విజ్ఞప్తి

ప్రబంధపరమేశ్వరుఁ డగు ఎఱ్ఱాప్రెగ్గడచే రచింపఁబడిన భారతశేష మగు హరివంశము క్రీ. శ. 1901 లో మాచేతనే ముద్రింపఁబడినది. దాని తాలూకు ప్రతులన్నియుఁ జెల్లిపోయినవెనుక తిరిగి దానిని పండితులచేఁ బరిశోధింపించి ముద్రింపవలయు నని తలఁచుచుండఁగా మా భాగ్యవశమున మహావిద్వాంసులును, శతావధానులును నగు శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు దానిని బరిష్కరించి యిచ్చుటకు దయతో నంగీకరించిరి. వారే మాకు ఎఱ్ఱాప్రెగ్గడ విరచిత మగు నృసింహపురాణమును గూడఁ బరిష్కరించిరి. బహుశ్రమకోర్చి యనేక తాళపత్ర ప్రతులను బరిశోధించి వారు నృసింహపురాణమునువలెనే యీ హరివంశమును గూడఁ జక్కఁగా నిర్దుష్టముగాఁ బ్రామాణికముగాఁ బరిష్కరించి యొసంగిరి. గొప్ప పరిశోధన చేసి వారు వెలయించిన వెల లేని పీఠిక యీ గ్రంథమున కొక యపూర్వాలంకార మని చెప్పఁదగి యున్నది. అనితరసాధ్య మయిన యేతత్ గ్రంథపరిష్కరణభారమును వహించి మా పూనికిని సఫలము కావించిన శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారికి మే మెంతయుఁ గృతజ్ఞులము.

భాషోద్ధారక, కళాప్రపూర్ణ శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారు సజీవులుగా నుండినపుడే యీ గ్రంథము పీఠిక మినహా దాదాపు పూర్తిగా ముద్రితమయినది. గ్రంథములోని కవిత్వాది విశేషములనుగూర్చి విపుల మయిన పీఠిక రచింపఁబడవలసి యుండుటచేతను, శ్రీ శాస్త్రులుగారు నిర్యాణము చెందిన తరువాత నేర్పడిన కొన్ని యితర పరిస్థితులవలనను దీనిని వెంటనే ప్రకటించుటకు వీలు లేక పోయినది. తరువాత గ్రంథప్రచురణకార్యమును జేపట్టిన శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులు ట్రస్టువారు శ్రీ శాస్త్రులుగా రసంపూర్తిగా వదలిపోయిన కార్యమును పూర్తి చేయుటకు సంకల్పించి వడివడిగా తగిన యేర్పాటులు చేసి యీ గ్రంథము నిట్లు ప్రకటించుచున్నారు.

ఎఱ్ఱన కవిత యంతయు నొకచోట నుండును గాక యని యిప్పటివఱ కుపలబ్ధము లయిన ఎఱ్ఱాప్రెగ్గడ రామాయణములోని పద్యములను పీఠిక కనుబంధముగా నిందు బ్రకటించితిమి. యథాపూర్వముగా నీ మహాగ్రంథము నాంధ్రమహాజను లాదరింతు రని మా విశ్వాసము. ప్రాచీనాంధ్రగ్రంథముల మఱికొన్నిటిని గూడ నిట్లే వరుసగాఁ బ్రకటింప వలయు నని మా సంకల్పము. ఆంధ్రమహాజనులు మా యీ యుద్యమమునకుఁ జేయూఁత యొసఁగుదు రని యాశించుచున్నాము.

దీని నిట్లు త్వరగా వెలుఁగులోనికిఁ దెచ్చుటకు ప్రత్యేకశ్రద్ధ వహించి కృషి చేసిన కీ. శే. శ్రీ కాళహస్తి చంద్రమౌళీశ్వరశాస్త్రిగారి యమూల్య సేవ నెంతకొనియాడినను తీరదు.

చెన్నపురి.

1 - 7 - 67.

ఇట్లు

ప్రకాశకులు.