హరివంశము/పూర్వభాగము-ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - ప్రథమాశ్వాసము

శ్రీకిం బ్రేమపదంబు భూమికి నతిస్నిగ్ధుండు దుగ్ధాబ్ధిశ
య్యాకేళీరతుఁ డాదివేధకు గృహం బై యొప్పునాభిస్థనా
ళీకంబుం గలవేల్పు లోకములఁ బాలింపం బ్రభుం డుత్తమ
శ్లోకుం డన్నమవేమభూవిభున కిచ్చున్ సుస్థిరైశ్వర్యముల్.

1


శా.

శర్వాణీస్తనచక్రవాకములు వక్షస్స్ఫారకాసారమున్
గర్వం బింపెసలారఁగాఁ దఱిసి వేడ్క ల్సల్ప రోమాంచమున్
సర్వాంగీణముగా ధరించి[1]కొని యిచ్చన్ బేర్చు శంభుండు స
ర్వోర్వీరక్షణదక్షు వేమనృపు [2]నత్యూర్జస్వలుం జేయుతన్.

2


ఉ.

తమ్మికిఁ జూలి లోకములతాత తపస్వులయొజ్జ యోగివ
ర్గమ్ముల కాఢ్యుఁ డాగమపరంపరకుం బ్రభవంబు ధర్మభా
గమ్ములకర్త భారతికిఁ గాదిలి మువ్వురతొల్తపేరు ని
[3]త్యమ్ముగ నాయువీవుత [4]గుణాఢ్యుఁడు ప్రోలయవేమశౌరికిన్.

3


మ.

కమలాక్షస్మరఘస్మరాబ్జభవులున్ గైవారు లంభోధిపూ
రములున్ బుక్కిటిసాము గోత్రగిరివర్గంబున్ గనత్కందుకా
భము సంక్రీడనవేళ నేవిభున కాభవ్యుండు ప్రత్యూహసం
తమసాదిత్యుం డిభాననుం డొసఁగు భద్రంబుం గృతిస్వామికిన్.

4


మ.

వరవస్తుప్రతిపత్తిధుర్య మగునైశ్వర్యంబు పంచాశద
క్షరసంసిద్ధసమస్తశబ్దరచనాసంవ్యాప్తి నుద్దీప్తమై
పరఁగం గల్పలతాసధర్మ యగుచుం బ్రజ్ఞావిశేషాఢ్యులన్
గరుణం బ్రోచు సవిత్రి వాణిఁ ద్రిజగత్కల్యాణిఁ బ్రార్థించెదన్.

5


శా.

సందీప్తార్కసమప్రకాశు జలదశ్యామాంగుఁ గౢప్తాఖిల
చ్ఛందోబృందవిభాగుఁ బావనయశస్సందోహు [5]నస్పందధీ

సందర్భాంచితు భారతాగమకథాసద్భావు లోకత్రయా
నందప్రాప్తికరుం బరాశరసుతున్ సర్వజ్ఞుఁ గీర్తించెదన్.

6


మ.

చతురోద్యన్మతి వాతపోతకమహాసాంయాత్రికుండై తగన్
జతురామ్నాయపయోధుల న్మెలఁగి భాస్వద్రత్నముల్ రామస
న్నుతిరూపంబుగఁ గూర్చి విశ్వజగమున్ భూషించె నేధన్యుఁ డా
ప్రతిముఖ్యుండు ప్రసన్నుఁ డయ్యెడుఁ గృపన్ వాల్మీకి మా కెప్పుడున్.

7


ఉ.

ఉన్నతగోత్రసంభవము నూర్జితసత్త్వము భద్రజాతిసం
పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటము న్నరేంద్రపూ
జోన్నయనోచితంబు నయి యొప్పెడు నన్నయభట్టకుంజరం
బెన్న నిరంకుశోక్తిగతి నెందును గ్రాలుట ప్రస్తుతించెదన్.

8


మ.

తనకావించిన సృష్టి తక్కొరులచేతం గాదు నా [6]నేముఖం
బున దాఁ బల్కినపల్కు లాగమములై పొల్పొందు నా [7]వాణి భ
ర్తను (?) నీతం డొకరుండ నాఁ జనుమహత్త్వాప్తిన్ గవిబ్రహ్మ నా
వినుతింతున్ గవితిక్కయజ్వ నఖిలోర్వీదేవతాభ్యర్చితున్.

9


ఉ.

కామవిలోభకస్పృహల గర్వపరంకర [8]క్రందువాసి హృ
త్తామరసస్థితుం డగు సదాశివుఁ గాంచి తదేకచింత చిం
తామణియై తలిర్పఁ దుదిదాఁకినయున్నతిఁ గన్న శంకర
స్వామి గురుండు మాతలఁపు సర్వముఁ దానయి యుండుఁ గావుతన్.

10


వ.

అని యిట్లు పూజ్యపూజాతత్పరుండ నైన నాకు నభీష్టార్థదాతయై యవదాత చరితంబున నఖిలజనరంజనం బొనర్చుటం జేసి రాజశబ్దంబునకు భాజనం బగుచుఁ
దేజోవిలాసైకనిత్యుండు పల్లవాదిత్యుం డనియును నుదాత్తపౌరుషోద్ధతుండు జగనొబ్బగండం డనియును సంగతానేకనరపాలనపరిపాలనశీలుం డంగరక్షాపాలుం డనియును [9]సకలకళాధికృతవిసృమరకేలివిధేయుండు కేళాధిరాయఁడనియును ననుభూతాద్భుతసమరవిజయుండు సంగ్రామధనంజయుం డనియును [10] అఖిలశత్రువిదారణప్రతిజ్ఞాపూరణోద్దాముండు భుజబలభీముం డనియును నసాధ్యసాధకవీరవ్రతనిర్వహణపరాయణుండు వీరనారాయణుం డనియును దురవగాహరిపువ్యూహవ్యపోహాభీలుండు గుజ్జరిదళ[11]విపాలుం డనియు
నాశ్రితరక్షణవ్యవసితదయాలోలుండు [12]జగరక్షపాలుం డనియును [13]జతుర్విధ దుర్గదారణవిహారోదారుండు చంచుమలచూఱకారుం డనియును బ్రతిభటవేదండఖండనప్రచండుండు మండలీకరగండం డనియును బహుప్రకారంబుల వీర

వ్యహారంబులవలన నిశ్శంకంబు లై బిరుదాంకంబులు ప్రవర్తిల్ల విలసిల్లు వేమజనేశ్వరుండు.

11


క.

[14]సకలకవివర్ణనీయుఁడు, సకలనృపతిపూజ్యుఁ డతని[15]సంపద్విభవం
బకలంక మనాతంకము, సకలజగన్మంగళప్రసంగము పేర్మిన్.

12


సీ.

కేయూరకంకణాం[16]కితపరాక్రమవితరణములు [17]బాహుభూషణత నొంద
ననుకూలగృహిణిచాడ్పున నృపశ్రీ యెందుఁ గదలక సకలసౌఖ్యముల నొసఁగ
నమృతసేవనము చందమున [18]నుత్తమధర్మతాత్పర్య మధికమోదంబుఁ బెనుపఁ
గరతలామలకవిఖ్యాతి నాతతనీతిగరిమంబు నిజవివేకమున వెలయ


తే.

జాహ్నవీప్రవాహముభంగిఁ జరిత మఖిల, భువనపావనపరిపూర్తిఁ బొలుపు మిగులఁ
బరఁగు వేమక్షమానాథుపాటినృపులు, గలరె యెవ్వారు ధారుణీతలమునందు.

13


ఉ.

వాలి మదోద్ధతారిజయవాంఛ నుదగ్రభుజుండు వేమభూ
పాలుఁ డనంతసైన్యభయబంధురలీలఁ గడంగి యెద్దెసన్
గ్రాలఁగఁ దీవ్రఘోట[19]ఖురఘట్టన మొందనిచోటు లేదు వా
చాల[20]విలోలవీచిశతసంకులసాగరవేష్టితక్షితిన్.

14


శా.

కాంతారంబులు దూఱి శైలములు ప్రాఁకన్ బాఱి [21]యంభోధితో
యాంతర్భూముల దాఁటి యెన్నఁడు[22]ను భీత్యంతంబెదం గాన క
త్యంతక్లేశము నొందుచుండుదురు వేమాధీశుధాటిం బరి
భ్రాంతిత్యక్తకళత్రపుత్రసుహృదాప్తశ్రీకులై శాత్రవుల్.

15


మ.

గజతాఘోటకహాటకప్రముఖముల్ గప్పంబు లొప్పించుచున్
విజితారాతులు మ్రగ్గ దిక్కుల హిమానీకాశ[23]నీకాశలై
నిజకీర్తుల్ నిగుడంగ లక్ష్మి కతులోన్మేషంబు పోషించె న
క్కజమై వేమనరేంద్రుపేర్మి జగదాకల్పంబు గా కల్పమే.

16


క.

ఘనుఁడు పరాక్రమసంభృత, ధనకోటికి ఫలము పాత్రదానమ యని యెం
దును బహుపురాణముఖముల, వినుచుండుటఁ జేసి యధికవిశ్వాసమునన్.

17


వ.

ఇష్టాపూర్తరూపం బగు క్రియాకలాపంబు నిజకర్తవ్యానురూపంబుగాఁ దొడంగి.

18


సీ.

అగ్రహారములు విద్యాతపోవృద్ధవిప్రుల కిచ్చి యజ్ఞ[24]కర్తలుగఁ బనిచెఁ
గొమరారఁ జెఱువులు గుళ్లు ప్రతిష్ఠించి లోకసంభావ్యంబులుగ నొనర్చె
నిధులు నల్లిండ్లును నిలిపెఁ దోఁటలు సత్రములు [25]చలిపందిళ్లు వెలయఁ బెట్టె
హేమాద్రిపరికీర్తితామితవ్రతదాననివహంబు లన్నియు నిర్వహించెఁ

తే.

జేసెఁ జేయుచునున్నాఁడు సేయనున్న, వాఁడు పునరుక్తకృతిశుభావలుల నెల్ల
[26]ననఁగ శ్రీవేమవిభునకు నలరుపేర్మి, వశమె వర్ణింపఁ దద్భాగ్యవైభవంబు.

19


ఉ.

చుట్టు నిజప్రభాపరిధిసోఁకున సర్వదివేలుశైలముల్
గట్టిపసిండి యై తనకుఁ గాంచనభూధ్రము లొప్పఁ బాత్ర మై
[27]చుట్టము లెల్ల నాత్మసమశోభితసంపద నొంద నొప్పెఁ దాఁ
జుట్టపుమేరు వన్వినుతి సొంపున వేమనరేంద్రుఁ డున్నతిన్.

20


చ.

కులజలరాశిచంద్రుఁ డగుకోమటిప్రోలనయు న్నితంబినీ
తిలకము పుణ్యురాలు పతిదేవత యన్నమయుం గృతార్థతా
కలితులు [28]వీరు వేమవిభుఁ గానఁగఁ గాంచిన[29]పుణ్య మెట్టి దే
కొలఁదుల నెన్నిజన్మములఁ గూర్చిరొ నాఁ [30]బొదలెన్ జనస్తుతుల్.

21


సీ.

పంట[31]కులస్వామి ప్రఖ్యాతుఁ డౌర వేమయపితామహుఁ డనుమాన్యతయును
ధూతకలంకుండు దొడ్డయ సైన్యనాయకుఁడు మాతామహుం డనువినుతియు
నాదిరాజన్యతుల్యాచారనిధి మాచవిభుఁడు పూర్వజుఁ డను విశ్రుతియును
శ్రీయుతుల్ [32]పోతయ చిట్టయ నాగయ ప్రభులు మాతులు రను భవ్యతయును


తే.

దనమహత్త్వంబు భూషింపఁ దాను వారి, పేరు వెలయింపఁజాలు గంభీరమహిమ
నాత్మగుణముల నొదవించు నన్వయైక, పావనుఁడు వేమజనపతి గేవలుండె.

22


తే.

తనకు నద్దంకి తగురాజధానిగాఁ బ, రాక్రమంబున బహుభూము లాక్రమించి
యనుజతనుజబాంధవమిత్రజనుల కిచ్చె, నెదురె యెవ్వారు వేమభూమీశ్వరునకు.

23


క.

దైతేయారికి మాఱుట, చేతులక్రియ నొప్పి రెందుఁ జేదోడై వి
ఖ్యాతులు [33]తమ్ములు వేమ, క్ష్మాతలపతి కన్నవిభుఁడు వల్లప్రభుఁడున్.

24


వ.

అయ్యిరువురయందును.

25


ఉ.

అన్న చమూవరుండు సకలార్థసమన్వితుఁ డన్నదానసం
పన్నుఁ డభిన్నబాహుబలభాసి భవాంఘ్రిసరోజపూజనా
సన్నుతితత్పరాత్ముఁ డవసన్నవిరోధి ప్రసన్నభావుఁ డ
భ్యున్నతిశాలి [34]కీలితశుభోదయుఁ డూర్జితుఁ డయ్యె నెయ్యెడన్.

26


వ.

తదనంతర[35]ప్రభుండు.

27


శా.

బాహాదర్పమునం బ్రతీపధరణీపాలావలిం దోలి యు
త్సాహోదగ్రుఁడు మోటుపల్లి గొని సప్తద్వీపపర్వస్తుసం
దోహంబున్ దన కిచ్చు నెచ్చెలి సముద్రుం [36]బ్రీతిఁ బోషించుచున్
మాహాత్మ్యంబు వహించె మల్ల[37]రధినీనాథుండు గాఢోద్ధతిన్.

28

క.

రామునకు లక్ష్మణుఁడు సు, త్రామసుతుఁడు ధర్మజునకుఁ దగసౌభ్రాత్రం
బేమెయి నెఱపుదు రామెయి, వేముప్రభుఁ గొల్చె మల్లవిభుఁడును భక్తిన్.

29


శా.

వేమ[38]క్ష్మాధిపు కూర్మిపుత్రుఁడు దయావిభ్రాజి యవ్యాజతే
జోమార్తాండుఁడు కీర్తనీయసుగుణస్తోమంబులం దేమియున్
రామస్ఫూర్తి[39]కి లొచ్చుగాక సరియై రాజిల్లు [40]రాజార్చితుం
డాముష్యాయణుఁ డెందుఁ బోతయచమూపాగ్రేసరు డిమ్మహిన్.

30


వ.

తదీయానుజుండు.

31


క.

దానంబునఁ గర్ణునిసరి, మానంబున పేర్మి ననుపమానుఁడు బుధస
న్మానచతురుండు ప్రోలయ, సూనుఁడు గోమటి [41]సమస్తసులభుఁడు కరుణన్.

32


వ.

వేమధాత్రీపతికిఁ బరమమిత్రుఁడును సకలజగజ్జైత్రుండునునగు మాతుల
ప్రియపుత్రుండు.

33


మ.

జయ మేకయ్యమునందు నెంత రిపుక్ష్మానాథులం జెందనీఁ
డయసంపన్నత నెన్నఁగున్ వెలితిగాఁ డాద్యక్రమాయత్తమై
నయ మాత్మీయముగాఁ జిరస్థితుల నానంగించు నాఢ్యుండు చి
ట్టయనూకప్రభుఁ డిద్ధసత్యగుణని[42]ష్ఠం బట్టి పుణ్యం డిలన్.

34


వ.

ఇట్లు [43]సకలసమృద్ధులఁ బ్రసిద్ధప్రభావుం డైన వేమజననాథుం డొక్కనాఁడు
ప్రమోదంబు మిగులం బేరోలగం బుండి.

35


క.

అంబుజభవనిభుఁడును బో, లాంబావిభుఁడు నగు సూరనార్యునిసుతు న
న్నుం బూజితధూర్జటిచర, ణాంబుజు శ్రీవత్సగోత్రు నంచితచరితున్.

36


వ.

సవినయంబుగాఁ బూజించి యిట్లనియె.

37


తే.

సకలభాపాకవిత్వవిశారదుఁడవు, సాధుసమ్మతుఁడవు నిత్యసౌమ్యమతిని
భవ్యుఁడవు గాన నీమీఁదఁ [44]బరగఁ బక్ష, మేను గలిగియుండుదు నెప్పు డెఱ్ఱనార్య.

38


శా.

నాతమ్ముండు ఘనుం[45]డు మల్లరధినీనాథుండు ని న్నాతత
[46]శ్రీతోడన్ సముపేతుఁ జేసి యెలమిం జేపట్టి మా కిచ్చుటం
జేతోమోద మెలర్ప రామకథ మున్ జెప్పించి యత్యుత్తమ
ఖ్యాతిం బొందితి నింక నేను దనియన్ గావ్యామృతాస్వాదనన్.

39


క.

భారతపరాంశ మని యిం, పారఁగఁ జెప్పుదురు బుధులు హరివంశము నీ
వారమ్యకథఁ దెనుంగుగ, ధీరోత్తమ నిర్వహించి తెలుపుము మాకున్.

40


వ.

అనినం బ్రహర్షితపులకితదేహుండ నై యమ్మహాభాగునిసమగ్రసంప్రార్థనంబుఁ
గృతార్థతాకలిత[47]వృత్తం బగుచిత్తంబునం గైకొని యిట్లంటి.

41

ఉ.

నన్నయభట్టతిక్కకవినాథులు చూపిన త్రోవ పావనం
బెన్నఁ బరాశరాత్మజమునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ
వెన్నునివృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి
ట్లెన్నియొ సంఘటించె మదభీప్సితసిద్ధికి రాజపుంగవా.

42


క.

కావునఁ జెప్పెదఁ గల్యా, ణావహమహనీయరచన హరివంశము స
ద్భావమున నవధరింపుము, భూవినుతగుణాభిరామ ప్రోలయవేమా.

43


వ.

అని యమ్మహీనాయకుఁ గృతినాయకత్వంబున కభిముఖుంగా నొనర్చి జగద
ర్చితం బగుప్రబంధంబు నిర్మింప నుపక్రమించితి. నవ్విధం బె ట్లనిన.

44


కథాప్రారంభము

సీ.

[48]సౌమ్యంబు జగదేకరమ్యంబు నగునైమిశారణ్యమునఁ బుణ్యయజనశీలు
రైయున్న యాశౌనకాదిసన్మునులు [49]ప్రసిద్ధు వేదవ్యాసశిష్యు ననఘు
రోమహర్షణపుత్రు రుచిరవాగ్విభపు నుగ్రశ్రవసుం డనుకథకవర్యు
నర్థిఁ బూజించి మహాభారతాఖ్యాన మఖిలంబు వరుసతో నతనివలన


తే.

విని [50]మనంబులు సమ్మోదవనధి నోల, లాడుచుండంగ వెండియు నంత తృప్తి
సనక నూతనకౌతుకసంప్రయుక్త, హర్షరభసులై యిట్లని రతనితోడ.

45


శా.

వ్యాసప్రోక్తము భారతాగమము నీ వత్యంతహృద్యోక్తివి
న్యాసం బొప్పఁగ విస్తరింపఁగఁ గడున్ హర్షించె వీనుల్ సము
ల్లాసోద్భాసిని యయ్యె బుద్ధి శ్రుతితుల్యం [51]బద్భుతార్థోదయ
శ్రీసంభావిత మిప్పురాణము ప్రశంసిపంగ నిట్లొప్పునే.

46


ఉ.

ఇమ్మహితేతిహాసమున నెందును నబ్బరతాన్వయప్రసం
గమునఁ బూర్వభూపతులకర్మవిశేషములున్ గుణప్రకా
రములు దేవదైత్యమునిరాక్షసయక్షఖగాదిపుణ్యవృ
త్తమ్ములు ధర్మనిశ్చయ విధమ్ములు పె క్కెఱిఁగించి తింపుగన్.

47


ఉ.

కౌరవపాండవప్రభవగౌరవలీలలు నీవు చెప్పఁ దీ
పారెడుభంగి వింటిమి గుణాకర యింక జగత్త్రయంబునన్
ధీరులు శూరులున్ విభవదీప్తులు నా నుతిగన్నయాయదు
క్ష్మారమణాన్వయోత్తములచందములున్ విన వేడుకయ్యెడున్.

48


వ.

తదీయజన్మచరిత్రప్రపంచంబు సమస్తంబును విస్తరప్రశస్తంబుగా నుపన్యసింప
వలయు ననిన నక్కథకుండు ప్రముదితహృదయుండై వారలం గనుంగొని మీరు
వినంగోరిన యీయర్థంబు జనమేజయజననాయకునకు వైశంపాయనుండు చెప్పి

నది యేనునుం జెప్పెద వినుండు. మహాభారతశ్రవణానంతరంబ యాపరీక్షిత్తన
యుండు పరాశరతనయశిష్యున కి ట్లనియె.

49


సీ.

మునివర కురువంశమును యాదవాన్వయంబును నాదుమది కొక్కప్రోవ కాఁగఁ
దోఁచుఁ గౌరవగోటిఁ దొడరి కీర్తించుచో యాదవులను జెప్పి తచట నచట
నంతటఁ దృప్తి నాయంతరంగంబున కొదవదు. తదృృత్త మొకటి గొఱఁత
వడకుండఁ బ్రత్యక్షపరిచితం బైనదిగాదె నీబుద్ధికిఁ గాన యిప్పు


తే.

డివు సెప్పఁగ వినుట సమిద్ధహర్ష, కరము పరమేష్ఠి మొదలుగాఁ గ్రమముతోడ
నలయు ప్రఖ్యాతపురుషులవర్తనములు, గూడ నెఱిఁగింపవే వృష్ణికులమువిధము.

50


క.

అని బహుమానముగా నడి, గిన జనమేజయున కతులకృప వైశంపా
యనముని యిట్లను నభినం, దనపూర్వకముగ నుదాత్తతరహృద్యోక్తిన్.

51


చ.

విను హరివంశనామమున విశ్రుతమైన పురాణ మగ్రిమం
బనుపమవాగ్విశేషవిభవాఢ్యుండు సత్యవతీసుతుండు సె
ప్పినయది యేను నీకు వినిపించెదఁ బూజ్యతమంబు వంశవ
ర్ధనము సమస్తపుణ్యఫలదం బిది శ్రోతకు వక్తకున్ నృపా.

52


ఉ.

భాసితశుద్ధియుక్తుఁడవు భవ్యయశుండవు నైననీవ యు
ద్భాసితబుద్ధియుక్తమును భవ్యయశంబును నైన[52]యాదవో
ల్లాసచరిత్రమున్ వినఁ దలంపఁగ నర్హుఁడ సిద్ధవైభవ
శ్రీసుఖసుస్థిరాయువులఁ జెందగఁ బాత్రమ వై తనర్చుటన్.

53


సంక్షేపరూపం బగు నాదిసృష్టిప్రకారము

వ.

తత్ప్రకారంబునకుఁ బ్రారంభం బె ట్లనిన నఖిలేశ్వరుం డగుపరమాత్ముం డాత్మ
యోగంబున నాత్మయుం బ్రకృతియు నను తత్త్వమిథునంబు నిర్మించెఁ. బ్రకృతికి
మహత్తును మహత్తునకు నహంకారంబును నహంకారంబునకుఁ బంచ
భూతంబులుం బ్రభవించె. నాభూతంబుల వలన ననేక[53]భూతభేదంబు లుద్భూతంబు
లయ్యె. నిది సనాతనయైనసృష్టికి సంక్షేపంబు. తక్కినయవి దీనికి విస్తరావయవంబు.
లవి యెట్టి వనిన నవహితుండ వై యాకర్ణింపుము.

54


సీ.

అఖిలజగత్సృష్టి నాత్మ నపేక్షించి యాత్మోద్భవుండు నారాయణుండు
జలముల సృజియించి సమధికం బగు [54]నిజవీర్య మం దిడుటయు విస్మయముగ
విమలహేమాకృతి నమరుమహాండ మై కర మొప్పెఁ దద్భూరిగర్భమూర్తి
యై యుండి బహువత్సరాత్మకం బగుకాల మేగిన నది యవియించుకొనుచుఁ


తే.

బుట్టి యజుఁడు [55]క్రిందటివ్రయ్య భువియు [56]మీఁది
వ్రయ్య దివియును నడు మంబరంబుఁ జేసి

దిశలు కాలంబు మనసు బుద్దియును వాక్కు
గామరోషరత్యాదిసర్గము నొనర్చె.

55


వ.

మఱియు నతండు మరీచి యత్రి పులస్త్యుండు పులహుం డంగిరసుండు గ్రతువు
వసిష్ఠుండు ననువారి నేడ్వుర నుత్పాదించె. నమ్మహాత్ములు క్రియానిరతులుఁ
బ్రజాపతులు నై వెలసి. రాహిణ్య గర్భుండు నిజరోషంబున నంతకుం గలిగించె.
యోగవిద్యాప్రభుండుగాను సనత్కుమారు సృజించె. మేఘవిద్యుదింద్రధనువుల
నశనిరోహితనిర్ఘాతకేతువులఁ బర్జన్యపూర్వకంబుగాఁ బుట్టించె. ఋగ్యజుస్సామా
ధర్వణంబులు సంపాదించి యజ్ఞ[57]సిద్ధికిం బ్రతిష్ఠించి సర్వగాత్రంబుల ననేకభూతం
బుల నిర్మించె. నిట్లు ప్రవర్తిల్లిన సృష్టికి నభివర్ధనంబు గోరి.

56


క.

తన[58]మేని రెండుసగములు, వనితాపురుషులుగఁ జేసి స్వాయంభవుఁడన్
మనువును శతరూపాహ్వయ, మనుపత్నియుఁ గా నొనర్చె మహిమోజ్జ్వలుఁడై.

57


వ.

వార [59]లిద్దఱకుఁ బ్రియవ్రతోత్తానపాదులు జనియించి రందు.

58


సీ.

ధర్మునిసుతసూనృతాదేవి యుత్తానపాదునివలన సంపన్నయశులు
ధ్రువుఁ డనఁ గీర్తిమంతుం డనఁగాను నాయుష్మంతుఁ డన [60]మహాద్యుతి యనంగ
ననఘుల నలువురఁ గనియెఁ బుత్రుల నందు ధ్రువుఁడు నిర్మలనిష్ఠతోడ మూఁడు
వేలు దివ్యాబ్దముల్ వినుతతపంబు గావించి విరించి మెచ్చించి సప్త


తే.

మునులకంటె మీఁదై యొప్పుననుపమాన, సుస్థిరజ్యోతిరాత్మకస్ఫురితపదవి
వడసె సర్వగీర్వాణతపస్విసిద్ధ, సమితి యాశ్చర్యమునఁ దన్ను [61]సంస్తుతింప.

59


వ.

అట్టిధ్రువునకు శంభు వనుదానికి శ్లిష్టియు భవ్యుండును ననుకొడుకులు పుట్టిరి.
శ్లిష్టికి సుచ్ఛాయ యను సతి రిపు రిపుంజయ పుణ్య(ష్ప)వృకల వృకతేజసు లన
నేవురం గనియె. నందు రిపునకు [62]బృహతికిం జాక్షుషమనువు జనియించె.

60


క.

అతండు పుష్కరిణి యను, నాతికి వీరణసమాఖ్యనందనుఁ గనియెన్
బ్రీతి యెసఁగ [63]నడ్వల యసు, గోతి యతినివలనఁ గాంచెఁ గొడుకుల వరుసన్.

61


వ.

ఊరుండును బురుండును శతద్యుమ్నుండును దపస్వియు సత్యవాక్కును
గవియు నతిరాత్రుండును [64]నగ్నిష్టుత్తును [65]సుద్యుమ్నుండును నభిమన్యుండు
ననంబరఁగిన యాపదుండ్రయందును బెద్దవాఁడైన యూరునకు ఆగ్నేయియందు
గ్రమంబున నంగుండు సుమనుండు [66]ఖ్యాతి క్రతు వంగిరసుండును గయుండు
నన నార్వురు పుట్టి. రందు నంగుండు మృత్యుపుత్రి సునీథం బరిణయంబై వేనుం
డను కొడుకుం బడసె. నతండు.

62

ఉ.

ధర్మువు దప్పి తాపసమతంబున కంకిలిపొ టొన్పఁ గ్రో
ధోర్మిహతాత్ములై తపసు లొక్కట నాతని [67]దక్షిణంపుఁ గే
ల్నిర్మథనంబు సేసిన జనించెఁ బృథుం డనురా జతండు స
త్కర్మధురీణుఁ డై నిలిపే ధార్మికసేవిత మైనమార్గమున్.

63


క.

అంతియ కాదు వసుంధర, యెంతయు గోరూపఁ జేసి యిచ్చెఁ గుశలుఁ డై
సంతతబహువస్తునివహ, మెంత వలచి రెవ్వ రంత యేర్పడఁ గురియన్.

64


వ.

అతనికి హవిర్ధాన యనుమానినికి శిఖండిహవిర్ధానులు జనియించిరి. శిఖండికి ధిషణ
యను తెఱవకుఁ బ్రాచీనబర్హియు శుక్లుండును గయుండును గృష్ణుండును నధ్వ
రుండును నజినుండును నను నార్వురు వొడమిరి. ప్రాచీనబర్హికి సముద్రపుత్రి
యైన సవర్ణయందు బ్రచేతసు లనువారు పదుండ్రు ప్రభవించి పదివేలవర్షంబులు
ఘోరతపంబు సేసి సోమకన్యక యగు మారిషం దమకు ధర్మపత్నిఁగా వరియించి
యయ్యింతియందు.

65


క.

దాక్షిణ్యధనునిఁ గాంచిరి, దక్షు నశేషక్రియైకదక్షుఁ బ్రభుఁ బ్రజా
ధ్యక్షుని నసదృశతేజుని, సాక్షాత్పరమేష్ఠిఁ బరమసంయమశీలున్.

66


వ.

అని చెప్పిన విని జనమేజయుం డతని కి ట్లనియె.

67


తే.

[68]ఆయజునికాలిపెనువ్రేలియందుఁ బుట్టె, దక్షుఁ డన వింటిఁ [69]దొంటికథాప్రసక్తి
నిపుడు ప్రాచేతసుం డనియెదు మునీంద్ర, యివ్విధం బేమి దెలియంగ నెఱుఁగవలయు.

68


వ.

సోమదౌహిత్రుం డైన యతండ యా సోమునికి మాము యెట్లయ్యె నని యడిగిన
వైశంపాయనుం డిట్లనియె.

69


మ.

విను సర్గంబు లయంబు భూతముల కుర్వీనాథ నిత్యంబు లెం
దును జన్మింతురు దక్షుఁ డాదియగునాద్యుల్ సర్వకల్పంబులన్
జనికిం గారణముల్ పృథగ్విధములై సంధిల్లు లే దెవ్విధం
బున నూహింపఁగఁ బిన్న పెద్ద యగుచొప్పు న్వావియున్ వారికిన్.

70


ఉ.

గౌరవలాఘవంబులకుఁ గారణ మిందఱకున్ దపస్సమా
చారము తారతమ్యము నిజం బిది జన్మగురుత్వహీనతల్
గోరి గణింప రివ్విధి యుకుంఠితబుద్ధి నెఱుంగు పుణ్యుఁ డిం
పారఁగఁ బొందుఁ గాంక్షిత[70]సుఖాగమమున్ బరలోకభద్రమున్.

71


సీ.

తొలితొలి సృష్టికిం దొడఁగి యంబుజసూతి దలపోయ నాతనితలఁపునందు
మునిదేవదానవమనుజాదిభూతంబు లొక్కట జనియించి యక్కజముగ
నవి యెన్నియును గల్గె నన్నియ యై యుండెఁ గాని వర్ధిల్లుట గలుగదయ్యె
నివ్విధం బటు సూచి యించుక చింతించి భూతవృద్ధికి హేతుభూత మొకటి

తే.

గాంచి మిథునధర్మంబు నిర్మించెఁ దత్ప్ర, ధానసంప్రయోజనకారి [71]దక్షతకును
జనికి సంకల్పదర్శనస్పర్శనముల, తొల్లి హేతువు లై చెల్లు దురితదూర.

72


వ.

ఆదక్షప్రజాపతికి వీరణపుత్రి యైన యసిక్నియందుఁ బుత్రసహస్రపంచకంబు వుట్టి
తండ్రిపనుపున భూతసృష్టి సేయ నుత్సహించునెడ నారదుండు సనుదెంచి.

73


ఉ.

బాలురు మీర లీధరణిభాగము క్రిందును మీఁదు దిక్కులున్
మూలలు నేంత యక్కొలఁది ముందఱి నిక్క మెఱింగికాక యు
క్కీలయి యిట్లు సృష్టిపనికిం దమకింపఁగఁ జన్నె యన్న వా
రోలిన యన్నివంకలకు నొక్కట నారయ నేఁగి రందఱున్.

74


క.

అమ్మెయిఁ జని యొకఁడైనన్, గ్రమ్మఱఁ జనుదేఁడ తత్ప్రకారంబున కు
ల్ల మ్మెరి[72]యఁగ నాదక్షుఁడు, క్రమ్మలు నాత్మజసహస్రకముఁ బుట్టించెన్.

75


వ.

వారు ముందఱివారియట్ల ప్రజల సృజియింపం దొడంగినఁ దొంటిచందంబున
నారదుం డరుగుదెంచి పలికిన.

76


తే.

ఇయ్యకొని లెస్సపని సెప్పె నిమ్మునీంద్రుఁ
డాదిఁ జన్న[73]వారలక్రమ మరయవలదె
యనుచు [74]నన్నిదిక్కులకు నత్యాదరమునఁ
బోయి యా[75]పోకలన డిందిపోయి రనఘ.

77


క.

[76]అది గతముగ భ్రాత సనిన, పదవి యరయఁ బోక సనదు భ్రాతక యని చె
ప్పుదు రాద్యు లవ్విధమున, వదలి చనినయాత్మజులకు వనరుచు మఱియున్.

78


వ.

దక్షుండు నిజపత్నియం దఱువండ్రు కూఁతులం గని ధర్మునకుం బదుండ్రను
గశ్యపునకుం [77]బదుమువ్వురను జంద్రునకు నిరువదియేడ్వుర నరిష్టనేమికి నలువు
రను గృశాశ్వునకు బహుపుత్రునకు నంగిరసునకు వేర్వేఱ నిద్దఱిద్దఱ నిచ్చె.
వారివలన వసురుద్రాదిత్యవిశ్వసాధ్యాదిదేవతలుపు దైత్యదానవయక్షరాక్షస
గంధర్వాప్సరోవిహంగ[78]భుజంగమప్రముఖులు బ్రభవించిరి. మఱియు గో
గజాశ్వ[79]ఖరోష్ట్రసింహశార్ధూలాద్యఖిలక్షుద్రజంతువులును జనియించె. వృక్ష
తృణలతాగుల్మాదులు నుద్భవించె. నందుఁ గశ్యపభార్య యైన దితిదేవి హిరణ్య
కశిపు హిరణ్యాక్షులం గనియెం. దత్సంతానం బపరిమేయం బై యదితి సంతతి
యైన యాదిత్యులతో విగ్రహించె. నట్టి విగ్రహంబున.

79


ఇంద్రుఁడు వజ్రాయుధముచేత దితిగర్భంబు ఛేదించిన ప్రకారము

మ.

అమరశ్రేణికి దైత్యసంతతికి నన్యోన్యాహవం బుద్ధత
క్రమరోషంబున నైన నందు సురవర్గం బేచి యవ్వైరిసం

ఘములో ముఖ్యులఁ బల్వురం దునుమ శోకం బంది దైతేయమా
త మనోవల్లభుఁ గశ్యపుం బ్రకటతాత్పర్యంబునం గొల్చినన్.

80


క.

ఆతడు ప్రసన్నుఁ డై య, న్నాతిన్ వర మడుగు మనిన నాకేశు ననిన్
ఘాతింపఁగ నోపెడుసుతు, నాతతబలు నవ్వరాంగి యర్థించుటయున్.

81


తే.

అమ్మహాత్ముఁ డాయమతోడ సబల నీవు, శుచిత నెప్పుడు నేమఱ కచలవృత్తిఁ
దగిలి నూఱబ్దములు చూలు దాల్పనోపు, దేని నట్టిపుత్రుఁడు జనియించు ననిన.

82


వ.

అయ్యుగ్మలి యయ్యుగ్రవృత్తంబు నడప నొడంబడియెం. గశ్యపమునియు గర్భ
ప్రదానంబు సేసి తపోవనంబున కరిగె. నమ్మగుప నిత్యంబునుగాఁ ద్రికాల
స్నానంబును వివిధోపవాసవ్రతంబులుం బూని శుచియై యుండె. నంతఁ దదంతరా
యా[80] పేక్షుండై సహస్రాక్షుండు సనుదెంచి నమస్కరించి తల్లీ నీవు వ్రతస్థితవై
యునికి యెఱింగి శుశ్రూష యాచరింప వచ్చితి ననిన నమ్ముగ్ధ సంతసిల్లి.

83


మ.

తనయా [81]యెంతయు మేలు సేసి తిటు మత్సామీప్యసంసేవివై
యనురూపస్థితి నుండు మబ్దశతపర్యాప్తి జనింపంగ నీ
యనుఁగుందమ్మునిఁ జూచు నుత్సవము నీ కబ్బున్ జగం బంతయున్
విను మీ రిద్దఱుఁ గూడి యేలుఁడు కడున్ విఖ్యాతి సంధిల్లఁగన్.

84


క.

అనియె నతండును దత్సే, వనతాత్పర్యంబు [82]తగ నెపం బిడి యే ప్రొ
ద్దును [83]నెడమడు గగుమదితో, ననువర్తింపంగఁ గించిదవశిష్టముగాన్.

85


వ.

సంవత్సరశతం బతిక్రాంతం బైన నొక్కనాఁ డమ్ముదిత పాదశౌచంబు సేయమఱచి
నిద్రిత యైన నది రంధ్రంబుగాఁ దదీయోదరంబు సొచ్చి జంభారి దంభోళిం గొని
తద్దర్భం బేడువ్రయ్యలుగా వ్రేయ నయ్యర్భకుండు రోదనంబు సేసిన.

86


క.

మా రుద యని పలుకుచు నతి, దారుణరోషంబుతోడఁ దచ్ఛకలము ల
వ్వీరుఁ డొకటొకటి యేడే, డై రూపఱ నడిచె నంత నసభ్యుత్థిత యై.

87


క.

అసురజనని కడునార్తిని, వసమఱి యిటు సేయఁదగునె వాసవ యనఁగాఁ
ద్రసదంతరంగుఁ డగుచును, వెస వెలువడి విబుధవిభుఁడు వినతాంగుం డై.

88


చ.

అడుగులయందు శౌచవిధి యాత్మ నొనర్పఁ దలంప కీవు కా
ల్గడఁ దలయంపిగా నిగుర గైగొన నేనిది యంతరంబుగాఁ
గడఁగి మదంతహేతు వగుగర్భము నొంచితి దీనిఁ దప్పుగాఁ
దడవక సైఁపఁగా వలయుఁ దల్లి నినుం గొనియాడు లోకముల్.

89


చ.

అనవుడు నింద్రుతో ననియె నమ్మునిపత్ని యొకింతయేనిఁ గీ
డన వశమే భవచ్చరిత మంతయు లెస్సయ కాక యింక నా

కు నొకటి మేలు సేయఁగఁ దగున్ గులిశాహతి[84]చేత నైనయ
త్తనుశకలంబు [85]లన్నియు వధం బొనరింపక కావు మింతటన్.

90


వ.

ఈ నలువదితొమ్మిదియును దేవత లై నీవు మా రుద యనుట కారణంబుగా
మారుతు లనం బరగి దేవాసురసమరంబులందు నీకుం జేదో డై [86]నడువవలయు.
దీనికి నొడంబడు మనియె. నతం డవ్విధంబునకుం బ్రియంబు నొందె. నిది సకల
భూతసంభవప్రకారంబు.

91


క.

ఈ సృష్టివిధం బెఱిఁగిన, భాసురపుణ్యుండు సకలభయములవలనన్
బాసియు నతులైశ్వర్య, శ్రీసౌఖ్యము లొందు మోక్షసిద్ధియుఁ గాంచున్.

92


వ.

విను మివ్విధంబునం గలిగిన భూతవిశేషంబులకు నజుండు ప్రత్యేకంబ యధి
కారులం గలిగించి యభిషేకం బొనర్చె. నంతయు వివరించెద.

93


సీ.

పృథుఁడు భూపతులకుఁ బెద్దవాఁడై యుర్వి యంచితనీతిఁ బాలించువాఁడు
ద్విజతారకాతరువ్తజయజ్ఞములకు నుజ్జ్వలతపంబుల కోషధులకు సోముఁ
డర్థసంపదలకు [87]నంబుధివితతికి రాజన్యులకును వైశ్రవణుఁ డొడయఁ
డఖిలభూతముల ననంతపిశాచసంచయముల శాసించుఁ జంద్రధరుఁడు


తే.

విష్ణుఁ డాదిత్యులకు వసువితతి కగ్ని, జలములకుఁ బాశపాణి వేల్పులకు నింద్రుఁ
డసురకోటికిఁ బ్రహ్లాదుఁ డంతకుండు, పితృసమూహంబునకు నధిపతులు వరుస.

94


క.

నాగులకు వాసుకియుఁ బెఱ, భోగులకుం దక్షకుఁడుఁ బ్రభులు పక్షులకున్
నాగాంతకుండు మనుజవ, రా! గంధర్వులకుఁ జిత్రరథుఁడును నొడయుల్.

95


క.

కరులకు నైరావతమును, హరులకు నుచ్చైశ్శ్రవంబు నవనీస్థలిపై
నరులకు నృపతియు హిమగిరి, గిరులకు నేఱుల కుదధియుఁ గీర్తిత[88]ధర్తల్.

96


వ.

ఇది యాదిగా నాదిసర్గంబునం బరమేష్ఠి నియమించిన యాధిపత్యంబు లట్లు నిశ్చ
యించి యాజగద్ధాత ధాత్రియంతయు నాలుగు చెఱంగులుగా నేర్పఱిచి యందు
బూర్వదిక్కున విరాట్పుత్రుం డగు[89]వైరాజును దక్షిణదిక్కునం గర్దమపుత్రుం
డగుశంఖపదుండునుం బశ్చిమదిక్కున రజఃపుత్రుం డగుకేతుమంతుండును నుత్త
రపుదిక్కునం బర్జన్యపుత్రుం డగుహిరణ్యరోముండును బరిరక్షకులుగాఁ
బ్రతిష్ఠించె. నన్నలువురు రాజులును మధ్యమభూమిశ్వరుం డగుపృథుండు
తమకు ననుశాసకుండుగా భాసిల్లి. రివ్విధంబునం బూర్వులచేత నీయుర్వి సర్వ
పర్వతద్వీపసాగరసమేతయై యనుభూతిం బొందె. నంతం జాక్షుషమన్వంతరానంత
రంబున వనజభవుండు వైవస్వతమనువునకు సమగ్రసామ్రాజ్యం బొసంగె ననిన
విని జనమేజయుండు.

97

చ.

మునివర యివ్విధంబున సముద్భవ మొందెఁ బృథుండు? ధాత్రి యే
యనువున దోహయోగ్య యగునట్లుగఁ దా నొనరించె? నెవ్వర
మ్మనుజవరేణ్యుపన్పున సమంచితవస్తువిశేషదోగ్ధలై
రనయముఁ జిత్ర మట్టితెఱఁ గంతయు నా కెఱిఁగింపు నావుడున్.

98


పృథుచక్రవర్తి భూమిని గోవుఁగాఁ జేసి వస్తువులు గొన్న ప్రకారము

వ.

అతనికి వైశంపాయనుం డిట్లనియె.

99


సీ.

ఆదియుగంబున నంగుండు నాఁ జను భూమీశ్వరుఁడు మృత్యుపుత్రియైన
నీరజనయన సునీథయం దధికబాహాసముద్ధతు వేనుఁ డనుతనూజుఁ
గనియె రాజై వాఁడు తనదుమాతామహుఁ బోలి క్రౌర్యంబునఁ బుడమిజనులఁ
బీడించి ధర్మంబుఁ బెడఁబాయఁగాఁ ద్రోచి వేదవిరుద్ధదుర్వృత్తి మరగి


తే.

యెల్లవారలఁ బిలిచి మీ రేసుకృతము, నాచరింపఁగ వలదు మీ రధ్వరముల
తెరువు వోకుఁ డీమేర నతిక్రమింతు, రేని జంపుదుఁ జెఱుతు నెవ్వానినైన.

100


తే.

యజన మిజ్యుండు యష్ట నా నతిశయిల్లు, నిన్ని తెఱఁగులవస్తువు లేన కాఁగఁ
దలఁపుఁ డేమేని కర్జంబు గలిగెనేనిఁ, [90]బన్నుగా నది చేయుఁడు నన్నుగుఱించి.

101


వ.

అని యాజ్ఞాపనంబు సేసిన.

102


సీ.

జపములు గాయత్రి సహితంబుగా [91]మాసె వేదంబు పేరును వినఁగ లేద
సోమపానక్రియచొప్పులు [92]రూపఱె హుతములు కఱవయ్యె హుతవహునకు
సర్వదైవతసమర్చలు గట్టిపెట్టంగఁ[93]బడిన భూతంబులపనులు సమసెఁ
బరహితంబులు దానపరతలుఁ గడతేఱె సతతవ్రతోపవాసములు పొలిసె


తే.

[94]స్వామిచందంబు చందమౌ జనుల కనిన, మాట నిజముగ వేనక్షమాతలేశుఁ
డఖిలధర్మపరాఙ్ముఖుఁ డయిన నతని, మతము చెల్లించి రెందును మనుజకోటి.

103


వ.

[95]ఆమెయికిఁ దలంకి తపస్వివరు లెల్ల నమ్మహీపాలుపాలికిం జనుదెంచి.

104


మ.

జనసంత్రాసనవృత్తి, [96]జేయఁదగునే సత్కర్మ నిర్మూలనం
బొనరింప న్నృప నీకు నిట్లు విను మే మొప్పారఁ బెక్కబ్దముల్
[97]జనుయాగం బొనరింపఁజూచెదము విశ్వక్షోణికిన్ రాజ వీ
వనుకూలుండవు గమ్ము మాక్రియకు ధర్మాయత్తచిత్తంబునన్.

105


తే.

క్షత్రియునిఁ దెచ్చి తొలితొలి గద్దియనిడి, పట్టబద్ధుఁ గావించుచోఁ బ్రజలు దమ్ముఁ
గావ ధర్మంబు నడపను గాదె సమయ, మర్థిఁ బలుకుదు రీ వది యరయవలదె.

106

మ.

అనినం బెల్చన నవ్వి యమ్మునులతో నాతండు న న్నొక్కరుం
డనుశాసింపఁ బ్రభుండె ధర్మమున కధ్యక్షుండ నే నొల్లకుం
డిన సర్వోర్వియుఁ ద్రొక్కి తోయములలో డిందింతు [98]మిన్నైన వ్ర
త్తు నశేషాండ[99]పుటంబు గాల్తు వల దీదుర్వాక్యముల్ మాదెసన్.

107


వ.

మీ రేమియు నెఱుంగ రూరక పొం డనుటయు వారు మఱియును బెక్కుతెఱం
గులం [100]బలుకం దొడంగి తా రెంత దెలిపిన నాదుర్వినీతుండు తనదుర్వినయంబు
చూపం గడంగినం గినిసి నిజతేజోబలంబున నాబలశాలిం [101]బట్టి మిడుకమిడుకం
ద్రొక్కి మంత్రయుక్త[102]కుశంబుల నతని యెడమతొడ [103]వ్రచ్చిన నందు.

108


క.

కాలినకొఱవ తెఱుంగునఁ, [104]గాళిమమగు కుఱుచమేను గలపురుషుఁ డొకం
డాలోకనదుస్సహుఁడై , యాలో జనియించి [105]భీతి వడుఁకుచు నెదురన్.

109


వ.

కృతాంజలి యై నిలిచినం జూచి మునులు నిషీద యని పలికి నిషేధించి. రతండు
కల్మషసంభవుండు నిషాదుం డనం బరఁగె. వింధ్యప్రముఖసంచారు లగుపాప
కారులు కిరాతకైవర్తాదు లెల్లఁ దత్సంతానజాతు లై. రమ్మహాద్విజులు మఱియును.

110


వేనశరీరమథనంబునఁ బృథుఁ డుద్భవించినప్రకారము

క.

[106]వెర వొప్పఁగ వేనజనే, శ్వరుదక్షిణకరతలంబు సంరంభముతో
దరువంగ నరణిమథన, స్ఫురితుం డగు జాతవేదుపోలిక యమరన్.

111


ఉ.

ఆజగవాఖ్యమై పరఁగునాద్యశరాసనమున్ సముల్లస
త్తేజము దీప్తబాణములు దివ్యకనత్కవచంబుఁ దాల్చి యు
ద్వేజితశత్రుఁ డప్రతిమదీర్ఘతనుండు జనించె రాజవి
ద్యాజితలోకుఁ డైన పృథుఁ డమును లమ్మును లద్భుతవార్ధిఁ దేలఁగన్.

112


క.

ఆతండు ప్రభవింప మహా, భూతము లన్నియును బ్రీతిఁ బొదలుచు సేవా
కౌతూహలమున నచటికి, నేతెంచె నుదాత్తమూర్తు లెంతయు వెలయన్.

113


మ.

అభిషేకార్థముగా నిజోదకము లింపారంగఁ గొంచున్ సరి
త్ప్రభుఁ డాపూర్ణసరిత్సరస్సహితుడై ప్రాదుర్భవించెన్ సరో
జభవుం డింద్రుఁడు లోనుగాఁ గలమరుత్సంఘంబుతో నేఁగుదెం
చె భువిన్ బేర్కలసంయమీంద్రతతి వచ్చెం బేర్చుమోదంబునన్.

114


ఆ.

అట్లు జాతుఁ డైన యాసుపుత్రుండు పు, న్నామనరకమోక్షణం బొనర్ప
వేనుఁ డపుడ పుణ్యవృత్తి సంసేవ్యలో, కముల కరిగె సురలు గారవింప.

115

ఉ.

అమ్మెయిఁ గూడినట్టిఘను లందఱు నాతని నత్యుదగ్రపీ
ఠమ్మున నుంచి పెంపు ప్రకటంబుగఁ బావనమంత్రయుక్తతో
యమ్ముల సౌర్వభౌమ విభవాఢ్యునిఁగా నభిషిక్తుఁ జేసి రొ
క్కుమ్మడి మ్రోసే దివ్యమురజోత్కటనాదము లెల్లదిక్కులన్.

116


వ.

ఇవ్విధంబున [107]నవ్విశుద్ధతేజునకుం బూజితస్థైర్యం బగునైశ్వర్యం బొసంగి కృత
కృత్యులై కృత్యవేదు లగునాచతుర్ముఖాదులు నిజస్ధానంబుల కరిగిరి. తదనంతరంబ.

117


క.

ఏకాతపత్రముగ సిరి, గైకొని నృపమౌళి రత్నకలికాకలితా
లోకంబు చరణపీఠ, శ్రీ కున్నతిసేయఁ బృథుఁడు చెన్ను వహించెన్.

118


చ.

తనజనకుండు ధర్మగతి దప్పుట నొప్పఱి తొల్లి యొల్లఁబో
యిన జనకోటి దాను గడు నెక్కుడుగా నొనరించు నాదరం
బున ననురంజనోత్సవముఁ బొందఁగ రా జను పేరి కొక్కఁడున్
బెనుపగుపాత్ర మయ్యె గుణపేశలుఁ డాతఁడు నీతిధన్యతన్.

119


చ.

జలనిధులైన మెట్టలగు శైలములైన నడంగు [108]నవ్వియ
త్తలమయినం దలంబ యగు దానములైనఁ దిరోహితంబులై
తొలఁగు నతండు సంచరణదోహలమున్ బ్రసరించుచో రసా
తలసురధామసీమలను దద్రథ[109]రోధము లే దొకింతయున్.

120


క.

దునకయు వెద పెట్టకయున్, దనరె నఖిలసస్యములును ధారుణి గోవుల్
పెనుపొందెఁ గామదోహిను, లనఁ దరువులు మధురమధుఫలాఢ్యము లయ్యెన్.

121


సీ.

ఆసమయంబున నంభోజసంభవుయాగంబునంచు [110]సుత్యాహమునను
సొరిది సంజాతుఁ డై సూతుండు నాఁ జనుమునియుఁ దన్మఖకాలమునన జనన
మొంది మాగధుఁడు నా నొప్పుసంయమియు నయ్యజునాజ్ఞఁ గైవారులై దివిజుల
నలరించు పని నున్కి నందుల ఋషులు వేల్పులుఁ బ్రియంబున వారిఁ బిలువఁ బనిచి
తే. పృథునరేశ్వరుఁ డిటమీదఁ బేర్మి యెసఁగఁ, జేయఁగల[111]కార్యములు సవిశేషకృతులు
నాత్మదృష్టిమైఁ గని మీర లతనియెదిరి, కేఁగి కైవార మొనరింపుఁ డింపుమిగుల.

122


వ.

అని పనిచిన నమ్మహామనస్కులపనువు గైకొని వార లరిగి యావైన్యుం గని
మధురమనోహరగంభీరధీరపవిత్రచిత్రస్తోత్రంబుల నమ్మహాక్షత్రియు నుద్దేశించి
యుపన్యాసంబులు సేసిన బ్రీతుండై యయ్యాదిమవదాన్యుండు సౌజన్యసుముఖ
త్వంబు శోభిల్ల సూతునకు సూతదేశంబును మాగధునకు మగధజనపదంబు
నుద్యోగంబుగా నిచ్చిన నయ్యౌదార్యంబు సూచి కార్యాపేక్షు లై మహీజనం
బులు మన కితఁడు వృత్తిప్రదాత యగు నని కదిసి తమ తమ నేర్పు [112]లెలర్పం

గొలువం జొచ్చి రట్టిసేవవలన నతనిచిత్తం బెఱింగి మాకు నెల్లనాఁటికి శాశ్వ
తంబులై నడుచు జీవనంబులు గావింపవలయు నని యభ్యర్థించిన నట్ల కాక యని
యొడంబడి.

123


పృథుచక్రవర్తికి భూదేవికి నైన సంవాదప్రకారము

సీ. ఆరాజపుంగవుం డతిరౌద్ర మగుశరాసనమును సందీప్తసాయకములు
గైకొని ప్రజలకుఁ గామితవస్తువు లెల్లకాలంబును నిచ్చుచుండుఁ
గాత యివ్వసుమతి యీతెఱం గొనరింపకున్న వ్రక్కలుగఁ జేయుదు ననంగ
వెఱుచి గోరూపయై పఱచె మేదిని యమ్మహాయోగబలదుర్జయాత్ముఁ డలుక


తే.

వెనుకొనంగ నాయమయును వనజభవుని, నెలవులోనుగజగములన్నియును దూఱి
తూఱి యెచ్చోటు సొచ్చినఁదోనతగులు, వైన్యుఁ గనుఁగొని తనుఁ గాచువారు లేమి.

124


వ.

అతని శరణంబు సొచ్చి వినయవినమితోత్తమాంగ యై యి ట్లనియె.

125


చ.

అధిప ప్రజాభిపోషణము నర్థి నొనర్పఁదలంచితేని మ
ద్వధ మొనరించి [113]నీ వెటుల ధన్యత నొందెడువాఁడ వొప్ప ద
వ్విధము చరాచరాత్మకము [114]విశ్వము నేను ధరింతు నాకు దు
ర్విధి [115]యొలయంగ నింతయును వేచెడి[116]పోవుట నీవ చూడుమా.

126


క.

అన్నంబు నాయధీనం, బన్నము లేకున్న నిలుచునయ్య యొడ ళ్ళీ
సన్నపుఁదలఁ పుడిగి సుసం, పన్న మగునుపాయ మొకటి పాటింపు తగన్.

127


తే.

విను ముపాయపూర్వక మగువిపులయత్న, మరయ [117]సర్వార్థసాధక మఖిలజీవు
లందు వనిత లవధ్య[118]ల యగుట నన్నుఁ, గావు నామాట విని కార్యగతికిఁ జొరుము.

128


క.

[119]అనుడు జననాథుఁ డిట్లనుఁ, దనకై యొరులకయి బహువిధప్రాణులఁ జం
పినఁ గీడగు నొకటిఁ దునిమి, మనుచు [120]టరుదె దేవి జీవమండలిఁ జెపుమా.

129


ఉ.

కావున మత్ప్రయోజనము గై కొని చేయనినిన్నుఁ ద్రుంచి యే
నీవివిధప్రజావితతి నెక్కటి దాల్చి [121]సమగ్రజీవన
శ్రీ వెలయించి నామహిమ సిద్ధముగా నఖిలంబునందు సం
భావన [122]మొందఁజేసెద నభంగుర మిప్పని సాగరాంబరా.

130


వ.

నీవు సర్వార్థసమర్థ మగుట యెఱుంగనే నన్ను నిట్లు గారింపం దలంచి యిమ్మెయికి
మేకొనవు గాక యది యట్లుండా నా[123]కోర్కియు సిద్ధించునట్లు గావించి మదీయ
దుహిత వై యెల్లలోకంబులం బ్రఖ్యాతి గలిగించుకొని బ్రతుకు మిట్లు
చేసెదవేని నిన్ను గుఱిచి కైకొనిన యీరౌద్రసాయకం బుపసంహరించెద ననిన
నద్దేవి యొక్కింత చింతించి యతని నాలోకించి.

131

క.

గోరూప నైననా కిం, పారఁగఁ గ్రేపుల ఘటించి యయ్యైవస్తు
క్షీరములు పిదికికొనుటకుఁ, గోరి పనుపు వివిధభూతకోట్లను వరుసన్.

132


వ.

అ ట్లయిన నెల్లవారికి వలయువాని నెల్ల నోలి నొసంగ నోపుదు. నిది నీకుఁ
బరమోపాయంబు. మఱియొక్కటి గలదు నిమ్నోన్నతభాగంబులవలన సమంబు
గా కున్న నాయాకారంబు చక్క నగునట్లుగా జూడు మనిన నట్లకాక యని
వైన్యుండు కార్మికకోటిం గొని [124]శిలలు ప్రోవు సేసి శిలోచ్చయంబులు గావించి
యెల్లచోట్లు సవరమై యుండ నొనర్చి నగరగ్రామాదులు రచియింపం బనిచెఁ.
దొల్లి నివాసంబులు సస్యంబులు గోరక్ష వాణిజ్యంబు లనునవి లేవు. కేవల వన
సంచరణంబునఁ గందమూలఫలంబులు భరంపడి ఘటియించి యుపయోగింతురు.
పృథుమహీపాలుపాలనంబు మొదలుగా సమస్తవస్తుసిద్ధి గలిగె నని విందు.
మవ్విధంబున ననన్యసామాన్యసమాచరణధుర్యుం డయిన యప్పురుషవర్యుండు.

133


సీ.

[125]స్వాయంభువుం డనఁ జనుమనుప్రవరుని వత్సంబుగాఁ జేసి వఱలు తనకు
హస్తంబు పాత్రమై యతిశయిల్లఁగ మహీధేనువుఁ బిదికి ధాత్రీజనులకు
సకలవర్గములును సర్వయుగంబుల వృధగాక ఫలియించువిధము గాఁగ
నొనరింప లోకు లభ్యుదయసమేతులై వర్తిల్లి రతఁ డెల్లవలనఁ గలుగు


తే.

భువనవాసులఁ బిలిచి మీ రవికలముగ, వలయునవి వేఱువేఱ మీవలను మెఱయ
నిద్ధరాదోగ్ధ్రిఁ గ్రేపుల నెలమిఁ జేసి, [126]పిదికికొనుఁ డని పనిచె [127]సమ్మదము మిగుల.

134


వ.

వారు నతని యత్నంబు గొనియాడి యట్లు సేసి [128]రందు.

135


క.

సోముఁడు వత్సముగా సు, త్రామగురుఁడు [129]దోహకుఁడుగఁ దగ నఖిలచ్ఛం
దోమయపాత్రం బిదికి ర, నామయులగుమునులు బ్రహ్మ మను దుగ్ధంబున్.

136


క.

సురలు గొనిరి కాంచనవి, స్ఫురదజ[130]పాత్రమున బలరిపుని వత్సముగా
మరిగించి సవిత దోగ్ధగ, నరుదగు [131]తేజంబు దుగ్ధమై సిద్ధింపన్.

137


క.

పితృకోటి [132]పిదికె వైవ, స్వతకాలురు గ్రేపుఁ బిదుకువాఁడును గా రా
జతపాత్రంబున దుగ్ధం, [133]బతులాస్పదమై యెలర్ప నవనీసురభిన్.

138


క.

ఆయసపాత్రంబున ఘన, మాయాదుగ్ధంబు గొని రమర్త్యవిరోధుల్
పాయక విరోచనుఁడు గ్రే, పై యొప్పు [134]ద్విమూర్ధుఁ డనుసురారి పిదుకఁగన్.

139


క.

వసురుచి పిదుకఁగఁ బాత్రము, బిసరుహముగఁ జిత్రరథుఁడు పెయ్యగఁ గొని రిం
పెసఁగ[135]న్ గాన క్షీరం, బసమున గంధర్వవరులు నమరాంగనలున్.

140

క.

తార పిదికికొనఁ జాలి కు, బేరుని వత్సముగ విడిచి పిదికిరి యక్షుల్
ధీరమతు లామ[136]పాత్ర ను, దారాంతర్ధానశక్తి తగుదుగ్ధముగన్.

141


తే.

రజతనాభుఁడు దోఁగ్ధగా రాక్షసులు పి, శాచములు నృకపాలభాజనములందుఁ
గనిరి నరరుధిరాఖ్యదుగ్ధము సుమాలి, వత్సమై పెంపొనర్పఁగ వసుధఁ బిదికి.

142


క.

వాసుకి పిదికెడువాఁడుగ, భాసితఫణ[137]పాత్ర గరళబహుదుగ్ధము లు
ల్లాసమునఁ గ్రేపు తక్షకుఁ, డై సమకొనఁ గొనిరి దారుణార్భతభుజగుల్.

143


క.

[138]మేరుగిరి దోగ్ధగా నీ, హారనగముఁ గ్రేపుఁ జేసి యద్రులు పిదికెన్
భూరిశిలాపాత్రికలన్, గోరి మహౌషధులు రత్నకోటులు నుర్విన్.

144


క.

వృక్షములు లతలు గొనియెన్, బ్లక్షము గ్రేపుగఁ బలాశపాత్రికలన్ [139]బాల్
ప్రక్షతిఁ బునఃప్రరోహత, నక్షత సాలంబు దోగ్ధయై తిలకింపన్.

145


వ.

ఇవ్విధంబున సకలచరాచరభూతంబులు నాత్మీయవాంఛితంబులు శాశ్వతంబు
లుగాఁ బడసి పరమానందంబునం బొదలం ద్రైలోక్యకామదోహినియై ధాత్రి
యు విధాత్రియుఁ బావనియు ననుభవ్య[140]నామంబులం బ్రాజ్ఞవర్ణితియై వసుం
ధరాదేవి పృథునిశాసనంబున నిలిచి యతనికిఁ బుత్రియై [141]పృథ్వి యనుపేరం బరఁగి
మధుకైటభమేదోమేదుర యగుటఁ దొల్లియు మేదిని యనుపెరిమెయఁ గనియె.
సంత [142]ననేకసస్యశోభితయు ననేక[143]వసురత్నాకరయు నపరిమితపురగ్రామప్రతి
స్థానగరిష్ఠయు నవిరతప్రాణిసముదయసంకీర్ణయునై యతిశయిల్లె. నీదృశప్రభావ
నిత్యధన్యుం డైన యవ్వైన్యుండు రాజన్యులకు నాద్యుం డనవద్యుం డయి
వెలింగి భువనపూజ్యుం డయి [144]సామ్రాజ్యంబునఁ బ్రాజ్యసుఖం బనుభవించె నని
చెప్పి వైశంపాయనుండు.

146


సీ.

సకలభూతములకు సంభావనీయుఁడు పృథుచక్రవర్తి ప్రస్ఫీతకీర్తి
వేదవేదాంగపవిత్రవర్తను [145]లైనవిప్రులకును నీతివిక్రమములఁ
బరఁగు రాజులకును బశుపాలనాకృషివాణిజ్యరతు లైన వైశ్యులకును
ద్రైవర్ణికార్చనాతత్పరు లగుశూద్రులకు నమస్కార్యుం డలంఘ్యగుణుఁడు


తే.

వృత్తిదాత యాదిమధర్మవృద్ధికరుఁడు, శూరవర్యుండు గావున శూరులకును
మాన్యుఁ డాజికి జనుచోట వైన్యుఁ దలఁచి, భటులు గెలుతు రనాయాసభంగిఁ బగఱ.

147


క.

ఈపృథుచరితము జనులకుఁ, బాపహరము భూరిపుణ్యఫలదము నిత్య
శ్రీపుత్రపౌత్రవర్ధన, మోపి పఠించినను వినిన నొసఁగున్ ముక్తిన్.

148


వైశంపాయనుఁడు జనమేజయునకు మన్వంతరంబుల నెఱిఁగించుట

వ.

అనిన విని జనమేజయుండు మన్వంతరంబుల తెఱం గడిగిన వైశంపాయనుం
డిట్లనియె.

149

క.

తోయజసంభవు సాక్షా, త్కాయసముద్భవుఁ డు[146]దాత్తదానాధ్యక్షుం
డాయతమతి యాదిమనువు, స్వాయంభువుఁ డపరపద్మసంభవుఁ డనఘా.

150


వ.

అతనికాలంబున [147]యామాభిధానులు పన్నిద్దఱు దేవత లైరి. పరమేష్ఠితేజం బపర
మూర్తియై యింద్రత్వంబు నొందె. మరీచి యత్రి యంగిరసుండు పులస్త్యుండు
పులహుండు క్రతువు వసిష్ఠుండు సప్తమునిపదంబు గైకొనిరి. ప్రియవ్రతోత్తాన
పాదులు మనుపుత్రులు ధాత్రీపరిపాలనంబునకు [148]నభిషేకంబు భజించి. రందుఁ
బ్రియవ్రతునకు నాగ్నీధ్రుం డగ్నిబాహుండు మేధుండు మేధాతిథి వసువు
జ్యోతిష్మంతుఁడు ద్యుతిమంతుండు హవ్యుండు [149]వపుష్మతుండు సవనుండు ననం
బదుండ్రు గొడుకులు గలిగిరి. వారిలో నగ్ని[150]బాహుమేధహవ్యు లనువారు
మువ్వురు విరక్తులయి పోవం దక్కిన యేడ్వురు నేడుదీవులకు నేలికలై వేర్వేఱ
పెక్కండ్రఁ దనయుల నుత్పాదించి వర్షాధిపతులం గావించిరి.

151


క.

స్వారోచిషుఁ డనుపేర ను, దారుండు ద్వితీయమనువు తద్దయు వెలసెన్
దారాజికలుషితు లనం, గా రెండుగణంబు లైరి క్రతుభుజులు నృపా.

152


వ.

[151]విపశ్చిన్నామధేయుండు యజ్ఞశతసుకృతంబున నింద్రుం డయ్యె. [152]నూర్జుండు
ప్రాణుండు దత్తుం డగ్ని ఋషభుండు చ్యవనుండు బృహస్పతి యను వారు సప్త
మునిత్వంబు నంగీకరించిరి. [153]జైత్రుండు గింపురుషుం డాదిగా మనుపుత్రులు రాజ
కులంబులం గలిగించిరి.

153


సీ.

విను ముత్తముండు నా వెలసె మూడవమను వతనికాలంబున నమరగణము
లైరి సుధామసత్యశివప్రతర్పణవశవర్తు లన నొప్పి వాసవత్వ
మొందెను శాంతి నా నొకపుణ్యకృత్తు సుతేజుఁడు మొదలై దీప్తతేజు
లనఘు లేడ్వురు వసిష్ఠాత్మజన్ములు మునులై రోలి నిషుఁ డూర్జుఁ డనఁగ వత్సు


తే.

డనఁగ మధుమాధవులు నాఁగ [154]నవల సహుఁడు
[155]శుచి యనఁగ శుక్రుఁ డన నభస్యుఁడు నభుఁ డన
మనుతనూభవదశకంబు మహి [156]భరించెఁ
దత్తదన్వయములుఁ బెక్కు దనరె నందు.

154


తే.

తామసుఁడునాఁ [157]జశుదుఁ డతామపాత్ముఁ, డధికుఁడై యొప్పె మనువుదదంతరమున
దేవతలు [158]హారసత్యసుధీసుధాదు, లనఁగ నాలుగు గణములై యమరి రోలి.

154

వ.

శిబి యను మహాభాగుండు వేల్పులం బాలించె. కావ్యుండును బృథుండు
నగ్నియు జహ్నుండును ధాతయుఁ [159]గపివంతుండును బవనుండును ననువారు
సప్తర్షిభావంబులు వడసిరి. జ్యోతియుఁ దపస్యుండును సుతపుండును దపో
మూలుండును దపోధనుండును దపోరతియుఁ దన్వియు నకల్మాషుండును బరం
తపుండును నను మనుతనూజులు పదుగురు రాజు లైరి. పంచమమనువయిన రైవతు
కాలంబునం గలవారల వినిపించెద.

156


తే.

విను సుమేధసు లనఁగ భూతయు లనఁగ, వరుసతోడ వైకుంఠులు స్వామిభోగు
లనఁగ నాలుగుగణములై రమరు లమర, విభుతఁ గాంచెఁ బుణ్యాత్ముండు విభుఁ డనంగ.

157


వ.

వేదబాహుండు వినిద్రుండు వేదశిరుండు హిరణ్యరోముండు రత్ననేత్రుండు
పర్జన్యుం డూర్ధ్వబాహుండు ననువారు సప్తమును లైరి. ధ్రుతిమంతుం డవ్య
యుండు తత్త్వదర్శి [160]నిరుత్సుకుఁ డరణ్యుండు ప్రకాశుండు నిర్మోహుండు [161]సత్య
వాక్కు కృతియు రైవతుఁడు ననుమనుప్రభువులు భూప్రభువు లైరి. చాక్షుసుం
డాఱవు మనువు తత్కాలంబున.

158


తే.

ఆప్యులు [162]ప్రభూతు లన భవ్యు లన భృగువులు, ననఁగ లేఖులు నావేల్పు లైదుగణము
లైరి వేల్బుల వేలె శతాధ్వరక్రీ, యాజిరత్రిలోకుండు మనోజవుండు.

159


వ.

అంగిరసుపుత్రు లేర్వురు మునులై వెలసిరి. మనునందను లైన యూరుప్రభృతు
లుర్వి పాలించిరి. సప్తమంబగు వైవస్వతమన్వంతరం బిప్పుడు వర్తిల్లెడు. నిందు
వసురుద్రాదిత్యమరుద్విశ్వే[163]1సాధ్యాశ్విను లను ననిమిషు లెనిమిది గణంబు.
[164]లూర్జస్వి యనువాఁడు దేవేంద్రుండు. కశ్యపాత్రివిశ్వామిత్రగౌతమభరద్వాజ
జమదగ్నివసిష్ఠులు సప్తమునులు. మనుజాతు లయిన యిక్ష్వాకుప్రముఖులు
మహీ[165]శు లయి నిజవంశంబులు ధరణిం బ్రతిష్ఠించిరి.

160


క.

మనువులు నమరులు నింద్రుఁడు, మునులును నిజవిహితకాలములతుదిఁ దొలఁగం
జనఁగా నన్యులు వెసఁ గై, కొని నిలుతురు తత్పదము లకుంఠిత[166]గరిమన్.

161


వైశంపాయనుఁడు జనమేజయునకు ననాగతమన్వంతరముల జెప్పుట

క.

వీ రెల్లరు దమతమయధి, కారంబులు నిర్వహించి కడపట నాత్మో
త్తారక మగు బోధము గని, చేరుదు రఖిలాత్ము మగుడఁ జెందరు భవమున్.

162


వ.

అతీతవర్తమానమన్వంతరంబు లెఱింగించితి. నిటమీఁద సూర్యసుతుండు సావర్ణుం
డష్టమమనుత్వంబు నొందెడు. నతనికాలంబున సుతపస్సునాభముఖ్యు లన నమ
ర్త్యులు మూఁడుగణంబు లయ్యెదరు. బలిదైత్యుండు దివిజాధిపత్యంబుఁ బడయుఁ.
బరశురాముండు పారాశర్యుండు ఋశ్యశృంగుండు గృపాచార్యుం డశ్వత్థామ

[167]దీప్తిమంతుండు గాలవుండు నీయేడ్వురు మహాముని[168]పదంబున వెలుంగుదురు.
పరీవానుండన తురీవానుండు సమ్మతుండు ధృతిమంతుండు వసుండు వరిష్ణుండు
నాథుండు ధృష్ణుండు వాసుండు సుపరేషుండు వృష్ణి సుమతి మొదలుగా మనుత
నయులు మనుజవిభులు గాఁగలరు. మఱియు దక్షదౌహిత్రులు నలువురు మేరు
సవర్ణు లయి సావర్ణ్యులనం బరగి యాకనకశైలంబుతటంబునఁ దపోనిష్ఠనున్నవారు.
రుచిప్రజాపతిపుత్రుండు రౌద్యుండును భూతిసంభవుండు భౌత్యుండునుగా
ననాగతమనువు [169]లేడ్వురు వీరలయందును సపరలు సురేంద్రులు మునులును
మనూద్భవులును వేఱువేఱ ఫురాణంబులం బరికీర్తితు లయి యుండుదురు.

163


సీ.

యుగచతుష్టయమును నొక్కటియై యేకసప్తతివారముల్ [170]సనియె నేని
మన్వంతరం బగు మన్వంతరంబున సలిలప్లవం బగు సలిలసంప్ల
వావసానము సృష్టి యంచితచరిత యీసరణిని యుగసహస్రంబు దెగిన
నబ్జాసనునకు దినాత్యయం బొదవు నత్తఱి సర్వభూతబృందములు నొక్క


తే.

పెట్ట యాదిత్యరశ్ములు వేల్చఁబ్రేలు, నట్టి బెడిదంబునకు నోర్వ కమరవరులు
మునులు నజుఁడు మున్నుగ మహిమూర్తి విష్ణు నుదరదేశంబు సొత్తురు బ్రదుకు గోరి.

164


వ.

ఇప్పుడు చెప్పంబడ్డ యీ ప్రపంచవర్తనం బంతముం గల్పంబులీలలం దెల్లను సాధా
రణంబైనవిధంబు నీ వడిగినయఖిలమన్వంతరంబులు సంక్షేపరూపంబున నీ కెఱిం
గించితి. నేతదీయ[171]విస్తరకథనంబు వర్షశతంబునకైన నశక్యవిధానం బని యుపన్య
సించి వైశంపాయనుం డన్నరనాయకుతో మఱియు ని ట్లనియె.

165


తరువోజ.

ఈవిశ్వమును సృజియింపంగఁ గర్త యీశ్వరుఁ డాద్యుఁ డహేతుఁ డక్షరుఁడు
గోవిందుఁ డనఘ యేకులమునం దాత్మ గోరి యుద్భవమయ్యెఁ గువలయం బలర
నావృష్ణిభూవరాన్వయము గీర్తించు నిట్టి యీకథనంబునం దేను చెప్ప
వైవస్వతుం డిప్డు వర్తిల్లు మనువువంశంబు వినుము భవ్యముగాన తొలుత.

166


క.

తనహృదయేశ్వరు గశ్యపు, ననుకూలప్రీతిఁ గొలిచి యదితి యతనిపా
వనతేజంబునఁ దాలిచె, దనయుం జూలుగ సహస్రధాము మహాత్మున్.

167


క.

ఆచందంబున నుండి వి, రోచనుఁ డాత్మీయతిగ్మరుచిఁ దల్లితనూ
గోచరకాంతి యఖిలమును, వే చెన్నఱఁ జేసెఁ జిత్రవిభవస్ఫూర్తిన్.

168


వ.

కశ్యపసంయమియు నయ్యతివం జూచి యవ్విధం బెఱుంగమింజేసి నీయుదరంబు
లోని [172]గర్భాండం బమృతంబు గావలె నని పలికె. నది గారణంబుగా మార్తాండుం
డను పేర నుదయించి యాదిత్యుం డత్యుగ్రతేజంబున జగత్త్రయంబునకు నధికసం
తాపంబు సేయుచుండె. నతనికిఁ ద్వష్టకూఁతురు సంజ్ఞాదేవి దేవియై యసాధా
రణం బగుసౌకుమార్యంబు గలయది గావున.

169

చ.

[173]గనగన యెల్లప్రొద్దు గొనిక్రాలెడు వేఁడిమిఁ బేర్చు భర్తమే
నెనయను డగ్గఱన్ సయిఁప కెంతయు భీతి నొదుంగుచున్ లస
ద్వనరుహపత్రలోచన యవంధ్యచరిత్రమునన్ దదాత్మకిం
పు నెఱయఁజేయుచుం గనియెఁ బుత్రుల నిద్దఱ నొక్కకన్నియన్.

170


వ.

వైవస్వతమనువును యముండును యమునయు నన నిట్లు మువ్వురం గనియు నవ్వ
రాంగి యోర్వలేక నిజచ్ఛాయం జేసి ఛాయయను[174]దానిం బుట్టించిన నది తనయె
దుర నిలిచి పని యేమి యని కేలు మొగిచి యున్న యన్నాతిం జూచి.

171


క.

[175]తాను బతివేఁడిమిఁ బరి, మ్లానాకృతియై కడుం దలంకేడు తెఱఁ గ
మ్మానవతికి నెంతయు స, మ్మానన నెఱిఁగించి యనియె మంజులరీతిన్.

172


ఆ.

పుట్టినింటి కేను వోయి యొక్కించుక, యూఱడిల్లి వత్తు నువిద నీవు
వింతతనము లేక విభునకుఁ బ్రియము నా, మాఱుగా నొనర్చి మనుము నెమ్మి.

173


క.

[176]మఱచి యయిన నాయిత్తెఱఁ, గెఱఁగింపకు పతికి బిడ్డ లీమువ్వురకున్
నెఱసినగారా మేమియుఁ, గొఱఁతవడక యుండ [177]నడపి కొఱలుము శుభమున్.

174


క.

నావుడు నది యాయమతో, దేవీ తల వట్టియీడ్చి తిట్టుకొలఁది రో
షావేశముఁ బతి యొందిన, నేవిధమున నిన్నుఁ జెప్ప నిది నిజ మనినన్.

175


వ.

సంప్రీతమానసయై సంజ్ఞాదేవి తండ్రిపాలికిం జని తనవచ్చినకారణం బెఱింగించి
సిగ్గునం దలవాంచియున్న విశ్వకర్మ యక్కొమ్మం బుజ్జవంబులుఁ దర్జనం
బులుఁ బెరయ నశ్రుకణకరాళకపోలం బగు తదాననం బాలోకించి.

176


క.

ఎంతయుఁ గ్రూరుం డయినను, శాంతుఁ డయినఁ బతియు చువ్వె సతి కారయ న
త్యంతపుబంధువు [178]తదతి, క్రాంతి దలంచుకాంత యెందుఁ గనునే శభముల్.

177


తే.

పొమ్ము నీప్రియు[179]పాలికి నమ్మతగదు, విడువు తలఁ కన్నీరు తుడిచి కూర్మిఁ
[180]గౌఁగిలించి వీడ్కొలిపినఁ గ్రమ్మఱంగఁ, బోక బెగ [181]డగ్గలింప నప్పువ్వుఁబోఁడి.

178


వ.

నిజాకారంబు మఱుఁగు [182]పఱుపం దురంగిరూపంబు దాల్చి యొక్క వివిక్తప్రదే
శంబునం బతిసమాగమంబుఁ గోఱుచుఁ దదీయధ్యానపరవశయై యుండె. నంత
నక్కడ.

179


ఛాయాదేవియందు సౌవర్ణశనైశ్చరతపతులు పుట్టినప్రకారము

సీ.

ఛాయ సంజ్ఞాదేవిచందంబునన సూర్యునందు శుశ్రూషణం బాచరించు
చుండంగ నతఁడును నొం డెఱుంగక యనురాగవిహారైకరతి దలిర్ప
సౌవర్ణుఁడును శనైశ్చరుఁడును దపతినా బరగు కన్యయు జనించిరి క్రమమున
నయ్యింతి దనపాపలందు మిక్కిలి కూర్మి బెలయ సంజ్ఞాదేవిబిడ్డ లయిన

తే.

మువ్వురను గేరడము సేయ నవ్విధంబు, [183]సైపలేక యొకప్పుడు శమనుఁ డలిగి
చరణ మమ్మాఱుదల్లిపైఁ జూఁచెఁ దన్న, దాని కాయమ [184]కోపసంతాప [185]మెసఁగ.

180


క.

జనని యనక యిట్లెంతయు, నను [186]లంకించి తటుగావునం బదము మహిం
దునిసిపడుఁ గాత యని పెల్చ, న శపియించుటయు వెఱచి జముఁ డాతురుఁడై.

181


వ.

తండ్రిపాలి కరిగి ప్రణతి యొనర్చి తనయపచారంబు తల్లి కోపించి యిచ్చిన
శాపంబును నెఱింగించి.

182


ఉ.

ఎందఱు గల్గినం బ్రజలం [187]కేకవిధం బగులాలనంబు సే
యం దగరే సవిత్రులు మదంబ [188]మమున్ ముగురన్ సహింప దే
చందమొ పిన్నవారలకుఁ జాలఁగఁ బక్షముసేయ దీనికిన్
డెందములోనఁ దాలిమి ఘటింపక యే నిటు తప్పుసేసితిన్.

183


తే.

[189]బాల్యమున నైన నజ్ఞానభంగి నైన, [190]నైన దీని సహించి శాపానుభవము
దగులకుండగఁ జేయవే జగదధీశ, యనినఁ గరుణించి కమలాప్తుఁ డతనితోడ.

184


క.

వినయజ్ఞుఁడు ధార్మికుఁ డితఁ, డనఁ బరగిన నీవు నిట్టు లగుట యరిది యి
ప్పనికి నిమిత్తం [191]బేమో, యనఘా కలుగంగఁ [192]2జలు నాత్మఁ దలంపన్.

185


వ.

అది యట్లుండె. మాతృవాక్యం బమోఘంబు గావున నొక్కతెఱంగు సేసెదం
క్రిములు భవచ్చరణమాంసంబు ధరణిపయిం దొరిఁగింపఁ గలయవి యంతశాప
ఫలం బనుభూతం[193]బ యగు నని పలికి ఛాయాదేవిం జూచి నీవు సర్వసంతతి
యంచును సదృశవాత్సల్యను గావు, గామికిఁ గతం బేమి యని యడిగిన నది
యేమే నుత్తరం బీబోయినం గనలి యినుండు నిజంబు చెప్పుము చెప్పకున్న
నిన్నుఁ గఠోరశాపానలంబు పాల్పడుతు ననుటఁయు.

186


ఆ.

సంజ్ఞ సనిన తెఱఁగు సకలంబుఁ జెప్పె న, త్తెఱవ యతఁడు రోషదీప్యమానుఁ
డగుచు విశ్వ[194]1కర్ము నావాసమునకు నేఁ, గుటయు నమ్మహాత్ముకోప మెఱిఁగి.

187


వ.

అతఁడుం దనకూఁతురు మగిడి మగనిపాలికిం బోవమియు నాత్మదృష్టిం [195]దెలిసి
యల్లునిం బ్రియవినయసంభావనంబుల ననునయించి ప్రసన్నుం గావించి.

188


శా.

నీతేజం బతితీవ్రమై పరఁగుట న్నిక్కంబు సైరింపలే
కాతంకంబునఁ బొంది సంజ్ఞ భవదీయాకార[196]శాంతత్వముల్
జేతోవృత్తమునందుఁ గోరుచుఁ దపశ్శీలాత్మయై యున్న దీ
వాతన్విన్ జరితార్థఁ జేయఁదగదే యాతానుకూలంబుగన్.

189


మ.

భవదీయం బగుదివ్యయోగము గణింపన్ శక్యమే యద్భుతం
బవికారం బది చెప్పనేల నను నీ వాజ్ఞాపనం బిప్డు నే

యువిధం బించుక గల్గె నేని విను చిత్రోపాయసంధాయినై
భువనాభ్యర్చిత యొండుచంద[197]ముల నొప్పుల్ దెత్తు నీమూర్తికిన్.

190


చ.

అనుటను నవ్విధంబునకు నంబుజబాంధవుఁ డియ్యకొన్న నా
తనిపటుదీప్తిమండలి ముదంబున నుగ్గమునం దమర్చి వే
తునియఁగ [198]ద్రచ్చెఁ జిత్రకృతిధుర్యుఁడవార్యజగత్మాప్రమోదవ
ర్ధనుఁడు సురేంద్రవర్ధకి యుదంచితతేజము ద్రెస్సి రాలఁగన్.

191


వ.

ఇట్లు కిరణంబు లెల్ల [199]1నురివి డుల్లి విన్ననైనం [200]గాంతిమాత్రదేహుండై పద్మినీ
కాంతుండు నిజకాంత యున్నరూపంబు యోగదర్శనంబునం గన తానునుం
దురంగమూర్తియై యచ్చటి కరిగి కదియుటయు [201]3నమ్మగువ యన్యపురుషుం
డనుతలంపునఁ బిఱుఁదు డాఁచి యడఁగుటయు నిరువురనాసాపుటంబులు మోచిన
[202]నాసత్యులు పుట్టిరి. తనంతరంబ.

192


శా.

ఆరూపం బటు వాసి నైజతను వింపారంగఁ దాల్పంగఁ [203]జే
తోరాగంబున [204]నవ్వెలంది నిజనాథున్ గాంచి తా నీశు
కారం బేర్పడి నిల్చె నయ్యిరువురుం గామోపభగక్రియా
ధౌరేయం బగునుజ్జ్వలోత్సవమునన్ ధన్యాత్ములై రెంతయున్.

193


వ.

ఆవివస్వంతుండు తనయగ్రపుత్రుం డగువైవస్వతునకు సప్తమమన్వంతరాధి
పత్యం బొసంగె. యముండు నిజధర్మవివర్ధనంబున ధర్మరావజనువిఖ్యాతియు
మహత్త్వంబునుం గనియె. సౌవర్ణుం డిటమీఁద నష్టమమనుభావంబు భజియింపం
గలవాఁడై మేరుశిఖరంబునందు గరిష్ఠ యగు తపోనిష్ఠ [205]వసియించియుండె. శనై
శ్చరుండును గ్రహపదవిం బ్రదీప్తుండై నిలిచె. [206]యమున మహానదియై లోక
పావనస్ఫూర్తిం బ్రవర్తిల్లెఁ. దపతి సంవరణుం డనురాజునకు రమణియై భారతవంశ
[207]ప్రదీపకరం బగునపత్యంబులుం బడసె. నాసత్యు లాశ్వినేయు లన నమరులకు
వైద్యులై యనవద్యవిద్యాగరిమంబునం బెంపొందిరి. బృందారకశల్పియు ననల్పం
బగుతపనతేజోరజఃపుంజంబున నజునకు నప్రతిమానవిమానంబును దానవధ్వంసికిఁ
బ్రశంసనీయవిక్రమం బగు చక్రంబును ఫాలలోచనునకు నాభీలం బగుశూలంబును
రచియించె. నిట్లు కీర్తితం బైన.

194


క.

ఈదేవజన్మకథ న, త్యాదరమున వినినఁ బ్రీతులై చదివిన స
మ్మోదంబున వ్రాసిన ల, క్ష్మీదీర్ఘాయువులు సుసమృద్ధియుఁ గలుగున్.

195


క.

అని జనమేజయవిభునకు, మునివైశంపాయనుండు మును పరిపాటిన్
వినుపించినకథ యంతయు, ననుపమచారిత్ర యన్నమాంబాపుత్రా.

196

శా.

లక్ష్మీలాభ[208]విధాయినిర్మలగుణాలాపైకధర్మా యశో
లక్ష్మీకల్పితలోకలోలుపవధూలభ్యావలోకా సమ
స్తక్ష్మాభోగఫలాత్మభాగ్యవిలపత్సౌభాగ్యయోగ్యా మహా
సూక్ష్మోపాయహృతాన్యభూపవిభవా శూరత్వశక్రోద్భవా.

197


క.

సకలద్వీపాంతరర, త్నకలాపనిరంతరార్చ[209]నాకలనారం
భకకురుమలూరిపురనా, యకమల్లచమూవరేణ్యహారినిషేవ్యా.

198


మాలిని.

బహుళహయగజేంద్రస్ఫారసేనాసహస్ర
ప్రహతకటకరాష్ట్రభ్రష్టద్విష్టరంప
ద్గ్రహణపరమధన్యోదగ్రధాటీభటశ్రీ
మహితజయవిజృంభా మంజురాజ్యోపలంభా.

199


గద్యము.

ఇది శ్రీశంకరస్వామి సంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
ధుర్య శ్రీసూర్య సుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయ నామధేయ
ప్రణీతం బైన శ్రీహరివంశంబునఁ బూర్వభాగంబునఁ బ్రథమాశ్వాసము.

200


  1. లలితేచ్ఛన్ బొల్చు శంభుం డశేషోర్వీరక్షణదక్షు వేమనృపు
  2. నిత్యోర్జస్వలున్ జేయుతన్
  3. మ్మగు
  4. కళాఢ్యుఁడు
  5. ఆస్పంద స, త్సందిష్టాంచిత
  6. నాముఖంబున
  7. వాణిన త్తను
  8. పొందు
  9. సకలకథావిశ్రుత
  10. దుశ్శీలశత్రు
  11. విభాలు
  12. జగద్రక్షపాలుండు
  13. చతుర్విధదుర్గవిదళనోదారుండు
  14. సకలవిధవర్ణనీయుఁడు
  15. సద్గుణనివహం
  16. కృతి
  17. బహుళ
  18. ననుత్తమ
  19. ఖురఖండన
  20. విశాలవీచిశరజాలమునక్కుల; విశాలవీచిశరసంకుల
  21. అంభోధితాయాంతర్భూములు
  22. విపత్యబ్ధిం జెడం
  23. రాకేశు
  24. భర్తలుగ వనిచె
  25. చలివిందరల్
  26. అనిన...నలరె
  27. చుట్టము నెల్ల నాత్మసమశోభితభంగిఁ దనర్పనొప్పెఁ
  28. ధీరు
  29. పుణ్య మెద్ది నే....
  30. బొదలున్
  31. జన
  32. మాతయ
  33. వెలసిరి
  34. శీలిత
  35. ప్రభవుండు
  36. బ్రీతుఁ గావించుచున్
  37. ధరణీ
  38. క్ష్మావిభు
  39. ని బోలుగాక
  40. రాజిల్లె
  41. సమగ్రసులభుఁడు
  42. ష్ఠాపుణ్యగ; ష్ఠాగణ్యపు
  43. సర్వసిద్ధుల
  44. బరఁగు పక్ష
  45. డగుచున్న
  46. స్ఫీతశ్రీ
  47. నృత్త
  48. కామ్యంబు
  49. ప్రసిద్ధుఁడౌ వ్యాసుని
  50. మనంబున సంతోష
  51. బద్భుతాపాదన; బద్భుతాపాదక
  52. యాదవోల్లాసి
  53. భూతంబు లిట్టి
  54. నట్టి
  55. క్రిందటిప్రక్క
  56. మీఁదిప్రక్క
  57. సృష్టి
  58. మేను
  59. లిద్దఱికి
  60. యశస్వంతుఁ డనఁగ?
  61. సన్నుతింప
  62. బృహస్పతికిం
  63. నుత్పల యను, నాతి యతనివలనఁ గాంచె నందనులఁ దగన్.
  64. అగ్నిష్టువును
  65. సత్యద్యుమ్నుఁడును
  66. స్వాతి
  67. దత్క్షణంబ మే, న్నిర్మ
  68. అజునికుడికాలిపెనువ్రేలి
  69. దొలుత
  70. శుభా
  71. దక్షుఁ డొకఁడ
  72. యంగా దక్షుఁడు
  73. వారిక్రమంబు నరయ
  74. నట్టి
  75. పోకల నడంగి
  76. అది గతముగ భ్రాత చనిన పదవి యరయఁ బోక సనును భ్రాతకు నని.
  77. పదమువ్వురు
  78. భుజంగ
  79. ఖరతురగ
  80. పేక్షి యైన
  81. యెంతటి
  82. దగు
  83. నెడ గోరినమతితో, ననువర్తింపంగ నుండె.
  84. జేసియైన
  85. లిన్నియు
  86. బంటులు గావలయు
  87. యక్షరాక్షసులకు
  88. భర్తల్
  89. సుధన్వుని
  90. బన్నుగాఁ జేయుఁడీ మీరు నన్నుగుఱిచి
  91. మానె
  92. రూపేదె
  93. బడియె బూర్తంబుల (పూ. ము.)
  94. స్వామిచందంబు సేవకజనుల స్వామిచందంబె చందంబు; స్వామిభృత్యులచందంబు జనుల కనిన, మాట నిజము లేదయ్యె క్ష్మాతలేశు.
  95. అమ్మెయిఁ దలరి
  96. చేర్చఁదగునే
  97. విను యాగంబు దొడంగఁజూచెదము నీవీ (పూ. ము.)
  98. మిమ్ముం దహింతు; మిమ్మందఱిన్, దునియం ద్రుంతు నశేషమున్ వలవ దీదుర్వాదముల్ మాదెసన్.
  99. ముదాల్తు నింక
  100. బెలుపం
  101. బెట్టుకట్టి
  102. కుశస్థలంబుల
  103. దర్చిన నందు
  104. గాలంబగుగుఱుచమేను గల
  105. చుండనడఁగుచు.
  106. కర మొప్పఁగ
  107. సమిద్ధ
  108. నుర్వియె
  109. దుర్గ
  110. సామాభినుతము చోట
  111. కార్యములను విశేష
  112. లేర్పడం
  113. యే యకట ధన్యత
  114. వేడుక
  115. యెనయంగ
  116. పోవచె నీవు
  117. సకలార్థ
  118. లట్లగుట
  119. అనుడు జననాయకుండను
  120. టురదె
  121. సమస్త
  122. నొంద
  123. కోర్కె
  124. నేలలు
  125. స్వారోచిషుం డన
  126. పితికి
  127. సమ్మతము
  128. రంత
  129. దోహనుఁడు
  130. పాత్రిక
  131. మార్జంబు
  132. చిదికి, కిడిరి
  133. బతులన్వధ యై
  134. విమూఢయను
  135. సుగంధ
  136. పాత్రి
  137. పాతి
  138. మేరువు దోగ్ధయుఁగా
  139. బల్
  140. సంజ్ఞలం బ్రాగ్వర్ణిత యై
  141. పృథ్వియనన్
  142. సస్యశోభిని
  143. సురత్నాలంకృతయు
  144. పూజ్యం బగు సామ్రాజ్యసుఖం
  145. లగు
  146. ధాత కాలా
  147. యమా
  148. నభిషిక్తులై
  149. సంస్కృతగ్రంథములో “నవుష్మంతుఁదు” లేదు. పుత్రుండు ఉన్నది. వ్రాతప్రతిలో “హవ్యుండు” లేదు. పుత్రుండు ఉన్నది.
  150. బాహుమేధనత్రు
  151. మహిక్షి
  152. నూస్తంబుఁడు
  153. హరిద్రుండు
  154. నట శుచి యన
  155. శుక్రు డన సహుఁ డన నభస్యుఁడు, సుహుఁ డనఁగ.
  156. ధరించె
  157. జతుర్ధుఁడు నామహాత్ముఁ
  158. హారిసత్య
  159. కపిధానుండు; కపీవరుండు
  160. నియుక్తుం
  161. సత్యవంతుండు కపియు
  162. ప్రసూతఋతులనఁ
  163. దేవసాధ్యా
  164. లోజస్వి
  165. పతులయి
  166. గతినిన్
  167. దీప్త
  168. పదవి
  169. లార్వురు
  170. సనినయేని, సనినమనువు నంతరం బయిదు మన్వంతరాంతరమున
  171. కథావిస్తరంబు
  172. 'నఖిల్వయా మృతోండస్థ ఇతి...' 1-9-5 పాఠాంతరములు చూ.
  173. కనఁగన నెల్ల ప్రొద్దు గొని కాలెడు (పూ.ము.)
  174. భామం
  175. తనపతివేఁడిమికిఁ బరి
  176. మఱచైనను
  177. నెరిపికొఱలుమి
  178. దనవి, శ్రాంతి దలఁచు కాంతయందు సనునె సుఖంబుల్.
  179. పాలికోయమ్మ
  180. కౌఁగలించి
  181. డంగలింప
  182. పడం
  183. నాఁపఁగా లేక శమరుఁ డొకప్పు
  184. రోష
  185. మడర
  186. భంగించి
  187. కేకప్రియంబున బుజ్జవంబు
  188. యు మమ్మును ముగ్గురన్న వే; య మమ్మువురన్.
  189. బాల్యమందును
  190. నయ్యె నిది దీని సైఁచి
  191. బేమే ననఘా
  192. బోలు
  193. బగు
  194. కర్మయా
  195. గని
  196. కాంత
  197. మిల నొప్పుంజేయ
  198. వ్రచ్చె
  199. నుఱవు
  200. శాంతి
  201. నది
  202. దస్రులు
  203. తేజో
  204. బొంది కాంతయు నిజేశున్
  205. నధిష్టించి
  206. నయ్యమున
  207. ప్రదీపకులగు
  208. విధానధర్మగుణ కళ్యాణైక
  209. నసుకవిజనరం జకముకుళప్రియనాయక