సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/సర్. సి.వి.రామన్
సర్.సి.వి. రామన్
మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ తరగతి గది. ఆంగ్ల పద్య భాగమును బోధించు ప్రొఫెసర్ ఇలియట్ తరగతిలో ప్రవేశించి విద్యార్ధలందరినీ ఒక మారు కలయజూచాడు. మూడవ వరుసన కూర్చున్న ఒక విద్యార్ధిని చూచి ఆశ్చర్యంతో ...
'నీవీక్లాసు విద్యార్ధివేనా?' అని ప్రశ్నించాడు. ఆ దినమే అతడు కళాశాలలో చేరాడు.
'ఔను, సర్, నేను ఈ తరగతి విద్యార్ధిని, నా వయసు 13 ఏళ్ళు. ఇంటర్‌మీడియట్ విద్యను వాల్టేర్ కాలేజీలో పూర్తి చేశాను. నా పేరు సి.వి. రామన్' అన్న సమాధానం నిర్భయంగా చెప్పాడు. ప్రొఫెసర్ వేసిన ప్రశ్నలన్నింటికీ ధైర్యంగా చకచకా చెప్పాడు. ప్రొఫెసర్, ఆ బాలుని తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. నాటి నుండి ప్రొఫెసర్ ఇలియట్ ప్రియశిష్యులలో ఒకడయ్యాడు సి.వి. రామన్.
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. తిరుచినాపల్లి హైస్కూల్‌లో ఉపాధ్యాయుడుగా చేరిన చంద్రశేఖర్ అయ్యర్ స్వయంకృషితో ఉన్నత విద్యనభ్యసించాడు. "పోలనుద్యోగికిని దూరభూమిలేదు" అన్న సూక్తి మేరకు స్వస్థలానికి దూరంగా ఉన్న విశాఖపట్నంలోని, మిసెస్ ఎ.వి.ఎన్. కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు. భౌతిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రాలలోనే గాక, వీణ, వాయులీన్ వాదనములలోను నైపుణ్యంగల వాడు చంద్రశేఖర్ అయ్యర్. సివి.రామన్ తల్లి పార్వతి అమ్మాళ్ తండ్రి గొప్ప సంస్కృత పండితుడు. సహనానికి, పట్టుదలకు మారుపేరు ఆమె.
విద్యార్ధి దశలో అనిబిసెంటుగారి అనర్గళమైన ఉపన్యాసాలు రామన్‌ను ఆకర్షించాయి. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ చదువుతున్నపుడే 'హిందూ పురాణములు' అన్న వ్యాసం రాసి ప్రథమ బహుమతి నందుకొన్నాడు. నిరంతరం అధ్యయన శీలి రామన్. బి.ఏ లో ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా ఉత్తీర్ణుడై, ఎల్‌ఫీన్‌స్టన్ బంగారు పతకంతో పాటు మరెన్నో విలువైన బహుమతులందుకున్నాడు.
పదార్థ విజ్ఞాన శాస్త్రంతో ఎం.ఏ తరగతిలో చేరాడు. తరగతిలో అధ్యాపకులు, విద్యార్ధులు రామన్ పట్ల అత్యంత గౌరవ భావంతో వ్యవహరించే వారు. ప్రయోగ శాల, గ్రంథాలయం అతనికి ఎల్లవేళలా అందుబాటులో వుండేవి. ధ్వనిశాస్త్ర విషయమున రామన్ ప్రయోగమారంభించాడు. ఇది వరకు ఎవరూ కనుగొనని లక్షణములను కనుగొన్నాడు. ప్రొఫెసర్ జోన్స్‌కు తన ప్రయోగ వివరములను నివేదించాడు. ఆ వివరములను పరిశీలించిన, ప్రొఫెసర్ రెలే రామన్ ప్రయోగాలను ప్రశంసించాడు. రామన్ తన పరిశోధనను వ్యాసరూపంగా సిద్ధపరచి ప్రొఫెసర్ గారికి పరిశీలించమని ఇచ్చాడు. ఆరు నెలలు దాటినా ప్రొఫెసర్ తన కాగితాలను యివ్వలేదు. శుద్ధ ప్రతిని వ్రాసి యిచ్చెదనని చెప్పి, తన వ్యాసాన్ని తీసుకుని, "ఫిలసాఫికల్ మ్యాగజైన్ ఆఫ్ లండన్" అను పత్రికకు 1906లో పంపాడు. ప్రొఫెసర్లు రామన్ ప్రతిభను గొప్పగా శ్లాఘించారు. 1907 లో రామన్ ఎం.ఏ (ఫిజిక్స్) పరీక్షలో మద్రాసు విశ్వవిద్యాలయ చరిత్రలోనే ప్రప్రథమశ్రేణి విద్యార్ధిగా ఉత్తీర్ణుడయ్యాడు.
పెద్దలు, మిత్రులు రామన్‌ను ఇంగ్లండు వెళ్ళి పరిశోధన సాగించమని ప్రోత్సహించారు. కాని రామన్ శారీరకంగా దుర్బలుడైనందున ఇంగ్లండు వాతావరణం అతనికి అనుకూలించదని వైద్యులు చెప్పారు. రామన్ ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఉద్యోగార్థియై, చరిత్ర, అర్ధ శాస్త్రములు ప్రత్యేక విషయములుగా చదివి పోటీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. "డెప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్"గా ఎన్నుకోబడినాడు. అప్పుడు రామన్ వయస్సు 18 ఏళ్ళు.
కలకత్తాలో ఉద్యోగమున చేరకముందే 'లోక సుందరీ'అను నామెతో అతని విహాహం జరిగింది. వారిది శాఖాంతర వివాహం. ఆ రోజులలో అది గొప్ప మార్పు. రామన్ కలకత్తాలో డెప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరాడు. కాని అతని మనసంతా శాస్త్రపరిశోధనపట్ల వుండేది.
ఒకనాడు కలకత్తా వీధిలో ట్రామ్‌బండిలో ప్రయాణం చేస్తుండగా "ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్" అను బోర్డు అతని కంటపడింది. వెంటనే ట్రామ్ బండి దిగి, ఆ భవనం ప్రవేశించాడు. శాస్త్రవేత్తలు సమావేశం ముగించి వెళుతున్నారు. ఆ సంస్థ కార్యదర్శి మహేంద్రలాల్ సర్కార్‌ను కలుసుకున్నాడు. మరుసటి దినం నియమిత కాలంలో ఇరువురు సమావేశమయ్యారు. రామన్ తన పరిశోధనలను మహేంద్రలాల్ సర్కార్‌కు వివరంగా చూపించాడు. రామన్ ప్రతిభకు నివ్వెరపోయిన సర్కార్, రామన్‌కు తమ సంస్థలో ప్రవేశం కల్పించి నిరాఘాటంగా, స్వతంత్రంగా ప్రయోగములు సాగించుటకు ప్రత్యేక సౌకర్యములు కల్పించాడు. రామన్ రాకతో సంస్థ ప్రతిష్ట బాగా పెరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడైన అశుతోష్ ముఖర్జీ రామన్‌ను ఎంతో ఆదరించాడు.
రామన్‌ను ప్రభుత్వం రంగూన్‌కు బదిలీ చేసింది. రంగూన్‌లో ఉన్నపుడే తండ్రి మరణించాడు. ఆరు నెలలు సెలవు పెట్టి మద్రాసు వచ్చిన రామన్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రయోగాలు చేయసాగాడు. నాగ్‌పూర్‌కు బదిలీ అయ్యాడు. అక్కడ సహోద్యోగుల ఈర్ష్యాసూయలతో భాదపడినాడు. మరల కలకత్తా బదిలీ కావడం రామన్ కెంతో ఆనందం కలిగించింది.
కలకత్తా విశ్వవిద్యాలయమున భౌతిక శాస్త్రంలో ఆచార్య పీఠం 1915లో నెలకొల్పబడింది. అందుకు భూరివిరాళమిచ్చిన సర్ తారకనాథ్ పాలిట్ దృష్టి రామన్ పై పడింది, ఇంగ్లండులో పెద్ద చదువులు నేర్చివచ్చినవారే ఆపదవికి అర్హులని పేర్కొనబడింది. కాని వైస్ ఛాన్స్‌లర్ అశుతోష్ ముఖర్జీ, అన్ని నిబంధనలను సడలించి సి.వి.రామన్‌ను ఆ పదవికి ఎన్నుకొన్నాడు. ప్రభుత్వంలోని ఉన్నత పదవికి వెంటనే రాజీనామా ఇచ్చిన రామన్ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా చేరాడు. 1919 లో రామన్ 'ఇండియన్ ఆసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సు' సంస్థకు కార్యదర్శిగా ఎన్నుకోబడినాడు. 1922 బ్రిటిష్ యూనివర్శిటీ కాంగ్రెస్ సభలో భారతదేశ ప్రతినిధిగా ఎన్నుకోబడినాడు. 1924లో కెనడాలోని 'సైన్స్ కాంగ్రెసు' కు విశేష ప్రతినిధిగా వెళ్ళి విదేశాలలో పలుచోట్ల ఉపన్యాసాలిచ్చాడు. అపూర్వంగా, రాయల్ సొసైటీ, రామన్‌కు 1924లో ఫెలోషిప్ సత్కారమిచ్చి గౌరవించింది. 1924లోనే రామన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సంస్థను నెలకొల్పాడు. 1925లో రష్యన్ సైన్స్ అకాడమి ఆహ్వానంపై మాస్కో వెళ్ళాడు.
కొన్నేళ్ళు, నిరంతర పరిశోధనా ఫలితంగా 1928లో "రామన్ ఎఫెక్ట్"ను కనుక్కొన్న, సి.వి.రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. ఆసియా ఖండంపై ఆ సత్కారం అందుకొన్న శాస్త్రవేత్తలలో మొట్టమొదటివాడు సి.వి.రామన్.
15 సంవత్సరాలు కలకత్తా విశ్వవిద్యాలయంలో, అపూర్వంగా పనిచేసిన సి.వి.రామన్ బెంగుళూరులోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' సంస్థ డైరెక్టర్‌గా చేరాడు. 1934లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంస్థ అవతరించింది. 1948 లో రామన్ తమ స్వంత సంస్థ రామన్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ను ప్రారంభించాడు. ఆ సంస్థలో అధ్యయనం చేసిన, రామన్ శిష్యులలో అగ్రగణ్యులు డా. హోమి జె.భాభా, డా.సూరిభగవంతం, డా. విక్రమ్ సారాభాయ్, డా.కె.యస్.కృష్ణన్, డా. రామశేషన్ మున్నగువారు.
స్వతంత్ర భారతావరణంలో శాస్త్రీయ పరిశోధనా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
రామన్ కీర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. బ్రిటిష్ ప్రభుత్వం అతనిని 'సర్' బిరుదంతో సత్కరించింది. ప్రపంచమందలి ప్రముఖ విశ్వవిద్యాలయాలెన్నో అతనిని గౌరవ డాక్టరేట్ బిరుదములతో సత్కరించాయి. 1954లో భారత ప్రభుత్వం అతనిని 'భారత రత్న' ప్రశస్తితో గౌరవించింది. కొన్ని వందల ఘన సన్మాలందుకొన్న మహామనీషి సర్ - సి.వి. రామన్.
రామన్ సంగీత శాస్త్రములో చక్కని ప్రవేశం కలవాడు. మృదంగ వాద్యంపై, శబ్ద తరంగాలపై ప్రయోగాలు సాగించాడు. రామన్ పరిశోధనలు ఫోటోగ్రఫీ, రబ్బర్ ప్లాస్టిక్ పరిశ్రమల కెంతో తోడ్పడింది.
రామన్ విజ్ఞానశాస్త్ర ప్రగతికెంతో కృషి చేశాడు. రాజకీయవాదులు వైజ్ఞానిక రంగంలో ప్రవేశించకూడదని ఆయన అభిప్రాయం.
ప్రతి ఏటా, ప్రధాని నెహ్రూ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలను ప్రారంభించడం రామన్‌కు నచ్చలేదు. ఆయన శిష్యుడైన శ్రీ వి.టి.శ్రీనివాసన్, రామన్‌తో మాట్లాడుతూ ఆ విషయం ప్రస్తావించగా 'ప్రపంచంలో ఏ దేశంలో నైనా, రాజకీయ నాయకులు విజ్ఞాన శాస్త్ర సమావేశాలు ప్రారంభించారా? గత 17ఏళ్ళుగా, సంస్థ నిర్వాహకులు, మన ప్రధానితోనే ఎందుకు ప్రారంభిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఆయన లేరు, ఆయన కూతురితో, ఈ పని చేయిస్తున్నారు. ఇదే మాత్రం సముచితం కాదు.' అందుకే ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవతరించింది.
రామన్ హాస్య చతురుడు. కొన్ని దశాబ్దాల క్రితం బెంగుళూరులోని ఒక బ్యాంకర్ (ధర్మరత్నాకర గోపాలరావు) గారి వద్ద రామన్ 75వేల రూపాయలు వుంచాడు. కొద్ది కాలం తర్వాత ఆ బ్యాంకర్ దివాలా అయినట్లు తెలిసింది. 'నోబెల్ బహుమతి గ్రహీతకే టోపీ పెట్టిన, ఆ బ్యాంకర్‌కు నోబెల్ పారితోషికం ఇవ్వడం సబబు' అన్నాడు డా.సి.వి.రామన్.
"కార్యసాధకులకు హంగులు ఆర్భాటాలు అనవసరం. నోబెల్ బహుమతి కొరకు నేను సాగించిన ప్రయోగానికి నా పెట్టుబడి కేవలం రెండువందల రూపాయలే!" అన్నారాయన. జాతీయ పరిశోధనాలయాలపై అనవసరంగా విపరీతమైన ధనాన్ని వ్యయపరచడం రామన్ గారికి సరిపడేది కాదు. అందువల్లనే "షాజహాన్ తన ప్రియురాలి శవాన్ని ఖననం చేసేందుకు తాజ్ మహల్ నిర్మించాడు. జాతీయ ప్రయోగశాలలు శాస్త్ర పరిశోధనా పరికరాలను నిక్షేపం చేసేందుకు నిర్మించారు" అన్నారాయన. రామన్ ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడో అంత గొప్ప వక్త. అతి క్లిష్టమైన శాస్త్రీయ విషయాలను జనరంజకంగా ఉపన్యసించగల మహామేధావి ఆయన.
మానవతావాది డా.రామన్. శాస్త్రవేత్తల పరిశోధనలు ప్రపంచ ప్రజల క్షేమానికి వినియోగ పడాలని చాటిచెప్పిన మహనీయుడు సర్.సి.వి.రామన్.
జీవితమంతా శాస్త్ర పరిశోధనలో గడిపి, భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడించిన సర్. సి.వి.రామన్ తన 83వ ఏట 1970 నవంబర్ 21 వ తేదీన దివంగతుడయ్యాడు.