హంసవింశతి/తొమ్మిదవరాత్రి కథ



తొమ్మిదవరాత్రి కథ

ముచ్చివాని భార్య తిరునాళ్ల గోవాళ్లఁ గూడుట

ఉ. సాలము మిన్నునంటి ఘనసంపదఁ గాంచ నగడ్త యీర్ష్యచేఁ
దాళ కనంతభోగములు తద్దయుఁ బద్దునఁ దాను జెంద నౌ
మేలనఁ గోట యున్నతియు మిక్కిలి ఖేయము లోఁతు గల్గి శో
భాలలితంబనంగ నొక పట్టణ మొప్పు నితంబినీమణీ! 6

క. ఆ వీటిలోన రంగా
జీవ కులాంభోధి పూర్ణ శీతమయూఖుం
డై వెలసి చిత్రఘనుఁ డనఁ
గా వార్తకు నెక్కి యొకఁడు కాపుర ముండున్. 7

తే. హరిత హారిద్ర కృష్ణ రక్తావదాత
శబల పాటల ధూమల శ్యామ కపిశ
వర్ణములఁ గూర్చి చిప్పల వాసె లునిచి
చిత్తరువు వ్రాయు గుళ్లలోఁ జిత్రఘనుఁడు. 8

క. సుర విద్యాధర కిన్నర
గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ హరి
ద్వర యక్షాసుర నలినజ
హరిహర మర్త్యర్షివరుల నతఁడు లిఖించున్. 9

మృగ పక్షుల పట్టి

సీ. హరి కరి మృగ ఖడ్గ కిరి తరక్షు ద్వీపి
సైరిభ గోకర్ణ శరభ చమర

గంధర్వ రోహిష గవయ భల్లుక రామ
శశ జంబు కోష్ట్రాశ్వ కోక
వామీ ఖరోరణ శ్వా నౌతు కపి బభ్రు
సరటర్శ్య లూతాఖు సర్ప మకర
శతపదీ బస్త మత్స్య ఢులీ కుళీరాళి
గౌధేయ రక్తపా కమఠ నక్ర
తే. గో మహిష వృష భేక చిక్రోడములను
సింగిలీకము చిఱుపులి చెదలు పురువు
కొక్కు వెంట్రువు నలికిరి కొర్నలాది
గాఁ గలుగు జంతువులఁ జిత్రఘనుఁడు దీర్చు. 10

తే. గరిమి డిబ్బంది చొఱపందిగాఁడు మంద
గరడ బెగ్గోలు రేచు గర్గరము రాళ్ల
రాచి పెంకుల జెఱ్ఱి పున్నాచి పక్కి
పేచి చెక్కెల చేరను పేళ్లఁ గలుగు. 11

వ. పులుగులను, మఱియు (పూరణము) 12

సీసమాలిక.
గరుఁడుండు సంపాతి గండభేరుండంబు
చీకురా యాడేలు జెముడుకాకి
వార్యము బైరి జావళము సాళ్వము డేగ
గూడబా తుల్లంగి కుంద టీల
పాల నారాయణపక్షి పాముల మ్రింగు
డంచ వేష్టము గ్రద్ద క్రౌంచ మాబ
లగు లోదె గొరకు తెల్లని పంత బలసట్టె
గూబ శంబర కాకి గుబిలిగాఁడు
నామాలకేతఁడు నల్లాస కప్పెరు
కాకి యంజిటిదారిగాఁడు మూఁగ

చిందర లకుముకి చిఱుత తీతువ కోడి
కారుకో డేకుల నారిగాఁడు
మునుఁగు కోడియు డాల ముట్టెకోడియు బోద
పొన్నంగి కకళేటి బొల్లికోడి
గొంగడి కక్కెర గొక్కెర గొరవంక
పూరేలు కనుపెంటి నీరుకాకి
వెలిచె లావుకపిట్ట చిలుక జీనువకౌఁజు
పెడిస కేర్జము డబ్బు బెలవ నెమిలి
జిట్టువ మునుగపూజిట్టువ గిజిగాఁడు
వల్లడ పొడిపిట్ట వంగపండు
బరతము కోకిల పసిరికె తంగేడు
గొరవంక జక్కవ చెఱువుకోడి
పట్టుజీనువు కొంగ పాపేరు పిచ్చుక
పోలిక పిక్కిలి మీలమ్రుచ్చు
చిలుక చకోరంబు జిబ్బిటాయ జటాయు
కొండపిచ్చుక వానకోకిలయును
మ్రానుపొక్కటిగాఁడు మాలకాకి బెనాసి
పాపెర గొరవంక పందికైర
గబ్బిలంబును జాతకము కంకచిటి చెల్వ
పొనుపెంటి యేట్రింత భూతపోఁతు
గున్నంగి కనకాక్షి గుడిసె బయ్యకపుల్ల
సీతువు బెగ్గురు జిక్కు తురుక
ఆ. పికిలి నేలనెమిలి పెనుగువ్వ బకదారి
పావురాయి సివఁడు పలువరింత
చదులుకోడి గువ్వ వదరుతోఁకల వేడి
యాడియైన పక్షు లతఁడు దీర్చు. 13



వ. అదియునుం గాక. 14

ఉ. వాని మనోహరాంగవిభవంబును వాని ముఖేందుకాంతియున్
వాని పటూక్తివిస్ఫురణ వాని విలోచనదైర్ఘ్యసంపదల్
వాని యురస్స్థలోన్నతియు వాని భుజప్రతిభావిశేషముల్
మానిని! యేమి చెప్ప, నసమానము లౌను తదీయవైఖరుల్. 15

క. అతని గృహమున విద్యా
చాతురి కలరారి నృపులొసంగ రహించున్
జాతిహయవస్త్రభూషణ
మాతంగద్రవ్యమణిసమాజము లెపుడున్. 16

క. పౌరుషముఁ దారతమ్యము
కారుణ్యము దానధర్మగరిమయుఁ గల వి
ద్యారసికత్వము వినయము
గారవముం గలిగి చిత్రఘనుఁ డట్లలరున్. 17

క. ఆ చిత్రఘనున కల వల
రాచవజీరుని జిరాగుఱానకు నెనయై
సూచింపఁ దగిన సొగసుది
వాచాలి యనంగ నొక్క వనిత చెలంగున్. 18

ఉ. ఆ కమలాక్షి చంచలదృగంచలసీమల తళ్కుబెళ్కులా!
యా కలకంఠకంఠి యలరారు సుధారస మొల్కు కుల్కులా?
యా కనకాంగి యంగరుచి హాటకకోటులఁ జిల్కుకళ్కులా?
హా! కుటిలాలకా! సరసిజాసనుఁ డైనను నేరఁడెంచఁగన్. 19

క. హరులా పల్కులు, తుమ్మెద
గఱులా కచరుచులు, నడలు కరులా కదళీ



తురులా తొడ లిందుని బి
త్తరులా గోళ్లెంచఁ బ్రౌఢతరులా? సరసుల్. 20

సీ. మాటలా? యమృతంపుఁ దేటలా? కపురాల
మూటలా? యని జారకోటు లెన్నఁ
గన్నులా? తెలిదమ్మి చెన్నులా? మగతేటి
యన్నులా? యని పల్లవాళు లెన్నఁ
జేతులా? సుమలతా జాతులా? కిసలయ
ఖ్యాతులా? యని యుపకాంతు లెన్న
గుబ్బలా? యపరంజి లిబ్బులా? రుచిమించు
దిబ్బలా? యని పాంథధీరు లెన్న
తే. గోరులా? రిక్కసౌరులా! కులుకుఁ దళుకు
నవ్వులా? జాజి పువ్వులా? నాటు నీటు
చూపులా? వాడి తూపులా? సొలపుఁ దెలుపు
ననుచు విటు లెన్నఁదగు నింతి, యతనుదంతి. 21

చ. వగ లిగురొత్త, జిత్తరువు వ్రాయుము సారెకు దీనిఁ జూచుచుం
దగ నవి పద్మసంభవుఁ డుదారదయామతి మీఱ మేలుబం
తిగ నొనరించి తత్పతికిఁ దేకువ నిచ్చిన మేటి జాళువా
జిగిబిగి గ్రమ్ము బొమ్మ యన సింధురగామిని యొప్పు నున్నతిన్. 22

తే. కురులు ఘనసంపదలఁ జెంది కొమరుమిగుల
ముఖము రాజవిభూతిచే మురియఁదొడఁగెఁ
గటి మహాచక్రవిభవముల్ గాంచె ననఁగ
నెలఁగు వాచాలి గమననిర్జితమరాళి. 23



ఉ. ముద్దులు గారు నెమ్మొగము మోహరసంబులు చిందు గుబ్బలున్
దిద్దినయట్టు లుండి జిగిఁ దేఱెడు చెక్కులు కావిమోవియున్
నిద్దపుజాళువా పసిఁడినిగ్గులు జిల్కు నయారె! దేహమున్
దద్దయు నెన్నఁగా వశమె? దాని నవీనవిలాససంపదల్. 24

తే. దాని వగలకు లోఁజిక్కి దర్ప ముడిగి
దర్పకాస్త్రాగ్నికీలదందహ్యమాన
మానసుడుఁగాని నరుఁడు భూమండలమున
వెదకినను లేఁడు సుమ్ము! సాధ్వీలలామ! 25

చ. అది తమయూరిదేవళమునందు దయ న్నెలకొన్న భక్తకా
మదుఁడగు రామచంద్రపెరుమా ళ్లలరం దిరునాళ్లలోన నిం
పొదవఁగఁ దార్క్ష్యవాహుడయి యున్నతితోఁ దిరువీథు లేఁగఁగా
ముదమున నమ్మహోత్సవపు ముచ్చటఁ జూడఁ దలంచి రా నటన్. 26

తిరునాళ్ల వేడుకలు

తే. పరఁగఁ బదియాఱు గుజ్జుల ప్రభ యొనర్చి
గంట వేదియు బంగారుకలశ మెత్తి
కంచుగుబ్బల రావిరేకలును లోవ
పక్షములు దీర్చి గొప్ప చప్పరము గాఁగ. 27

మ. జగతీజ్యోతులు కాగడాలు బలు బంజాయీలు మోంబత్తులున్
బగలొత్తుల్ దివిటీలుఁ దిర్వళిఘలుం బంజుల్ మహాజ్యోతులున్
దగ సూర్యప్రభ లాయిలాయులును జంద్రజ్యోతులున్ మైనపున్
జిగటాల్ నిచ్చెనపంజు లారతులు నగ్నిజ్యోతులున్ వెల్గఁగన్. 28

వ. అప్పు డప్పద్మపత్రాయతాక్షుని తాదృశమహోత్సవం బేకశరీరంబున నిరీక్షించిన సంతుష్టి గాదని కాయవ్యూహయోగసామర్థ్యంబున ననేకదేహంబులు దాల్చి భక్తిసంయుక్తి నిరుచక్కిం జేరి వీక్షించు సూర్యచంద్రబింబంబుల డంబునం బొలుచు పట్టుగొడుగులు ధవళాతపత్రంబులు రాణింప, గరుడధ్వజాదివివిధకేతనజాతవాతాహతి నంతరిక్షంబున నుండ నళికిపడుచుండెడు నుడుగణంబుల వడువున నక్షత్రబాణపరంపరలు చెలువు మీఱఁ, బాతాళభూతలంబుల సంచరించుసంచున వియత్తలంబునం దారు విహరించం దలంచి విషవహ్నిజ్వాలికలు గురియుచు గగనంబున కెగయు కాకోదరానీకంబుల వేఁక రివ్వురివ్వున నెగిరిచను నాకసపుఁ జువ్వలు మింటనెరయ ననంతకోటిబ్రహ్మాండనాయకుండైన పుండరీకనాభుం డేతేరం గనుంగొని ప్రమోదంబున మహావేదండయానలు సేసలుచల్లిన నుల్లసిల్లు వెండిపసిండిక్రొవ్విరితండంబుల పాండిత్యంబునఁ బలుతెఱంగుల బిరుసుల వింజామరల ఫెళఫెళారభటి నెఱయ రాలు సువర్ణవర్ణనీయంబులగు పూవుమొత్తంబులు భూనభో౽౦తరాళంబులం గప్పి యొప్పుచుండఁ, దదుత్సవవీక్షణకుతూహలసమాగత శుక్రబృహస్పతిబుధాదుల పగిదిం బగులొత్తులు వెలుఁగ వెండియుఁ జక్రబాణంబులు నాకాశచక్రంబులుఁ బిట్టబాణంబులు శతముఖబాణంబులుఁ దాటబాణంబులు దేలుబాణంబులు గురుజులు కుండబిరుసులు సంపంగిపూలబిరుసులు జక్రబిరుసులుఁ బంచవన్నెబిరుసులు గజబిరుసులు మొదలైన బాణవిద్యలవైఖరులు చిత్రవిచిత్రంబుగాఁ జూపుచు బాణకారులు ముందర నడువ డమరుపుర భిడ్డమరు సహచరభయద ఢక్కా హుడుక్కా రవచాను కలహ పటహతమ్మటావజనిస్సాణ ఝల్లరీమర్దళ మురజషణాతుత్తుంభికజర్జరీ పాశకోశక్రోలు మోరీ భేరులును డోలు గౌరు గుమ్మె తమ్మెట వీరణ యురుమ యొంటికంటియురుమ పంబ జిమిడిక తప్పెట గిడిబిడి తుడుము చక్కి చుయ్యంకియును దాళ మహోత్తాళంబులును జేగంట చిటితాళంబులుఁ జిటికెలు ముఖవీణ శంఖ కాంస్యశృంగ కాహళంబులును సన్నేగాళెన ఫీరు కరకొమ్ము నాగస్వరమును సుతి చెంగు చేసన్నాయి సింగినాదము పిల్లఁగ్రోవి మ్రోలుఁబీకలును వీణె రుద్రవీణ స్వయంభువీణ మనోహరవీణ నారదవీణ బాణవీణ సరస్వతీవీణ స్వరమండలంబు, తంబుర రావణహస్తంబు రవాలుఁ గిన్నర తిపిరికిన్నర సిద్ధకిన్నర దండె మొదలయిన హృద్యానవద్యవాద్యవిశేషంబులు దిక్కులు పిక్కటిల్ల నిర్ఘోషంబులు బోరుకొల్ప నడుగడుగునకు నీరాజనంబులు నేకారతి పంచారతి యళఘారతి కుంభారతి శేషారతి గరుజారతి పురుషమృగారతి మంగళారతి యేకదళారతులు కూర్మస్వస్తిక నభోమంటప రంగవల్లిక లింగస్వస్తిక సర్వతోభద్ర గిరిబంధ మయూరనాట్య నాగబంధ వింజామర వ్యజనచ్ఛత్ర సింహతలాట బృందావన కల్పవృక్ష పాలసముద్ర గంగాతరంగ శంఖచక్ర పద్మంబులను పేరు గల్గిన మ్రుగ్గులు మాణిక్య మౌక్తిక ప్రవాళ మరకత పుష్యరాగ వజ్ర నీల గోమేధిక వైడూర్యంబులను నవరత్నంబులం దీర్చి పుణ్యభామిను లెత్తుచుండ దశాంగ గుగ్గులు సామ్రాణి సజ్జరస శ్రీవాస సరళ యావన వృక్షధూపంబులు ఘుమ్మురను వాసనలుఁ గ్రమ్ముకొనఁ బశ్చిమభాగంబునఁ బరమభాగవతోత్తములు శ్రీవైష్ణవులుఁ గులశేఖరులుఁ ద్రైవర్ణికులు యతిరాజవింశతి పూర్వదినచర్య యుత్తరదినచర్య క్షమాషోడశము శఠగోపస్తవము శ్రీగుణరత్నకోశము ముకుందమాల యష్టశ్లోకి యాళవందారుస్తోత్రముఁ దిరువాయిమొడి తిరుమంత్రద్వయచరమశ్లోకంబులు మొదలయిన ద్రావిళపాఠప్రబంధములు ప్రపత్తిపూర్వకంబుగాఁ బ్రసంగింప స్థలపరస్థలంబులనుండి చూడవచ్చిన బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులును, కోమటి కమ్మ వెలమ వేకరి పట్ర గొల్ల బలిజ కుమ్మర వలగండ బెస్త చిప్పె కమ్మరి వడ్రంగి కాళె కంచర యగసాల వడసాలె సాలె సాతాని కటిక భట్టు జెట్టి జాండ్ర తొగట గాండ్లవారును, జిత్రకార వందిమాగధ వైతాళిక జైన ఘూర్జర గౌడమిశ్రులును, భేరి భళియ ఛటికి సృగాలక చత్రజాతులును, బోయ యెఱుకు చెంచు యేనాది జలగరి వానివన్నె గట్టురంబళి యీడిగె మేదర వీరముష్టి మాష్టి యొడ్డె యుప్పరులును, నసిధావక మైలారి తురుక పింజారి విప్రవినోదులును, జాతికర్త దొమ్మరి డొమిణి బొమ్మలాటవారును, నింద్రజాలిక మహేంద్రజాలిక హస్తలాఘవ సూత్రనాటక క్షౌరక రజకులును, బోగమువారును, దెరనాటకపు జంగాలును, జంగాలు బిద్దెమువాండ్రు తెల్లకోకబత్తులు సివసత్తులు బత్తులు పలునాటివీరులు పరిహాసకులు సుద్దులకొమాళ్లు కొమ్మూరి దానళ్లు తవిరుదాసళ్లు కోణాంగులు సేవపరులు పరసలు పడిగెవారు పరంగు లింగిలీసులు పరాసులు వళందులు సన్న్యాసు లేకదండత్రిదండు లేకాంగులు వానప్రస్థులు యోగు లవధూతలు పరమహంసిలు బైరాగులు జటాధారులు దిగంబరులు గోముఖులు నియమస్థు లూర్ద్వబాహులును, గోరడజోగులు కాటిపాపలు మందపిచ్చులు పిచ్చుగుంట్లు చర్మకర్ములు చండాల మాతంగులు తలక్రిందుజోగులు రామగోవిందులు మొదలగువారును, బురోభాగంబున నేల యీనిన చందంబున, వెల్లివిరిసిన చాడ్పున, నుసుళ్ల విధంబున, మిడుత గమిలాగున, బేడిసెకదుపు భంగిని, నాకుఁ జిలుకల మొత్తంబు వంతున, బెరయీఁగల పగిదిని, స్వాతిబకంబుల వీఁకను, గంగాతరంగంబుల కైవడి, జలబుద్బుదంబుల వైఖరి, వర్షధారల పోల్కిని, రామరావణ బాణపరంపరల రీతినిఁ, బుంఖానుపుంఖంబులుఁ దండోపతండంబులు లక్షోపలక్షలు శాఖోపశాఖలుఁ గోటానుకోటులు సంఖ్యాతిసంఖ్యలుగా నడుచు సమయంబున. 29

క. నెఱిఁగంట మాళ్లిడుదు ని
ద్దఱు మంచి కొమాళ్లు గలుగ దయచేసిన నో
పెరుమాళ్ళని యా వాచా
లి రుమాళ్ల నొసంగి మ్రొక్కి యేఁగుచునుండన్. 30

క. ఆయెడ వరదత్తుండను
కాయజరేఖాసమానకలితాకారుం
డా యింతి యున్న చక్కటిఁ
బాయక నిలుచుండి దానిపై మోహమునన్. 31

ఉ. కందువమాటలాడి వగకారితనంబులు సూపి సన్న లిం
పొందఁగ సల్పి చేరికల నుల్లము రంజిలఁజేసి తమ్ములం
బందఁగనిచ్చి మెచ్చి భుజమందుఁ కరంబిడి నవ్వుచేష్టఁ గే
ళిం దమిరేఁచి గుబ్బలు ఛళీమని నల్చి రతైకచిత్తుఁడై. 32



క. ఆ వాచాలిని సంకే
తావాసమ్మునకు రమ్మటని ప్రార్థింపం
గా వలచి మనసు మెత్తని
దై వాని మనో౽భిలాష లమరన్ దీర్చెన్. 33

క. అదిమొదలు సుదతి మదమును
బొదలఁగఁ దుదిలేని మోహముల కాస్పదమౌ
మదిని ముదంబులు గుదిఁగొన
మదనప్రదరప్రభిన్నమర్మస్థలయై. 34

చ. చవిగొని జారవీరవరసంగమసంగ్రహణక్రియామహో
త్సవపరిణద్ధశుద్ధఘనతద్ధితబుద్ధిని సంచరింప న
య్యువిదకు నొక్క పుత్రుఁడు సముద్భవ మొందె మఱంతనైనఁ బ
ల్లవసురతం బసహ్యతఁ దలంపక యెప్పటియట్ల సల్పఁగన్. 35

ఉ. “సొంపులునింపు చిత్తరువుఁ జూడఁగవచ్చితి" మంచు వేడ్క మో
హంపువయస్సు డిచ్చటకునై పఱతేఱె" నటంచు, “మీదె? యీ
సంపద లుల్లసిల్లు ఘనసద్మ" మటంచును దానికోసమై
గుంపులుగూడి వీటి విటకోటులు వత్తురు బోఁటియింటికిన్. 36

క. ఈలాగు జారకోటికి
మేలౌ నభిమతముఁ దీర్చి మెలఁగుచు నుండే
కాలమున నొక్క నాఁ డొక
జాలుండను విటునిఁ బిల్చి సంధ్యావేళన్. 37

తే. పురము వెల్వడి కాళికాపుణ్యభవన
సీమ సంకేత; మట కీవు చేరు మనుచుఁ
జెప్పి వాచాలి పతిలేని చొప్పుఁ జూచి
పుత్రు నిద్దురఁబుచ్చి తాఁ బోయె నటకు. 38



తే. పోయి యా కాళికోవెల పొంత నిలిచి
కటికి మబ్బున నలుదెస ల్గలయఁ జూచి
జాలుఁ డాచాయ లేకున్న సంశయించి
మనసుఁ దెలియఁగ డాఁగెనో యని తలంచి. 39

ఉ. చీమ చిటుక్కుమన్న వినుఁ జిమ్మట బుఱ్ఱన నేఁగు నంతలో
నే ముదమంది చూచు సరణిన్ బశుపక్షిమృగాదిజంతువుల్
వేమఱుఁబోవు చప్పుడులు విస్మయ మందఁగ నాలకించు "నా
హా! మఱి రాక తక్కెనె" యటంచుఁ దలంచు వియోగవేదనన్. 40

క. "ఏరా తాళఁగ లేరా!
రారా! నన్నేచ నేల? రారా! రాపుల్
మేరా? మోహనరూపశ
రీరా! యటుడాఁగి పల్కరింప వదేరా?" 41

మ. అని వాచాలి ప్రియంపుఁ బల్లవుని డాయం బిల్వఁగా మ్రోయు వా
గ్ధ్వను లాలించి నిజాంగనాగళరవవ్రాతం బిదౌ నిశ్చయం
బనుచుం దద్విభుఁ డప్పుడొక్కపనికై యాదారిగాఁ బోవుచున్
గని “యిట్లేటికిఁ జీరెదీ" వనుచుఁ బల్కన్ గాంత తానంతటన్. 42

క. ఎటువలె బొంకఁగ వలెనో
కుటిలాలక! నీవు తెలిసికొమ్మని యనఁగా
నిటునటుఁ జూ చది తెలియదు
పటుసూక్తిని నీవె తెలుపు పత్రిప! యనినన్. 43

క. ఆ మానసౌక మప్పుడు
హేమావతి కనియెఁ దను నిజేశుం డడుగన్



భామిని ధైర్యము వదలక
తా మగనికి ననియె వేడ్క దళుకొత్తంగన్. 44

ఉ. “అయ్యలు సందేవేళఁ జని యాడఁగ, నింటికి రాక తక్కితే
నియ్యెడ నీదు వెంటఁ జరియించుచు వచ్చెనొ యంచు భీతిచే
నుయ్యెల లూఁగు ప్రాణముల నోర్వక చీరెద వీటఁ జూచితే
నెయ్యెడ లేఁడు చెల్లనిఁక నేమి యొనర్తు మనోహరాధిపా!" 45

క. అని వాపోవుచు సతి ప
ల్కిన విని యా చిత్రఘనుఁడు కినుకెడలి దిగుల్
గొని మనసు వకావకలై
చనఁ, "జెడితి నెటేఁగె?" నంచు సతితో ననుచున్. 46

తే. నగరమున కేఁగి యిద్దఱు నాల్గు వీథు
లరయుచుండంగ వాచాలి యంతలోన
భవనమున కేఁగి చనుదెంచి భర్తతోడ
వేడ్క లిగురొత్తఁ జెప్పెను వింతగాఁగ. 47

క. "నేనింటి కేఁగి చూడఁగఁ
దా నిద్రాసక్తిఁ బూని తనయుం డున్నా
డో నవమదనా! ర”మ్మని
మానిని తోడ్తెచ్చె మగని మందిరమునకున్. 48

తే. అట్లు తోడ్తెచ్చి నిద్రించు ననుఁగు సుతుని
లేపి ముద్దాడుకొనుచుఁ దొల్లింటి యట్ల
చిత్రఘనుఁడును వాచాలి చిత్త మలర
నిండుమోదంబున సుఖాన నుండి రపుడు. 49

క. ఆ రీతి నేర్పుగల్గిన
భూరమణునిఁ జేరు మనుచుఁ బులుగులదొర తన్
జీరఁగ హేమావతి విని
యౌరా! చెలియాగడం బటంచు గణించెన్. 50

క. ఈరీతిఁ గథకుఁ జొక్కి ప
యోరుహముఖి మెచ్చునప్పు డుత్ఫుల్ల త్పం
కేరుహ గంధానిల మరు
దేరఁగఁ దెలవాఱవచ్చె దృఢమని యంతన్. 51

సీ. పట్టెమంచము మెత్తపయిఁ దలగడ బిళ్ల
లగురుధూపము దివ్వె లడపము చిటి
చాప జాబిల్లికైసాన పువ్వుల చెండ్లు
తబుకు దంతపు గద్దె తావికుడుక
గొడుగు పావలు గందవాడి పెట్టె గందపు
గిన్నె సున్నపుఁగాయ గిండి సురటి
తంబుర నిల్వుటద్దము తమ్మిపడిగయు
వీణ కస్తురి రుద్రవీణ పునుఁగు
తే. కరవటం బాకు సంబెళ కప్పురంపుఁ
గ్రోవి బాగాలు బకదారి గూండ్లు దనరు
లోవ తీనెలు చిత్తర్వు ఠీవిఁ దనరు
కేళినిలయంబుఁ జేరె నక్కీరవాణి. 52

క. చేరి దినాంతంబైన వ
నేరుహశర కుసుమచాపనిర్ముక్తశరా
సార మొకయింత సైపక
భూరమణీరమణుఁ జేరఁబోయెడు బుద్ధిన్. 53

సీ. జలదావళి రహించు చంచలా లత లన
వేణిఁ గైతక దళ శ్రేణి మెఱయ
దిన విభాంకురము మైత్రినిఁ దమ్మిఁజేరె నాఁ
గాశ్మీర రేఖ వక్త్రమునఁ దనర
జయశంఖమునకు ముత్తియపు జల్లులు వేసె
మరుఁడు నా గళమున సరులు దూఁగఁ
బువ్వుగుత్తులఁ గప్పు పుప్పొడి యన గంద
వడి - పూఁత గుబ్బలఁ బరిమళింప
తే. రమ్య మేఖల ఘళఘళల్ రత్నహేమ
కలిత నూపుర ఝళఝళల్ చలువ వలువ
ఫెళఫెళల్ గిల్కు మట్టెల గిలగిలల్ ర
హించ రాయంచకడ నిల్చెఁ జంచలాక్షి. 54

తే. నిలిచి హేమావతీ నామ జలరుహాక్షి
హంసకుల పట్టభద్ర! నేడైన మాన
వేంద్రు కడకేఁగు మని సెల విమ్మటన్న
శిరముఁ గదలించి రాయంచ చెలియ కనియె. 55

శా. అక్కా! రత్నపుఁ బొళ్లసొమ్ము లివి లెస్సాయెన్ దుకూలం బహో!
చొక్కంబై తగె బుక్కపూఁత సుమముల్ సొంపారె, సేబాసు! నా
దిక్కుం జూడు, శిరోవిధూననము సంధిల్లన్ వచోమాధురిన్
జొక్కం జెప్పెద నొక్కగాథ విని నన్నున్ మెచ్చి పొమ్మంతటన్. 56

క. అనుచున్న హంస పలుకులు
వినుచున్ నళినాక్షి పలుకు వినియెద నని తన్
గనుచున్నఁ దేనెధారలు
పెనుచుచు నవభణితి నపుడు బిసభోక్త యనెన్. 57