స్మృతికాలపు స్త్రీలు/నవమాధ్యాయము

స్మృతికాలపు స్త్రీలు

నవమాధ్యాయము

గౌరవము, స్వాతంత్య్రము

దాంపత్యము, కర్మకాండ, ధనము మున్నగు వంశములలో స్త్రీలకెట్టి స్థానమును స్మృతు లంగీకరించుచున్నవో యిదివరలో చూచియుంటిమి. కాన వారి గౌరవ స్వాతంత్య్రములు గూడ కొంతవఱకు మనకు వ్యక్తములైనవి. స్త్రీల గౌరవస్వాతంత్య్ర విషయములలో పూర్వాధ్యాయములలో పేర్కొనబడని యంశములను పేర్కొనబడినవానిలో ముఖ్యములగు వానిని నీయధ్యాయమున పరిశీలింతము.

జీవితములోని వివిధసందర్భములలో వివిధపరిమాణములుగల గౌరవము స్త్రీల కంగీకరింపబడినట్లే వివిధపదవులలోనుండు స్త్రీలకు గూడ వివిధపరిమాణములుగల గౌరవ మంగీకరింపబడినవి. అనగా తల్లికొక విధమగు గౌరవమును, భార్యకొక విధమగు గౌరవమును, కూతునకొకవిధమగు గౌరవమును వితంతువునకొక విధమగు గౌరవమును ఇట్లే యొక్కొక స్థానములోనున్న స్త్రీకొకవిధమగు గౌరవమును నంగీకరింపబడినవి. అందందఱికంటె మాతకు చూపబడిన గౌరవము సర్వాధికమై యొప్పుచున్నది. తల్లి, తండ్రి, గురువునను మువ్వురపైనను భక్తిగల్గి యుండుట పరమధర్మము.

    ఇమంలోకంమాతృభక్త్యా పితృభక్త్యాతుమధ్యమం
    గురుశుశ్రూషయాత్వేవ బ్రహ్మలోకం సమశ్నుతే
(మను 2-233)

(ఈలోకమును మాతృభక్తిచేతను మధ్యమ లోకమును పితృభక్తిచేతను బ్రహ్మలోకమును గురుశుశ్రూషచేతను పొంద వచ్చును.)

    తఏవత్రయోలోకాస్తఏవ త్రయఆశ్రమాః
    తఏవత్రయోవేదాస్తఏవోక్తా స్త్రయోగ్నయః
(మను2-230)

(తల్లి, తండ్రి, గురువునను వారలే మూడు లోకములు, వారే మూడాశ్రమములు, వారే మూడు వేదములు, వారే మూడగ్నులు.)

ఈమువ్వురిలోను గూడ మాతయే హెచ్చుగ పూజ్యురాలు.

    ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాంశతంపితా
    సహస్రంతుపితౄన్మాతా గౌరవేణాతిరిచ్యతే
(మను 2-145)

(పదిమంది యుపాధ్యాయులకంటె నొక యాచార్యుడు హెచ్చు గౌరవార్హుడు. నూరుమంది యాచార్యులకంటె తండ్రిహెచ్చుగ పూజ్యుడు. తండ్రికంటె వేయిరెట్లు తల్లి యెక్కుడు పూజ్యురాలు.)

తల్లికిమించిన దైవములేదని యుశనస్మృతి చెప్పుచున్నది.

నాస్తిమాతృసమందైవం

(ఉశన: 1-36)

(తల్లితో సమానమైన దైవములేదు.)

ఆచార్యుడు, తండ్రి, తల్లి యనువారలలో నాచార్యుడే హెచ్చుగ పూజ్యుడని కొన్ని స్మృతులు చెప్పుచున్నవి.

ఆచార్యఃశ్రేష్ఠో గురుణాం

(గౌ. 2-56)

కొందఱిమతములో తల్లియే యెక్కుడు పూజ్యురాలను నంశమునుగూడ గౌతము డంగీకరించుచున్నాడు.

మాతేత్యేకేమాతేత్యేకే

(గౌ. 2-57)

అనగా నీలోకములో గౌరవింప తగినవారిలో తల్లియే ప్రథమురాలనియు నీయంశము నంగీకరింపనివారి మతములో గూడ తల్లి గౌరవములో ద్వితీయస్థానము నలంకరించు చున్నదనియు తేలుచున్నది. తలిదండ్రులిద్దరిలో తల్లియే యధికురాలని కూడ స్పష్టమైనది.

మాతయే శిశుజనమునకు హెచ్చు బాధపడునదియు, శిశుపోషణమునకుకూడ హెచ్చు కారకురాలగుటయు నిందులకు కారణమై యుండవచ్చును.

యథామాతరమా శ్రిత్యసర్వే జీవన్తిజన్తవః

(వసిష్ఠ 8-16) (తల్లి ననుసరించి సమస్త జంతువులు జీవించునట్లు)

అను నొక యుపమానము వసిష్ఠస్మృతిలో వాడబడినది. తల్లి భరించునది కావునను భౌతికదేహమున కామె కారకురాలగుచున్నది. కావునను నామె భూదేవియొక్క రూపమని చెప్పబడినది. మఱియు సహనభావములో గూడ మాత పృథివిని పోలుచున్నది.

మాతామూర్తిఃపృథివ్యాస్తు

(మను. 2-225)

(తల్లి పృథివియొక్క మూర్తి)

అట్టి జీవహేతువైన తల్లిని పోషింపవలసిన విథి పుత్రునిపై గలదు. మనుస్మృతి పదునొకండవ యధ్యాయమున నుపపాతకములను జెప్పుచు.

గురుమాతృ పితృ త్యాగః

(మను 11-59)

అని గురుమాతృ పితృత్యాగమును గూడ నందుచేర్చినది. నూరు సంవత్సరములు సేవచేసినను తలిదండ్రుల ఋణము తీరదని మనుస్మృతి చెప్పుచున్నది.

     యంమాతాపితరౌ కౌక్లేశం సహేతే సంభవేనృణాం
     నతస్యనిష్కృతి శ్శక్యాకర్తుం వర్షశతైరపి
(మను. 2-227)

అవసరమగుచో నిత్యకర్మలను వదలియైనను తలిదండ్రులను సేవింపవలెను. అంతేకాదు. వారి యనుజ్ఞ లేనిదే ధర్మ కార్యములను జేయరాదు. నతాభ్యామననుజ్ఞాతో ధర్మమేవ సమాచరేత్

(ఉనశ:1-36)

వర్జయిత్వాముక్తిఫలం నిత్యనైమిత్తికం తథా

(ఉశన: 1-37)

ఒక విశేషమేమన: తండ్రి పతితుడైనచో కుమారు డాతనిపట్ల భక్తి చూపనక్కర లేదు. కాని తల్లి పతితురాలైనను కుమారు డామెపట్ల భక్తి చూపవలసినదే. తల్లి దోషములను గూర్చి చింతించుటకైనను కుమారున కధికారములేదు.

పతితః పితా పరిత్యాజ్యో మాతాతుపుత్రేనపతతి

(వసిష్ఠ. 13-47)

(పతితుడైన తండ్రిని వదలివేయవలెను. తల్లి యన్ననో పుత్రునిదృష్టిలో నెన్నడును పతితురాలు కాదు.)

తలితండ్రులపట్ల నిట్లు గౌరవము కన్పఱుపవలసిన విధి పుత్రునకే చెప్పబడినది కాని కుమార్తెకు కాదు.. స్త్రీ కందఱ కంటెను భర్తయే యెక్కువవాడు.

పతిరేకః ప్రభుః స్త్రీణాం

(భర్త యొక్కడే స్త్రీకి ప్రభువు)

స్త్రీభిర్భర్తృవచః కార్యమేషధర్మః పరస్త్రియాః

(స్త్రీకి భర్తృవచనమును పాటించుటకంటెను నెక్కుడు ధర్మము లేదు.) మున్నగు నంశములను దాంపత్యమను ప్రకరణమున చూచియే యుంటిమి.

పురుషునకు తల్లియే కాక మఱికొందరు స్త్రీలు గూడ గౌరవార్హలు గలరు.

   మాతామాతా మహీగుర్వీపితృమాతృష్వస్రాదయః
   శ్వశ్రూః పితామహి జ్యేష్ఠాజ్ఞాతవ్యా గురవః స్త్రియః
(ఉశన: 1-26)

(తల్లి, మాతామహి, గురుభార్య, తలిదండ్రుల యక్క చెల్లెండ్రు, అత్తగారు, నాయనమ్మ, అక్క- అను స్త్రీలు గురువులు)

గురుభార్య గురువువలెనే పూజ్యురాలు.

    గురువత్ప్రతిపూజ్యాశ్చ సవర్ణాగురుయోషితః
    అసవర్ణాస్తు సంపూజ్యాః ప్రత్యుత్థానాభివాదనైః
(ఉశన: 2-27)

(సవర్ణలైన గురుభార్యలు గురువువలెనే పూజింపతగిన వారు. అసవర్ణలన్ననో యెదురేగుట నమస్కరించుట మున్నగువానిచే పూజింపతగిన వారు.)

గురువునకువలెనే గురుపత్నులకు గూడ పాదములను బట్టి నమస్కరింపవలెను. కాని యౌవనములో నున్న గురుపత్ని యొక్క పాదములను తాకకుండా భూమిమీదనే యభివాదము చేయవలెను.

    కామంతు గురుపత్నీనాం యువతీనాం యువాభువి
    విధివద్వందనం కుర్యాదసావహమితి బ్రువన్.
(మను. 2-216)

నైష్ఠికబ్రహ్మచారి గురువుచనిపోయిన పిమ్మట గురుభార్యకు శుశ్రూషచేయవలెను.

గురుదారేనపిండే వాగురు వద్వృత్తిమాచరేత్.

(మను. 2-247)

ఆడపడుచులకు గూడ గృహములో గొప్ప గౌరవ మీయబడినది.

    జామయోయా నిగేహాని శవంత్యవ్రతపూజితాః
    తానికృత్యాహ తానీవ వినశ్యన్తి నమంతతః
(మను. 3-58)

(ఎవరి యక్కచెల్లెండ్రు పూజింపబడని వారై శపింతురో వారిగృహములు దయ్యము చేత కొట్టబడినవివలె నశించును)

సౌభాగ్యవంతురాండ్రగు నింటి యాడపడుచులకును గర్భిణులకును నతిథులకు కంటెనుగూడ ముందుగ భోజనము పెట్టవలెను.

    సువాసినీః కుమారీశ్చరోగిణో గర్భిణీస్త్రియః
    అతిథిభ్యోగ్రఏవైతాన్ భోజయేదవిచారయన్.
(మను. 3-114)

గర్భిణిరేవు నావను దాటునపుడామె యొద్దనేమియు తీసికొనరాదని కూడ చెప్పబడినది.

    గర్భిణీతు ద్విమాసాది స్తథా ప్రవ్రజితోమునిః
    బ్రాహ్మణోలింగి నశ్చైవనదాప్యా త్రీరికంతరే.
(మను. 8-407)

గర్భిణికిట్టి పూజ్యత గలదనుట కిట్టి యుదాహరణము లెన్నియోకలవు.

గర్భిణి కోరికలను మన్నింపవలెను.

     దోహదస్యా ప్రదానేన గర్భోదోష మవాప్నుయాత్
     వైరూప్యం మరణంవాపి తస్మాత్కార్యం ప్రియంస్త్రియాః
(యాజ్ఞ 2-79)

(గర్భిణి వాంఛను తీర్పనిచో గర్భము దోషమును, వైరూప్యమును, మరణమును పొందును కాన నామె యభీష్టము నెరవేర్పవలెను.)

గర్భిణి యేదైన తప్పుచేసినను నామెను మాటలతో మందలింపవలసినదే కాని యంతకంటెను నామెను శిక్షింప రాదు.

    ఆపద్ధతో థవావృద్ధోగర్భిణీ బాలఏవవా
    పరిభాషణమర్హంతి తచ్చశోద్ధ్యమితిస్థితిః
(మను. 9-283)

సాధారణ స్త్రీలకుగూడ దండనపురుషులకు కంటె తక్కువగనే చెప్పబడినది.

     స్త్రీబాలోన్మత్తవృద్ధానాం దరిద్రాణాంచ రోగిణాం
     శిఫావిదలరజ్జ్వాద్యైర్వి దద్యాన్నృపతిర్దమం.
(మను. 91-23)

(స్త్రీలు, బాలురు, పిచ్చివారు, వృద్ధులు, దరిద్రులు, రోగులు - వీరు తప్పుచేయుచో రాజు వేళ్లు, బద్దలు, త్రాళ్లు మున్నగువానితో కొట్టింపవలెను)

స్త్రీలయందతి కోపము చూపరాదని పరాశరుడు చెప్పుచున్నాడు.

స్త్రీ బాల నృవగోవిప్రేష్వతికోపం విసర్జయేత్

(పరాశర. 9-61)

సాధారణముగ స్త్రీలందఱును పూజింపతగినవారే.

    భర్తృభ్రాతృపితృ జ్ఞాతిశ్వశ్రూశ్వశురదేవరైః
    బంధుభిశ్చస్త్రియః పూజ్యాభూషణాచ్ఛాదనాశనైః
(యాజ్ఞ. 1-88)

(భర్తలు, భ్రాతలు, తండ్రులు, జ్ఞాతులు, మామలు, అత్తలు, మఱదులు, బంధువులు గూడ స్త్రీలను భూషణములతోను, భోజనములతోను, వస్త్రములతోను పూజింపవలెను.)

స్త్రీలు దేవతలవలె పూజింపతగినవారు. వారు పూజింపబడనిచోట దేవతలుగూడ సంతోషింపరు.

    యత్రనార్యస్తుపూజ్యన్తే రమన్తే తత్రదేవతాః
    యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రాఫలాఃక్రియాః
(మను. 3-56)

(స్త్రీలెచట పూజింపబడుచున్నారో దేవతలచట క్రీడింతురు. స్త్రీలెచట పూజింపబడరో యచట జరుగుక్రియలన్నియు నిష్పలములే యగును.) స్త్రీలను పలుకరించుటలో గూడ గౌరవమును గన్పఱుపవలెను.

    పరపత్నీతుయా స్త్రీస్యాదసంబంధాచయోనితః
    తాంబ్రూయాద్భవతిత్యేవం సుభగేభగినీతిచ
(మను. 2-129)

(రక్తబంధుత్వములేనట్టియు, పరునిభార్యయైనట్టియు స్త్రీని 'భవతి' పూజ్యురాలా - 'సుభగే' - సౌభాగ్యవంతు రాలా 'భగిని' - సోదరీ - యని సంబోధింపవలెను.)

మార్గమధ్యమున స్త్రీ యెదురగుచో పురుషుడు ప్రక్కకు తప్పుకొని యామెకు దారి యొసగునట్టి గౌరవము చేయవలెను.

వథూస్న్యాతకరాజభ్యః పథోవదనం

(గౌ. 6-24)

(స్త్రీకిని స్నాతకునకును రాజునకును మార్గము నీయవలెను.)

స్త్రీ కుపనయనము లేకపోవుటచే నామెకు బ్రహ్మణ్యసిద్ధి లేకపోవుటచే కాబోలు నామె బ్రాహ్మణవర్ణములో జన్మించినను బ్రాహ్మణ పురుషునకు గల పవిత్రత, ప్రాముఖ్యము నామె కంగీకరింపబడలేదు. బ్రాహ్మణుని చంపినచో మహాపాతకము వచ్చుననియు నది పతన హేతువనియు చెప్పబడినది. కాని బ్రాహ్మణ స్త్రీని చంపినచో నట్టిపాపము రాదు. కాని ఋతుస్నాతను జంపుచో నట్టిపాపమే వచ్చును. ఆత్రేయీం చస్త్రియం

(ఆ.ధ.సూ. 1-24-9)

సామాన్య బ్రాహ్మణస్త్రీని చంపుచో క్షత్రియాదులను జంపునపుడు వచ్చు పాతకమే వచ్చును.

స్త్రీశూద్రవిట్ క్షత్రవధోనాస్తిక్యంచో పపాతకం

(మను. 11-66)

పురుషశిశువును గర్భమున ధరించుటకు తగిన స్థితిలో నున్నది కావుననే యాత్రేయి యెక్కుడు నహంతవ్యురాలని తోచుచున్నది. ఈయంశ మీక్రింది సూత్రమువలన స్ఫురించు చున్నది.

గర్భంచతస్యావిజ్ఞాతం

(ఆ.ధ. 1-24-8)

(బ్రాహ్మణగర్భము స్త్రీ పున్న పుంసకభేదము స్పష్టము కాకుండ చంపబడినను బ్రహ్మహత్యాదోషమే వచ్చును.)

ఆగర్భము పురుషుడగుట కవకాశమున్నది కావున నా యవకాశము ననుసరించియే యాదోషమునకు ప్రాబల్యము వచ్చినది.

స్త్రీ పురుషుల కిట్టిభేదము చాలవిషయములలో నంగీకరింపబడినది. బ్రాహ్మణుని యుచ్ఛిష్టము దినవచ్చును గాని స్త్రీ యొక్కయు ననుపనీతుని యొక్కయు నుచ్ఛిష్టము తినరాదు. స్త్రీణామనుపేతస్యచోచ్ఛిష్టం వర్జయేత్

(ఆ.ధ. 2-5-7)

స్మృతులలో స్త్రీలకు గౌరవ మంగీకరింపబడినదే కాని స్వాతంత్య్ర మంగీకరింపబడలేదు. ఎట్టి స్త్రీయు గూడ స్వాతంత్య్రము పొందరాదని స్మృతులు చెప్పుచున్నవి. బాల్యమున తండ్రి చెప్పుచేతలలోను, యౌవనమున భర్త చెప్పుచేతలలోను, వార్ధకమున (భర్త మరణించినపుడు గాని వానప్రస్థుడైనపుడు గాని) కుమారుని చెప్పుచేతలలోను నుండవలెను.)

    బాల్యేపితుర్వశేతిష్ఠేత్ప్రాణి గ్రాహస్యయౌవనే
    పుత్రాణాం భర్తరిప్రేతేనభజేత్ స్త్రీస్వతంత్రతాం
(మను. 3-148)

కాన గృహకృత్యములలో గూడ స్త్రీలు స్వతంత్రలై యేపనియు చేయరాదు.

    బాలయా వాయువత్సావావృద్ధయావాపియోషితా
    నస్వాతంత్య్రేణకర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి
(మను. 3-147)

(బాల కాని యువతి కాని వృద్ధ కాని గృహములో గూడ దేనిని స్వాతంత్య్రముతో చేయరాదు.)

బాల్యమున తండ్రిని యౌవనమున భర్తను వార్ధకమున పుత్రులను వదలి యుండుటకు స్త్రీ యెన్నడును కోరరాదు. వారితో విరహము పొందు స్త్రీ రెండు కులములను గర్హ్యములనుగ జేయును.

     పిత్రాభర్త్రాసుతైర్వాపి నేచ్ఛేద్విరహమాత్మన:
     ఏషాం హివిరహేణస్త్రీ గర్హ్యేకుర్యాదుభేకులే
(మను. 3-149)

సత్కార్యములను జేయుటకు గూడ స్త్రీ భర్త యనుమతిని పొందవలెను.

    అపృష్ట్వాచైవ భర్తారం యానారీకురుతేవ్రతం
    సర్వం తద్రాక్షసాన్గచ్ఛేదిత్యేవం మనురబ్రవీత్
(పరాశర. 4-18)

(భర్త నడుగకుండ స్త్రీ వ్రతముచేయుచో నావ్రతము రాక్షసులను జెందునని మనువు చెప్పినాడు.)

కావుననే గౌతముడు

అస్వతంత్రాధర్మే స్త్రీ.

(గౌ. 18-1)

(ధర్మవిషయములలో స్త్రీ యస్వతంత్రురాలు) అని చెప్పియున్నాడు.

వసిష్ఠు డిట్లు చెప్పుచున్నాడు.

అస్వతంత్రా స్త్రీ పురుషప్రధానా

(వసిష్ఠ. 5-1)

(స్త్రీ యస్వతంత్రురాలు. పురుషుడు ప్రధానుడుగా గలది.)

భర్త యనుజ్ఞనిచ్చుటచే స్త్రీకి కొన్ని ముఖ్యములగు ధర్మకార్యములను జేయుట కర్హత గల్గుచున్నది. కుమారుని దానమిచ్చుటకు కాని దత్తత చేసికొనుటకు గాని స్వతస్సిద్ధ ముగ స్త్రీ కధికారము లేదు. కాని భర్త యనుజ్ఞనిచ్చుచో నామె కాయధికారము గల్గును.

    సస్త్రీపుత్రం దద్యాత్ప్రతిదృహ్ణీయాద్వాన్య
    త్రానుజ్ఞానాద్భర్తుః
( వసిష్ఠ. 15-5)

(భర్త యనుజ్ఞనిచ్చిననే కాని స్త్రీకి పుత్రుని దానము చేయుటకు గాని ప్రతిగ్రహణము చేయుటకు గాని యధికారము లేదు.)

మనుస్మృతి మున్నగు కొన్ని స్మృతులు తండ్రి కాని తల్లి కాని పుత్రుని దానము చేయవచ్చునని చెప్పుచున్నవే కాని యామె భర్త్రాజ్ఞను పొందుట మాట చెప్పుటలేదు.

    మాతాపితావాదద్యాతాం యమద్భిః పుత్రమాపది
    సదృశం ప్రీతిసంయుక్తం సజ్ఞేయోదత్త్రిమః స్మృతః
(మను. 9-168)

లౌకిక వ్యవహారములలో కూడ స్త్రీకి స్వాతంత్య్రము లేదు. భర్త యనుమతిలేకుండ స్త్రీ న్యాయస్థానములో నభియోగము కూడ తేరాదు. అట్టి యభియోగములను న్యాయాధికారి విచారించి తీర్పు చెప్పినను నాతీర్పు చెల్లదు.

స్త్రీనక్తషుం తరాగారబహశ్శత్రుకృతాం స్తథా

(యాజ్ఞ. 2-31)

సాధారణముగ భర్త భార్యతో నాలోచించియే గృహకృత్యములను నిర్ణయింపవలెను గాని కేవలము నామెను నిర్లక్ష్యము చేయరాదను నంశము పూర్వాధ్యాయములలో చూచియున్నాము. పిల్లలకు పేర్లను పెట్టుట మున్నగు నంశములలో గూడ నామె యభిప్రాయమును తీసికొనవలెను.

    దశమ్యాముత్థితాయాగ్ స్నాతాయాం పుత్రస్య
    నామదధాతి పితామా తేతి
(ఆ.గృ. 15-6-8)

(పదవనాడు స్నానమైన పిమ్మట తలిదండ్రులు పుత్రునకు పేరు పెట్టవలెను.)

భర్తచనిపోయి పుత్రులులేకుండినగాని ప్రాజ్ఞులు గాకుండిన కాని స్త్రీకి భర్తృపక్షమువారే ప్రభువులగుదురుగాని పితృపక్షమునవారుకారు.

    మృతేభర్తర్యపుత్రాయాః పతిపక్షః ప్రభుః స్త్రియాః
    వినియోగాత్మరక్షాను భరణేచసఈశ్వరః
    పరిక్షేణేపతికులే నిర్మానుష్యేనిరాశ్రయే
    తత్సపిండేషువాసత్సు పితృపక్షఃప్రభుస్త్రియాః
(నారద. 12-28, 29)

(భర్తపోయిన యపుత్రకు పతిపక్షము వారే ప్రభువులు. నియోగము, ఆత్మరక్ష, పోషణయను విషయములలో వారే యామె కధికారులు. పతికులమంతయు నశించి నిర్మానుష్యము నిరాశ్రయము నైనచో పతియొక్క సపిండులు గాని తండ్రిపక్షమువారు గాని ప్రభువులగుదురు.) భర్త జీవించియున్నంత కాలము భార్య యాతని కన్నివిధముల ననువర్తనగ నుండవలెనను నంశమును దాంపత్యమను నధ్యాయమున చూచియున్నాము. బాల్యములో తండ్రివిషయమున నొక సందర్భములో కుమార్తె స్వాతంత్య్రమును వహింపవచ్చునను నంశము 'వివాహ కాలము' 'వివాహ విధానము' అనునధ్యాయములలో చూచియుంటిమి. రజస్వల యైన మూడుమాసములలో గాని కొన్ని స్మృతుల ననుసరించి మూడు సంవత్సరములలో గాని తండ్రి కన్యను దానము చేయనిచో నామె స్వయముగ నెవరినైన వరించుకొనవచ్చునను నంశమును చూచియుంటిమి. అట్లే గాంధర్వవివాహములో నామెకు గల స్వాతంత్య్రమును గూడ చూచియుంటిమి.

స్త్రీలకు స్వాతంత్య్రము లేకుండుట యన వారికి గౌరవములేకుండుట యని భావించుటకు వీలులేదు. ఈలోకములో నందఱకంటె నెక్కుడు పూజ్యురాలు, నిహదైవతమునని చెప్పబడిన తల్లియే కుమారుని వశముననుండవలెనని స్మృతులు చెప్పుటచేతనే యీయంశము స్పష్టమగు చున్నది. అనగా వారిక్షేమము నాలోచించియే వారికి స్వాతంత్య్రము నిషేధింపబడినదని తేలుచున్నది.

  
    స్వాతంత్య్రా ద్విప్రణశ్యనికులే జాతాఅపిస్త్రియః
    అస్వాతంత్య్రమతస్తా సాంప్రజాపతిరకల్పయత్
(నారద. 12-30)

(సత్కులమందు పుట్తిన స్త్రీలుకూడ స్వాతంత్య్రము వలన నశింతురు. కాన బ్రహ్మ స్త్రీల కస్వాతంత్య్రమును విధించెను.)

స్త్రీస్వాతంత్య్రమును పొందకూడదను నిషేధధర్మమెంత బలీయమో పురుషుడామెకు స్వాతంత్య్రము నీయ కూడదను విధికూడ నంత బలీయమైనదిగనే యున్నది.

అస్వతంత్రాఃస్త్రియః కార్యాః పురుషైర్దివానిశాం

(మను. 9-2)

(పురుషులు రేఁబవలు స్త్రీల నస్వతంత్రలనుగ జేయవలెను.)

అట్లు కాక స్త్రీలకు లొంగిపోవు పురుషులు మిక్కిలి గర్హింపబడినారు. పరాశరస్మృతి కలియుగములోని యధర్మాచరణమును వర్ణించుచు స్త్రీలకు పురుషులు లొంగిపోవుట యనుదానిని కూడ పేర్కొనినది,

జితాశ్చోరైశ్చ రాజానఃస్త్రీభిశ్చపురుషాః కలౌ.

(పరాశర. 1-80)

(కలియుగములో రాజులు చోరుల చేతను పురుషులు స్త్రీల చేతను జయింప బడుదురు)

స్త్రీచేత జయింపబడిన వానితో భుజింప కూడదని మనుస్మృతి చెప్పుచున్నది.

మృష్యంతిచోపపతిం స్త్రీజితానాంచసర్వశః

(మను 4-217) (భార్య కుపపతి యుండుటను సహించువారితోను, స్త్రీలచేత జయింపబడిన వారితోను నెన్నడును భుజింపరాదు.)

స్త్రీ గౌరవార్హయే యైనను నామె యెల్లపుడును పురుషుని యధీనముననే యుండవలెనని యీవిధముగ తేలుచున్నది. సంగ్రహముగ చెప్పవలెనన్నచో స్త్రీని పురుషుడు సగౌరవముగ కాపాడవలెనని చెప్పవలెను. పాశ్చాత్యదేశములలో 'షివల్రీ' యని చెప్పబడినది స్మృతులలో గలదని పైన నీయబడిన యుదాహరణములవలన వ్యక్తమగుచున్నది. దీని యవధి యీ క్రింది శ్లోకములో గలదు.

స్త్రీవిప్రాభ్యుపవత్తౌచఘ్నన్ ధర్మేణనదుష్యతి,

మను. 8-349)

(స్త్రీలను బ్రాహ్మణులను విపత్తునుండి తప్పించునపు డెవరినైనను చంపినను దోషములేదు.)


______