హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము/పీఠిక

పీఠిక

"ఎలిమెన్ట్స్ ఆఫ్ హిందూ లా" అని పేరు పెట్టి మా తండ్రిగారయిన సర్ తామన్ స్ట్రెంజిగారు చేసిన గ్రంథమును ముఖ్యముగా ననుసరించి యీ ధర్మశాస్త్ర సారసంగ్రహము చేసినాఁడను. మా తండ్రిగారు చేసిన గ్రంథము మన ధర్మస్థానములందుఁ బ్రమాణముగా గ్రహింపఁబడి వాడఁబడుచున్నది. ఆ గ్రంథము మాటిమాటి కచ్చుపడకపోయినది కాఁబట్టి యది యచ్చువేయింప వలసినదా, యిప్పుడు నేను రచించిన రీతిని సంగ్రహ గ్రంథ మొకటి రచియించి ప్రచురము చేయవలసినదా యని శంకితుఁడ నయితిని. మా తండ్రిగారి పరిశ్రమమును వారి కాలమునకు వెనుక మన ధర్మస్థానముల యందు నడుచుచు వచ్చిన వ్యవహారముల తీర్పులను సహాయ పఱుచుకొని యా విషయములు కూర్చి సులభ క్రమమయిన సంగ్రహ గ్రంథ మొకటి చేయవలసినదేయని తుదకు నిశ్చయించి కొంటిని. అయినను మా తండ్రిగారు నిర్ణయించినదే సరియని కన్నులు మూసికొని పరిశీలింపక యొప్పుకొన్నవాఁడనుగాను. నా కగపడ్డ న్యాయముఁబట్టి మా తండ్రిగారి తాత్పర్యములకు నా తాత్పర్యములు భేదిల్లినచోట నాకుఁ దోఁచిన సిద్ధాంతము సంకోచిల్లక నిర్ణయించినాఁడను. అయినను నా కిట్టి తాత్పర్యభేదము లొకానొకచోటనే ప్రసక్తించినవి.

ఈ విషయమందు యథా ప్రాప్తముగా జ్ఞానము సంపాదింపవలెననియు దుష్కరములైన శాస్త్రాంశములు విడువక లెస్సగా వివరింపవలెననియుఁ గోరి సదరదాలతు కోర్టువారి పుస్తకశాలయందుండు సకల ధర్మ శాస్త్రములను బరిశీలించి సదరదాలతు కోర్టు ప్రొవిన్షియాల్ కోర్టు జిల్లాకోర్టుల పండితులు తమ యధికార స్థానములందు వ్రాసియిచ్చిన యభిప్రాయములును హర్మేజస్టీ ప్రివి కవున్సలువారు తీర్చిన తీర్పులును సదరదాలతు కోర్టువారి తీర్పులును వెలి దేశముల యందు యూరోపు దేశీయులయిన న్యాయాధిపతులచేతఁ దీర్పఁబడి యచ్చుపడిన తీర్పులును గలిగిన సమస్త లేఖ్యముల నాలోడించినాఁడను. ఇదిగాక సదరదాలతు కోర్టు పండితులతోఁ బలుమా ఱీ శాస్త్ర విషయమునందుఁ జర్చించుచు రాఁగా వారు నాకు సంశయ నివర్తకముగా నా గ్రంథ రచనకు మిక్కిలి సహాయముగా ధర్మశాస్త్రమందలి మూల ప్రమాణము లుదాహరించి నా రచించిన గ్రంథము పరిశీలించిరి. పశ్చిమ సముద్ర ప్రాంత దేశమందుఁ జెల్లుచున్న మరుమక్కదాయ మను నియమమును దద్దేశమందలి, ముఖ్యులయిన న్యాయాధిపతులు చెప్పిన విషయములఁ దెలిసికొని వ్రాసితిని. ఇదిగాక యీ శాస్త్రాంశమునందు నాకు సహిత యనుభవము గలదు. ఇప్పుడు హిందూ ధర్మశాస్త్రమును జెల్లించు ధర్మస్థానములవారి కీ గ్రంథము నిర్దోషముగా సుబోధముగా నుపయుక్తముగా నుండునను తలంపుచేత ప్రచురము చేసెద. ఇది హిందువులయిన ................... వాది ప్రతివాదులకును సాధారణముగా సమస్త హిందువులకును వినియోగించుటకయి యాంధ్ర ద్రవిడ భాషలయందును బ్రచురము చేయఁబడెను.