హలో...డాక్టర్/అభినందనాంజలి

అభినందనాంజలి

ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక నిర్దిష్టమైన విధి ఏర్పాటు చేయబడి ఉంటుంది. సకల చరాచర ప్రాణి కోటిలో మానవ జీవితం ఎంతో ఉత్కృష్టమైనది. జీవిక కొరకు మనుషులు ఏ వృత్తినైనా ఎంపిక చేసుకోవచ్చును. కానీ తాము చేస్తున్న పనిని ప్రేమించ గలిగిన వారే మానవజాతికి సేవ చేసినట్లు. అందులోనూ ప్రాణ ప్రదాతలైన వైద్యులు ప్రత్యేకంగా చెప్పుకోదగిన వారు.

ప్రస్తుత కరోనా సమయంలో అనేక భయాలతో  చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. స్వార్ధపూరిత సమాజంలో విద్య, వైద్యం వ్యాపారంగా మారాయి. భయంకరమైన వ్యాధులు పీడిస్తున్న ప్రస్తుత సమయంలో కూడా కొందరు రోగులను దోచుకుంటున్నారు. కానీ ప్రజా సంక్షేమము దృష్టిలో పెట్టుకొనే డాక్టర్లు కూడా ఉన్నారు. అటువంటి ఆణిముత్యాలలో డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి గారు ఒకరు. వారు వ్రాసిన ‘హలో... డాక్టర్’ అనే ఈ పుస్తకం రోగులకే కాదు చాలామంది వైద్యులకు కరదీపిక వలె మార్గదర్శనం చేస్తుంది. స్నేహితురాలు తెలుగుతల్లి కెనడా పత్రిక సంపాదకురాలు శ్రీమతి రాయవరపు లక్ష్మిగారి ద్వారా పరిచయమైన ఈ ‘డాక్టర్ అన్నయ్య’ ఎంతో ప్రత్యేకమైన వారు. ఇంతవరకు నేను ఎన్నో పుస్తకాలను, రకరకాల సాహిత్యాన్ని చదువుతూ వచ్చాను. కానీ ‘హలో.. డాక్టర్’ అనే ఈ గ్రంథం చాలా నచ్చడమే, కాదు ఎంతో అపురూపంగా అవసరమైనదిగా అనిపించింది. అందుకే జె.డి.పబ్లికేషన్స్ పేర ముద్రణ బాధ్యతను నిర్వహిస్తున్న నాకు ఈ పుస్తకాన్ని గురించి వ్రాయాలని పించింది. చిన్నాచితక వ్యాధులతో భయపడి, బాధపడే వారిని మరింత

xvii :: భయపెడుతూ అవసరం లేని పరీక్ష లెన్నో నిర్వహించి నిలువు దోపిడీ చేస్తున్న

ప్రస్తుత సమయంలో... అనేక రోగాల గురించి రాశారు. రోగ లక్షణాలను, రోగ కారణాలను, నివారణలను, చేయవలసిన పరీక్షలను, వాడవలసిన మందులను, తీసుకోవలసిన జాగ్రత్తలను ఎంతో వివరంగా తెలియ చేశారు ఈ పుస్తకంలో. ఉదాహరణలతో బొమ్మలతో సహా తెలియచేసి బాధితుల పక్షాన నిలబడి మనోధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు రచయిత. తమకు తెలిసిన దానికి గర్వ పడిపోతూ... నలుగురికి దానిని ఒక బ్రహ్మ పదార్థంగా చూపించి భయపెట్టే ఈ కాలంలో... తమ అనుభవాలను, వృత్తిపరమైన జ్ఞానాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో రాశారు ఇందులో. ‘వైద్య పారిభాషక పదాలను’ తెలుగులోకి అనువాదం చేసి సవివరంగా వివరించారు ఈ వైద్య నారాయణుడు. ‘హలో... డాక్టర్’ అనే ఈ గ్రంథం ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రంధాలయంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఉండ తగినది. అందరూ చదివి, నలుగురికి బహుమతిగా పంచ తగినది. వృత్తిధర్మంలో భాగంగా పరదేశాలకు వెళ్ళినా పుట్టిన గడ్డను మాతృభాషను మరువకుండా ఎంతో ఆసక్తిగా ఈ రచనలను కొనసాగించారు డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి గారు. ఎంతో శ్రమకోర్చి చేసిన ఈ రచన మానవ సమాజం పై వారికి ఉన్న అపరిమితమైన ప్రేమకు మచ్చుతునక. విశ్వైక ప్రేమ, వసుధైక కుటుంబం అంటూ ఉపన్యాసాలు చేసేకంటే ఇటువంటి మంచి రచనల ద్వారా తమ జ్ఞానాన్ని నలుగురికి పంచడం హర్షించదగిన విషయం. వారు మరిన్ని ఇటువంటి గ్రంథాలను రచించాలని ఆశిస్తూ.... అభినందనలతో జ్వలిత జె.డి. పబ్లికేషన్స్ 13-08-2021, హైదరాబాద్.

xviii ::