాఢముగ హృదయమున కదుముకొని పెదవుల ముద్దుగొనెను.

శ్వేత: అదిగోనమ్మా! మీయక్క నీయందము మెచ్చుకొను చున్నది.

నాగ: మామయ్యగారూ, మీ వన్నియు వేళాకోళములే!

శ్వేతకేతు తనమందులసంచియు, మంజూషయు సేవకుడు కొనిరా పకపక నవ్వుచు వెడలిపోయెను.

సువర్ణ: చెల్లాయీ! దినదినమూ హిమబిందుగుడారమునకు బోవు చున్నట్లున్నావే?

సిద్ధా: అవును అన్నా! నన్ను హిమబిందు దినదినము రమ్మన్నది. నాకు తానే తలదువ్వును. బాలనాగినిగాని, అలంకారికనుగాని దువ్వనీయదు, అలంకరింపనీయదు. తన ఒడిలో కూర్చుండబెట్టుకొనును.

నాగ: అన్నకు అక్కడ జరిగిన విషయము లన్నియు చెప్పవే తల్లీ! అందులో ముఖ్యమగు రాజవ్యవహారము లున్నవి.

సువర్ణశ్రీ: అవును నీవు పురుషవేషమున....

నాగ: అన్నా!....

నాగబంధునిక చెల్లెలికి కనబడకుండ అన్నకు కన్నులతో చెల్లెలిని చూపి, తన పెదవులపై తర్జనినుంచి సైగచేయును.

సిద్ధార్థినిక పెదవులు పూ మొగ్గవలె ముడుచుకొని, “అన్నా! పోనీ, అక్కమగవేషము సంగతి నాకు తెలియదా? మొన్న హిమబిందుశిబిరములకు సమవర్తి వచ్చినారు. ఆయన నన్నుచూచి, కనుబొమలు ముడిచి, నామొగము తేరిపారచూచి, “ఈ బాలిక ఎవరు?” అని హిమబిందువదినను అడిగినారు” అని చెప్పుచుండెను.

నాగబంధునిక ఆమె మాటకు అడ్డమువచ్చి, “హిమబిందువదిన ఏమీటే?” అని ప్రశ్నించినది.

సిద్ధా: హిమబిందు నాకు వదిన! నన్నట్లు పిలువు మనినది. నాకు వదిన అయితే నీకు మాత్రము కాదా!

నాగ: (పక పక నవ్వుచు) నాకును వదినే!

“వదిన చెడ్డది ఎంతో వల్లమాలినదీ వదిన కన్నకు మనసు కుదరనేలేదూ” (అని పాడినది) సిద్ధా: హిమబిందువదిన చెడ్డదికాదు. సమవర్తితో వదిన “ఈ బాలిక ధర్మనందిగారి చిన్న కొమరిత” అని తెలిపినది. ఆయన “ఈమెకు అన్న లెంతమంది?” యని అడిగినారు. వదిన “ఒక్కడే!” అని ప్రత్యుత్తరమిచ్చినది. అప్పుడు సమవర్తి “అటులనా, ఇరువు రనుకొంటిని. ఏలన ఈ బాలిక మోమును, నాకొక నూతన అంగరక్షకుడు వచ్చినా డాతని మోమును ఒక్క పోలిక నున్నవి” అనినారు.

సువర్ణశ్రీ: ఓహో! సమవర్తి నిజమునకు దగ్గరగ వచ్చు చున్నాడు.

సిద్ధా: నిజ మేమిటి అన్నా?

సువర్ణశ్రీ: ఆ నవవీరుడు మనకు దగ్గరచుట్టములే తల్లీ!

సిద్ధా: ఆ క్రొత్తవానిని నే నెరుగుదునా?

నాగ: ఎరుగుదువు! ఎరగవు. అది మన కేలనే! హిమబిం రెట్లున్నది?

సిద్ధా: బాగుగనే యున్నది, కాని ఎప్పుడును ఏదియో యాలోచించును. బాలనాగిని నా కొరకై పంపును. నేను వెళ్ళగనే నన్నొక నిమిషమైన వదలదు.

సువ: నీవు సమవర్తి శిబిరమునకు పొమ్ము. ఆయనయు నిన్ను వదలడు.

ఇంతలో సమవర్తి సాతవాహన సేనాపతి సువర్ణశ్రీని చూచుటకు వచ్చినాడని ఒక దళవాయి గుడారము గుమ్మముకడనుండి తెలియజేసెను. అతని వెనుకనే సమవర్తియు ద్వారమునుండి లోనికి వచ్చినాడు. నాగబంధునిక యచ్చట శిల్పముచేసిన విగ్రహమువలె కదలలేక నిలుచుండి పోయినది.

సమవర్తి నాగబంధునికను జూచి అవరోధజన ముండిరని వెనుకకుబోవ నుంకించుట కనుగొని సువర్ణశ్రీ నవ్వుచు, “లోనికి రండు! సంశయింపబనిలేదు. ఈ బాలిక మా చిన్నచెల్లెలు. ఇదివరకే హిమబిందు శిబిరములకడ చూచినారు. ఆమె మాపెద్దచెల్లెలు.

సమవర్తి తెల్లబోయి, మాటకై ఒకనిమేషము వెదకికొని, “నా కడకు వచ్చిన ఒక బాలకునిగూర్చి మిమ్మడుగవచ్చితిని. స్వైత్రులవారు మీరు గొనివచ్చిరని తెలిపినారు” అని వచించెను.

సువర్ణశ్రీ: ఈ నా పెద్దచెల్లెలు చటుక్కున పురుషుడై పోవును. ఆనాటి ఎడ్లపందెము కాలమునుండి మీకు బాసటగ విరోధుల తలపడవలెనని కోరికోరి నేడది ఫలవంతము చేసికొన్నది.

సమవర్తి ఆశ్చర్యమంది, ఏమి.... మీ.... మీ.... చెల్లెలా! అందుకే... అందుకే.... పోలిక....” అని వాక్యము పూర్తిచేయకుండగనే నిలిచెను.

నాగబంధునిక తుర్రున మాయమయ్యెను. సువర్ణశ్రీయు, సమవర్తియు ఆవైపునకు జూచుచు చిరునవ్వులు మోముల పై ప్రసరింప ఒకరి నొకరు చూచుకొనిరి. సిద్ధార్థినిక “అక్క పారిపోయిందేమి?” అని ప్రశ్నించినది. 

4. సువర్ణశ్రీ పలాయనము

“ఎవరీ విషకన్యక? ఈ విషకన్యకకు, మహారాజు శ్రీకృష్ణునకు సంబంధమేమి? ఈ విషకన్యను ప్రయోగించటమేమి?” అని చారుగుప్తుడు పాటలీపుత్రమునందు తాను బసచేసిన భవనమున, ప్రార్థనామందిరమున బుద్ధపాదుకల పీఠమున కెదురుగనున్న ఆసనముపై అధివసించి, “ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి” అని ప్రార్థన సల్పుచు మనసున వివిధాలోచనలపాలాయెను.

మహారాజుకడనున్న అనుయాయులు ఆ విషయము నిగూఢరహస్యముగా నుంచుటచే తనకు చూచాయగమాత్రము తెలిసినది.

హిమబిందుకుమారి వివాహవిషయము ఎందరు పెద్దలు హెచ్చరించినను తనకు వివాహ మక్కరలేదనియు, తాను బ్రహ్మచారిగ మాత్ర ముందుననియు యువరాజు ప్రతివచన మిచ్చినారట.

తనబాలిక యందము అతిలోకముకదా! ఇంతవరకు దేశదేశముల నుండి తన తనయను తమబాలుర కిమ్మని మహారాజులు, కోటీశ్వరులు వర్తమానము లంపుటలేదా? ఆంధ్రబాలురలో తనబాలికను చూచి మతి పోనివా డుండెనా? ఇందేదియో విచిత్ర మున్నది. త్వరలో యువరాజు నునుమతినంది, వివాహనిశ్చయ మహోత్సవ మీ పాటలీపుత్రములో జరిపింపవలయును.

ఈ సువర్ణశ్రీ పాటలీపుత్రము చక్రవర్తివశమగుటకు కారణభూతు డైనాడే. ఎంతటి చిత్రమైన ఎత్తువేసినాడు! ఎంతపెద్ద సేనాధికారికిగూడ నట్టియుక్తియే తోచలేదేమి? మొన్న చక్రవర్తి ఆ అఖండజయోత్సవమున సువర్ణశ్రీని జయకిరీటధారి నొరించినాడు. ఆ బాలుడు దివ్వునివలె వెలిగిపోయినాడు.

తనకుమారి అతని జయోత్సవమున అంత ఆనంద మందినదేమి? తన్ను రక్షించిన యువకుడు పాటలీపుత్ర పతనమునకు కారకుడైనాడని కాబోలు! సోమదత్తాచార్యులును తానే జయమందినట్లు ఉప్పొంగిపోయినాడు.

ఈ ఆలోచనలతోడనే చారుగుప్తులవారు జపము ముగించుకొని తమ మందిరము లోనికి పోయినారు. అక్కడ సమవర్తి యుండెను. చారుగుప్తుడు లోనికి వచ్చుటయు, సమవర్తి మేనమామకు నమస్కరించి, ఆయన రత్నకంబళిపై అధివసింపగనే తానును కూరుచుండెను.

“మామయ్యగారూ! ఆంధ్రులు అఖండవిజయసంపన్నులగుటకు మీరే కారకులు. మీ పరమసంకల్పము శతథా విజయమందినది. ఇంక హిమ వివాహ విషయము తేల్చవలసియున్నది.”

ఇంతలో లోనినుండి అమృతలతాదేవియు, భిక్షుకుడైన వినయ భిక్కును ఆ మందిరములోనికి వచ్చిరి.

అమృతలతాదేవి: అన్నా! నీవు మావానికి హిమను ఇత్తు వని మే మందరము ఆశించియున్నాము. మా సమవర్తి విజయపరంపర నీవు వింటివికదా! ఇంక అందరును ఇచ్చటనేయున్నారు. సమవర్తికి హిమబిందుకు మనువు నిశ్చయము చేయించి, ప్రదానోత్సవము. చేయింపుము.

వినయ: కుమారా! నా ఉద్దేశ్వము అదియే! నేను నీకు సలహా నిచ్చుచున్నది తండ్రినై కాదు. భిక్షువునయ్యు, మా గురువులగు అమృత పాదార్హతులు నిందుల కియ్యకొనుటచే నిట్లు చెప్పుచుంటిని.

చారు: చెల్లీ! నీ మాటయు, నాన్నగారిమాటలు ఎంతయు సమంజసములే! అయినా నేను చిరంజీవి హిమబిందును శ్రీకృష్ణసాతవాహన మహారాజుకీయ నిశ్చయించి, చక్రవర్తిగారికి నా మనవి నివేదించితిని. అందుకు చక్రవర్తులను, సామ్రాజ్ఞి ఆనందదేవి మహారాణియు సంతోషమున సమ్మతించినారు. అమృత: ఆఁ!

సమ: ఏమిటీ! అదియా నీ ఉద్దేశ్యము! అది ఉత్తమమార్గమే! కాని నాకు తెలియవచ్చిన విషయములు కొన్ని ఉన్నవి. అవి నీకు కొద్దికాలముననే వ్యక్తమగును.

అమృతలత కోపముతో, సమవర్తి ఏదో బరువుతొలగిన హృదయముతో వెడలిపోయిరి.

వినయభిక్కులవారు “నాయనా! నీప్రయత్నము ఉత్తమమైనదే కాని అమ్మాయి అమృతలతను అడిగి మఱి నీ వీ పని చేయవలసినది. నే ననునది ఏమియులేదు. హిమ సంతానవతియై, దీర్ఘ సుమంగళియై-బుద్ధ భగవదారాధన పరురాలై మనవలసిన దని నాఆశీర్వచనము. నేను వెళ్ళుచున్నాను” అని, కుమారుడు పాదాభివందన మాచరింప నాశీర్వదించి వెడలి పోయిరి.

చారుగుప్తులవారు హిమబిందును కలిసికొన నామె మందిరములోనికి బోవుటయు, నంతకుముందే హిమబిందు రథమెక్కి కీర్తిగుప్తులవారి మందిరమునకు బోయెనని తెలిసినది. చారుగుప్తుడు విసిగికొనుచు, చక్రవర్తిని దర్శింపబోయినాడు.

హిమబిందు కీర్తిగుప్తులవారి భవనములో, వారిమందిరమున తాత గారి ఒడిలో తలనుంచి వెక్కివెక్కి ఏడ్చుచున్నది.

ఆతడామె తల నిమురుచు, “నా తల్లీ! ఎందుకు ఏడుపు? నీహృదయము నా కవగతము కాలేదనా? నీతండ్రికి యౌవన మనోరథము లర్థము కావు. ఆతడు ధనముకొరకు దేశములు తిరిగినాడు. నేను ఆనందముకొరకు ఆ వెనుక ధనముకొరకు దేశములు తిరిగినాను. నా ఇంటనున్న అపురూప విచిత్రములను మూల్యమునకు కుబేరులు కొనజాలరు. మీ తండ్రి కుబేరుల కప్పీయగలడు. కన్నతల్లీ! నేను నీతండ్రి నిట్లంటి ననుకొనకుము. ఆతడు మీ తల్లిని ఆత్మసమానముగా ప్రేమించినాడు. కాని అమెను మృత్యుంజయగ చేయలేకపోయినాడు. ప్రేమ సావిత్రివలె మృత్యువును జయించును. ఆమెను తనకొరకు మాత్రము ప్రేమించినాడు. ఆమె కారణజన్మ. వెడలి పోయినది. గంగ శంతనుని విడిచి వెడలిపోలేదా? తన రూపం ప్రేమించిన శంతనుడు సమయ భంగము చేయగలిగినాడు. గంగ ఆతని వీడి వెడలి పోయినది. తల్లీ! నాతల్లియు మనలను వీడి వెడలిపోయినది” అని తనలో తాను ఆమెకు వినబడునట్లు మాట్లాడినాడు.

హిమ: నా ప్రేమ ఎట్టిది తాతయ్యా?

కీర్తి: తల్లీ నీ ప్రేమలో ఇంకను నీవు కొంచే మున్నావు.

హిమ: ఆఁ.

కీర్తి: అవును కన్నతల్లీ! నేను చెప్పవలసిన సమయమువచ్చి నప్పుడు మోమోటములేక చెప్పెదను.

హిమ: తాతయ్యా! నేనేమి చేయుదును? సువర్ణశ్రీని వివాహము చేసికోలేనినాడు నా ప్రాణమే పోవునేమో!

కీర్తి: తల్లీ! ప్రేమ రెండువిధములు. నువ్వు ప్రేమింతువు. కాని ఆ ప్రేమించినవానిని నీ భర్తగా గోరవు. అది మహోత్తమప్రేమ.

హిమ: అది ప్రేమ ఏమిటి? అది గౌరవము, స్నేహము.

కీర్తి: రెండవది, నీవు ప్రేమించినవానిని భర్తగా వాంఛింతువు. అది ఉత్తమప్రేమ. నీదీ రెండవరీతి. నేను చెప్పిన మొదటి ప్రేమ పురుషుని దైవముగా మాత్రము చూచును. రెండవరీతి ప్రేమగలవారు వివాహమైన వెనుక భర్తనే క్రమముగా దైవమునువలె ప్రేమించుటయు కలదు. కావుననే నీవు సువర్ణశ్రీని ప్రేమించియు, నీ తండ్రి నిన్ను శ్రీకృష్ణసాతవాహనున కిత్తునని చెప్పగనే ఊరుకొంటివి. కావుననే ఇట్టి రసాభాస యగుచున్నది.

హిమ: తాతయ్యా! నీవు చెప్పినది నిజము. ఇప్పుడు నేనేమి చేయగలను?

కీర్తి: తల్లీ! నీవలన తప్పులేదు. నీలోని యవనర క్తము దీ తప్పు. నేను మీముత్తవను భారతీయకారిగా నొనరించుటకు ఎంత తప మొనరించితినో తెలియునా! చివరకు విజయమందితిని. నీ తల్లి నాకొమరిత! మీ అమ్మమ్మ కొమరితకాదు. నీవు మీ అమ్మమ్మకు, నాకును మనుమరాలివి. నీతండ్రి కూతువు.

హిమ: తాతయ్యా! నాహృదయమంతయు నీకు విప్పిచెప్పితిని, నీ మేమి చేయు మన్న చేసెదను. ఒక్కటి మాత్రము నిజము. నా అంతరాత్మయో ఏదియో నాకు చెప్పుచున్నమాట నిజము. నేను కోరినపురుషుడు నాకు భర్త కానిచో, నా తాతవలె నేనును దీక్ష గైకొందును. లేదా, నా ప్రాణము ఈ బొందిని వీడును. నాకా శిల్పియే దైవము, మిత్రుడు, భర్త. నా అనుమానము లన్నియు వీడినవి. అతని నామము తలువని నిమేష మొకటి లేదు. నిద్దురయే లేదు! స్వప్నములు, స్వప్నముల నా దివ్యమూర్తి!

ఇంతలో కీర్తిగుపులు పంపిన చారు డొకడు తిరిగివచ్చినాడని కంచుకి చెప్పినాడు. కీర్తిగుపుడు లోనికిరా ననుమతి నిచ్చుటయు, నాతడు వచ్చెను.

“అయ్యా, సువర్ణశ్రీ నిన్ననే పాటలీపుత్రము వీడి ఎచ్చట కేని పోయేనట” అని చెప్పెను. 

5. సుశర్మ ప్రస్థానము

పాటలీపుత్రము ఆంధ్రులవశమైన దినముననే సువర్ణశ్రీకుమారుడు మహావేగముతో నగరదుర్గమును పదివేలమంది సైనికులతో ముట్టడించెను గంగానదీతీరమున తూర్పుగ తీరస్థ కుడ్యములకు నూరుధనువుల దూరమున చంద్రగుప్త సార్వభౌముడు నగరదుర్గమును నిర్మించెను. ఈదుర్గము చిన్న నగరమంత విశాలముగ నున్నది. ఈ దుర్గముచుట్టును గంగానదిలోనుండి ఒక శాఖను కొనివచ్చి లోతును, వెడల్పును గల పరిఖగా నొనర్చి దుర్గసంరక్షణ చేసినారు. ఈ దుర్గమునకు నాల్గువైపుల నాలు ద్వారములుమాత్ర మున్నవి.

చక్రవర్తి సౌధములు, హర్మ్యములు, మహాభవనములు, రాజోద్యానములు నెంతో సుందరములుగా నశోకచక్రవర్తి నిర్మించినారు.

నేడు ఆంధ్రులు పాటలీపుత్ర మహానగరమును స్వాధీనము చేసికొనదిగనే సుశర్మకాణ్వాయనుడు ఏబదివేలమంది సైన్యముతో, సేనానాయకులతో రాజకోటనుండి యుద్ధము సాగించుచుండెను.

సువర్ణశ్రీ యుద్ధము చేయుచు, దుర్గసింహద్వారగోపురమునే తల పడెను. సమవర్తి, సోమదత్తాచార్యులు, స్వైత్రులవారు తక్కిన మూడు గోపురములకడ విజృంభించిరి. సువర్ణశ్రీ యుద్ధవిధానమును గమనించుచు ఆతని కనేకవిధముల బాసటయై చక్రవర్తియే ఇరువదివేల సైన్యముతో వెనుక నిలిచియుండెను.

సువర్ణశ్రీ వేగము మహావేశపూరితమైనది. అతని ఆవేశమే ఆంధ్రవీరులనుగూడ ఆవేశింప ఘోరయుద్ద మొనర్చుచుండిరి. కందకములో పుట్టెలు, నావలు వైచిరి. కోటగోడలపై నుండి వచ్చు అగ్ని వర్షమునకు, బాణవర్షమునకు నున్నని దళసరి ఖడ్గమృగపు చర్మములచే, ఎనుబోతు చర్మములచే సంతరింపబడిన కేడెముల వితానమే రక్షగా సైనికులు నావలపై గోడలదగ్గరకు బోయి, ద్వారము జేరబోయి వానిని భేదింప గడగుచుండిరి.

యాంత్రికాయుధములు సంతతధారగా కోటలో గురియుచుండెను సువర్ణశ్రీ స్వయముగ ఒక ఏనుగుపై నున్నిశయ్య లమరించి, ఆపైన ఇనుపఫలకములు కప్పి అందు పూర్ణకవచధారియై కూరుచుండి, పైన ఉక్కుకేడెముల ఛత్రములవలె గజరక్షకులు పట్టియుండ నీటిలోనికి నా గజమును దూకించెను. ఆ మహాగజమునకు మహాకవాట విధ్వంసిని యన్న బిరుదనామ మున్నది. ఆ దంతావళము కరమున నినుపగుదియబూని గోపురద్వారమును ముక్కలగునట్లు తాడన మొనరింపసాగేను.

పై నుండి మృత్యువర్షము కురియుచుండెను. ఒక గడియలో ద్వారములు వివిధములగు తాకుడులవలన ముక్కలై విడినవి. ఆంధ్రసైన్యము “జై సువర్ణా” యని లోనికి జొరబడెను. వెంటనే చక్రవర్తి నూరుగజముల సింహద్వారము కడకు దూకించెను. పుట్టెలు, పడవలు వందలకొలది నిండిపోయినవి. వేనకువేలు సైన్యములులోని కురికినవి. కాణ్వాయన సైన్యము లాధాటి కాగలేక వెనుకంజ నిడినవి. చక్రవర్తియే కోటలోని కడుగిడెను. తన మహాధనుసుతో చక్రవర్తి నిరంతర బాణ ప్రయోగము చేయుచు ప్రాణములు గొనుచుండెను. ఆ సంకుల సమరములో చక్రవర్తి వైతాళికులచే “ఆయుధములు పడవేసినవారికి రక్ష” అని కేకలు వేయించుచుండెను. ఒక్కసారిగా ఆ ద్వారముకడ యుద్ధముచేయు ఏడువేలమంది తమ ఆయుధముల క్రింద బడవేసిరి.

సువర్ణశ్రీ నూరుగురు మహావీరులతో, కాణ్వాయనచక్రవర్తి గజారోహియై యుద్ధము నడుపుదెస కేగి, “కాణ్వాయనమహారాజా, ఇంతటితో యుద్ధయు చాలును. మీ భటు లందరు నిరాయుధులైనారు. యుద్ధము మాన తమ సేనల కాజ్ఞనిండు. తమ్ము బంధింపము. చక్రవర్తి గౌరవము లొసగబడును” అని కేకవేసెను.

సుశర్మకాణ్వాయనునకు పాటలీపుత్రనగరము పట్టుబడులతోడనే వైరాగ్య ముదయించి యుండెను. తన సేనలయందే తనకు నమ్మకములేక యుండెను. కావున సువర్ణశ్రీ అట్లు పలికిన వెంటనే యుద్ధవిరమణ భేరీ చఱపించెను.

“ఆ భేరీనినాదములు వినగనే సుశర్మచక్రవర్తి సైనికులు ఆయుధములను క్రిందపారవేసినారు.

సుశర్మ చక్రవర్తి విచారవదనమున గజావరోహణ మొనర్చెను. సువర్ణశ్రీ ఆ ప్రభువునకు సాష్టాంగదండ ప్రణామంబు లిడి, లేచి “మహా ప్రభూ! రండు తమ దర్శనము చేయ మా చక్రవర్తి వేంచేయుచున్నా” రనెను.

శ్రీముఖచక్రవర్తియు పాదచారియైవచ్చి, సుశర్మచక్రవర్తికి వీర నమస్కార మిడెను.

ఇరువురు బ్రాహ్మణులు, చక్రవర్తులు. ఒకరు ఓడినారు, ఒకరు జయమందినారు. సుశర్మ శ్రీముఖునకు ప్రతినమస్కారమిడెను. శ్రీముఖ చక్రవర్తి సుశర్మకడకు పోయి, యాయనను కౌగలించెను. ఇరువాగుల సైన్యములవారును జయజయధ్వానములు కావించినారు.

సుశర్మ: “మహారాజా! మా కణ్వాయనయుగ మింతటితో అంతరించినది. కాని, దక్షిణాత్యులగు మీరిచ్చటనుండి ఏమిపాలన మొనరింప గలరు? మీరు బౌద్ధులై వేదముల నగౌరవ మొనర్చితిరి. యుగయుగముల నుండి పవిత్రమైయుండిన ధర్మముల నడుగంటించి, వేదబాహ్యమైన ఈ చార్వాకమతమును విజృంభింపచేసినారు. మీ బుద్ధుని ధర్మము శాశ్వత మగునా? వేదములే పరబ్రహ్మ స్వరూపములు. అవి నాశనము కావు. ఈ దినముకానిచో రేపు మీబౌద్ధధర్మము నాశనమైపోవును. ఈ జంబూ ద్వీపమునందు బుద్ధధర్మమే లేకుండా నాశనమగుగాక! మా ధర్మము మేము నిర్వర్తించితిమి. మీ రనుమతించినచో మేము వానప్రస్థమునకై హిమాలయములకు పోదుము. లేదా మీ ఇష్టమువచ్చినట్లొనరింపుడు అనెను.

శ్రీముఖుడు: చక్రవర్తీ! మీరు మీ ధర్మము నిర్వర్తించినారు. మేము మా ధర్మమును నిర్వర్తించినాము. “మే మొనరించినది ధర్మ బద్ధము మీది కాదు” అని మేము అనము. తాము తప్పక హిమాలయములకు పోవచ్చును. మనము ప్రయత్నము చేయవలెను. తర్వాత కర్మమెట్లు నిర్దేశించునో యట్లు జరుగును. తామెప్పుడు ప్రయాణముచేయ నిచ్చగింతురో యప్పుడ మీ కిష్టమగునవన్నియు గొనిపోవచ్చును. మేము మీ సేవకులము, మీ అతిథులము.”

సుశర్మ “మహారాజా! సెలవుతీసికొందుము. వేద ధర్మమును, బౌద్ద ధర్మమును సమానముగ పాలింపుడు, అదియే మా కోర్కె అని యంతఃపురములోని కరిగి హిమాలయప్రస్థాన ప్రయత్నమున నుండెను. ఈ విజయమునకు సువర్ణశ్రీ కారకుడని చక్రవర్తి యాతనివంక దొరిగి, తనమెడలోని నిద్రుమమాలను అతని కంఠమున వైచెను.

విజయులైన ఆంధ్రులు మహోత్సవము లొనరించుట ప్రారంభించిరి.

సువర్ణశ్రీ నగరములో తండ్రిగారు విడిదిచేసిన భవనమునకు బోయెను. తనధర్మము నెరవేర్చినాడు. ఈ మహాయుద్ధము తన ప్రాణములు కాంక్షించినచో నిచ్చుటకు సిద్ధపడియే ముందుకు చొచ్చుకుపోయినాడు. ఎప్పటికప్పుడు కొన్ని గాయములు తగిలినమాట నిజమే. ఒక్క గాయమును బ్రాణముగొనలేదు. తాను యశమును ఆశించినాడు. ప్రాణ నష్టము ఆశించినాడు. రెండును తుచ్ఛములే. ఒకటి సంభవించినది, ఒకటి సంభవించలేదు.

పొమ్మన్నను పోని యీ ప్రాణము తీపి, దానిని వదలలేము. ప్రాపంచికానందము కావలెను. భార్య కావలెను. ఎంత విచిత్రమైనది మానవజీవితము! ఈ ఆలోచనలతో తన వైద్యునిచే గాయములకు కట్టుకట్టించుకొని, ఆలోచించి ఆలోచించి, తల్లిదండ్రుల సెలవునంది తాను యాత్రలు సలుపుచు ధాన్యకటకము చేరెదనని వెడలిపోయెను. 

6. అమృతపాదులు

సర్వదక్షిణాపథచక్రవర్తిని సర్వభారత వర్ష చక్రవర్తిగా అభిషేకింప మహా ప్రయత్నములు జరుగుచున్నవి. దేశదేశముల మహారాజుల, భూపతుల, మహా మాండలికుల, మహాఋషుల, పండితుల, అర్హతలు, సంఘారామాచార్యుల, వివిధ

పరిషత్తుల కులపతుల, మహాభిక్షుకుల, భిక్షుల, భిక్షిణుల, జైనసన్యాసుల, దిగంబర శ్వేతాంబరుల, జైనమహర్షుల, వర్తక చక్రవర్తుల, యవనుల, సామంతుల ఆహ్వానించుటకు వివిధదేశములకు శ్రీముఖుని నిమంత్రణమున వెడలిరి.

పాటలీపుత్రము మహావైభవముగ అలంకరించుచుండిరి. ధర్మనంది ఆ అలంకారికులకు ఆజ్ఞ లిచ్చుచుండెను.

చక్రవర్తికి ఎటుచూచినను విజయమే. అయినను తన పెద్దకుమారుడు విషకన్యను ప్రేమించుచున్నాడనియు, నామె యాతని ప్రేమించుచున్నదనియు, కాని ఆ బాలిక విషకన్య యగుటయే వారి సమాగమమునకు అడ్డువచ్చిన దనియు చారులచే శ్రీముఖుడు వినినాడు. తన స్నేహితుడు, సోదరసమానుడు, ఆంధ్రరమాజనకుడు, ఉత్తమపురుషుడగు చారుగుప్తుని పుత్రికను వివాహమాడజాలనని యువరాజు తన తల్లితో చెప్పెనట. చక్రవర్తికీ సమస్య హృదయాందోళనకారణమయ్యెను.

చారుగుప్తుని నిర్వేదము తానెట్లు భరింపగలడు? శ్రీకృష్ణుని తన ఆజ్ఞచే హిమబిందు కుమారిని వివాహ మగునట్లు చేయవచ్చును. అవసరమైన అట్లు చేయవలసియున్నది. కాని శ్రీకృష్ణుడు ఆ విషకన్యను తక్క ఇంకొక్కబాలిక నుద్వాహముకాడట. తాను రాజ్యమునైన వదలివేయునట.

ఎవరా విషబాలిక! ఆమెను తా నొకసారి చూడవలసియున్నది. ఆ బాలిక స్థౌలతిష్యుని శిష్యురాలట. మనుమరాలని కొంద రనిరి. ఎట్టి మనుమరాలో! ఆ దూర్వాసుడు తన మనుమరాలిని విషకన్యగా నెట్లు చేయగలిగినాడో! వెనుక చాణక్యు డట్టి విషకన్యల విరోధినాశనమునకే ప్రయోగించు వాడట. స్థాలతిష్యులవారికి మాయెడ నింతకోప మేమి?

తాను శ్రీకృష్ణునికి ఈ నిరంతరమృత్యుసన్నిహితత్వ మెట్లు సహింపగలడు? విషకన్యను యువరాజు కడనుండి తొలగించి మరల స్థౌలతిష్యుని అంతికమునకు పంపవలయునా? అయినచో, యువరాజునకు మిక్కుటముగ కోపము రావచ్చును. కాని యెరిగి యెరిగి ప్రేమాస్పదుడగు నా బాలుని చావున కనుమతించుట యెట్లు?

ఈ విషమసమస్యను విడదీయగలిగిన మహానుభావుడు అమృత పాదార్హతులే! వారి దర్శనముచేసినచో నుత్తమ మనుకొనుచు, చక్రవర్తి రథమునెక్కి పాటలీపుత్ర పురముననున్న మహాచైత్య సంఘారామమునకు వెడలిపోయెను.

అమృతపాదులకు చక్రవర్తి తన్ను దర్శింపవచ్చుచున్నారని తెలియగనే చతుశ్శాలలోనికి వచ్చి, అచ్చట రత్నకంబళులు పరిపించి ఉపధానములు వేయించెను.

ఇంతలో చక్రవర్తియు వచ్చెను. అమృతపాదులకు నమస్కృతులిడి, ఆశీర్వాదమంది, కంబళిపై చక్రవర్తి యధివసించుటయు, అమృత పాదులును ఎదుట కూర్చుండిరి.

“ప్రభూ! తాము వచ్చిన కారణము?”

“విషకన్యకా శ్రీకృష్ణుల సంబంధవిషయమై తమతో నాలోచింప వచ్చితిని.”

“ఆ విషకన్యకడకు నేను వెళ్ళితిని. యనురాగ మెరుగని నాకు అవ్యాజపుత్రికాప్రేమ ఆ కన్నెపై నుదయించినది.”

“విషకన్యగదా! ఆమె సామీప్యమే మృతియనినారు!”

“నేను విషపు విరుగుడుల తోడనే వెడలితిని. ఆ బాలిక సాత్విక మూర్తి. స్థౌలతిష్యుల వారిని నేనెప్పుడును దర్శనము చేయలేదు. ఆయన మహాత్మ్యము ఆంధ్రు లనేకులు విభ్రాంతులై చెప్పుకొందురు. అట్టి ఉత్తమఋషి మనుమరాలట ఈ బాలిక! ఈ బాల నెట్లు విషకన్యను చేయగలిగిరో?”

“అదియే నాకును ఆశ్చర్యము కొల్పినది. శ్రీకృష్ణుని నాశనము చేయు నీ బాలిక నా మహర్షి ప్రయోగించెనట స్వామీ!”

“అవును. ఆ విషయములన్నియు బయటపడినవి. మహారాజా! శ్రీకృష్ణుడు ఆ బాలికను ప్రేమించుచున్నాడనుటలో నాశ్చర్యమేమియు లేదు. ఆమె సౌందర్య మతిలోకము.”

“హిమబిందుకుమారి సౌందర్యవతి కాదా స్వామీ?”

“కావచ్చును. హిమబిందు శిల్పసూత్రలక్ష్యభూత, సౌందర్య సర్వస్వము. కాని ఈ విషకన్యలోని సౌందర్యము మహోత్తమాభిదత్త మగు మూర్తిత్వము. సుందరరేఖా సమన్వితమూర్తి. ఒక్క హిమబిందుమూర్తికి తగ్గునేమో! కావుననే యువరాజు తన సర్వస్వముతో నీమెను ప్రేమించు చున్నారు.”

“ఆ బాలిక విషబాల యగుటవలన ఆత్మాభిదత్తత కుంటుపడిపోదా?”

“ఆమెను విషకన్యను చేయుటలో, ఆమె దేహము విషయుక్తమైనది. ఆమె హృదయము, ఆమెలోని ప్రకృతి, ఆమె బుద్ధియు, అహంకారమును విషయుక్తములు కాలేదు. ఆమెలోని మనోబుద్ధ్యహంకారా లమృతములేయైనవి. అమృతము నిండిన నీచపాత్రతో మనము పోల్చవచ్చును. ఆ పాత్రవిషముతో నిర్మించినా రనుకొందము. అట్టిది ఈ బాలిక.”

“విషకన్యకకు శ్రీకృష్ణునకు వివాహ మెట్లు గురుదేవా?”

“అదియే ఆలోచింపవలసిన విషయము మహారాజా! నేను స్థౌలతిష్యులవారిని సందర్శించి వారిహృదయమును కరగింప ప్రయత్నింతును. ఆపై భగవాన్ బుద్ధదేవుని కరుణ!”

“ఆచార్యదేవా! చారుగుప్తుడు ఆంధ్రదేశమునకు శేషునివంటివాడు గదా!”

“అవును.”

“అతనికి సర్వప్రపంచము హిమబిందుకుమారి!”

“అవును.”

“ఆమెను యువరాణి య నాతనితపస్సు. అందుకే ఆమెకు సర్వవిద్యలు నేర్పించినాడు వర్తకచక్రవర్తి. ఆమెకై తన అనంతములైన సర్వైశ్వర్యములు నర్పింప సిద్ధముగ నున్నాడు.”

“ప్రభూ! బాలికలు సర్వసాధారణముగా నీడువచ్చినవెంటనే ప్రేమాభియుక్తలై యుందురు. ప్రేమ వ్యక్తి రూపమున సాక్షాత్కరింపదు. ఆ సమయములందు ఒక బాలికకు వరుని ఏర్పాటుచేయుదురు పెద్దలు. ఆ బాలిక తన వరుని ప్రేమించును. కాని ఒకసారి యుక్తవయస్కయగు నొకబాలిక వరుని తాన ఎన్నుకొని, ఆతని గాఢముగ ప్రేమించినచో ఆ బాలికను వేరొక్కని కిచ్చి వివాహముచేయుట ఆ బాలికచే వ్యభిచార మహా దోషము చేయించుటయే!”

“చిత్తము ఆచార్యదేవా!”

“హిమబిందు తనసర్వస్వము ఒక బాలునికి దత్త మొనర్చుకొన్నది. ఆ బాలు డామెను ప్రేమించుచున్నాడు. అట్టి బాలికను యువరాజున కెట్లు ఇత్తురు. చారుగుప్తుడైన అధర్మమున కెట్టియ్యకొనును?” “అటులనా! ఎంత విచిత్రము! ఎవ్వ రా బాలుడు?”

“మన సువర్ణశ్రీ!”

“సువర్ణశ్రీకుమారుడు! అతని నెవ్వరు ప్రేమింపరు? ఇది గాఢాలోచనము సలుపవలసిన విషయము ఆచార్యదేవా!”

“ఆలోచనమున కే మున్నది? సువర్ణశ్రీ మహాశిల్పి, భక్తుడు” సర్వశాస్త్రపారంగతుడు, వీరసింహము. చారుగుప్తదేవుడు ఆంధ్రమహా సామ్రాజ్యమునకుమూలము, సువర్ణశ్రీ శక్తి.”

“అవును స్వామీ!”

చక్రవర్తి వెడలిపోయెను. అమృతపాదులు ఆలోచనాధీనుడయ్యెను.

స్థౌలతిష్యులు సనాతన ధర్మతేజస్సు, అనార్షములైన మార్గముల వెంట మానవులు నడుచున్నప్పు డిట్టి మహోత్తమపురుషులుద్భవింతురు. సనాతనమార్గము ఒక రీతి నంది మానవాభ్యుదయమున కిసుమంతయు నుపకారిగాక, కర్కశమై మృత్యురూప మందినప్పుడు బుద్ధభగవానుని వంటి అవతారపురుషు లవతరింతురు. అవియు కర్కశమైనప్పుడు సనాతనత్వము, నూత్నపుష్టి చేకూర్చుకొని, ఆ అధునాతనత్వ వక్రగతిని ఖండించును. ఈ రెండుశక్తులిట్టు పోరాడుకొనుచు లోకమును ముందునకు నడిపించుకొని పోవుచుండును గాబోలు ననుకొనుచు అమృతపాదార్హతులు సమాధిలోనికి పోయెను. ఆయన మోము చంద్రకాంతివలె వెలిగిపోయెను.

7. సమవర్తి హృదయము

సమవర్తి నాగబంధునికను చూచుటయేమి, యామెను ప్రేమించు టేమి! పొడుగరి, యుద్ధకుశలత, ఆనందహృదయ, స్పష్ణసౌందర్యరేఖా సమన్విత, వీరవిక్రమోపేత!

అందమైన యువతులు మూడుజాతులవారని సమవర్తి అనుకొనినాడు. ఒకజాతివారు పూవులప్రోవులు, వెన్నతో తేనెలు రంగరించినవారు! ఇంకొకజాతివారు వజ్రముల ప్రోవులు. మూడవజాతివారు తేనెలును, కరగించిన బంగారును కలియబోసి మూర్తించినవారు.

మొదటి జాతివారు అతిఆర్ద్రహృదయులు. రెండవవారు కర్కశ హృదయులు. మూడవవారు సమహృదయులు. నాగబంధునిక మూడవజాతి బాలిక. ఆమె ఎంత గంభీరమగు చరిత్ర కలది! ఆమెయుద్ధము అప్రతిమానము. తన్ను గోవర్ధనపర్వతము వలె రక్షించును. పార్థసారథివలె అఖండధైర్యమును సమకూర్చును. ముందునకు తన్ను విజయయానము చేయించును.

యుద్ధము చేయునప్పుడు నాగబంధునిక బాలిక యన్న భావ మాతనికి కలుగునది కాదు. ఆమెకు గాయములు తగిలినవి. తనకునూ తగిలినవి. కాని భయంకర దావాగ్ని శిఖలవలె వారిరువురు సమముగ ముందుకు చొచ్చిపోవువారే.

వారిరువురి హృదయములు ఆనందమయములు. వారు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నట్లు ఒకరినొకరికి తెలియును.

ఆమె వీరకుమారుడై తెల్లవారగట్లనే సమవర్తి శిబిరమునకు వచ్చునది. “ఈ బాలిక నెట్లు యుద్ధమున కనుమతించుట, తనతో తీసికొనిపోవుట?” అని అతడనుకొనును. ఈ మహావీరునితో భుజము భుజము కలిపి యుద్ధము చేయు భాగ్యము సర్వభాగ్యములను మించిన పరమోత్తమభాగ్య” మని యామె యనుకొనును. ఇరువురు యుద్ధమునకు బోదురు.

పాటలీపుత్రపురము పట్టుకొను మహాయత్నము జరుగునాడు, నాగబంధునిక సమవర్తితో సమముగ విరోధులతో దలపడినది. ఆమె ఆరోజు అపరాజితాదేవియే! పకపకమని నవ్వుచు,

“ఆంధ్రవీర రారా!
అరిపైని దుముకరా!
పుష్పపురము నీదేరా;
పురంజయుడ నీవేరా!”

అని పదముపాడుచు తన ఉత్తమాశ్వమును ముందుకు సమవర్తి గుఱ్ఱముతో సమముగ దూకించినది. పుష్పపురము ఆంధ్రుల వశమైనది.

నాగబంధునికయు సమవర్తియు తిరిగి తమ సైన్యముల నడపు కొనుచు వచ్చుచుండ నాగబంధునిక గుఱ్ఱము ఒకశవముపై కాలువేసి తూలిపడిపోయినది.

“అయ్యో!” అనుచు సమవర్తి చెంగున తన హయమునుండి ఉరికి నాగబంధునికను!” సమీపించి, సువ్వున నామె నెత్తుకొని, “నాగబంధునికా! నాగబంధునికా!” యని వేదనాపూర్ణమగు అరపు అరచినాడు. నాగబంధునిక పది నిమేషములు చైతన్య రహితయై యాతని చేతులలో కదలలేదు.

వెంటనే యుద్ధవైద్యులు వచ్చి, యామెను ఆ పరిసరముననున్న ఒక భవన వితర్దికపై సమవర్తిని పరుండబెట్టమనిరి. ఒక వైద్యుడు ఆమె సమవర్తి చేతుల నుండగనె ఆమె పెదవులపై దివ్యలేప రూపముననున్న దివ్యౌషధము నొకదానిని రాచినాడు. ఒక నస్యమును ఆమె ముక్కుపుటములకడ నుంచినాడు.

ఆమెను ఒక అరుగుపైన సమవర్తి పరుండబెట్టెను.

ఆమెకు వెంటనే మెలకువ వచ్చి, చూచుకొనుసరికి ఆమె తల ఆతని తొడపై నుండెను. ఆతడు ప్రణయభయార్ధ్రదృక్కుల ఆమె మోముపై ప్రసరింపుచు, జేతితో ఆమెనుదురు తుడుచుచు, “నాగబంధునికా! నాగబంధునికా!” అని అస్పష్టవాక్యముల పిలిచెను.

నాగబంధునిక ప్రథమమున కల యనుకొన్నది. తర్వాత తనకును సమవర్తిని వివాహమైనదనియు, వివాహానంతరము భర్త తన్ను అనునయించుచున్నాడు కాబోలు ననుకొనుచు సిగ్గుపడుచు “ప్రాణేశ్వరా!” అని చేతులు చాచి అతని తలవంచి యాతని పెదవులు ముద్దుగొనెను.

సమవర్తి ప్రణయమహావేగమున గదలిపోయి, ఆమెపై వ్రాలి తన హృదయమున కదుముకొని, ఆమెను గాఢముగ చుంబించెను.

ఆమె పడినవెంటనే యామె శిరస్త్రాణమును తీసినారు. దీర్ఘమై ఒత్తయిన యామె కచభారము ముడివీడి మేఘమువలె ప్రసరించిబోయినది. అప్పుడు ఆ చుట్టుమూగిన వీరులు, ముఖపతులు, గణపతులు మొదలగువా రామే బాలికయని గుర్తెరిగినారు.

“ఈ బాలిక ధర్మనందులవారి కొమరిత, సువర్ణశ్రీ సేనాధ్యక్షుల చెల్లియట” అని సమవర్తి వైద్యునకు తెలిపెను. నాగబంధునిక పూర్తిగ మెలకువవచ్చి సువ్వునలేచి, “ఇదియేమి ఇచ్చట నుంటిని! ఏమి జరిగినది సేనాపతీ!” యని యామె యాశ్చర్యమున నడిగినది.

నాడిచూచి వైద్యు డా బాలికకు ఏమియు మొప్పము లేదనెను. ఎచ్చటను ఎముక విరుగలేదనియు, నట్లువిరిగినచో నాడిగతి వేరగుననియు నా వైద్యుడు సమదర్శికి చెప్పి తనపనిపై తాను పోయెను.

నాగబంధునిక గుఱ్ఱము భక్తిగదురు చూపులతో తన యజమాను రాలిని చూచుచు నిలుచున్నది. ఇరువురును తన తమ బసలకు వెళ్ళి పోయిరి.

నాగబంధునికకు పూర్తిగ మెలకువ వచ్చినంతనే తాను సమవర్తిని ముద్దుగొంటినని యెంతయో సిగ్గుపడెను, ఆనందమందెను, క్రుంగిపోయెను, ఉప్పొంగిపోయెను. ఆమె పూర్తిగా యోషావేషము ధరించి, సిద్ధార్థినికను సువ్వుననెత్తుకొని, యామెను హృదయమున కదుముకొని, ఆమె పెదవుల ముద్దుగొనెను.

సిద్ధార్థినిక అక్కను తిరిగి కౌగిలించి “అక్కా! నీవు యుద్ధము చేయుచున్నావటగా! నాకు అన్న చెప్పినాడు. నీవు సమవర్తిని ప్రేమించుచున్నావటగా” అని యడిగెను.

“ఛీ ఛీ! అవేమి మాటలే సిగ్గులేని తల్లీ! అని నాగబంధునిక నవ్వుచు చెల్లెలిమొగ్గ నులిమినది. సిద్దార్ధినిక నవ్వుచు, “దొంగక్కా! అన్న నాకన్నియు చెప్పినాడులే!” యన్నది.

“అన్న మంచివాడు కాడు! అన్నతో మాట్లాడకూడదు!”

“అన్నతో మాట్లాడక, అన్నదగ్గరకు పోకపోతే అన్నకు భయమా ఏమి? మాటలు మాటలువచ్చి అన్న అమ్మకు చెప్పుచున్నప్పుడు నేను వింటిని.”

“అవునే, తల్లీ?” అని తల్లి ప్రశ్నింప నాగబంధునిక ఆమెపాదాలకు నమస్కరించినది. శక్తిమతి కొమరిత నాశీర్వదించి “అమ్మా! నాయన గారితో నీ విషయము చెప్పినాను. నాయనగారు వెంటనే శ్వేతకేతులవారిని వెంటగొని చారుగుప్తులను, కీర్తిగుప్తులను, వినయభిక్కులవారిని, శ్రీచక్రవర్తులను చూచి వచ్చినారు. అమృతలతా దేవిగారిని నేనును కలిసికొంటిని. ఆమె తన తండ్రిని కలిసికొని ఏ విషయము తెలిపెద నన్నది.

శక్తిమతీదేవి నాగమ బిగియార కౌగిలించుకొని మూర్థమును ముద్దు గొన్నది. నాగబంధునిక సిగ్గుగదుర నేదియే స్వప్నములుగనుచు నిలుచుండిపోయినది.

సిద్ధార్థినిక గంతులువేయుచు, “ఇంక బావమీద పాటలు పాడ వచ్చును, ఎంతో చక్కగా!

“బావా బావా పన్నీరు
బావనుపట్టుకు తన్నేరు”


శక్తిమతి: బావ మళ్ళీ తన్నినచో?

సిద్ధార్థినిక: అమ్మా! ఎక్కడైనా మగవారిని ఆడవారు తన్నుట ఉన్నది. ఆడవారిని తన్నెద రేమిటి?

శక్తిమతి: ఎవరు తల్లీ మగవారిని తన్నిన ఆడవారు

సిద్ధార్థినిక: సత్యభామ తన్నలేదా శ్రీకృష్ణుని?

శక్తిమతి: సత్యభామ శ్రీకృష్ణునిభార్య కనుక తన్నవచ్చును. మరదలు తన్నునా?

నాగబంధునిక: చెల్లీ! నీవే తన్నవే, నీకు ఆనతి ఇస్తాను.

8. పెళ్లి రాయబారాలు

యుద్ధము ముగియగానే సమవర్తికడకు తల్లి వచ్చినది. “నాయనా మనము పోయి హిమబిందును నీకిచ్చి ఉద్వాహమొనరించు టెప్పుడు” అని మా యన్నగారి నడుగవలయును. “మానాయనను కలుసుకొని ఇక్కడకు తీసికొనిరా! ఇంక పెద్దలను కొనిరా!” యని యామె కొమరుని కోరెను.

అమృతలత కోటీశ్వరుని తనయ, కోటీశ్వరేశ్వరుని చెల్లెలు. ఆమె మహారాణివలె పెరిగినది. మహారాణియైనది. ప్రతిష్ఠానమునకు మహారాజై ప్రియదర్శి సాతవాహన మహారాజుభార్య, సాతవాహన రాజ వంశమున మెట్టుట అభిజనాభిమానమునకు దోడైనది.

సప్తమాతృక లొకరై కుమారస్వామి ప్రేమించినట్లు ప్రేమించిన దామె పుత్రుని. సమవర్తి తల్లిమాట కెప్పుడును ఎదురాడలేదు. తాను నాగబంధునికను ప్రేమించినాడు. తల్లి హిమబిందును తనకై వాంఛించు చున్నది. ఆమె తన యన్నను నిర్బంధించును. ఏది ఎట్లగునో?

అందరునుపోయి చారుగుప్తునడిగిరి. అమృలతాదేవితో చారుగుప్తుడు నిషర్షగ హిమబిందును శ్రీకృష్ణసాతవాహన మహారాజున కిత్తునని తెలిపివేసెను. సమవర్తి ఆనందమున నిట్టూర్పు విడిచెను. వినయభిక్కుకొమరితను చూచి, “తల్లీ! నాకు చారుగుప్తుని హృదయ మప్పుడ యవగతమైనది. నీవు కోప మేల చెందెదవు? సమవర్తి హృదయము నా కవగతమైనది. ఆతడు ధర్మనంది తనయను ప్రేమించుచున్నాడు. ఆమెయు వీనిని ప్రేమించుచున్నది. సువర్ణశ్రీ కాశికాదిపురములకు ప్రయాణమైపోవుటకు ముందు నా కడకు వచ్చి “తాతగారూ! శ్రీసమవర్తి మహారాజును, మా చెల్లెలును ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. ఆర్యశ్రీ చారుగుప్తులవారు కొమరితను శ్రీకృష్ణమహారాజున కిత్తుమని నిశ్చయించిరి. నేనును హిమబిందుకుమారియు ధాన్యకటకమున నున్నప్పు డొకరినొకరము ప్రేమించుకొంటిమి. కాని చారుగుప్తులవారు కొమరితకు తన నిశ్చయము తెలిపిరి. మేము విడిపోతిమి. మహారాజునకు రాణియగు బాలికను నేను ప్రేమించుట యేమి యని క్రుంగిపోతిని. నేను దేశయాత్ర చేసెదను. స్వామీ! తాము సమవర్తి ప్రభువునకు, నాగబంధునికకు వివాహమగునట్లు ప్రయత్నించుడు. తాము ఆశీర్వదించినచో కార్యము సఫలమైతీరును. సెలవు” అని తెలిపి వెడలిపోయినాడు. కాబట్టి నీవు నీ కొమరుని ఆనందము మనస్సున తలచుకొనుము. ఆతనితోడిదే నీలోకము. పుత్రునియానందమే నీ యానందము. నీ పుత్రుడు మహావీరుడు. అతిరథుడు, ఆతని నేదో రాజ్యమునకు చక్రవర్తి పట్టముగట్టును. సువర్ణగిరియగు ముసిక నగరదేశము మహోత్తమమైనది. ఆ మహారాజ్యమునకు నీ తనయుడు ప్రభు వగునని చక్రవర్తి భావము. ఆ విషయము మహామంత్రులవారు సెలవిచ్చియున్నారు” అని బోధించెను.

అమృతలతాదేవి తండ్రిమాటలన్నియు విన్నది. ఆమె ఆశలన్నియు కూలిపోయినవి. జగదేకసుందరి యగు బాల తనకు కోడలగునని యాశించినది. తన కుటుంబమున ఉన్న కోటులన్నియు తన కొమరునకు వచ్చునని యనుకొన్నది. సార్వభౌములకే ఏడుగడ యగు తనయన్నగారు తన కొమరుని సార్వభౌములకు సమ మొనరించును అనుకొన్నది. ఆ స్వప్నములన్నియు విరిగి నేల కూలినవి. ఆమె భర్తను తలచుకొని, తన తల్లిని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చినది.

లోకమున నెవ్వరికిని వెరవక తల్లికిమాత్రము వెరచు సమవర్తి తల్లి దుఃఖమును దర్శించుచు కలగుండుపడి చేష్టలుడిగి నిలుచుండినాడు.

ఆశలు, స్వప్నములు, కోర్కెలు మానవుల కుండుట సహజము. కాని అవి సంపూర్ణముగ స్వార్థపరము లయినచో మానవుడు తుచ్ఛుడై పోవును. సువర్ణశ్రీ హిమబిందును ప్రేమించెను. ఆమె తనకు గాదని తెలిసియు నామెను రక్షించెను. కోరికలేక ధర్మమార్గమున నడచు పురుషుడు వీరోత్తంసుడు. సువర్ణశ్రీ యట్టివాడు.

సమవర్తి కనులుమూసుకొనెను. తాను ప్రేమించుచున్నది నాగబంధునికను. హిమబిందు తనసొత్తు అనుకొని, ఆమె దివ్యసుందర విగ్రహమును చూచి, యామె అగణిత సంపదను ఎరిగి, యామెను భార్యగ ఊహించి, కాంక్షించి వ్యధలపాలయినాడు. నేడు అన్నియు తారుమారైనవి. ఉత్తమ ఫలవృక్షము భూమిని చీల్చికొని పైకి వచ్చునట్లు తన స్వార్థమును చీల్చి నాగబంధునికా ప్రేమ వెడలి తన జీవితదిశలు క్రమ్ముకొనిపోయినది. ఇప్పుడు తల్లి ఏమనునో, ఏమియాజ్ఞ నిచ్చునో?

వినయభిక్కు లేచి కొమరిత మూర్ధముపై హస్తము నిడి, “తల్లీ! భగవాన్ సమంతభద్రుడు మానవలోకమున కిచ్చిన యుపదేశములు నీయెడల నిష్ఫలము లగుటయేనా?” యనినాడు.

సమవర్తి తలవాల్చి క్రుంగి కూర్చుండియున్నాడు. ఆతని తీక్షణముగ చూచినది ఆ తల్లి. ఆమె కన్నులు చెమరించినవి. అమృతలత చిరునవ్వున “నాయనా! నాకు సర్వమును నా తండ్రి ఈ బాలుడే! వాని యానందమే నా యానందము. కానిమ్ము, అన్నియు నీవే ఏర్పాట్లు చేయుము. (కొమరుని కడకుపోయి) నాయనా! నీవు వీరాగ్రగణ్యుడవు. నీ తండ్రిగారి పేరు నిలబెట్టిన ఉత్తముడవు. నీకు పారితోషికముగా నీ హృదయేశ్వరినే నే నర్పింతును” అని పలికినది.

వినయభిక్కునకు వారిరువురు పాదాభివందన మాచరించిరి. ఆతడు వారి నాశీర్వదించి, అమృతపాదులను దర్శింప వెడలిపోయెను.

కొన్నినాళ్ళయిన వెనుక శక్తిమతీదేవియు, మహారాణి ఆనంద దేవియు, మహామంత్రి భార్యయు, ఇతర నారీమణులతో, పరిచారికలతో సమవర్తీ పాటలీపుత్రమున వసించు భవనమునకు వేంచేసిరి. అమృతలత యానందమున వారిని సర్వమర్యాదల నెదుర్కొని ఉచితాసనముల గూర్చుండ చేసెను.

మహారాణి: అక్కగారూ, మేము మీకడకు వివాహ రాయబారమున వచ్చినాము.

అమృతలత: మహారాణీ! తాము స్వయముగ మా ఇంటికి విచ్చేయుట మాకందరకు తులలేని గౌరవమొసంగుట, సెలవీయండి సామ్రాజ్ఞి!

మహారాణి: శక్తిమతీదేవి, తమ పుత్రికను శ్రీ సమవర్తి ప్రభువునకు సమర్పింప తమ యనుమతివేడ వచ్చిరి.

ఆంధ్రమహారాణులు, మహారాజులు, ఏవిషయమును తాము స్వయముగ మాటలాడరు. వారి ప్రతినిధులు వచ్చి విషయములు ఏర్పాటుచేయుదురు. ఇప్పుడు ఆంధ్రసామ్రాజ్ఞి తానే స్వయముగ రాయబారియై వచ్చుట తనకెంతయో గౌరవమని అమృతలత ఆనందమందెను. అమృతలత తన కా సంబంధము ఎంతయో ఆనందదాయకమని తెలుపుచు, సంబంధము నిశ్చయముచేయవలసినది తనయన్న చారుగుప్తులవారే యని తెలిపినది.

చారుగుప్తునికడకు ధర్మనందియు, శ్వేతకేతులవారు, మహా మంత్రియు ఈ వివాహము విషయము రాయబారము వచ్చిరి. చారుగుప్తునకు వినయభిక్కు అమృతలతాదేవి యుద్దేశము తెలిపియుండుటచే చారుగుప్తులు సంతోషమున నియ్యకొనిరి.

రెండుదినములైన వెనుక ఒక శుభముహూర్తమున అమృతపాదులు, చారుగుప్తులు, మహామాత్యుడు, మహాసైన్యాధ్యక్షుడు, ధర్మనంది, సైన్యాధి కారులు, భిక్కులు, పండితులు కోటలో మహారాజ సమాలోచనమందిరమున జేరి సమవర్తి, నాగబంధునికల వివాహమును నిశ్చయము చేసిరి. చక్రవర్తియే తాంబూలము లిప్పించెను.

పలుపోకల బోవు ఆలోచనలతో సముచితవేషుడై, ఉత్తమాశ్వము నధిరోహించి సమవర్తి ధర్మనంది వసించు హర్మ్యమునకు బోయెను. సువర్ణశ్రీని చూడవలయుననియే యాతని యుద్దేశము. అంతరాంతరమున నాగబంధునిక కనబడదా యన్న యాలోచన!

ఆతడు “సమవర్తి వచ్చినా” డని లోనికి వార్త పంపెను. సేవకులు గుఱ్ఱముకడకు పరువిడి వచ్చి, గుఱ్ఱపు కళ్ళెమునంది పుచ్చుకొనిరి. శిల్ప విద్యార్థులు దారిచూప లోనికిబోయి సభామందిరమున నాతడు ఉచితాసనము నధివసించి యుండెను. సిద్ధార్థినికకు సమవర్తి వచ్చినట్లు తెలియదు.

“బావా బావా పన్నీరు
బావనుపట్టుక తన్నేరు”

అని పాడుచూ సభామందిరమునకు వచ్చి సమవర్తిని చూచి చటుక్కున ఆగిపోయెను. సమవర్తి “సువర్ణశ్రీ ఎచ్చటనమ్మా?” యని నువ్వుచు అడిగెను.

“మా అన్న పుణ్యక్షేత్రములు దర్శింప మహాబలగోండు యువరాజుతో పోయినాడు.

“అయ్యో! అతనితో మాటలాడవలెనని వచ్చినానే!”

“అలాగునా? మా అక్కవచ్చి మాటలాడునండి” యని యామె తుఱ్ఱుమనెను.

ఇంతలో “ఎవరండీ” యనుచు, చెల్లెలు మనచుట్టములు వచ్చినారని చెప్పుటచే నాగబంధునిక ఆ మందిరములోనికి వచ్చినది.

లోనికి ఆ బాల వచ్చుమార్గము సమవర్తి వెనుకవైపునున్నది. ఆ బాలికలోనికి వచ్చుటతోడనే ఎవరో కూరుచుండ యుండుట గమనించి “ఎవరండీ?” అని మరల ప్రశ్నించెను. సమవర్తి ఉలికిపడి లేచి నిలుచుండి ఆమెవైపు తిరిగి ఆమెను చూచెను.

“ఎవరండీ” అన్నమాట అచ్చటనే ఆగిపోయినది. ఆమె గుమ్మము కడ నిలుచున్నది. సమవర్తిని చూడగనే యామె చకితయై, లజ్జారుణిత వదనయై తలవాల్చి నిలుచుండి పోయినది.

9. ముక్తావళీదేవి

ముక్తావళీదేవి కిపుడు అరువది సంవత్సరము లున్నను ఏబది సంవత్సరముల స్త్రీవలె కనుపించును. ఆమె కీర్తిగుప్తుని భవనమున సగము యవనాలంకారాది మేచ్ఛాచారముల గొనివచ్చినది. యవనశిల్పులను కొందరిని రప్పించి యవనభవనములు కూడ నిర్మాణము చేయించెను. ఆ శిల్పులే ఆంధ్రచైత్యములలో తమ విధానములను అక్కడక్కడ విన్యసించిరి. అప్పుడే గాంధారించుటయన శిల్పము చెక్కుట యనుమాటకూడ ఆంధ్ర భాషలో చొచ్చినది.

పాటలీపుత్రమున చిన్ననాటనే కీర్తిగుప్తులు ఒక మహాహర్మ్యము నిర్మాణము చేయించెను. వినయగుప్త చారుగుప్తులకును అచ్చట మహా భవనములున్నవి. యుద్ధానంతరము ఎవరి భవనములలో వారు ప్రవేశించి, యవి యన్నియు మరల బాగుచేయించుకొనినారు. సమవర్తి, చారుగుప్తుల భవనములలో నొకదాన ప్రవేశించినాడు.

కీర్తిగుప్తులకు డెబ్బదియేండ్లు దాటినను, “ప్రపంచ మానంద మయము. ఆవల నేమియున్నదో ఎవరికెరుక? బ్రతికియుండగనే ఆనందము ననుభవింపుము” అను యవనవేదాంతి ఎపిక్యూరియసు వాదమును నమ్మినాడు. కావుననే అతడు భోగముల ననుభవించుటలో గ్రీకులకే పాఠములు నేర్పుచుండెను.

గ్రీకులు తమదేవతలను భారతీయ దేవతలతో పోల్చుకొని వారే వీరను నిశ్చయమునకు వచ్చిరి. కొందరు యవనులు బౌద్ధదీక్ష గైకొనినను జీవితము నానందముగ ననుభవింపుము అన్నభావము మిశ్రితముచేసి ఒక నూతనవాదము గొనివచ్చిరి.

కీర్తిగుప్తుడు మంచి మాటకారి. ముక్తావళీదేవికి భర్తయే భగవంతుడు. కాపురమునకు వచ్చిన కొత్తలో భారతీయాచారములకు సంకటము పడునది. కాని రానురాను భారతీయాంగనలకే పాఠములు నేర్పు భారతీయత్వ మామె కలవడినది.

ముక్తావళీదేవిని, హిమబిందును సువర్ణశ్రీ గుహాబంధమునుండి విడిపించినప్పటి నుండియు నామె సువర్ణశ్రీ చరిత్రమంతయు జాగరూకతగ గమనించుచునే యుండెను. సువర్ణశ్రీని తన మనుమరాలు గాఢముగ ప్రేమించుచున్నదని ఆమె ధాన్యకటకముననే గమనించినది. తన యల్లుడు హిమబిందును శ్రీకృష్ణసాతవాహన ప్రభువున కీయ సంకల్పించుకొనె ననియు హిమబిందు మూగదానివలె నందుల కియ్యకొనెననియు వినినప్పు డామె ఎంతయో ఆశ్చర్యమందెను.

ఆనాటినుండి హిమబిందు హిమబిందుగ నుండుటలేదని యామె గమనించుచు వచ్చినది. ముక్తావళి దేశమైన ఏథెన్సులో రాజులను విపరీతముగ గౌరవించుట ఎరుగదు. అక్కడ రాజవంశములు లేవు. కాని మాసిడోనియాలో రాజవంశము విజృంభించినది. అచటి సేనాపతులు వివిధ దేశముల రాజులై రాజవంశ ప్రారంభకులైరి.

ఈ దేశమున రాజులు ధర్మపరులు. ప్రజలకు రాజభక్తి కలదు. రాజులకన్న బ్రాహ్మణులు మరియు గౌరవమందుదురు. రాజులును, బ్రాహ్మణులును అయిన సాతవాహన ప్రభువంశమునకు పిల్లనిచ్చుట ఎవ్వరికైనా గౌరవావహమే. అందుకనియే తనయల్లుడు శ్రీకృష్ణమహారాజునకు పిల్లనీయ సంకల్పించినాడని ముక్తావళీదేవి గ్రహించినది.

తన ముద్దుల మనుమరాలు జగదేకసుందరి, శ్వేతతారాదేవి కెనయైనది. విద్యల ప్రజ్ఞాపరిమితాదేవియే. ఆ బిడ్డకొరకే తాను బ్రతికియున్నది.

తనభర్త కీర్తిగుప్తుడును హిమబిందునుచూచి దుఃఖము దిగమ్రింగి, దుఃఖ పాతాళమున క్రుంగిపోయిన యల్లుని ఊరడించువారు. అప్పటినుండియు హిమబిందును తనే పెంచినది. భార్యాభర్తలిరువురు అల్లునియింటను, తమ యింటను సమముగ కాలము గడుపుచు హిమబిందు తోడిదే లోక మనుకొనుచుండిరి. ఆ బాలిక నేడు సువర్ణశ్రీని ప్రేమించి క్రుంగిపోవుచున్నది. ఈ విషయమే ముక్తావళీదేవి భర్తతో నెప్పుడూ హెచ్చరించుచుండెను.

ముక్తావళీదేవి: మీ రీ విషయమున నేమియు జోక్యము కలుగజేసి కొనకున్నచో దానిసంగతి ఏమి కావలయును?

కీర్తిగుప్తుడు: ఏమియుకాదు. నేను ఎప్పటివిషయము లప్పుడే తెలిసికొనుచున్నాను. శ్రీకృష్ణసాతవాహన విషకన్యల ప్రేమ జగద్విదితమైపోయినది. సార్వభౌమునికి మధ్యవర్తులచే యువరాజు తన యభిప్రాయము నిస్సంశయముగ తెలియజేసినాడు.

ముక్తా: అయినా హిమబిందున కది యేమిలాభము? ఆమె ఆతని ప్రథమభార్య కావచ్చును. విషకన్య రెండవభార్య కావచ్చును. హిమబిందు ధర్మపత్నియు, విషకన్య ప్రేమపత్నియు అగుదురు.

కీర్తి: యువరాజు తండ్రివలె ఏకపత్నీవ్రతుడు.

ముక్తా: చక్రవర్తి యువరాజునకు విషకన్యతో వివాహ మెట్లంగీకరించును? ఆమె ఊర్పులే మృత్యువందురుకదా?

కీర్తి: అందురు దేవీ! వారి కేమితెలియును మానవజీవిత తత్వము! విషకన్యను వినా యువరాజు మరొకరిని వివాహమాడడు. విషకన్యను వివాహమాడనినాడు రాజ్యమునే త్యజించును.

ముక్తా: మన అల్లుడు చారుగుప్తుని సమ్మతిగైకొనక మహారాజు విషకన్యను కోడలినెట్లు చేసుకొనును? అల్లుని తపస్సు, బిందును మహారాణిని చేయవలెనని కదా?

కీర్తి: అవును ముక్తా! (కీర్తిగుప్తుని హృదయము అతి ఆర్ధ్రత నందినప్పుడు భార్యను ముక్తాయని పిలుచును) కాని చారుగుప్తుడు శ్రీకృష్ణ మహారాజు హృదయము నింతయైన గ్రహింపలేదు. తా నొకటి తలచిన దైవ మొకటి తలంచును. స్థౌలతిష్యులవారు ప్రపంచాద్భుతుడు. బౌద్ధ సన్యాసులు దేశదేశములకు బోధకై పోవుచుండ, ఆర్య ఋషులను వారి వెనుకనే పంపి, వేదధర్మములు ప్రపంచమునకు చాటింపజేసినాడు. నేను యోర్దను దేశముపోవ నచ్చట స్థౌలతిష్యుని శిష్యులుండిరి. తురష్కమున, పారశీకమున, బాహ్లికమున ఆయన శిష్యుల జూచితిని. అట్టి పురుషుడు చక్రవర్తిపై కత్తిగట్టెను. చారుగుప్తుడు స్థౌలతిష్యుని శక్తి వమ్ము చేయ దీక్షవహించి, సఫలీకృతుడైనాడు. చక్రవర్తిపై కుట్రలు నాశనము చేసినాడు. వ్యతిరేకించిన సామంతుల నుక్కడగింప జేసినాడు. ఆంధ్ర సామ్రాజ్యమునకు భరుకచ్ఛము సముపార్జించి పెట్టినాడు. ఆంధ్రచక్రవర్తిని జంబూ ద్వీపమునకు చక్రవర్తిని చేయుచున్నాడు. కావున చక్రవర్తి తన యాలోచన వినకపోవు నాయని ఆశపడుచున్నాడు.

ముక్తా: ఇంక నాతల్లి క్రుంగి, కృశించి, హృదయము శకలములు చేసుకొనవలెనన్న మాట. మీరు నా మాట వినండి. ప్రాణేశ్వరా! మీరు తలచుకొనినగాని ఈ సంకటము చక్కబడదు. హిమబిందు లోలోననే కృశించి తనతల్లిని చేరిపోవునను భయము వేయుచున్నది.

కీర్తి: ముక్తా! నీవు యవనస్త్రీవి. ఆర్యనారీమణులశక్తి నీ వెరుగవు. ప్రజాపతే తన కొమరితను రక్షించుకొనును. ఆయినను ఈలోన నేను శ్రీకృష్ణమహారాజుతో అన్నియు మాటలాడెదను. ముక్తావళీదేవి తన అనుగుబిడ్డ ప్రజాపతిమిత్ర విగ్రహముకడకు పోయి ద్యోఃపితను అపోదితీ ని ప్రార్థించెను.

10. జ్ఞాన యుద్ధము

అమృతపాదులు: తథాగతుడు “చత్వారి ఆర్యో సత్వాని” - నాలుగు సత్యములను గురించి ఇట్లు చెప్పినాడు : స్వామీ, ప్రపంచమునందు దుఃఖమున్నది. మనము పుట్టినప్పుడు బాధ నందుదుము. బ్రతుకంతయు దుఃఖమయము. ముసలితనము దుఃఖము. చావు దుఃఖము. మనము కాంక్షించినవి మనకు లభింపకపోవుట దుఃఖము. మనము ప్రేమించినవారి ఎడబాటు దుఃఖము.

స్థౌలతిష్యులు: అవునయ్యా, ఇవి పామరునకు దుఃఖములు, జ్ఞానికి దుఃఖములు కావుగదా?

అమృత: అక్కడికే వచ్చుచున్నాను. రెండవ సత్యము - దుఃఖమునకు కారణము తృష్ణ, తనకై బ్రతుకుట, సమస్తము తనకై వాంఛించుట. కాబట్టి జీవితము వేదనాభరితము. ప్రతినిమేషము మనముదేనినో కాంక్షించున్నాము.

స్థౌల: ఈ సంగతులు చెప్పుటా బౌద్ధధర్మము! ఇవి ఎట్టి పామరుడైనను చెప్పవచ్చును.

అమృత: చిత్తము. మూడవ సత్యము - ప్రతిమనుష్యుడు దుఃఖ నివృత్తికై ప్రయత్నము చేసితీరునని. అది ఎట్లు సంభవించును? మనలోని కాంక్షలను చంపుకొనుటచే, కాంక్షలు తృప్తిపరచుటచే అడగిపోవు. ఇంధనములు వేసిన అగ్నివలె అవి ఇంకను ప్రజ్వరిల్లును.

స్థౌల: ఈ బాలబోధ విన్పింప వచ్చినావురా నాకు?

అమృత: కాదుస్వామీ! ప్రారంభము చిన్నపిల్లవాని బోధవలెనే యుండును. ఆత్మవిచారము ప్రాపంచికానుభవమునుండి ఉద్భవించును.

స్థౌల: కానిమ్ము, కానిమ్ము; మీ ఆడమ్మల ఆత్మవిచారణమంతయు విని కొంచెము నవ్వుకొందును.

అమృత: స్వామీ! నాల్గవ సత్యము ఆర్య అష్టాంగమార్గము. ఈ నిధానము కాంక్షలను నాశనముచేయును.

స్థౌల: మీ అష్టాంగమార్గము నాకు తెలియును. ప్రతిమనుష్యుడు ఈ నాలుగు సత్యములు ఒప్పుకొని తీరవలయునా?

అమృత: స్వామీ! అవి ఒప్పుకొని తీరవలయునని తథాగతుడు సెలవీయలేదు. మనుష్యుడు ప్రపంచము, జీవుడు, దుఃఖము, చావు, మనస్సు, విశ్వము మున్నగు సర్వవిషయములగూర్చి తనలో తాను విచారించుకొనవలయును. ఇది ధర్మమునకు మొదటిసూత్రమని సెలవిచ్చినారు.

స్థౌల: ఆ ముక్కలు చిలుకపలుకులవలె నాకు చెప్పవచ్చితివా?

అమృత: తాము బౌద్ధధర్మ మేమియని పృచ్ఛచేయుటచే ప్రారంభించితిని. తాము ప్రశ్నలు వేసినచో, నేను ప్రతివచన మిత్తును, లేదా ఈరీతిని, ఈ విషయమునుగూర్చి చెప్పుమని ఆజ్ఞచేయుడు, అటుల నొనరించెదను.

స్థౌల: మంచిది. నీ యిష్టమువచ్చినట్లు కానిమ్ము. ఈ విధముగ స్థౌలతిష్యమహర్షికి, అమృతపాదార్హతలకు వాదోప వాదములు ప్రారంభమైనవి.

అమృతపాదార్హతులు విషకన్యనుగూర్చి స్థౌలతిష్యుని అడుగుటకు ఆయన ఆశ్రమమునకు ఒక మధ్యాహ్నకాలమున వెళ్ళినారు. వెళ్ళిన రెండుగడియలవరకు మహర్షి దర్శన మాయనకు గలుగలేదు.

అమృతపాదులు మహర్షికి నమస్కరించి ఆశీర్వాదమంది, ఒక కృష్ణా జినముపై నుపవసించెను. ఈమాట లామాట లయిన పిమ్మట స్థౌలతిష్యుడు మీ బౌద్ధమత స్వరూప మెట్టిదని పృచ్ఛచేసినాడు. అచ్చటనుండి ఈ వాదన బయలుదేరినది.

ఈ భిక్షుకుడు, ఈ పతితుడు తనతో వాదింపవచ్చెనా యని స్థౌలతిష్యుడను కొనినాడు. స్థౌలతిష్యుని జ్ఞానమనంతము. బౌద్ధదర్శనము లన్నియు పేలపిండి. ప్రస్తానత్రయము ఆయనకు గళగ్రాహము. వేదములు, వేదాంగములు, స్మృతులు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ఆ మహాత్ముని ఎదుట నాట్యమాడును. ఈ పిచ్చివానిని మూడుమాటలతో దూదిఏకి పంపుదునని యాతడనుకొనెను.

“ఈ ముదుసలి మహాతపస్వి, సర్వతంత్రస్వతంత్రుడు. ఓహో! ఏమి వీరితేజస్సు! ఇట్టి మహానుభావుడు తన మనుమరాలిని విషబాలగా నెట్లొనర్చగలిగెను? ఈయన హృదయమున ఇంతకోప మెట్లు నిండియున్నది? ఈయన ఆర్యధర్మము బోధించెనేగాని స్థితప్రజ్ఞుడు మాత్రము కాదు” అని అమృతపాదార్హతులు అనుకొనినాడు.

స్థౌల: నీ వాదన దుఃఖముతో ప్రారంభించునా?

అమృత: స్వామీ! నా వాదన కాదు. ఇది ప్రతిమనుష్యుని హృదయములోని వాదన! ఎవరికివాడు విచారించుకొనవలెను. మధించినగాని వెన్నరాదు; రెండుకర్రల రాపిడివలనగాని అగ్ని జనింపదు. అటులనే మనుజుడు, అతని చుట్టునున్న సర్వసృష్టి ఇవి ప్రత్యక్షములు.

స్థౌల: అవి నిద్రపోవువాని కున్నవా?

అమృత: లేవు. అట్లు లేకపోవుటకు కారణమేమి? మరల నిదుర లేవగనే ప్రత్యక్షమగుటకు కారణమేమి? ఆ సృష్టియు, ఆ ప్రపంచమును అటులనే యున్నవనియు, తానుమాత్రము నిద్రపోయి లేచితిననియు మనుజుడేల యనుకొనవలెను? ఈ ప్రశ్నలు విచారించుకొనుటలో మనుష్యుడు నిజము గుర్తెరుగుచున్నాడు.

స్థౌల: మీరు వేదము లపౌరుషేయములని అంగీకరింపరు. నీ ముద్దు మాటలు విన మాకు చాలా కుతుహల మగుచున్నది.

అమృత: ఈ విచారణకు అవధి ఆశయసాఫల్యము.

స్థౌల: ఆశయ మెట్టిది? సంతోషమేకదా? దుఃఖము లేకయుండుటయేనా?

అమృత: అవును. అది ప్రాపంచికముకాదు. ప్రపంచములో దుఃఖము లేకపోవుట యనునది ఎచట నుండును? ఎప్పు డుండును? మనకు సద్గతి యున్నదా లేదా యను ప్రశ్న అవసరములేదు. సద్గతియు ఒక గతియే. గతికి అతీతమగుస్థితి కావలెను.

స్థౌల: గతియు, స్థితియు ఒకటికాదా? నీరుగతి ఆవిరి. ఆవిరి మేఘస్థితి నందును. అచ్చటనుండి నీరుగతి వర్షము. వర్షము వాపీకూప తటాక సముద్రస్థితి నందును ఇవియున్నియు నొకటి కాదా? అమృత: వ్యావహారికముగ నొకటి కాదు. గుణముచేతను ఒకటి కాదు. ఆవిరిగుణము వేరు, మేఘగుణము వేరు, వాపీకూపతటాకాదుల రూపముననున్న జలము గుణము వేరు.

స్థౌల: కాని జలభావము ఒకటియేనా?

అమృత: అవుగాక!

స్థౌల: అవుగాక ఏమి, మీ మొగము! అటులనే పరబ్రహ్మ మొకటి, తక్కిన వన్నియు ఆతని ఆభాసలు. అవి అజ్ఞానముచే, మాయచే కలిగే భ్రమ!

అమృత: ఎవరికి స్వామీ?

స్థౌల: జీవునకు.

అమృత: జీవుడును ఆభాసయేకాదా?

స్థౌల: ఆతడును.

అమృత: మాయాజాత మగునది ఆభాస, మాయాజాత మగునది అజ్ఞానము, మాయాజాతుడే జీవుడును. ఆ జీవుడును, అజ్ఞానమును ఒకటి అయినప్పుడు జీవునకు అజ్ఞాన మేమిటి స్వామీ?

స్థౌలతిష్యుని ముక్కుపుటములు విస్తృతము లయ్యెను. “ఓయి అజ్ఞానీ, నీకు స్వప్నము వచ్చు చున్నది. స్వప్నములో ఇది స్వప్నమే అని ధైర్యము తెచ్చుకొనుచుందువు. స్వప్నములో స్వప్నము సంగతి ఎరుగవా?” అని గంభీరస్వరమున నరచినాడు.

అమృతపాదులు చిరునవ్వునవ్వినాడు. 

11. “నీ కిదే శిక్ష”

స్థౌలతిష్యుడు అతిజాగరూకతతో అమృతపాదులను పరీక్షించెను. ఎవ్వరీతడు? ఈతనిమోము తనకు పరిచితమై తోచును. ఈతనిపై ఏదియో దయ తనయం దావిర్భ వించుచున్నది. అయిన నీతడు చార్వాకుడు, విమతుడు, అనార్షధర్మయుక్తుడు కావున గర్హ్యుడు. అంతఃకరణ ప్రవృత్తికి, సత్యమునకు వైరుధ్యము కలిగినప్పుడు, అంతఃకరణ ప్రవృత్తిని నాశనముచేయవలయును. ఇట్టివాడే ఆ సిద్ధార్థుడు. ఆతడు బౌద్ధుడట. ఇదియే కలిమాయ. వేదములను గర్హించినవాడెల్ల ఒక మహాగురు వగుచున్నాడు. అనార్షదర్శనము లన్నియు నట్లే ఉద్భవించినవి.

అయినను ఏల తన కీ బౌద్ధునియందు కరుణకలుగవలెను? ఏ పూర్వసంబంధ ముండియుండును?

స్థౌల: పూర్వాశ్రమమున మీరెవరు?

అమృత: నా కేమియు తెలియదు.

స్థౌల: అదేమయ్యా! తెలియకపోవుట ఏమి? అట్లనుట మీ బౌద్ధ ధర్మమా, లేక తపస్సుచే అట్లు మరచిపోదురా?

అమృత: స్వామీ! మీ రన్నది ఏదియుకాదు. నా కేకారణము చేతనో పూర్వస్కృతి పోయినది. ఆ సంఘటన నా తలకు తగిలిన దెబ్బవలన నై యుండవచ్చును.

స్థౌల: దెబ్బ ఎందుకు తగిలినది?

అమృత: నేను గంగానదిలో దొరికినానట. ఈ మహానదికి ఎగువభాగముననున్న పాటలీపుత్రపురము చెంత బౌద్ధాశ్రమవాసులకు గంగలో దొరికితినట.

స్థౌలతిష్యు డాశ్చర్యభరితుడై “ఎక్కడ నీకు దెబ్బతగిలినది?” అని అడిగెను. అమృతపాదులు తననుదుట కుడివైపున పై భాగమును చూపించెను. స్థౌలతిష్యుడు ఆ మానిపోయిన పెద్దమచ్చను అచ్చట చర్మమును కుట్టిన విధానమును చూచెను.

స్థౌల: ఏ దినమున మి మ్మా భిక్షుకులు రక్షించిరి?

అమృత: ఇప్పటికి పదునెనిమిది వత్సరములకు బూర్వము, వైశాఖమాసమున, శుక్లపంచమినాడు.

స్థౌల: ఏమి? శుక్లపంచమినాడా! గంగానదిలో! నాయనా! నీవెవరైనది ఏమియు జ్ఞప్తిలేదా! నన్ను పరికించి చూడుము. ఒక చిన్నబాలిక జ్ఞాపకములేదా? ఒక చక్కనితల్లి నీ భార్యయని జ్ఞాపకములేదా? ఓహో నా తండ్రీ! గంగలోనా నీవు దొరికినది? అవును! లేనిచో నా హృదయమేల ద్రవించిపోవును? తండ్రీ! నీ కేమియు జ్ఞప్తికి వచ్చుటలేదా?

అమృత: ఏమియు జ్ఞాపకమునకు వచ్చుటలేదు స్వామీ! మిమ్ము దూరమునుండి రెండుమూడు సారులు చూచితిని అదియే జ్ఞాపకము.

స్థౌలతిష్యుడు అతివేగమున పరుగిడి హృదయమును కుదుటపరచుకొని, ఒకవిధమగు యోగములోనికి పోయినాడు. అమృతపాదార్హతు “లిదియంతయునేమి? పెద్దవారికి మనస్సు అప్పుడప్పుడు చలించును. అది కాబోలు” ననుకొని ఊరకుండెను. స్థౌలతిష్యుడు చిరునవ్వున కన్నులు తెరచి,

“సరే. మీరు వేదములే భగవంతుడు, అవి అనాది అని ఏల నమ్మరు? వేదములపై మీ ధర్మము నేల నాధారము చేసికొనలేదు?” అని ప్రశ్నించెను.

అమృత: వేదములు పౌరుషేయములు. ధర్మనిశ్చయము చేయువాడు మనుజుడు. తనకు దానే నిశ్చయము చేసికొనవలెను.

స్థౌల: మంచిది. నీకు ఒకరు చదువు చెప్పవలయునా? అక్షరములు నేర్పవలయునా?

అమృత: అంతవరకే!

స్థౌల: అదిమాత్ర మేల?

అమృత: అది లేనిచో పూర్వజ్ఞాన మెట్లలవడును?

స్థౌల: కాబట్టి నీ భవిష్యత్ జ్ఞానమునకు, వెనుకటి జ్ఞాన మాధారము. దానికి అంతకు పూర్వపుజ్ఞానము. అట్లు పోనుపోను ప్రథమ మనుష్యుల కుద్భవించిన జ్ఞానము మన కాధారమా, కాదా?

అమృత: చిత్తము. ఆ ప్రథమకాలమున వివిధప్రదేశముల వివిధ జాతుల మనుజు లుండిరి. వారందరికి జ్ఞానముండెను. ఆ యా జాతుల నుండి ఉద్భవించినవారికి ఆ యా జ్ఞానము లాధారమయ్యెను.

స్థౌల: ఆ జాతు లన్నిటి మూలమగు నొకజాతి యున్నదా?

అమృత: ఉండవచ్చును.

స్థౌల: ఆయా మనుజులందరు ఉద్భవించు మూలతత్వ మొకటి యుండునా?

అమృత: ఉండవచ్చును.

స్థౌల: ఆ తత్వ మేమిటి? అమృత: ఈ విచారణ ప్రస్తుత మనవసరముగాదా? ఈ విచారణ మనుష్యుడు చేసికొనును. మంచిదే! కాని జ్ఞానతృష్ణతో చేసినచో, తృష్ణయు దుఃఖమగునుకదా? కాక తన దుఃఖమును నాశనముచేసికొనుటకైనచో తాను, తన దుఃఖము, ఆ దుఃఖముపోవు నిధానము, తన గమ్యస్థలము తెలిసికొనగలడు.

స్థౌల: అవునయ్యా, ఆ తెలిసికొను విచారణలో మూలమునకు బోయినగాని అసత్యమిది, సత్యమిది యని ఎట్లు నిర్ధారణచేసికొనగలుగును?

అమృత: అట్లగుగాక! తెలిసికొనినవెనుక మన మేమి చేయవలయను? తెలిసికొనగనే మనుష్యనిపని తీరిపోవునా? అతని దుఃఖము క్షయ మెట్లగును? కావున అది క్షయమగు విధానము నవలంబింప వలదా?

స్థౌల: సత్యము. నీరునకు, సముద్రనీరమునకు మధ్య కొన్ని పదార్థము లడ్డమున్నవి. ఆ అడ్డము తీరుటే నీరము స్వస్వరూపమందుటకాదా! కనుకనే విచారణయు, జ్ఞానము ముఖ్యము. అటువెనుక ఆ అసత్ ను తొలగింపవలయును. ఆ తొలగించునది తానే! తొలగించుటకు వేరుధర్మ మున్నదనిన ఆ ధర్మమునకు, తొలగించుటయును క్రియకు ఆధారమగు వేరువస్తు వుండవలయునా? ఈ పృథక్త్వమే సత్యమునకు సార్థక్యము కల్పించు నేని అవి నాశనమగుచున్నవి. నాశనమగునవి సత్యములు కావుగదా?

అమృత: స్వామీ! మీరు చెప్పినవన్నియు మేము ఒప్పుకొందుము.

స్థౌల: జ్ఞానముకలవాడు ఒప్పుకొనవలయును. అయినచో సత్యమై అన్నిటికి ఆధారమగునది బ్రహ్మము.

అమృత: అందుండి ఈ విశ్వము వచ్చునా?

స్థౌల: అందుండి వచ్చుటయేమి? అదియే ఇది.

అమృత: అయినచో ఈ దుఃఖము అదియేనా? ఈ చావు అదియేనా? ఈ ఈతిబాధలు, ఈ తాపత్రయములు, ఈ ఈషణత్రయములు, ఈ అరిషడ్వర్గములు అదియేనా?

స్థౌల: ఆ పదార్థమున కాభాసలే ఇవి.

అమృత: మీరు బ్రహ్మ మందురు. మేము నిర్వాణ మందుము. స్వామీ! మొదటి కారణమనుచు లేదు. ఈ కారణపరంపర “ప్రతిద్యసముత్పదం పశ్యంతి తే ధర్మం పశ్యంతి మే ధర్మం పశ్యంతి స బుద్ధం పశ్యతి” అన్నట్లు యీ కారణపరంపర కర్థ మెరిగినవాడే బుద్ధుడు. యీ కారణములలో నొక్కొక్కటికి తక్కిన వాధారములు. తక్కినవానికి, ఇదియు తక్కినదియు ఆధారములు.

స్థౌల: ఇదియేకదా సాంఖ్యము చెప్పునది? నీవు క్రొత్తగా చెప్పు విచిత్ర మేమున్నది? ప్రకృతిసహితుడగు పురుషుడు సృష్టి, ప్రకృతిత్యక్త పురుషత్వమే జీవుని కర్మరాహిత్యము. కారణమనంతమయినచో కారణ విముక్తి ఎట్లు? నిర్వాణ మెట్లు?

అమృత: “కర్మజం లోకవైచిత్ర్యం.” సర్వకాలము సృష్టిలో మార్పు జరుగుచున్నదిగదా? “నోచ నిరోధోస్తినచభవోస్తి సర్వదా అజ్ఞాతం అనిరుద్ధంచ, తస్మాత్ సర్వ ఇదం జగత్.” సృష్టిలేదు, నాశనములేదు, మొదలులేదు, తుదలేదు.

స్థౌల: ఓయి వెర్రివాడా, మార్పు జరుగుచున్నదియు అసత్యము. యీ వస్తువు లున్నవియు అసత్యము. అసత్యములుకాని సత్యము ఒక్కటి లేదా? నీవు సంసారము సత్యమందువు. మార్పు సత్యమందువు అయినచో కర్మ సత్యము కాదా? ఇంక కర్మక్షయమై నిర్వాణ మెట్లొందగలవు? నీ నిర్వాణమున “సర్వాణి నిరచగ్ఛంతి దుఃఖాదయోస్మి న్నిత నిర్వాణం” అని గదా? దుఃఖాదులు దీనియందు నిర్గతమగునని గదా? ఎంతటి క్షుద్రాశయము!

అమృత: దుఃఖాదు లన జన్మపరంపరగదా?

స్థౌల: జన్మపరంపర నిజమయినప్పుడు నీకు నిర్వాణ మెప్పుడు వచ్చును? నీ వేమవుదువు?ఎందు గలసెదవు? నీవు వేరుగా నుందువా? ఇదిగదా శూన్యవాదము.

స్థౌలతిష్యుడొక్క నిమేషము మనస్సున ప్రార్థన సలుపుకొనెను. వెంటనే తన కడనున్న దండముతీసి “దుర్మార్గుడా! కుత్సితవాదమునకు నీ కిదే శిక్ష” యని, వెనుక తల పై తగిలినచోటనే మరల పుర్రె పగులునట్లు తూచికొట్టెను. “హా,” యని అమృతపాదార్హతులు తలపగిలి, రక్తము స్రవింప చైతన్యరహితుడై పడిపోయినాడు. 

12. పూర్వస్మృతి

స్థౌలతిష్యు డా దెబ్బకొట్టి, అమృతపాదులు పడిపోవగనే సింహము వలె లేచి, ప్రక్కనున్న గంటవాయించెను. కాషాయాంబరధారులగు శిష్యులు నలుగురచ్చటకు బరుగిడివచ్చిరి. వీరి వాద ప్రతివాదములువినుచు, దూరముగ కంబళుల పై, కృష్ణాజినములపై నాశీనులై యున్న భిక్షుకులు అమృతపాదులు పడిపోవగనే, యచ్చటకు పరుగిడివచ్చి చైతన్యరహితుడైయున్న తమ ఆచార్యుల తల నొకరు పట్టుకొనిరి. ఏడ్చుచు కాషాయోత్తరీయము చింపి, వెల్లువలై ప్రవహించు గాయముపై ఒక రదిమి పట్టుకొనిరి. తక్కినవారు వేదనతో చుట్టును మూగిరి.

స్థౌలతిష్యుడు వారినందరిని అదలించి, నిర్వికారమగు చిరునవ్వుతో, అమృతపాదులపై అతికరుణార్ధ్రమగు చూపులుపరపి, “తండ్రీ! నీకు పూర్వస్మృతి కలుగుటకై ఈ విధాన మవలంబించితిని. ఈశ్వరుని ప్రేమ ఎట్టిదో చూచెద” ననుచు, వెంటనే అతిజాగరూకతతో, తన వైద్యశాలలో నొక మంచముపై పరుండబెట్టించి, అస్త్ర పేటిక తెరచి, అందుండి నిశితమగు నాయుధములు దీసెను. వేరొక రజత మంజూషనుండి ఒక కాచపాత్ర గ్రహించి అందుండి ఒక తైలము నా అస్త్రములపై పోసెను.

అమృతపాదుల గాయమునుండి రక్తము స్రవించిపోకుండ మొదటనే ఫాలమునకు దిగువనే ఆ వృద్ధతపస్వి వస్త్రముచే బిగించికట్టెను. శిష్యు డొక డింకొక కాచపాత్ర నందీయ, అందుండి మరియొక తైలవిశేషమును స్థౌలతిష్యు డా గాయము పై పోసెను. వెంటనే రక్తము కరిగిపోయి గాయము నిర్మలమైనది.

అమృతపాదులు లంబికాయోగము ధరించిరేమో, నుదుట గుడ్డ కట్టకుండగనే రక్తము స్రవించుట మొదటనే మానినది. గాయముకడ నున్న రక్తముమాత్రము స్రవించిపోయినది.

లలితములై, సూర్యకిరణ సదృశములై, శక్తిమంతములైన తన వ్రేళ్ళపై స్థౌలతిష్యుడొక తైలమును పోసికొని ఆ తైలమును రెండు చేతులకు పులుముకొని, నిశితములై, మహాపురుషుల తపస్సులవలె మొనయుచున్న రెండు శస్త్రములు తీసెను.

ఆ మహర్షి తీక్షణదృష్టిచే అమృతపాదులను చూచెను. ఆతడు లంబికా యోగము లోనికి పోయినాడు. ఆతడు జీవించియు శవము. అతని హృదయమునందు చలనములేదు. ఊపిరిలేదు. కంటిపాపలు వెనుకకు తిరిగిపోయెను. దేహము కొయ్యబారిపోయెను. కాని సూక్ష్మాతిసూక్ష్మమగు నాతని ప్రాణనాడి మాత్రము దేహ మెల్ల ప్రసరించియే యుండెను. స్థౌలతిష్యుని కనులు వెలిగిపోవుచుండెను. మంత్రములు జపించుచు, ధ్వని రహితముగ పెదవుల కదల్చుచు, ఆ శస్త్రములచే గాయముకడ కపాలశల్య మాతడు ఛేదించెను. ఆ శల్యమును నాల్గువైపులగోసి ఆ శల్యపుముక్కను తీసి పుఱ్ఱెపై నుంచెను. ఆలోన అనేక సూక్ష్మనాళములు లున్నవి. వానిలో కొన్ని తెగి అచ్చట రక్తము ఒక్కతిలలో పదవభాగమంత గడ్డకట్టి యుండెను. ఆ కరడుగట్టిన రక్తకణ భాగమును తీసివేసి ఆ ప్రదేశమంతయు అతిసున్నితముగ శుభ్రముచేసి నాళములను సర్ది, ఎముక కుట్టి, ఆమీద ఔషధలేపన మొనర్చి, చర్మమునుకుట్టి కట్టుకట్టెను.

తోలుపరచిన ఆ మంచమునుండి అమృతపాదులను వేరొక పల్యంకముపై పరుండబెట్టి, అమూల్యమగు నొక తైలమును హృదయముపై నెమ్మదిగ పూయించెను.

ఈ శస్త్రచికిత్స యంతయు ఒక అర్థఘటికామాత్రము పట్టినది.

అచ్చటనుండి స్థౌలతిష్యుడుపోయి గంగాజలములో స్నానముచేసి వచ్చి, శుభ్రవసనములు ధరించి అమృతపాదులకడ కృష్ణాజినాసనముపై కూరుచుండి ప్రణవమంత్రోపాసకు డయ్యెను. ఆ మంత్ర పునశ్చరణము మహావేగవంతమై, దివ్యపథ సంచారియై సప్తలోకాలు నిండినది. విశ్వమున ప్రజ్వరిల్లినది.

“ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధేపదం సమూహమస్యపాంసురే” అను మహావిష్ణు పథములవరకు ప్రసరించినది.

సాయంకాలమైపోయినది. స్థౌలతిష్యుడు సమాధిలోనికి బోయెను. అతనికి లోకములులేవు. సృష్టి లేదు. ఏమియు లేదు. ఆతడే అంతయు నైనాడు. ఆతడే సత్యము. ఆతడే జ్ఞానము, ఆతడే జ్ఞాని, ఆతడే జ్ఞేయము నైనాడు. అటు లంబికాయోగమున నున్న అమృతపాదులకు సర్వము శూన్యము. ఆత డా శూన్యమున ఒక మహాత్తత్వము. ఆ మహాత్తత్వము, ఆ శూన్యము ఒకటియైనవి. ఆతనిజ్ఞానము ఆతనిలో లయమైనది. ఆతడు శూన్యములో లయమైనాడు. లంబికాయోగము వీడినది.

అచ్చటనుండి అమృతపాదుల కొక స్పందనము తోచినది. విశ్వమంతయు నాక్రమించుకొన్న ఒక సూక్ష్మదీపకళిక యైనాడు. ఆ దీపకళిక విశ్వరూపమగు ఆదిత్యమైనది. ఆదిత్యము, ఒక మహాతేః పుంజమైనది. అందుండి లోకము లావిర్భవించినవి. లోకములనుండి భూమి భూమి, యంతయు తానైనాడు. తా నా భూమియం దున్నాడు. ఆభూమిలో జంబూ ద్వీపము, అందు భరతవర్షము అందు కాళికా ప్రదేశము. తాను గంగలో పడవలో పోవుచున్నాడు. ఆతనితో ఆ నావలో ఒకపెద్ద, ఒక పుణ్యస్త్రీ, వేరొక పుణ్యాంగన ఇరువదిరెండు వత్సరముల సాధ్వి, ఆమెచేతులలో ఆటాడుకొను పదిమాసముల పసికూన ఒకబాలిక.

ఆ తేజశ్శాలి వృద్ధుడు తనతండ్రి. ఆయన ప్రక్కనున్న యామె, తన తల్లి, తనభార్య ఆ జవ్వని, ఆమె చేతిలోని బిడ్డ తన బిడ్డ. తాను త్రయార్హేయ మౌద్గల్యస గోత్రోద్భవుడై, ఆపస్తంభసూత్రుడై, యజుశ్శాఖాధ్యాయియైన నందిదత్తుడు. ఇంతలో ఆ పడవ మునిగినది. ఏమయ్యెను? అంతయు తమస్సు!

ఇంతలో అమృతపాదులు కన్నులు తెరచెను. ఎదుట ఎవరు? తన తండ్రి పోలిక మహాయోగమున నున్న తేజఃపుంజము!

అమృతపాదులు కళ్ళు తెరచుట ఏమి, స్థౌలతిష్యుడును కళ్ళు తెరచెను. స్థౌలతిష్యు డాయనను మాటలాడవలదనియు, కదలవలదనియు సంజ్ఞ యొనర్చి లోనికిపోయి, తేనెతో రంగరించిన ఒక ఔషధము కొని వచ్చి, అమృతపాదులచే సేవింపచేసెను.

“నాయనా! నీ పేరు నందిదత్తుడు కాదా?”

అవునని అమృతపాదులు తలయూపెను.

“నీ భార్య పేరు అపరాజితాదేవి కాదా?”

“అవు” నని అమృతపాదు లస్పష్టముగ ననెను.

“నే నెవరు?”

“నా పితృపాదులు!”

స్థౌలతిష్యుని కన్నుల నీరు తిరిగినది. ఆయన కంఠమున ముడులు పోవ ఒక్క నిమేష మటులుండి, శాంతించి “తండ్రీ, నిద్రపో! తర్వాత అంతయు చెప్పెదను” అనెను.

“నాయనగారూ! పడవలో మునిగిపోయిన వారందరు క్షేమమా?” అని అమృతపాదు లస్పష్టధ్వనిని ప్రశ్నవేసిరి.

స్థౌలతిష్యుడు మాటలాడవలదని పెదవులకడ చూపుడువ్రేలుంచెను.

ఔషధప్రభావముచే అమృతపాదులు నిదురగూడిరి.

స్థౌలతిష్యుడు రూపెత్తిన బ్రహ్మతేజమువలె నట్లే నిలుచుండి, రూపెత్తిన బౌద్ధమువలె నున్న కుమారుని చూచుచుండెను.

ఇతడు, ఈ ప్రియబాలకుడు, తనకన్నతండ్రి. ఈ రీతిగ దొరికినాడేమి! ఈ సంఘటనలోని మహాభావ మేమి? తనపూర్వజ్ఞానమే పోగొట్టుకొని, బౌద్ధ సన్యాసియై, ఆచార్యుడై, అర్హతుడై, కులపతియై, సర్వభారతీయ బౌద్ధసంఘములకు ఏడుగడయైనాడు. తాను ఆర్యధర్మదీక్షాపరతంత్రుడు, తన పుత్రుడు బౌద్ధధర్మాభిరతుడు. తాను త్రయీపఠన పవిత్ర వదనుడు, ఈత డభిధర్మాది మహాగ్రంథపఠనపవిత్రుడా? లేక అపవిత్రుడా? 

13. అన్వేషణ

సువర్ణశ్రీ ఎక్కడకుపోయినాడు? ఏమయినాడు? ఎందు కట్లు వెడలి పోయినాడు? తనకు సువర్ణశ్రీయే కావలెను. తనకు సామ్రాజ్యమెందుకు? సామ్రాజ్ఞిత్వ మెందుకు? సువర్ణశ్రీ తన నాథుడై, తా నాతని శిల్పము, చిత్ర లేఖనము చూచుచు, ఆనందమున దివ్యపథములకు బోవుచు, తన అద్భుత గాంధర్వమున ఆతని నోలలాడించుచు, ఆతనిచే చైత్యములు నిర్మాణము చేయింపుచు, ఈ జన్మము నొక మహదానందప్రవాహమును చేసికొన గలుగుటయే చరితార్థత!

తాను సువర్ణశ్రీతో భారతవర్షమంతయు యాత్రలు సలుపవలెను. బౌద్ధ క్షేత్రములు దర్శింపవలయును. ఈ ధన మెందుకు, రాజ్యమెందుకు? ఒక మంచివానికన్న ఇంకొక మంచివాడు ఇంకనెక్కువ బాగుగ రాజ్యము పరిపాలింపగలుగునా? రాజులేకదా, రాజ్యలోభముచే మహాయుద్ధములు సలిపి ప్రజానష్టము గొనివచ్చుచున్నారు!

తన తండ్రి కీ కోట్లెట్లు వచ్చినవి? ఇతరులధనమును వ్యాపారము పేర హరించుట వలనగదా! రెండుపణములకు కొన్నవస్తువు, పదిపణముల కమ్మును. ఒకచోటినుండి వస్తువులు మరొకచోటికి చేర్చుటలో పడినపాటు రెండుపణములు విలువయుండు ననుకొన్నను, లాభము ఆరుపణములు మిగులుచున్నది. ఈ రీతిగ ప్రోగైన పాపమే తనతండ్రి మహాసంపద యుంతయు.

తనకై, తనభర్తకై, తన బిడ్డలకై, లోకమునకై, భగవంతునికై జీవితము ధారపోయని యువతిజన్మము వృథాయనికదా అమృతపాదార్హతులు చెప్పినది. ఈ భావములు హిమబిందు హృదయములో నెలకొన్నవి. ఆమెకు తగని ఆవేదన, నిలుచుండలేదు, కూరుచుండలేదు. పాటలీపుత్ర పురముననున్న సంఘారామములు, చైత్యములు ఎన్నిసారులో తిరిగినది. అమృతలతాదేవితో ధాన్యకటకమునుండి వచ్చిన బాలనాగిని వేపుకొని తినుచున్నది.

“బాలనాగీ, ఎటులనే!” “బాలనాగీ నాకు జ్వరము తగిలినట్లున్నది, చూడవే!” “బాలనాగీ! నాకు మంచివిషమును కొనిరావే” ఈ రీతిగ బాలనాగి నలిగిపోవుచున్నది.

పాపము బాలనాగి ఏమిచేయగలదు? ఆమె ఇటు పరుగిడును, అటు పరుగిడును. యజమానురాలితో పాటు ఆమెయు నాబాధ లన్నియు పడుచున్నది. ఆమెకు హర్షగోపుడు మనస్సునకు వచ్చును. తానును హర్ష గోపునికై బాధ నందుచుంటినని యనుకొనును. హర్షగోపుడు వచ్చునట. ఆతని విశాలవక్షము ఆమెహృదయమున తోచును. తన్నాపక్షమున కదిమివేసిన ఆతని పృధుబాహుద్వయ మామె హృదయ పథముల తోచి దేహ ముప్పొంగును. హిమబిందునకు వివాహమైనగాని తాను వివాహము చేసి కొనరాదు. హర్షగోపుడు తన్ను ద్వాహమగుటకు ఇంద్రగోపుడు అనుమతించినాడట. తనతల్లి తండ్రు లిదివరకే అనుమతించిరి. తన తండ్రి మంచి వ్యవసాయకుడు. చారుగుప్తుని గ్రామములో ముఖ్య గ్రామమైన జయస్థలి యందు పెత్తన మాతనిదే. చారుగుప్తుని పొలములన్నియు ఎంత చక్కగా పండించును! ఆ గ్రామమే అందమైనది. అది శ్రీకాకుళమున కెగువను కృష్ణాతీరమున నున్నది. వ్యవసాయము, పొలములుదున్నుట, కలుపు తీయుట, పంటకోయుట, నూర్చుట, ధాన్యాదు లింటికి తెచ్చుట, సంక్రాంతి! ఎంత చక్కనైనపాటు! ఆ పాటును అందగింపజేసే పాటలో! తన ఇల్లు పేరుగానుండును. తనకెన్ని పశువులుండును! అవి అంబా అని అరచును. ఆవులపాలు తాను పిదుకును, తనభర్తయు పితుకును. బిడ్డలు “అమ్మా గుమ్మపాలు” అందురు.

“బాలనాగీ!” అను హిమబిందు కేకతో బాలనాగి కలలు ఎగిరి పోయినవి.

హిమబిందు పరుగున వచ్చి, “బాలనాగీ! రావే నా బట్టలన్నియు సర్దు. గోండువీరుల నిరువదిమందిని సిద్ధముచేసితిని. మన రథము సిద్ధము. నేనును, నీవును వెంటనే బయలుదేరవలెను. ఈ రాత్రి రాత్రి గంగ ఒడ్డునే బయలుదేరి కాశికాపురము పోవుచున్నాము. వారణాసీపురముకడ, బుద్ధ దేవుని ప్రథమాశ్రమమైన హరిణవన మున్నది. అచ్చట అతిపవిత్రమైన మహాచైత్య మున్నది. ఆ చైత్యము అశోకచక్రవర్తి నిర్మించినాడు. మన మా క్షేత్రము దర్శించి రావలయును తండ్రిగారికి తెలియదు. మన రథము మహా వేగమున పోవును. లే! లే!” అని తొందరపరచెను.

వా రా రాత్రి ప్రయాణమైరి. మహావేగముతో వారిరథము మహా రాజపథమున వెడలిపోవుచుండెను. తెల్లవారుసరికి వారొక పట్టణము చేరిరి. అచ్చటనుండి హంసవలె నున్న ఒక చక్కని నావను మాటలాడుకొని, వారు గంగానదిలో పడవ ప్రయాణము సాగించిరి. తన స్వామిని తాను కలుసుకొనుటకు పోవుచున్నది. విమానములు, గంధర్వాశ్వములు బృహత్కథా సందోహములో మాత్రమున్నవి. లేనిచో మరుక్షణములో అచ్చటికిపోయి వాలియుండునుకదా!

ఆ సుందరశ్రీవికాసిత వదనుడు, తన మనోనాథుడు వారణాసీపుర ప్రాంత కురంగ వనమున నుండునా? అచ్చటినుండి కౌశాంబికో, కుశ నగరమునకో, లంబినీ వనమునకో పోయియుండునా? ఎక్కడకు పోయినను తాను నిర్నిద్రయై ఏడులోకములు వెదకియైన తనప్రాణేశుని పట్టుకొనును.

శిల్పకుమారుడు పురుషులలో మహాకిరీటము. ఆయన కన్నులలో చిత్రలేఖనములు కలలు తిరుగును. ఆశిల్పి నవ్వులలో కావ్యములు గానము చేయును. ఆయన రూపమున సర్వశిల్పములు చైతన్యము నందును.

తా నెంత యదృష్టవంతురాలు! ఆ దివ్యమూర్తి తన్నుచూచిన ప్రథమ క్షణమందే తన్ను ప్రేమించెను. తన్ను శిల్పమూర్తిని చేసెను. తన్ను చోరులు తస్కరించికొనిపోయినప్పు డేమియు వెరవక తన్ననుసరించి, విరోధుల నుక్కడగించి తన్ను రక్షించెను. తనకై ఆత డుద్భ వించినాడు, ఆతనికై తా నుద్భవించినది.

తండ్రి తన్ను శ్రీకృష్ణమహారాజున కుద్వాహమొనరించెదనని తనతో తెలిపినప్పుడు, వెంటనే హృదయము వణకి ప్రాణముపోయి నేలపై పడిపోక, సిగ్గులేక తల ఊపినది. తనలోని యవనరక్తమట్లు చేసినది. “ప్రభూ! ఆత్మేశ్వరా! నీకెంత ప్రణయద్రోహము చేసితిని! ఆనాడు తోటలో ఈ కర్కశహృదయ వచించిన మాటలకు నీవు ఎంత కుంది నావో!” ఈ ఆలోచన ఆమె హృదయమున మెఱిసిపోవుటయు ఆమె కన్ను లార్ద్రము లయ్యెను.

ఒకవైపు తనప్రభువగు శ్రీకృష్ణసాతవాహనమహారాజున కిచ్చెద రనుకొనిన బాలిక! ఆ బాలిక ఆ వివాహమున కొప్పుకొనినట్లు కనంబడుట. ఈ రెండును ఆ మహాభాగుని ఇటుల దేశాలపాలుచేసిన వని యామె యనుకొనెను.

ఒకవేళ నందమహారాజు దీక్ష గయికొనిన వెనుక సుందరీదేవిగతియే తనకును బట్టునేమో! తనహృదయేశ్వరుడు, తన సువర్ణశ్రీ భిక్షువే యైనచో ఓ సమంతభద్రా! నీ పరమప్రేమకు అర్థమేలేదని ఆమెకన్నుల నీరు కారిపోయినది.

“బాలనాగీ! మనయానమును తొందరగ బోనిమ్మనుము. త్వరగ మనల కాశీపురికి తీసికొనిపోయినచో వారు కని విని ఊహించలేని పారితోషికమత్తు నని తెల్పవే!” అని ఆమె తొందరపెట్టెను.

రెండు రాత్రులు, రెండు పవళ్ళు పడవలోనే ప్రయాణించిరి. పడవలోనే బాలనాగి వంటచేయుచుండెను. చారుగుప్తుడు వచ్చి, హిమబిందును వెనుకకు గొనిపోవునేమో యను భయమున హిమబిం దట్లొనరించినది.

ఒకచోట తండ్రి రథములతో, గుఱ్ఱములతో, ఏనుగులతో పది గోరుతముల దూరమున నున్నాడని ఒక గోండుడు వచ్చి చెప్పినాడు. ఆమె వెంటనే పడవ నాపి తానును, బాలనాగియు, గోండులు గంగ అవలిఒడ్డున దిగి వెనుకకు కొంతదూరము పోయి, నదిఒడ్డునుండి మహావేగముతో రెండు గోరుతములు తీరమువదలి వెళ్ళి, అచ్చటనుండి చుట్టి గ్రామముల వెంబడి కాశీనగరము ప్రయాణము చేసిరి. చారుగుప్తుడు గంగానది తీరముననే కాశీనగరము ప్రయాణము చేయుచున్నాడని గోండులు వార్తలు తెచ్చిరి. హిమబిందు మరల సంకేతముచొప్పున నదీతీర గ్రామమునకువచ్చిన నావ నెక్కి ఒకదినము ప్రయాణము చేసి కతిపయదినములకు వారణాసి చేరెను.

వారణాసినుండి ఆమె వెంటనే గోండులతో హరిణవనాశ్రమము చేరినది. అచ్చట ఒక అతిథిగృహమున వారిద్దరు వసించి, గోండులను సువర్ణశ్రీ ఎచ్చట నుండెనో తెలిసికొనిరమ్మని పంపినది. 

14. నూత్నాశోదయము

చారుగుప్తుని ప్రపంచము ఇసుకతో కట్టిన బొమ్మరిళ్ళవలె కూలిపోయినది. తన బాలికను యువరాజ్ఞిని చేయవలెనని ఉవ్విళ్ళూరిపోయినాడు. హిమబిందు శైశవము నాడే ఆతని నా మహాస్వప్న మావేశించెను. అందుకై ఆత డెత్తిన ఎత్తులు, చేసిన సంపాదన, రాజానుగ్రహప్రాప్తికై పడినపాట్లు లోకవిఖ్యాతి నందినవి.

ఆంధ్రచక్రవర్తి గౌరవ ప్రేమల కాస్పదుడైనాడు. చారుగుపునితో నాలోచింపకుండ నేకార్యమును చక్రవర్తి తల పెట్టలేదు.

మహారాజ్ఞకి కావలసిన విద్యలన్నియు హిమబిందునకు నేర్పించినాడు. చారుగుప్తుడు- సకలశాస్త్రములు, ఛప్పన్నభాషలు, ఆంధ్రప్రాకృతము, పాలి, సంస్కృతము, మాగధి, శూరసేని మొదలగువానిలో నామెను పండితరాలిని చేసినాడు. త్రిపీఠకములు, ధర్మచక్రప్రవర్తన సూత్రము, అభిధర్మసూత్రము, మహాపరినిర్వాణ సూత్రము మొదలగు సూత్రములు నికాయములు, జాతకగాథలాది బౌద్ధ గ్రంథము లన్నియు ఇతిహాసాది సంసృత గ్రంథములన్నియు హిమ చదివినది. అశ్వారోహణము, కత్తి సాము, విలువిద్య, రథచోదకత్వము మొదలగు విద్యలయందామె ప్రజ్ఞావంతురాలు. నాట్యము, చిత్రలేఖనము, గాంధర్వము, సాహిత్యము వీనియన్నిటి యందును ఆమె అపరప్రజ్ఞాపరిమిత, సరస్వతి.

ఇట్టి బాలికను, జగదేకసుందరిని శ్రీకృష్ణుడు తనకు వలదనినాడు. ఆ విషబాలికయే తనకు కావలెనట. రాజులహృదయములు నిలుకడలేనివి. ఋతువులలో గాలివాన లెప్పుడువచ్చునో చెప్పవచ్చును. రాజధర్మము నిర్వర్తించు వారి హృదయము లెట్లుండునో ఎవ రెరుంగ గలరు?

తన శ్రమయంతయు వ్యర్థమైనది. తన ఆశలు, తపస్సులు రిక్తఫలములు పండినవి. తనబిడ్డ సువర్ణశ్రీని వివాహమాడునట. తన బాలికకు శిల్పి యగు సువర్ణశ్రీకి నెక్కడి కెక్కడ! తాను వర్తకచక్రవర్తి. సాధారణచక్రవర్తులు తొక్కిచూడని దేశములు తాను జయించినాడు. భారత వర్ష మన నేల, సకల భూమండలమున తనతో సమాను లగు ధనవంతులు లెక్కకువత్తురో, రారో!

ధన మిచ్చి సామ్రాజ్యములు కొనగలవానిపుత్రికయై, బొమ్మలు చెక్కుకొను శిల్ప బ్రాహ్మణుని బిడ్డనా తనబాలిక వలచునది!

రాజులహృదయములకన్న మరియు విచిత్రములు, అగాథములు స్త్రీల చిత్తములు. ఎవరు తనకు సహాయము చేయగలరు? ఎవరు ఆలోచన చెప్పగలరు? చక్రవర్తి తనతోపాటు విచారించును. తన చండశాసనముచే కుమారుని ఆజ్ఞాపించి హిమబిందు నుద్వాహమగునట్లు చేతునని యాయన వాగ్దానమిచ్చినాడు. కాని ఆ బలాత్కార వివాహముచే నేమిప్రయోజనము? అమృతపాదులు వేదాంతము బోధించినారు. తాను శ్రీకృష్ణునికి వేదాంతము బోధించి మనస్సు త్రిప్పెద ననినారు. మహారాణి ఇట్టి సంఘటన కెంతయో వాపోయినది. తనకుమారుని ప్రాధేయపడి యొప్పించెద నన్నది. ఇట్టివారే తనకు సహాయము చేయలేనిచో ఇక నెవ్వరీ ప్రపంచమున సాయపడగలరు?

తా నధర్మాభిరతుడు కాడు. రాజమార్గమగు సత్యమునే తా ననుష్ఠించును. ఎందుకు తన కీఅవమానము, బాధ, ఆశాభంగము కలుగవలెను? తన తనయ కిట్టి గతి పట్టవలెను? తన పూర్వకర్మమా? తన తనయ పూర్వకర్మమా? కర్మ నతిక్రమించు నధికారము తనకు, తన తనయకులేదా? తనయయూ తన కోర్కె నిరాకరింపనని వాగ్దాన మిచ్చినది.

విషకన్యల విషయము కథలలో వింటిమి. ఇప్పు డట్టిసంఘటన నీ స్థౌలతిష్యుడు ప్రత్యక్ష మొనరించెను. ఆ విషకన్య తా నే విధి నిర్వర్తింప ప్రయుక్తయైనదో అది చేయవలెను. లేదా, తానే నశించిపోవలయును. ఈ బాలిక స్థౌలతిష్యుని మనుమరాలట. ఈమె ఆ రెండుపనులను చేయలేదు. ఇది ఏమి చిత్రము!

స్థౌలతిష్యుడు రాజవంశమును జయింతునని బయలుదేరెను. ఏమియు చేయలేక పోయినాడు. తనకు మాత్రము తీరని అపకారముచేసినాడు. తనబాల నెత్తుకొని పోయి, సువర్ణశ్రీని ఆమెను జతకూర్చినాడు. విషకన్యను ప్రయోగించి శ్రీకృష్ణయువరాజు మనస్సు విరిచినాడు.

బుద్ధభగవానుని దయ ఇట్టిదా? వేదములలో, ఉపనిషత్తులలో, పురాణములలో తెలుపబడిన దేవతలను, పరమేశ్వరుని నిరసించి ఈ ధర్మమును నమ్మినవారి పని ఇట్ల యగును కాబోలు! నేను కాశికావిశ్వేశ్వరునే నమ్మవలయునా?

ఆతని ఆవేదన తీర్చువా రెవ్వరు? అప్రయత్నముగ నాతనికన్నుల నీరు స్రవించినది. ఆతడు వెంటనే తన రత్నస్థగితమంజూష తెరచి స్వర్ణ విగ్రహరూపయైయున్న ప్రజాపతిమిత్రను కనుంగొని, కన్నులకా ప్రతిమ నద్దుకొని వెక్కి వెక్కి రోదించినాడు. ఆతనిగుండె అదిరిపోయినవి. ఆతని కంటినీరావిగ్రహము నభిషేక మొనరించినది.

“ప్రాణేశ్వరీ! నీ ముద్దులబిడ్డను చక్రవర్తిని చేయ సంకల్పించితిని. అందుకై అనంతమగు నా సంపదనంతయు గడ్డిపోచగ నెంచి వెచ్చింపనెంచితిని. నాచేతనైన ప్రయత్నము చేసితిని. ఆత్మేశ్వరీ! మహారాణులకన్న ఉత్తమురాలా! నీ వేల నన్ను వదలిపోతివి? హితకరమైన నీ ఆలోచన నాకు దూరమై పోయినది. నీ బిడ్డ దిక్కులేని దైనది. బ్రతికి యీ తండ్రి అప్రయోజకుడు, అసమర్థుడునై జీవచ్ఛవమైనాడు.”

చారుగుపుడు చైతన్యరహితుడైనాడు. ఇంతలో అతనికి తెలివి వచ్చినది.

ఎదుట సశరీరయై ప్రజాపతిమిత్ర నిలిచియున్నది. ఆమెకన్నులలో దివ్యకరుణ వెన్నెల వెలుగులను జల్లుచున్నది. చారుగుప్తుడు అదిరి పడి “నీవు వచ్చితివా! ప్రాణేశ్వరీ! ఈ దీనునికి ప్రత్యక్షమైనావా?” అని గోల పెట్టెను.

ప్రజాపతిమిత్ర ఇట్లు పలికినట్లాతనికి వినంబడినది: “ప్రభూ! ఏల నంత బాధపడెదరు? మనబాలిక ప్రేమను పాలింపుడు. ఆమెయే మీకు సర్వానందములు సమకూర్చును. మీరు చేసిన ఏ కార్యమును ఫలరహితమై పోదు. హిమ సువర్ణుల దివ్యప్రేమలో మీరు లోకాతీత రహస్యముల గ్రహింతురు. నేను సదా మీ ప్రక్కనుంటిని. అటుల నింకను ఉందును. మీరు అమితాభసామీప్య పదవి నందువరకు నుందును. ఆ వెనుక మన మిరువురము ఒకటియైపోదుము.” ఆ విచిత్రదర్శనము కరగి చేతిలోని జాంబూనద సాలభంజికలో చేరిపోయి నట్లయినది. ఆత డా విగ్రహమును హృదయమున కద్దుకొని, ముద్దిడుకొని, తనఫాలమున చేర్చి, సంధ్యారుణకాంతులు తన్నలమి, కరిగిపోయి, చిరుచీకట్లలమి, వెన్నెలకాంతులు తనపై ప్రసరించువరకు అట్లే నిలుచుండిపోయెను.

సువర్ణశ్రీ మహావీరుడు, ప్రజ్ఞానిధి, మహోత్తముడు. అతని తాను లోకోత్తరుని చేయును. ఆతడే హిమబిందునకు ప్రాణేశ్వరుడగును. చారుగుప్తుని తనయ సాధారణ మానవుని ప్రేమింపదు. ఆతనిలో ఏ మహోత్తమపవిత్ర శక్తులున్నవో అవి ఆశాశోత్తాలమై విశ్వమున ప్రజ్వరిల్లు గాక! తన ఆత్మేశ్వరి ఆదేశము దివ్యధర్మసూత్ర మగుగాక!

చక్రవర్తి యింతలో చారుగుప్తుని మందిరములోనికి వచ్చినాడు. చారుగుప్తుని హస్తములనున్న విగ్రహ మా చీకటిలో మెరసిపోవు చున్నది.

చారుగుప్తుడు చక్రవర్తిని చూచి చకితుడై “మహాప్రభూ! తామే వచ్చినా రేమి! వార్త నంపిన తమ్ము సేవింప నేనే వచ్చియుందును” అనెను.

“చారుగుప్తులవారూ! మీరు మా సోదరులు. మేము ఈ పాటలీపుత్రమున సింహాసన మధిష్ఠించునాడు, మీరును మా ప్రతినిధిగ మహా రాజు సింహాసన మధివసింప మిమ్ము కోరుటకు వచ్చితిమి.”

“మహాప్రభూ! నాకు సింహాసనాసీనత వలదు. నేను భగవద్ధర్మము పాలించుటయే ఈ దేవికి ఇష్టము అని నా నిశ్చయము. తమయాజ్ఞ కెన్నడు నెదురాడి ఎరుగని నేను నేడు మొదటిసారి ఈ మనవి చేసికొన సాహసించుచున్నాను.”

“సువర్ణశ్రీకుమారులను మేము కళింగాధిపతిగ జేయుచున్నాము. మీరును మా సంకల్పించిన సత్కారము స్వీకరింతురని అనుకొంటిని.”

“నా బిడ్డను సువర్ణశ్రీకి అర్పింప నిశ్చయించుకొన్నాను దేవా! మీ యాశీర్వాదమే నాకు సత్కారము.”

“హిమసువర్ణుల ప్రేమోదంతము కీర్తిగుప్తులవారు మాతో చెప్పి యున్నారు. పాటలీపుత్ర మహారాజ్యము మీది. మీరది ఏమిచేసినను మీ యదియ! మీబాలకరణమిండు, లేదా సువర్ణునకు....”

“ప్రభూ! ఎంత చక్కని ఉదారత మీది! సువర్ణునకే ఈ రాజ్యమిండు.”

“తథాస్తు.” చక్రవర్తి వెడలిపోయెను.

ఆ జాంబూనదవిగ్రహమును నవరత్నఖచితపూజాపీఠికపైన నుంచి చారుగుప్తు డా సింహాసనము ఎదుట పద్మాసనస్థుడైనాడు. 

15. వారణాసీయాత్ర

చారుగుప్తుడు స్వస్థచిత్తుడై కుసుమపురహర్మ్యమున హిమబిందు కుమారివసించు శుద్ధాంతములకు పోవలెనని అనుకొను సమయమున పరిచారికలు భయము గదురు మనసులతో వణకుచు అవనతవదనలై చారుగుప్తునికడకు విచ్చేసిరి.

చారు: ఏమి పని?

ఒకపరిచారిక: ప్ర.... ప్ర.... భూ! చారు: ఏమమ్మా వణకిపోయెదవు! కన్నుల నీరు నిండుచున్నది? భయములేదు. నీకు కావలయునది మనవిచేసికొమ్ము.

పరిచారిక: ప్రభు! హిమబిందుదేవి తాను వారణాసి వెళ్ళుచున్నాననిచెప్పి, బాలనాగితో, గోండురక్షకభటులతో రథముపై వెళ్ళిపోయినది.

చారు: (సువ్వున లేచి) ఏమీ! హిమబిందు వారణాసి వెళ్ళినదా?

చారుగుప్తుడు తన ప్రజాపతిమిత్ర విగ్రహమువైపు పదినిమేషములు అనిమిషుడై చూచినాడు. దగ్గరనున్న జేగంటను మ్రోయించినాడు. ఆ మ్రోత “జయ్” అని మ్రోగినది. వెంటనే ఇంద్రగోపు డచ్చటకు వచ్చినాడు.

ఇంద్రగోపుడు: ఏమి సెలవు స్వామీ?

చారు: హిమబిందుదేవి వారణాసిపోయినదట. ఆమెకు కావలిగా రెండువేల సైన్యము పంపుము. ఆమె వెళ్ళినజాడ తీయుము. నేనును వారణాసికి ఈ సాయంకాలము ప్రయాణము. ఆశ్వికులు వేయిమంది నా వెనుక వత్తురు. నారథము సిద్ధముచేయు మని అంచెలవారిని పంపుము. నా ప్రయాణము సిద్ధముచేయుము. ఇప్పుడ మామగారికి హిమబిందు కుమారి వారణాసికి పోయిన విషయము తెలియజేసి వారు నాతో వచ్చుటకు నా ఆహ్వాన మ౦దింపుము.

ఇంద్రగోపుడు నమస్కరించి “చిత్తము మహాప్రభూ!” అని వెడలిపోయెను. చారుగుప్తుడు పరిచారికలవైపు చూచి, “మీరు మా అత్త గారికి ఈ విషయము తెల్పుడు. ఆమెను గూడ నాతో ప్రయాణమునకు సిద్ధముచేయుడు. మీలో నలుగురును, తారాదత్తయు, దాదులు నాతోవచ్చుటకు సిద్ధము కండు” అని ఆజ్ఞనిడెను. “చిత్త” మని వారు వెడలిపోయినారు.

వెంటనే చారుగుప్తుని దర్శింప శ్రీకృష్ణసాతవాహనమహారాజు వేంచేసినారని దౌవారికుడు మనవిచేసెను.

చారుగుప్తుడు చిరునగవున త్వరత్వరగ సభాభవనమునకు వచ్చినాడు. శ్రీకృష్ణ సాతవాహన మహారాజు విచ్చేయగనే చారుగుప్తుని మంత్రులు, సేనాపతులు సగౌరముగ వారి నెదుర్కొని, తోడితెచ్చి సువర్ణాసనముపై నధివసింపచేసిరి.

చారుగుప్తుడు వచ్చుటయు మహారాజులేచి ఆయనకు నమస్కరించి, వారిచ్చు ప్రతినమస్కార మందుకొని, “దయచేయుడు!” అని చారుగుప్తుడు ప్రేమపూరితముగతన్ను ప్రార్థింప ఆసన మలంకరించెను. చారుగుప్తుడును దాపున నున్న దంతాసన మలంకరించెను. మంత్రులు, సేనాపతులు సభామందిరమువీడి వెడలిపోయిరి.

శ్రీకృష్ణసాతవాహన ప్రభువు చారుగుప్తుని జూచి, “చారుగుప్తుల వారూ! నేను మీయెడ దోష మాచరించితిని. అందులకు క్షంతవ్యుడను” అనెను.

“మహాప్రభూ! అది భగవంతుని ఇచ్చ! తా మెట్లు తప్పు చేయగలరు?”

“నేను ఒక మహాభాగ్యమును చేతులార త్రోసివేసుకున్నాను.”

“మహారాజా! తాము మనస్సున నేవిధమగు కించయును జారనీయకుడు. నాబాలిక సువర్ణశ్రీని ప్రేమించినది. సువర్ణశ్రీ యామెనుప్రేమించి వాడు. ఆమె ధర్మమున పరకీయ యైనది. నేను నాతల్లివిషయమున మూర్ఖుడనై సంచరించితిని. ఆమె యిష్టాఇష్టములు విచారింపనైతిని. శకటపందెమున విజయమందిన గిత్తలను తమకు బంగారు సంతరించిన బండితో సమర్పింపనెంచితిని. అది ఇంకొకదారి పట్టినది. విజయమందినది సువర్ణశ్రీ! అప్పుడు భగవానుడు నాకు జరుగబోవు విషయములు సూచించినాడు. అయినను మహామత్తతతో నేను భగవంతుడననినట్లు సంచరించితిని. నేనును, తమ్మంతమొందింప సంకల్పించిన స్థౌలతిష్యమహర్షియు ధర్మముచే పరాభవ మొందితిమి. తామును, విషకన్యయు, నా హిమబిందును, సువర్ణశ్రీయు ఏ మహత్తర దివ్యసంఘటన నెరప జనించినారో ఏరికి తెలియును? మీ నలువురి ఆనందమే నా ఆనందము. తాము తథాగతుని పరమకరుణతో వర్ధిల్లుదురుగాక!

“మీ అఖండానురాగము మన ఆంధ్ర ప్రథమునకు, సాతవాహనులకు అనంతాశీర్వాదము.”

శ్రీకృష్ణసాతవాహనుడు వెడలిపోయినాడు.

వారు వెడలిపోవుటయేమి కీర్తి గుప్తులవారు, ముక్తావళీదేవియు నచ్చటకు వచ్చినారు. కీర్తిగుప్తుడును, ముక్తావళియు నలుని వందనము లందుకొని యాశీర్వదించినారు. వారందరు లోనిమందిరమున కొకదానికి పోయినారు.

కీర్తి: నాయనా!

చారు: మామగారూ! మీరు చెప్పబోవు విషయము నాకు తెలియును. మీరు వెంటనే అత్తగారితో కాశీపురము ప్రయాణముకండు. హిమబిందు వారణాసి వెళ్ళినది.

ఇంద్రగోపుడు వచ్చి సువర్ణశ్రీ మూడుదినముల క్రిందటనే వారణాసి వెళ్ళినట్లును, అతని వెదకికొనుచు హిమబిందుకుమారి, మహా రాజపథమువెంట ఆశ్వికులైన గోండు సైనికులు వెంటరా బాలనాగితో రథముపై కాశీపురము వెడలినట్లును విన్నవించినాడు.

కీర్తిగుప్తుడు అల్లునితో “నాయనా! మనము వెనువెంటనే వెళ్ళవలయును. వినయభిక్కులవారును మనతో వచ్చునట్లు చేయవలయును. ఆ పనిలో నే నుండెదను. వర్జములేకుండ బయలుదేరిపోదము. మీ అత్త గారును మనతో వచ్చును” అని తెలిపినాడు.

వారిరువురు వెంటనే తమభవనము చేరిరి. కీర్తీగుప్తుడు సముచిత వేషుడై రథ మారోహించి కోటలోనికి శ్రీకృష్ణసాతవాహనుని మహా భవనమునకు బోయినాడు. కీర్తిగుప్తుడు మహారాజును దర్శింప ననుమతి వచ్చుటయు, వారు లోనికి బోయిరి. శ్రీకృష్ణుడు సగౌరవముగ నాయన నెదుర్కొని ఆసన మధివసింప గోరి తానును అధివసించెను.

“వర్తకచక్రవర్తీ! తమ రాకకు కారణము?”

“మహాప్రభూ! సువర్ణశ్రీ రాజభక్తిచే వారణాసి పోయినాడు.”

“అదేమి స్వామీ!”

“తాము హిమబిందుకుమారిని ఉద్వాహ మగుదురని యాతడు భావించినాడు.”

“అవును. ఆతడు హిమబిందుదేవిని ప్రేమించినాడు. ఉత్తమ శిల్పి. ధీరోదాత్తుడు. అతిరథశ్రేష్ఠు డా యువకుడు. ఆత డిచ్చట నుండుట, మా వివాహమునకు ప్రతిబంధక మగునని తలపోసి వెడలిపోయినాడు.”

“ఈ విషయమే మనవి చేయవలెనని వచ్చినాను మహారాజా!”

“స్వామీ! ఇందు మా కర్తవ్య మొకటి యున్నది. మేము ప్రార్థించినగాని సువర్ణశ్రీ హిమబిందుకుమారిని వివాహమాడుట కియ్యకొనక పోవచ్చును. మీరు వెంటనే పోయి ఆ మహాభాగుడు ఏవిధమగు తొందర పడకుండ చూడుడు. మేము మీ వెనువెంటనే వత్తుము.” కీర్తిగుప్తుని భావమును అదియ. ఆయన శ్రీకృష్ణుని వారణాసి రండని ఎట్లు ప్రార్థింపగలడు? ఉన్నవిషయమును మనవి చేసికొన్నచో శ్రీకృష్ణప్రభువు గ్రహింప గల్గుననియే కీర్తిగుప్తుడట్లు చేసినాడు.

శ్రీకృష్ణసాతవాహనప్రభువు కాశి కేగి సువర్ణశ్రీని కోరుటలో మహత్తరార్థము సువర్ణశ్రీకి గోచరించును. శ్రీకృష్ణప్రభువు రాకపోయినచో ఎటులనో సువర్ణుని పాటలీపుత్రము గొనివచ్చి యువరాజుతో చెప్పింప దలచెను.

కీర్తిగుప్తుడు సెలవునంది వెడలిపోయెను.

16. దుర్భరావేదన

యుద్ధము లన్నియు పూర్తియైనవి. తన ఆంధ్రచక్రవర్తి సకల జంబూ ద్వీపమునకును, చతుస్సముద్రవలయిత భూలోకమునకు చక్రవర్తి యైనాడు. ఈ మహాచక్రవర్తి చల్లనిపాలనమున లోకమున సర్వధర్మములు పరమశాంతితో సమన్వయింప బడుగాక! సర్వకళలు ఉత్తమాశయముల తేజరిల్లుగాక! సర్వ దేశములు దివ్యసుఖము లనుభవించుగాక! సర్వ ప్రజలు నీతిదూరులుగాక, ద్వేషరహితులై చతుర్విధపురుషార్థపరులై వృద్ధి నందుదురుగాక! సువర్ణశ్రీ పాటలీపుత్ర మహాచైత్యముకడ ధ్యానములో బుద్ధభగవానుని అర్చించుకొన్నాడు.

ఇంటికడ పది ముహూర్తములైన ఉండలేడు. నాగబంధునికా సమదర్శుల ప్రేమ తన కానందము సమకూర్చినది. వేదనయు నధికముచేసినది. దూరమున నుండియైన హిమబిందుదేవిని చూడవలె నను కాంక్ష. ఆ కాంక్ష దోషపూరిత మని దుర్భరవేదన!

తన గురువు సోమదత్తాచార్యుని దర్శించును. వారితో ఏవేవియో చర్చించును. మనస్సు మాత్రమెక్కడనో యుండును. “ఏమి సువర్ణశ్రీ! నీవు మాటలాడుచుంటివి. నీవుమాత్ర మిచ్చటలేవు” అని సోమదత్త ప్రభువు పలికి పక పక నవ్వును. సోమదత్తునకు శిష్యునిహృదయము పూర్తిగ అవగతమైనది. ఈ విచిత్ర సన్నివేశ సంక్లిష్టత నెట్లు తాను మాత్రము విడదీయగలడు? తన శిష్యుడు ఈ మారదేవ మాయనుండి తానే తప్పించుకొన వలయును. సువర్ణుని నిట్టూర్పులు సోమదత్తుని హృదయమును గలంచును. సువర్ణశ్రీ ప్రాణమిత్రుడైన మహాబలగోండు యువరాజుతో కలిసి శిల్పదర్శనము చేయును. శిల్పశాస్త్రములు చర్చించునుగాని, మహాబలుడు తన ప్రియమిత్రుని హృదయాంతరమున ఏదియో మహాబాధ విషరోగమై విజృంభించినదని గ్రహించినాడు.

“అన్నా! మనకు కాని ఫలము దివ్యమైనను, మన జీవితమునుండి యా వాంఛను తొలగించుకొనవలదా?”

“అవును! నిస్సందేహముగ అట్టివాంఛను నాశనము చేసి తీరవలయును. లేనిచో ఆ మనుష్యుడే నాశనమైపోవును తమ్ముడూ!”

“అయినచో నీ వేల ప్రయత్నము చేయవు?”

“ఆ ప్రయత్నమే చేయుచున్నాను. నేను విజయము నందితీర వలయును. లేనిచో నాశనమై పోయెదను.”

“నీవు నాశనమైపోయి ఏమి లాభము?”


“ఎవరికి లాభము?”

“లోకమునకు!”

“నేను నాశనమైన లోకమునకు నష్టమేమి తమ్ముడూ?”

“పారిజాత కుసుమమునే
వాంఛించిన యొక భృంగము
సిద్ధిగనక నశియించిన
చేటేమీ లోకమునకు?
అమృతమునే వాంఛించిన
అహిపతి యొక డాశ చెడియు
నశియించిన చేటేమీ
నరనారుల కావంతయు?”

“అటు లనుటవలన జీవితము నెదుర్కొనలేని నీరసత్వమే తెలియ జేయును గాని....”

“అయిన భయమేమి?”

“మరల నీవు జన్మించి కర్మ దుర్విపాకము చెల్లించవలయునుకాదా”

“కర్మ అనంతము చేసికొందుమనుకొనుము. అప్పుడు ఏమి యగును?”

“అనంతముగ దుఃఖము నందుచుందువు.”

“దుఃఖము, ఆనందమునకు కావడికుండ. దుఃఖమైన, ఆనందమైన నేమి? రెండును ఒకటియ!”

“అది యందరకు తెలియును. ఈ వేదాంతవిచారము మన మనుకొన్న కార్యములు జరుగనప్పుడు వచ్చునేమి? మనవాంఛలు తీరనప్పుడు లోక మంతయు దుఃఖమయ మగునేమి? బాగుగా చదువుకొంటివే? అదియకాబోలు ఆర్షధర్మము, బౌద్ధధర్మము బోధించినది! మా ఆటవిక జాతులు జీవితము నెదుర్కొనుటలో ఇట్టి మెట్టవేదాంతపు మాటలు మాటలాడరు సుమా!”

“తమ్ముడూ! నన్నేమి చేయుమందువు?”

“నీవు ప్రపంచ శిరోమణివి కాదగిన శిల్పివి. శిల్పము సృష్టి. చతుర్విధ పురుషార్థదాయిని. మానవుడు తన వాంఛలను దివ్యము లొనర్చు కొన్నప్పుడే ఉత్తమ శిల్పి యగునన్న విషయము పెదనాయనగారు నీకు బోధించలేదా? నీవు నిజమగు విశ్వబ్రహ్మవై విరాట్ సృష్టిని చేయవలయును. ఆ శిల్పమంతయు లోకమునకు లేకుండ చేయుదువా? నీ వర్పించు శిల్పము నిన్ను నిర్వాణపథమునకు గొనిపోదా? ఇవి నీకు నేనా తెల్పవలసినది అన్నా! పో! దేశసంచారము చేయుము. అర్హతులకడ, మహర్షుల కడ శిల్పరహస్యముల నెరిగిరమ్ము.”

మహాబలగోండ ప్రభువు తనహృదయములోని యాలోచనలనే మాటలలో పైకి తెలిపినాడు. ఆశయసౌందర్యము నిర్వాణపథము. అది నశ్వరమగు భౌతికసౌందర్యము కాదు. భౌతికసౌందర్యము పరమావధి యైనను మానవునికి దుఃఖము కలుగజేయుటకే యగును. సువర్ణశ్రీ యాత్రలు సలుప తల్లిదండ్రులయనుమతి గోరినాడు. ధర్మనందియు, శక్తిమతీదేవియు సువర్ణశ్రీచరిత్ర తెలిసికొనియుండిరి. వారు ఆతని నాశీర్వదించిరి.

వెనుకనే హిమబిందునకు మహాబలగోండుని యనుమతితో నూరుగురు గోండువీరులను అంగరక్షకులుగ సువర్ణశ్రీ ఇచ్చియుండెను. వారిని హిమబిందు యువరాణి యగువరకు నా దేవికడనే యుండవలయునని గోండుయువరాజుతో తెలిపి సువర్ణశ్రీ యాత్రాభిముఖుడై బయలుదేరి పోయెను.

అతడు ప్రథమమున కపిలవస్తునగరము చేరెను. అచ్చట బాలుడగు సిద్ధార్థదేవుని మనమున ప్రత్యక్ష మొనర్చుకొనెను. అచ్చట విహారమున మాయాదేవి స్వప్నము, ధవళదంతావళము ఆమెగర్భమున జొచ్చుట, లుంబినీ వనమున తథాగతుని జన్మము, ఆ బోధిసత్వుని జాతకము వ్రాయుట చిత్రించినాడు. ఆనాటి యాచారముచొప్పున సమంతభద్రుని మూర్తిగా చిత్రించక, పాదములు, ధర్మచక్రము, ఛత్రము, పూర్ణకలశము చిహ్నలుగా చిత్రించెను.

కపిలవస్తునుండి సువర్ణశ్రీ లుంబినీవన సంఘారామమునకు బోయినాడు. అచ్చటనుండి మధురానగరము పోయి, వెనుకకు మరలి సువర్ణశ్రీ కాశీపురమువచ్చి మృగవన సంఘారామము చేరినాడు.

ఆ సంఘారామ కులపతి మహాశిల్పి ధర్మనందిపేరు వినియున్నాడు. ఆతని కొమరుడు సువర్ణశ్రీ యని ఎరింగి ఆనందమున సువర్ణశ్రీ తలపై చేయివైచి “కుమారా, మా సంఘారామచైత్యవిహారముల నలంకరించి జగదద్భుతముగ నొనర్పుము” అని ఆశీర్వదించినాడు.

సువర్ణశ్రీ తనవిడిదికి వెడలిపోయినాడు. అవును, అటులనే తా నొనర్చును. శిల్పము, చిత్రలేఖనము ఆ విహారము లన్నియు నల్లుకొని పోవుగాక! చైత్యములు పవిత్రమైన పూజాలయములయిపోవుగాక యని హృదయమున మహాశ్రమణకునకు నమస్కృతి యర్పించెను.

17. అమృతకన్య

అమృతపాదులబుద్ధిలో రెండు మహాప్రవాహములు సంగమించినవి.

ఒకటి - చిన్ననాటినుండి స్థౌలతిష్య మహాద్రిజనితమై, వేగవంతమై, ఆదిని చిన్న శైవాలినీరూపమున, పోనుపోను మహానదియై ప్రవహించిన నందిదత్తజీవితము, ఆతని సంస్కారము, ఆతని జ్ఞానము, ఆతని విద్యయును, రెండు - గంగానదీజనితమై, ఆనందాశ్రమ పోషితమై, ఆనందాశ్రమ కులపతి ప్రజాపతి కాశ్యపాచార్యబోధితమై, ప్రవహించి ధాన్యకటక సంఘారామ కులపతియైన, అమృతపాదార్హతుల జీవితము, ఆతని సంస్కారము, ఆతని జ్ఞానము, ఆతని విద్యయును.

రెండును నేడు స్థౌలశిష్యునిదెబ్బతో, శస్త్రవైద్యముతో పర్వతముల ఛేదించుకొని సంగమించినవి.

ఒక నది ధవళదేహ ఒక నది నీలశరీర, ఈనాడు రెండును కలిసి ఏమియగును? ఆతడు బౌద్ధుడా, వేదవతుడా? ఆతడు సన్యాసియా, విధురు డైన గృహస్థా?

మానవధర్మము, మానవాతీతధర్మము నాతనిలో సంఘర్షణకు బాల్పడినవి. రెండు చిత్తసంస్కారములు అమృతపాదులను కలతపెట్టినవి. ఆరోగ్యము కుదిరి ఇటునటు నడయాడుచున్న దినములలో స్థౌలతిష్యులు తన కుమారుని జాగరూకతతో గమనింపుచుండెను. చక్రవర్తి వచ్చెను. చారుగుప్తుడు, శ్రీకృష్ణసాతవాహనుడు, అచీర్ణుడు, స్వైత్రుడు, ధర్మనంది, మహారాణి ఆనందాదేవి, శక్తిమతీదేవి, నాగబంధునిక, అమృతలతాదేవి, ముక్తావళీదేవి, సమవర్తి, కీర్తిగుప్తుడు, అనేకులు ఆంధ్రపల్లవాధరలు, పురుషసింహములు అమృతపాదులను దర్శింప వచ్చుచుండిరి. అనేకు లీ విచిత్రము చూడవచ్చుచుండిరి.

“ఏమి విడ్డూరము! ఈ అద్భుత సంఘటన ఎట్లు జరిగినది? తన కుమారుని ఈ మహర్షి ఎట్లు రక్షించుకొనినాడు?” అని స్థౌలశిష్యునకు, అమృతపాదులకు నమస్కరించుచు వేలకొలది జనులు, బౌద్ధులు, భిక్షుకులు, బ్రాహ్మణులు, సన్యాసులు దర్శనము చేసికొని వెళ్ళుచుండిరి.

స్థౌలతిష్యుడుగూడ నీ యద్భుతఘటనచే ఆలోచనలో పడెను. తన పుత్రు డేల బౌద్ధుడైనాడు? ఆతనికి పూర్వస్మృతి పోవుటయేమి? ఆతడు మరల ఆరునెలలో సర్వశాస్త్రములు నేర్చుకొనుట యేమి? బౌద్ధ సన్యాసి యగుట ఏమి? అర్హతుడై, కులపతియై తన చరితమువలన, మహోత్తమబోధవలన ఆంధ్రదేశమున బౌద్ధధర్మము విరివిగ వ్యాపింప జేయు టేమి? సహజప్రతిభచే, సహజ సత్యశాంతి శీలముచే, పరమకరుణా పూరిత హృదయముచే ప్రజల కోటానుకోట్లుగ నాకర్షించినాడు. బుద్ధుడే మరల నవతరించినాడని ప్రజ లనుకొందురట. తనకర్తవ్యమేమి?

తనపుత్రుడు ఆర్యధర్మము వీడనట్లా, వీడినట్లా? పూర్వస్మృతి లేనప్పుడు, సంపూర్ణజ్ఞానము లేనట్లు కాదా? అట్టివాడు బాలకుడే యగును. బాలకుడు స్వధర్మ మెట్లు వదులుకొనును? పరధర్మ మెట్లు గైకొనుట యగును?

అమృతపాదులకు లంబికాయోగము వదలి పూర్తిగ మెలకువ వచ్చినంతట ఏదియో అనుభూతి, ఏదియో మహాస్మృతి కలిగినది. తాను నందిదత్తుడు. తండ్రికడ వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, దర్శనములు, సూత్రములు, ధర్మశాస్త్రములు, జ్యోతిషాది షట్ఛాస్త్రములు-వీనియన్నిటిలో మహాపండితు డైనాడు. తమ నివాస మగు కాశిలో ఒకనాడు తాను, తనభార్య, తనచిన్నబిడ్డ, తనతండ్రి, తనతల్లి వ్యాసకాశి పోవుచుండిరి. గంగానది వేగముగా ప్రవహించుచుండెను. గాలి వీచినది. అనేకములగు పడవలును దాటుచుండెను. ఇంతలో తమ పడవయు, వేరొక పడవయు తారసిల్లి గట్టిగ కొట్టుకొన్నవి. తమపడవ మునిగిపోయినది.

ఆ వెనుక తన కేమియు స్మృతిలేకపోయినది. తనతండ్రి తన్ను కొట్టి, శస్త్రవైద్యముచేసి, తనకు పూర్వస్మృతి తెచ్చినాడు.

ఎంతవిచిత్రము! నీటి లోబడిన తన్ను పాటలీపుత్రపురమున కెగువను, ఆనందాశ్రమతీరమున గంగలో నుండి భిక్షుకులు పైకితీసినారు. తాను విద్యలు నేర్చుకొనెను. పలుచని తెరవలెనుండిన స్మృతివెనుకనుండి చదువులుమాత్రము వచ్చినవి. అచ్చటనుండి తాను బౌద్ధ సన్యాసి యాయెను. అర్హతు డాయెను. తనభార్య ఉత్తమాంగన, మహాసాధ్వి కనబడ దేమి? తమ యను రాగము ఎంత ఉచ్ఛస్థితిని నడచినది? తనబిడ్డ చంద్రబాల వెన్నముద్దల తల్లియై, బంగారుబాలయై మాటల నప్పుడే నేర్చుచున్నది. తనతల్లి అపర లోపాముద్ర, ఉత్తమ చరిత్ర ఏమయినది? వీరంద రేమయిరి? ఎవరును కనబడలేదు. తండ్రియొక్కడే రక్షింపబడినారా?

ఈ ఆలోచనలతో అమృతపాదులు తండ్రికడకు బోయి “నాయనా అమ్మ ఏమయినది? చంద్రబాలయు, మీ కోడలును ఏమయిరి?” అని ఆతురతతో ప్రశ్నించెను.

“నాయనా! నీతల్లి పదిరెండేళ్ళ క్రిందట మరణించినది. ఎంత చదువుకొన్నది అయిననేమి? కుమారుని స్మరింపని దినము లేకపోయిన దామెకు. పేరు తలచుకొనుచు, చిక్కి శల్యమై, పదియేడులు ధైర్యమున ఈ లోకమున నుండి, దేహము చాలించినది. మనపడవ మునిగినవెంటనే నేను తేలి ఈదుచు, నీబిడ్డను, కోడలిని బ్రతికించుకొంటిని. మీ యమ్మను మనపడవకు తగిలిన పడవ నావికుడొకడు రక్షించినాడు. నీవుమాత్రము కనబడవైతివి. బిడ్డను హృదయమునకు గట్టిగ అదుముకొనియే నీభార్య మునిగిపోయినది. ఆమె మూర్ఛపోయినది. ఆమెను ఒక పడవలోని కందిచ్చి, నీకై యా మహానదిలో వెదకితిని, వెదకితిని. అనేకులు వెదకిరి. నీవు దొరకలేదు. తండ్రీ! గంగఒడ్డుననే శిష్యు లనేకులు వెదకిరి. పడవల మీద పోయి వెదకిరి. నీకు లంబికాయోగము నేర్పినందుకు, నీవు వెంటనే ఆ యోగము ప్రాణరక్షణార్థము సంధించితివి కాబోలు! నీభార్య నీకై బెంగగొని, మూడేడులు కృశించి, నీ దేవతార్చన మంజూషను పూజ సేయుచు ఒకరోజున నీకూతు నా కప్పగించి ప్రాణము విడిచినది. చంద్రను మీయమ్మ కొంతకాలము పెంచినది. ఆ బాలికకై బ్రతికి, తుదకు ప్రాణము వదలినది.”

“ఓహో! ఎట్టి విధిసంఘటనము! చంద్ర ఏది తండ్రీ?”

“చంద్ర నీకు కావలయునా?”

“నాకు కావలయునని చెప్పలేను, అక్కరలేదనియు చెప్పలేను. నా చిత్తము పరిపరివిధముల పోవుచున్నది.”

“ఓయి వెఱ్ఱివాడా! నీవు సన్యాసివి కావు, బౌద్ధుడవుకావు. నీవు స్వచ్ఛమగు ఆర్షధర్మజీవివి. ఈ మధ్యజీవిత మంతయు కలవలె వచ్చినది, కలవలె పోయినది.”

“మీమాటలు నేను వెంటనే ఆమోదింపలేను. నాజీవితము ఒక్కసారిగా రెండు నదులుగా చీలి మరల కలుసుకొనినది. కావున నా ఆత్మలో నే నొక నిశ్చయమునకు రావలెను. నేను ఆలోచింపగ విషకన్యయే చంద్రయని నాకు నిశ్చయము కలుగుచున్నది. ఆమె తమపౌత్రిక నని నాతో చెప్పినది. తనతండ్రి నదిలోపడి చనిపోయినా డనియు తెల్పినది. తండ్రి, మహర్షి ఆమెనేనా మీరు విషకన్యను చేసినది?” 

18. నిర్వికల్పపథము

కుమారుడు ఎప్పుడు తన్ను “తండ్రీ, మహర్షీ! ఆమెనేనా మీరు విషకన్యను చేసినది?” అని ప్రశ్నించినాడో, ఆ వెంటనే తాను పాతాళమునకు క్రుంగిపోయినట్లు భావించుకున్నాడు స్థౌలతిష్యుడు. కుమారునకు బ్రతి వచన మీయక కన్నులు నిమీలితము చేసెను. ఈ బాలికను కాకపోయిన, వేరొక బాలికను విషకన్యను చేయవలయును కదా! ఇతర బాలికలను చేయుట కంటే తనబాలికయే విషకన్య యగుట యుత్తమముకదా!

విషకన్యకాప్రయాగము ఉత్తమధర్మమా? ఏల కాదు? తా నధర్మ మెట్లు చేయగలడు? మఱి ధర్మమైనచో అట్టి కార్యము విఫలమగునా? అమృతపాదులు తండ్రిముఖము గమనించెను. తనలో ఒక విశ్వాంభోధి మథన మగుచున్నది. ఆతడు తండ్రి ఎదుట పద్మాసనాసీనుడై, యోగాసనబద్ధుడై నిర్వికల్ప సమాధిలోనికి పోయినాడు. అటు స్థౌలతిష్యుడును సమాధిలోనికి పోయెను.

రెండును నిర్వకల్పములే. నిర్వికల్పము రెండురూపుల నెట్లుండును? అందు వారిరువురును లయమైరి. వారి ఆత్మలు రెండును ఒకటై, ఆ ఏకత్వము విశ్వమున లయమై, సర్వమును నిత్యమున లయమైనది. ఇరువురును ఒక్కసారి ప్రపంచమునకు దిగిరి. వారికి మాటలురావు. బుద్ధుడు నిజము. శ్రీకృష్ణ భగవానుడు నిజము, శ్రీకృష్ణుని భక్తుడు వ్యాసుడు నిజము. బుద్ధుని భక్తుడు ఆనందుడు నిజము. ఈ ఆలోచన వా రిరువురకు ఒక్కసారి తట్టినది.

స్థౌల: భిక్షూ! నిర్వికల్పపథగాములమైన మే మేమి, నిర్వాణపథ గాము రగు మీ రేమి ఒక్కరమే! దిగువ మీదారి మీది, మాదారి మాది. విషకన్య అమృతకన్య యగును. ఆమెను శ్రీకృష్ణుడు వివాహమాడును. వారి వంశము మహాసామ్రాజ్యభారము వహించుగాక!

అమృత: మహర్షీ! అనిత్య, అనాత్మ, నిర్వాణము లను ముఖ్య సూత్రము లేమి, అనిత్య, ప్రత్యగాత్మ బ్రహ్మసాయుజ్యమను ముఖ్య సూత్రము లేమి, రెండును ఒకటియ! ఆర్యధర్మమే వేదములు. ఆర్య ధర్మావతారమే బుద్ధుడు. జనకరాజర్షికి బిమ్మట శ్రీకృష్ణావతారము, వేద వ్యాసుల పరిణతియే బుద్ధావతారము.

స్థౌల: ఈ విశ్వాతివిశ్వములో సూక్ష్మరూపమేగాని, స్థూలమైగాని, సత్యమై, నిత్యమై, సర్వాతీతమై, సర్వజ్ఞానపూర్ణమై, సర్వశక్తియుతమైన బ్రహ్మపదార్థము లేదు. విశ్వములో స్పర్శలు, భావములు, వికారములు పొందుచుండును. అందుండి మరియు గాఢమైనవి మనుష్యభావములై పరిణమించును. అవియే శరీరము లగును. అవి నశ్వరములేకాని వట్టి మాయకావు. అంతియకాని మాయాచ్ఛాదితమైన బ్రహ్మము ప్రత్యగాత్మత్వ మందుట అసత్యమని బుద్ధుడు ప్రవచించినాడు. ఆత్మభావమే సకలదుఃఖములకు హేతువందురు. బుద్ధు డట్లు చెప్పినంతమాత్రమున పరమాత్మ అసత్యము కాదు. పరమాత్మ లేనిమాట సత్యమైనచో ఉన్నదన్న మాత్రమున అది యుండదు. మీ దారి ధర్మపరము, మా దారి ధర్మపరము. మీలో అనధికారులు బుద్ధధాతువును నిక్షిప్త మొనర్చి, స్థూపమని, చైత్యమని దానిని పూజ లొనర్తురు. “బుద్ధం శరణం గచ్చామి” అందురు. మాలో అనధికారులు పూజలు, భక్తి, యోగము, యజ్ఞము, యాగము మొదలగునవి చేయుదురు. వీనితో నేమి పోనిమ్ము! ఉత్తమచరిత్రయే ఎల్లరకు శిరోధార్యము.

అమృత: ఆర్యా! ఈ దినములలో ఈ విశాలప్రపంచమున ఎన్ని ఆత్మ విచారణలు లుద్భవింపలేదు? సంజయవైఠ్ఠిపుత్రవాదులు ఆత్మ లేదందురు. విశ్వజ్ఞానము మానవున కెప్పుడు అలభ్య మందురు. అజితకేశ కంబళీమతస్థులు ఆత్మ లేదందురు. మనుష్యుడు చాతుర్భూతాత్మక మందురు. పూర్ణకాశ్యపులు ధర్మము వలదు, అధర్మమువలదు పాపపుణ్యములులేవు అందురు. మస్కరి గోశాలజులు, అజీవకులు కర్మలేదని, మనుష్యునికి అధికారము లేదని అందురు. అంతయు నియతమే అందురు. మహాజిన మతము నంతియకదా! ఆత్మ లున్నవని మహా వీరుడు బోధించెను. ప్రత్యగాత్మ చావుతో నంతము కాదనెను; పరకాయప్రవేశమున్నదనెను; పుణ్య పాపములు ఉన్నవనెను. పాపములు చేయువాడు హీనజన్మ మెత్తుననెను; పురుగులు, వృక్షములు, రాళ్ళజన్మముల నెత్తు ననెను. మోక్షమునకు దారి సంసారత్యాగము, కర్మరాహిత్యము, అహింస, చివరకు ప్రాయోపవేశము అనెను. ఇట్టి మతములు మనుష్యులున్నంతకాలము ఉద్భవించును. సత్యము మానవునకు లభ్యమే! అతీత మనునది మేము ఒప్పము కాని నాలో రెండు నదులు సంగమించి అనేక విచత్రమహాభావములు రూపెత్తుచున్నవి. పరమ పవిత్రమైన వేదధర్మము, బుద్ధధర్మము రెండును నాలో నిడుకొని తపస్సునకు పోదును. నే నేమి కనుగొనెదనో!

స్థౌల: స్వామీ! మీ పూర్వాశ్రమరూపమైన నాపుత్రుని ఆశీర్వదించుచున్నాను. మిమ్ము “నారాయణ” మహానామమున సాగనంపుచున్నాను. నాకు అద్భుతానందము విశ్వమునుండి సూక్ష్మాతిసూక్ష్మమై, బ్రహ్మమై దర్శన మిచ్చునున్నది. ఈ అమృతత్వమే సర్వము నిండును. అదిగో చంద్ర!

ఇంతలో స్యందన మెక్కి విషకన్య అచ్చటకు వచ్చినది. విష వైద్యులు, ఆయుర్వేదరులు, విషవేత్తలు, మంత్రవేత్తలు కూడ నుండిరి.

విషకన్య పరుగునవచ్చి తాతగారి కాళ్ళకడ సమాలింగిభూతల యైనది.

అమృతపాదుల కన్నులు చెమరించినవి. స్థౌలతిష్యు లామెను ఒడి లోనికి తీసికొని, తల్లీ! నీ దివ్యచరిత్ర విషాతీతమై ప్రేమమయమైనదా? నీ విషము అమృతమే అయినదా! నీవలన సర్వలోకములు జయింప బడినవా? తల్లీ, అరుగో ఆ మహానుభావుని ఎరుంగుదువా?” అని ఆనందమున ననెను.

విషకన్య: అమృతపాదార్హతులు, నాగురువులు తాతగారూ!

స్థౌల: వారు నీకు ఏమిగా కనబడిరి?

విష: వారిని చూచినప్పుడు నిన్ను చూచినట్లయినది. వారును, నీవును ఒకటయిరి. వా రెవరు తాతయ్యా?

స్థౌల: తల్లీ! ఆయన నీ తండ్రి, ఆ తండ్రిని చిన్నతనమున పోగొట్టుకొంటిని నే డాతడు మహర్షియై నాకడకు వచ్చినాడు.

స్థౌలతిష్యుని శిష్యుడొకడు కొన్నిమాత్రలను అమృతపాదుల కిచ్చెను. వేరొక మాత్రను విషకన్యచే సేవింపజేసెను.

స్థౌలతిష్యుడప్పుడు కంఠమెత్తి,

“శుక్రం తే అన్య ద్యజతంతే అన్వద్విషురూపేఅహనీ ద్యౌరివాసి!
విశ్వహిమాయా అవస్విధావో భద్రాతే పూష న్నిహరాతి రస్తు”

అని సూర్యమంత్రము పఠించెను. బ్రాహ్మణులందరు కంఠములు గలిపిరి.

ఇంతలో చక్రవర్తియు, శ్రీకృష్ణసాతవాహనుడు, మహారాజ్ఞి అందరును వచ్చి స్థౌలతిష్యునకు, అమృతపాదులకు నమస్కరించిరి.

విషకన్య తండ్రికడకు పోయి నమస్కరించినది. అమృతపాదు లామెను అక్కున చేర్చుకొని, మూర్థమున ముద్దిడి “తల్లీ! నీవలన నాకు బూర్వజ్ఞానము వచ్చినది. నాతండ్రి, నీ తాతగారు ప్రేమస్వరూపులైనారు. నీవు అమృతకన్య వగుదువు. నీవు ప్రేమించిన ఈ శ్రీకృష్ణమహారాజునే చెట్టపట్టుము” అని ఆశీర్వదించెను. శ్రీకృష్ణసాతవాహనుడు: స్థౌలతిష్యమహరీ! తాతగారూ! ప్రథమమున నన్ను చిరంజీవ అని ఆశీర్వదించితిరి. అదియే నిజము. తమ బాలికను నాకు ప్రసాదింపుడు.

స్థౌల: మహారాజా! నానోటినుండి మొదటవచ్చినదే సత్యము. నీ ప్రియురాలు మృత్యుంజయుని శరణ్యమునే పొందినది. ఇంక మీతండ్రి ఆంధ్ర చక్రవర్తిని, సకలజంబూ ద్వీపమునకు చక్రవర్తిగా నేనే ఈ పాటలీపుత్ర సింహాసనమున అభిషేకింతును. మీ మామగారును అభిషేకింతురు. ఇంక ఆరునెలలలో చంద్రబాల అమృతకన్య యగును. నీవామె నప్పు డుద్వాహ మగుదువుగాక!

అందరు తథాస్తనిరి. చక్రవర్తి స్థౌలతిష్యుని కడ మోకరించెను. 

19. విషకన్యకా శ్రీకృష్ణులు

విషకన్యక తాతగారి ఆశ్రమమునందే వాసముచేయ శ్రీకృష్ణుడు పంపించెను. ఆమెను గగనియు, కాశ్యపియు, అగస్తియు కలుసుకొని హృదయమార కౌగిలించుకొనిరి. ఆ పుణ్యబాలకును వారికిని కన్నులనీరు తిరిగినవి.

స్థౌలతిష్యునకు ఇన్ని సంవత్సరములు అణగియుండిన ఆపేక్ష నేడుపొంగి వరదలై ప్రవహించినది. జడభరతునకు కురంగశాబకముపై ప్రేమ పూర్వకర్మ వశమున నదియై ప్రవహించినట్లు, నేడు మనుమరాలిపై ప్రేమ మిన్నుముట్టినది. ఇన్ని సంవత్సరములు తన మనుమరాలిని భయంకర మారణయంత్రముగ సిద్ధముచేసినాడు. కర్కశహృదయుడై బౌద్ధ జిన ధర్మనిర్మూలన మొనర్ప సంకల్పించిన యా వృద్ధునకు నేడు ఆ యావేశ మెల్ల సూర్యకిరణస్పర్శమాత్రమున విరిసిన మంచువలె మాయమైనది.

మనుమరాలే తనకు దేశికత్వము వహించినదా యని యా తపస్వి తలపోసినాడు. శాంతిజ్యోత్స్నావిలసితమూర్తియై, సౌందర్యశ్రీ విలసితమై అగస్తీ గగనీ కాశ్యపీ మధ్యస్థయై, కృష్ణాజినాసనయై యున్న యా బాలికను జూచి స్థౌలతిష్యుడు విశ్వామిత్రునిబారినుండి రక్షింపబడిన నందినీ ధేనువును జూచిన వసిష్ఠ మహాఋషి వలె ఆనందపూర్ణహృదయు డయ్యెను.

విశాలములైన యామెకన్నుల కోటి తారాద్యుతులు వెలుగు నిర్మల యామినీ కాంతులు నృత్యము చేయుచున్నవి. ఆమె మోమున బాలికారేఖలు పోయి క్షీరనదీరేఖలు వికసించినవి. అడవి దొండపండువంటి యామె పెదవులు క్షీరసముద్రమున శ్రీమన్నారాయణశయనీయ పూర్ణకమల పరిసర జనిత సరోజ కుట్మములై అమృతస్విన్నములైనవి.

స్థౌలతిష్యమహర్షిసంకల్ప మీనాడా బాలికను అమృతకన్యను చేసి, శ్రీకృష్ణ సాతవాహన ప్రభువున కుద్వాహ మొనరింపవలయు ననియే! వేదమంత్ర ద్రష్టలైన మహాఋషుల పావిత్ర్యమే జంబూద్వీపమును సకల ధర్మసంయుక్తను జేయుచుండును. ఏ మహావీరుడో, ఏ గౌతమబుద్ధుడో జనించి, వేదధర్మమందలి భిన్నభావముల ఒక్కొక్క కాలమున విలసిల్ల జేయుగాక! అందేమి దోషమున్నది? అమృతకన్య యగు విషకన్యకా ప్రభావమున సాతవాహనమహారాజులే యజ్ఞయాగాది క్రతువు లొనర్తురు. వారు సర్వధర్మ ప్రవర్తకులగుదురుగాక యని సంతుష్టుడైనాడు.

విషకన్య చంద్రబాలయే యైనది. ఆమె గగనితో తాంత్రికముల చర్చించును, కాశ్యపితో దార్శనికములు వాదించును, అగస్తితో త్రయీ గతములగు మహాసత్యముల విచారణచేయును. అమృతములైన దివ్యోషధుల సేవించును పూర్ణవికసితములగు అంగములకు, విషపువిరుగుడు తైలముల పూయించుకొనును. ఆమె దినదినము పూర్ణిమోన్ముఖమైన చంద్రబింబమువలె తేజస్సును తాల్చుచున్నది.

ఆమె వీణియపై ఆనందగీతము లాలపించుచు దినదినము తన్ను చూచుటకు వచ్చు ప్రియునిరాకకై ఎదురు చూచుచుండును.

కీర్తిగుప్తుడు తనకడకు వచ్చి వెళ్ళిన సాయంకాలము శ్రీకృష్ణ సాతవాహన మహారాజు చక్రవర్తి దర్శనము చేసికొనెను.

“మహాప్రభూ! సువర్ణశ్రీప్రభువు వారణాసి మృగవనసంఘారామానికి వెడలిపోయినాడు.”

“అవును కుమారా! మీరు మా ప్రతినిధులుగా నేగి సువర్ణశ్రీప్రభువును సార్వభౌమప్రతినిధిగ పాటలీపుత్రసింహాసన మధివసింప పిలువుడు.”

“అవధరించుచుంటిని మహాప్రభూ, హిమబిందుదేవియు, సువర్ణశ్రీ ప్రభువును ఒకరినొకరు ప్రేమించుకొన్నారు.”

“అవును. శ్రీకృష్ణసాతవాహన మహారాజా బాలికను వివాహమాడునని, తాను పాటలీపుత్రపురమున నుండుటవలన హిమబిందు ఏదియైన బాధపడునేమో యనుకొని ఆ కుమారుడు పారిపోయినాడు. మీరు వెంటనే పోయి ఆ బాలప్రభువును వెంట గొనిరండు. మీ వివాహమున కాశిల్పి మూర్తిని ఆహ్వానింప నేను కొందరుమంత్రుల నంపెదను.”

శ్రీకృష్ణమహారాజు జనకుని పాదముల కెరగెను. ఆ చక్రవర్తి కొమరుని గాఢముగ కౌగిలించుకొనెను. తండ్రియనుమతి నంది యువరాజు రథముపై, సేనాపతులు, మంత్రులు కొలువ గంగాతీరస్థ మగు స్థౌలతిష్యా శ్రమమునకు వెడలెను.

స్థౌలతిష్యమహర్షికి పాదాభివందన మాచరించి, వారి ఆశీర్వాదము లంది. యువరాజు, విషకన్యకాదేవిని చూడ లోని ఆరామములకు ఒంటిగ బోయినాడు.

తనస్వామి వచ్చుచున్నాడని వినిన చంద్రబాల గగన్యాదుల వదలి, ఆనంద పులకితహృదయయై, రాజహంసివలె నడచుచు ప్రియుని ఎదుర్కొనినది.

ఒకరి నొకరు చూచుకొని యా వనాంతరమున పూలపొదల వికసించి యున్న యా స్థలమున నటులనే నిలుచుండిపోయినారు. ఆ బాలిక నిలకడ నంది మెఱపువలె నిలుచుండిపోయినది. విడివడిన యా బాలిక పెదవుల చిరునవ్వులగూడి ఉషారుణ్యములు పొదవికొనిన మందారకుసుమ కోరకము లైనవి. శ్రీకృష్ణప్రభువు హిమాచలతనయను చూచిన కైలాసేశునివలె వెలిగిపోయినాడు.

చంద్రబాల చేతులు చాచి, “ప్రభూ! వచ్చితిరా! సర్వకాలముల మీ పాదములమ్రోల అధివసించియుండు భాగ్యము నా కెప్పుడు?”

“దేవీ! ఆ పొదరింట కూరుచుందము రమ్ము.”

“మందులు పుచ్చుకొనియే వచ్చితిరా!”

“తాతయ్యగారు ఔషధముల సేవింపనీక నన్ను నీకడకు పంపెదరా ఆత్మేశ్వరీ!”

“తాతపాదుల దయ అనంతము.” ఇరువురు పొదరింట అధివసించిరి. ఆ పొదరింట పూలపరీమళములలో చంద్రబాల శివజటాజూట శ్వేతపన్నగివలె స్వాతికాభిరూప యైనది. ఆమె వెనుకనే స్వచ్ఛోరగి ఉలూపి మెఱుమువలె శ్రీకృష్ణప్రభువు ఒడి లోనికి ప్రవహించి వచ్చెను.

“దేవీ! ఉలూపి ఈ దినములలో మెఱుమువలె వెలిగిపోవుచున్నది. ఆమె కింత యానంద మేమి?”

“ప్రభువు ధూర్తులగుచున్నారు. నా ఆనంద మాపన్న గరాణిది యును”

“అటులనా!”

ఉలూపి ఎటులవచ్చినదో అటులనే మాయమైనది. విషకన్యక కడకు శ్రీకృష్ణుడు చటుక్కున చేరి యామె నక్కున జేర్చుకొని నంతట మందాకిని పాలసముద్రము చేరునట్టి, రాకాపూర్ణిమాజ్యోత్స్న సుధాకరహృదయమున చేరునట్టి అమృతమధురములగు సుస్వరముల నా విషకన్యక -

“చంద్ర స్త్వం, చంద్రికాహం,
దివిజసరి దహం, భాస్వర సాగర స్త్వం,
ఏత ద్విశ్వాంబుజం త్వం
సతత పరిచర ద్గంధ సందోహికాహమ్”

అని పాడెను. ఆమె మోము హాసప్రఫుల్లమైనది. “ఇది నేను రచించు నొక రూపకములోనిది సుమండీ! ఈ శ్లోకంకూడా వినండి -

“ఏషా సేయం ధ్వని రహ మమృతౌ
త్వం మహాకాశరూపః,
ఓం త్వం, త్వం తత్, త దహ, మహ మహో
సృష్టి రేషా సమస్తా”

అని తోడిరాగిణీయుక్త మగు కాకలీస్వనమున శ్లోకము పాడినది.

శ్రీకృష్ణప్రభుని యానందము వర్ణనాతీతము.

“దేవీ! నేను హిమబిందుకుమారిని ఉద్వాహ మగుదు ననుకొని సువర్ణశ్రీ ప్రభువు వారణాసి పారిపోయినాడు. రేపు వఱువాతనే ఆయనను తోడి తే వారణాసి పోవుచున్నాను.”

విషబాల “తప్పక కొనిరండు. మీరు ప్రార్థించినగాని యా మహాశిల్పి రాడు సుమండీ!” యనెను.

20. శిల్పి-ప్రణయిని

సువర్ణ అచ్చట శిల్పగృహమున బోధిసత్వుని విగ్రహము చెక్కుచుండెను. ఆ బోధిసత్వుడు త్రిభంగిమై నిలుచుండి లీలాకమలము కుడి చేత ధరించియుండెను. సువర్ణశ్రీ తన వేదన నంతయు నా విగ్రహమున వేదనాతీతు డగు మహానుభావునియందు మూర్తింపజేసెను.

మృగాజిన యజ్ఞోపవీత ధారియై, మణిస్థగిత కుండలకర్ణుడై, విశాల నేత్రుడై, విపుల భుజాస్కంధుడై యా బోధిసత్వుడు సువర్ణశ్రీ పోలికనే వరించెను. “నీ పోలిక నీ విగ్రహ మేల చెక్కితివి?” అని గాంధార నివాసి యగు నొక బౌద్ధభిక్షుకు డడిగినాడు.”

“నేను పొందలేని అర్హతత్వము నీవిధమున పొందింప చేసికొంటిని.”

“ఓయి వెఱ్ఱివాడా! నీవుమాత్ర మేల బోధిసత్వుడవు కాలేవు?”

“కొన్ని జన్మలవరకు కాలే నని నాకు నిశ్చయముగ తెలుసును. నా మనస్సు అద్భుత మగు నొక విషయమున తగులము నందినది. ఆ వస్తువే నాకు స్వప్నము. ఆ వస్తువును మనసా నేను విడిచి ఉండలేను.”

“ఏల నీ వా వస్తువును పొందకూడదు?”

“అది నేను పొందదగినది కాదు. నేను వేవిధముల పూజింపదగిన మహాపురుషుని దది.”

ఆ భిక్షుకుడు ఈ బాలశిల్పి ఒక పరకీయను, బహుశః గురుపత్నిని, ఆశించెనేమో యని ఎంచినాడు.

“కుమారా! నీవు దీక్ష గైకొనుము. దీక్షయే ఈ ప్రపంచవాసనల నుండి నీకు విముక్తి కలుగజేయును” అని బోధించెను.

సువర్ణశ్రీ ఆలోచనాతీక్షణ మగు వదనమున “నేను దీక్ష పుచ్చుకొందును. రేపటి దినముననే పుచ్చుకొందును. బుద్ధుని చరణము తప్ప నాకు వేరు గతి లేదు. అని చెప్పెను.

“అయిన నీ దీక్షకు వలయు సన్నాహము చేయించెద” నని భిక్షుకు డా శిల్పభవనము నుండి వెడలెను.

సువర్ణశ్రీ అర్ధనిమీలితనేత్రుడై బుద్ధదేవుని ధ్యానించుచుండ మనో నయనమున హిమబిందు ప్రత్యక్షమయ్యెను. హృదయము చెదరి సువర్ణశ్రీ కన్నులు తెరచెను. ఎదుట చిరునవ్వు నవ్వుచు హిమబిందు నిలిచియున్నది. హిమబిందుమూర్తి ప్రత్యక్షమగుటయు, సువర్ణశ్రీ కళ్ళు మరియూ గట్టిగా మూసుకొనినాడు. ఆమె ఇంకను కనులలోనే నిలచియున్నది.

బుద్ధదేవునకు కామదేవు డటులనే ప్రత్యక్షమైనాడు. ఆమె అటుల తన చూపులలో, సర్వస్వములో ప్రత్యక్షమగుట అతనికి సంతోషమే కూర్చినది. అటుల నానంద ముద్భవించుట గమనించి యాతడు కించ పడినాడు.

తాను భిక్షుకుడయ్యు ఈ దేవిని మరచిపోలేడా? ఈ అద్భుత సుందరీమణినీ, సకలకళాధిదేవిని తాను మరువలేడా? తన హృదయము చిత్తము నిజముగా భిక్షుత్వ మందలేదా?

“దేవీ! హిమబిందూ! నాకళాతపస్సు మూర్తీభవించిన అపర తారాదేవీ! ఆనందమయీ! సౌందర్యమయీ! నిన్ను విడిచి ఎట్లు నేను భౌద్ధ బిక్షుకుడను కాగలను! కట్టిన పుట్టములు, కాషాయవర్ణములు, భావములు కాంక్షాపూర్ణములు” అని ఆతడు పెదవులు కదలించెను.

“అవునయ్యా! నీవు బౌద్ధభిక్షుకుడ వెట్టు కాగలవు” అని తీయని మాటలు వినబడినవి.

ఆత డా మాటలు తన హృదయమునుండి వినబడిన వనుకొనెను.

“నా బుద్ధసేవకు నీ వడ్డము రావలదు. దేవీ! నిన్ను ప్రేమించితిని, ప్రేమించు చున్నాను. నిన్ను మరచిపోవు శక్తి నాకు నీవే ప్రపాదింప వలయును.” ఆతడు కన్నులు తెరచెను. హిమబిందు కన్నుల నీరునిండ, ఆతని ఎదుట చేతులు జోడించి నిలిచియున్నది.

“స్వామీ! మీరు నన్ను నిజముగా మరచిపోవలయుననియే సంకల్పించినారా?”

ఆతడు చకితుడై తనయెదుట నున్నది హిమబిందే అని గ్రహించి లేచి నిలుచుండినాడు. ఆతడు గజగజ వణకినాడు. ఒక్కసారి పరచింత లెల్ల విడిచి ఈ దివ్యమూర్తిని తనహృదయమున కదిమికొని, మనుష్య లోకమునకు దూరముగ నామెను తస్కరించుకొనిపోయి, యావెయే తానై, ఆ నిర్జనపథములలో దివ్యానంద మనుభవింపవలయు ననుకొనినాడు.

ఒకసారి ఈబాలిక ఈ మహో తమచరిత్ర మహారాజ్ఞియై, చక్రవర్తిని లోక మేల నున్నప్పుడు, తానామెకు ధూమకేతువువలె ఆమె పాలిట దుర్దైవమువలె తటస్థించుట మహాదోషము అనుకొనును.

ఈమె ఇట్లేల వచ్చినది? అయ్యయ్యో! ఏ మనుకొందురు! ఎంత తప్పు! నాకై ఇట్లు వచ్చుట ఏమి? వృషభశకట పరీక్షలో నెగ్గుటయే ఈ యనర్థముల కన్నిటికి మూలము. తా మిద్ద రట్లు ప్రేమించుకొననేల? తథాగతుడు తన కేదారి చూపునో? ఇంతదనుక తాను భిక్షుకత్వ మేల పుచ్చుకొన లేకపోయినాడు?

“సువర్ణశ్రీకుమారా! మాటలాడ రేమి? నేమి దోష మొనర్చితి నని ఇటుల పారిపోయి వచ్చితిరి?”

“దేవీ! నీవు దోష మొనర్చుటా! నేను దోషముల ముద్దను, మా నాయనగారి మాటలు విన్నచో నా ప్రభువునకు, నాధర్మమునకు దోషము వచ్చెడిదిగాదు.”

“మీ రేమి దోష మొనరించినారు? నాదే దోషమంతయు. నా కీ విద్య లెందుకు, నా కీ జన్మ ఎందుకు? ఏల నేను మాతండ్రికి ఉద్భవించి నాను? మిమ్ము ప్రేమించితిని. మీరు నాకు భర్తలు. ఒండొకని భర్తగా ఎట్లంగీకరింపగలను? అది ఆర్యధర్మము కాదు. స్త్రీధర్మ మంతకన్నను గాదు. మీరు భిక్షుకులగుదురా, నేనును భిక్షుకురాల నగుదును. మీకు సేవ చేయుదును.”

“నీవు మహారాజ్ఞివి కావలయును! భారతవర్షమును రక్షింపవలయును. ధర్మ భావనమునకై ఉద్భవించిన నీకు భిక్షుకత్వము తగదు.”

“మీకన్న నాకితరధర్మము, దైవములేదు. కానీ నాడు నాకీ ప్రాణములు నిలువవు.”

“బుద్ధ! బుద్ధ! అట్టిమాట లనకు దేవీ!”

సువర్ణశ్రీ ఏమిచేయును? ఎదుట తాను రచించిన బోధిసత్వవిగ్రహము! కుడివైపున హిమబిందు! ఆమె బోధిసత్వునిదేవియై, యాతనికి తోచినది. కాని ఆ బోధిసత్వుడు తనపోలిక! ఆ బోధిసత్వుడే తా నయినాడు.

హిమబిందునకు ధైర్యము పటాపంచలగుచున్నది. తాను చారుగుప్తుని తనయ యై తన చిరకాంక్షితమును పొందలేకపోయినది. భిక్షురాలై సంఘసేవ చేయుచు ఈ మహాత్ముని, ఈ బోధిసత్వావతారుని, మనస్సులో పూజించుచు, నశించిపోవుటకంటె మార్గ మింకొకటి లేదని యామె తలంచి భయపడి గజగజ వణకిపోయినది. ఆమె ముడుచుకొని క్రుంగిపోయినది. తానెట్లు మరల తండ్రి ఇంటికి పోగలదు? తనకు చక్రవర్తినీత్వ మావం తయు అవసరము లేదు. తనకు కుబేర వైభవము వలదు. ఏల తాను ఒక కర్షకసుతయై జన్మింపలేదు?  సుందరీనందుల చరిత్ర ఏమైనది? అటులనే తామును సన్యాసము పుచ్చుకొందుము గాక! దూరమున నుండియే తాను తన స్వామిని దర్శింతును. ఆయన కొరకే తన సన్యాసము. ఆయన తన తపస్సు. ఆయన తన నిర్వాణము!

“ప్రభూ! మీరు సన్యాసులగుడు. నన్నును దీక్షపుచ్చుకొన నిండు. అంతియ నా తుదికోర్కె” అని హిమబిందు సువర్ణుని ఎదుట మోకరించి నది.

సువర్ణశ్రీ “వలదు, హిమబిందూ! అట్లనకుము. నీ పితృదేవుల కోర్కె నిరాకరింపకుము. బుద్ధదేవుడు నిన్ను రక్షించును. నీకు సన్యాస మేమి?” అని చేతులు రెండుజోడించి విచారముతో, గద్గదికతో పలికి వేదనతో నిలుచుండెను.

“సువర్ణశ్రీకుమారా! నీకు మాత్రము సన్యాస మెందుకయ్యా!” అని చారుగుప్తుడా మందిరములోనికి వచ్చెను. చారుగుప్తుని వెనుక ఆ సంఘారామ కులపతియు, వారివెనుక కీర్తిగుప్తుడును వచ్చిరి. 

21. రాజప్రతినిధీ జయ!

హిమబిందు లేచి నిలుచున్నది. ఆమె భీతచిత్తయై, ధైర్యము కుదుర్చుకొని, కోపఘూర్ణయగు ఆడుపులియైనది.

చారుగుప్తుడు తనయను గట్టిగ హృదయమున కదుముకొని, “నా తల్లీ! నిన్ను సువర్ణశ్రీకి ఉద్వాహమొనరింప నేను సంపూర్ణముగ సంకల్పించుకొనినాను. నే నందులకే నీవెంట వచ్చితిని తల్లీ! అందుకే మీ తాతగారును నీ మామగారును వచ్చినారు. మేము నీ వెనుకనే ఈ మందిరముకడకు వచ్చి, గుమ్మముకడ ఆగి మీ సంభాషణ వినుచుంటిమి. సువర్ణశ్రీ! నీవు పవిత్రచరిత్రుడవు. నేను మూర్ఖుడనై ఐహికభోగములు కాంక్షించితిని. నీవు నాతల్లిని నీ ఆత్మతోడనే ప్రేమించితివి. నీవు సన్యాస మెట్లు గ్రహింపగలవు నాయనా? నీవు భిక్షుకత్వము స్వీకరించి, ధర్మమునకు ద్రోహము చేతువా?” అని సువర్ణుని వైపు తిరిగియనెను.

హిమబిందు తండ్రిమాటలకు చకితియై తండ్రికంఠము చుట్టు చేతులు వైచి, ఆతని హృదయమున తన మోము దాచుకొని, అతి సంతోషమున వెక్కివెక్కి ఏడ్చినది.

సువర్ణశ్రీ ఇది కల యనుకొన్నాడు. తన్ను తాను నమ్మలేకపోయి నాడు. చారుగుప్తుని వైపు వెఱ్ఱివానివలె చూచినాడు. కీర్తిగుప్తునివైపు చూచినాడు. ఆ వెనుక ఆచార్యుల చూచి మోము వాల్చినాడు.

“బిడ్డా! నీవు భిక్షుకుడ వెట్లగుదువు తండ్రీ! నా కా గాంధారభిక్షుకుడు వచ్చి చెప్పినప్పుడే నవ్వువచ్చినది. నీవు కాబోవు తాతగారికి, మామ గారికి నమస్కరింపుము!” అనినారు.

సువర్ణశ్రీ తెల్లబోయి ఇటునటు చూచినాడు. ఎట్లు వీరంద రిచ్చటికి వచ్చినారు? వీరు తన సంకల్పమును కొనసాగనీయరా?

హిమబిందు వచ్చినది. ఆమెతండ్రివచ్చినాడు. ఆమె తాతయు వచ్చినాడు.

చారుగుప్తుడు కొమరితపై యత్యంత ప్రేమచే యామె కోర్కెనే పాలించుటకు వచ్చినారా? లేక ఆ బాలికను తనెదుట యువరాజునకై ఒప్పించుటకా? మొదటి విషయము నిజమైనచో తానెట్లు ఒప్పుకొనగలడు? రెండవ విషయమున హిమబిందునే ఒప్పించుటకు తాను ఆమెపాదముల బడును.

ఏది కర్తవ్యము? ఏమిటిది? తనకై ఇంతమంది వచ్చిరి. తానెప్పుడు ఇట్టి సంకటములే ఇతరులకు తీసుకొనివచ్చుచుండునా? ఏది కర్తవ్యము?

తన ప్రభువునకు తాను ద్రోహమెట్లు చేయును? ఇదే తనకు మార పరీక్ష? తథాగతుడు తన పక్షము రానేరాడా? తనలోని దోషములే తన్నీ పరీక్షకు తెచ్చినది.

ఓం నమ చ్ఛాక్యమునయే

సువర్ణశ్రీ మ్రాన్పడిపోయెను. ఆతడు కన్నులు మూసెను. ఆతడు రచించిన బోధిసత్వుడైన తానే తన ఎదుట తనకు ప్రత్యక్షమైనాడు.

కన్నులు తెరచి హిమబిందును చూచినాడు. ఆమె కన్నుల నీరు కారి పోవుచున్నది. చారుగుప్తుడు చిరునవ్వు నవ్వుచున్నాడు. కీర్తిగుప్తుడు తనపై కరుణార్ధ్రచంద్రిక లగు చూపుల పరచుచున్నాడు. సంఘారామ కులపతి భ్రూయుగ్మముమధ్య ఈ ప్రపంచమున ఇట్టి దుఃఖమయ చరిత్రలు వ్యక్తమగుట మారదేవుని మహిమయేగదా యను విచారణాత్మకము లగు కాంతులు ప్రసరించుచున్నవి.

సువర్ణశ్రీ మూర్తిమంతుడు, సుందరశ్రీలేఖా సమన్వితుడు, మనోహర కాంతియుతుడు, వీరావతంసుడు, మహాశిల్పి. సువర్ణశ్రీ కుమారుడు ఏమియు మాటలాడలేక మ్రాన్పడి నిలుచుండెను.

చారుగుప్తుడు “నీకుమాత్రము సన్యాస మెందుకయ్యా?” అని గంభీరములు, ఆర్ధ్రములు, ప్రేమమయములయిన వాక్యములు పలికిన పలుకులే ఆతనికి స్థూప ఘంటికా నిస్వనములై, వీణతీగల మ్రోతలై వినిపించినవి.

ఆ పలుకులు వినంబడి ఇరువది నిమేషములైన కాలము జరుగ లేదు. సువర్ణశ్రీ ఆ శిల్పశాలయం దుండియు చతుర్ధశభువనములు మహా వేగమున పరిభ్రమించి పోవుచున్నాడు.

ఏ భావము స్పష్టముగ దర్శనమీయదు. ఏ వెలుగును పూర్ణకాంతి యుతముకాదు. ఏ చీకటియు గాఢతమస్సు కాదు.

ఆతడు గడగడ వణంకిపోవుట కీర్తిగుప్తుడు చూచి ఆ బాలుని కడకుపోయి “నాతండ్రీ! నీవు హిమబిందును ప్రేమింపలేదా, ప్రేమించి వదలుకొంటివా?” అని అస్పష్టముగ ప్రశ్నించెను. కాని కీర్తిగుప్తుని కన్నులు నవ్వుచున్నవి.

చారుగుప్తుడు కొమరిత చుట్టును తనచేయి చుట్టి, సువర్ణశ్రీని చూచి, “కుమారా! ఈ బాలిక నీపై ప్రాణము పెట్టుకొని బ్రతికియున్నది. ఆమెపై ప్రాణ ముంచుకొని నేను బ్రతికియుంటిని-” అని అనుచుండ సంఘారామ కులపతి, “మీపై జంబూద్వీపమంతయు నాధారపడియున్నది వర్తక సార్వభౌమా!” అని యనినాడు.

సువర్ణశ్రీ ఏమి చేయవలయునో, ఏమి యనవలయునో తెలియక మౌనమూర్తియై నిలుచుండెను. ఒక్కొక లిప్త ఒక యుగమువలె జరుగు చున్నది. తన మహారాజు, హిమబిందు తాను, చారుగుప్తుడు-మహారాజు, హిమబిందు -

“జయజయ! జగన్ న్మహాపథనృత్యత్ కీర్తిసుందరీపాదా! జయ చతుస్సముద్ర ముద్రిత ధరావలయ సార్వభౌమకుమారా! సాతవాహనపవిత్ర వంశపారావార రాకాసుధాకరా! జయ శ్రీప్రతిష్టాన నగర మహాపాలకా! జయభరుకచ్ఛపట్టణ చంద్రసైంహితేయా! జయ జయ మాళ వాభీర కుంత లాశి కాశ్మికాది నానాదేశ రాజన్య కిరీటరత్న నీరాజితసుందర శ్రీపాదుకా! జయ జయ జయశ్రీ ఆనందీపుత్ర శ్రీకృష్ణ సాతవాహన మహారాజా!” అన్న జయ వాక్యములు గంభీరస్వరమున ఆ విహారమున మారుమ్రోగి అందరు చకితులై యావంక కనుగొనిరి.

శ్రీకృష్ణసాతవాహన మహారాజు, వినయభిక్కులు, ధర్మనందియు, శక్తిమతీదేవియు, ముక్తావళీదేవియు లోనికి విచ్చేసిరి. వారివెనుకనే హర్షగోపుడు పెన్నిధిని వెదకు లోభివలె వచ్చెను. హిమబిందు వెంటనే ముక్తావళీదేవి కడకు పరువిడి యామె కౌగిలిలో వ్రాలినది. ముక్తావళీదేవి కనుల నీరు చెమరింప “నా తల్లీ!” అని ఆమెమూర్థము పుణికినది.

శక్తిమతీదేవి నవ్వుచు, “కోడలా! క్షేమమా తల్లీ!” అని ప్రశ్నించినది.

సువర్ణశ్రీ మహారాజునకు వీర నమస్కారమిడి, తండ్రికి పాదాభి వందన మాచరించి, ముక్తావళీదేవికి, తనతల్లికి నమస్కృతులిడెను.

శ్రీకృష్ణసాతవాహనుడు సంఘారామకులపతికి నమస్కారమిడి ఆశీర్వాదమందెను. ఆ మహారాజు సువర్ణశ్రీని కనుంగొని, “సువర్ణశ్రీ ప్రభు! యాత్రలన్నియు పూర్తియైనచో మిమ్ము గొనిరమ్మని సార్వభౌములు మా కాజ్ఞ నిడిరి. మిమ్ము చక్రవర్తి సామ్రాజ్యాభిషేకమునకు, మీ వివాహమునకు, మా సమవర్తిసోదరుల వివాహమునకు ఆహ్వానింప మేమే వచ్చితిమి!” అని సాభిప్రాయపూరితము లగు చూపుల పరపెను.

సువర్ణశ్రీ “మహాప్రభూ! అవధరించుచుంటిని” అని వినయముతో బలికెను.

యువరాజు “సువర్ణశ్రీ ప్రభు! చారుగుప్తులవారు తమపుత్రికను హిమబిందుదేవిని తమకు పాణిగ్రహము సలుప కోరుటకు వచ్చిరి. తమ ప్రతినిధిగ సార్వభౌములు మమ్మంపిరి. కాని మాకన్న ముందుగనే శ్రీ చారుగుప్త మహాభాగులు విజయము చేసినారు” అని దరహసిత వదనమున పలికినాడు.

సువర్ణశ్రీ “మ-మ-హారాజా!” అని గద్గదిక మొందినాడు.

శ్రీకృష్ణుడు “సువర్ణశ్రీ మహాప్రభూ! మీరు కుసుమపురమున సకల ధరాధీశేశులైన శ్రీ శ్రీముఖసాతవాహన చక్రవర్తుల రాజప్రతినిధులుగా సింహాసన మధివసింప చక్రవర్తులు మిమ్ము ఆహ్వానింప మా కాజ్ఞ నిచ్చినారు” అని గంభీరస్వరమున పలికినాడు.

మాగధులు, జయ జయ శ్రీసువర్ణశ్రీమహారాజులకు! జయ విరోధి వీరమత్తేభకుంభ విదారణకంఠీరవులకు! జయజయ శ్రీపాటలీపుత్రపురసింహాసనాధీనా! జయ జయ సకలభూమండల ప్రసర్పితశ్వేతచ్ఛత్రాధిప శ్రీ శ్రీముఖసాతవాహన మహాజాధిరాజ ప్రసాదలబ్ధ సింహాసనా!” అని జయ ధ్వానములు పలికినారు.

చారుగుప్త ధర్మనంది కీర్తిగుప్తుల హృదయములు ఝల్లుమని పోయినవి. శక్తిమతీ ముక్తావళీదేవులు ఉప్పొంగిపోయినారు.

సువర్ణశ్రీకడకు శ్రీకృష్ణసాతవాహనుడు పోయి చెవిలో “మిత్రమా! సువర్ణశ్రీప్రభూ! నాకు హిమబిందుదేవి ఎప్పుడును చెల్లెలు. నీవు వేరభిప్రాయమంది నాకు తలవంపులు తెచ్చెదవా! నా చెల్లెలు హిమబిందు కుమారి నీ అర్థాంగిసుమా!” అని రహస్యము చెప్పెను.

సువర్ణశ్రీ ఆచార్యునిపాదములకడనే సాష్టాంగపడినాడు. ఆచార్యులంతట అత్యంతదయతో సువర్ణుని లేవనెత్తి ఆతని చేతిలో హిమబిందు చేయి నుంచినారు. అక్కడకుచేరిన భిక్షుకులు:

“నమచ్ఛాక్యమునయే
తథాగతాయ అర్హతే
సంయుక్ సంబుద్ధాయ”

అని పాడిరి.

22. అఖండభూవలయు సామ్రాజ్యాభిషేకము

“అగ్నిఃపూర్వేభికృషిభిరీధ్యో నూతనైరుత స దేవా ఏహవక్షతి.”

అను మంత్రముచే అగ్ని ప్రజ్వరిల్లుచుండెను. మహర్షులు మంత్రములు చదువుచుండిరి. స్థౌలతిష్యమహర్షి వసిష్ఠు డయ్యెను.

“ఇంద్ర స్యను వీర్యాణి ప్రకోచం యాని చకార ప్రథమాని వజ్రీ
అహ న్నహీ మన్వప స్తదర్ద ప్రవక్షణా అభినత్పర్వతానాం”

ఇంద్రమంత్రములైనవి.

“తత్పూర్యస్య దేవత్వం తన్మహిత్వం మధ్యా కర్తరి తతం సంజ
భార య దేత దయుక్త హరితః సదస్థా దాద్రాత్రీ వాసస్తను తే సి మస్మై.”

సూర్యుని పూజించినారు. సర్వదేవతలను అర్చించినారు.

“నా విష్ణుః పృధివీపతిః” గావున విష్ణు నట్లర్చించిరి.
“ఇవ ద్విషోః పరమం పదం సదా సశ్వంతి సూరయంః దివీవచక్షు
రాతతంǁ త ద్విప్రాసో విపన్వవో జాగృవాం సః సమింధతే విష్ణోర్య త్పరమం పదంǁ”


చక్రవర్తి సింహాసన మహావితర్దికకు దిగువను ఒక సామాన్య సింహాసనముపై శ్రీముఖసాతవాహనుడా శ్రావణశుద్ధ పంచమినాడు, ఉత్తరఫల్గుణీనక్షత్ర తృతీయ పాదయుక్త కన్నాలగ్నమునందు, సింహాసనారూఢుడు కా సముచితాలంకారుడై అధివసించియుండెను.

కర్కాటకమున రవియు, దశమమున బుధశుక్రులును, మీనము నందు గురువును బలవంతులై యుండి, చంద్రుడు లగ్నమందుండెను.

ఈ మహాముహూర్తమునందు సింహాసనాభిషేకము నేర్పాటు చేసినాడు స్థౌలతిష్యుడు. అంతకుముందునుండియు అనేకహోమములు జరుగు చున్నవి.

పాటలీపుత్రము దేవనగరివలె నలంకరింపబడెను. మగధ దేశమంతయు నలంకరింపబడెను. ధాన్యకటకమహానగరము వైకుంఠమే ఆయెను.

ఆంధ్రదేశమంతయు పండుగలే! సకలభూవలయము మహదాంధ్ర దేశమయినది వారికి.

మహదాంధ్రసార్వభౌముడు హరిశ్చంద్రాది మహాచక్రవర్తుల వంశములోనివా డైనాడు. తెల్లని భద్రదంతావళముపై నధిరోహించి చక్రవర్తి ఆ ముందు రాత్రి యంతయు నూరేగినాడు. ఆ దంతావళాలంకారమే కోటిపణములు విలువ చేయునట.

చక్రవర్తి సింహాసనమున కెడమభాగమున దేవి ఆనందమహారాజ్ఞి వేరొక సింహాసనముపై నధివసించియుండెను. ఆమె కెడమప్రక్క రెండు సింహాసనములపై శ్రీకృష్ణసాతవాహన మహారాజు, మంజుశ్రీ రాజకుమారు లధివసించియుండిరి.

దేశదేశములనుండి మహారాజులు, మహాప్రభువులు, భూపతులు, సామంతులు, సేనాధికారులు, వర్తకచక్రవర్తులు, మహామంత్రులు, మహా పండితులు వచ్చియుండిరి.

లోకమంతయు ప్రసిద్ధినందిన నాయకులు, కవులు, శిల్పులు, నాట్య వేత్తలు వచ్చియుండిరి.

సాముగరిడీలవారు, ఆయుధవిద్యావిశారదులు, మంత్రవేత్తలు, మల్ల ముష్టి యుద్ధపునిపుణులు వచ్చిరి.

ఉత్సవమునందు పాల్గొన అనేకులు జానపదులు, నాగరులు వివిధ దేశములనుండి వచ్చిరి. యవనరాజ్య రాయబారులు, మ్లేచ్ఛదేశ రాయబారులు వచ్చియుండిరి.

స్త్రీమండలమున కౌస్తుభమణివలె చంద్రబాల యొక సింహాసనము నలంకరించి యుండెను. ఆమెప్రక్కను చక్రవర్తికుమారికలు మాయా దేవియు, శాంతశ్రీదేవియు అధివసించి యుండిరి. చంద్రబాల కుడిప్రక్కనే అపర ప్రజ్ఞాపరిమితా దేవివలె హిమబిందు అధివసించియుండెను. అచ్చటనే ముక్తావళియు, అమృతలతాదేవియు, శక్తిమతీదేవియు, నాగబంధునికా సిద్ధార్థినికలు ఉచితాసనముల నధివసించి యుండిరి.

చక్రవర్తి కుడివైపున ఉచిత సింహాసనముపై చారుగుప్తవర్తక సార్వభౌములు నివసించి యుండిరి. వారివెనుక అచీర్ణమహామంత్రియు, ధర్మనందియు అధివసించి యుండిరి. సంపూర్ణ కవచాఢ్యులై స్వైత్రులవారు సార్వభౌమ సింహాసనము కడ కత్తిదూసి నిలిచియుండిరి.

ఆవలప్రక్క సోమదత్తాచార్యులుండిరి. సింహాసన వితర్దికా సోపాన పంక్తి మ్రోల సమవర్తి సాతవాహనుడు, శుకబాణులవారును, సువర్ణశ్రీయు ఉండిరి.

స్థౌలతిష్యునకు చంద్రస్వామి ఉపవసిష్ఠు డయెను.

అమృతపాదార్హతులు సింహాసనమునకు ఎడమప్రక్క సువర్ణపద్మ పీఠముపై అధివసించి యుండిరి. వారి ననుసరించి వివిధసంఘారామ కులపతులు, అర్హతులు, ఆచార్యులు, భిక్షులు, పీఠముల పై అధివసించి యుండిరి.

మంజుశ్రీని పెంచిన చంద్రస్వామి చెల్లెలు కరుణశ్రీదేవి ఆనంద మహారాణి వెనుక పీఠమున అధివసించి యుండెను. ఆమెభర్త గౌతమ పండితులు, స్థౌలతిష్యుని శిష్యులు వారికి యాజకత్వమున సహాయముచేయు చుండిరి.

అభిషేకము జరిగినది.

బౌద్ధులు బౌద్దవిధానమున వినయపిటకమునుండియు, దమ్మసుత్త ములనుండి మంత్రములు పఠించిరి.

“నమో తస్స భగవతో అర్హతో,
సమ్మ సముబద్ధస్స!
బుద్ధం శరణం గచ్ఛామి,



దమ్మం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి,
దుతియంపి బుద్ధం శరణం గచ్ఛామి,
దుతియంపి దమ్మం శరణం గచ్ఛామి,
దుతియంపి సంఘం శరణం గచ్ఛామి,
తతియంపి బుద్ధం శరణం గచ్ఛామి,
తతియంపి దమ్మం శరణం గచ్ఛామి,
తతియంపి సంఘం శరణం గచ్ఛామి,
పానాతిపాతా వరమనీ సిఖ్ఖాపదం సమాదియామి.
అదిన్నాదానా వరమనీ సిఖాపదం సమాదియామి.
కామేసు మిచ్ఛాచారా వరమనీ సిఖ్ఖాపదం సమాదియామి.
ముసాపాదా పరమనీ సిఖ్ఖాపదం సమాదియామి.
సురా-మెరయా మజ్జ-పమాద-దానా వరమనీ.
సిఖ్ఖాపదం సమాదియామీ”

అని పాడిరి.

బౌద్ధధర్మాభిషేక విధానమును, ఆర్యధర్మాభిషేక విధానమును ఒకటియే.

రెండు ధర్మముల ప్రకారము అభిషేకము జరిగెను. చారుగుప్తుని భుజముపై కుడిచేయి నిడి చక్రవర్తియు, అతని ఎడమ పార్శ్వమున చక్రవర్తినియు, చెలికత్తె శక్తిమతి చేయిబట్టియు సింహాసనము చెంతకు వచ్చిరి. సర్వవాద్యములు మ్రోగుచున్నవి. నృత్యగీతాది కళాప్రదర్శనములు జరుగు చున్నవి.

ఐతరేయబ్రాహ్మణము ననుసరించి స్థౌలతిష్యమహర్షి సార్వభౌమ పట్టాభిషేక మొనర్చి, సార్వభౌమకిరీటములు వారితలలపై నుంచేను. మహ దాశీర్వచనము, సుమంగళుల హారతియు జరిగినవి.

దమ్మసూత్తముల ననుసరించి బౌద్ధార్హతశిరోమణియైన అమృత పాదులు చక్రవర్తికి అభిషేకము చేసెను.

చక్రవర్తి చారుగుప్తుని సకలజంబూద్వీపసామ్రాజ్యమునకు మహామంత్రిగ అభిషేకము చేసి ముద్రిక లందిచ్చెను. 

23. శుభమంగళ గీతములు

అభిషేకమహోత్సవములు సకలభారతావనియుందును కొన్నినెలలు జరిగినవి. కుసుమపురము కన్నుల వైకుంఠమై, ఆనందకోలాహలమై పోయినది.

అభిషేక మహోత్సవమైన కొలదిదినములకు శుభముహూర్తముల సువర్ణశ్రీ హిమబిందుల వివాహమును, నాగబంధునికా సమదర్శుల వివాహమును జరిగినవి.

సమదర్శిసాతవాహనుడు ఆంధ్రశత్రువులకు సమవర్తి కావున, సమవర్తి బిరుదనామ ప్రసిద్ధుడు. ఆతడు రాజముద్రిక లంది, భార్యాద్వితీయుడై, చంద్రస్వామి మహా పండితయుక్తుడై, తన సైన్యము గూడుకొని భరుకచ్చ పట్టణమునకు బోయినాడు. అచ్చట నొక శుభముహూర్తమున నాగబంధునికా సమదర్శులకు రాజ ప్రతినిధి మహారాజ పట్టాభిషేకమహోత్సవము జరిగెను.

సమదర్శి సమదర్శియే! సమదర్శి సమవర్తియే. నాగబంధునికయు భర్తను ప్రోత్సహించి, ఆంధ్ర నౌకలపై దూరదేశములకు ప్రయాణము చేయుచు, ఆంధ్ర శిల్పము, నాగరికత వెదజల్లించుచుండెను.

ఓడదొంగలు విజృంభింపకుండ వర్తకము సర్వతోముఖముగ వృద్ధినంద సమదర్శి రాజ్యపాలన చేయుచుండెను.

నాగబంధునికాదేవి మాట సమదర్శికి చక్రవర్తిశాసనము. ఇరువురు సమముగ యుద్ధములకు బోదురు. ఇరువురు సమముగ సభయం దధివసించి తీర్పుల నిత్తురు. ఇరువురు ఆలోచనామందిరమున చంద్రస్వామి మొదలగు మంత్రులతో రాజ్యవ్యవహారము లాలోచింతురు.

నాగబంధునిక గర్భము ధరించియు తల్లితండ్రులకడకు పురిటికి వెడలి పోవ నిరాకరించినది. అమృతలతాదేవి కోడలిని చూచి తనయంత యదృష్టవంతురాలు లేదని పొంగిపోవుచుండునది. నాగబంధునిక పురిటికి శక్తిమతీదేవియు, సిద్ధార్థినికయు, ధర్మనందియు విచ్చేసిరి.

అక్కకు పుట్టిన బంగారుశిశువును చెల్లెలు వదలునది కాదు. శిశువునకు ఏడునెలలు వచ్చువరకు ధర్మనంది కుటుంబముతో భరుకచ్ఛముననే యుండెను. అక్కడ నొక చైత్యనిర్మాణము తల పెట్టి ధర్మనంది ఆరు నెలలలో ముగించెను. అచ్చటనే యొక సంఘమును స్థాపించి మహా చైత్యవాద పక్షమునకు జెందిన సంఘారామము నిర్మించెను.

నవశిశువునకు శక్తిమతియే పెంచునది. నాగబంధునిక మరల సమదర్శికి మంత్రియు అంగరక్షక సేనాపతియు నైనది.

***

వివాహమైన కొలదిదినములకు చక్రవర్తి సువర్ణశ్రీమహారాజునకు, హిమబిందునకు పాటలీపుత్రమున ఉత్తరాంధ్ర సామ్రాజ్యమునకు రాజ ప్రతినిధి పట్టము గట్టినారు.

జ్యోతిష్యులు వీరిరువురికుమారుడు చారుగుప్తమహారాజ నామ ధేయుడై ఒక మహా సామ్రాజ్యమునకు పాటలీపుత్రపురమున మూలపురుషు డగునని సెలవిచ్చి యుండిరి. ఆ విషయము స్థౌలతిష్యులవారీ వరకే భవిష్యత్తును తెలిపియుండిరి.

ధాన్యకటకమునకు చక్రవర్తియు, శ్రీకృష్ణసాతవాహన మహారాజు, ధర్మనందియు, శక్తిమతీదేవియు, మహామంత్రులు, సైన్యాధ్యక్షులు, సేనాపతులు మొదలగు వారందరు తరలిపోయిరి.

ఆరునెలలు శ్రీకృష్ణమహారాజునకు చంద్రదేవికిని (విషకన్య) ఎట్లు గడచినవో! స్థౌలతిష్యుల ఆశ్రమమునందు విషకన్యక అమృతకన్యక యగుచుండెను. శ్రీకృష్ణ మహారాజునకు మహర్షి దివ్య ఓషధుల సేవింప జేయుచుండెను.

శ్రీకృష్ణసాతవాహనప్రభువు తన భవిష్యద్దేవిని దర్శింపని దిన మొక్కటియు లేదు. విషకన్యక అపరాజితాదేవి వలె ప్రకాశించిపోవు చుండెను. అమృతపాదార్హతులు తండ్రిని అప్పుడప్పుడు దర్శించుచు వివిధవాదముల విశ్వతత్వము నిర్ణయించుకొనుచుండెను. తండ్రి తాతగారల వాదనలలో విషకన్యక బ్రహ్మానందసుఖ మనుభవించుచు తనప్రియుని మూర్తియే తనకు పూజామూర్తిగా దినదినాభివృద్ధిగ చంద్రికామృత తేజస్సున విలసిల్లిపోవుచు, ప్రియుని హృదయాన చేరు శుభముహూర్త మెప్పుడని ఎదురు చూచుచున్నది.

***

పాటలీపుత్రమును పాలింపుచు సువర్ణశ్రీ కోశలదేశమున స్థూపమున కొన గోపురము స్వయముగ విన్యసించి యర్పించెను.

సువర్ణశ్రీ హిమబిందులప్రేమ మహాకావ్యముల కవులచే పాడబడినది.

హిమబిందు సువర్ణశ్రీల ప్రేమ అతిలోకసుందరమై మహాద్భుత శిల్పవిన్యాసరూపమై ఆర్యావర్తమంతయు విలసిల్లిపోయినది. సువర్ణశ్రీ శిష్యులు గాంధార, పారశీక, కొహరస్థాన, బాహ్లిక, మంగోలు, కాశ్యప సముద్రదేశాదులు పోయి ఆంధ్రశిల్ప చిత్రలేఖనాదులు వికసింపజేయు యత్నమున నుండిరి.

శిల్పదీక్ష ఎంత ప్రతిభాయుక్తమైయున్నదో సువర్ణశ్రీకి రాజ్యపాలనాదక్షతయు నంతపట్టుబడినది. ముక్తావళీదేవియు, కీర్తిగుప్తులవారును పాటలీపుత్రముననే ఆగిపోయిరి. చారుగుప్తవణిక్సార్వభౌముడు హిమబిందు ఆనందములో తాను మహానంద మనుభవించుచు, ఆంధ్రమహా సామ్రాజ్యమును వేయికన్నుల కాపాడుచు, పాటలీపుత్ర, ధాన్యకటకనగరములమధ్య తిరుగుచుండెను.

హిమబిందు సౌందర్యము సంపూర్ణవికాస మందినది. ఆమెయే యరణము నిచ్చి బాలనాగిని హర్షగోపునకును వివాహముచేయించి, హర్ష గోపునకు పాటలీపుత్ర పురమున ఉద్యోగమిప్పించినది.

హిమబిందు మహత్సౌందర్యమును అణువు పూజింపుచు సువర్ణశ్రీ దివ్యపథముల సంచరించుచున్నట్లు జీవితాన్వేషియైనాడు. హిమబిందు వెన్నెల, సువర్ణశ్రీ శశికళా ప్రియంభావుకుడు.

హిమబిందు: ఆత్మేశ్వరా! ఏమట్లు మీరు అత్యంత తీవ్రాలోచనా ధీనులైయున్నారు?

సువర్ణశ్రీ: జీవితేశ్వరీ! నాకీ రాజ్యభారము వహించుట ఎందుకు? ఏదియో శిల్పము చేసుకొనువానికి.

హిమ: పాటలీపుత్రపురమును జయించి చక్రవర్తికి స్వాధీనము చేయునాడు మీ కా ఆలోచనలేదూ?

సువర్ణ: ఆపని చక్రవర్తికై చేసితిని.

హిమ:

“ఇదియు చక్రవర్తికై కదా?
ఏనాటి నాకోర్కె నీకనుల రూపొందె,
ఆనాడే ఈ లోక మావహించెను కళలు
ఏనాడు నీమూర్తి నా సర్వమై వెలిగె
ఆనాడే ఈ భూమి ఒక శిల్పమైపోయె”


“ప్రభూ! అశోకుడు శిల్పరసజ్ఞు డగు చక్రవర్తి, మరి నా ప్రభువు శిల్పి చక్రవర్తి! శిల్పియే చక్రవర్తి ప్రతినిధి!”

ఆమె ఆతని హృదయమున వ్రాలినది.

సువర్ణు డామెను బిగియార కౌగిలించుకొనెను. వారిరువురి మోములు శశికళాపరమ శోభాయుతములై పోయినవి. 

“ఓం అసతో మా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ.”

“బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్ఛామి.”


సర్వము సంపూర్ణము


***