హంసవింశతి/అయిదవ రాత్రి కథ



అయిదవ రాత్రి కథ

గొల్లచిన్నది బాపన చిన్న వానిఁ గూడుట


క. ఆలింపు మహాభ్రంకష
కేళీప్రాసాద నీలఘృణి గాఢ తమః
పాళీ సతత విహారి సు
రాళీ పురజాల కులటమై సర మనఁగన్. 73

తే. పురమొకటి యుల్లసిల్లు, సంస్ఫురిత పూర్ణ
మా నిశాకర ధిక్కరి మంజులాస్య
మందు నొక గొల్ల సంపల్లతాంగిపిల్ల (బిడ్డ)
విజయుఁ డను పేర సిరులచే వెలయుచుండు. 74

గోప గృహము - గొఱ్ఱెలు


సీ. కంబళి తలదడ్డు కవ్వము మజ్జిగ
బాన గొడ్డలి నుచ్పు ప్రాఁతల గుది
కావడి యుట్లు చిక్కము సందికడియంబు
సూకల తోఁప పొగాకుతిత్తి
బొప్పి మజ్జిగముంత బొటమంచి పిల్లల
గూడు దామెనత్రాడు కోఁతకత్తి
తొర్లుగట్టెయు జలచుబ్బు చిల్కుడుగుంజ
పూజబిందెలు వెన్నపూస చట్టి
తే. పాలబుడిగలు వడిసెల ప్రాఁతమెట్లు
మలపమందుల పొడిబుఱ్ఱ మన్నెముల్లు
తోలుకుళ్ళాయి తొడుపును దొడ్డికంప
చుట్టు చవికెయుఁ గొమరొప్ప సొలయు నతడు. 75



చ. కుఱుబవి దోరచాఱ నలగొండ్లెఱగొండిలి మూజ బొల్లివిన్
నఱిగివి నెట్టుజోడు పులనల్లని వెఱ్ఱవి పుల్ల చిల్లవిన్
బఱిగివి మొఱ్ఱివిన్ గరకపల్లవి నాఁదగుపేళ్ల నొప్పెడున్
గొఱియలు వేనవేలుఁగలగుంపు లసంఖ్యము లుండు వానికిన్. 76

తే. బోడి పొడమట్టి నామంబు బొల్లిపూరి
జాలవల ఫుల్ల వెఱిబట్ట చాఱ బఱిగి
కఱుకుగడ్డము తెలమొఱ్ఱి గవర దోర
వనెడు పేరుల మేఁకగుం పతని కుండు. 77

తే. మట్టె చేమట్టె కఱె పస్సె మైల బట్ట
కోర తలపూజ వెఱ్ఱనిచాఱ బోడ
పొడ కపిలకన్నె బొలిచుక్క పుల్లవి యను
పేళ్ల నొప్పారి మందకోఁ బెక్కు గలవు. 78

క. పల్లవి నల్లవి యెనుములు
బిల్లలనిడు గోడిగలును బెంపుడు పెద పొ
ట్టేళ్లును దుక్కెడ్లును విల
సిల్లగ నా విజయుఁ డచట సిస్తుగ నుండున్. 79

క. అతనికి మంజుల యనఁగా
సతి యొక్కతె గలదు దాని సరియెన్నుటకున్
గొతుకుపడు రతికిఁ జతురత
యితరుల నిఁక నెన్న నేల యిందునిభాస్యా! 80

క. ఆ కుల్కు లా యొయారము
లా కనుఁదమ్ముల మెఱుంగు లా కౌను బెడం
గా కుచయుగ్మము బింకం
బా కోయిల ముద్దుఁబల్కు లతివకె చెల్లున్. 81



క. ఆబిడ గర్భోత్పత్తికి
నై బగిసియు మాలి పతి రతాదృతి మీఁదన్
లోఁ బొడమిన రుచి మించినఁ
బ్రాబల్యము గలుగు విటుల పాలిది యయ్యెన్. 82

సీ. వేశ్యాపతి చకోరవిసరంబునకు నురి
విట లతావళికి లవిత్రకంబు
యువరాజి కరులకు నొసరారు నోదంబు
కాముకవ్యాఘ్రంపు గమికి బోను
పాంథమానసమత్స్యపటలికి గాలంబు
పల్లవోక్షములకు వల్లెత్రాడు
షిద్గకపోతరాశికి జీరు దీమంబు
లలి భుజంగవిహంగములకుఁ జివురు
తే. జార కిరి పంక్తులకు మోటు, సరస శశక
ములకు గట్టువ, యుపకాంత ముఖ్య చటక
సంఘములకును గుబ్బిక శంబరారి
ఘోర రణహారి జయభేరి ఘోషనారి. 83

తే. ఇత్తెఱంగునఁ జిత్తనాయత్తచిత్త
వృత్తి గైకొని బారుల పొత్తు సలిపె
నలసటయు వేసటయు లేక, యట్టులయ్యు
జూలు గాంచఁగలేక యా సుదతి కుంది. 84

చ. తిరుమల కంచి పుష్పగిరి తీర్థములుం జని కొంగుముళ్లతో
వరములు దంపతుల్ వడ యవారిగఁ గాన్కలు వైచి యంతటన్
బరికలు దృష్టిదీపములుఁ జన్నిన గద్దెలు పెట్టి యేమిటన్
గరసుగుసుపుత్రవాంఛ కడఁగానఁగలేక విచారఖిక. ఆబిడ గర్భోత్పత్తికి
నై బగిసియు మాలి పతి రతాదృతి మీఁదన్
లోఁ బొడమిన రుచి మించినఁ
బ్రాబల్యము గలుగు విటుల పాలిది యయ్యెన్. 82

సీ. వేశ్యాపతి చకోరవిసరంబునకు నురి
విట లతావళికి లవిత్రకంబు
యువరాజి కరులకు నొసరారు నోదంబు
కాముకవ్యాఘ్రంపు గమికి బోను
పాంథమానసమత్స్యపటలికి గాలంబు
పల్లవోక్షములకు వల్లెత్రాడు
షిద్గకపోతరాజికి జీరు దీమంబు
లలి భుజంగ విహంగములకుఁ జివురు
తే. జార కిరి పంక్తులకు మోటు, సరస శశక
ములకు గట్టువ, యుపకాంత ముఖ్య చటక
సంఘములకును గుబ్బిక శంబరారి
ఘోర రణహారి జయభేరి ఘోషనారి. 83

తే. ఇత్తెఱంగునఁ జిత్తనాయత్తచిత్త
వృత్తి గైకొని బారుల పొత్తు సలిపె
నలసటయు వేసటయు లేక, యట్టులయ్యు
జూలు గాంచఁగలేక యా సుదతి కుంది. 84

చ. తిరుమల కంచి పుష్పగిరి తీర్థములుం జని కొంగుముళ్లతో
వరములు దంపతుల్ వడయ వారిగఁ గాన్కలు వైచి యంతటన్
బరికలు దృష్టిదీపములుఁ బన్నిన గద్దెలు పెట్టి యేమిటన్
గరమగు పుత్రవాంఛ కడఁగానఁగలేక విచారఖిన్నులై. 85

వ. ఉన్న సమయంబున. 86



ఉ. కొమ్ములు వీరణాలు జిగి గుల్కెడు వ్రాఁతల కృష్ణలీలలం
గ్రమ్ము గుడార్లు వీరుఁడగు కాటమరాజు కథానులాపముల్
బమ్మిన పుస్తకాలు ముఖపట్టిక కట్టు రుమాలలున్ నెఱా
సొమ్ములు నామముల్ వెలయు సుద్దుల గొల్లలు వచ్చి రెంతయున్. 87

వ. ఇట్లు వచ్చి. 88

సీ. ఫెళఫెళ వీరణాల్ ఖళిఫెళి వాయించి
పోటుబోఁ గొమ్ములు నాట నూఁది
దొనకొండ గంగను దొలుత సన్నుతి చేసి
కృష్ణున కతిభక్తిఁ గేలుమోడ్చి
యాదికాలపు గౌండ్ర నందఱఁ గొనియాడి
తాత తండ్రుల పేళ్ళు తలఁచి పొగడి
బిరుదుల నరుదుగాఁ బేర్కొని మొరయించి
దీవించి వీరుల త్రోవ లెన్ని
తే. కులము పెద్దల కత లాముకొనఁగఁ జెప్పి
సివము పుట్టించి పుత్రులఁ జెందఁ గలరు
వీరులను గొల్వుఁడని తెల్పి వీడుకొల్పఁ
జనిరి సుద్దుల గొల్లలు సంతసిల్లి. 89

వ. ఇట్లు వారలు సెప్పిపోయిన నత్యంతభక్తిప్రియపూర్వకంబుగా నంతట. 90

మ. కొలిచెన్ గాటమరాజు సన్నుతులు చేకూర్చెన్ మహావీర్లకున్
బొలమున్ రాజుల నెంతొ భక్తిపరతన్ బూజించె నా గంగకున్
వెలయన్ వేఁటలు బోనమున్ సిడులు గావించెన్ సుతోత్పత్తికై
చెలి యాలాగున సల్ప దైవముకృపన్ సిద్ధించెఁ దద్వాంఛయున్. 91

వ. అంత. 92



ఉ. మోము వహించెఁ దెల్వి జిగి మోవిరుచుల్ దగ సందడించె మృ
త్స్నామతి మించెఁ జన్మొనలు శ్యామలకాంతి వహించె యానముల్
వేమఱు మందగించెఁ గడు వృద్ధి భజించెను గౌను చిట్టుముల్
రామకు సంభవించె, నభిరామతరంబుగఁ జీర చిక్కినన్. 93

తే. అంత నొకనాఁడు శుభముహూర్తాంతరమున
మంజులాంగన రంగైన మంచి మణుల
నొఱపుగాఁ దీర్చికట్టిన యొక్క దివ్య
మందిరములోనఁ జిన్ని కుమారిఁ గనియె. 94

చ. వడఁకెడు కౌనురంగు తలవాసెన గట్టిన కొంగు పుక్కిటన్
విడియపుఁ జొంగు మైలఁగొని వ్రేలెడు చేలచెఱంగు పాలచేఁ
పుడు చనుదోయిపొంగు వసపూతఁల వింతబెడంగు నూనె క్రొ
మ్ముడి రుచి హంగు బిట్టమర ముద్ధియ యొప్పెను బిడ్డ కాన్సునన్. 95

వ. అంత. 96

క. అది ప్రతిపచ్ఛశిరేఖా
భ్యుదయమువలె దినదినమ్ముఁ బొదలెడు కళలం
బొడువంబడి లేఁబ్రాయపు
మద మెక్కఁగ ముద్దు గులికె మనమలరారన్. 97

క. చన్నులపస యట మీఁదటఁ
గన్నులపస ముద్దు గులుకఁగల ముఖమున మేల్
క్రొన్నెలమిస జిగిబిగి వగ
చిన్నెల మసఁ జూచి వలచుఁ జిత్తజుఁ డయినన్. 98

తే. తమకమున కొగ్గ దనెడు నేరము ఘటించి
తరుణతను వెళ్లఁగొట్టింపఁ దలఁచి మదనుఁ

డీర్ష్య గుండలు వెల్లవేయించె ననఁగ
బాల్యము చనంగఁ గుచము లేర్పడియె సతికి. 99

తే. కొమిరె బంగారు పొక్కిలి కుంది యందు
రతియు శృంగార మను ధాన్యరాశి నించి
దంచ నిడినట్టి రోఁకలి సంచు మీఱి
రోమరాజి దనర్చు నారూఢిగాఁగ. 100

క. చెందిర మా మెయిసిరి, సిరి
మందిర మా మోము గోము, మదనారి లస
న్మందిర మా కుచయుగ మిం
దిందిర మా వేణి యనఁగ నెలఁత రహించున్. 101

సీ. రాణించు నెఱికురుల్ వేణి కందకమున్న
కనుబొమల్ వక్రిమఁ గనక మున్న
జిగి గుబ్బలు మొగాన కెగయ నిక్కక మున్న
నునుఁబల్కు నేర్పుఁ గైకొనక మున్న
చూపులఁ జుఱుకుగాఁ జూడనేరక మున్న
వీనుల మరుకథల్ వినక మున్న
లలితయానము మదాలసతఁ బూనక మున్న
కటిసీమ విస్తృతిఁ గనక మున్న
తే. చిత్తజుఁడు తమ్మిపూఁదూఁపు చెఱకువింటఁ
గూర్చి గుఱిచేసి తనునేయ గొల్లవనిత
మమతఁగని చోరసురతసామ్రాజ్యమునకు
దిట్టతనమునఁ బట్టంబు గట్టుకొనియె. 102

వ. అవ్విధంబున ఘోషకన్యారత్నంబు శైశవయౌవనసమయంబున మన్మథప్రేరితయై విజృంభించి వర్తించు నప్పుడు. 108



సీ. చిన్నిచన్నులు గోళ్లఁ జీరఁ జెక్కులు గొట్టుఁ
గౌఁగిలించు మటంచుఁ గదియఁ దివురు
గిలిగింత లొక కొన్ని కలయంగ నెనయించి
మోవి నొక్కు మటంచు మొనసి నిలుచు
నిచ్చకం బిగురొత్తఁ బచ్చిదేరఁగఁ బల్కు
ముద్దిడరా యని యొద్ది కరుగు
బకదారి కివకివ లొకదారి మైఁజూపు
తమిఁ గూడరాయంచు దరికి నేగు
తే. నుపరతికి నెంచుఁ బరిహాస కోక్తులాడుఁ
జేష్ట లెనయించుఁ బొలయల్క చేతఁ గుందు
వెతల నేఁ కారు మదినిట్లు విటులఁ జూచి
చిత్తజోన్మత్తయై గొల్ల చిన్నెలాఁడి. 104

చ. జిగినెఱ వన్నెకాఁ డెదుటఁ జేరినవేళల ముద్దు గుల్క మె
ల్లఁగ నడవందొడంగు ఘన లౌల్యము చూపులఁజూపి మోహపుం
బిగువునఁ బల్కరింపఁజను బెళ్కుచుఁ బయ్యెద కొంగుదీటుఁ, డె
క్కుగఁ జిఱునవ్వు నవ్వు నొడఁగూడిన సిగ్గున నేఁగునవ్వలన్. 105

తే. ఇట్లు చరియించు నయ్యింతి యెమ్మె లెఱిఁగి
పొరుగుననె యుండెడు నియోగిపుత్రుఁ డొకఁడు
జారశేఖరుఁ డను బ్రహ్మచారి మీఱి
యొంటి పాటైనఁ దెరువులో నొడిసి పట్టి. 106

మ. అసమాలాప మచుంబితాధర మశయ్యాన్యోన్యవిక్రీడితం
బసమాలింగన మస్థిరోత్సవ మధైర్యస్తంబకాంబూలితం
బసుదంతాంక మనిర్భయం బమణికం బస్రస్తనీవ్యాదికం
బసిధారావ్రతమైన చోరరతికార్యం బప్డు సంధించినన్. 107



సీ. చిఱుచెమ్మటలతోడ బెరసిన ఫాలంబు
కసవంటి వీడిన కప్పుఁ గొప్పు
కడురక్తిమము గల్గు గండస్థలంబులు
వెనుకకు దిగజాఱి వ్రేలు సరులు
పులకలు నిండారఁ బొడమిన దేహంబు
ధూళిధూసరితమై దొరయు వీఁపు
మందస్మితంబగు మధురాధరంబును
మందవీక్షణ నమ్రమస్తకంబు
తే. తడఁబడ వడంకుచుండెడు తలిరుఁదొడలు
వదలిన బిగించి సవరించు వలువ దసరఁ
దిరిగి చూచుచుఁ దనయిఁంటి తెరువుఁబట్టి
గొల్లప్రాయంపుఁ జిల్కలకొల్కి చనియె. 108

క. అది మొదలు జారశేఖరుఁ
డొదవిన యపుడెల్ల గొల్ల యుగ్మలి నెంతో
మదనాహవమునఁ దేల్చుచు
మదిమీఱఁగ మరుని లెంకమానిసిఁ జేసెన్. 109

క. చలివిడిచి జారశేఖరు
కలయిక చవిమరఁగి తెరువు కాఁపెట్టుక ని
చ్చలు లేనిపనుల నెన్నే
నలవఱచుకయుండు విరహ మగ్గలమైనన్. 110

ఉ. కమ్మనిజున్ను మంచినెయి గట్టిమీఁగడతోఁ బెరుంగు చొది
క్కమ్మగు జున్నుబాలు చిలుకమ్మిసిఁ దీసిన వెన్నముద్ద వె
చ్చమ్ముల కైదునాల్గుదివసాలకు మాడలముల్లె లిమ్మెయిం
గిమ్ములఁ దెచ్చియిచ్చు రతికిన్ బతిమాలుచుఁ బిల్చు నిచ్చలున్. 111

తే. ఇటుల నజ్జారశేఖరుఁ డేలఁబట్టి
యింటిలోనున్న వస్తువు లెదురువెట్టి
వలపులకుఁజిక్కి కేరడములకుఁ జొక్కి
సంగమసుఖంబు కొన్నాళ్లు జరిపె గన్నె.

ఉ. అంతటఁ బెండ్లిచేసెద మటంచును దత్సతి తల్లిదండ్రు ల
త్యంతమహోత్సవంబునఁ గులాదులతోఁ దగురూపరేఖలన్
గంతునిఁబోలునట్టి మృదుకాయము గల్గినవాని నొక్కశ్రీ
మంతునిఁజూచి తెచ్చిరి కొమార్తె వివాహముఁ జేసి రేంతయున్.

తే. వేగఁ దలఁబ్రాలు గాఁజేసి నాగవల్లి
యైన పిమ్మట నత్తింటి కనుపఁ దలఁచి
పయన మొనరించి నెమ్మదిఁ బ్రమద మలర
ననుఁగుఁ గూఁతును నల్లుని ననిపి రపుడు.

ఉ. దువ్వెన తీరుగాఁ బసపుతో నలరించిన బొట్టు నున్నఁగా
దువ్వినకొప్పు వన్నెగల దుప్పట మొప్పు విడెంబు పుక్కిటన్
మవ్వపుఁబోఁగునూల్ రవల మద్దెలు చేతులఁ బూలగాజులున్
నివ్వటిలంగ గోప హరిణీ తరళేక్షణ పోవ ముందటన్.

సీ. సద్ద్విజరాజ సంశ్రయ మహాస్పదలీల
శాఖలు కకుబంత చయముఁ బ్రాఁక
సాంద్రవర్ణక్రమస్థాయిత్వమున మించు
జట లనంతావాప్తి పటిమ మెఱయ
విష్ణుపదార్పితవిహితవృత్తిఁ దనర్చు
నగ్రముల్ సప్తాశ్వు ననుకరింప
నహిలోకరాడ్భూషణాధారమై యొప్పు
మూలంబు కుండలిముఖ్యు జొరయఁ



తే. దన మహాగమవిఖ్యాతి ధరణిలోన
నఖిలజనులకు నద్భుతం బావహిల్ల
దేటపడఁగాను జూపెడు తెఱఁగు దోఁప
మలసి చూపట్టెఁ బథి నొక్క మఱ్ఱిచెట్టు. 116

క. ఆ వటభూజము చెంగటి
త్రోవను ముందట విభుండు తొయ్యలి వెనుకన్
బోవంగ జారశేఖరుఁ
డావెలఁదికి నెదురుపడియె నంతన్ వేడ్కన్. 117

చ. తమకముఁ బట్టఁజాలక పథంబున ముందరఁబోవు భర్తవి
క్రమముఁ దలంపఁబోక యధికంబగు మోహము నిల్పలేక వే
గమె యెదిరించి వచ్చు నుపకాంతుని వల్లవకాంత తెప్పునన్
గమకముఁజేసి గుబ్బకవ కౌఁగిఁటఁ దార్చి సుఖించె వేడుకన్. 118

తే. బ్రామికలు దీఱ నన్యోన్య భావమూరఁ
గలయికలు జేరఁ దాపాగ్నికణము లాఱ
సౌఖ్యములు మీఱఁ జేష్టలు సరణిఁ దేఱఁ
జెలఁగె నయ్యిద్దఱకు దృఢాశ్లేషణమ్ము. 119

క. ఆయెడ నిజపతి సతి రా
దాయెనని తలంచి మరి తనుఁ జూచినచో
నాయింతి పతికి హితముగ
నే యనువున బొంకవలయు నెఱుఁగింపఁగదే! 120

క. ఆమాడ్కి హంస మడిగిన
హేమాపతి యనియె నెవ్వరిడు నిక్షేపం
బేమఱక వారె కనవలె
నే మనుచున్ దప్పఁదాల్చె నెఱిఁగింపు మనన్. 121



ఉ. హంసహిమాంశుఁ డిట్లనియె, నయ్యళివేణిని భర్తచూడ జా
రాంసమునందు వ్రేలు కులటాంగన దేహము కంపమొంద సా
యం సమయాదిఁ గేకివలె నారట మందుచు, "వీఁపుఁ దట్టుమో
పుంసవరా! " యటంచు విటపుంగవు కర్ణము నాటఁ జెప్పినన్. 122

తే. జార శేఖరుఁ డాగొల్ల సకియనపుడు
వీఁపుఁ దట్టుచు “వెఱవకువే" యటంచుఁ
బలుకరించెడు నంతలోఁ బరువు వాఱి
దాని ప్రియనాయకుఁడు భీతి దాయవచ్చె. 123

క. వచ్చి "యిదియేమి చెలి?" యని
విచ్చలవిడి వీపుఁ జఱచి "వెఱవకు" మని లోఁ
జొచ్చిన భయమున నదరిన,
గచ్చుగ నిట్లనియె గోపకన్యక పతికిన్. 124

ఉ. ముందర నీవుపోవ భయమున్ వెదచల్లెడు నీ వటద్రు సం
క్రందనుఁజూచి గుండెలు వకావకలై వెతఁబొంది యీ దయా
తుందిలు పొందునన్ బ్రతుకు త్రోవకు వచ్చితి లేక యున్న నా
కుం దరి లేక యొంటినిటఁ గుందుదుఁగాదె యనుంగు వల్లభా! 125

క. అని చెప్పి నిజేశ్వరు చే
తను దన మోహంపు విటునిఁ దద్దయుఁ బొగడిం
చి, నళినలోచన వేడుక
దనరారఁగఁ జనియెఁ బతియుఁ దానును సరణిన్. 128

క. అట్టి యుపాయము నీకున్
దట్టిన నృపుపొందు మాటఁదలఁపుము లేదా
గట్టిగ నీమగఁ డెఱిఁగిన
యట్టయినను సిగ్గుచేటు లౌఁగదె చెలియా! 127



ఉ. నావిని హంస పల్కు, వదనంబున హాసము దోఁపఁ బల్కె హే
మావతి "యద్దిరా! మగలమార్చు నెలంతదిగాక యింకఁ గ
దా? వివరించి చూడ వసుధాస్థలిలో" నను నంతలోపలన్
వేవినఁ గేళికాగృహము వేగ చనెన్ నృపమోహమగ్నమై. 128

వ. మఱియు నయ్యహర్ముఖం బప్రకాశమానకావ్యలక్షణంబయ్యును బ్రకాశమానకావ్యలక్షణంబై యనిద్రాళువనాంతరాళపుండరీకసముదయంబయ్యును నిద్రాళువనాంతరాళపుండరీకసముదయంబై యప్రస్ఫుటీకృతకువలయంబయ్యును బ్రస్ఫుటీకృతకువలయంబై యవిభాసమానద్విజరాజంబయ్యును భాసమానద్విజరాజంబై యవిభాసితతారాళిగణంబయ్యును విభాసితతారాళిగణంబై యొప్పె నప్పుడు. 129

క. ఒక నిముసం బొక మాసం
బొక ఘటికయ యొక్క యయన మొక జా మొక యేఁ
డొక దిన మొక కల్పముగా
సకి గడపెన్ బగలు విరహసంతాపమునన్. 130

క. రవియనెడు కాలచక్రము
దివసాంతప్రళయవేళ దీపాగ్నులచే
దివిఁ గాల్చి యడఁగ నమ్మషి
నివహంబన ఘోరతమము నిండెన్ బెలుచన్. 131

వ. అప్పుడు. 132

చ. చందురకావిపావడ పసల్ వెలిఁజిమ్మఁగఁ జల్వగట్టి, కా
లందెలు సందిదండలును హారములున్ మణికుండలమ్ములున్
బొందుగఁ దాల్చి వాసిలెడు పూలసరుల్ కచసీమఁ జుట్టి పొ
ల్పొందఁ గళాస గందవొడిఁ బూసి మృగేక్షణ వచ్చి నిల్చినన్. 133



క. చూచి కలహంస మిట్లను
వాచావైచిత్రి మెఱయ వనితా! చోద్యం
బై చెలువొందిన యొక కథ
యాచించి నృపాలుకేళి కరుగు మటన్నన్. 134

క. ఆ మధురతరసుధారస
సీమాసామోక్తిధార చెవులకు నెంతో
యామోదము చేసిన విని
హేమావతి యడుగ హంస మిట్లని పలికెన్. 135

ఆఱవ రాత్రి కథ

చలిపందిరి బ్రాహ్మణసుందరి తెరువరిఁ గూడుట.

శా. జంబూద్వీపధరారవిందముఖి కంచద్భూషణప్రాయమై
సాంబప్రస్థ మనంగ నొక్కటి మహాస్థానీయ మొప్పారు, ర
మ్యంబై యప్పురిలోన నుండు హరిశర్మాఖ్యుండు విప్రాన్వవా
యంబున్ శోభిలఁజేయు కర్మఠుఁడు కల్యాణాంగి! యాలింపుమా! 136

సీ. బలుకంచు గుబ్బబోర్తలుపులు తీనెల
వాకిలి నడవ చావడియు మగులు
నఖిలవస్తువుల ధాన్యముల కణంజలు
దేవతార్చనమిద్దె తావి పడుక
టిలు వంటకొట్టంబు పలుగాఁడి పసిదొడ్డి
పసపాకుపందిరి బావితోఁట
మడిసంచి దోవతి మడతవ్రేల్దండెంబు
ధమనికుండంబు బృందావనంబు