సీతారామాంజనేయసంవాదము
సీతారామాంజనేయమను నీ ప్రబంధము రచించినకవి పరశు
రామపంతుల లింగమూర్తి, ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు. రామమంత్రి
తిమ్మమాంబలకుమారుడు. ఇతనినివాసస్థలము నిజాము రాష్ట్రములోని
వరంగల్లునకుఁ జేరిన మట్టివాడ. నేఁటివఱ కీకవివంశీయులు లింగమూర్తి
కవిపాదరజముచేబవిత్రీ కృతమైన ప్రాచీనగృహముననె వసించు
చున్నారు. ఈ వంశమున నీయనకుఁ బూర్వము కవులున్నటులఁ దెలి
యదు. ఆంధ్రమున నీకవివర్యుఁడు రచించిన గ్రంథములఁ బేర్కొందుము.
1 రతిమన్మథవిలాసము
2 జీవన్ముక్తి ప్రకరణము
3 బ్రహ్మనారదసంవాదము
4 తారక యోగము
5 మానసశతకము (కందములు)
6 సీతారామాంజనేయము.
ఇందు సీతారామాంజనేయము రతీమన్మథవిలాసము అను
రెండు గ్రంథములెయించుక పెద్దవి. మిగిలిసకబ్బములు శతక ప్రాయములు.
రతిమన్మథవిలాసము మూఁడాశ్వాసముల ప్రబంధము. ఈ గ్రంథము కవి
బాల్యమున రచించినటుల నందలిభావలోపములు వ్యాకరణలోపములు
సాక్ష్యము లగుచున్నవి. గద్యములో “శ్రీ మదాంజనేయచరణకమల
సేవావిధేయ శృంగారకవితాచమత్కారధౌరేయ పరశురామపంతుల
లింగమూర్తినామధేయ ప్రణీతం బైనరతిమన్మథవిలాస మను శృంగార
ప్రబంధమందు” అని వ్రాసికొనియున్నాఁడు. దీనింబట్టి యౌవనమున
నీగ్రంథము కవి రచియించియుండునని తేలుచున్నది. సీతారామాంజ
నేయము లిఖించునప్పటికి కవిస్థితిగతులు మాఱెను. ఈతనిమానసము
శృంగారరసమునుండి విముఖమై వేదాంతరసమున నోలలాడఁ దొడ
గెను. కవితయు నిగ్గుతేఱిి వశంవదయై భావబింబముల నిర్జీవకథాంశ
ములలో సైతము చిత్రించుశక్తి కల దయ్యెను. రతీమన్మథవిలాసము
హనుమంతునకుఁ గృతి యీయఁబడినది, గద్యమున హనుమద్భక్తుఁడ
నని కవి చెప్పికొనెను. గ్రంథమున గురుప్రశంస లేదు. తుదకు స్వవంశ
విషయమేని చెప్పికొనియుండ లేదు. సీతారామాంజనేయ మీకవి తన
యుత్తరవయస్సున రచించియుండును. ఇందులకుఁ గవితాధారయు
వేదాంతపాండిత్యము మనకు దృష్టాంతములు కాగలవు. ఈకవి బాల్య
మున సామాన్యునివలె విద్యాజ్ఞానశూన్యుఁడై తన గ్రామమగు మట్టి
వాడకు సమీపముననున్న ″ఈదులవాయ” యను గ్రామమున సంచ
రించుచుండ సమీపశైలమున వసించు మహాదేవయోగి యను నొక
మహాత్యుడు రామమంత్రోపదేశ మొనరించె ననియు, నా గిరియందే
యామంత్రరాజము సిద్ధించువఱకు వసించి యోగివలని సెలవంది యాయన
దయ చేసిన షట్చక్రసీతారామస్వరూపము నిజగృహమునఁ బ్రతిష్ఠించె
ననియుఁ జెప్పుట యేకాక నేఁటివఱకు నాసీతారామమూర్తిస్వరూపము
వంశీయులు భక్తితాత్పర్యములతోఁ బూజించుచున్నారు. కవి, తాను
మహాదేవగురుశిష్యుఁడ ననియు షట్చక్రసీతారామోపాసకుఁడ ననియు
సీతారామాంజనేయగద్యమున నిటుల “శ్రీమన్నారాయణ మహా దేవ
గురుకరుణా కటాక్షవీక్షణ విమలీకృత నిజహృదయకమల కర్ణికాంతస్సం
దర్శితాఖండ సచ్చిదానందరసైకస్ఫూర్తి షట్చక్ర సీతారామమూర్తి
పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి ప్రణీతము ” అని వ్రాసి
కొనియున్నాఁడు. మఱియు నీకవివర్యుఁ డార్జించిన శ్రీరాముమాడయు
స్ఫటికవినాయకవిగ్రహము మరకతలింగము సాలగ్రామములు సైతము
వంశీయులు శ్రద్ధాభక్తులతోఁ బూజించుచున్నారు. ఎట్టి విపత్కాలమున
నేని'తాఁ గడించినవిగ్రహముల మట్టివాడయందుంచియే పూజింప
వలయునని కని యాజ్ఞ యొసంగెనఁట. నేటికి, వంశజు లటులె సల్పుచు
న్నారు. కవికి గురుమూర్తిపదము బిరుదనామము. ఇది యిక్కవి రామ
పెక్కండ్రు శిష్యుల గడించి వారివలనఁ బొందెనఁట.
కవి తనగురుపరంపర నిటుఁల జెప్పికొన్నాఁడు.
ఇందు కడపటివాఁ డగుమహాదేవగురుఁడే ప్రకృతకవి కుపదేశ మొనరించిన దేశికుఁడు, ఈ దేశిక నామము రతీమన్మథవిలాసమునఁ గాన రామిచే నప్పటి కీకవి భక్తియోగాభ్యాస మొనరించి యుండఁ డని తెలియుచున్నది. సీతారామాంజనేయమునఁ దన దేశికు నిటుల స్తోత్ర మొనరించి యున్నాఁడు.
సీ. “అఖిలభూతంబుల నాడించుమాయను
సొంపుగా నెవ్వఁ డాడింపుచుండు
గురుజనంబుల కెల్ల గురువులై తగుహరి
హరుల కెవ్వఁడు గురు వగుచునుండు
విబుధలోకంబుల వెలిఁగించి వెలుఁగుల
మించి యెవ్వఁడు వెలిగించుచుండు
ప్రభువుల కెల్ల సత్ప్రభు వైన బ్రహ్మకుఁ
బ్రభు వౌచు నెవ్వఁడు పరఁగుచుండు
గీ. సగుణ నిర్గుణరూపుఁడై నెగడుచుండు
నమ్మహాదేవగురువరు నభినుతింప
సకలనిగమాగమాంతశాస్త్రంబు లోప
వనఁగ మముబోంట్లకు నుతింప నలవి యగునె."
ఈపద్యమువలన మహాదేవయోగి దైవసముఁ డని తోచు చున్నది. ఎంతఁవాడొ కానిది లింగమూర్తికవికి గురువు కాఁగలడా! కవి తాను, మహాదేవయోగి గురుఁ డని యిట్లు చెప్పికొనెను.
గీ. “అమ్మహాదేవగురుచరణారవింద
పరపరాగాంశభజనతత్పరుఁడఁ బరశు
రామపంతులకులజాతరామమంత్రి
మౌళితిమ్మాంబికాప్రియాత్మజుఁడ నేను. "
కొండొకచోట నిక్కవి తనదేశికుని సీతారామస్వామికి సమాను నిగ నీక్రిందిపద్యములోఁ జెప్పికొని యున్నాఁడు.
క."ప్రణవాత్మకసదసత్కా
రణసంపూర్ణప్రభాభిరామసగుణని
ర్గుణ నిర్వికారనారా
యణసీతారామగురుమహాదేవశివా."
కవి తానీగ్రంథమున బ్రహ్మాండపురాణాంతర్గత మగు అధ్యాత్మ రామాయణమునందలి శ్రీరామహృదయమును విస్తరించి వ్రాసితినని యు శ్రీరాముఁడు స్వప్నమునఁ బ్రత్యక్షమై కృతి రచింపు మనె ననియు వ్రాసికొనియున్నాఁడు.
ఈకవి యీ గ్రంథమును మూఁడాశ్వాసములుగ విభజించి క్రమ ముగఁ దారకయోగము సాంఖ్యయోగము అమనస్కయోగము అని పేరులఁ బెట్టి యున్నాడు. రజతగిరియందు శంకరుఁడు పేరోలగముఁ దీర్చియుండుతఱిఁ దన పరిచర్యలయం దప్రమత్తురాలగు పార్వతినిఁ జూచి శంకరుఁడు సంతసించి నీయభీష్టంబుఁ దీర్తు నెద్దియేని వరము కోరుమనె నఁట. అందులకుఁ బార్వతి పవిత్రమగుమంత్రరాజ ముపదేశింపునుని కోర శంకరుఁడు నీకుఁ దగినది శ్రీరామమంత్రమని దాని నుపదేశించెనఁట. పిమ్మట పార్వతి శంక రునిఁజూచి శ్రీరామతత్త్వస్వరూప మెట్టిదని ప్రశ్నింప, శ్రీరాము నను మతిచే సీత హనుమంతున కెఱింగించినయంశము శంకరుఁడు పార్వతి కెఱింగించెనఁట, ఇదియే యీగ్రంథావతారిక.
కవికాలము తెలిసికొనుటకు గ్రంథమున నాధారములు లేవు. రతి మన్మథవిలాసము కవిస్తుతిలో అయ్యలరాజు రామభద్రుని పేర్కొని యుంటచే పదునాఱవశతాబ్దమునకుఁ గడపటివాఁ డనువిషయము స్థూలదృష్టికిఁ దోఁచును. కవికిఁ గడపటివంశవృక్ష మీక్రిందివిధముగ నున్నది.
ఈ వంశవృక్షమునందలి పట్టాభిరామయ్య గ్రంథకర్తయగు లింగ మూర్తికవి కైదవతరమువాఁడు. ఈపట్టాభిరామయ్యకు వయస్సు 40సం వత్సరము లుండును. ఈయనవద్దనుండి తరమునకు ముప్పదియేండ్ల చొ ప్పున లెక్కించినచో ప్రకృతకవి యిప్పటికి రమారమి 150 సంవత్సరముల కాలము వాఁ డగును . అధ్యాత్మ రామాయణము, శుకచరిత్రము లో నగుగ్రంథముల విరచించిన మహాకవియు లింగమూర్తికవికుమారుఁడు శిష్యుఁడు నగు రామమూర్తి తనతండ్రి లిఖించిన రతీమన్మథవిలాసము నగు శుద్ధప్రతి వ్రాయుచు క్రింద, “ప్లవంగ సంవత్సర జ్యేష్ఠ బ 13 గురు వారమువఱకు పరశురామపంతులురామన్నగారు రతిమన్మథవిలాసము పూర్వ ప్రతిలోనున్న క్రమాన వ్రాసిరి.” అని వ్రాసికొనెను. జీర్ణమయ మై యున్న గ్రంథమువలనను, ప్రకృతవంశీయులకు రామమూర్తికవి యైదవపురుషుఁగుటవలనను ప్లవంగసంవత్సర మిప్పటికిఁ బదియేండ్ల క్రిందను డెబ్బది యేండ్ల క్రిందను గతించినది కాక నూటముప్పది సంవత్స రముల క్రింద గతించినదై యుండును. అంతకుముందు లింగమూర్తిగారు రమారమి యిరువది సంవత్సరముల క్రిందనుండె ననుకొనినను సీతారా మాంజ నేయ మిప్పటికి నూటయేఁబది సంవత్సరముల క్రింద - అనఁగా క్రీ. శ. 1760 ప్రాంతములో విరచింపఁబడియుండుననుట నిస్సందేహము. కవిజీవిత మిఁక విడిచి కావ్యము విమర్శింతము.
సీతారామాంజనేయసంవాదము
స్టముగా నున్నది. కావ్య ముంతయు యోగశాస్త్రమగుటచేఁ గవితావిమ ర్శమునకు వీలు కానరాదు. అందం దుఁ గలస్వతంత్ర పద్యముల చేఁ గవి శక్తి సామర్థ్యములు గుర్తింపవచ్చును. ప్రాచీనకవుల పద్యములపోలికల నను సరించి వ్రాయబడిన పద్యములు కొన్ని సీతారామాంజనేయమునకలవు.
సీ, "స్వామియై నిగమాలి భూమియై సురపురో
గామియై యబ్ధిజాకామి యుండ
హారియై హలహలాహారి యై భవదంశు
ధారియై ప్రసవాయుధారి యుండ
వసుచరిత్రము, చతుర్థాశ్వాసము, ప, 36.
సీ. “ఏకమై పరమై విశోకమై సత్య మ
లోకమై వ్యాపకాలోక మగుచు
సారమై చిదచిదాకారమై యతినిర్వే
కారమై విగతసంసార మగుచు.........”
సీతారామాంజనేయము, ఆ-2, ప-6.
ఉ. “హా యను గాధినందనమఖారినిశాటమదాపహారిబా
హా యను గ్రావజీవదపదాంబురుహా యను రాజలోక సిం
హా యనుఁ బోషితార్యనిసహా యనుఁ గానల కేఁగితే నిరీ
హా యను నిర్వహింపఁగలనా? నిను బాసి రఘూద్వహా యనున్.”
రామాభ్యుదయము. ఆ.5, ప-10.
ఉ. మాయను మిథ్యగాఁ దెలియుమా యను దత్కృత మెల్లఁ గల్లసు
మ్మా యను మేను నే ననకుమా యను సాక్షిని నీవు చూచుకొ
మ్మా యనుఁ జూడఁగానితరమా యను నే నని నిశ్చయించుకొ
మ్మా యనుఁగాకపో నితరమా యనుమానము మానుమా యనున్.”
సీతారామాంజనేయము, ఆ-3. ప.143 .
ఇట్టిపోలికలచే నీకవి ప్రాచీనకవులకవిత్వముపై గౌరవభావము కలవాఁ డనియు రసార్దియనీయుఁ బాఠకులు తలంతురుగాక. కఠినతమ మగు వేదాంతశాస్త్రమును, కవితాప్రపంచమున వెలయించుట సామా న్యకార్యము కాదు. అందును నీకవివర్ణనాంశములలో నిరోష్ఠ్యపద్య ములు, సర్వతః ప్రాసపద్యములు, చతుః ప్రాసపద్యములు వ్రాసి తనశక్తిని వెల్లడించియున్నాఁడు. విస్తరభీతిచే నుదాహరింప మానితిమి. ఈ లింగ మూర్తికవిమొదలు కడకు వంశవృక్షములోనివారందఱును కవులుగను పండితులుగను రామమంత్రోపాసకులుగ నున్నారు. ఈ పవిత్రమగు వంశమునఁ బట్టాభిరామయ్యగారును వారిపుత్రులును గవితాపరిచయము లేనివారుగ నున్నారు. ఈ సీతారామాంజనేయమునకు సర్వంకషముగ మొదట వ్యాఖ్యానమొనరించిన శ్రీ పాలపర్తి నాగేశ్వరశాస్త్రినిగూర్చిన విశేషాంశములు తెలియరావు, సీతారామాంజనేయమువలెనే యీ కవి రచించిన రతీమన్మథవిలాసముకూడ ముద్రించి భాషాలోకమున కుపకృతి యొనరింప శ్రీవావిళ్ల హరి నడిగికొనుచుఁ బ్రకృతాంశమును ముగించుచున్నారము.
ఇట్లు భాషా సేవకులు,
శేషాద్రి రమణకవులు, శతావధానులు,
గంపలగూడెము శ్రీ కుమార రాజావారి ఆస్థానకవులు.
గంపలగూడెము
కృష్ణాజిల్లా
18-8-1917.
పీఠిక.
___________
మాతృభాషయందుఁ బ్రౌఢములై పండితైకవేద్యములై వాదా నువాదప్రతివాదభూయిష్టములై శాస్త్రజ్ఞానము లేనివారలకు దురవగా హము లైనద్వైతాద్వైతవిశిష్టాద్వైతసంబంధము లగువేదాంతగ్రంథి ము లనేకములు గలవు; గాని యందఱకుఁ దేటతెల్ల మగుదేశభాష యందు సామాన్యు లగు వేదాంతజిజ్ఞాసువులకు సులభముగ సిద్ధాస్త స్వరూపమును దెలుపు వేదాంతగ్రంథములుమాత్రము మిక్కిలి తక్కువగ నున్నవి. ఇట్టికొఱత యన్ని మతముల వారికిఁ గలవని చెప్పుట సాహసము గాదు గాని చాలవఱకు విశిష్టాద్వైతులకు మాత్రమీకొఱఁత దీర్పఁబడి నది. ఏలయన సుమారు 5000 సంవత్సరములకు ముందునుండియే భూత యోగి మహాయోగి సరోయోగి శఠకోపాదులగువిశిష్టాద్వైతులు తమ సిద్ధాంతమును ద్రావిడ భాషలోనికిఁ బద్యరూపముగ మార్ప నారంభించిరి. తరువాతను వారిమతము ననుసరించియే లోకాచార్యాదులు తత్త్వత్ర యతత్త్వశేఖరాదిగ్రంథములఁబెక్కింటిని వచనరూపముగ నెల్లరకుఁ దేట తెల్లమగునట్లు రచించిరి. ఇంతియకాక, క్రీ.శ. 16 శతాబ్దము లో నుండు కృష్ణదేవరాయలు, సంకుసాలనరసింహకవి మున్నగువారు తమవిష్ణుచిత్త యకవికర్ణరసాయనాది గ్రంథములయం దీమతస్వరూపమును జక్కఁగ వివ రించి యాంధ్ర భాషయందును విశిష్టాద్వైత సిద్ధాంతమును వెలయించిరి. తరువాతివారును ముముక్షుజనకల్పకము మున్నగు కొన్నిపద్యకావ్యము లను రచించిరి. పిదప నూఱుసంవత్సరములనుండి యఱవమునుండి తెలుఁ గున కెల్లగ్రంథములు మార్చుకొనఁబడుచున్నవి గదా !
ఇట్లె కొంతవఱకు ద్వైత గ్రంథములుగూడఁ గర్ణాటభాషలోనికి మార్చుకొనఁబడినవట! కాని యల్పవ్యాప్తి గల యామతగ్రంథము లంతఁగా బ్రసిద్ధి నొందినవి గావు. ఇఁక ననాదియై లోకమునం దత్యంతవ్యాప్తి గలయద్వైతమత మును దెలుపు దేశభాషా గ్రంథములు సుమారు 400 సంసత్సరముల క్రిందటినఱకు లేనట్టు కనబడుచున్నది.అఱవభాషలోఁ కొన్ని గలవందురు గాని యవియు నంత ప్రసిద్ధములుగా లేవు. తెనుఁగునందు నీటీవల వాసు దేవమననము మున్నగు కొన్ని వచన గ్రంథములు బయలు వెడలినవి గాని యందు సర్వవిషయములను సోదాహరణముగఁ జర్చింపఁబడకుండుటయే కాక యాశైలియు సహృదయహృదయరంజకముగా నుండలేదనియుఁ జెప్పవచ్చును.
ఇఁకఁ బద్యకావ్యమై సరసకవితావిలసితమై యద్వైతమతమునకు సంజీవని యనందగి విలసిల్లు వేదాంత గ్రంథరత్నము ---
సీతారామాంజనేయసంవాదము.
ఇయ్యది మూఁడాశ్యాసముల ప్రబంధము. దీనిని బరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి యనుకవి రచించెను. ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు . రామమంత్రికిని దిమ్మాంబకును బుత్రుఁడు. శ్రీరా భక్తుడు. మహాదేవయోగికి శిష్యుఁడు . ఇతని కాలాదులనుగూర్చి యాధారము లేవియు దొరకనందున సుమారు 100-150 సంవత్సరముల క్రింద నుండి యుండెనని యూహింపవలసి యున్నది. ఇతఁ డద్వైతమతమును వివరింపఁ బూనియుఁ దాను యోగాభ్యాసపరుఁ డగుటవలన రాజయోగ మును, బాలలోఁ జక్కెరను గలిపినట్లు, అద్వైతమతమునందుఁ గలిపి యేకముగ సమన్వయించియున్నాఁడు.
ఈ వేదాంతమును బార్వతీదేవి శివుని బ్రశ్న సేయఁగా నతఁడు పూర్వకాలమున రామపట్టాభిషేకానంతరము జరిగినసీతారామాంజనేయ సంవాదమును బార్వతికిఁ దెలిపినట్లు గ్రంథకర్త గ్రంథాదియందుఁ బొందు పఱచియున్నాఁడు. ఇందు మొదటఁ బ్రథమాశ్వాసము నందుఁ దారక యోగమును నిరూపించుచు, తొలుత యోగాభ్యాసమువలనఁ బ్రాణవాయువు స్వాధీన మగుననియు, వాయువునకు మనసునకును సంబంధముండుటవలన వాయు జయముతోఁగూడ మనోజయము గలుగుననియు, నింద్రియముల కన్ని టికి మనసే ప్రభువు.గాన వెంటనే యింద్రియజయము గూడఁ జేకూరు ననియు, నిట్లన్నియు జయింపఁబడెనేని సంసారముకు ముఖ్యకారణ ములగు కామక్రోధాదులు నశించి జీవునకు బ్రహానందసుఖము గలుగు ననియు సహేతుకముగ సయుక్తికముగ యోగఫలమును నిరూపించి పిదప యోగాభ్యాసము సేయువారనుసరింపఁ దగినయాహారాది నియమములు మొదలుకొని- యోగమఠలక్షణము, పంచముద్రాలక్షణము, సూర్య చంద్రమండలకళానిర్ణయము, హంసతత్వపదేశము మున్నగువానిని విపులముగ వివరించి తారకయోగమును ముగించెను.
రెండవయాశ్వాసమునందుఁ బరబ్రహ్మస్వరూపము, భావాభావ పదార్థస్వరూపము, మాయాస్వరూపము, ప్రపంచకారణస్వరూపము, సూక్ష్మశరీరసృష్టిప్రకారము, జీవబ్రహైక్యవిచారము, ఓంకారస్వరూప నిరూపణము, పంచకోశవివేచనము, దృగ్దృశ్యవివేకము, ఆరురుక్ష్వాదిలక్ష ణము, సద్రూపలక్షణము, ప్రళయనవరణము, చిద్రూపలక్షణాఖండలక్ష ణాదులను సహేతుకముగ నిరూపించి సాంఖ్యయోగమును బూ ర్తిసేసెను.
ఇఁక మూఁడవయాశ్వాసమున, అమనస్కయోగలక్షణము, తద్వ ర్తనము, వైరాగ్యబోధోపరతుల తారతమ్యము, వైరాగ్యశబ్దవిమర్శనము , గురుశుశ్రూషావిచారము, మహావాక్యార్థవివరణము, సుస్థితప్రజ్ఞలక్షణము, పంచదశయోగాంగవిభాగము, యోగిలక్షణము మున్నగువానిని సాంగ ముగ వివరించి యమనస్కయోగమును ముగించెను. ఈమూఁడుయోగ ములును రాజయోగభేదములే కావున నీగ్రంథము రాజయోగ నిరూపక మనందగియున్నది. ఈ కావ్యమునందు విషయమువలెనే కవిత్వమును జాల సమంజస ముగనే యున్నది. దురవగాహమగు వేదాంతమును సులభ శైలిలోఁ గ్లిష్ట పదసందర్భము గలుగకుండఁ బద్యములో నిముడ్చుట సామాన్యమగుపని కాదు కదా! వేదాంతములో నెంతయో యనుభవము కలిగి వశ్యవా క్కులు గలకవికిఁ గాని యిట్టిసామర్థ్యము గలుగ నేరదని చెప్పవచ్చును. ఇంతియకాక యీకవి తన గ్రంథమునం దచ్చటచ్చట నేకాక్షర ద్వ్యక్షర ముక్తపదగ్రస్తాదిశబ్దచిత్రములు గలపద్యములఁ బెక్కింటిఁ జొప్పించి నిజ పాండిత్యప్రకర్షను వెల్లడించియున్నాడు. ఇట్టి యుత్తమ గ్రంథ మెం తయో శ్రమపడి పూర్వముద్రితగ్రంథములకన్న మిన్నయగునట్లు సుల భశైలిలో నద్వైత విషయముల నెల్లం జక్కఁగఁ జర్చించుటీకాతాత్పర్య ములతో ముద్రింపఁబడినది. విచారించి చూచినఁ బెక్కువిషయములఁబట్టి యీగ్రంథ మద్వైతులకుఁ బరమోపకారకమగునని నొక్కి వక్కాణింప వలసియున్నది. ఇకమనదేశమునందు నూటికిఁ దొంబదిమంది యద్వైత జిజ్ఞాసువు లీగ్రంథమును దప్పక చదువుచుండుటంబట్టియే యీ గ్రంథ ప్రాశ స్త్యము వెల్లడియగుచుండ వేఱుగ వ్రాయ సక్కఱలేదు గదా ! కాబట్టి రాజయోగజిజ్ఞాసువు లందఱు నీగ్రంథమును జదివి తత్స్వరూపమును జక్కగ నెఱింగి బ్రహ్మానందము నొందుదురుగాక!
ఉత్పల వేంకటనరసింహాచార్యులు.