హరవిలాసము (1971)/లింగోద్భవము

(హరవిలాసము-లింగోద్భవము నుండి మళ్ళించబడింది)

లింగోద్భవప్రకరణము

ఈ గ్రంథభాగము (58వ పద్యము తరువాతనుండి ఆశ్వసాంతపద్యముల వఱకు) కాకినాడ, అకాడమీ ప్రతులలోఁ బరిత్యజింపఁబడినది. ఆనంద ప్రతిలో గ్రంథాంతమునను, వావిళ్ళ ముద్రణములోఁ బీఠికాంతమునను బ్రకటింపఁబడియున్నది. ఇక్కడ ప్రకటించిన పాఠము 1971 ఎమెస్కో ప్రతినుండి గ్రహింపబడినది.

వ. ఇట్లు పరమధూర్తవర్తనంబునం బ్రవర్తిల్లు నయ్యష్టమూర్తి యిష్టాపూర్తధర్మకర్మాఢ్యులగు నమ్మఠపతులు ధట్టించి తన్నుం బట్టఁజేరినఁ గట్టిన కౌపీనంబు దలంగవైచి ప్రాచీనబర్హికుంభిశుండాదండసన్నిభంబైన మదనధ్వజదండంబు నిగుడించి యమ్మహనీయసాధనంబున నమ్మహీసురోత్తముల యుత్తమాంగంబులు మొత్తియు, మెడ కడఁత లడంచియుఁ, జెవుల కొడంక లొత్తియు మొగంబులు (మొత్తియు), ముక్కులు నొక్కియు, బరులు వ్రేసియు, వీపులు చఱచియుఁ, (బండ్లు రాల్చియు, నురంబులు ఱాచియుఁ ద్రికంబులు దాఁకించియు, జంఘలు వొడిచియు, జానువులు దాటించియు, బడలు వఱచియుఁ, దోలి తొప్పఱంబెట్టి యార్చి) పేర్చి యమ్మహాలింగంబు నింగిదాఁకం బెరిగించి నక్షత్రమండలం(బను) ముత్యాలగొడుగునకుం బసిండికామభంగి నంగీకరింపఁజేసి సోమార్కమయమహాసోపానంబుల డిగ్గు వియద్గంగాప్రవాహంబు నభిషేకం బాపాదించి బ్రహ్మాండకర్పరం బప్పళింపజేసిన; 59

క. సురగరుడఖచరవిద్యా
ధరకిన్నరసిద్ధసాధ్యదానవముఖ్యుల్
పురహరుఁడు చాఁచి పట్టిన
యురులింగంబునకు మ్రొక్కి యుపచితభక్తిన్. 60

వ. సంస్తుతింపఁ దొడంగి రప్పుడు, బ్రహ్మ బ్రహ్మలోకంబునకు నిగిడిన యమ్మహాలింగబునకుం గరకమండలంబు తీర్థంబు వారిధారాసహస్రంబుల నభిషేకం బాపాదించి గంధపుష్పధూపదీపనైవేద్యతాంబూలాద్యుపచారంబుల నుపాసించి దండప్రణామపూర్వకంబుగా నిట్లని స్తుతియించె: 61

దండకము


జయ జయ శివలింగ జ్యోతిర్మహాలింగ లింగోద్భవ శ్రీ మహాలింగవేదత్రయీ నిర్లింగ సంస్పర్శలింగ క్షమాలింగ సద్భావలింగ స్వభావైకలింగ ..... దిగ్దేశకాల వ్యవచ్ఛేదరాహిత్యలింగ స్వయంబూమహాలింగ పాతాళలింగ క్రియాలింగ పంచాక్షరీలింగ పంచప్రకారోపదీపక్రియీలింగ ప్రమాణాప్రమేయప్రథాలింగ విద్యాకళాలింగ షట్కర్క లింగామామ్నాయ లింగాప్రతిష్ఠా కళాలింగ మూలాలవా లాంతరాళాన లావాణ? కోణత్రయీ గేహ రోహ ప్రధా లేఖికాస్యూతి నిధ్యాన శంపాలతా లంఘిత బ్రహ్మరంధ్ర స్రవచ్చాంద్ర సాంద్రామృత స్యందన స్పందితానందలిం గాదిమధ్యాంత శూన్యస్వరూ పాభిధాలింగ ఖట్వాంగలింగాహి లింగాభ్ర గంగా సరిల్లింగ సారంగ లింగాత్మ భూలింగ ఐంలింగ ఈంలింగ ఓంలింగ దివ్యాక్షరోక్షా విరూపాక్ష లింగా నమస్తే నమస్తే నమః. 62

క. అని సంస్తుతించి వెండియు
వనరుహసంభవుఁడు దాను వా గ్భామినియున్
గనకారవిందముల న
ర్చన చేసిరి నీలగళుని సాధనమునకున్. 63

వ. ఇట్లు పూజించి విరించి కరకమలంబులు మొగిడ్చి యిట్లనియె; 64

సీ. ఉపసంహరింపుము త్రిపురదైత్యధ్వంస!
యూర్ధ్వాండకర్పరం బొలయకుండ
బింకం బడంపుము సంకల్పసంసిద్ధ!
యుడువీథి గ్రగ్గోడు పడకయుండ
బిరుసు మాన్పుము జలంధరదైత్యమర్దన!
యేడుగాడుపులు బిట్టెరియకుండ
దర్పంబు సడలింపు తరుణేందుశేఖర!
యొరసి యాశాభిత్తు లురలకుండ
తే. తివియు శర్వ! మహాదేవ! ధిక్కరింపు
ముడుపు మహిరాజకంకణ! యడఁపు రుద్ర!
వాల్పు ఖట్వాంగపాణి! వదల్పు మభవ!
మోహనంబైన నీ మహామేహనంబు. 65

చ. అనినఁ బ్రసన్నుఁడై కహకహధ్వని నవ్వి లలాటనేత్రుఁ డి
ట్లను భువనంబు లెల్ల వినులట్లుగ నో పరమర్షులార! యో
యనిమిషులార! తక్కుఁగలయట్టి సురాసురులార! మీకు నా
యనుపమదివ్యలింగ మిది యర్చన కర్హము నేఁటినుండియున్. 66

క. లింగార్చనాపరుండగు
మంగళహృదయునకు నేను మక్కువతోడన్
సాంగత్యము కృప సేయుదు
నంగీకృత...తి...................తోన్. 67

వ. అని శంభుండు నిభిలబ్రహ్మాండసంభారకుక్షింభరి యగు నిజమహాలింగస్తంభంబు స్తంభింపం జేసె, నప్పుడు ముకుళితహస్తారవిందులై దేవదారువనదివ్యాశ్రమస్థు లగు గృహస్థు లీర్ష్యాదోషంబు లుజ్జగించి, యా శేషాహిభూషణుని బహువిధంబుల భక్తివిశేషంబుల భజియించిరి; భోగమోక్షంబులు గాంచిరి. ఇ ద్దేవదారువనవిహారంబు వ్రాసినఁ బఠియించిన విన్నను వక్కాణించినను నభినయించినను జనులకు నభీప్సితార్థఫలసిద్ధి యగును. 68