స్మృతికాలపు స్త్రీలు/ప్రథమాధ్యాయము

స్మృతికాలపు స్త్రీలు

ప్రథమాధ్యాయము

స్త్రీ సంతతి

అన్నదమ్ములు కల కుమార్తెకును నన్నదమ్ములు లేని కుమార్తెకును ధర్మశాస్త్రములలో విశేషభేదము పాటింపబడినది. అన్నదమ్ములు కల కుమార్తెవలన కంటె నన్నదమ్ములులేని కుమార్తెవలన పితృవంశమున కెక్కుడు లాభము గల్గుచున్నది; కుమారుడే విధముగ వంశవర్ధకుడగు చున్నాడో యామెయు నా విధముననే వంశవివర్ధిని కాగలదు. కావుననే యామెకు "పుత్రిక" యని పేరు. అన్నదమ్ములు గల కుమార్తెకు "పుత్రిక" యను నామమెచ్చటను వాడబడలేదు. "సుత", "దుహిత" మున్నగు నామముల చేతనే యామె వ్యవహరింపబడును. ఏమన: పుత్రధర్మ మామెయందు లేదు. పుత్రశబ్ద నిర్వచనము మనుస్మృతిలో నీ క్రింది విధముగ చేయబడినది.

పున్నామ్నో నరకాద్యస్మాత్త్రాయతే పితరంసుతః
తస్మాత్పుత్ర ఇతిప్రోక్తః స్వయమేవ స్వయంభువా.
                                                (మను 9-135)
(తండ్రిని పున్నామ నరకమునుండి రక్షించుచున్నాడు.
కావున పుత్రున కాపేరు స్వయంభువుడు కల్పించినాడు)

అభ్రాత్మకయగు మహిళ వలన కూడ తండ్రి పున్నామ నరకము నుండి రక్షింపబడవచ్చును గావుననే యామెకు "పుత్రిక" యను పేరు వచ్చుచున్నది. ఆమెకీ పుత్రధర్మ మెట్లు వచ్చుచున్నదనగా: అభ్రాతృకన్యను దానము చేయునపుడు తండ్రి వరునితో నీ క్రింది విధముగ చెప్పును.

అభ్రాతృకాం ప్రదాస్యామి తుభ్యం కన్యామలం కృతాం
అస్యాయో జామతే పుత్రస్సమే పుత్రోభవిష్యతి.
                                           (లిభి 5-52)
       (అలం కృతయగు నభ్రాత్వకన్యను నీ కిచ్చుచున్నాను.
ఈమెయందు నీకు గల్గిన పుత్రుడు నా పుత్రుడే యగును)

ఇచ్చత "పుత్రః" అను నేకవచనము చేత ప్రథమపుత్రుడే మాతామహునకు పుత్రుడగునని తెలిసికొనాలెను. తర్వాతి పుత్రులు జనకునకే చెందుదురు. ఈ విధముగ నభ్రాతృదుహిత తన పుత్రుని ద్వారమున తన తండ్రిని పున్నామ నరకము నుండి రక్షించుచున్నది కాననామెకు పుత్రధర్మము గల్గి "పుత్రిక" యను నామ మామె కన్వర్థమగుచున్నది. దుహిత యీ విధముగ పుత్రికయగుచున్నది.

అపుత్రో నే వవిధినాసుతాంకుర్వీతపుత్రికాం,
                                    (మను 9-1127)
(పుత్రులులేనివాడీ విధానముచె కూతును పుత్రికనుగ జేసికొనవలెను.)

ఇట్టి పుత్రిక వలన తండ్రి వంశము వృద్ధియగును. ఈ విధముగ పూర్వ మనేకులు వంశాభివృద్ధిని చేసికొనిరి.

      అనేనతు విధానేనవురా చక్రేథపుత్రికా:

    (పూర్వము దక్షప్రజాపతి తన వంశాభివృద్ధి కొరకీ విధానముచే పుత్రికలను చేసెను; పదిమంది పుత్రికలను యమునకును, పదముగ్గురను కశ్యపునకును, నిరువదియేడ్గురను చంద్రునకును గౌరవించి యిచ్చెను.)

ఇట్టి పుత్రికకు కల్గిన పుత్రుడు తల్లికి ముందుగ పిండమును వేయును; పిమ్మత నామె తండ్రికి వేయును, మూడవా దాని నామె పితామహునకు వేయును. ఈయంశ మీ క్రింది శ్లోకములో చెప్పబడినది.

ఇట్టి దౌహిత్రుని గూర్చి ప్రసంగించుచు మనుస్మృతి యిట్లు చెప్పుచున్నది.

     పౌత్రదౌహిత్రయోర్లోకే విశేషోనోపపద్యతే
     దౌహిత్రోపిహ్యముత్త్రైవం సంతారయతిపౌత్రవత్
                                    (మను. 9- -39)

(పౌత్రదౌహిత్రులకు భేదములేదు. దౌహిత్రుడు గూడ పౌత్రునివలెనే పరలోకములో తరింపచేయగలడు.)

పౌత్ర దౌహిత్రులకుగల యీసమాన ప్రతిపత్తికి గల హేతువును గూడ మనుస్మృతి చెప్పుచున్నది.

తయోర్హిమాతాపిత రౌసంభూతౌతస్యదేహత:
                                     (మను 9-133)

(పౌత్రుని తండ్రియు దౌహిత్రుని తల్లియు నాతని దేహమునుండి పుట్టినవారేగదా!)

మనుస్మృతి యిట్టి హేతువును చెప్పుచున్నను గూడ నపుత్రకుని దౌహిత్రునకు పౌత్రతుల్యత్వము నంగీకరింప జాలకున్నది. పుత్రపౌత్రులు లేనపుడే దౌహిత్రునకీ ప్రాశస్త్యము నంగీకరించుచున్నది.

దౌహిత్ర ఏవచహరే దపుత్ర స్యాఖిలంధనం
                                        (9-181)

(అపుత్రకుని ధనమునంతను దౌహిత్రుడు హరించును)

సపుత్రకుని ధనములో నన్ననో దౌహిత్రునకు పాలే లేదు (స్త్రీధనము, అను ప్రకరణమును జూడనగును.) అట్లే

పుత్రేణ దుహితాసమా.
                       (9-130)

(కుమారునితో కుమార్తె సమురాలు)

అని యంగీకరించుచున్న మనుస్మృతి పుత్రులుగల వాని యాస్తిలో కుమార్తెకు భాగము నంగీకరించుటలేదు. (స్త్రీథనము, అను ప్రకరణము చూడనగును) కాని యపుత్రకుని ధనము నామెయే కాని మఱొకరు పొందజాలరని చెప్పుచున్నది.

తస్యాత్మనితిష్ఠన్త్యాం కథమన్యోధనం హరేత్
                                    (మను 9-130)

(ఆతని రూపమే యైయున్న, యాతనికుమార్తె యుండగా మఱొకడెట్లు ధనము హరించును?)

సపుత్రకుని ధనములో కుమార్తెకు భాగమేలేదను సంశమునకై 'స్త్రీధన'మను ప్రకరణము చూడవచ్చును.

పుత్రులు లేనపుడే కుమార్తెకును నామె పుత్రునకును నిట్టి ప్రాముఖ్యము కలదుగాని పుత్రులున్నచో లేదను నంశము ప్రధానమైనది. నారదుడు కూడ

పుత్రాభా వేతుదుహితాతుల్య సంతాన కారణాత్
పుత్రశ్చ దుహితాచో భౌపితుస్సంతాన కారకౌ

(కుమారుడు లేనపుడు కూతురాతనివలెనే సంతాన కారకురాలు గాన నాతని స్థానముననుండును. పుత్రుడును కుమార్తెయు కూడ తండ్రి సంతానకారకులే కదా!)

కావుననే స్మృతులలో పుత్రప్రాప్తియే ముఖ్యముగ ప్రశంసింపబడినది.

పుత్రాన్దేహి ధనం దేహి
                                              (యాజ్ఞ 1-201)

(కుమాళ్లనిమ్ము ధనమునిమ్ము)

పుత్రేణ లోకాన్ జయతి పౌత్రేణానంత్యమశ్ను తే

అథ పుత్రిస్య పౌత్రేణ బ్ర్ధ్నస్యాప్నోతి విష్టవం

(మను 9-137)

(పుత్రునిచేత లోకములను జయించుచున్నాడు. పౌత్రునిచే నావంశ్యము నొందుచున్నాడు. పుత్రుని పౌత్రునిచే సూర్యమండలము పొందుచున్నాడు.)

అంతియే కాదు, పుత్రులనుకనక కేవలము స్త్రీలనే కనుచున్న భార్యను పదేండ్లుచూచి పదునొకండవయేట మఱొక భార్యను చేసికొనవలెనని మనుస్మృతి స్పష్టముగ చెప్పుచున్నది.

(పునర్వివాహమను నధ్యాయము చూడుడు)

ఆడపిల్ల మఱొకని గోత్రములోనికి పోవుటయు మఱొకని సొత్తగుటయు ('దాంపత్యము' చూడుడు) మున్నగు నెన్నియో హేతువులవలన స్త్రీపురుష సంతతులపట్ల నీదృక్పథ భేదము బయలు దేరినది. అయినను పుత్రులు లేనపుడాస్థానము నాక్రమించుటకు కుమార్తె యర్హురాలనుట సహజముగనే యున్నది కాని స్వయముగ తనకు జన్మించిన కుమార్తెవలన గాక యామెకు జన్మించిన కుమారునివలన నే పురుషుడు తరించునని స్మృతులు చెప్పుచుండుటచే నవి స్త్రీ సంతతికంటె పురుషసంతతియొక్క ప్రాధాన్యము నెంత హెచ్చుగ నంగీకరించినవో స్పష్టమగుచున్నది. వసిష్ఠుడు మాత్రము పుత్రికకే ద్వాదశ పుత్రులలో మూడవస్థానము నొసగుచున్నాడు.

"తృతీయ:పుత్రికా'

(27-15)

కాని యిట నామె కౌరసునితొ సమాన ప్రతిపత్తి లేదు. యాజ్ఞవల్క్యుడు మనువువలెనే పుత్రికాపుత్రునకే పుత్రతుల్యత్వము నంగీకరించుచు

ఔరసోధర్మపత్నీజ: తత్పమ: పుత్రికాసుత: (2-126)

(ధర్మపత్నివలన పుట్టినవా డౌరసుడు. పుత్రికాపుత్రు డామెతో సమానుడు) అని చెప్పియున్నాడు.

పైన తెల్పబడిన విధముగ కుమార్తెను పుత్రికనుగచేసి కొనుటకు పుత్రికాకరణమని పేరు. అదిమూడు విధములుగ జరుగ వచ్చునని స్మృతికారులభిప్రాయ పడుచున్నారు.

(1) గౌతమధర్మసూత్రమీవిధముగ చెప్పుచున్నది;

పితోత్పృజేత్పుత్రికామనపత్యో గ్నింప్రజాపతించేష్ట్వా స్మదర్థమపత్యమి తిసంవాద్య

(గౌతమ 38-18)

(పుత్రహీనుడు ప్రజాపతికిని నగ్నికిని హోమముచేసి యీమె పుత్రుడు నాకొఱకగునని చెప్పి యామెనుదానము చేయవలెను.)

(2) ఇట్లగ్నిసాక్షిగ కాకపోయినను నోటిమాటచేతనైనను నీనియమము చేసి కొనవచ్చునని కొందఱిమతమని గౌతమ ధర్మసూత్రమే చెప్పుచున్నది. అభిసంధిమాత్రాత్పుత్రికేత్యేకే

(గౌతమ: 29-19)

(3) నోటిమాటచేత నియమములేకున్ననుగూడ సభ్రాతృకన్య పుత్రికయే కావచ్చునని కొన్ని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. ఇచటకన్యాదాత యభిప్రాయమేకాని వరుని సమ్మతి యవశ్యముకాదు. కావుననే పుత్రికాకరణము ప్రత్యక్షముగ జరుగకున్ననుకూడ సభ్రాతృకన్యను వివాహమాడరాదని చెప్పబడినది

తత్సంశయాన్నోపయచ్ఛేదభ్రాతృకాం

(గౌ ఎమ,29-30)

(పుత్రికగ పరిగణింపబడు నేమోయనుభయముచే సభ్రాతృకన్యను వివాహమాడరాదు.)

లిఖితస్మృతియు మనుస్మృతియుకూడ నీయభిప్రాయమునే యీక్రిందివిధముగ వెల్లడించినవి.

యస్యాస్తుస వేదభ్రాతా సవిజ్ఞాయేత వాపితా

నోపయాచ్ఛేతతాం ప్రాజ్ఞ: పుత్రికాకర్మశంకయా

(లిఖిత 8-51)

యస్యాస్తుసభవేద్ర్భాతా నవిజ్ఞాయేతవాపితా

నోపయచ్ఛేతతాంప్రాజ్ఞ:పుత్రికాధర్మశంకయా

(మను 3-11)

భ్రాతృహీనమగు స్త్రీసంతతినిగూర్చి యింతవఱకును విచారించితిమి. ఇక భ్రాతృసహితమగు స్త్రీసంతతివలని ప్రయోజనముల నించుకపరికింతము. ఇట్లుచూచిననుగూడ నాడుపిల్ల గలవాడు పుణ్యాత్ముడనియే స్మృతులయభిప్రాయము. కన్యాదానమాత్రముచేతనే తండ్రియునాతని పితృదేవతలును తరించు చున్నారని యర్వాచీనగ్రంథములలో చెప్పబడినది. మఱియు (పుత్రిక కాని) సామాస్యదుహితయొక్క కుమారుడుకూడ మాతామహుని యాతనిపితురులను మిక్కిలి సంతుష్టులను చేయగలడని స్మృతులలో తెల్పబడినది. కన్యాధానఫలము శేషధర్మములలో నీక్రిందివిధముగ తెల్పబడినది:

   సురూపాయ కులీనాయ సుశీలాయహ్యగోగిణే
   కన్యాందద్యా చ్ఛుభాన్లోకాన్లభతే నాత్రసంశయ:
   సుశ్రుతాయ దరిద్రాయ శ్రోత్రియస్యాత్మ జాయచ
   యోదద్యాచ్చ స్వకాంకన్యాం బ్రహ్మలోకంస గచ్ఛతి
                       (శేషధర్మము 8 అధ్యా, 6, 7.)
  
   విష్ణువాయన సంక్రాంతౌ చంద్రసూర్యోపరాగయో:
   పుణ్యక్షేత్రే పుణ్యతీర్థే కన్యాదో మోక్ష మశ్నుతే
   పిట్ర్ దేవగణా స్తవ్య భవంతి హిసుపూజితా:
   గంధర్వైస్తూయ మానాన్తే ప్రయాంతి మమమందిరం
                       (శేషధ. 8-9.10)

(మంచి రూపకుల శీలారోగ్యములు గలవానికి కన్య నిచ్చినవానికి శుభలోకములు లభించుటలో సందేహములేదు. వేదము చదువుకొనినట్టియు, దరిద్రుడైనట్టియు శ్రోత్రియ పుత్రునకు తన కన్యనిచ్చువాడు బ్రహ్మలోకమును పొందును. సంక్రాంతియందును, సూర్య చంద్రగ్రహణములందును, పుణ్య క్షేత్రమందును, పుణ్యతీర్థమందును కన్యను దానము చేయువాడు మోక్షము నొందును. అతని పితృదేవ గణములు బాగుగ పూజింపబడిన వగుచున్నవి. ఆగణములు గంధర్వుల చేత స్తుతింపబడుచున్నవైనా (విష్ణుని) మందిరమునకు వచ్చును.

యాజుషస్మార్తాను క్రమణిణిలో గూడ కన్యాదాన ఫలము పేర్కొనబడినది.

దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగిషయా

(బ్రహ్మలోక కాంక్షతో విష్ణుస్వరూపుడవగు నీకు కన్యనిచ్చుచున్నాను.)

త్వద్దానాన్మోక్ష మావ్నుయాం

(ఓకన్యా, నిన్ను దానము చేయుటచే మోక్షము నొందగలను)

కన్యామిమాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై

(పితృదేవతలు తరించుటకై యీ కన్యను దానము చేయుచున్నాను.)

మహాసంకల్పములో పారవశ్యముతో వినుతింపబడిన కన్యాదాన మహాఫలము తెలియుటకై యందుండి కొన్ని భాగముల నిచ్చుచున్నాడను.

తిలై:స్సూర్య మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాప కర్షక్రమేణ సర్వరాశ్యపకర్ష సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం......త్రిగుణీకృతా గ్నిష్టో మాతిరాత్రాప్తోర్యామ సాంతపన వాజిపేయ పౌండరీ కాశ్వమేధాది శతక్రతు పుణ్యఫలా వాప్త్యర్థం మయాసహదశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితౄణాం నరకాదు త్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం.....సాలంకృత కన్యాదానం......కరిష్యే.

(సూర్య మండలము వఱకును నువ్వులను, ప్రోగువేసి యందుండి వేయిసంవత్సరముల కొకగింజను తీసివైచు చుండినచో నెంతకాలము కాప్రోగు పూర్తిగ తీయబడునో యంత కాలము బ్రహ్మలోకములో నుండుటకును, త్రిగుణీకృతాగ్నిష్టో మాతిరాత్రాప్తోర్యామ సాంతపవ వాజిపేయ పౌండరీ కాశ్వమేధాధి శతక్రతు పుణ్యఫలము గల్గుట కొఱకును, మావంశమునందును మాతృవంశమునందును నాతోకూడ పది తరముల పై వారును పదితరముల క్రిందివారునునగు పితరులు నరకమునుండి లేచి శాశ్వత బ్రహ్మలోక నివాసమును పొందుటకును.......సాలంకృత కన్యాదానమును చేయుచున్నాను.)

ఇంత యత్యుక్తులతో గాకున్నను సంవర్తస్మృతి కన్యాదానమున కీ క్రింది ఫలమును జెప్పుచున్నది.


    అలంకృత్యతుయ: కన్యాం పరాయసదృశాయవై
    బ్రాహ్మేణవిహాహేన దద్యాత్తాన్తుసు పూజితాం
    సకన్యాయా: ప్రచానేనశ్రేయోవిందతి పుష్కలం
    సాథువాదం లభేత్సద్భి:కీర్తిం ప్రాప్నోతిపుష్కలాం

    జ్యోతిష్టోమాదిపత్రాణాంశతం శతగుణీకృతం
    ప్రాప్నోతిపూరుషోదత్త్వాహోమమంత్రైస్తు సంస్కృతాం
    అలంకృత్యపితాకన్యాం భూషణాచ్ఛాదనాపనై:
    దత్వాస్వర్గమవాప్నోతి పూజితస్తు సురాదిషు.

(సంవర్త. 61, 62, 63, 64)

(అలంకరించిన కన్యను బ్రాహ్మవివాహముచేత తగిన వరునకిచ్చుచో వాడు మిక్కిలి శ్రేయస్సును, కీర్తిని, సజ్జనవస్తుతిని పొందును; జ్యోతిష్టోమాదియాగముల ఫలమునకు నూరు రెట్లు ఫలము నొందును. హోమమంత్రములచే సంస్కరింప బడిన కన్యను భూషణచ్ఛాదనాసనములచే నలంకరించి యిచ్చువాడు స్వర్గమునొంది దేవతలలో పూజింపబడును.)

కుమార్తె తనతండ్రికిని నాతని వంశమునకును నెంత మహోపకారిణి కాగలచో పైన నుల్లేఖింపబడిన వాక్యములను బట్టి స్పష్టము కాగలదు. స్మృతికారులు స్త్రీ సంతతి కెంత ప్రాశస్త్యమును గల్పించినారో యిట్టివాక్యములవలన స్పష్టమగుచున్నది.

కుమార్తె కేవలము తానేకాక తన సంతతిద్వారమున గూడ పితృవంశమునకు మహోపకృతి సల్పుచున్నది. ఏమన: సామాన్యుడగు (పుత్రికా పుత్రుడుకాని) దౌహిత్రునిమూలమున గూడ మాతామహుని వంశము తరించుచున్నదని స్మృతుల యభిప్రాయము. దౌహిత్రుడనిన పితృదేవతల కెంతయో ప్రీతియట! శ్రాద్ధములో నాతని భుజింపజేసినచో వారు పర మతృప్తులగుదురట! శ్రాద్దమునకు కుతుపకాలము, తిలలు నెట్లు కావలెనో దౌహిత్రుడుకూడ నట్లే కావలెనట!

త్రీణ్యేతాని పవిత్రాణి దౌహిత్ర:కుతపస్తిలా:

(వసిష్ఠ: 1-35)

(దౌహిత్రుడు, కుతపకాలము, తిలలు - ఈమూడును శ్రాద్ధమునకుపవిత్రములు.)

కావుననే బ్రహ్మచర్యవ్రతములోనున్నను దౌహిత్రుని భోక్తగనియమింపవలెనను నియమముగలదు.

వ్రతస్థమపి దౌహిత్రంశ్రాద్ధేయ త్నేసభోజయేత్

(మను 3-234)

నిత్యమునుదకదానము చేయుటచేగూడ దౌహిత్రుడు మాతామహవంశ్యులలో ప్రేతులైనవారికి సేవకుడగుచున్నాడు.

ఏవంమాతామహాచార్య ప్రేతానాముదకక్రియా

(యాజ్ఞప్రాకాం. 4)

(సపిండులకువలెనే మాతామహుకును నాచార్యులకును నుదకదానము చేయవలెను.)

దౌహిత్రునివలన తనవంశమునకిట్టి ప్రయోజనముగల్గును గావున నే కన్యాదాత కన్యనిచ్చునపుడితర దానములలో వలె 'సమమ' 'ఇదినాదికాదు' యని చెప్పడు. అట్లుచెప్పుచో దత్తవస్తువుయొక్క ఫలమగు దౌహిత్రునివలన నాతడును నాతని వంశీయులును ప్రయోజనములనొందుటకు వీలుండక పోయెడివి. స్త్రీసంతతిపట్ల స్మృతులదృక్పధము నింతవఱకును జూచితిమి. ఇక స్త్రీసంతతియొక్క యుత్పత్తినిగూర్చి స్మృతికారులకుగల రెండభిప్రాయముల నిటతెల్పుట యప్రస్తుతము కాదు.

పురుషుని శుక్రాదిక్యముచే పురుషసంతతియు, స్తీ శోణితాధిక్యముచే స్త్రీసంతతియు గల్గునని మనుస్మృతి చెప్పుచున్నది.

పుమా-- సోథి కేశుక్రే స్త్రీభవశ్యధి కేస్త్రియా:

(మను 8-49)

కుమారునిలో తండ్రియంశమును కుమార్తెలో తల్లి యంశమును విశేషముగ నుండుటచేతనే వసిష్ఠుడు పతితుడైన పురుషునకు పతితురాలుకాని స్త్రీయందు జన్మించిన పుత్రుడే పతితుడగును. కాని కుమార్తె పతితురాలుకాదని చెప్పినాడు.

పతితేనోత్సన్న: పతితో భవతి అన్యత్రస్త్రియా:

(వసి 18-51)

(పతితుని స్త్రీకంటె నితరమగు సంతతి పతితమగు చున్నది)

మఱియు ఋతుకాలములో సరిసంఖ్యగల రాత్రులందు పురుషుడను బేసిసంఖ్యగల రాత్రులందు స్త్రీయును గర్భములో ప్రవేశించునని యీ క్రింది శ్లోకము చెప్పుచున్నది.

యుగ్మాసుపుత్రాజాయంతే స్త్రియోయుగ్మానురాత్రషు

(మను 3-48)
__________