హంసవింశతి/తృతీయాశ్వాసము



హంస వింశతి

తృతీయాశ్వాసము

శ్రీజానకీక్షణోత్పల
రాజా! రాజాధిరాజ! రాజన్నిజసే
వాజాతహర్ష మునిజన
తాజలరుహచండధామ! దశరథరామా! 1

వ. అవధరింపుము. ప్రత్యుత్పన్నమతి నలరా జన్యున కిట్లనియె. అట్లు ప్రభాతసమయంబు గావచ్చినం గనుంగొని. 2

మ. చని పూఁజప్పర మొప్పుచుండెడు మణిసౌధంబులోఁ గెంపుఱా
మొనముక్కుల్ గల పచ్చఱాచిలుకకోళ్పొల్పొందు బంగారపుం
బని రంగారెడు తూగుటుయ్యెలపయిన్ బాగొప్ప మేన్సేర్చి యా
వనజాతాక్షి దినాంతవేళ మనుజస్వామిస్పృహాధీనయై. 3

చ. మిడిగల వజ్రపున్ రవలమిన్కుల కమ్మలు జాతికెంపుఱా
కడియములున్ సుపాణుల చొకాటపుహారములున్ మృగీమదం
బడరెడు పట్టుచీర సొగసౌ ననఁదాల్చి నృపాలు కేళికిన్
నడిచె వధూలలామ తమినాటిన చిత్తము తత్తరింపగన్. 4

క. ఆయెడ హంసకులాగ్రణి
యా యోషామణినిఁ గాంచి యనుపమ వచన
శ్రీ యలరఁగ "నొక చిత్రో
పాయపుఁ గథ విను" మటంచుఁ బలికి వచించెన్. 5



తొమ్మిదవరాత్రి కథ

ముచ్చివాని భార్య తిరునాళ్ల గోవాళ్లఁ గూడుట

ఉ. సాలము మిన్నునంటి ఘనసంపదఁ గాంచ నగడ్త యీర్ష్యచేఁ
దాళ కనంతభోగములు తద్దయుఁ బద్దునఁ దాను జెంద నౌ
మేలనఁ గోట యున్నతియు మిక్కిలి ఖేయము లోఁతు గల్గి శో
భాలలితంబనంగ నొక పట్టణ మొప్పు నితంబినీమణీ! 6

క. ఆ వీటిలోన రంగా
జీవ కులాంభోధి పూర్ణ శీతమయూఖుం
డై వెలసి చిత్రఘనుఁ డనఁ
గా వార్తకు నెక్కి యొకఁడు కాపుర ముండున్. 7

తే. హరిత హారిద్ర కృష్ణ రక్తావదాత
శబల పాటల ధూమల శ్యామ కపిశ
వర్ణములఁ గూర్చి చిప్పల వాసె లునిచి
చిత్తరువు వ్రాయు గుళ్లలోఁ జిత్రఘనుఁడు. 8

క. సుర విద్యాధర కిన్నర
గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ హరి
ద్వర యక్షాసుర నలినజ
హరిహర మర్త్యర్షివరుల నతఁడు లిఖించున్. 9

మృగ పక్షుల పట్టి

సీ. హరి కరి మృగ ఖడ్గ కిరి తరక్షు ద్వీపి
సైరిభ గోకర్ణ శరభ చమర

గంధర్వ రోహిష గవయ భల్లుక రామ
శశ జంబు కోష్ట్రాశ్వ కోక
వామీ ఖరోరణ శ్వా నౌతు కపి బభ్రు
సరటర్శ్య లూతాఖు సర్ప మకర
శతపదీ బస్త మత్స్య ఢులీ కుళీరాళి
గౌధేయ రక్తపా కమఠ నక్ర
తే. గో మహిష వృష భేక చిక్రోడములను
సింగిలీకము చిఱుపులి చెదలు పురువు
కొక్కు వెంట్రువు నలికిరి కొర్నలాది
గాఁ గలుగు జంతువులఁ జిత్రఘనుఁడు దీర్చు. 10

తే. గరిమి డిబ్బంది చొఱపందిగాఁడు మంద
గరడ బెగ్గోలు రేచు గర్గరము రాళ్ల
రాచి పెంకుల జెఱ్ఱి పున్నాచి పక్కి
పేచి చెక్కెల చేరను పేళ్లఁ గలుగు. 11

వ. పులుగులను, మఱియు (పూరణము) 12

సీసమాలిక.
గరుఁడుండు సంపాతి గండభేరుండంబు
చీకురా యాడేలు జెముడుకాకి
వార్యము బైరి జావళము సాళ్వము డేగ
గూడబా తుల్లంగి కుంద టీల
పాల నారాయణపక్షి పాముల మ్రింగు
డంచ వేష్టము గ్రద్ద క్రౌంచ మాబ
లగు లోదె గొరకు తెల్లని పంత బలసట్టె
గూబ శంబర కాకి గుబిలిగాఁడు
నామాలకేతఁడు నల్లాస కప్పెరు
కాకి యంజిటిదారిగాఁడు మూఁగ

చిందర లకుముకి చిఱుత తీతువ కోడి
కారుకో డేకుల నారిగాఁడు
మునుఁగు కోడియు డాల ముట్టెకోడియు బోద
పొన్నంగి కకళేటి బొల్లికోడి
గొంగడి కక్కెర గొక్కెర గొరవంక
పూరేలు కనుపెంటి నీరుకాకి
వెలిచె లావుకపిట్ట చిలుక జీనువకౌఁజు
పెడిస కేర్జము డబ్బు బెలవ నెమిలి
జిట్టువ మునుగపూజిట్టువ గిజిగాఁడు
వల్లడ పొడిపిట్ట వంగపండు
బరతము కోకిల పసిరికె తంగేడు
గొరవంక జక్కవ చెఱువుకోడి
పట్టుజీనువు కొంగ పాపేరు పిచ్చుక
పోలిక పిక్కిలి మీలమ్రుచ్చు
చిలుక చకోరంబు జిబ్బిటాయ జటాయు
కొండపిచ్చుక వానకోకిలయును
మ్రానుపొక్కటిగాఁడు మాలకాకి బెనాసి
పాపెర గొరవంక పందికైర
గబ్బిలంబును జాతకము కంకచిటి చెల్వ
పొనుపెంటి యేట్రింత భూతపోఁతు
గున్నంగి కనకాక్షి గుడిసె బయ్యకపుల్ల
సీతువు బెగ్గురు జిక్కు తురుక
ఆ. పికిలి నేలనెమిలి పెనుగువ్వ బకదారి
పావురాయి సివఁడు పలువరింత
చదులుకోడి గువ్వ వదరుతోఁకల వేడి
యాడియైన పక్షు లతఁడు దీర్చు. 13



వ. అదియునుం గాక. 14

ఉ. వాని మనోహరాంగవిభవంబును వాని ముఖేందుకాంతియున్
వాని పటూక్తివిస్ఫురణ వాని విలోచనదైర్ఘ్యసంపదల్
వాని యురస్స్థలోన్నతియు వాని భుజప్రతిభావిశేషముల్
మానిని! యేమి చెప్ప, నసమానము లౌను తదీయవైఖరుల్. 15

క. అతని గృహమున విద్యా
చాతురి కలరారి నృపులొసంగ రహించున్
జాతిహయవస్త్రభూషణ
మాతంగద్రవ్యమణిసమాజము లెపుడున్. 16

క. పౌరుషముఁ దారతమ్యము
కారుణ్యము దానధర్మగరిమయుఁ గల వి
ద్యారసికత్వము వినయము
గారవముం గలిగి చిత్రఘనుఁ డట్లలరున్. 17

క. ఆ చిత్రఘనున కల వల
రాచవజీరుని జిరాగుఱానకు నెనయై
సూచింపఁ దగిన సొగసుది
వాచాలి యనంగ నొక్క వనిత చెలంగున్. 18

ఉ. ఆ కమలాక్షి చంచలదృగంచలసీమల తళ్కుబెళ్కులా!
యా కలకంఠకంఠి యలరారు సుధారస మొల్కు కుల్కులా?
యా కనకాంగి యంగరుచి హాటకకోటులఁ జిల్కుకళ్కులా?
హా! కుటిలాలకా! సరసిజాసనుఁ డైనను నేరఁడెంచఁగన్. 19

క. హరులా పల్కులు, తుమ్మెద
గఱులా కచరుచులు, నడలు కరులా కదళీ



తురులా తొడ లిందుని బి
త్తరులా గోళ్లెంచఁ బ్రౌఢతరులా? సరసుల్. 20

సీ. మాటలా? యమృతంపుఁ దేటలా? కపురాల
మూటలా? యని జారకోటు లెన్నఁ
గన్నులా? తెలిదమ్మి చెన్నులా? మగతేటి
యన్నులా? యని పల్లవాళు లెన్నఁ
జేతులా? సుమలతా జాతులా? కిసలయ
ఖ్యాతులా? యని యుపకాంతు లెన్న
గుబ్బలా? యపరంజి లిబ్బులా? రుచిమించు
దిబ్బలా? యని పాంథధీరు లెన్న
తే. గోరులా? రిక్కసౌరులా! కులుకుఁ దళుకు
నవ్వులా? జాజి పువ్వులా? నాటు నీటు
చూపులా? వాడి తూపులా? సొలపుఁ దెలుపు
ననుచు విటు లెన్నఁదగు నింతి, యతనుదంతి. 21

చ. వగ లిగురొత్త, జిత్తరువు వ్రాయుము సారెకు దీనిఁ జూచుచుం
దగ నవి పద్మసంభవుఁ డుదారదయామతి మీఱ మేలుబం
తిగ నొనరించి తత్పతికిఁ దేకువ నిచ్చిన మేటి జాళువా
జిగిబిగి గ్రమ్ము బొమ్మ యన సింధురగామిని యొప్పు నున్నతిన్. 22

తే. కురులు ఘనసంపదలఁ జెంది కొమరుమిగుల
ముఖము రాజవిభూతిచే మురియఁదొడఁగెఁ
గటి మహాచక్రవిభవముల్ గాంచె ననఁగ
నెలఁగు వాచాలి గమననిర్జితమరాళి. 23



ఉ. ముద్దులు గారు నెమ్మొగము మోహరసంబులు చిందు గుబ్బలున్
దిద్దినయట్టు లుండి జిగిఁ దేఱెడు చెక్కులు కావిమోవియున్
నిద్దపుజాళువా పసిఁడినిగ్గులు జిల్కు నయారె! దేహమున్
దద్దయు నెన్నఁగా వశమె? దాని నవీనవిలాససంపదల్. 24

తే. దాని వగలకు లోఁజిక్కి దర్ప ముడిగి
దర్పకాస్త్రాగ్నికీలదందహ్యమాన
మానసుడుఁగాని నరుఁడు భూమండలమున
వెదకినను లేఁడు సుమ్ము! సాధ్వీలలామ! 25

చ. అది తమయూరిదేవళమునందు దయ న్నెలకొన్న భక్తకా
మదుఁడగు రామచంద్రపెరుమా ళ్లలరం దిరునాళ్లలోన నిం
పొదవఁగఁ దార్క్ష్యవాహుడయి యున్నతితోఁ దిరువీథు లేఁగఁగా
ముదమున నమ్మహోత్సవపు ముచ్చటఁ జూడఁ దలంచి రా నటన్. 26

తిరునాళ్ల వేడుకలు

తే. పరఁగఁ బదియాఱు గుజ్జుల ప్రభ యొనర్చి
గంట వేదియు బంగారుకలశ మెత్తి
కంచుగుబ్బల రావిరేకలును లోవ
పక్షములు దీర్చి గొప్ప చప్పరము గాఁగ. 27

మ. జగతీజ్యోతులు కాగడాలు బలు బంజాయీలు మోంబత్తులున్
బగలొత్తుల్ దివిటీలుఁ దిర్వళిఘలుం బంజుల్ మహాజ్యోతులున్
దగ సూర్యప్రభ లాయిలాయులును జంద్రజ్యోతులున్ మైనపున్
జిగటాల్ నిచ్చెనపంజు లారతులు నగ్నిజ్యోతులున్ వెల్గఁగన్. 28

వ. అప్పు డప్పద్మపత్రాయతాక్షుని తాదృశమహోత్సవం బేకశరీరంబున నిరీక్షించిన సంతుష్టి గాదని కాయవ్యూహయోగసామర్థ్యంబున ననేకదేహంబులు దాల్చి భక్తిసంయుక్తి నిరుచక్కిం జేరి వీక్షించు సూర్యచంద్రబింబంబుల డంబునం బొలుచు పట్టుగొడుగులు ధవళాతపత్రంబులు రాణింప, గరుడధ్వజాదివివిధకేతనజాతవాతాహతి నంతరిక్షంబున నుండ నళికిపడుచుండెడు నుడుగణంబుల వడువున నక్షత్రబాణపరంపరలు చెలువు మీఱఁ, బాతాళభూతలంబుల సంచరించుసంచున వియత్తలంబునం దారు విహరించం దలంచి విషవహ్నిజ్వాలికలు గురియుచు గగనంబున కెగయు కాకోదరానీకంబుల వేఁక రివ్వురివ్వున నెగిరిచను నాకసపుఁ జువ్వలు మింటనెరయ ననంతకోటిబ్రహ్మాండనాయకుండైన పుండరీకనాభుం డేతేరం గనుంగొని ప్రమోదంబున మహావేదండయానలు సేసలుచల్లిన నుల్లసిల్లు వెండిపసిండిక్రొవ్విరితండంబుల పాండిత్యంబునఁ బలుతెఱంగుల బిరుసుల వింజామరల ఫెళఫెళారభటి నెఱయ రాలు సువర్ణవర్ణనీయంబులగు పూవుమొత్తంబులు భూనభో౽౦తరాళంబులం గప్పి యొప్పుచుండఁ, దదుత్సవవీక్షణకుతూహలసమాగత శుక్రబృహస్పతిబుధాదుల పగిదిం బగులొత్తులు వెలుఁగ వెండియుఁ జక్రబాణంబులు నాకాశచక్రంబులుఁ బిట్టబాణంబులు శతముఖబాణంబులుఁ దాటబాణంబులు దేలుబాణంబులు గురుజులు కుండబిరుసులు సంపంగిపూలబిరుసులు జక్రబిరుసులుఁ బంచవన్నెబిరుసులు గజబిరుసులు మొదలైన బాణవిద్యలవైఖరులు చిత్రవిచిత్రంబుగాఁ జూపుచు బాణకారులు ముందర నడువ డమరుపుర భిడ్డమరు సహచరభయద ఢక్కా హుడుక్కా రవచాను కలహ పటహతమ్మటావజనిస్సాణ ఝల్లరీమర్దళ మురజషణాతుత్తుంభికజర్జరీ పాశకోశక్రోలు మోరీ భేరులును డోలు గౌరు గుమ్మె తమ్మెట వీరణ యురుమ యొంటికంటియురుమ పంబ జిమిడిక తప్పెట గిడిబిడి తుడుము చక్కి చుయ్యంకియును దాళ మహోత్తాళంబులును జేగంట చిటితాళంబులుఁ జిటికెలు ముఖవీణ శంఖ కాంస్యశృంగ కాహళంబులును సన్నేగాళెన ఫీరు కరకొమ్ము నాగస్వరమును సుతి చెంగు చేసన్నాయి సింగినాదము పిల్లఁగ్రోవి మ్రోలుఁబీకలును వీణె రుద్రవీణ స్వయంభువీణ మనోహరవీణ నారదవీణ బాణవీణ సరస్వతీవీణ స్వరమండలంబు, తంబుర రావణహస్తంబు రవాలుఁ గిన్నర తిపిరికిన్నర సిద్ధకిన్నర దండె మొదలయిన హృద్యానవద్యవాద్యవిశేషంబులు దిక్కులు పిక్కటిల్ల నిర్ఘోషంబులు బోరుకొల్ప నడుగడుగునకు నీరాజనంబులు నేకారతి పంచారతి యళఘారతి కుంభారతి శేషారతి గరుజారతి పురుషమృగారతి మంగళారతి యేకదళారతులు కూర్మస్వస్తిక నభోమంటప రంగవల్లిక లింగస్వస్తిక సర్వతోభద్ర గిరిబంధ మయూరనాట్య నాగబంధ వింజామర వ్యజనచ్ఛత్ర సింహతలాట బృందావన కల్పవృక్ష పాలసముద్ర గంగాతరంగ శంఖచక్ర పద్మంబులను పేరు గల్గిన మ్రుగ్గులు మాణిక్య మౌక్తిక ప్రవాళ మరకత పుష్యరాగ వజ్ర నీల గోమేధిక వైడూర్యంబులను నవరత్నంబులం దీర్చి పుణ్యభామిను లెత్తుచుండ దశాంగ గుగ్గులు సామ్రాణి సజ్జరస శ్రీవాస సరళ యావన వృక్షధూపంబులు ఘుమ్మురను వాసనలుఁ గ్రమ్ముకొనఁ బశ్చిమభాగంబునఁ బరమభాగవతోత్తములు శ్రీవైష్ణవులుఁ గులశేఖరులుఁ ద్రైవర్ణికులు యతిరాజవింశతి పూర్వదినచర్య యుత్తరదినచర్య క్షమాషోడశము శఠగోపస్తవము శ్రీగుణరత్నకోశము ముకుందమాల యష్టశ్లోకి యాళవందారుస్తోత్రముఁ దిరువాయిమొడి తిరుమంత్రద్వయచరమశ్లోకంబులు మొదలయిన ద్రావిళపాఠప్రబంధములు ప్రపత్తిపూర్వకంబుగాఁ బ్రసంగింప స్థలపరస్థలంబులనుండి చూడవచ్చిన బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులును, కోమటి కమ్మ వెలమ వేకరి పట్ర గొల్ల బలిజ కుమ్మర వలగండ బెస్త చిప్పె కమ్మరి వడ్రంగి కాళె కంచర యగసాల వడసాలె సాలె సాతాని కటిక భట్టు జెట్టి జాండ్ర తొగట గాండ్లవారును, జిత్రకార వందిమాగధ వైతాళిక జైన ఘూర్జర గౌడమిశ్రులును, భేరి భళియ ఛటికి సృగాలక చత్రజాతులును, బోయ యెఱుకు చెంచు యేనాది జలగరి వానివన్నె గట్టురంబళి యీడిగె మేదర వీరముష్టి మాష్టి యొడ్డె యుప్పరులును, నసిధావక మైలారి తురుక పింజారి విప్రవినోదులును, జాతికర్త దొమ్మరి డొమిణి బొమ్మలాటవారును, నింద్రజాలిక మహేంద్రజాలిక హస్తలాఘవ సూత్రనాటక క్షౌరక రజకులును, బోగమువారును, దెరనాటకపు జంగాలును, జంగాలు బిద్దెమువాండ్రు తెల్లకోకబత్తులు సివసత్తులు బత్తులు పలునాటివీరులు పరిహాసకులు సుద్దులకొమాళ్లు కొమ్మూరి దానళ్లు తవిరుదాసళ్లు కోణాంగులు సేవపరులు పరసలు పడిగెవారు పరంగు లింగిలీసులు పరాసులు వళందులు సన్న్యాసు లేకదండత్రిదండు లేకాంగులు వానప్రస్థులు యోగు లవధూతలు పరమహంసిలు బైరాగులు జటాధారులు దిగంబరులు గోముఖులు నియమస్థు లూర్ద్వబాహులును, గోరడజోగులు కాటిపాపలు మందపిచ్చులు పిచ్చుగుంట్లు చర్మకర్ములు చండాల మాతంగులు తలక్రిందుజోగులు రామగోవిందులు మొదలగువారును, బురోభాగంబున నేల యీనిన చందంబున, వెల్లివిరిసిన చాడ్పున, నుసుళ్ల విధంబున, మిడుత గమిలాగున, బేడిసెకదుపు భంగిని, నాకుఁ జిలుకల మొత్తంబు వంతున, బెరయీఁగల పగిదిని, స్వాతిబకంబుల వీఁకను, గంగాతరంగంబుల కైవడి, జలబుద్బుదంబుల వైఖరి, వర్షధారల పోల్కిని, రామరావణ బాణపరంపరల రీతినిఁ, బుంఖానుపుంఖంబులుఁ దండోపతండంబులు లక్షోపలక్షలు శాఖోపశాఖలుఁ గోటానుకోటులు సంఖ్యాతిసంఖ్యలుగా నడుచు సమయంబున. 29

క. నెఱిఁగంట మాళ్లిడుదు ని
ద్దఱు మంచి కొమాళ్లు గలుగ దయచేసిన నో
పెరుమాళ్ళని యా వాచా
లి రుమాళ్ల నొసంగి మ్రొక్కి యేఁగుచునుండన్. 30

క. ఆయెడ వరదత్తుండను
కాయజరేఖాసమానకలితాకారుం
డా యింతి యున్న చక్కటిఁ
బాయక నిలుచుండి దానిపై మోహమునన్. 31

ఉ. కందువమాటలాడి వగకారితనంబులు సూపి సన్న లిం
పొందఁగ సల్పి చేరికల నుల్లము రంజిలఁజేసి తమ్ములం
బందఁగనిచ్చి మెచ్చి భుజమందుఁ కరంబిడి నవ్వుచేష్టఁ గే
ళిం దమిరేఁచి గుబ్బలు ఛళీమని నల్చి రతైకచిత్తుఁడై. 32



క. ఆ వాచాలిని సంకే
తావాసమ్మునకు రమ్మటని ప్రార్థింపం
గా వలచి మనసు మెత్తని
దై వాని మనో౽భిలాష లమరన్ దీర్చెన్. 33

క. అదిమొదలు సుదతి మదమును
బొదలఁగఁ దుదిలేని మోహముల కాస్పదమౌ
మదిని ముదంబులు గుదిఁగొన
మదనప్రదరప్రభిన్నమర్మస్థలయై. 34

చ. చవిగొని జారవీరవరసంగమసంగ్రహణక్రియామహో
త్సవపరిణద్ధశుద్ధఘనతద్ధితబుద్ధిని సంచరింప న
య్యువిదకు నొక్క పుత్రుఁడు సముద్భవ మొందె మఱంతనైనఁ బ
ల్లవసురతం బసహ్యతఁ దలంపక యెప్పటియట్ల సల్పఁగన్. 35

ఉ. “సొంపులునింపు చిత్తరువుఁ జూడఁగవచ్చితి" మంచు వేడ్క మో
హంపువయస్సు డిచ్చటకునై పఱతేఱె" నటంచు, “మీదె? యీ
సంపద లుల్లసిల్లు ఘనసద్మ" మటంచును దానికోసమై
గుంపులుగూడి వీటి విటకోటులు వత్తురు బోఁటియింటికిన్. 36

క. ఈలాగు జారకోటికి
మేలౌ నభిమతముఁ దీర్చి మెలఁగుచు నుండే
కాలమున నొక్క నాఁ డొక
జాలుండను విటునిఁ బిల్చి సంధ్యావేళన్. 37

తే. పురము వెల్వడి కాళికాపుణ్యభవన
సీమ సంకేత; మట కీవు చేరు మనుచుఁ
జెప్పి వాచాలి పతిలేని చొప్పుఁ జూచి
పుత్రు నిద్దురఁబుచ్చి తాఁ బోయె నటకు. 38



తే. పోయి యా కాళికోవెల పొంత నిలిచి
కటికి మబ్బున నలుదెస ల్గలయఁ జూచి
జాలుఁ డాచాయ లేకున్న సంశయించి
మనసుఁ దెలియఁగ డాఁగెనో యని తలంచి. 39

ఉ. చీమ చిటుక్కుమన్న వినుఁ జిమ్మట బుఱ్ఱన నేఁగు నంతలో
నే ముదమంది చూచు సరణిన్ బశుపక్షిమృగాదిజంతువుల్
వేమఱుఁబోవు చప్పుడులు విస్మయ మందఁగ నాలకించు "నా
హా! మఱి రాక తక్కెనె" యటంచుఁ దలంచు వియోగవేదనన్. 40

క. "ఏరా తాళఁగ లేరా!
రారా! నన్నేచ నేల? రారా! రాపుల్
మేరా? మోహనరూపశ
రీరా! యటుడాఁగి పల్కరింప వదేరా?" 41

మ. అని వాచాలి ప్రియంపుఁ బల్లవుని డాయం బిల్వఁగా మ్రోయు వా
గ్ధ్వను లాలించి నిజాంగనాగళరవవ్రాతం బిదౌ నిశ్చయం
బనుచుం దద్విభుఁ డప్పుడొక్కపనికై యాదారిగాఁ బోవుచున్
గని “యిట్లేటికిఁ జీరెదీ" వనుచుఁ బల్కన్ గాంత తానంతటన్. 42

క. ఎటువలె బొంకఁగ వలెనో
కుటిలాలక! నీవు తెలిసికొమ్మని యనఁగా
నిటునటుఁ జూ చది తెలియదు
పటుసూక్తిని నీవె తెలుపు పత్రిప! యనినన్. 43

క. ఆ మానసౌక మప్పుడు
హేమావతి కనియెఁ దను నిజేశుం డడుగన్



భామిని ధైర్యము వదలక
తా మగనికి ననియె వేడ్క దళుకొత్తంగన్. 44

ఉ. “అయ్యలు సందేవేళఁ జని యాడఁగ, నింటికి రాక తక్కితే
నియ్యెడ నీదు వెంటఁ జరియించుచు వచ్చెనొ యంచు భీతిచే
నుయ్యెల లూఁగు ప్రాణముల నోర్వక చీరెద వీటఁ జూచితే
నెయ్యెడ లేఁడు చెల్లనిఁక నేమి యొనర్తు మనోహరాధిపా!" 45

క. అని వాపోవుచు సతి ప
ల్కిన విని యా చిత్రఘనుఁడు కినుకెడలి దిగుల్
గొని మనసు వకావకలై
చనఁ, "జెడితి నెటేఁగె?" నంచు సతితో ననుచున్. 46

తే. నగరమున కేఁగి యిద్దఱు నాల్గు వీథు
లరయుచుండంగ వాచాలి యంతలోన
భవనమున కేఁగి చనుదెంచి భర్తతోడ
వేడ్క లిగురొత్తఁ జెప్పెను వింతగాఁగ. 47

క. "నేనింటి కేఁగి చూడఁగఁ
దా నిద్రాసక్తిఁ బూని తనయుం డున్నా
డో నవమదనా! ర”మ్మని
మానిని తోడ్తెచ్చె మగని మందిరమునకున్. 48

తే. అట్లు తోడ్తెచ్చి నిద్రించు ననుఁగు సుతుని
లేపి ముద్దాడుకొనుచుఁ దొల్లింటి యట్ల
చిత్రఘనుఁడును వాచాలి చిత్త మలర
నిండుమోదంబున సుఖాన నుండి రపుడు. 49

క. ఆ రీతి నేర్పుగల్గిన
భూరమణునిఁ జేరు మనుచుఁ బులుగులదొర తన్
జీరఁగ హేమావతి విని
యౌరా! చెలియాగడం బటంచు గణించెన్. 50

క. ఈరీతిఁ గథకుఁ జొక్కి ప
యోరుహముఖి మెచ్చునప్పు డుత్ఫుల్ల త్పం
కేరుహ గంధానిల మరు
దేరఁగఁ దెలవాఱవచ్చె దృఢమని యంతన్. 51

సీ. పట్టెమంచము మెత్తపయిఁ దలగడ బిళ్ల
లగురుధూపము దివ్వె లడపము చిటి
చాప జాబిల్లికైసాన పువ్వుల చెండ్లు
తబుకు దంతపు గద్దె తావికుడుక
గొడుగు పావలు గందవాడి పెట్టె గందపు
గిన్నె సున్నపుఁగాయ గిండి సురటి
తంబుర నిల్వుటద్దము తమ్మిపడిగయు
వీణ కస్తురి రుద్రవీణ పునుఁగు
తే. కరవటం బాకు సంబెళ కప్పురంపుఁ
గ్రోవి బాగాలు బకదారి గూండ్లు దనరు
లోవ తీనెలు చిత్తర్వు ఠీవిఁ దనరు
కేళినిలయంబుఁ జేరె నక్కీరవాణి. 52

క. చేరి దినాంతంబైన వ
నేరుహశర కుసుమచాపనిర్ముక్తశరా
సార మొకయింత సైపక
భూరమణీరమణుఁ జేరఁబోయెడు బుద్ధిన్. 53

సీ. జలదావళి రహించు చంచలా లత లన
వేణిఁ గైతక దళ శ్రేణి మెఱయ
దిన విభాంకురము మైత్రినిఁ దమ్మిఁజేరె నాఁ
గాశ్మీర రేఖ వక్త్రమునఁ దనర
జయశంఖమునకు ముత్తియపు జల్లులు వేసె
మరుఁడు నా గళమున సరులు దూఁగఁ
బువ్వుగుత్తులఁ గప్పు పుప్పొడి యన గంద
వడి - పూఁత గుబ్బలఁ బరిమళింప
తే. రమ్య మేఖల ఘళఘళల్ రత్నహేమ
కలిత నూపుర ఝళఝళల్ చలువ వలువ
ఫెళఫెళల్ గిల్కు మట్టెల గిలగిలల్ ర
హించ రాయంచకడ నిల్చెఁ జంచలాక్షి. 54

తే. నిలిచి హేమావతీ నామ జలరుహాక్షి
హంసకుల పట్టభద్ర! నేడైన మాన
వేంద్రు కడకేఁగు మని సెల విమ్మటన్న
శిరముఁ గదలించి రాయంచ చెలియ కనియె. 55

శా. అక్కా! రత్నపుఁ బొళ్లసొమ్ము లివి లెస్సాయెన్ దుకూలం బహో!
చొక్కంబై తగె బుక్కపూఁత సుమముల్ సొంపారె, సేబాసు! నా
దిక్కుం జూడు, శిరోవిధూననము సంధిల్లన్ వచోమాధురిన్
జొక్కం జెప్పెద నొక్కగాథ విని నన్నున్ మెచ్చి పొమ్మంతటన్. 56

క. అనుచున్న హంస పలుకులు
వినుచున్ నళినాక్షి పలుకు వినియెద నని తన్
గనుచున్నఁ దేనెధారలు
పెనుచుచు నవభణితి నపుడు బిసభోక్త యనెన్. 57

పదియవ రాత్రి కథ

భూతవైద్యుని యిల్లా లొక రేయి నలుగురినిఁ గూడుట

క. వినుము సుధానిధి యనుపే
రునఁ గృష్ణాతీరమందు రుచిరోన్నత కాం
చన గోపురాధరీకృత
ఘన గోపుర మైన పురము గలదొకటి సతీ! 58

సీ. సౌధఖేలద్వధూ జనదత్త ఖనదీ బి
సాహార తుందిల హంసచయము
హిత వయస్యా సమర్పిత కల్పతరుసుమ
స్రగ్వృత సౌధ యోషాకచంబు
సాల శృంగగ శారికాళీ పునః పునః
పఠిత నిర్జరసతీ భాషణంబు
జనకార్పితోగ్రాప్త వనభూజ ఫలవృద్ధ
భర్మ గోపుర శుకీ పైక గణము
తే. మందిర విటంక కలరవా మంద కలక
లారవ ప్రతిరావ కార్యమరనాథ
కేళికాగార మణికుడ్య వాళికంబు
తనరు వస్తు సమృద్దంబు తత్పురంబు. 59

వ. వెండియు నప్పురంబు విబుధరాజమనోరంజకంబై సుధర్మాస్థాన వైఖరిని, బురుషోత్తమాధిష్టానంబై వైకుంఠంబు పోలికిని, రాజశేఖర కుమారాధీనంబై యమర సైన్యంబు ఠేవను, బుణ్య జన సమృద్ధంబై యలకాపురంబు దాడ్పున నొప్పుచుండు. 60

క. కరి తురగ రథ భటోర్వీ
సుర భూవర వైశ్య శూద్ర శుభసౌధాళ్యా



వరణ జలఖేయ తరుణీ
పురుషోపవనాది గరిమఁ బురమది వెలయున్. 61

ఉ. భూతియుఁ గావిబొట్టు మెయిఁబూసిన మూల్కెలుఁ జొక్కు కల్కెముల్
చేతఁగడెంబుఁ దాయెతులఁ జేర్చిన మందులు మంత్ర తంత్ర కో
పేతపు నాగబెత్త మరఁబెట్టెలు నొప్పఁగ రౌద్రకర్ముఁడన్
భూతచికిత్సకుం డొకఁడు పొల్పుగ నచ్చటనుండు మానినీ. 62

సీ. పైగాలి సోకినఁ బాఱుఁ బిశాచక
తండంబు లెల్లను దల్లడిల్లి
పొలఁకువఁ గనుఁగొన్నఁ బోవు దయ్యంబుల
విసరముల్ భీతిచే విస్తరిల్లి
పేరు విన్నప్పుడే దూరమై చను భూత
చయములు దిగులున సరభసిల్లి
తొడరి నిల్చిన యంతఁ దొలఁగు దుష్టగ్రహ
ప్రచయముల్ భయమునఁ బరిఢవిల్లి
తే. యుఱుకు నా రౌద్రకర్ముని కరము సోఁకఁ
బ్రేత బేతాళ మోహినీ పిశిత భోక్తృ
కామినీ శాకినీ ఢాకినీ మదాంధ
భయకర బ్రహ్మరాక్షసుల్ పల్లటిల్లి. 63

క. క్రూరగ్రహ చోరగ్రహ
చారగ్రహ కూర్మశాక చండిగ్రహ కా
[1]టేరి గ్రహాంతర గ్రహ
వారి గ్రహములును బోవు వానిఁ దలంపన్. 64

క. వెలగల రావుల మఱ్ఱుల
వెలుగులఁ బాడిండ్ల శూన్య విపినస్థలులన్



గలుఁగుల నిలువక తొలఁగును
మలయక భూతములు వాని మంత్రోద్ధతికిన్. 65

క. ఈలాగు మంత్రమారుత
తూలతృణీకృతసమస్తదుష్టగ్రహుఁడై
యాలోకోలోకాంచిత
భూలోకఖ్యాతి నతఁడు పొలుపొందు సఖీ! 66

తే. వాని ప్రియురాలు విరివాలుఁ బూనఁజాలు
ఱేఁడు తమినేలు జవరాలు రేఖఁ బోలు
మేలు గల జాళువాడాలు గ్రాలు ముద్ద
రాలు ఘనురాలు పేర నవ్వాలుఁగంటి. 67

క. కుందనపు బొమ్మ తేనియ
చిందెడు క్రొవ్విరులకొమ్మ శృంగారము చె
ల్వందెడు గుమ్మ శుభాకృతిఁ
గందర్పునకమ్మ దానికథ విని పొమ్మా! 68

ఆ. వాలుమీలఁ బోలు వామాక్షి చూపులు
సోము సాము గోము భామ మోము
మించు మించు సంచు నెంచు మై దులకించు
మిన్ను చెన్ను దన్ను సన్ననడుము. 69

మ. బళిరా! ముద్దుమొగంబు తేటలవురా! పాలిండ్ల సొంపద్దిరా!
బెళుకుంగన్నుల సోయగంబు కటి బల్ బింకంబు సేబాసురా!
కులుకుంజెక్కుల నిక్కు మిక్కుటపుఁ డెక్కుల్ బల్ చొక్కాటంబురా!
తలరా! దీనికి సాటిలేదని విటుల్ తన్ మెచ్చ బోఁటొప్పగున్. 70

చ. ఘనకనకంపు సొంపుగల కాయము, కాయజుతూఁపు రూపులన్
జెనకిన చూపు కజ్జలవిశేషము, తోషముఁ గుల్కు పల్కులున్,



దనరు నవీన సూనముల నవ్వెడు నవ్వులు, తేనెసోన జా
ల్కొను పెనుతావి మోవి, యల కోమలి కే తగు, నొప్పుఁ జెప్పఁగన్. 71

క. నెలరా మొగమును నును వె
న్నెల రాజీవాక్షినవ్వు నీలపురా వ
న్నెలు రాజిలు బలుకీల్జడ
నెలరాల జయించు మిగుల నెలఁత నఖంబుల్. 72

క. నెఱికురులగుఁ గంధరములు
ధరముల కన్నన్ గుచములు తగ సుందరముల్
దరముల సిరి బిత్తరముల్
తరమె? లతాతన్విగళము ధర వర్ణింపన్. 73

క. ఇటులఁ దుల లేని రేఖా
పటిమయు జవ్వనముఁ దనరఁ బతిపైని రుచుల్
పొటమరిల కన్యపురుషుల
ఘటియింపం దొడఁగె రతికిఁ గామిని వేడ్కన్. 74

సీ. ఏనాఁటి కేపాప మెఱుఁగని కన్నుల
కిడియెఁ గాటుకరేక లేపు గులుకఁ
బుట్టి పుణ్యమెఱుంగనట్టి నెమ్మేనికి
బసపునల్గు ఘటించె మిసిమి బెళుకఁ
గలనైనఁ బంకించి కలయ దువ్వని వెండ్రు
కలు దువ్వి కొప్పిడెఁ జెలువ మొలుక
నెన్నఁడు సొగసేని యెఱుఁగని గుబ్బల
కలరించెఁ గంచుళి వలపు చిలుకఁ
తే. బూర్వ మెక్కాల మందైన ముడువఁగనని
విరిసరులు జుట్టెఁ గ్రొమ్ముడి సిరులు దొలుక

నుదుటు విటకోటి నెన్నేటి మదమునాటి
యారజము మించి యా చంచలాక్షి యపుడు. 75

ఉ. పాటలు మోముఁ ద్రిప్పుటలుఁ బైఁ దిమిరించుట లోరచూపులున్
మాటలు ముద్దు జంకెనలు మవ్వపు నవ్వులు గోటి చిమ్ములున్
నీటు దొలంకు చిన్నెలును నెవ్వగ సన్నలు, లేని యూరుపుల్
మేటిగ సల్పు వింతవగ మిండలఁగాంచి వధూటి మాటికిన్. 76

సీ. పూటపూఁట మెఱుంగు నీటుగాఁ బెట్టును
గమ్మలు క్రొమ్మించు కాంతులీన
మాటి మాటికి నూనె పాటిగాఁ బదనిచ్చి
తలదువ్వి కొప్పిడు వలపు గులుక
గడెగడెకును బెట్టె నిడియున్న గడితంపుఁ
జలువలు గట్టును జెలువు దనర
దినదినంబును వింత దేఱఁ జొక్కటపు సొ
మ్ములు దాల్చు నెమ్మేనఁ దళుకు లొలుక
తే. గళమునను బూయు గందంబు గందవడియుఁ
క్రొమ్ముడిని జెక్కు సవరంబుఁ గ్రొవ్విరులును
సొగసు దనరార విటకోటి సొక్కి తిరుగఁ
జిత్తజాయత్తచిత్త యై చిగురుఁబోఁడి. 77

తే. మదనపీడితయై యన్యమానవాభి
లాష మెదఁబూని యిటుల నలంకరించి
తిరుగుచుండెడు పిననాఁడె వెరవు పఱచు
కొనియెఁ దమిదీఱ నమ్ముద్దుగుమ్మ విటుల. 78

క. కరణమును నూరి రెడ్డి
గరిమందగు పారుపత్తెగానిఁ దలారిన్



దఱియైనవేళ నీ నలు
గురితోఁ బొలివోని రతులఁ గూడి సుఖించున్. 79

సీ. పురి బాహ్యసంకేతపరిసరంబున కేఁగి
యామికాభిప్రాయ మలరఁ తీర్చుఁ
దఱియైన యెడఁ జేని దగ్గరకే పోయి
ప్రియము గొల్పఁగ రెడ్డిప్రేమఁ దీర్చు
సంచారికాలయస్థలికిఁ బిల్పించుక
నధికారికోరిక లమరఁ దీర్చు
నెనయ వీలై యున్నఁ దన యింటికే పిల్చి
గరిమతోఁ గరణంబుకాంక్షఁ దీర్చుఁ
తే. బగలు రాతురులను నెడఁ బాయకుండు
మోహపరితాపవేదనల్ ముదిరి చెదరి
చెదరఁ జేయగ వేఱొక చింత లేక
చండమదమత్తభద్రవేదండగమన. 80

తే. సొగసి సొగయించు నెఱయోర చూపు చూచి
పలికి పలికించుఁ జిన్నెలు బయల నెఱపి
బ్రమసి బ్రమయించుఁ దనకు లోఁబడఁగఁ జేసి
వలచి వలపించు నది యెంతవాని నైన. 81

క. ఈ స్థితిని గొంతకాలం
బాస్థన్ విటకోటిఁ గూడి యలరుచు మోహా
వస్థల జరుపఁగఁ బతికొక
ప్రస్థానము సంభవించెఁ బ్రమదం బెసఁగన్. 82

చ. పరపుర భూమిభర్త కులభామిని కుగ్రములైన భూతముల్
తిరముగఁ బట్టి బాధలిడు తెంపున నుండఁగ నన్నిమిత్త మ
న్నరపతి పిల్వనంపఁగ ఘనంబగు వేడుక రౌద్రకర్ముఁ డా
తటి నెఱ మాంత్రికుండగుటఁ దత్క్షణ మేఁగెఁ జికిత్స సేయగన్. 83

తే. అటుల నిజనాయకుం డేఁగి యన్యరాజ
పురవరముఁ జేరె, నంతటఁ బొలఁతి యలరి
తొడుసు వాసెఁ గదా యంచు దుడుకు చేసి
విటుల నలరించె నిచ్ఛానువృత్తి మీఱ. 84

క. ఆజ్ఞ యొకింతయు లేమి మ
నోజ్ఞ వయోవిటపులకు మనోభవసమర
ప్రజ్ఞలఁ జూపుచు రతిపై
సుజ్ఞానము వొడమి పడఁతి సొంపున నుండెన్. 85

క. ఈ తీరు కొన్ని దినములు
చేతోజాతాహవములచేఁ దనివారన్
శీతాంశువదన మెలఁగఁగ
నా తలవరి యొక్కనాఁటి యామిని వేడ్కన్. 86

ఉ. పువ్వులతోడి కోరసిగ పొందగు చందురుకావి జాళువా
మవ్వపుటంచు పద్మపు రుమాలు సుగంధపుఁ బూత నేతచే
రవ్వగు చల్వ దుప్పటి కరంబున నాకులుఁ జంక వట్రమున్
నివ్వటిలంగ దానికడ నిద్దురఁ జెంద బిరాన వచ్చినన్. 87

క. చూచి ముదమంది దిగ్గున
లేచినదై యెదురుగా నిలిచి యాతని కే
లాఁచికొని పట్టి మెల్లనె
యా చెలి తన కేళిగృహము నతనిం జేర్చెన్. 88

ఉ. చేర్చి సూళముల్ గలుగు చిల్కల కోళ్లఁ దనర్చి పట్టెచేఁ
దీర్చిన తూఁగుపాన్పునఁ గదించిన కమ్మని పువ్వు సెజ్జకుం
దార్చి వినోదముల్ సలిపి దర్పకదర్పరణప్రవీణయై
పేర్చుచు నుండఁగా రతికిఁ బేర్కొని రెడ్డి ప్రియంబు సంధిలన్. 89



సీ. కమ్మి పచ్చడమును గంటీల పోఁగులు
మొలఁ జిట్టి కమ్ముల ముదుగు వల్లె
నిండు చల్వ రుమాలు రెండొంకుటుంగరం
బులుఁ జుక్కబొట్టు సొంపొలయ, మెడను
గందంపు నునుఁబూఁత కర్ణయుగంబున
నేర్పుగాఁ జెక్కు గన్నేరు పూలు
కత్తెర గండంబు గజ్జెలు నందెలు
నాదించు జిగి సకలాది తిత్తి
తే. పాదములఁ గిఱ్ఱు కిఱ్ఱని పలుకు మెట్లుఁ
గుచ్చు టద్దాలుఁ జేపట్టుకోల యమర
రెడ్డి ప్రియురాలి వాకిటఁ బ్రేమ నిలిచి
వాకిలి సడల్పు మనుచుఁ బిల్వంగ నపుడు. 90

క. తలవరి గడ గడ వడఁకిన్య
గలగకు మని వీఁపుఁ జఱచి ఘనురా లతనిన్
నిలిపె నొకమూల నటుకన్
నెలమిని వాకిలి సడల్చి హిత మలరారన్. 91

తే. రెడ్డి నింట్లోకిఁ బిలిచి నీరేరుహాక్షి
వాకిలి గదించి యపుడు దా వానికేలు
పట్టుకొని వచ్చి శయ్యపైఁ బవ్వళించి
ననవిలుతుకేళి నిద్దఱు పెనఁగుచుండ. 92

చ. తెలి తలపాగ చొక్క మొలతిత్తి బుజంబునఁ జల్వపచ్చడం
బరి చిటివ్రేల ముద్రిక యొయారము మీఱఁ బొగాకుచుట్ట సొం
పలరెడు కావిదోవతి పదాబ్ధయుగంబున ముచ్చె లొప్పఁగా
సలనిభుఁ డంత గ్రామకరణంబటకై చనుదెంచి వేడుకన్. 93



క. "పెను తలుపు గడియఁ దీ" యని
మనురాలి నతండు పిలఁ గాఁపుకొడుకు తా
విని దిగులొందిన వెఱవకు
మని రెండవమూల నటుక నాతని నుంచెన్. 94

తే. ఉంచి కదలకు మిచ్చోట నురగ మొకటి
కల దటంచును జెప్పి యాకాంత వేగఁ
గరణమును డాయఁగాఁ బోయి గడియఁ దీసి
లోపలికిఁ బిల్చి మరలఁ దల్పును గదించి. 95

మ. దయకద్దా? యని పల్కరించి తమిఁ జెందం జేసి లేనవ్వులన్
బ్రియమొందించి కదించి ముద్దులిడుచుం బృథ్వీధరోరుస్తన
ద్వయి బల్ ఱొమ్మునఁ గ్రుమ్మి కుమ్మి యనుమోదంబొప్పఁ గావించి యా
వియదాకారసుమధ్య సంగమసుఖోద్వేలస్పృహాధీనయై. 96

క. తనివారక యరికట్టక
యనివారక మోహ దోహలామోదము హె
చ్చను వారట్లన్యోన్యము
చనువారఁ గళాదు లరసి సమరతిఁ బెనఁగన్. 97

వ. ఆ సమయంబున. 98

క. నిలువంగి యోర మెలికల
తలపాగ ఖలీతిశాలు తావి మెయిం బూఁ
తలు పోఁగు లంఘ్రిరక్షలు
వెలయఁగ వేపారి మీఱి వెలఁదుక కడకున్. 99

మ. వగకాఁడై చనుదెంచి ఠీవిని బహిర్ద్వారంబునన్ నిల్చి త
ల్పు గడెం దీయు మటంచు నా ప్రవిమలాంభోజేక్షణన్ బిల్వఁగా
దిగులున్ బొంది నియోగి యెట్టు లనుచున్ దేహంబు కంపింప, నా
చిగురుంబోఁడి యమాత్యు వీఁపడఁచి తాఁ జెన్నొంద శీఘ్రంబునఁన్. 100



క. మూఁడవ మూలను నట్టుక
పై డించి నియోగి నయ్యబల యధికారిం
గూడఁ జని తలుపు సడలిచి
వేడుకఁ గ్రీడాలయంబు వేగమె చేర్చెన్. 101

తే. చేర్చి వాకిలిఁ గదియించి చెలిమి మించి
కాంక్ష లూరించి చిన్నెల కలిమిఁ గాంచి
మొలకనవ్వులఁ దేలించి మోహ ముంచి
కళలఁ గరఁగించి సంధించి కౌఁగిలించి. 102

చ. మునుకొని మూఁడు మూలలను మువ్వురు గ్రుక్కలు మ్రింగఁ జెంగలిం
చిన తమిచేత హెచ్చి మరుజెట్ల తెఱంగున డొంకి డొంకి పొ
ర్లిన గతిఁ బొర్లుకాడి చనులీలల నిద్దఱు నేకకాంక్షతో
ననవిలుకాని పోరునఁ బెనంగెడు వేళ నిజేశ్వరుం డొగిన్. 103

తే. పరధరాధిపు భార్యకుఁ బట్టినట్టి
భూతముల వెళ్ళఁగొట్ట భూభుజుఁడు మెచ్చి
ధనపరిష్కారవస్త్రముల్ తన కొసంగి
యంపకము సేయఁ దన యింటి కరుగుదెంచి. 104

క. తలుపు సడలింపు మనుచున్
గులభామను మాంత్రికుండు కూపెట్టినచోఁ
దలఁకెడి వ్యాపారి మన
శ్చలనము పో వీఁపుఁ జఱచి సంభ్రమ మొదవన్. 105

ఉ. నాలవ మూలయందు నుపనాథుని నుంచి కృశాంగవల్లియై
యీలువు భక్తి యుక్తిఁ దమి హెచ్చు భయంబునఁ దల్పుఁ దీసి యా
నీలశిరోజ నేత్రముల నీళ్ళనె కాళులు గడ్గి కౌఁగిఁటం
దేలిచి యింటిలోపలికిఁ దిన్నఁగఁ దోడ్కొని వచ్చె మెచ్చుగన్. 106



తే. పరధరాధిపు భార్యకుఁ బట్టినట్టి
భూతముల వెళ్ళఁగొట్టిన భూభుజుండు
దనియఁగా నీ కొసంగిన ద్రవ్య మేది?
కనుఁగొనఁగఁ జూపు మన రౌద్రకర్ముఁ డపుడు. 107

చ. “తెమలని చిమ్మచీఁకటిని దీపము లేనిది జూపు టెట్లు? దీ
పముఁ గొనితెమ్ము చూపెదను భద్రముగా నివి నీవె దాఁచి పె
ట్టుము మును దాఁచు మూలనె కఠోరకుచా!" యని పల్కరింపఁగా
నమితభయార్తచిత్తులయి యయ్యధికారిముఖుల్ చలింపుచున్. 108

క. మును దాఁచు మూల దాఁచు మ
టని భార్యను బొడిచియాడె, నది దీపము చూ
పినఁ జూచి వీఁడు మమ్మే
మనునో యను శంకచేత నలమట పడుచున్. 109

చ. నలువురు గుప్పుగుప్పునను నాలుగు మూలల నుండి దూకి వి
చ్చలవిడిఁ బాఱసాఁగినను సాహస మొప్పఁగఁ దద్విభుండు గొం
దలపడి చూచి, "వీ రెవరు దాఁపక చెప్పుము, చెప్పుకున్న న
గ్గలముగ నిన్ వధింతు" నని కత్తిని దా నొఱదూసి పల్కినన్. 110

క. ఆ వేళ నెట్లు బొంకం
గా వలయునొ కొమ్మ! తేటఁగాఁ జెప్పి ధరి
త్రీపభుని నెనయఁ జనుమనఁ
గా విని యోచించి, వనిత, కళవళపడుచున్. 111

ఉ. వింత కథారహస్యములు వీనుల విందుగ వింటిఁ బార్వతీ
కాంతునకైన శక్యమిది గాదు వచింపను, బ్రహ్మలోకప
ర్యంతముఁ జూడఁ దోఁప దిది, హంసవతంసమ! నీవె చెప్పి భూ
కాంతునిఁ జేర నన్ననుపు గాథలచేతనె ప్రొద్దుపుచ్చకన్. 112

క. అన విని మేల్ నెఱజాణవు
గనఁ జెప్పఁగరాదె? యెంత కథ యిది నే నీ
కును దెలియకున్నఁ జెప్పెద
వినవే; ఘనురాలి బొంకు విశదము గాఁగన్. 113

చ. వినుము నిజేశ! నీవు చని వేఱొక యూరికిఁ బోవ నాఁటి రా
త్రిని నొకతెం బరుండఁగను దృష్టికిఁ గన్పడెఁ గొన్ని భూతముల్
కనుపడి మమ్ము నీ మగఁడు కాలిడనీయఁడు మాస్థలంబులన్
దునియెద మేము ని న్ననుచుఁ దూటిన నందొక భూత మయ్యెడన్. 114

తే. నాతి! యీ వేళకును గాచినాము నిన్ను
నీదు మగఁ డింటి కరుదెంచి నిలిచినపుడు
మా తెరువు దాను రాకుండ మనవి చెప్పు
చెప్పకుండిన నీచావు సిద్ద మనుచు. 115

క. బెదరించి నాఁటి రాత్రికిఁ
గడలెన్ భూతమ్ము లంతఁ గనుగూర్కెడు వే
ళ దినము దినమగపడి నా
యెదుటం బొడకట్టి నాపయింబడి త్రొక్కున్. 116

క. పది యైదు నాల్గు భూతము
లదయత ననుఁజూచి “నీ నిజాధిపుఁడు మమున్
మెదలంగ నీయఁ డియ్యెడ
విదళింతుము నిన్నుఁబట్టి వెలఁదీ!" యనుచున్. 117

క. ఇంతకు మును చనుకను న
న్నెంతయు బాధించె నింటి కీవిప్పుడు రాఁ
బంతము చెడి నీభయమునఁ
గాంతుఁడ! యవి పాఱిపోయెఁ గడువడిఁ గంటే! 118



త. ఈ రీతి నీ భయంబునఁ
బాఱెడి భూతములఁజూచి “భామా ! వారె
వ్వా” రని సంశయమున ననుఁ
గారింపఁ దలంచి తహహ! కరుణయు లేకన్ ! 119

క. నీవింట లేని తఱి భూ
తావళిచే నొచ్చుకంటె నదయుఁడ! నీచేఁ
జావగుట లెస్స తన కటు
గావున నిదె నఱుకు మనుచుఁ గంఠము వంచెన్! 120

ఉ. వంచిస భామినీమణి నవార్యకృపంగని తద్విభుండు హ
సంతాంచితమండలాగ్రము రయంబున నవ్వలఁ బాఱవైచి, రా
ణించిన వేడ్కఁ గౌఁగిటను నిల్పి నెఱుల్ కొనగోళ్ల దీటి లో
నుంచకు భీతి యంచు వినయోన్నతి నూఱటఁబుచ్చి యంతటన్. 121

తే. భూతరాపును జుట్టి విభూతిఁ బెట్టి
యంత్రములు గట్టి వెఱవకు మనుచుఁ దట్టి
పోయె లెమ్మన్న స్నానాన్నభుక్తిరతుల
మగనిఁ గరఁగించి ఘనురాలు మమతనుండె! 122

క. అని యంచ పలుకు నత్తఱి
నినుఁ డుదయాద్రిని పసింప నింటికిఁ జని యా
దినమెల్లఁ గడపి యామిని
చనుదెంచిన నృపతి నెనయు సంతోషమునన్! 123

ఉ. కొప్పున జాజిపూలు మణికుండలముల్ చెవులందుఁ గంధరన్
గొప్ప సుపాణిపేరుఁ జనుగుబ్బలఁ గుంకుమపూఁత పుక్కిటన్
గప్పురపున్ విడెంబుఁ గనకంపుఁ గడెంబులు చేతులన్ గటిన్
జొప్పడు చల్వదువ్వలువ సొంపు ఘటింప లతాంగి వచ్చినన్! 124

క. కనుఁగొని హంసము తరుణీ!
విను మొండొక పిన్నకథ వివేకముతో నే
వినియెద నని నీవడిగిన
వినిపించెద ననిన విరహ విహ్వలబుద్దిన్. 125

క. దినములు నీ గాథలచేఁ
జనెఁగావి నృపాలుఁ జేర సాగకపోయెన్
జనియెద నేఁడై నను నా
మనవిని విని వేగఁ దెల్పుమా! పతగమణీ! 126

పదునొకండవ రాత్రి కథ

కడఁద్రోయఁబడిన బడబ తిరిపగానిఁ గూడుట

క. అని పలికిన హేమావతిఁ
గని పల్కెఁ బతంగవిభుఁడు కనకంబను పే
మనఁదగు పురి నొక విప్రుం
డనవద్యుఁడు చండరశ్మి యనఁ దనరారున్. 127

పండిత పరిశ్రమ

వ. అతఁ డక్షర లక్షణ ఋగ్యజుస్సామాధర్వణంబులు వేదాంత వైశేషిక భాట్ట ప్రాభాకర పూర్వోత్తర మీమాంసా శాస్త్రంబులును, బ్రహ్మాండ విష్ణు నారద మార్కండేయ వామనాగ్నేయ గారుడ భవిష్య ద్భాగవత స్కాంద మాత్స్య లైంగ కూర్మ వాయు వరాహ పద్మ బ్రహ్మవైవర్త బ్రహ్మోత్తరఖండంబులను పదునెనిమిది పురాణంబులును, ఆదిసభారణ్యవిరాటోద్యోగ భీష్మద్రోణ కర్ణ శల్యసౌప్తిక స్త్రీ శాంత్యానుశాసనికాశ్వమేధ మౌసల మహాప్రస్థాన స్వర్గారోహణంబులను పదునెనిమిది భారతపర్వంబులును, శిక్షా కల్ప జ్యోతిర్వ్యాకరణ నిరుక్తములును, ఉక్తాత్యుక్త మధ్యా ప్రతిష్ణా సుప్రతిష్ణా గాయత్రీ ఉష్ణిక్ అనుష్టుప్ బృహతీ పంక్తి త్రిష్టుప్ జగతీ అతిజగతీ శక్వరి అతిశక్వరి అష్టి అత్యష్టి ధృతి అతిధృతి కృతి ప్రకృతి ఆకృతి వికృతి సంకృతి అభికృతి ఉత్కృతియను నిరువదాఱు ఛందస్సులును, బైలజ రోమజ వాసిష్ఠ సోమ సూర్యాది సిద్ధాంతంబులును, ఉపమా రూపక దీపావృత్తాక్షేపార్థాంతరన్యాస వ్యతిరేక సమాసోక్త్యతిశయోక్త్యుత్ప్రేక్షా హేతు సూక్ష్మ లేశ క్రమ సర్వ ప్రియోర్జస్వ పర్యాయోక్తి సమాహితోదాత్తాపహ్నవ శ్లేషోక్తి తుల్యయోగితాప్రస్తుతప్రశంసా వ్యాజస్తుతి నిదర్శనా సహోక్తి పరివృత్తి సంకీర్ణ విభావనాద్యలకారంబులును, అమరామరశేష విశ్వశాశ్వత శబ్దార్ణవ యాదవ వైజయంతీ నానార్థ రత్నమాలికా మేదినీ హలాయుధ వాగురి కేశవ తారపాల ధన్వంతరీ ధరణీ ధనంజయ రభస విశ్వప్రకాశ మాధవ చింతామణి జయ ప్రతాప శుభాంకాజయపాల క్షీరస్వామ్యేకాక్షరాది నిఘంటువులును, సంస్కృత పాకృత శౌరసేని మాగధి పైశాచి చూళికోక్త్యపభ్రంశాంధ్రము లనునష్టభాషలును, స్వర నిత్యసమాస ప్లుత కాక్వాదేశ ప్రాది ప్రాదియోగ వృద్ధ్యభేద దేశీయోభయ శకంధ్వ ఖండ విభాగ వికల్ప ప్రభునామ భిన్నవర్గ సంయుక్త వికల్ప సంయుక్తము లను చక్కటి యెక్కటి పోలికలును, సరసానుస్వార ఋజువు లనంబరగు యతుల విధంబులును, సమనామ సంయుక్త సంధిగతోభయ ప్రాది వికల్ప బింద్వర్ధబిందు ఋప్రాస త్రికార సమలఘుప్రాస మైత్ర్యంత్య దుష్కర ద్వంద్వ త్రిప్రాస చతుర్థప్రాసా ద్యష్టాదశ ప్రాసంబులును, మగణ యగణ రగణ సగణ తగణ జగణ భగణ నగణంబులును, జంద్రేంద్ర సూర్యగణంబులును, నుపగణంబులును బ్రయోగించి, తత్తద్దేవతాలక్షణంబు లెఱింగి శయ్యాశైలీ భేదంబు లెఱంగి ద్రాక్షా కదళీ నారికేళ పాకంబుల కవిత్వ రచన లెఱింగి సకల విద్యా పారంగతుండై యుండె నప్పుడు. 128

తే. ఆతఁడు తన సతు లిద్దఱు నహరహంబు
 వాదొనర్చుట సైఁపక వలపుఁ గులుకు



పిన్న పెండ్లాము పక్షమై పెద్దబార్య
భాషిణీనామఁ గడనుంచె దోషమనక. 129

సీ. నెఱిగొప్పు నెఱరంగు నీలంపు సద్రుచుల్
నారద భావంబుఁ జూఱఁ గొనఁగఁ
గలికి కాటుకకంటి చెలువు భారద్వాజ
గరిమంబు నైనఁ జీకాకు పఱుప
మించు సిబ్బెపు గుబ్బ మినుకులు కుంభజ
సద్వృత్త మంతయు జడియఁ జేయ
మందయానపుఁ బ్రౌఢిమము మతంగజధైర్య
పర్యాయ మెంతయుఁ బగులఁ జేయ
తే. నవసుధామయ మధురోక్తి నైపుణములు
శుక మనోవృత్తి నెంతయుఁ జులుకఁ జేయ
మెఱుఁగు జిగినిచ్చు వగజగ్గు నెఱతనంబు
వెలయఁ జరియించు నదియు న వ్వీటిలోన. 130

తే. మగఁడు పెఱవాడ వైచిన మట్టు మీఱి
బిడ్డ పాపలఁ గని యెత్తి పెంచు జోలి
లేదు గావునఁ దిండిచే నూఁది పోఁత
బొమ్మ గతి నుండు నక్కొమ్మ యెమ్మె చిమ్మ. 131

చ. కుడువ సమస్త భాగ్యములు కోరిక మీఱఁగఁ గట్ట వస్త్రముల్
తొడుగ విశేష భూషణములున్ దనరార నలంద గంధమున్
ముడువను మంచి పుష్పములు మొత్తము గల్గిన భోగహీనలై
పడఁతుక లుండ నేర్తు రటె? ప్రాయమునన్ బెఱత్రోవ డాయకన్. 132

తే. పిఱుఁదుఁ బిక్కలుఁ జెక్కులు బెడఁగుఁ దొడలు
వెడఁద యొడలును జన్నులు వెండ్రు కిడను
సందు లేకుండ బలియుట సకియ మనసు
జార సంభోగ కేళికిఁ స్వారి వెడలె. 133



వ. అది మఱియును, 134

క. జారుల మది జాఱఁగ నా
నారీమణి మోవి లేఁత నవ్వెసఁగించున్
హారంబుల వారంబుల
హేరంబులనన్ రదాళి యించుక మెఱయన్. 135

తే. మనసు నిలువక తమి హెచ్చ మాఱుమగల
వెదకుచుండంగ నప్పు డా వీథి వెంట
వింత పరదేశి చతురాఖ్య విప్రుఁ డొకఁడు
వచ్చె భాషిణి కనువిచ్చి మెచ్చి చూడ. 136

ఆ. విప్రుఁ డివ్విధమున వీథి నేతెంచుచు
సొలసి కెలఁకు లరసి చూచికొనుచుఁ
దన్నుఁ జూచుచున్న ధరణీసురాగ్రణి
తరుణిఁ గాంచి దాన్ని దఱియవచ్చె. 137

తే. వచ్చి ధర్మాభివృద్ధి గావలె నటంచుఁ
బరమ భాగీరథివి మహాభాగ్యశాలి
వనుచు దీవించి నాకింత యన్న మనుచు
వేఁడ భాషిణి యా విప్రవిభున కనియె. 139

క. పేరెయ్యది? యూరెయ్యది?
మీ రెయ్యెడ కేఁగఁదలఁచి మెట్టితి రిటకం
బారసి యడిగిన బాడబ
సారసలోచనకు వేడ్కఁ జతురుం డనియెన్. 139

చ. మునుపు ప్రసిద్ది మీఱఁ దమ మూఁడవ తాత తరాన నుండి యుం
డిన యది కాణయాచి దగుఁ డెంకణ ధారుణియందుఁ దండ్రి నన్



గని చదివించు బుద్ది నయగారికి నప్పనసేయ, నక్షరా
స్యునిఁగ నొనర్తు నంచు బడి కొయ్యనఁ దోడ్కొనిపోయి యచ్చటన్. 140

ధూర్త విద్యార్థి చేష్టలు

సీ. నన్నయ్యవార లోనామాలు దిద్దుకో
మ్మనీనచోఁ గడుపు నొప్పనుచు నేడ్చి
దండమ్మునను గుణింతము పెట్ట రమ్మన్న
నంగుళి వ్రణమాయె ననుచు జుణిఁగి
శిష్యులచేఁ గాలుసేతులు గట్టించి -
తెచ్చి పద్యముఁ జెప్పఁ దెమలకుండి
పలకవ్రాయు మటంచు బడి కెత్తుకొని పోవ
బలపంబు లేదని పలుకకుండి
తే. యలుకచే నుండ బుగ్గలు నులిమి తిట్టి
తొడలు వడిపెట్టి కోదండ మడరఁ గట్టి
రెట్ట లెగఁబెట్టఁ బట్టించు ఱేపు మాపుఁ
గొట్టు బెట్టుగ సజ్జనకోల విఱుగ. 141

సీ. గద్దించి వడిఁ బెట్టి దిద్దుమంచును వేలు
వెట్టింప నచట నేఁ బెట్టకుందుఁ
పలుమాఱు "లో" యని పల్కుమంచును గొట్టి
చెప్పిన శిలవృత్తిఁ దప్పకుందు
నొకటికి సెలవియ్య నుఱికి చీఁకటి దాకఁ
బసుల కాఁపరుల వెంబడిన పోదు
జనని యడుగుకొని చదువుకోఁ బొమ్మన్న
వినక వేమఱు వెక్కివెక్కి యేడ్తు
తే. సారె పద్యపుఁ బలకపైఁ జమురు పూఁతు
నెప్పుడును బెద్ద పలక పొక్కెత్తఁ జేతు



బాలరామాయణము పుస్తకాలు దాతు
వేయు సజ్జనకోలలు విఱిచి వైతు. 142

క. చరికుండఁ బగులఁ గొట్టుదుఁ
బరువడి సూత్రంబుఁ ద్రెంచి పాఱఁగ వైతున్
మతిమతి బలపము లిచ్చినఁ
బొరి దినమును బగులఁగొట్టి పోయె నటందున్. 143

తే. నన్ను బింగీలు పెట్టించునాఁడె యయ్య
వారు నిద్రింపఁగాఁ జూచి చేరి యచటఁ
జింత వ్రేల్ కొమ్మ వంచుక సిగను గట్టి
విడిచి యుతికితి నయగారు మిడికి కూయ. 144

తే. అంతఁ దలిదండ్రు లయగార లది మొదలుగ
వేఁడి వెసలట్లు వేసరీ విడువ నేను
గొంటె వగ నాకతాయులఁ గూడుక పలు
గాకి చేష్టల నాటలఁ గ్రందుకొంటి. 145

వ. అంత మఱియును. 146

బాలక్రీడలు

సీసమాలిక :
దూచియు జాబిల్లి బూచి కన్నుల కచ్చి
గుడిగుడి గుంజాలు కుందెనగిరి
చీఁకటి మొటికాయ చింతాకు చుణుచులు
పులి యాటలను జిట్ల పొట్లకాయ
తూరన డుక్కాలు తూనిఁగ తానిగ
ఛిడుగుడు మొకమాట చిల్లకట్టె



దాఁగిలిమూఁతలు తనుబిల్ల యాలాకి
గుప్పిటి గురిగింజ కొండకోఁతి
చిక్కణ బిల్లయుఁ జెల్లెము గొడుగును
బిల్ల బిద్యము లక్కిబిక్కి దండ
గడ్డెనబోడి యొక్కసికొక్కు బరిగాయ
పోటు గీరనగింజ బొంగరములు
పెంచుల బేరి దోపిల్లు గాలిపటంబు
సరిబేసి పుటచెండ్లు చాఁకిమూట
గోట దొర్లుడుకాయ గొబ్బిళ్లు మోపిళ్లు
నీగ పోగిస బంతి దూగిలాట
వెన్నెల కుప్పలు వ్రేలు బొట్టగ సిరి
సింగన్న వత్తియుఁ జిందుపరువు
గచ్చకాయలు కిఱ్ఱుగానుగ త్రిప్పుళ్లు
గుఱ్ఱపెక్కుడు మంటిగూళ్లు సూళ్లు
కాలికంచంబును గట్టె గుఱ్ఱము వినా
యకు తిరితూనె కొట్లాట చెమట
కాయత్తు గొడుగు బొంగరము రామన్నాట
పొడుగుళ్ల నుయ్యాల బోర్ల పక్క
బండ్లికలును జొప్ప బెండ్ల మంచంబులు
గంగెద్దులాటలు గనికె కుండ
లీనె గాజులు పోఁతుటీనె గుఱ్ఱంబులు
నాల్గు కంబాలాట నట్టకోఁతి
దంటు కిన్నెర మంటిగంటి పోట్లాటలు
సింగన్న దాఁటులు జిరుకురాతి
దాబాటలును మంచి తాటాకు చక్ర చ
క్రాల త్రిప్పుడు తోచిగాయ పరుపు
పాడుపా తరమాళ్లు పాతరల్ బంతులు
చిమ్మన గ్రోవులు చిఱ్ఱు బుఱ్ఱు



లాకుపీఁకెలు జండ్రలాటలు చుండ్రాళ్లు
గిలకలు చిటికెలు కీచు బుఱలు
కోలాటములు పిల్లగ్రోవులు గుమ్మడి
క్రోవి కూఁతలు నూఁదుక్రోవు లొడ్డు
విడుపు నెట్టుడు గాయ విండ్లమ్ములాటలు
పులిజూదములు కట్టె పుట్టచెండ్లు
దాయాలు సొగటాలు దాట్రాయి చదరంగ
మును బోటురాళ్లును మూఁత పొడుపు
వామన గుంటలు వడి గుప్పి గంతులు
చెఱకుల పందెముల్ చిమ్ముఱాయి
తుమ్మెద రేఁపుళ్లు కుమ్మర సారెలు
బందారు బసవన్న పత్తికాయ
తిరుగుడు బిల్లల త్రిప్పుళ్లు జరుగుళ్లు
చిటి తాళ మీళలు నెటికె తట్లు
తే. తాటియాకుల చిలుకలు తాళ్లపాము
లకట! యగచాట్ల ప్రాఁతనై యాడుకొనుచుఁ
జదువుపై సంధ్యపై నాస్థ చాల లేక
పొలఁతి! యీరీతి నేఁ బ్రొద్దుపుచ్చుచుండ. 147

క. విను మాట్లాడఁగఁ బెద్దలు
ననుఁగని పనిసేయు మనుచు నాటిన కోపం
బున నేవలాడ వినలే
కను దేశభ్రమణవృత్తి గైకొని మఱియున్. 148

క. సత్రాశన పాత్రుఁడనై
విత్రాసము మాని వింత విషయముల బడిన్
యాత్రావస్థలఁ దిరిగితి
రాత్రి పవళ్ళనక వినుము రాకేందుముఖీ! 149



వ. ఇంత యేమిటి కంటేని. 150

సీ. తల్లికిఁ గలనైన దయలేదు నామీఁదఁ
దండ్రి యెప్పుడు చూచి వేండ్రపడును
బినతండ్రి బెదరించుఁ బెదతండ్రి కారించుఁ
బెదతల్లి యూరక బెట్టుఁ దిట్టుఁ
చినతల్లి మెటికలు ఫెళ్లున విఱుచును
నన్నదమ్ములు చూడ రతులకరుణ
వదినెలు మఱఁదండ్రు వదరుచు శాపింతు
రక్కలుఁ జెల్లెండ్రు లెక్కఁ గొనరు
తే. మేనమామలు బావలు గానివానిఁ
గాఁగఁ జూతురు మా వాడకట్టువారు
కంటగింతురు నన్నంటె, కమలజాతు
వ్రాఁత ఫలమేమియో కాని, వనజగంధి! 151

తే. ఇంక నెన్నైనఁ గలవు నా హీనదశలు
నాపదలుఁ జెప్ప నేఁటిమీఁదాఱు నెలలు
పట్టు నది యేటి జోలి! నా పాపఫలము
నేఁటితోఁ దీఱె నోకొమ్మ! నిన్నుఁ జూడ. 152

క. అని చతురాస్యుఁడు వేగమె
తన వృత్తాంతంబుఁ జెప్పి తరలాక్షి! క్షుథా
ర్తిని డస్సితి భోజన మిడు
మని భాషిణి నడుగఁగానె యది యిట్లనియెన్. 153

క. ఈవేళ మాత్ర మన్నముఁ
గావించెదఁ గాని, మాపు కదలక దినమున్
నీవు పరుండెదవా? సుఖ
జీవితముగ నిచట నొకటి సెప్పెద నీకున్. 154

అనినఁ జతురాస్యుఁ డామాట కాశఁబొంది
"నీవు చెప్పిన మర్యాద నిజము నేను
జేయఁగల వాఁడ"నని బాసఁజేసి యపుడు
భోజన మొనర్చి వెలువడిపోయి యతఁడు. 155

సీ. అప్పుడె యేమని యడుగ నైతి నటంచుఁ
బలుమాఱుఁ దలఁచి యూర్పుల నిగుడ్చు
నీసారి చని వేఁడ నేమనునో యని
సంకోచమునఁ గొంకి చక్కఁబోవు
నస్తమానము గాదటంచుఁ బాదచ్ఛాయ
లొనరించు వ్రేళ్ళెంచికొనుచు నుండు
నీ యూర గడియార మేడ లేదాయని
వీథి వెంబడిఁ బోయి వెదకి చూచు
తే. లీలఁ బవళించు దిగ్గన లేచిపోవు
నిలుచుచోటను నిలువక నిప్పుద్రొక్కు
కోఁతి చందానఁ జతురాఖ్యకుండుఁ దిరుగు
వెలది పై మోహ మెదహత్తి వెఱ్ఱి యెత్తి. 156

క. ఇటులఁ దమి హెచ్చి మారుఁడు
సటలం బెట్టంగ నొచ్చి సడి నటు నిటుఁ జెం
దుటకు వెఱసొచ్చి రతిసం
ఘటనార్థము మిగుల వేఁగు కాలమునందున్. 157

ఉ. భానుఁడు క్రుంకఁగాఁ గని యపార ముదంబునఁ బొంగి, భాషిణీ
మానినియిల్లు చేరి వగమాటల తేటలఁ బొద్దువుచ్చి, యా
యా నిపుణోక్తులం జెనక నాబిడ "చూచిటు రమ్మటన్నచోఁ
బూనిక నిల్లు చేకొనెడు బుద్దిటు వచ్చితి వేమి చెప్పరా! 158

తే. మంచి తగిన గృహస్థుఁడ వెంచఁ, బరక
కెత్తు కొమ్మనఁ బాతిక కెత్తుకొంటి"
వనినఁ జతురుఁడు వణఁకంగ నప్పళించి
“జడియకు" మటంచుఁ గౌఁగిఁటఁ జక్కఁ జేర్చి. 159

క. తరి తీపు వగలు చిన్నెలు
మురిపెములు వినోదకథలు మోహపు భాషల్
పరిపరి వింతల వలపులు
నెరయంగాఁ జూపి సురత నీరధి ముంచెన్. 160

వ. ఇట్లు చెలంగి. 161

చ. "కురు సురతక్రియాం, ప్రణయ కోపమతిం త్యజ, పూర్వ సంగమం
పరిచిను, దేహి గాఢ భుజ బంధన, మంగజ శాస్త్ర వాసనామ్
స్మర, రదఖండనం ఘటయ, మా మవ మారశరా న్నఖక్షతం
విరచయ" యంచుఁ బల్మఱును వేడ్క వచింతురు జారదంపతుల్ . 162

వ. ఇట్లన్యోన్య సరస సల్లాపంబుల నెడతెగని మోహాతిరేకంబున సంఫుల్ల హల్లకభల్ల మల్లయుద్ధ మహోద్ధత సన్నద్ధ బుద్ధిని సరికట్లం బెనంగి పుల్లసిల్లి, కరంబులు కరంటుల, నురంబు నురంబున, ముఖంబు ముఖంబున, నూరువు లూరువులం గీలుకొల్పుకొని నిద్రించు సమయంబున. 163

చ. వనితయు నిద్రలేచి తెలవాఱెను లెమ్మని జారు లేపి, “నీ
వనుదిన మిట్లు రాత్రి సమయంబున వచ్చి, యనంగ సంగరం
బున నను డాయు" మంచు, నెఱ మోహముతో వినుతింప, మంచి దం
చును వచియించి వేడ్క పడుచున్ జతురాహ్వయుఁడేఁగె నెంతయున్. 164

తే. ఏఁగి సంధ్యాద్యనుష్ఠాన మెలమిఁ దీర్చి
పురములో రచ్చ ఠావులఁ బ్రొద్దు పుచ్చి



యస్తమయము సమీప మౌనంత, నేటి
కేఁగి మజ్జనమాడి యథేష్టముగను. 165

క. అక్షసరం బార్ద్రాంశుక
మక్షయ కరపాత్ర మమర నతఁడప్పురిలో
"భిక్షాం దేహి " యటంచు న
పేక్షం బ్రతి గృహముఁ దిరిగి భిక్షం బెత్తున్. 166

తే. ఎత్తి తెచ్చిన భిక్షాన్న మెల్లఁ జల్ల -
శాక మిడునింట భుజియించి సకల వైశ్య
జాల యాచిత లబ్ధి తాంబూల చర్వ
శోష శోణిమ మోమున నొఱపు నెఱప. 167

క. మనుజులు నిద్రాశయులై
యొనరిన తఱి నాల్గు దిక్కు లొగిఁ జూచుచు వే
చని భాషిణి యింటికి ముద
మునఁ జతురుఁడు నిచ్చ దాని ముచ్చటఁ దీర్చున్. 168

వ. ఇట్లు ప్రతిదినంబును నతండు భాషిణీ యోషాభిప్రాయంబుఁ దీర్చు; నంత. 169

మ. ఉహుహూకార తనూ విధూనన జనవ్యూహోపభూ జృంభమా
ణ హసంతీ జ్వలనంబు శీతపవమాన స్పర్శ రోమోద్గమో
ద్వహనాంగాఖిల జంతు సంఘము హిమ వ్యాప్తాంబుజాతాండ మి
మ్మహి మీఁదం బొడసూపె నెయ్యెడల హేమంతంబు దుర్ధాంతమై. 170

సీ. సకల దిశా వ్యాప్త బక సితీకృతములు
బహుళ నిద్రాముద్ర పంకజములు
నిబిడ వర్షిత మహా నీహారకణములు
శీతలోత్తర జాత వాత తతులు



వర్దిత నిర్దూమ వహ్ని హసంతులు
కైరవ వికసన కారణములు
దాళవృంత విహార కేళివారణములు
యామినీ సముదయాయామదములు
తే. సరస మృగమద మేచకాగురు సుగంధ
బంధుక శ్రీ కుచ ద్వంద్వ బాఢ యుక్తి
చకిత పురుషావళీ శీత సాధ్వసములు
భాసురములయ్యె హేమంత వాసరములు. 171

తే. శాంతములయ్యె నెండలు, నిశాంతములయ్యె వధూకుచంబు ల
త్యంతము వాడి వేడిమికిఁ దాంతము లయ్యెఁ బయోజముల్ వ్రణా
క్రాంతములయ్యె వాతెఱలు, కాంతము లయ్యె మహోష్ణ వస్తు, లా
శాంతములయ్యెఁ దావులు, నిశాంతములన్ హిమవారి బారికిన్. 172

తే. అట్టి హేమంతకాలంబునందు నొక్క
నాఁడు చతురుఁడు భాషిణితోడఁ గూడి
రాతిఁ బరిపరి రీతుల రసికవృత్తి
సురతకేళుల నైపుణిఁ జూపు నపుడు. 173

చ. నెలవునఁ జండరశ్మినిఁ గనిష్ఠకుటుంబిని లేనిపోని వా
దుల జగడించు చిల్వెడలఁదోలిన వ్రాలిన చింతనొంది యూ
ర్పు లెనయ "దైవమా" యనుచుఁ బొక్కుచు నెవ్వరుఁబల్కరంచుఁ బే
రెలుఁగున భాషిణీ యువతి యింటికి వచ్చె నతండు ఖిన్నుఁడై. 174

తే. వచ్చి యచ్చండరశ్మి తా వాకిటికడ
నిలిచి తన యగ్ర మహిషినిఁ బిలువఁ గానె
గుండె ఝల్లని చతురుండు కొంకుచుండ
నతని నెట్లింతి యిలువెళ్ల ననుపవలయు? 175

క. ఇది దెలిసిన నృపు నెనయన్
బదమని రాయంచ వలుక, భామామణి
నా కది తెలియ దెటుల నని పెను
విదితముగాఁ దెలుపు మనిన విహగం బనియెన్. 176

తే. అటుల నిజపతి తనుఁబిల్వ విటుని కేలు
పట్టి తోడ్తెచ్చి, భాషిణీ పద్మగంధి
తలుపుఁ దెఱచుచు నామూల నిలిపి వాని
నాత్మనాథుని కెదురుగా నరిగి యపుడు. 177

ఉ. నెయ్యము మీఱఁగాఁ జరణనీరజముల్ తలసోక మ్రొక్కి వే
డ్కయ్యెడఁ బల్లవింప హృదయంబున భాషిణి యాత్మనాయకున్
శయ్యకుఁ దార్చి దివ్వె లిరుచక్కి వెలుంగ ముసుంగు వెట్టి “నేఁ
డెయ్యెడకైన నేఁగవె చెలీ!" యని పల్కి పరుండెఁ దిన్నగన్. 178

చ. అనువచనంబు దన్ను నొక యన్యగృహంబున కేఁగుమంచుఁ బ
ల్కినదని యాత్మనెంచి వడి గేహము వెల్వడి యావిటుండు పో
యిన తరువాత భాషిణి నిజేశుని దగ్గరఁ బండసైపకన్
గొనకొని లేనివాదు లొనఁగూర్చి చరించెను వేఁగునంతకున్. 179

క. జారులపై నాసక్తులు
నారుల కున్నటుల నాత్మనాయకుల పయిన్
గోరిక లున్నవె? యని ఖగ
మారయ వచియించుతఱి నిశాంతంబైనన్! 180

మ. కని హేమావతి దాని మెచ్చుచు సమగ్ర స్వర్ణ సౌధాంతరం
బున నక్షీపని జాళువా గొళుసులన్ బొల్పొందు నుయ్యాలపై
ఘనతం జేరి వసుంధరాధిపతి యోగప్రాప్తి ఘస్రాంతమౌ
దనుకంగుంది తమిస్రమౌట కెద మోదంబంది యాపిమ్మటన్. 181

సీ. సకటాక్షదీప్తి కాంచన రత్న తాటంక
ధగధగల్ చీఁకట్లు తలఁగఁద్రోయ
సకపోల కాంతి మౌక్తిక హారవల్లికా
చకచకల్ సాంద్రచంద్రికలు గాయ
సవలయ ధ్వని హేమ స్పతకీ కింకిణీ
ఘణమణల్ శ్రుతికౌతుకముగ మ్రోయ
సస్థాసక సుగంధ సారస దళ దామ
ఘుమఘుమల్ ఝణోత్సవమును జేయఁ
తే. గళుకుపని చిల్క వగ లేఁత తళుకు లొలుకు
జాళువాకమ్మి సరిగంచు చలువ వలువ
ధగధగల్ జాజిపువ్వు మొత్తములు గురియ
నంచకడఁ జేరె సాతాని మించుఁబోఁడి! 182

క. చేరిన హేమావతి ముఖ
మారసి నెఱజాణ వౌదు వనుదినము మెయిన్
వేఱొక వగ గుల్కఁగ శృం
గారింపఁగ ననుచు ముదముఁ గల్పించి యనెన్. 183

పండ్రెండవ రాత్రి కథ

శివదత్తయోగిసతి కోడిపందెగానిఁ గూడుట

చ. మనవి పరాకుమాని విను మానిని! పూనికమైఁ గళింగభూ
మిని సిరికాస్పదంబు జనమేజయుఁడేలు సుగంధ బంధురం
బను పుర ముల్లసిల్లు మణిహర్మ్య వినూతన కేతనచ్ఛటా
జనిత సువాతధూత సురసాలపతత్సుమ ధౌత వీథియై. 184

శా. అందుండున్ భసిత త్రిపుండములు కామాక్షుల్ జడల్ కక్షపా
లందుం దండము కావి వస్త్రములు రుద్రాక్షల్ దువాళించు కా



లందెల్ పాదుకలున్ మృగాజినము నిత్యం బొప్ప సంసారి యో
గీంద్రుండొక్కఁడు శూద్రుఁ డీశపద భక్త్యెకాగ్ర చిత్రాబ్జుఁడై . 185

వ. అతండు పృథివ్యప్తేజో వాయ్వాకాశంబులను పంచభూతంబులును, ద్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులను జ్ఞానేంద్రియంబులును, వాక్పాణి పాద పాయూపస్థలను కర్మేంద్రియంబులును శబ్ద స్పర్శ రూప రస గంధంబులను విషయంబులును మనోబుద్ది చిత్తాహంకారంబులను నంతఃకరణ చతుష్టయంబును జీవునితోఁగూడి పంచ వింశతి తత్త్వంబులగునని యెఱింగి యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులనం బరగు నష్టాంగ యోగంబులఁ జతురుండై కమల యోగ బ్రహ్మ గరుడ సుఖ వీర కూర్మ సిద్ధానంత కుక్కుటాసనంబుల నిశ్చలత నిలిచి రేచక పూరక కుంభంబులఁ, బ్రాణాపాన వ్యానోదాన సమానంబులను ప్రధాన వాయువులను నాగకూర్మ కృకర దేవదత్త ధనంజయంబులను నుపవాయువులను స్వాధీనత నొందించి, యిడా పింగళా సుషుమ్నా మార్గంబులను, నున్మనీ మనోన్మనులను నాద బిందు కళలను సాంఖ్య తారకామనస్కంబులను మంత్ర హఠ లయ రాజ యోగంబులను మూలాధార స్వాధిష్ఠాన మణిపూరకానాహత విశుద్ధాజ్ఞా సహస్రారంబులను చక్రంబులను దెలియనేర్చి యాత్మాంతరాత్మ పరమాత్మజ్ఞానాత్మ స్వరూపంబు లెఱింగి సత్పురుషుల నాశ్రయించియుఁ దత్ఫలలబ్ధిఁ గానక కేవలంబు శైవమత ధురంధరుండై యుండె నంతట. 186

క. ఆరాధ్యుఁడు తమ వంశా
చారమునకు గురుమహత్త్వసత్తముఁడు ప్రియం
బారఁగ నతనికిఁ బెట్టిన
పేరును శివదత్తుఁడండ్రు బిసరుహగంధీ! 187

తే. సంతతంబును జంగమార్చనలు సల్పి
భౌమవారంబునను వీరభద్రు పళ్ళె



రంబునిడి వారి పాదతీర్థమున భుక్త
శేషమునఁ దృప్తిఁబొందుచుఁ జెలఁగు నతఁడు. 188

సీ. అయ్యావళీ ముఖ్యమై తనరారెడు
మిండ జంగంబులు మెఱసి నడువ
గౌరఘే మల్లప్ప గంగకుఁ జను కంచి
కావళ్లవారును గలిసి చనఁగ
గుమ్మెతల్ కిన్నెరల్ గూడి వాయించుచు
భైరవజోగి వెంబడినె కదల
బసవగంటలు బృహత్పటుశంఖములు మ్రోయ
శివరాత్రి జంగాలు చేరి కొలువ
తే. లశన తిలపిష్ట చూర్ణభాగశన మసిమి
యుల్లి పచ్చళ్లు పులిదోసె లూరుఁబిండ్లు
మూట జోలెలు చిటిగాళ్లు మోసితేఁగ
నాతఁ డేఁటేట శ్రీశైల మరిగివచ్చు. 189

తే. వీర శైవంబు ముదిరి యేవేళనైన
“హరహర శివా మహాదేవ" యనెడు పల్కు
పలుకునేకాని యితర సంభాషణంబు
లాడఁ జెన్నఁడుఁ బెండ్లాము తోడనైన. 190

క. అతనికి విశాల యనం
గాఁ దరుణియొ ర్తు తనరుఁ గమ్మవిరి లకో
రీ తురక రౌతు లాయము
లోఁ దేజీరతన మనుచు లోకులు పొగడన్. 191

క. దాని విలాసపు వదనము
దాని చొకాటంపు గబ్బి తళుకుల గుబ్బల్
దాని పసమించు దేహము
మానవతీ! పొగడ శక్యమా? విధికైనన్? 192

సీ. నీలాల రుచినవ్వు నెఱివేణి మొత్తమ్ము
తమ్ముల నిరసించు నెమ్మొగంబు
గంబురా బుగబుగల్ గలఁగించు నునుఁ బల్కు
పల్ కుదు రాణుల పసనుమించు
మించుల నిర్జించు మెయితీవ పొంకంబు
కంబుసోయగముల గళము మారు
మారు గుడారముల్ దోరుచు గుబ్బలు
బలుదీవినగు నితంబంబు మహిమ
తే. హిమమయూఖాస్య యూరుల యేపుఁ దెగడు
గడుసు రంభల సొగసు జంఘలు జయించు
నించువిలుకాని శరధుల నేణనయన
యనఘ పదములు కెంజివుళ్లను హసించు. 193

క. చివురా? వాతెఱ నల్లని
కవురా? నునుసోగ వెండ్రుకలు పుత్తడిమేల్
సవురా? దేహము ముద్దుల
దవురా? యని జనులు పొగడ నాబిడ యలరున్. 194

తే. దాని నెమ్మేని మెఱుఁగుఁ దాఁబూనఁ గడఁగి
పుత్తడి వెలంది చిద్రుపలై ముద్రవడసి
యొఱసి యొట్టంబువడి కాఁగి నెఱయఁ జిమిడి
కరఁగి నీరయి పోవును గలువకంటి! 195

ఉ. సారసమా నవీనఘృణిసంపదఁ గాంచును నెమ్మొగంబు కా
సారసమాన విభ్రమము సారె జయించును నాభియున్ సుధా
సారసమాన మాధురిని జాల రహించును మోవి చంద్రికా౽
సారసమాన హృద్యరుచి సంతతి మించును గాంతహాసముల్. 198



శా. పున్నాగంబును గెల్వఁజాలు రుచిరాంభోజాస్య వేణీరుచుల్
పున్నాగంబును నవ్వనోపి నెఱయున్ లోలాక్షియానంబులున్
బున్నాగంబును గేరి మీఱి మెఱయున్ బూఁబోఁడినూఁగారుడాల్
పున్నాగంబును మించు నాభిచెలువంబున్ సారె వర్ణింపఁగన్. 197

క. అతను జయధర్మ లీలా
హితవృత్తిన్ గన్బొమలు రహించె ననుచుఁ దా
మతను జయధర్మలీలా
హితవృత్తి రహించి మించు నింతికుచంబుల్. 198

చ. అది పతిభక్తి మీఱఁగ దినాంతముదాఁకను సేవఁజేసి యిం
పొదవఁగ నారగించి వసనోత్తమ భూషణ పుష్పగంధ సం
పదలనుదేలి రేలు ప్రియభర్తను సిబ్బెపుగబ్బిగుబ్బలన్
గదిసి కవుంగిలింపఁ జనఁగాఁ గని కోపవిఘూర్ణితాత్ముఁడై. 199

క. శివదత్తుఁడు "హరహర!!" యని
"యవలికిఁబో! ఱంకులాఁడి!" యని తను ద్రొబ్బం
గ వయసుది గనుక నాశలఁ
దివురుచు, వ్రతికతివ మోహదీక్ష చెలంగన్. 200

సీ. పదము లొత్తెదనంచుఁ బతిజంఘికలు తన
తొడలపై వేసికో మిడిసిపడును
నడుము పట్టెదనంచు నాథుని చిఱుఁదొడల్
పుడికినఁ జీయని పొరలు నవల
నుపబర్హ మెగఁద్రోయ నుంకించి మోముపై
మోముఁ జేర్చినఁ జూచి ముదుగులాడు
వ్రేల్మెటికలు దీయ వెసనెత్తి హస్తంబు
కుచములపై వేసికొనినఁ దిట్టుఁ

తే. బ్రక్కలోఁజేరి కౌఁగిఁటఁ జిక్కఁబట్టి
కులుకు గుబ్బల నెదఱొమ్ము గ్రుమ్మి క్రుమ్మి
రతి బలాత్కారమునఁ జేయ ధృతి వహించు
ప్రేయసిని జూచి రోయుచుఁ ద్రోయు నతఁడు. 201

క. ఈలాగు నిచ్చ నిచ్చలు
వాలుగు టెక్కెంబుఁ బూనువాని దురంబుల్
లీల నొనరింపఁ జూచు వి
శాలను "జీ! ఱంకులాడి! చను" మని తిట్టున్. 202

తే. అతఁడు పరసౌఖ్యమునె కోరి యాసఁబొందఁ
డిహమునం దుచ్ఛ సౌఖ్యాప్తి కింతయైన
ఱాతికిడునట్టి గిలిగింతలై తనర్చుఁ
గాని ప్రియురాలి చేష్టలు గలఁప వతని. 203

వ. మఱియును. 204

సీ. ఎడలేక కవఁగూడి యేప్రొద్దు రతిసల్పు
వారి వైఖరుల కే(కారఁ దొడఁగు
సయ్యాటములు గల్గు జంపతిక్రీడకుఁ
గెరలి వేమాఱు గ్రుక్కిళ్లు మ్రింగుఁ
గందర్పు కేళులఁ బొందు సతీపతు
లాసక్తికిని భావమందుఁ గుందు
సురతఖేలన వధూవరుల మైత్రికి మాన
సమున నిట్టూర్పులు సల్పి పొక్కు
తే. విరి లకోరీ దునేదారి దురముఁ గోరి
మీటి పోరాడు సుకుమార మిథునతతుల
వైభవముఁ గాంచి హా! యంచుఁ బరితపించు
సంగమ విహీనయైన యా జలజనయన. 205



తే. కుడువఁ గట్టను దొడుగను ముడువఁ బుడమి
నెంత గలిగినఁ బ్రాయంపు టింతులకును
గ్రామ్య ధర్మంబు లేకున్నఁ గలుగు దుఃఖ
మెంతని వచింపవచ్చు నో దంతిగమన! 206

తే. వినుము నానావిధంబుల దినము దినము
రాత్రి రమణునిఁ గడియఁబో "ఱంకులాఁడి!
పోవే" యని త్రోయ, గుబ్బలఁ బొందు పైఁట
చెఱఁగుఁ బఱుచుకఁ బండు నుస్సురు మటంచు. 207

ఉ. మిన్నక యిట్లు భర్త తనమీద విరాళి వహింపకున్న నా
కన్నియ చూచి "యీ ముది బికారునితోఁ బనియేమి నా" కటం
చున్నిరసించుఁ “బంచశర సుందర రూపుల జార వీరులం
గ్రొన్ననవింటివానీ మొనకున్ గదియించెద" నంచు నెంచుచున్. 208

క. వేవిన శివదత్తునకును
సేవలు సేయుటలు మాని చిత్తం బలరన్
భావజనిభులగు జారుల
త్రోవలు గనుచుండె విరహ దోహల కాంక్షన్. 209

చ. చికిలి విభూతిరేక, జిగిఁ జిల్కెడు కమ్మల కాంతిజోక , హా
టక మణిభూషణంబుల మిటారపుఁ డెక్కులమూఁక వాసనా
ధిక సుమగంధ సంపదల తేటగు సిస్తుల వీఁక యొప్పఁగా
నకట! విశాల నామసఖి హర్షముతోఁ జరియింపుచుండఁగన్. 210

కోడి పందెములు—కోళ్లు

క. ఆంతట నితాంత హర్ష
స్వాంత యుత ద్యూత జన రవక్షుభిత హరి



ద్దంతిశ్రుతియై నగర
ప్రాంతంబునఁ గోడిపదువు పందెము సాఁగెన్. 211

తే. కాలి ప్రాఁతలు దారాలు కట్టుముళ్లు
ముష్టులును నీళ్ల ముంతలు మూలికలును
గత్తుల పొదుళ్లు మంత్రముల్ కట్టు పసరు
లెనయ వచ్చిరి పందెగాండ్రేపు రేఁగి. 212

తే. డేగ నెమలి పింగళి కోడి డేగకాకి
వన్నె లైదింటి కిరవొందు వన్నెలందు
రాజ్య భోజన గమన నిద్రా మరణము
లను విచారించి యుపజాతులను వచించి. 213

సీ. పట్టెజుట్టుది మైల పుట్టజుట్టుది గూబ
చిలుకజుట్టుది మూఁగ చిల్లకోడి
పట్టుమార్పుది యరజుట్టుది బోరది
బూడిద వన్నెది పొడది చిల్ల
కాలుది గుజ్జుది గాజులకాలు దో
గలది పండెఱ్ఱది గద్దకాలు
దెఱ్ఱని దురగది నీఁకెల కాలిది
నల్లది కొప్పుది తెల్ల యురగ
తే. పిల్ల వ్రేళ్లది మొద్దుది నల్ల యురగ .
లనఁగఁదగు కత్తి కాల్పుంజు లందులోనఁ
బసపు పావళ్లు కాలందె లెసలు కట్లు
రావి రేకలు బిరుదులు ఠీవి గలుగు. 214

సీ. గరుడండు శరభంబు కంచు డమారము
రణభేరి కార్చిచ్చు ఱాతిబొమ్మ



రాము బాణము మితి రాహుత్తి పిడుగు హం
వీరుండు పుంజుల వేరువిత్తు
గండకత్తెర గుండెగాలంబు మాష్టీఁడు
పట్టభద్రుఁడు జెట్టి భైరవుండు
కత్తులపొది సింహగాలి బేతాళుండు
పసులపాఁతర పాదరసము చిలుకు
తే. టమ్ము సుడిగాలి చక్రంబు నలజ డదరి
శూలము పిరంగి వెలినక్క సాలువంబు
కాళరాత్ర్యంతకుఁడు పందెగాండ్ర మెచ్చు
లనెడు పేరుల పుంజులఁ గొని మొగించి. 215

చ. చొరఁబడి కాలి ప్రాఁతలను జుట్టియుఁ గత్తులు వేసి సందిటం
బెరయఁగఁబట్టి చెక్కు గఱపించి, గిఱేర్పడగీచి నిల్పికొం
కురలఁగఁబూంచి పందియపు టుంకువ దిద్దుచుఁ జిట్కె వేసి స
ళ్ళిరి మఱి "భో" యటంచును ఖళీపెళి పుంజులు తన్నులాడఁగన్. 216

క. కృకవాకువులం బుట్టిన
కకపిక వాదడరుచుండఁ గాలజ్ఞ రణో
ర్వికడను నిలిచిన శకనా
మకు నొక నాయకునిఁ జూచి మానిని మెచ్చెన్. 217

ఉ. మెచ్చినయంతలోఁ జిగురుమేలడిదంబు బిరాన దూసి, బ
ల్పచ్చని వింటిబోయ చెలిపైఁబడి నిబ్బరపుబ్బు సిబ్బెపున్
మచ్చగలట్టి గుబ్బకవ నాట ఖచిక్కునఁ గ్రుమ్మి క్రుమ్మి తా
నచ్చుగఁ బేర్చియార్చె హరిణాక్షిమనంబు గలంగ నెంతయున్. 218

తే. అపుడు తనుఁదానె తెలుసుక యజ్ఞనయన
కులుకు గుబ్బలఁ జిన్నారి గోట్ల రవిక
పిగులఁ బోకముడూడిపోఁ బేర్మితోడ
శకునిఁ జూచుచుఁ దన యింటిచక్కి నిలిచి. 219



చ. అతఁడొక నీటికాల్వకడ కంతట వేచని తామ్రచూడ శో
ణితయుత హస్తముల్ కడుగు నేర్పున నుండఁగ వాని చెంతకున్
గుతుక మెలర్పఁగా జని శకుంగని కోమలి కొంకుపాటుతోఁ
గొతుకుచుఁ బల్కె నొంటి నిటు గూడునె రాఁదనవంటి దానికిన్. 220

క. అని నీళ్లఁ గాళ్లు గడుగుచుఁ
“జనఁ గావలె నమ్మ చెల్ల! సరె తడవాయెన్
గన నెవ్వారును లే" రని
ఘనకుంతల పల్కుచుండఁగా శకుఁడంతన్. 221

క. “ఇంతీ ! యెవ్వరు లేరని
గొంతేటికిఁ జేసె దెవరు గొనిపోయెదరే!
యెంతపని వచ్చినను నిదె
చెంతనె యున్నాఁడ, భీతిఁ జెందకు" మనినన్. 222

చ. విని చిఱునవ్వునవ్వి “భువి వింతలు పో! మగనాండ్ర నీగతిన్
బనివడి యొంటినుండఁగని పల్కుట న్యాయమే?" యంచుఁ బల్కి, “నీ
వనుదిన మెందునుందు వెవరైనను వచ్చెద, రేది? చెప్పుమా
ననవిలుకానివంటి నెఱనాయక!" యంచు విశాల వేడినన్. 223

క. “నేనుండు దెపుడు మాపురి
లోనన్ నా పేరు శకుఁడు, లోలాయతనే
త్రా! నారుల మానసములు
పూని కనుంగొనెడు బుద్ది భూమిఁ జరింతున్.” 224

వ. అని చెప్పి నవ్వుచు వెండియు నిట్లనియె. 225

క. “ఈ వీట నొండు చిత్రము
గావించెడి పాటిదానిఁ గనమీవఱకున్

నీవైతె జాణవౌదువు
గా వోలున్ మాట లటుకఁగా వినఁబడియెన్. 226

క. అదిగాక నిన్నుఁ జూచిన
మొదలున్ మదనాస్త్రతతుల మొనఁబడితి ననున్
గదియించి గబ్బిగుబ్బల
పొదుగున నీడేర్పు రతులఁ బొసఁగించి సఖీ! 227

తే. అనిన విని యా విశాల యౌరా! యటంచు
మెచ్చి నా మదిలోఁగల మేలిమెల్లఁ
దెలిసితివి జాణవౌదని పలికి, యతని
రమ్ము నాయింటి కిపుడని నెమ్మి మీఱ. 228

క. త్వరితగతిన్ దనయింటికి
దిరిగి తిరిగి చూచుకొనుచుఁ దెఱవయుఁజనె, నా
సరణిని బడి శకుఁడాబిడ
శరణమునకుఁ జనియె వేడ్క సఫలతఁ బొందన్. 229

తే. ఇద్ద ఱీరీతి నింటిలో కేఁగినప్పు
డొంటిపాటయ్యె శివదత్తుఁ డింటలేని
కతన ననిపొంగి యన్యోన్య కాంక్షలూర
సురత కేళికిఁ జెలరేఁగి చొచ్చి హెచ్చి. 230

చ. అలసటలే కసహ్యగుణ మందక తగ్గక తొట్రుపాటునం
గలఁగక ప్రాలుమాలక వికారముఁ బొందక యాలసించకం
దొలఁగక నిద్రమబ్బుగొని తూలక నిద్దఱు నేకకాంక్షతోఁ
దలిరుకటారివాని బెడిదంపుదురం బొనరించి రెంతయున్. 231

చ. లకుముకులట్ల సర్పముల లాగునఁ గుక్కుటజాతి చాడ్పునన్
బికముల లీలఁ బావురపుఁ బిట్టల తీరునఁ జెట్లవీఁక ధే



నుకముల వైఖరిన్ గపుల నూఁకుడు భంగిని భైరవాశ్వయు
గ్మకములరీతి సింహముల కైవడిఁ బోరి రనూన చాతురిన్. 232

తే. అటులఁ దమి దీఱకుండెడి యాసతోడ
ముచ్చటలు దీఱ నిరువురు మొనసి పెనఁగు
వేళ శివదత్తుఁ డింటికి వేగవచ్చి
చూచె నాశ్చర్యకోప విస్ఫురితుఁడగుచు. 233

వ. ఇత్తెఱంగున. 234

క. ఘర్షించి కనుల నిప్పుల
వర్షంబులు గురియఁజూచు వల్లభునకు నా
ధర్షణి యపు డేవిధమున
హర్షముఁ గావింపవలయు నని యడుగుటయున్. 235

తే. హంసకుల సార్వభౌమ! నీ వనుదినంబు
కథకుఁ గథకిట్లు నన్నడుగంగ నేల?
చెప్పు మేలాగు హర్షింపఁజేసె మగని
ననిన హేమావతిని జూచి హంసయనియె. 236

క. విను మటుల మగఁడు కోపము
పెనఁగొని ఘర్షించి పలుక భీతిల్లక యా
వనజదళాకార విలో
చన ధైర్యము చెదరనీక చతురత ననియెన్. 237

క. మరుకేళిఁ గవయ 'కవ్వలి
కరుగవె చీ! ఱంకులాఁడి!' యని నను నిచ్చల్
నిరసింతువు, యోగివ కన
నరకా! నీ వాకె తాఁకె నాకుం జూడన్. 238



చ. పలుమఱు 'ఱంకులాఁడి' యనిపల్కెడు నీ వచనం బమోఘమై
నెలకొని తాఁకె, సిద్ధుఁడవు నీ మహిమంబది యేల వ్యర్థమై
తొలఁగు?" నటంచుఁబల్కి చెలి దూఱిన, నాత్మతపో విభూతిచేఁ
దలకొను వాక్యసిద్ధికి ముదంబు గొనెన్ శివదత్తుఁ డెంతయున్. 239

చ. అటుల నిజాధినాథుఁడపు డాత్మమహత్త్వ గుణోపలబ్ది కు
త్కటమగు మోదమందఁగను గామిని చూచి, “ననుం బతివ్రతా
పటిమ వహించుమంచు బహు భాషలఁ బల్కుము, పల్కకున్న నీ
కిట ఘటియింతు హత్య, తను వేటికి నేఁటికి నింద వచ్చినన్" 240

తే. అనెడు సతివాక్యమునకు స్త్రీహత్య కులికి
తనదు వాక్సిద్ధికిని నద్భుతంబుఁ జెంది
“నీ విఁక మహా పతివ్రతా భావ మహిమ
వెలయవే!" యని యోగి దీవించెఁ బ్రీతి. 241

క. అటువలె దీవించుచు నె
ప్పటియట్లనె వేఱులేని పక్షంబున న
జ్జటిలుండుండెను జెలియును
బటు ముదమున మెలఁగుచుండెఁ బడఁతుక! వింటే? 242

క. ఆరీతి మహోపాయము
నేరిచినన్ జారుఁ గవయ నెలకొను మన, నౌ
రౌర! జగజంత యని తెల
వాఱుటఁ గని భామ కేళివసతికిఁ జనియెన్. 243

వ. అని ప్రత్యుత్పన్నమతి చెప్పిన విని హర్షంబు నొంది నలుండు తరువాతి వృత్తాంతం బాన తిమ్మని ప్రార్థించిన. 244



మ. నిరవద్య స్వయశో వినిర్జిత మహానీహార నీహార భూ
ధర పుత్రీశ్వర కావ్యగోత్ర విధికాంతా గౌరవా గౌరవా
కర మందార పటీర శంకరపతాకా తారకా తారరా
డరవిందోద్భవవాహ పథ్యతిథి పాకాహార కాహారపా! 245

అనులోమ విలోమ కందము.
రామా కుజరాజనుత ర
మామర సుమరాగకర సుమాకర సమరా
రామ సరకమాసుర కగ
రామ సురమమార తనుజ రాజకుమారా! 246

తోటక వృత్తము.
వారణ వారణ వారణ రక్షా!
సారస సారస సారస పక్షా!
శారద శారద శారద కీర్తీ!
హారిమ హారిమ హారిమ మూర్తీ! 247

గద్యము :
ఇది శ్రీమత్కౌండిన్యస గోత్ర పవిత్రాయ్యలరాజాన్వయ సుధావార్ధి
పూర్ణిమా చంద్ర నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్య నిస్తంద్ర
శ్రీ రామనామ పారాయణ నారాయణామాత్య
ప్రణీతంబైన హంసవింశతి యను
మహా ప్రబంధంబు నందు
దృతీయాశ్వాసము

  1. ఇచట గణభంగము కన్పట్టుచున్నది.