సింహాసనద్వాత్రింశిక/పంచమాశ్వాసము

శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

పంచమాశ్వాసము


క.

శ్రీమత్పన్నగఫణమణి
ధామావృతబాలతుహినధామాంశునిభ
వ్యోమాపగాంబుసుమనో
దామాచరితావతంసు దక్షధ్వంసున్[1].

1


ఉ.

ఇచ్చఁ దలంచి భోజధరణీశ్వరుఁ డంత గ్రహానుకూలత
న్మెచ్చగునట్టిలగ్నమున నిల్చి మహాసన మెక్కఁబూనఁగా
నచ్చటిబొమ్మ వల్కె విను మర్థికి నుజ్జయినీపురీశ్వరుం
డిచ్చినభంగి నీగి మెఱయింపక నీ కిది యెక్కవచ్చునే.

2


క.

అనవుఁడు జనవల్లభుఁ డా
తనివితరణ మెట్లు మెఱసెఁ దగఁ జెప్పు మనం
దనమోవి[2] మందహాసం
బు నటింపఁగ నిట్లు దశమపుత్రిక వలికెన్.

3

పదవబొమ్మ కథ

సీ.

ఎవ్వనిసాహసం బేవేళఁ జూచినఁ
        బరహితంబుల కెల్లఁ బట్టుఁగొమ్మ
యెవ్వనియాజ్ఞ భూమీశుల శిరముల
        మౌశిరత్నావళిమాడ్కి మెఱయు

నెవ్వనివైభవం బెల్లయాచకులకు
        ముంగిటిపెన్నిధి భంగిఁ దోఁచు
నెవ్వనిసత్కీర్తి యీరేడుజగముల
        నాటపట్టుగ నిండి యాడుచుండు


తే.

నతఁడు సామాన్యజనుఁడె ధీరాధినాథ
నిర్మలాత్మకుఁ డత్యంతధర్మమూర్తి
శత్రుసమవర్తి నృపలోకచక్రవర్తి
సత్యసంధుడు విక్రమాదిత్యవిభుఁడు.

4


క.

అట్టివిభుం డుజ్జయినీ
పట్టణమున రాజ్యలక్ష్మిఁ బరఁగుచుఁ బ్రజఁ జే
పట్టి తగం బెంచి సంపద
దట్టంబుగ నిల్చి తల్లిదండ్రులమీఱెన్.

5


వ.

 అట్టిదినంబుల.

6


క.

అకళంకచిత్తుఁ డార్యుఁడు
సకలాగమమంత్రతంత్రసారజ్ఞుఁడు భి
క్షుకవేషధారి యవధూ
తకుఁ డనఁగా నపుడు వచ్చెఁ దత్పురమునకున్.

7


ఉ.

అచ్చటి దేవతాగృహమునందు గతస్పృహవృత్తి నుండఁగా
నచ్చెరువంది పౌరజను లాతనివర్తన విన్నవించినం
జెచ్చెరఁ దోడితెం డని ప్రసిద్ధులఁ బంచిన రాకతక్కినం
దచ్చరితంబుఁ జూడ వసుధావరుఁ డయ్యెడ కేఁగె వేడుకన్.

8


క.

అవనీసురరక్షకుఁ డగు
నవనీశ్వరవరుఁడు చనినయవసరమున న
య్యవధూతకల్మషుం డగు
నవధూతకుఁ డతనిఁ గరుణ నవలోకించెన్.

9

క.

తత్కరవిహితోపాయన
సత్కార మన గ్రహించి సంయమిపతి వి
ద్వత్కులరత్నము భూవరుఁ
దత్కాలసముచి గోష్ఠిఁ దగులంజేసెన్.

10


క.

మా టిడక యాతఁ డడిగిన
మాటలలో సకలశాస్త్రమర్మంబులు ప
ల్మాటును నానావిధములఁ
దేటపడం దెలిపె భూపతికిఁ బ్రియ మడరన్.

11


క.

నిధ్యానంబున నజున క
సాధ్యం బగుతత్త్వబోధసారము కుదురౌ
నధ్యాత్మవిద్యమర్మము
మధ్యమజగతీశునకు సమ స్తముఁ జెప్పెన్.

12


సీ.

క్షోణిపానీయతేజోవాయుగగనాఖ్య
        పంచభూతాంశుసంబంధమైన
మేనిలోఁ గర్జనాసానేత్రజిహ్వాత్వ
        గాహ్వయపంచేద్రియములగోష్టి,
శబ్దగంధాంగరసస్పర్శసంజ్ఞిక
        పంచవిషయములఁ బాలుపఱుచు
ప్రాణప్రభృతిపంచపవనప్రసారంబు
        హృదయాదిపదములఁ బొదలుబుద్ధిఁ


ఆ.

గూడి నిలిచియుండు కుంభకపూరక
రేచకములగతి వివేచకంబుఁ
జిత్తకమలచక్రజీవాత్మపరమాత్మ
యోగసాధనముల నొనరఁ జెప్పి.

13

క.

యోగము కల్మషబంధవి
యోగము పంచేంద్రియాభియోగము, పుణ్యో
ద్యోగము, ముక్తివధూసం
యోగము పరతత్త్వపదనియోగము సుమ్మీ.

14


ఆ.

దుఃఖసాధ్యమయ్యుఁ దొడరి యభ్యాసంబుఁ
జేయఁజేయ యోగసిద్ధిపెంపు
దినఁగఁ దినఁగ వేము తియ్యనౌకైవడిఁ
బిదపఁ బరమహర్షపదము సుమ్ము.

15


సీ.

హఠయోగమంత్రయోగాష్టాంగయోగసా
        ధనయోగలయయోగధర్మములకు
యమనియమాసనధ్యాన ధారణశక్తి
        బవననిరోధంబుఁ బట్టుకొలిపి
నాభిచక్రోపరినలినమధ్యంబున
        నీవారశూకసన్నిభ విభాతి
వెలిఁగెడు తేజంబువెలుఁగున గరఁగిన
        యమృతంబు మదిలోన ననువువార


తే.

నందుఁ గలుగుట సచ్చిదానందమయ్యె
నచటితేజస్స్వరూపంబె యచ్యుతుండు
పంచవింశతితత్త్వప్రపంచమునకు
నతఁడె కారణ మాదినారాయణుండు.

16


క.

కరణాసనభేదంబుల
వెర వెఱఁగి తదంగయోగవితరణసరణిం
బరికించి పెనఁగనేర్చిన
మరగుఁ జుమీ ము క్తికాంత మర్మజ్ఞునకున్.

17

క.

అని బహువిధములఁ జెప్పఁగ
విని జనపతి తెలిసి యోగవిద్యావిభవం
బున రాజయోగి యనఁగా
జనకునిక్రియఁ బ్రజలఁ బెంచె జనకునిభంగిన్.

17


వ.

ఇట్లు కొంతకాలంబు పుచ్చి తన్ముఖకళలం జూచి యోతాపసోత్తమ నీకెన్నియేం డ్లయ్యె నని యడిగిన నతండు యోగికిఁ గాలక్రమంబు విచారింపనేల నూఱేండ్లు వేయేండ్లని యెన్నిక గలదే సిద్ధయోగంబున వజ్రశరీరంబు దుర్లభంబు గాదు.

19


క.

బాధాబిరహితగతికుఁడు
బోధాహితపరమహర్షపూర్ణుఁడు నిజవాం
ఛాధీనమరణుఁ డీక్షణ
సాధితచిన్మూర్తి యోగి సామాన్యుండే.

20


క.

తలనరసినఁ జెక్కులపై
వళు లెగసిన మేని బిగువు వదలిన నేత్రం
బుల నెఱ్ఱసెరలు విరిసిన
జెలువెడలిన యతఁడు[3] యోగసిద్ధుఁడె ధాత్రిన్.

21


క.

అనఁ దద్వచనామృతసే
చనమున యోగంబు సిద్ధిచందము దెలియన్
మనమునఁ గౌతుకకందళి
మొనసూపిన నృపుని నెఱిఁగి మునినాయకుఁడున్.

22


ఆ.

ఎద్దియైన నీకు నెఱిఁగింతు నడుగుము
సిగ్గుపడకు మనుడు క్షితివరుండు

మరణభయము లేనిమార్గంబు చేకుఱు
సిద్ధయోగనియతిఁ జెప్పుమనియెతిఁ.

23


మ.

అనిన న్న్యాసముతో జరామరణశూన్యం బైన మృత్యుంజయం
బను మంత్రంబును హోమతంత్రమును హవ్యద్రవ్యభేదంబు సా
ధనయోగంబుఁ గ్రమంబునం దెలిపి విద్యాదక్షిణానుగ్రహం
బున మన్నించి నరేంద్రు వీడుకొని విప్రుం డేఁగె వింధ్యాద్రికిన్.

24


సీ.

క్షితివరుం డిట యోగసిద్ధికై మంత్రిపై
        రాజ్యభారం బిడి రాముపగిది
జటిలుఁ డై మేన భస్మముఁ బూసి వల్కల
        ధారియై కాననాంతమున కేఁగి
ఋషిభంగి గంగలోఁ ద్రిషవణస్నానుఁ డై
        జపతపంబులఁ బురశ్చరణ చేసి
మంత్రపూతంబుగా మధుతిలదూర్వాజ్య
        హోమంబు జరుపుచు నేమమునను


తే.

నక్తము నుపోష్యమును నేకభుక్త మనఁగఁ
గలుగుదినముల సిద్ధయోగమున నుండి
కందమూలముల నశనకాంక్ష దీర్చి
వ్రతము చరియించె నట్లేకవత్సరంబు.

25


వ.

తదనంతరంబ యొకనాఁటి హోమసమయంబున.

26


క.

ఆహుతి వోయఁగఁ గాంతితి
రోహితుఁడై లోహితాశ్వరోచిఃపటలీ
రోహితుడై యాకుండము
లో హితుఁ డై నిల్చె నీలలోహితుఁ డంతన్.

27


వ.

తదాకారంబు గని సాఁగి మ్రొక్కి నిలిచిన.

28

క.

మృత్రుంజయుఁ డతనితపః
కృత్యమునకుఁ జిత్తవృత్తికిం దగఁగ జరా
మృత్యునివారక మగు ఫల
మత్యాదరణంబుతోడ నాతని కిచ్చెన్.

29


వ.

ఇచ్చి తిరోహితుం డైన.

30


ఆ.

అట్టిఫలము చేత నంది జనేశ్వరుం
డీశ్వరునకు మ్రొక్కి శాశ్వతముగ
నంగసిద్ధి గంటి నని యుల్లసిల్లుచు
మగిడి వచ్చునట్టి మార్గమునను.

31


చ.

పదములుఁ జేతులు న్ముడిఁగి పండులు డుల్లి నిజస్వరంబు గ
ద్గదికఁ బెనంగ నంగమున గ్రంథులు వాఱఁగఁ గుష్ఠరోగమున్
ముదిమియుఁ గూడి రూపు బలుపుం బొలియింపఁగ దైన్యజీవనా
స్పద మగుబ్రాహ్మణుండు జనపాలున కడ్డమువచ్చి యిట్లనున్.

32


క.

ముదిమియు రోగముఁ గూడం
బొదలెడు నిదె మేను నిలువఁబూనదు నాకున్
మది నెఱుఁగుదేని మం దీ
పదనున సమకూర్చి యిమ్ము పరమదయాత్మా.

33


ఆ.

అనిన నతనిఁ దోడుకొనిపోయి తనయింట
మందుమ్రాఁ కొనర్ప మదిఁ దలంచి
యాతఁ డంతదూర మరుదేర లేఁ డని
యాత్మఁ జూచి విక్రమార్కవిభుఁడు.

34


ఆ.

కలిగి పెట్టలేక కష్టుఁ డై న్న దు
ర్గుణుని పాపమునకుఁ గొలఁది లేదు

తన్ను మాని యైన ధర్మంబు చేసిన
యతనిపుణ్యమునకు నవధి లేదు.

35


క.

తుదిముట్టనిబ్రతుకున కా
పదఁ బొదలెడివాఁడు దానపాత్రం బని స
మ్మదమున నార్తులకొఱకై
సదయులు ప్రాణములు తొల్లి చాగము లిడరే.

36


వ.

అని తొల్లింటి రాజులం బ్రశంసించి తనలో శంకింపక సాహసాంకుండు మహోదారుండై.

37


క.

ప్రాణము లడుగఁడు వృద్ధ
క్షోణీసురుఁ డితఁడు మందుఁ గోరెడు దేహ
త్రాణము గావించెద నని
క్షోణీశుఁడు చేతిపండుఁ గోరిక నిచ్చెన్.

38


శా.

దివ్యం బౌఫల మిచ్చినం దిని ధరిత్రీనిర్జరుం డంతఁ గు
స్ఠవ్యాధిస్థవిరత్వదూరతమమై సంపూర్ణతేజఃకణా
భివ్యాప్తం బగు దివ్యదేహ మటుఁ బ్రాపింపంగ నిర్మోకము
క్తవ్యాళేంద్రుని భంగి నొప్పెఁ బతి చోద్యం బంది హర్షింపఁగన్.

39


క.

అర్థికి నీక్రియ నిచ్చి కృ
తార్థుండై కదలి వచ్చె నటుగావున న
ప్పార్థివునకు సరిపూనమి
వ్యర్థము నీతలఁపు భోజవసుధాధీశా.

40


క.

నావుడు భోజక్షితిపతి
భావంబునఁ జోద్యహర్షభరితుం డై ల
జ్జావనతవదనుఁ డగుచు హి
తావృతుఁ డై మగిడి పోయె నంతఃపురికిన్.

41

వ.

మఱియుఁ గొన్ని దినంబులు సనిన నేకాదశద్వారవీక్షకుండై.

41


పదునొకొండవబొమ్మ కథ

క.

సూక్ష్మముగఁ దలఁచెద న్మృగ
లక్ష్మకళారమ్యు వీరలక్ష్మీగమ్యున్
లక్ష్మిలలనావక్షో
జక్ష్మాధరసక్తు భక్తసంహు నృసింహున్.

42


క.

అని నియమంబున భోజుం
డనువగులగ్నమునఁ జేర నరిగి మహేంద్రా
సన మెక్కఁబోఁగ నిలునిలు
మని యచ్చటిబొమ్మ పలికె నచ్చెరు వందన్.

43


క.

పరికింప విక్రమార్కుని
సరిపూనఁ బరోపకారసత్త్వంబులు సు
స్థిరముగఁ గలగనివానికిఁ
దరమే యిట దీని నేక్క ధారాధీశా.

44


క.

అనవుడు నవ్వసుధాపతి
చనునతనిపరోపకారసత్త్వగుణము లె
ట్లనఁ బాంచాలికయును స
ద్వినయంబున భోజనృపతి విన ని ట్లనియెన్.[4]

45


క.

జననాథ రాజసముఖం
బున నున్ననరుండు యోగ్యము నయోగ్యముఁ[5]

ల్కిన నవుఁ గా దన కూరక
వినవలయును సరసమైన విరసం బైనన్.

47


ఆ.

పలుకఁ దగినపలుకు పలుకక యున్నను
బలుకు వినియు వినని పగిది నున్నఁ
బలుకఁ జూచువానిఁ బలుకకు మన్నను
బలుకులేల తల్లి సొలయు నతని.

48


వ.

కావున.

49


క.

వ్యక్తంబుగఁ జెప్పెద నను
రక్తుఁడ వై విను మవంతిరాజుగుణము నా
యుక్తిం జులుకం జూడకు
యుక్తులయెడ నాఁటదాని యోగ్యత గలదే.

50


మ.

సత్యవచోవిశారదుఁడు, శారదనీరదసంస్ఫురద్యశో
నిత్యుఁడు నిత్యదానగణనీయుఁడు విజ్ఞజనావళీమనో
వృత్యనుసారి సారబలవిక్రమకృత్యుఁడు నాఁగ విక్రమా
దిత్యుఁ డవంతి యేలె నలు దిక్కులరాజులు పంపు సేయఁగన్.

51


వ.

అట్టిమహీపాలుండు షణ్మాసరోజ్యప్రతిపాలనంబును షణ్మాసదేశాంతర వనాంతర ప్రవాసంబును నవశ్యకర్తవ్యం బగుటం జేసి యొక్కసమయంబున రాజ్యం బరాజకంబు గాకుండ భట్టి నుజ్జయిని నునిచి యసహాయశూరుండు గావున నొంటి నిగూఢవేషంబున దేశాంతరనగరగహనవిశేషంబులు చూచుచుం జని చని యొక్కనాఁడు.

62


ఉ.

పణ్యపథంబు భంగి భయభంగము నొందక చొచ్చె దండకా
రణ్యము శైలగర్భితహిరణ్యము తాపసచిత్తనిత్యకా
రుణ్యము గంధబంధురసరోజరజోవనరాజిలక్ష్మణా
గణ్యము[6] పత్రపుష్పఫలగణ్యముఁ బుణ్యజనానుగుణ్యమున్.

53

వ.

చొచ్చి యనుష్టుప్ఛందంబునుం బోలె హంసరుతయుతంభై త్రిష్టుప్ఛందంబునుం బోలె భ్రమరవిలసితంబై జగతీచ్ఛందంబునుం బోలెఁ గుసుమవిరిత్రాంబరంబై యతిజగతీచ్ఛందంబునుం బోలె మత్తమయూరసేవితంబై శక్వరీచ్ఛందంబునుం బోలె సింహోద్ధతాశ్రయంబై యతిశక్వరీచ్ఛందంబునుఁ బోలె సుకేసరభాసురంబై యష్టిచ్ఛందంబునుం బోలె హరిణీసంశ్రితంబై ధృతిచ్ఛందంబునుం బోలె మత్తకోకిలాకలితంబై యతిధృతిచ్ఛందంబునుఁ బోలె శార్దూలవిక్రీడితలక్షితంబై కృతిచ్ఛందంబునుం బోలె నుత్పలమాలాయుక్తంబై ప్రకృతిచ్ఛందంబునుం బోలెఁ జంపకమాలాసహితంబై సంకృతిచ్ఛందంబునుం బోలె సరసిజచిహ్నితక్రౌంచపదాంకితంబై[7] యుత్కృతిచ్ఛందంబునుం బోలె భుజంగవిజృంభితసంగతంబై యున్న యవ్వనాంతరంబునం దిరుగునప్పుడు.

54


క.

ఇల నందఱుఁ దను సైరిం
పలే రనుచు వెట్టయైన బ్రదుకొల్లక తాఁ
గలుమడుఁగు లుఱికెనో యన[8]
జలజాప్తుం డస్తశిఖరిచటి దిగబడియెన్.

55


వ.

అప్పుడు.

56


క.

బహుయోజనదూరము లగు
గహనంబుల నుండి యెగసి కలకలములతో
విహగంబులు నిలయమహీ
రుహముల కరుదెంచెఁ బంక్తిరూపం బలరన్.

57

క.

బంధురమదాంధదిక్కూ
లంధరగజగండమండల ప్రచలితపు
ష్పంధయనిభనీలిమ జగ
దంధంకరణప్రసార మై తమ మొదవెన్.

58


వ.

తత్సమయంబున.

59


ఆ.

ఆదిమూర్తిక్రియ సహస్రశాఖలను స
హస్రపాదములను నవనిగగన
భాగపూర్ణ మగుచు భవ్యమై ద్విజకుల[9]
సేవ్య మైనతరువుఁ జేరె విభుఁడు.

60


సీ.

ఏమ్రానిమూలంబు లిలకు నాధార మై
        శేషుపడగలతోఁ జెలిమి సేయు
నేవనస్పతికొమ్మ లెక్కి యాడంగ ది
        గంతబాలికలకు నందికోలు
ఏవృక్షమునఁ గల యి రహర్నిశ మంధ
        తమసంబునకు నుండఁ దల్లియిల్లు
ఏపాదపముతుద నెడనెడఁ గాలూఁద
        రవిహయంబులకు విశ్రామభూమి


ఆ.

యేమహీజమునిలు వెల్లపక్షుల కున్కి
పట్టు నాఁగ నెగడి ఫలదళముల
నబ్జరాగమరకతాంచితైకస్తంభ
హర్మ్యసామ్యమందు నట్టివటము.

61

క.

ఆవటము క్రిందఁ దలిరుల
నావటముగ శయ్య దీర్చి యందు సమస్త
క్ష్మావరమణికోటీర
స్థావరనిజశాసనుండు శయితుం డయ్యెన్.

62


వ.

ఆవేళ నాతరుశాఖాంతరంబున నున్న చిరజీవి యను వృద్ధపక్షీశ్వరుండు తనచుట్టు వచ్చి యున్నపిట్టలం జూచి మీరు దిరిగిన వనంబుల నపూర్వంబు లేమి గంటి రని యడిగిన వానిలోఁ గుక్షింభరికుం డనువిహంగం బోస్వామీ నీ వెఱుంగని యపూర్వంబులు లే వట్లున్నను నొకటివవింటి నవధరింపుము.

63


మ.

ఖగవంశోత్తమ నేఁడు గుంపుగ నుషఃకాలంబున న్వేడ్కతో
గగనా భోగము నిండ నే మెగసి పక్షశ్రేణివాతోద్ధతి
న్నగము ల్దూలఁగఁ బోయి వింధ్యముచఱి న్నానాదిగంతాగతం
బగు నాత్మీయగణంబుఁ గూడి యొకపుణ్యారణ్యమధ్యంబునన్.

64


క.

కంకాలఖండనుండను
కంకము విహగములు గొలువఁగా నిజమిత్రా
తకం బగుశోకాంబుధిఁ
గ్రుంకఁగ నేగితిమి వానికుంచుట దెలియన్.

65


క.

ఏఁగినఁ నాతం దశ్రులు
దోగిననయనములఁ జూపు దోఁపక తనలోఁ
గ్రాఁగుచునుండఁగ నేమా
పాఁ గెఱిఁగినభంగి నొయ్యఁ బలికితి మతనిన్.

66


క.

పిట్టలము మేము నీకల
చుట్టాలము మమ్ము నేల చూడవు నీకి
పట్టున వలవనిశోకము
పుట్టెడుకత మేమి చెప్పు పొందుపడంగన్.

67

ఉ.

నావుడుఁ జూచి యతఁడు మనంబు యథాస్థితి నిల్పి యిట్లను
న్వేవురు బాంధవు ల్గలుగ వేదనఁ బొందఁగ నాకు నేల మీ
కీవిధిచొ ప్పెఱుంగఁ దగునేని వినుం డిఁక వింధ్యకందర
గ్రావముఁ జెంది యుండె నొకరక్కసుఁ డక్కడ నిక్కువంబుగన్.

68


శా.

ఆమాంసాగనుఁ డుక్కు పిక్కటిలఁగా నాత్మాంతికద్వాదశ
గ్రామాంకస్థుల నెల్లవారలఁ దినంగా నందఱు న్భీతి మై
స్తోమం బై చని సాగి మొక్క యొకమర్త్యు న్నిత్యము న్నీ బహి
ర్భూమి న్నిల్పెద మారగింపుము నవాపూపాదియుక్తంబుగన్.

69


మ.

అని సంప్రార్థన చేసి యేఁగి నిజమర్యాదావిధిం బ్రాప్తుఁ డౌ
మనుజుం గమ్మనిపిండివంటలును సన్మానంబుతోఁ దెచ్చి య
ప్పనసేయం గని యార్చుచు న్వెడలి వ్యాపాదించి[10] తృప్తాస్థగాఁ
దినుచుండుం దనుజుండు యత్నమునఁ బత్నీయుక్తుఁడై నిచ్చలున్.

70


వ.

ఇ ట్లనుదినంబును నరబలి జరగు నెల్లిటిదినంబున.

71


క.

మన్మిత్రుఁ డైన యొక్కద్వి
జన్మకుమారకుని వరుస చనుదెంగిన దే
తన్మూలము నాశోకము
సన్మార్గికిఁ గలియుగమున సౌఖ్యము గలదే.

72


మ.

అనిన న్విస్మయ మంది మేము ఖగవర్యా నీకు నవ్విప్రబా
లునకుం జుట్టఱికంబు కీలుం జెప్పుమా నావుడున్
వినరయ్యా యుపకారహీనుఁడ భయావిష్ణుండ నిర్భాగ్యజీ
వనుఁడం జెప్పెద దీని కారణము మీవాలాయపుంబల్కులన్.

73

ఉ.

ఏనును బిల్లలుం గలయ నెల్లెడఁ ద్రుళుచు నుల్లసిల్లుచుం
గాననభూమిలోఁ దిరుగఁగా నొక చెం చురు లొడ్డిపోయినం
గానక తూఱుచో మెడలుఁ గాళ్లును జుట్టలుగొన్న దిక్కులన్
దీనులమై కలంగి నలుదిక్కులుఁ జూచుచునున్న యత్తఱిన్.

74


క.

ఫలకుసుమసమిత్పర్ణం
బుల కట చనుదెంచి మమ్ముఁ బొడఁగని కరుణా
కలితుఁ డయి యక్కుమారకుఁ
డలజడిఁ బడకుండఁ ద్రెంచె నయ్యురు లెల్లన్.

75


క.

అతనికృప నిట్లు బ్రతికితి
క్షితి రాఁబులుఁగులకు నెల్ల సేవ్యుఁడనై విం
శతివర్షంబులు పెరిఁగితి
గతి సేసిన యతనికీడు గనుఁగొనవలసెన్[11].

76


క.

తనకుపకారము చేసిన
మనుజునకు న్మేలు గోర మరగక[12] దు:ఖం
బున కడ్డుపడక యుండిన
జనుని బ్రదుకు మేఁకయఱితిచన్నుం బోలున్.

77


క.

రాక్షసిని జంపనోపను
బక్షిని దుర్బలుఁడ నన్ను బ్రతినిధి గాఁగన్
భక్షింపు మనిన మాంస
ప్రక్షీణతఁ జూచి వాఁడు పైఁబడఁ డిటకున్.

78


చ.

అనవుడుఁ దత్ప్రతిక్రియ కుపాయము గానక చింతఁ జెంది యా
తనిఁ దగ నూఱడించి మదిఁ దారుచు వచ్చితి మేము నావుడు

న్విని చిరజీవి పల్కె నరవిందభవుం డలికంబునందు వ్రా
సినయది తప్పునే పరులచేతఁ జరాచరభూతకోటికిన్.

79


క.

ఈ క్రమమునఁ బలుకఁగ విని
విక్రమభూషణుఁడు బాలవి ప్రత్రాణా
పక్రమమున నిద్రింపక
శుశ్రోదయవేళ కెదురు చూచుచు నుండెన్.

80


ఆ.

అంత భార్గవోదయంబైన వెలుఁగునం
దెరువు గానవచ్చు తెఱఁ గెఱింగి
కదలె వింధ్యగిరికి గండభేరుండాది
ఘోర మైనయడవిఁ గొంకులేక.

81


చ.

జలజల మంచునీ రొలుకఁ జల్లనిగాడ్పులు వీవఁ దారక
ల్మలమల మగ్గఁ జీఁకటి క్రమంబున డిగ్గ విహంగసంఘము
ల్మలకలం బల్కఁ దూర్పున వికాసము కెంపునఁ గూడియాడఁగా
బలబలఁ దెల్లవాఱె జనపాలకుఁ డేఁగువనాంతరంబునన్.

82


క.

ఒకసారె యేడుతేజులు[13]
వికలాంగుఁడు సూతుఁ డనిలవీథి తెరువుగా
నొకరథమునఁ ద్రిభువనములు
నొకనాఁటనె తిరుగునాతఁ డుదయము సేసెన్.

83


క.

ఆపర్వత మెక్కుచు గజ
రూపంబగు తిమిర మణఁచి లోహితకాంతి
వ్యాపితకరనఖరుండై
దీపించె మృగేంద్రుకరణి దినమణి కణఁకన్.

84

సీ.

పూర్వదిక్పతి యొద్దఁ బొలుపారు గొడుగుపై
        ఖచితమౌ మాణిక్యకలశ మనఁగ
విబుధబాలురఁ గూడి వేడుకతోడ జ
        యంతుఁ డాడెడి బట్టుబంతి యనఁగఁ
బ్రాచీవధూటికాఫాలభాగంబునఁ
        బెట్టిన కెంపులబొ ట్టనంగఁ
దెలివితో నాడెడి దివసఫణీంద్రుని
        తలమీఁద నున్న రత్నం బనంగ


తే.

రక్తకాంతి మెఱయ రచితరక్తాశోక
కింశుకాగ్రగుచ్ఛసంశయంబు
పొడుపుఁగొండమీఁదఁ బొడతెంచెఁ ద్రైలోక్య
మండనంబు భానుమండలంబు.

85


క.

దల మగుదీధితి నుదయా
చల మలరఁగ రూపబోధజననచ్ఛాయా
కలితంబై యర్కునిమం
డల మప్పుడు రత్నదర్పణముగతి నొప్పెన్.

86


సీ.

ఎవ్వనియుదయ మీరేడులోకములకు
        దిక్కాలవృత్తులు దెలుపుచుండు
నెవ్వనితేజ మగ్నీందువైభవముల
        కాధారమును దానయై వెలుంగు
నెవ్వనిమండలం బెల్లయోగీంద్రులుఁ
        జేరుముక్తికి మణిద్వారభూమి
యెవ్వనిమూర్తి వాణీశశంకరవిష్ణు
        రూపమౌ వేదస్వరూప మండ్రు

ఆ.

ఎవ్వఁ డిష్టజనుల కిష్టదర్శనమునఁ
బావసంచయంబుఁ బాపుచుండు
నట్టిలోకమిత్రుఁ డైన తేజోనిధి
కోకములకు విరహశోక మణఁచె.

87


మ.

గిరిశృంగంబుల గైరికాకృతిని శాఖిశ్రేణిపైఁ బల్లవో
త్కరలీలం గరిరాజకుంభములమీఁద న్రక్తచూర్ణాకృతిన్
శరధిద్వీపములం బ్రవాళరుచిఁ గాసారంబుల న్శోణపు
ష్కరకాంతిం దరుణాతపంగం బడరె దిక్కాంతాంగకాశ్మీరమై.

88


చ.

కలువలవైరి జక్కవలఁ గావఁగఁబూనిన దాత ముజ్జగం
బులకును సాక్షి యంబరవిభూషణ మానెలతాల్పువేల్పుకు
న్వలపలికన్ను ముక్తితలవాకిలి చీఁకటివీడుకోలు నా
వెలుఁగులఱేఁడు తామరలవిందు వెలుంగుచునుండె నయ్యెడన్.

89


క.

సంధ్యావందనవిధి యా
వింధ్యానదిలోనఁ దీర్చి విభుఁ డనవరతా
వంధ్యారంభుం డల్లన
వింధ్యాద్రిబిలంబుఁ జేరె విప్రునిఁ గావన్.

90


క.

కాలుని కేళీశైలముఁ
బోలెడునచ్చోటి యస్థిపుంజముఁ గని భూ
పాలుఁడు మనమున నధికకృ
పాళుండై వధ్యభూమి బలియై నిలిచెన్.

91


ఆ.

అంత నింతిఁ గూడి యసుర యార్చుచు వచ్చి
యోరి పిండివంట లుజ్జగించి
నేఁడు నీవె వచ్చినాఁడ విదేమిరా
యనుడుఁ దెలియఁబలికె మనుజవిభుఁడు.

92

క.

ఓరాక్షస నే నొక్కని
బారికినై యడ్డువడితిఁ బరదేశిఁ బ్రియా
హారముగ మెసవు పక్వా
హారంబులు వెనుకవచ్చునంతకు నన్నున్.

93


మ.

అనినం జిత్తములోన దానవుఁడు చోద్యం బందుచు న్నీదుపూ
నినసత్కార్యము సెల్లు మెచ్చితిఁ జుమీ నీకిష్ట మెద్దేని వేఁ
డిన నే నిచ్చెద నావుడుం గరుణదృష్టిం గల్గ నీక్షించి య
జ్జననాథుండు పరోపకారకరణోత్సాహంబుతో నిట్లనున్.

94


క.

ఇప్పుడు నీ వాడినయది
తప్పకుమీ తఱచుగాఁగ దానవులకడం
దప్పును గల వని పెద్దలు
చెప్పుదు రొకచోట సత్యశీలము లేదే.

95


చ.

నయమునఁ బూర్వదేవతలు నాఁగఁ బ్రసిద్ధికి నెక్కె రాక్షసా
స్వయము జగంబులో నసురవంశవిభూషణ[14] మీవు నీవచో
నియమముఁ దప్ప నేరుతువె నీదుకళత్రము సాక్షి గాఁగ నా
ప్రియమును నీవునుం బ్రియము పెంపునఁ జేయుము[15] నిన్ను వేఁడెదఁన్.

96


క.

దనుజేంద్ర నేఁడు మొదలుగ
మనుజాహారంబు గొనుట మానుము కృపతో
జనులకుఁ బ్రియ మొసఁగుచు నీ
వనమున నెలకొనుము వింధ్యవాసిని కెనయై.

97


తే.

అనుడు నవ్వర మిచ్చెదనని తలంచి
ముదితహృదయుఁడై తనయింతిమోముఁ జూచి
యితని సరిపోల్ప నెవ్వరి నెన్నవచ్చు
వనిత యీతఁడు జీమూతవాహుమీఱె.

98

వ.

అనిన నా రాక్షసి కుతూహలంబున నిట్లనియె.

99


జీమూతవాహనుచరిత్రము

క.

జీమూతవాహుఁ డెవ్వం
డేమి ఘనత[16] చేసి వెలసె నిక్కథఁ దెలియం
గా మనుజాంతక చెప్పుము
నా మనమున హర్షవల్లి నాటుకొనంగన్.

100


వ.

అనుడు నద్దనుజుండు పుణ్యపురుషునియెదురం[17] బుణ్యపురుషకీర్తనం బుచితం బని యిట్లనియె.

101


సీ.

ప్రాలేయగిరిమీఁద భానుబింబద్యుతి
మణిమయప్రాకారమహిమతోడఁ
దిరమైన కాంచనపురములో జీమూత
కేతుఁడు నాఁగ విఖ్యాతయశుఁడు
ఖచరవల్లభుఁ డొకకనకవతీసంజ్ఞఁ
బరఁగెడుకన్యకఁ బరిణయించి
ప్రీతిసంధిల్ల జీమూతవాహుం డనఁ
దగునట్టి పుత్రరత్నంబుఁ బడసి


ఆ.

రాజ్యలక్ష్మిచేతఁ బూజ్యుఁడై కడపట
వార్ధకమున భోగవాంఛ వదలి
నిజపదమునఁ బుత్రు నిలిపి నీతులు సెప్పి
వనితఁ గూడి యేఁగె వనమునకును.

102


క.

జీమూతవాహనుండు మ
హామహిమాఖండలుండు యాచకజనచిం

తామణి శరణాగతర
క్షామణి ఖచరేంద్రకులశిఖామణి యయ్యెన్.

103


క.

పితృదత్త మైన కల్ప
క్షితిరుహ మర్థులకు నొసఁగి చిక్కిన ధనసం
హతిఁ దనబంట్లకుఁ బ్రజలకు
హితులకుఁ దగ నిచ్చె రిపుల కెడ రిడి యనఁగన్.

104


ఆ.

పురముఁ గొనఁదలంచు, నరులఁ జంపఁగఁబూని
జీవహింస కోడి చింతనొంది
తల్లిదండ్రు లున్నఁ దగుఁగాక యిదియేల
యనుచు గురులజాడ నరుఁగఁ దలఁచె.

105


వ.

తలఁచి సఖుం డైన మధుకరుం గూర్చుకొని యరిగి తజ్జననీజనకులం గని సాష్టాంగంబుగాఁ బ్రణమిల్లిన వారలు సంతుష్టాంతరంగులై యుండం జేరి.

106


క.

తత్పదపంకజసేవా
తత్పరమతి విరులుఁ బండ్లుఁ దాఁ దెచ్చుచు నా
సత్పురుషుఁడు మలయమహీ
భృత్పార్శ్వమునం జరించెఁ బితృభక్తుఁ డనన్.

107


మ.

ఒకనాఁ డిష్టసఖుండుఁ దాను ఫలపుష్పోపార్జనాసక్తితో
వికచాంభోజసరోవరంబుల నవావిర్భూతచూతాదిజా
లకజాలంబుల రాజకీరమదరోలంబాగ్రపుష్పంబులం
బ్రకటశ్రీగుణగణ్యమౌ నొకతపోరణ్యంబు సొత్తేరఁగన్.

108


క.

ముందఱ గౌరీమందిర
మందారనవారవిందమాకందలతా

కుందమకరందబిందు
స్పందానందనుఁడు మందపవనుఁడు వీచెన్.

109


వ.

అంతఁ దదాగతకుసుమామోదవాసితమలయసమీరాప్యాయనశరీరాయాసాపహారుండై.

110


క.

ఎడపని కూరిమితో న
య్యెడఁ బుత్రికి నీడ యైన హిమశైలము కై
వడి బెడఁ గడరెడు పటికపు
గుడి బొడఁగని యక్కుమారకుం డటుచేరెన్.

111


క.

అంగనమున నభ్యంతర
సంగీతాకర్ణనమునఁ జలియింపక వే
డ్కం గసవు మేయకున్నకు
రంగంబులఁ జూచె నంతరంగు బలరన్.

112


వ.

చూచి తత్సంగీతప్రసంగసాంగత్యకారణం బగు జాణం జూతము రమ్మని యిష్టసఖుం డైన మధుకరుం గూడి తద్ద్వారంబుఁ దూఱి.

113


సీ.

చిన్నిచన్నులమీఁదఁ జేర్చినవీణియ
చేఁదోడుగా శ్రుతిస్థితులఁ దీర్చి
సరిగమపధను లన్సప్తస్వరంబుల
గమకంబు లయవిభేదముల నెఱపి
నాదామృతంబున ననిచినక్రియఁ దంత్రిఁ
బెనఁగొని నఖకాంతి గొనలుసాఁగ
రాగకదంబంబు రంజిల్లఁ జేయుచు
నాలతి వీనుల కమృత మొసఁగ


ఆ.

గానరసవశమునఁ గనుఁగవ మోడ్చుచు
బోటిఁ గూడి వాణిబోటిఁ బోలె

గౌరిఁ బాడుచున్న కన్యకారత్నంబుఁ
జూచె నచట దాలఖేచరుండు.

114


వ.

అంతఁ దదీయలావణ్యమధుమత్తనయనమధుకరుండై మధుకరునితో నిట్లనియె.

115


క.

వనితారత్నము నవయౌ
వనయై పొదరింట నున్నవనలక్ష్మిక్రియన్
దొన నున్నమరునిబాణం
బన నున్నది యిచట మోహనాకృతితోడన్.

116


సీ.

ఇది దేవకామిని యేని నింద్రుని వేయు
        గన్నులు సఫలము ల్గాక యున్నె
యిది నాగకన్యక యేనిఁ బాతాళంబు
        సోముఁడు లేఁ డని శూన్య మగునె
యిది ఖేచరాంగన యేని మాజాతికి
        బ్రభ యెక్కు చెఱకునఁ బండుగాదె
యిది సిద్ధబాలిక యేని లోకంబులో
        సిద్ధకులంబు ప్రసిద్ధిఁ గనదె


ఆ.

యిది వనాంతలక్ష్మి[18] యేని వనం బెల్లఁ
బల్లవింపకున్నె యెల్లయపుడు
నిది సుధాంశురేఖ యేని యీగుడి నున్న
శిలలు చంద్రకాంతశిలలు గావె.

117


క.

పరసతులను దల్లులఁగాఁ
బకెకించెడు నాకు దీనిపైఁ జిత్తం బే
వెరవునఁ దగిలెనొ యిది కృత
పరిణయ గాకుండఁబోలుఁ బరికింపుదమా.

118

వ.

అని యంతకుమున్న నిజదర్శనంబునఁ జంద్రావలోకనంబునం గరంగు చంద్రకాంతంబు క్రియఁ జిత్తంబు గరంగి మేన ఘర్మజలంబులు మణిగణభూషణంబులుగా లజ్జారాగనిమగ్నయై వనుబేటంబున గాటంబగునారాటంబునఁ దుంటవిల్తుండు మానంబు వేఁటాడ[19] బోటి పూఁబొదమాటు సొరం దలంచునెడ వసంతానుగమ్యమానుండగు మీనకేతనుని భాతి డగ్గఱి యోలీలావతి నీ వెవ్వరిదాన వీగౌరీగేహంబున కరుగుదేరం గారణం బేమి నావుడు విని చతురికయను తత్సఖి లేచి బాలలకుఁ బ్రౌఢత్వంబు గలదె యేను విన్నవించెద నవధరింపుఁడు.

119


క.

వసుమతిఁ బరఁగిన మిత్రా
వసుసోదరి సిద్ధవంశవరుఁ డను విశ్వా
వసుసుత మలయవతి విభా
వసునిభుఁడగువరుని వేఁడవచ్చిన దిటకున్.

120


వ.

అనిన నక్కుమారుండు నామాట తప్ప దిది కన్యక యగుట వింటివే యనుడు నమ్మధుకరుండు దైవయోగమ్మున సమానవయోరూపంబులు గలవధూవరు లిట్లు గూడుదురే యని.

121


క.

వనరుహగర్భుని నేరమి
ననురూపసువస్తుయోగ మగపడదు జగం
బున మీబోంట్లకు నగపడుఁ
గనకము రత్నమ్ముఁ గూడుకైవడి నొకచోన్.

122


వ.

అని చతురికం జూచి నిజసఖుని దెసం జూపి.

123


క.

జీమూతకేతుసుతుఁ డరి
జీమూతసమీరణుండు చిత్తజనిభుఁ డౌ

జీమూతవాహుఁ డీతఁడు
జీమూతస్థిరుఁడు ఖచరశేఖరుఁడు చుమీ.

124


క.

అనవుడు నది మలయవతిం
గనుఁగొని యది గౌరికరుణ గలిగెం జెలియా
మునువిందు మితఁడు రూపసి
యనఘుఁడు వరియింపు మితని నతిమోదమునన్.

125


ఉ.

నావుడుఁ గన్యకామణి మనంబునఁ గూరిమి నాటుకొల్ప నా
భావజుబాణము ల్మిగులఁ బజ్జఁ జరించినఁ దత్పరాగమో
నా విలసిల్లి లేఁజెమట నవ్యముగాఁ గుచసీమఁ దోఁప ల
జ్జావనతాస్యయై నిజవయస్యకు నుత్తర మీక యుండినన్.

126


వ.

చతురిక మఱియు నొత్తి పలుకునప్పుడు.

127


సీ.

జనని పుత్తెంచిన సఖి వచ్చి పిల్చిన నిఁక నుండరా దని యిచ్చఁ దలఁచి
పోయినఁ బ్రియుఁడెట పోవునో యని నిల్చి తడసినఁ గోపించుఁ దల్లి యనుచు
గదలి వేదన మదిఁ బొదలఁగా నేటికి నెదురీఁదుచాట్పున నింటి కేగి
బలవంతమైన యావలవంత మదిలోన వేఁగుచు నొకచోట వెచ్చనూర్చు


ఆ.

చున్నఁ జూచి చెలియ లొయ్యనఁ జనుదెంచి
హృదయతాప మెఱిఁగి మదిఁ గలంగి
చంద్రకాంతవేది శయ్యాతలంబుపైఁ
జేర్చి శిశిరవిధులు సేయునపుడు.

128


క.

పుప్పొడియుఁ బువ్వుఁదేనెయుఁ
గప్పురమును జందనంబుఁ గలపిన పన్నీ
రప్పొలఁతుకపైఁ జిలికిన
నిప్పుపయిం జిలికినట్టి నెయ్యిం బోలెన్.

129

సీ.

కుప్పలు గొనఁజల్లుపుప్పొడి యెరువుగాఁ
        బొరిఁబొరివిరహాగ్నిఁ బొగులఁజొచ్చె[20]
ఘనసార మిళితచందనపంక మురమునఁ
        దొడిఁదొడి నెఱియలు విడిచి చిటిలె
సెజ్జపై బఱిచిన చెంగల్వరేకులు
        స్రుక్కి మై సోఁకినఁ జూర్ణ మయ్యె
విసనకఱ్ఱలు చేసి విసరుచో నావులఁ
        గదలీదళంబులు గ్రాఁగి ముఱిఁగె


ఆ.

మోవికెంపు డిందె ముత్తియంబులు గందె
గంకణముల లక్క కరఁగిపాఱెఁ
జలువమందు లెల్లఁ జెలువ మందఁగఁ జేయ
నెడఁద మదనతాప మినుమడించె.

130


క.

కలకలఁ బలికెడు చిలుకల
కలకలములుఁ గోకిలముల కలరవములు నా
కులపఱుప నళికులంబులు
నులుకఁగ నయనముల జలము లొలికెం జెలికిన్.

131


వ.

ఇట్లు పెచ్చగిల్లిన[21] పచ్చవిల్తువెచ్చ వెచ్చు నెచ్చెలిం జూచి కలంగి ప్రబలదర్పితుం డగు నాదర్పకుని దూఱం దలంచి చతురిక యిట్లనియె.

132


క.

వలరాజ నిన్ను రూపున
గెలిచిన జీమూతవాహు గెంటింపఁగ లే
కలఘుమతి నబల నొంచెదు
పలువురు వినిరేని బంటుపంతము డిగదే.

133

మ.

అళులారా యలికుంతలం జెలిమితో నానంద మందింపుఁడీ
చిలుకా చిల్కలకొల్కి నేపక సఖీస్నేహంబు వాటింపుమీ
వలరాజా వలవంత మాన్పుము పికద్వంద్వంబ యీద్వంద్వముం
గలయం గోరుము మారుతా మరలుమీ కన్నంత నిక్కన్నియన్.

134


వ.

అనునప్పు డక్కుమారఖేచరున కైన యత్తాపమునకుం దాప యగు నాదిఖేచరుం డాదిత్యుండు కాంతి సడలినట్టు దిరిగి చని ఘనపుష్పరాశితల్పంబునం దనమేను సేర్చిన.

135


క.

జడనిధి వెలువడి యెఱ్ఱగఁ
బొడమెడు కిరణములు శిఖిలపోలిక నిగుడం
గడగి యుడురాజు విరహుల
బడబానల మనఁగ నుదయపర్వత మెక్కెన్.

136


ఆ.

అంత జగమునిండ నచ్చవెన్నెల పర్వ
నందులోని వేడిఁ గంది కుంది
కాఁగఁబెట్టినయుదకంబులోపల నున్న
మీనువోలె బాల మిడుకఁజొచ్చె.

137


వ.

ఇట్లధికపరితాపంబునం బురపురం బొక్కుచున్న కన్నియం జూచి కళవళించి చెలులు మెత్తన నెత్తుకొని చని గుడువెందపందిరిక్రింద నరవిందతల్పంబుపై నిడి దైవం బేమి దలంచునో యని దానిమేని కట్టావులం గ్రాఁగిన తమ్ము సవరించుకొనుచు.

138


క.

తను నంట నోడి వనజా
ననకును జేమంతిపుప్వునం గొని పన్నీ
రెనయ మెయిఁ బూయుచోఁ గ్రాఁ
గినపెనమున నొలుకు నూనె క్రియఁ జుయికొట్టెన్[22].

139

క.

అస్తోకంబుగ నత్తా
ళస్తని కుచమండలమున లలనలచే వి
న్యస్త మగుచకదనము నవ
కస్తూరీలేపనంబుకై వడిఁ దోఁచెన్.

140


వ.

అవి యన్నియుం జూచి డగ్గఱ బెగ్గిలి చతురిక న్యాయనిష్ఠురోక్తులఁ జంద్రు నుద్దేశించి.

141


క.

ఉడురాజ నీవు పొడిచిన
జడనిధి యుడుకెక్కి వెక్కసంబునఁ బొంగున్
బడబాగ్ని మీఱి నావుడుఁ
బడఁతుక నీవేఁడిఁ జిమిడిపడ కెట్లుండున్.

142


క.

హరిణాక్షి చూడ్కిఁ గన్నుల
సిరిగోల్పడి యిఱ్ఱి నిన్నుఁ జేరిన నీ వీ
తరుణిఁ దెగఁజూడఁ బోలుదు
పరికింపఁగ నెపుడుఁ బక్షపాతివి గావే.

143


మ.

అమృతాంభోనిధి జన్మభూమి సురభూజైరావతశ్రీసుధా
ప్రముఖంబు ల్తగు తోడఁబుట్టుగు లుమాప్రాణేశుజూటంబు గే
హము బింబం బమృతం బనంగ జగదాహ్లాదంబుగా నిన్నుఁ జూ
తుము నీవేఁడిమి కాలకూటమునకుం దోఁబుట్టు వయ్యెంగదా[23].

144


ఆ.

నాఁడు నేఁడు నీకు నాఁడుఁదోబుట్టువు
లేదా కరుణ లేదు లేశ మైనఁ
బొలఁతిమొగముతోడి పొత్తైనఁ బరికించి
చల్ల సేయుమయ్య చందమామ.

145

వ.

అని వేడుకొని మలయవతిం జూచి.

148


సీ.

వనిత నీకన్ను లొయ్యన విచ్చి చూడవే
        మారుబాణము లరుదేరనోడు
నబల మావీనుల కమృతంబు చిలుకఁగాఁ
        బలుకవే చిలుకలు పలుకనోడుఁ
గోమలీ నీదు ముంగురులు పాటింపవే
        తేఁటిదాఁటులు కొంత దాఁటనోడు
ధవళాక్షి నీముఖదర్పణం బెత్తవే
        సోముఁడు నీదెసఁ జూడనోడుఁ


ఆ.

బడఁతి మమ్ముఁ దగినపనిఁ బంపఁజీరవే
కోకిలంబు లిచటఁ గూయనోడు
మగువ చల్ల నూర్పు నిగిడింపవే యింద
మలయమారుతంబు మలయనోడు.

147


వ.

అని ధైర్యంబు పట్టుకొల్పిన నమ్ముద్దియ తనవేదన దీఱు తెఱంగు చెప్పంబూని వ్రీడావశంబున నోడి మారుప్రేరణం దవులుకొని చెలిం జూచి.

148


క.

ప్రథమముననుండి చిత్త
వ్యథ యెఱుఁగుదు ప్రాణసఖివి వలనైన మనో
రథ మొనగూర్పక యీమ
న్మథుబారికిఁ ద్రోవ నీకు నాయం బగునే.

149


క.

రతిపతికిఁ దోడుపడి యో
చతురిక వెనువెంట మందు చల్లుచు నన్నున్
బతిమాలించెద వకటా
హితులుం బగవారిఁ గూడి రేమనవచ్చున్.

150

వ.

అనిన నోయమ్మ నీ నెమ్మనంబున నింత యుమ్మలికం బేల నమ్ము మతనిం దెచ్చెద నూఱడు మని చతురిక మనోహారిక యను సఖిం జూచి యీచేడియ గౌరీధామంబున జీమూతకేతు కుమారు సుకుమారుం జూచి వలచినయది యది మనరాజున కెఱింగించుట విచారం బగునే.

151


క.

చెప్పినఁ బతి గోపించును
జెప్పకయుండినను బాల చిక్కెడు మనకుం
దప్పులు దొలఁగునుపాయము
చొప్పడు నేదేని బ్రదుకుఁ[24] జూడఁగ వలయున్.

152


క.

అని తలపోయుచు నుండఁగ
వనజంబులు వెలయఁ గుముదవనములు సొలయం
గనుకని చీఁకటి పొలియఁగఁ
దనరుచి దివిఁగలయఁ బొలయఁ దపనుఁడు పొడిచెన్.[25]

153


సీ.

ఆవేళఁ జతురిక యనువునఁ బ్రాణంబు
        నిలుపంగఁబూని యానెలఁత లేపి
యిష్టునిఁ గూర్చెద నేతెమ్ము గౌరిని
        వాసమ్ముకడ కని యాసగొలిపి
కొని చని మాధవీకుంజంబులోపలఁ
        జల్లని పల్లవశయ్య నునిచి
వగవకు జీమూతవాహనుం దెచ్చెద
        నని నాలుగడుగులు నడచునంత

ఆ.

నెదుర మదనుచేత హృదయసంతాపంబు
పొదలఁ బువ్వుఁబొదల మెదలఁబూని
సంగడీనిఁ గూడి యంగనఁ దలఁచుచుఁ
బలవరించు నతనిపలుకు వినియె.

154


వ.

అది యెట్లన్నను.

155


ఉ.

మారుని మోహనాస్త్రము, సమస్తవిలాసవిహారభూమి, శృం
గారరసంబుతేట, తొలుకారుమెఱుంగులపుట్టినిల్లు, సం
సారసుఖంబు లేమొలక , చక్కఁదనంబులప్రోక కాఁకబం
గారముచేగ, యాతరుణి కన్నులపండువ గాదె చూచినన్.

156


క.

నెఱిచెడి యింటికిఁ జనునా
తఱి మొగమున కెగయు తేఁటిదాఁటునకై తాఁ
జెఱికడ బెడమఱి చూచినఁ
జుఱుకున నానెఱను నాఁటెఁజూ పెనుదూపై[26].

157


వ.

తన్మూలంబుగా మన్మథుండు బాణవిరహితుండయ్యె నని తదనంతరంబ.[27]

158


క.

మదనుని యేనమ్ములు నా
హృదయాగ్నిని భస్మమయ్యె నిదిమొదలుగ నీ
పదునాలుగులోకములును
బ్రదుకుఁ గదా వీనిచేతిబాధకు వెలి యై.

159


క.

మధుకర తన్ముఖపంకజ
మధుకరభావమున మిగుల మత్తిల్లి సుధా

మధుర మగు నావధూమణి
యధరము చవిచూడఁ గలుగునా యిఁక నాకున్.

160


వ.

అట్టిబోటి కూటమి లేక మదిం గంది కుంది బ్రతుకుకంటెఁ బ్రాణంబులు దొఱంగుట మే లనిన మధుకరుం డోకుమారకంఠీరవ యిఁతలో ధీరత్వంబు విడుతురే నావుడు నభిమానించి.

161


క.

పూచినరసాలభూజముఁ
జూచితిఁ జంద్రాతపమ్ముఁ జొచ్చితి నిన్నన్
నీచేతికదళిదళముల
వీచోపులగాలినుంటి వీరుఁడఁ గానే.

162


వ.

అనునెడం జతురిక డగ్గఱి తనచెలి వల పెఱింగింపం బూని.

163


క.

వీరుఁడవు మేరుభూధర
ధీరుఁడ వత్యంతదానదీక్షాజితమం
దారుఁడవు భూరికరుణో
దారుఁడ వయితేని బాల దయఁ జూడుమిఁకన్.

164


వ.

అని మఱియును.[28]

165


క.

మలయాచలసానువుపై
మలయుచుఁ జనుదేర గౌరిమందిరమున నీ
ర్మలయశుఁడ వైన నిను మా
మలయవతీకన్య చూచె మానముదూలన్.

166


క.

అది మొదలుగ మరునమ్ములఁ
జెదరినదైర్యమున జేయి చెక్కిట నిడి స

మ్మద ముడిగి మనము నీపై
గదియించును జూడ్కి బాష్పకణములు దొరఁగన్.

167


క.

భావజనిభుఁడగు నాతని
భావంబునఁ గూర్మి నిలిపి పరిరంభణసం
భావన సుఖ మొనగూర్చెడు
దైవము నాపాలఁ గలుగదా యని తలఁచున్.

168


క.

అనిమేషంబునఁ బ్రియునిం
గనుఁగొనఁగాఁ గోరు కన్నుఁగవ కడ్డము వ
చ్చినఁదనుఁ గోపించు నొకో
యని కన్నులఁ జేర నిద్ర యలుకుచునుండున్.

169


క.

విను గడు సన్నం బగునీ
మనముఁ బ్రవేశింప నిదియ మత మగు నని డ
స్సెనొకాక యనఁగ నంగన
తనతనువునఁ దనుపు లేక తనువై యుండున్.

170


క.

సారసములు నారసములు
హారంబులు కంటకప్రహారంబులు క
ర్పూరము విషపూరము శృం
గారము బంగార మయ్యెఁ గామినిమదికిన్.

171


క.

నేనుం దానును నొక్కటి
దా నుండఁగ నొరునిఁ దగిలెఁగా యనుచు నుడా
సీనంబు వీడుకోలుగ
మానినికిన్ లజ్జ దలఁగె మరు బేటమునన్.

172


క.

పలికెఁ బొడసూపెఁ బ్రియుఁడదె
పిలిచె ననుం గీరచంద్రపికములయెడ వా

గ్విలసనరవములుఁ బలుకులు
మొలతేరఁగ సంభ్రమించు మ్రొక్కును లేచున్.

173


క.

మోహమున మన్మథానల
దాహము పె ల్లెఱుఁగలేక తనప్రాణంబుల్
దేహమునఁగలుగుటకు సం
దేహముగాఁ జెయ్వులుడిగి దృష్టి మొగుడ్చున్.

174


క.

సతి విడిచిన ప్రాణంబులు
పతి నిలుపఁగ నుండె నేఁగఁ బాడియె యతఁ డీ
యతివ డిగవిడిచి తలఁగిన
నతివేగమ తలఁగి పోద మని యున్న వనా.

175


క.

ఖేచరవంశవిభూషణ
యేచోట వసింపలేక యెత్తుఁబయన మై
నాచెలిప్రాణంబులు నినుఁ
జూచినతావునన యెదురుచూచుచు నుండున్.[29]

176


మ.

అని చెప్పంగ లతాగృహంబుకడఁ బ్రాణాధీశుచే నేఁడు మ
న్నన లే దిం కిట నెన్నిజన్మములకైనన్ భర్త జీమూతవా
హనుఁ డౌఁగాత మటంచు దీఁగెయురిలో నాబాలకంఠంబుఁ దూ
ర్చిన లోకాంబిక యైన యంబిక కృపం జేపట్టి తా నిట్లనున్.

177


క.

హృద్యాకారిణి యీమర
ణోద్యోగం బుడుగు బాలుఁ డుత్తముఁడు యశో
విద్యోతీతుఁ డధికాయువు
విద్యాధరచక్రవర్తి విభుఁడౌ నీకున్.

178

వ.

అనిన ననుమానించునెడ నచ్చతురికయు వియచ్చరకుమారుండునుం బఱతెంచి కంఠంబున నున్న లతాపాశం బూడ్చి భుజలతాపాశం బిడి యింతతెంపు సేయుదురే యేమిదె వచ్చుచున్నవార మని బుజ్జగించిన నుజ్జిజీవిషువగు నజ్జోటి లజ్జామజ్జదవనతానాబ్జయై పులకించి గురుని యనుమతిలేమిం గొందలపడు నెడ మనోహరిణి యనుసఖి వచ్చి గౌరీప్రసాదవిభవం బిట్టిదిగదే యని.

179


ఆ.

అమ్మ నీవు గోరినట్లు మీతండ్రియు
నతని కిచ్చేద నని యెఱుఁగఁజెప్పె
మీకుఁ బెండ్లి సేయ మిత్రావసువునకు
నానతిచ్చె నటకు నరుగుదెమ్ము.

180


ఆ.

అన్నమాటఁ బొంగి కన్నులఁ బ్రియునికి
గన్నె మ్రొక్కి యేఁగె నన్నకడకుఁ
జిత్త ముల్లసిల్ల జీమూతవాహనుం
డాత్మగురులకడకు నరుగుదెంచె.

181


వ.

తదనంతరంబున మిత్రావసుండు జీమూతకేతుం డున్నకడకు వచ్చి యవ్వధూవరుల పరస్పరానురాగం బెఱుకపడం జెప్పి ప్రార్థించి తదనుమతి వివాహవేళ నిశ్చయించి నానానగరనివాసులైన కిన్నరకింపురుషగరుడగంధర్వసిద్ధసాధ్యవిద్యాధరులం గూర్చి యుభయవర్గంబులుగా నేర్చి సకలశృంగారాభిరామంబుగా నొనర్చిన కళ్యాణమండపంబున నున్నసురేంద్రాదిసురలు వధూవరులం జూచి సదృశకులవయోరూపలావణ్యంబులు గల మిథునంబుం గూర్చుటకుం బితామహునిం గొనియాడుచుండ.

182


సీ.

అప్సరఃస్త్రీలు కళ్యాణగానంబులు
        తెఱఁ గొప్పఁ బాడగాఁ దివ్యమునులు

ప్రకటించి మంగళాష్టకములు చదువంగ
        రత్నములం దలఁబ్రాలుగాఁగ[30]
నగ్నిదేవుండు ప్రత్యక్షమై సాక్షిగాఁ
        దగ బ్రహ్మమునులు మంత్రములు సెప్ప
నిర్జరకాంతలు నివ్వాళులిడఁ[31] గల్ప
        వృక్షంబు లొగిఁ బుష్పవృష్టి గురియ


ఆ.

సురలు పరిణమింప సురదుందుభులు మ్రోయ
నారదుండు దీవెనలుగఁ బాడ
విశ్వమెల్లఁ బొగడ విశ్వావసునికూఁతుఁ
బరిణయించె ఖచరవరసుతుండు.

183


తే.

పరిణయోత్సవంబు జరిపి సిద్ధవిభుండు
గారవమున నెల్లవారి ననిపె
స్త్రీసమేతుఁడైన జీమూతవాహుఁడు
గురుపదాంబుజములు గోరి చనియె.

184


క.

జనకుని యనుమతి గతిపయ
దినములు రతితంత్రగతులఁ దేలుచు వనితా
జనతానురాగుఁడై చం
దనగిరిపై నతఁడు మనము దవియ సుఖించెన్.

185


ఉ.

అంతట నొక్కనాఁడు ప్రణయాన్వితుఁడౌ తమబావఁ గూడి ప
ర్యంతవనాంతభూమిఁ గలయం జరియించుచు వింతకాంతి న
త్యంతసముజ్జ్వలం బయిన యస్థిసమూహముఁ గాంచి పర్వత
ప్రాంతమున న్శరద్ఘననిభం బది యేటిది బావ నావుడున్.

186

వ.

అతం డి ట్లనియె.

187


క.

పక్షీంద్రుఁడు పక్షానిల
విక్షిప్తం బైన జలధి వేఁటాడి మహా
చక్షుఃశ్రవముల నిత్యము
భక్షించుచునుండుఁ దొంటిపగ మొదలాఱన్.

188


క.

ఆగరుడికి వెఱచి మహా
నాగేంద్రుఁడు వచ్చి యనుదినము నొకపాము
న్నీగుంటికడకు నేనై
వేగమె పుత్తెంతు నింక వేఁటాడకుమీ.

189


ఉ.

దుర్భరపక్షపాతహతిఁ దోయధి పాయలుగాఁగ వచ్చు నీ
యార్భట మెల్లెడ ల్విని భయంబున నందు భుజంగమాంగనా
గర్భము లెల్ల నూడిపడఁగా నిది నీధనహాని[32] గావునన్
నిర్భకయవృత్తి నుండ గరుణింపుము నీకుఁ బ్రయాస మేటికిన్?

190


మ.

అని ప్రార్థించి యహీంద్రుఁ డేఁగి దినమర్యాదన్ ఫణిం బంపఁగా
విసతాపుత్రుఁడుఁ దించు నుండు నవి భావింప న్శతాసంఖ్యముల్
విను మా తెల్పు తదస్థికూటము జగద్విఖ్యాత మీతార్క్ష్యవ
ర్తన మిచ్చో మసనంబున న్నిలువ యుక్తంబౌనె లోకోత్తమా.

191


ఆ.

అనుచు దానశూరుఁ డగువానిమది నొండు
పుట్టకుండ మరలి పోద మనుచుఁ
బిలుచునంతఁ దండ్రి పిలువ బుత్తెంచిన
బాసిపోయె సిద్ధపతిసుతుండు.

192


ఆ.

అంత నక్కుమారుఁ డహిరాజు మది దూఱి
గరుడువలన నురగమరణములకు

మూల మయ్యె దాన నేలికతన మెద్ది
యేది పెద్దతన మదేటితగవు[33].

193


క.

అకటా నాగేంద్రుఁడు స్రు
క్కక జిహ్వలు రెండువేలు గలుగఁగ నొకనా
లుకనైనఁ దన్నుఁ దీని స
ర్పకులము రక్షింపు మనుచుఁ బలుకం దగదే.

194


సీ.

అని కరుణాకరుండై యేఁగుచో నొక్క
        వృద్ధకామిని పుత్రువెనుకఁ దగిలి
హా శంఖచూడ వంశధార యోయన్న
        నీచిన్నిమో మెందుఁ జూచుదాన
పక్షినాయకుబారిఁ బడఁద్రోచి యే నెట్లు
        నిలుతుఁ బ్రాణంబుతో నీవు సనఁగ
బంధువు లందఱుఁ బగఱ కొప్పించిరి
        యింకిట నీకు దిక్కెవ్వ రయ్య


ఆ.

యనుచుఁ బలవరింపఁ గనుఁగొని యది దాని
జననిఁగా నెఱింగి మనుపఁబూని
వీనిఁ గాచువాఁడ వెఱవకు మోయమ్మ
యనిన గరుఁడుఁ డనుచు నబల బెగడి.

195


క.

పైచీరఁ గొడుకుఁ గప్పినఁ
జూచి యతం డేను వినతసుతుఁడం గా నే
ఖేచరకులజుఁడ నీసుతుఁ
గాచెద బెగ డుడుగు నన్ను గరుడని కిత్తున్.

196

వ.

అనిన బెగ డుడిగి యప్పడఁతి యిమ్మాట యింక నొకమాటాడుఁ డనిన నతండు నవ్వి.

197


క.

నేలయు నుదకముఁ దేజము
గాలియు నాకసము నెఱుఁగఁ గాచితి నాకై
కోలిదె రెం డాడఁగ నా
నాలుక మీకులమువారి నాలుక లటులే?

198


ఉ.

మేరువు సంచలించిన సమీరుఁడు నిల్చిన భూమి గ్రుంగినం
దారక లెల్ల డుళ్ళిన సుధాకరుఁ డగ్నికణంబు లొల్కిన
న్వారిధు లింకిన న్నభము వ్రాలిన భానుఁడు చల్లనైన నం
భోరుహసూతి దప్పినను బొంకుదునే మునుపాడి క్రమ్మఱన్.

199


ఉ.

నావుడు నాగకాంత కరుణాకర యోఖచరేంద్ర నాసుతుం
గావగఁ బూని వచ్చితివి కన్నతనూజునికంటె నీయెడన్
భావము సార్ద్రమైనయది పన్నగవైరికి నిన్ను నిచ్చి యే
త్రోవల నేఁగుదున్ బ్రదుకుత్రోవ విచారము లేదు నా కిఁకన్.

200


ఆ.

అన్న నీకు నతిచిరాయువు గావుత
మన్న శంఖచూడుఁ డతనిఁ జూచి
కరముఁ జోద్యమంది కరములు మొగిడించి
విన్నఁదనము లేక విన్నవించె.

201


క.

వసుధఁ గొఱగాని కడుఁబా
లసులము పులుకాసిపుర్వులము[34] మాకై నీ
యసువులఁ బగఱకు నొసఁగుట
కసవునకై రత్న మమ్మఁ గడఁగుట గాదే.

202

శా.

సంసారాటవిలోపలం గలవు మత్సామాన్యముల్ వ్యర్థముల్
హింసామూలము లైన జంతువు లసంఖ్యేయంబు లోఖేచరో
త్తంసా నీ కెనయైనవారు గలరే ధర్మాధికు ల్వెంచలో
హంసానీకము లేదుగాక బకభేకౌఘంబు లేకుండునే.

203


క.

మావంటివారి నూర్వురఁ
గావఁగఁ జాలుదువు నీ వొకనిఁ గాచుటకున్
జీవం బిచ్చిన నార్తుల
కేవెరవున బ్రదుకవచ్చు నెడరైన యెడన్.

204


క.

మాకులమువారు విడిచిరి
నీ కీకృప సేయనేల నీచుట్టమనే
శోకమునఁ జావకుండగ
నీకాంతను ముసలిఁ గావు మింతియ చాలున్.

205


చ.

అనవుడు ఖేచరేంద్రసుతుఁ డచ్చెరువంది ఫణీంద్రనందనా
విను మిది యేల నాపనికి విఘ్నము చేసెద వింత కొల మీ
వనమున నర్థి వేఁడమి దివానిశము ల్మదిఁ గుందుచుందు నేఁ
డనఘ పరోపకారసమయం బిటు గల్గిన నుబ్బి వచ్చితిన్.

206


చ.

తనయులు భార్య లన్నలును దమ్ములుఁ జుట్టలు సంగడీండ్రు యౌ
వనము ధనంబు నంచు మది వారక ప్రాణములైన నిచ్చి తా
ననదను నార్తు దీను శరణాగతుఁ[35] గావనివాఁ డజాగళ
స్తన మని యండ్రు వానికి యశంబును ధర్మము నెట్లు చేకుఱున్.

207


ఉ.

లావు భయార్తరక్షణము లాభము పుణ్యము దేహశుద్ధి స
ద్భావము భూషణం బెఱుక ధర్మము సత్కృప ప్రాభవంబు సం

భావన పాడి సత్యపరిపాలన మే లుపకార మెయ్యెడన్
భావన కీర్తి యాయువు శుభంబు నిజాప్తులు ధాత్రిలోపలన్[36].

208


క.

జాణ “లనిత్యాని శరీ
రాణి” యనుచుఁ దెలిపి చెప్పరా[37] భువినాత్మ
ప్రాణంబు లిచ్చి యార్త
త్రాణం బొనరింపవలయు తత్త్వజ్ఞులకున్[38].

209


తే.

నీవు లేవేని నొరులకుఁ గావవశమె
ధన్య నీవు బ్రదికిన నీతల్లి బ్రదుకు
నదియు కారణముగ వైరి కడ్డపడుదు
నీవు గోరిన యట్ల యీనెలఁతఁ గాతు.

210


ఆ.

అనుచు వధ్యచిహ్నమైన రక్తాంశుక
మడిగి మ్రొక్కినంత నతని నిల్పి
యేల ఖేచరేంద్ర యీదివ్యదేహంబుఁ
బాముకొఱకు విడువఁ బాడియవునె.

211


క.

క్షోణీమండలమునఁ గల
ప్రాణుల కెడరైన నడ్డపడుచుఁ దదీయ
త్రాణం బొనరించుచు నీ
ప్రాణంబులతోడఁ గీర్తిఁ బడయందగదే.

212


ఆ.

శంఖధవళ మైన శంఖపాలకులంబు
శంఖచూడు చేతఁ జాలఁ గందె
ననఁగ మీఁదఁ బుట్టు నపకీర్తి నాకది
చావు గాదె బ్రదుకుత్రోవ యేది.

213

వ.

కావున నన్ను మన్నించెదవేని నీతెంపు మాని మరలు మని పునఃపునః ప్రణామంబు లాచరించి యాతని వేఁడికొని తల్లిని జూచి యోయమ్మ నెమ్మనంబున బమ్మరింపకుము నాకెన్ని జన్మంబులైన నీవ జననివి గమ్మని మొక్కి వీడుకొని దేవతాప్రణామోన్ముఖుం డై చని యాపొంత.

214


క.

గోకర్ణరాజకంకణు
గోకర్ణనివాసుఁ జాపగుణగోకర్ణున్
గోకర్ణశాయిమిత్రుని
గోకర్ణేశ్వరునిఁ జూచుకోరిక నేఁగెన్.

215


సీ.

అట ఖేచరాత్మజుఁ డార్తునిఁ గాచుట
        చేకూరు టెట్లని చింతనొంది
యర్ణవతీరగోకర్ణంబునకు వాఁడు
        చని వచ్చునంతకుం జనఁ దలంచి
యత్తవారిచ్చిన యరుణాంశుకంబులు
        వధ్యచిహ్నమునకు వలను గాఁగఁ
బులకించి చని వధ్యశిలయెక్కి మదిఁ జొక్కి[39]
        గారుడాగమనంబుఁ గోరుచుండి


ఆ.

తల్లి కనకవతియుఁ దండ్రి ఖేచరపతి
కాంత మలయవతియె గాఁగ నాకు
నీపరోపకార మెల్లజన్మంబులఁ
గలుగ వలయుననుచుఁ దలఁచునపుడు.

216


మ.

గిరు లల్లాడఁగ నర్కుతేరు దొలఁగం గీర్ణంబులై మింటిపైఁ
దరువుల్ గ్రద్దలభంగి నాడఁగ సముద్రం బెల్ల ఘూర్ణిల్లఁగాఁ

హరిదంతంబులు పక్షకాంతి నవసంధ్యాలీలఁ గీలింపఁగా
గరుడుం డార్చుచు వచ్చె నచ్చటికి నాకారంబు ఘోరంబుగన్.

217


ఉ.

వచ్చి యతండు మస్తమున వ్రయ్యలు వారఁగఁ దన్ని ముక్కునన్
గ్రుచ్చి వియత్పథంబునకుఁ గొంచుఁ జనంగఁ గిరీటరత్నముల్
చెచ్చెర మాంసఖండముల చెల్వున భూమిఁ బడంగ నిచ్చలో
మెచ్చి కుమారకుండు ధృతిమేరువు మే లొనగూడె నా కనన్.

218


ఉ.

అంబరసీమనుండి మలయాద్రిశిలాస్థలి వ్రాలి యేకచి
త్తంబున మాంసఖండములు దర్పము గ్రమ్మగఁ ద్రెంచి మ్రింగఁగా
నంబరచారినందనుఁడు హర్షరసంబున మేను వొంగ వ
క్త్రాంబుజ ముల్లసిల్లఁ బులకాంకితుఁడై విహాగేంద్రుఁ జూచినన్.

219


వ.

అంతఁ బక్షీంద్రుండు.

220


ఉ.

వేదన మేను స్రుక్క దరవిందముకాంతిఁ దొఱంగ దాననం
బాదరణంబు నాయెడ మహాఘన మైనది యంతరంగ మా
మోదతరంగితంబు నిజమూర్తివిలాసము దివ్య మిట్టి కా
కోదరజాతి లేదు సుగుణోత్తమ యెవ్వఁడ వీవు నావుడున్.

221


ఉ.

ఎవ్వఁడ నైన నేమి[40] మది నిన్నివిచారము లేల నీకు నొం
డెవ్వఁడు భక్షణం బగు నహీశ్వరబంధువు[41] గాక యియ్యెడన్
మవ్వము దప్ప దంగలత మానపు గంటుల రక్తపూరముల్
క్రొవ్వినమాంస మున్న యది కొమ్ము భుజింపు భుజంగమాంతకా.

222


క.

అనునెడ నాగోకర్ణే
శునకుం ప్రణమిల్లి శంఖచూడుఁడు మగుడం
జను దేంచి వధ్యశిలమీఁ
ద నవం బగు రక్తబిందుతతిఁ బొడఁగాంచెన్.

223

ఆ.

కాంచి మున్నతండు వంచించి వచ్చుట
తెలిసి తన్నుఁ దాన తిట్టికొనుచుఁ
గులముఁ గావనైతి గురునాజ్ఞఁ దప్పితి
నన్ను డాఁచి యొకని మన్నిగొంటి.

224


ఆ.

ఇట్టి కష్టజీవ మేటికి నాకని
చాఁ గడంగి యచటి కేఁగుదెంచి[42]
ఖేచరేంద్రతనయుఁ జూచుచుఁ దలయూఁచి
భుజగవైరిఁ జూచి భుజగవరుఁడు.

225


మ.

వినతానందన దీనరక్షణపరున్ విద్యాధరేంద్రాత్మజుం
దిన ధర్మం బగునే సహింపు మకటా దృష్టింపవే పాములం
దినవే యాచవి మున్నెఱుంగవె భవద్భీతాత్ముఁడౌ రాజుపం
పున నే వచ్చితి నాగపుత్రుఁడ ననుం బోనీక భక్షింపుమా.

226


వ.

అనిన గరుడుండు పడియున్న యక్కుమారకుం జూచి నే నెఱుంగనైతి నీ కీదుర్మరణోద్యోగం బేల యనవుడు నతం డే మని చెప్పుదు నాయత్నం బంతయు విఫలం బయ్యె.

227


క.

వికలము లగుప్రాణంబుల
నొకయుపకారంబు సేయనోపుదు నని కౌ
తుకమున నినుఁ గొలువఁగ వీక
డకటా యవసానవైరి యై చనుదెంచెన్.

228


చ.

అనునెడ శంఖచూడుఁడు రయంబున డగ్గఱ వచ్చి యెత్తి యో
ఘనకరుణార్ద్రమానస యకారణబాంధవ సత్యసంధ యీ

వినతసుతుండు నీ వనునివేకము లేక యహీంద్రుఁ డంచు నీ
సునఁ దెగటార్చె నొక్కొ యనుచుం దను వంటఁగఁ జేర్చి యేడ్వఁగన్.

229


ఆ.

వధ్యచిహ్న మైనవసనంబుఁ జూచితి
నెఱుఁగనైతి నీతఁ డెవ్వఁ డనిన
వ్యోమచరవిభుండు జీమూతవాహనుం
డనుడు వెఱఁగు పడుచునడలి గరుడి.

230


క.

మందరతటమున హిమవ
త్కందరముల మలయసీమఁ గైలాసమునన్
బృందారకసుందరు లా
నందంబునఁ బాడు ఖచరనందనుఁ డితఁడే.

231


క.

కడుఁబుణ్యుం డగు నీతని
మడియించిన శోకవహ్ని మడియుటకంటెన్
సుడిగొని జడనిధి నుడికెడు
బడబాగ్నిం బడుదుఁ గడిఁదిపాపం బడఁగన్.

232


సీ.

అనుడు నంతకమున్న తనయుకిరీటర
        త్నంబు కోడలియంకతలముమీఁదఁ
బడిన నాపడఁతుక పతిశేఖరం బని
        బెగడుచు ముందటం బెట్టె నంతఁ
గాంతయుఁ దాను నిర్ఘాతపాతం బైన
        తరుపుకైవడిఁ గూలి తడసి తెలిసి
ఫణిఫణామణి యని భావించి సుతునిది
        గాఁ జూచి తన్మృతి గలుగు టెఱిఁగి


తే.

మూర్ఛనొందుచు శోకాగ్ని మునిఁగి
యాలుఁగోడలుఁ దనతోడ నడలినడువ

మారుతప్రేరితం బగుపూరిబొమ్మ
భాతి నేతెంచె జీమూతకేతుఁ డటకు.

233


వ.

ఇట్లు చనుదెంచి యట గురుజనప్రాణభయాకులుండై నెత్తుట జొత్తిల్లిన యురగకుమారునిమీద నొరగిన కుమారుమ్రోల వాలి.

234


సీ.

ఓయయ్య మీబావయును నీవు నాడుచు
        నున్నార లని నమ్మి యుంటిఁగాక[43]
ద వ్వేగనిత్తునే [44]తడసిన రానైతిఁ
        గుణరత్న మౌ నిన్నుఁ గోలుపడితి
రాజ్యంబు విడిచి యరణ్యంబుఁ జేరియు
        నీ సేవ సౌఖ్యంబు నెగడఁగంటి
సద్భక్తి సేయవే సరగున నోయన్న[45]
        చెడుగుఁబాముల కేల జీవమీయ


ఆ.

గరుడనఖముఖాగ్రఘాతంబునకుఁ జొరఁ
బూనె మెత్తనైన మే నదెట్లు
మాకు దిక్కుగలరె యోకరుణాకర
చీఁకు చేతికోల చిన్ని కుఱ్ఱ.[46]

235


వ.

అని పలవరించుచు మేనంటి చూచుచుండఁ గనకవతియుం గనుఁగవ నశ్రుపూరంబు తోరంబుగాఁ బెదవులు దడుపుచు మొగము వెలవెలంబుచ్చుచుఁ గోడలిం గూడి గోడాడుచు.

236


సీ.

ఓతండ్రి యందఱ నొక్కపెట్టునఁ జంపఁ
        గడఁగితి వొకపాముఁ గావఁబూని

ధనకనకాదులు తనియ నిత్తురు గాక
        ప్రాణంబు లొసఁగెడు ప్రభుఁడు గలఁడె
తనతల్లికడుపు చలన చేసికొన నోపి
        శంఖచూడుఁడు నీకుఁ జా వొనర్చెఁ
జీఁకువట్టినకోల యీకుమారుం డని
        గరుడుని కేలొకో కరుణ లేదు


ఆ.

దైవమేల యిట్లు దలఁచె నే నెట్లోర్తు
నేమి సేయుదాన నెందుఁ జొత్తుఁ
బాసి యేఁగఁ దగునె మూసీనముత్తెమ
పంజరమ్ముచిలుక పసిఁడిబొమ్మ.

237


క.

మలయవతిమీఁది ప్రేమము
మలయించెనే దైవ మిట్లు మ మ్మెడచేసెం
బలుకొకటి బ్రాఁతి చిలుకల
కొలికీ నాచందమామకూనా నీకున్.

238


వ.

అని విలాపింపఁగఁ బ్రాణహానికి శంకించెద రని తనప్రాణంబులు చిక్కఁబట్టి యల్లన కనువిచ్చి జననీజనకులం జూచి.

239


క.

గురులార మీకు నాకై
పురపురఁ బొక్కంగవలదు భువి “ధర్మస్య
త్వరితాగతి" యనుపలుకునఁ
బరహిత మొనరింపఁ గంటి బ్రదు కిది గాదే.

240


ఉ.

అస్థిగృహంబు దేహము దురాశలఁ జిల్లులు వోవస్రుక్కి రో
గస్థితిఁ జిక్కి చచ్చు టధికం బగుమోసము గాక, దానిలో

నస్థిర మైనప్రాణమున నగ్గువ[47] మిక్కిలిగా జగంబునన్
సుస్థిర మైనకీర్తిఁ గొనజూచిన లాభమునం గొఱంతయే.

241


వ.

కావున వగ పుడిగి నాగకుమారు నాకుమాఱుగాఁ దలంచుకొనుం డని సాయాసకృతాంజలియై యంత్యప్రణామం బొనరించిన సవినయానతుండై వినతాసుతుం డోకుమారచంద్రా నాయజ్ఞాననిద్ర దొలంగె నీధైర్యసాహసపరోపకారగుణంబులం బరిణమించితి నా కేమిహితం బానతిమ్మనిన.

242


క.

దయ సేయుము పాములపై
భయభీతులఁ గావు ధర్మపథమునఁ జను ని
శ్చయ మిది దురితము దీనను
లయ మగు నుదకమునఁ బడ్డలవణముభంగిన్.

243


క.

అని చెప్పి శంఖచూడా
వినుమా గురుజనులసేవ విడువకు మిఁక నీ
జనని కడు బెగడకుండగఁ
జనుమీ యని పలికి హృదయజలజములోనన్.

244


క.

రుద్రునిఁ దలఁచుచుఁ గీర్తిస
ముద్రుండు పరోపకారమున నలసిన యా
ముద్ర తనమేనఁ దోఁపఁగ
నిద్రించినగరణి దీర్ఘనిద్రం జెందెన్.

245


వ.

అంతం దత్సహచరీసహితు లయిన జననీజనకులు తమ యురోముఖశిరోఘాతహాహాకారమహారావంబులు మలయగహ్వరంబున నుపబృంహితంబులై దిక్కులు పిక్కటిల్ల బిట్టేడ్చుచు మూర్ఛిల్లుచు నుభయకృతోపచారంబులఁ దెలియుచు నలయుచుఁ బలవరించుచు.

246

ఆ.

పురము ధనము రాజ్యభోగంబు విడిచియు
మమ్ముఁ గలసి యిచట మాయనుజ్ఞ
నబలఁ గూడి పిదప నందఱఁ బాసి నేఁ
డొంటి నేఁగ నీకు నుచిత మగునె.

247


వ.

అనవుడు ననుగమనోద్యోగ గావున మలయవతీకన్య ధైర్యం బవలంబించి.

248


క.

ప్రాణము కొఱకై యితరుల
ప్రాణము దినుచుండు వానిప్రాణము గావం
బ్రాణం బెడఁబాసిన నా
ప్రాణేశుం డిపుడు మనలఁ బాయుట యరుదే.

249


క.

మనకుండుట యి ట్లెఱిఁగియు
మన కుండుట తగునె యితనిమార్గంబున నా
మనమరిగెడు గతిఁదడయక
మన మరిగెడు తెఱఁగుఁ గనుఁడు మఱి వగ పేలా.

250


ఆ.

అనిన శంఖచూడుఁ డందఱచావుల
కేన మూల మైతి నితనివెంట
నరుగువాఁడ ననిన నాదికారణ మేన
మున్ను సత్తు ననియెఁ బన్నగారి.

251


క.

నావుడు మీ కిందఱకుం[48]
జావం బనిలేదు సుతునిజాడనె యేఁగం
గావలయుం జితి వేగమె
కావింపుము శంఖచూడ కడుఁబుణ్య మగున్.

252


ఆ.

అనుడు నభముఁ జూచి యమరవర్గములార
ఘనపరోపకారమునకు మెచ్చి

యమృత మైనఁ జల్లి యన్న ప్రాణంబులు
గావరయ్య మమ్ముఁ బ్రోవరయ్య.

253


వ.

అని జననీజనకులు (క్రమంబున) వేఁడినఁ దజ్జీవనోపాయం బెఱింగి విహగేంద్రుం డింద్రుం బ్రార్థించి యమృతంబుం దెచ్చి యిచ్చట విపన్నంబు లగు పన్నగంబుల తోడ నిప్పన్నగకుమారరక్షకుం గాచెద నని పూని.

254


ఉ.

పోయుదుఁ బ్రాణము ల్మగుడఁ బూనిక దప్పిన మేరు వబ్ధిలోఁ
ద్రోయుదు నెల్లదేవతలఁ దోలుదు నాకముఁ బట్టి పాడుగాఁ
జేయుదు నష్టదికృతులఁ జెండుదు మేదినిఁ గ్రింద మీఁదుగా
వ్రేయుదు వీనిపై నమృతవృష్టి వడిం గురియింతు నింతటన్.

255


క.

అని గరుడుఁ డెగసి యేఁగినం
దనయునిదెసం జూడలేమిఁ దడయక ఫణినం
దనుచేత ఖచరసతి చం
దనచితు లొనరించుకొనియెఁ దత్పార్శ్వమునన్.

256


వ.

అంత నత్యంతసతీమండనంబులు గైగొని బ్రదక్షిణంబు గాఁ దిరుగుచు గౌరి నుద్దేశించి.

257


క.

ఓయంబిక యుత్తముఁ డధి
కాయువు విద్యాధరేంద్రుఁ డగుఁ బతి యనుచు
న్నాయుద్యోగం బుడిపితి
నీయానతి దప్పె నింక నిన్నే మందున్.

258


క.

అని దూఱఁగ ముందఱఁ గాం
చనలతగతి మెఱుఁగుదీఁగ చాడ్పునఁ గాత్యా
యని వచ్చి పుత్రి నిలునిలు
మని తత్పతిమీఁదఁ జేతియమృతము చల్లన్.

259

క.

చల్లిన సంజీవితుఁ డై
యల్లన సుఖనిద్ర దెలియుననువున నతఁ డు
త్ఫుల్లముఖుం డై గజముఖు
తల్లికిఁ బ్రణమిల్లెఁ దల్లిదండ్రులుఁ దానున్.

260


క.

మగలకు మగఁ డగుమరునిం
దెగఁ జూచిన శివునిదిక్కు దృక్కుల నిడి యా
మగతనము సగము చేసిన
మగువా మాపాలఁ గలిగి మన్నించితివే.

261


వ.

అని యందఱు నానందంబున వందనం బొనర్ప మలయవతి కృతాంజలి యై.

262


క.

గరళము మ్రింగినపతికి
న్మరణముఁ దప్పించి మెఱియు మంగళసూత్రా
భరణము గలదేవత వని
పరిచర్య యొనర్చినట్టిఫల మిటఁ గంటిన్.

263


క.

అని మ్రొక్కఁగ దివిఁ దూర్య
ధ్వను లొలయఁగ సకలదేవతలుఁ గొనియాడ
న్వినతానందనుకతమున
ననిమిషకుసుమములతోడ నమృతము గురిసెన్.

264


క.

ఆయమృతంబున నస్థిని
కాయము సప్రాణ మైనకాయంబుల న
త్యాయతఫణమణిరుచి సము
దాయము మెఱుఁ గిడఁగ నెగసె దర్వీకరముల్.

265


క.

చెలులుం జుట్టలుఁ గలయం
జెల రేఁగి సుధాంబుపూర్తి చెలువునఁ జాముల్

చెలగుఁచు మలయాచలమున
సెలయేఱుల భంగి జలధిఁ జేరఁగఁ బాఱెన్.

266


ఆ.

అంత నమరసిద్ధయక్షగంధర్వులు
గొలువ గగనతటిని జలకమార్చి
సిరులు మిగుల గౌరి జీమూతవాహను
ఖచరచక్రవర్తిగా నొనర్చె.

267


వ.

అట్టియెడ నత్యంతసంతుష్టాంతరంగుం డై గరుత్మంతుండు చనుదెంచి నీ కెద్ది యిష్టంబు వేడు మనిన నక్కుమారుం డురగహరణం బుడిగి దృఢప్రతిజ్ఞుండవుగ మ్మింతియ చాలు నీప్రసాదంబున నాకేమియుం గొఱంత లేదు.

268


క.

అనదలఁ గాచితి నాగురు
జనముల ప్రాణములు నిలిచె సర్వేశ్వరిమ
న్నన గలిగె నీవు మెచ్చితి
విను రాజ్యం బబ్బె నేమి వేఁడెద నింకన్.

269


చ.

అని వినయోక్తిఁ బల్కి జగదంబికఁ గ్రమ్మఱఁ బ్రస్తుతించి య
జ్జననికి మ్రొక్కి యిష్టజనసంగతుఁ డై చని తొల్లి యున్న కాం
చనపురిఁ జొచ్చి రాజ్యసుఖసంపదఁ దేలుచు నేలుచుండె న
వ్వనితయు దాను నాత్మగురువందననందితచిత్తవృత్తియై.

270


వ.

కావున నట్టిపరోపకారశూరుం డెవ్వఁడు గలఁడు.

271


ఆ.

వింటి మతనిఁ దొల్లి కంటి మీతని నేఁడు
విందు మిప్పు డొక్కవిక్రమార్కు
ననిన నతనివనిత దనుజేంద్ర విక్రమా
దిత్యుఁ డీతఁ డొక్కొ తెలియు మనియె.

272

వ.

నావుడు నారక్కసుం డోనరోత్తమ నీ వడిగినవరం బిచ్చితిఁ బుణ్యపురుషుండవు బొంకకు నీ వెవ్వండ వనిన నవ్వసుమతీవల్లభుండు పూర్వదేవుండవు నీ వెఱుంగవే విక్రమార్కుండ నగుదు నాచరిత్రంబు జను లెఱుంగకుండఁ గృప చేసి శాంతుండవు గమ్మని మ్రొక్కి తదనుజ్ఞాతుం డై యజ్ఞాతభావంబున నిజపురంబగు నుజ్జయినీపురంబునకుం జనుదెంచెం గావున.

273


క.

ఇట్టిగుణంబులు నీ కే
పట్టున సమకూరకునికిఁ బార్థివ చను మి
ట్టట్టును బొరలకు మనవుడు
దిట్టతనం బుడిగి వసుమతీపతి మగిడెన్.

274


పండ్రెండవ బొమ్మ కథ

వ.

మఱియుం గొన్ని దినంబు లరిగిన.

275


క.

కంబూపమగళు మృగమద
జంబాలీకృతమహావిషద్యుతిసదృశ
స్తంబేరమచర్మాంబరు
లంబోదరగురుఁ గృపావలంబునిఁ గొలుతున్.

276


చ.

అని మదిలో దలంచుచు ధరాధిపుఁ డిష్టజనోపదిష్టమౌ
దినమున నెక్కఁ బూని యరుదేరఁగ నచ్చటిబొమ్మ చూచి యో
జనవర విక్రమార్కుగతి సాహసదానగుణంబు లేక నీ
కెనయఁగ దేవతాసనము నెక్కఁగవచ్చునె[49] నిల్వు నావుడున్.

277


క.

అతనికడ నట్టిసాహస
వితరణగుణ మెట్లు చెల్లె వినిపింపు మనం

బతిగుణములు పండ్రెండవ
ప్రతిమ యెఱింగింప భోజపతి కి ట్లనియెన్.

278


మ.

విను మావిక్రమభూషణుండు విమలోర్వీనాథసందోహత
ర్జనసంపన్నజయాభిరాముఁడు సదాచారప్రచారోచితా
త్మనయప్రాభవధర్మనందనుఁడు విద్వత్పాలనాకేళిసం
జనితానందుఁడు సాగరాంతముగ నీక్ష్మామండలం బేలఁగన్.

279


ఆ.

ఆతనివీట నర్థపతి కెనయగు భద్రం
సేనుఁ డనఁగ నొక్కసెట్టి గలఁడు
వాని కొకఁడు గలిగె దానసుందరుఁడు పు
రందరుం డనంగ నందనుండు.

280


క.

ఆకోమటి కడపటఁ బర
లోకమునకుఁ జనిన నర్థలోభ ముడిగి సు
శ్లోకుండు పురందరుఁ డీ
లోకము గొనియాడ దానలోలుం డయ్యెన్.[50]

281


క.

అతని దగువ్యయముఁ గనుఁగొని
హితు లందఱు వచ్చి బుద్ధి యిదిగా దుచిత
స్థితి నడువు మహౌదార్యో
న్నతి దారిద్ర్యంబు వచ్చు నరపతి కైనన్.[51]

282


ఆ.

ధనము గలుగువాఁడె ధన్యుండు మాన్యుండు
ధనము గలుగువాఁడె ఘనుఁడు జగతి

ధనము గలుగువాఁడె తగవుల కాఢ్యుండు
ధనము గలుగువాఁడె మనుజవిభుఁడు.

283


ఆ.

ధనము గలిగేనేని ధర్మార్థకామమో
క్షముల నచట నచట జరుపవచ్చు
ధనముగలుగువేళ జను లెల్లఁ దమవారు
ధనము లేనివానిమనికి చావు.

284


మ.

అని చెప్ప న్విని యప్పురందరుఁడు గర్వాక్రాంతుఁడై నవ్వి యి
ట్లనియెన్ దానము భోగముం దగవుఁ జేయం బాడి గాదేని యా
ధన మేలా మఱి లాభ మేల సుఖికిన్ దారిద్ర్యమే మేలు నాఁ
జనదే మర్త్యుఁడు మంటిపాలయిన నేసౌఖ్యంబు భోగించెడున్.

285


క.

మును దనకుం గానున్నది
పనివడి యగు నారికేళఫలరసముక్రియం
జననున్నది చనుఁ గరి గ్ర
క్కున మ్రింగిన వెలఁగపండు గుంజును బోలెన్.

286


క.

తొడఁ గట్టఁ బూయఁ బెట్టం
గుడువం జెప్పుదురు గాక గొనకొని గడియం
జెడియెడిబ్రదుకున కిడుమం
బొడివోసికొనంగఁ జెప్పు బుధులుం గలరే[52].

287


చ.

అనుచు ననాదరంబున నిజాప్తుల దూఱి యుదారబుద్ధిఁ జం
దనమృదుపుష్పవస్త్రవనితాపరిభోగవిషక్తచిత్తుఁడై
యనుదినమున్ ధనంబుఁ గలయ న్వెదచల్లుచు నొయ్యనొయ్య ని
ర్ధనదశ నొంది వంది యనుతాపము నందుచుఁ గంది కుందుచున్.

288

క.

మురిసినయూరనె కడపటఁ
దిరియుట యది సచ్చు టనుచు ధృతిమాలి పురం
దరుఁ డొకనెపమున దేశాం
తర మరిగెన్ మిత్రు లెల్లఁ దను నవ్వంగన్.

289


వ.

ఇట్లరిగి.

290


ఉ.

అక్కడ నక్కడం గల నయంబుఁ బ్రియంబు సువస్తుజాతముం
జక్కనికాంతల న్రతిరసజ్ఞులఁ జూచుచు నాదరంబుతో
నొక్కొకయూరఁ గర్ణనయనోత్సవలీలల నిచ్చ మెచ్చుచుం
బెక్కుదినంబు లుండెఁ దనపేరు నిజాప్తు లెఱుంగకుండఁగన్.

291


క.

ఒకనాఁడు మధురలోపల
నొకచోద్యం బెఱిఁగి మగిడి యుజ్జయినీభ
ర్తకు విన్నవింతు నని[53] యిం
చుక రవణముతోడ వచ్చెఁ జుట్టలు పొగడన్.

292


ఉ.

వచ్చినవానిఁ జూచి జనవల్లభుఁ డీవు చరించు భూమిలో
నచ్చెరు వేమి గంటి వని యానతి యిచ్చిన నప్పురందరుం
డిచ్చకు వచ్చున ట్లడిగె నీధరణీవరుఁ డంచు నాత్మలో
మెచ్చుచు విన్నవించెఁ బతిమె చ్చొనఁగూడ యథాక్రమంబునన్.

293


సీ.

ఈపురి వెడలి యే నెల్లతీర్థంబులుఁ
        దిరుగుచుఁ గేవారధరణి కేఁగి
మగిడి వచ్చుచు హేమమణిమయప్రాకార
        రమ్యమౌ మధురాపురంబుఁ జూచి
చని యొప్పిదం బెల్లఁ గనుఁగొని రేయొక్క
        ద్విజునింటిపొంత నిద్రించునప్పు

డనద ననాథ నిరాధారఁ గావరే
        యనుచు వీతెంచె నార్తారవంబు[54]


ఆ.

దాని కుల్కి మిగుల దయ గలియును లావు
లేమి యేమియు ననలేక యుండి
రేపకడన లేచి యాపురజనుల న
య్యబలవార్త దెలియ నడిగి వింటి.

294


వ.

ఎ ట్లనిన.

295


క.

చెల్వొనరెడు పురి చేరువ
బిల్వవనాంతమున రేయి భీమాకృతితో
నిల్వలనిభుఁ డొకదనుజుఁడు
చెల్వం బెనుకశల మొత్తి చెండుచు నుండున్.

296


క.

ఆపొలఁతుక రేయెల్లను
వాపోవుచునుండ నసుర వారింపంగా
నోపరు పరు లెవ్వరుఁ బృ
థ్వీపాలక యేను విన్న తెఱఁ గిది చుమ్మీ[55].

297


ఉ.

నావుడుఁ జోద్యమంది నరనాథుఁ డనాథఁ గృశాంగి నంగనం
గావఁ గడంగి హస్తమున ఖడ్గము తోడుగ సెట్టిఁ గూడి యా
త్రోవన యేఁగి దూరగతి దోఁపఁగ నల్లన నొక్కనాఁడు ల
క్ష్మీవిభవాఢ్య మౌ మధురఁ జేరె నినుం డపరాద్రిఁ జేరఁగఁన్.

298


క.

మలయుచు నెయ్యెడఁ గలయం
దెలివిపడ న్వెలిఁగి భువనదీపము చనినన్

మలినాకృతితోఁ గాటుక
మలక[56] క్రియన్నభము తిమిరమయమై పొలిచెన్.

299


ఆ.

అప్పు డధిపుఁ డాపురాంతికవనభూమి
యమున పగిదినున్న తమముఁ జూచి
వైశ్యతనయ వెఱవ వల దని తెలుపుచు
నచట నసురరాక యరయుచుండె.

300


ఆ.

వాలుఁగంటిమొఱ్ఱ వాలాయమగు నాన
వాలుగాఁగఁ జీకువాలు సొచ్చి
వాలు పెఱికికొనుచు వాలుమగం డేఁగె
వాలు దైత్యునుదుటివ్రాలు దుడువ.

301


క.

ఈరీతి గాచియుండఁగ
నారాక్షసుఁ డంత నంగనామణి మొత్తం
గా రావము వినవచ్చిన
నారాజును నాలకించి యతిరభసమునన్.

302


క.

వెఱవకు వెఱవకు తరుణీ
మొఱ యాలించితి[57] నృపాలముఖ్యుఁడ నీకై
పలుతెంచితిఁ బరిపరిగాఁ
గఱకు టసురఁ జెండివైతుఁ[58] గాచెద నిన్నున్.

303


వ.

అని.

304


శా.

ఓరీరాక్షస వట్టిగర్వమున నీ వుప్పొంగి దీనానన
న్నారీరత్నము నేల నొంచె దిటు లన్యాయంబు గావింతువే

యేరా చెప్పఁగనైన మున్నెఱుఁగవే యే విక్రమార్కుండ నీ
క్రూరత్వంబును దర్పము న్బలిమియు న్రూపార్చెద న్నిల్వుమా.

305


క.

అనవుడు రోషంబున ని
ట్లను మాయాబలసమగ్రుఁ డగుదుందుభికి
న్మనుమఁడ నోరి నరాధమ
ఘనభుజదర్పుఁడఁ గఠోరకరుఁడం జుమ్మీ.

306


క.

ఆలమునఁ బంద[59] పగతుఱ
నాలం బొనరించినట్టు లాడెద విటు నా
పాలం బడితివి[60] నేఁడు నృ
పాలాధమ నిన్ను భూతబలి గావింతున్.

307


క.

నీకొలఁదివారియెముకలు
నాకోఱలసందిఁ జిక్కె నలుతును నీ వే
లోకము సొచ్చిననైననుఁ
బోకార్చెద నిన్నుఁ బదరి[61]పోవక నిలుమా.

308


వ.

అనిన వీరరసభీషణంబులగు భాషణంబుల విక్రమభూషణుండును దోర్దండమండితారాతి రాజమండలదండితప్రచండ భుజాగ్రమండనాయమాన మండలాగ్రధరుం డగు నద్దండిమగ లొండొరులం దలంపడి.

309


క.

మదకరులకరణి సింగపుఁ
గొదమలక్రియఁ బులులభంగి గురుపోతుల ప్ర
ల్లదముల[62] శరభంబులగతిఁ
గదిసిరి కదనమున కవని గ్రక్కదలంగఁన్.

310


ఉ.

బంధురవిక్రమస్ఫురతబాహులు దైత్యుఁడుఁ బార్థివుండుఁ గ్రో
ధాంధత మీఱి పోరిరి దశాననుఁడు న్రఘునాయకుండు న

య్యంధకుఁడున్ హరుండు నరకాసురుఁడు న్నలినాక్షుఁడు న్జరా
సంధుఁడు వాయుసూనుఁడును జంభుఁడు నింద్రుఁడుఁ బోరుకైవడిన్.

311


వ.

ఇట్లు పోరునెడఁ బ్రభాతం బైనఁ దత్కాలోచితంబుగ.

312


క.

క్రందఱి తనతేజమునఁ[63] బు
రందరుదెసఁ దెలివిగలుగ రాత్రించరునిన్
మ్రందించె విక్రమార్కుఁడు
సుందరి ముఖపంకజమున సొంపు నటింపన్.

313


ఆ.

మండలేశ్వరుండు మండలాగ్రంబున
దండి మిగులఁ గలిగి దండిదైత్యుఁ
జెండి పాఱవైచి చండాంశువిధమున
నుండెఁ గండ లుర్విఁ గుండుకొనఁగ[64].

314


ఆ.

దిశలఁ దెలివి గలిగె దివ్యతూర్యంబులు
చెలఁగె నారదుండు మలసి యాడె
నాకసమున నిల్చి యమరవర్గము జన
విభునిమీఁదఁ బుష్పవృష్టి గురిసె.

315


ఆ.

నృపుఁడు సంతసిల్లి నీరజాననఁ జూచి
పడఁతి యిట్లు కొట్లఁబడఁగ నీకు
నేమికతము దీని నెఱిఁగింపవచ్చునేఁ
జెప్పు మనిన వినతి చేసి పలికె.

316


ఆ.

వసుమతీరమణ యవంతిదేశంబులో
ధర్మశర్మ యనఁగఁ దగినవిప్రు
భార్య, గాంతిమతి నకార్యంబు గావించి
కులము చెఱిచి మిగుల గుఱుచనైతి[65].

317

ఉ.

భవ్యుఁడు ధర్మశర్మ తనబాంధవవర్గము చెప్పగా మదీ
యవ్యభిచార మట్లెఱిఁగి యాత్మఁ గలంగియు కామినీ నహం
తవ్య[66] యటంచుఁ దెంపుడిగి దానవుచేతికశాహతి న్శరీ
రవ్యథఁ గుందుచుండు బహురాత్రులు నీ వని శాప మిచ్చినన్.

318


క.

వడవడ వడఁకుచు మానము
సడలఁగ ధరఁ జాఁగి మ్రొక్కి శాపావధి యె
న్నఁడు నాకుఁ గలుగు ననుచుం
దడవోర్వమి విన్నవింప దయతో నతఁడున్.

319


క.

అసహాయశూరుఁ డగునొక
వసుధాపతి వచ్చి రేలు వగఁబెట్టెడున
య్యసురఁ బొరిగొన్న యప్పుడ
వెస నీశాపమున కెల్ల వీడ్కో లనియెన్[67].

320


శా.

ఆశాపంబున వీనిబారిఁ బడి దేహం బెల్ల మ్రందంగ న
య్యాశాబంధముపేర్మిఁ బ్రాణములఁ బాయంజాల కే నుండఁగా
నీశస్త్రప్రభ నాతమం బడఁపి మన్నించెం గృపం జూడు భూ
మీశాధీశ్వర! నీకు మే లొకట యే నిచ్చోటఁ గావించెదన్.

321


సీ.

ఇక్కడి గుడి తూర్పుదిక్కునఁ బక్కెచె[68]
        ట్టున్నది దానికి నుత్తరమునఁ
[69]బరువెఁడు దవ్వున బరివెంక పడుమటి
        నెలవునఁ దొమ్మిది నిధుల మీఱి
దనుజుఁడు దాఁచిన ధనము పెక్కున్నది
        కైకొమ్ము నామీఁదఁ గరుణసేయు

చనియెద నని మ్రొక్కి వనిత యేఁగిన రాజు
వెఱఁగంది యిక్కువ వెదకి కాంచి


ఆ.

దీనుఁ డైన భద్రసేనతనూజున
కిచ్చి వేడ్క మగిడి వచ్చెఁ బురికి
నిట్టిగుణము లేక యిది యెక్కవచ్చునే
పొమ్ము చాలు నింక భోజరాజ.

322


క.

అనవుడు నంతకు నంతకు
విన నింపగు నతనితెంపు విని సభ యెల్లన్
మన మలరఁగ నవమానం
బును[70] సిగ్గును ముడివడంగ భోజుఁడు మగిడెన్.

323


శా.

అక్షీణప్రతిపక్షభావసముదగ్రాటోపజాగ్రన్మనో
రక్షోనాయకపక్షతత్క్షణవిహారక్షిప్తకౌక్షేయకుం
గుక్షిన్యస్తసమస్తలోకభరణక్షుణ్ణాక్షయాత్మావృతి
ప్రక్షేపోచితు వాహనీకృతమహాపక్షీశు లక్ష్మీశునిన్.

324


శా.

ఉల్లాసోద్ధతచండతాండవవిహారోత్తుంగరంగజ్జటా
వల్లీమండలమల్లికాకుసుమభావప్రాప్తబాలేందుసం
ఫుల్లేందీవర రేణుసంగకబరీభూతాభ్రకూలంకషా
కల్లోలోపరిబిందుమౌక్తికమయాకల్పోత్తమాంగున్ శివున్.

325


మాలిని.

ధరణిధరవిభూషా ధర్మనిర్మాణతోషా
సరసిజభవసేవ్యా సంతతాత్మీయభావ్యా
నిరుపమనిజలీలా నిత్యకళ్యాణశీలా
పురహరహరిరూపా భుక్తిముక్తిస్వరూపా.

326

గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాదిబిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిణాంధ్ర మహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలి పురవరాధీశ్వర వెలనాఁటి పృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొఱవి వెన్నయామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజవిరచితం బైనసింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కు మహౌదార్యంబును జీమూతవాహనోపాఖ్యానంబును సాహసాంకుని సాహసౌదార్యంబులును నన్నది పంచమాశ్వాసము.

  1. తావతంసి దక్షధ్వంసీ
  2. మోము
  3. జెలువించుక యెడయ
  4. వ. అనవుడు నవ్వసుమతీపతి యతని పరోపకార సత్త్వగుణంబు లెట్టివనినఁ బాంచాలిక సవినయంబుగా ని ట్లనియె. అని యొక ప్రతిలో వచనమున్నది.
  5. రాజసమ్ముఖ
    మున నరుఁ డవయోగకార్యములుగా వెసఁ
  6. రజోవనరాజితాజలక్షణ్యము
  7. క్రౌంచపదమును సరసిజచిహ్నితమును సంకృతిచ్ఛందములోఁ గనఁబడుచున్నవి. ప్రకృతిచ్ఛందములోని దని వ్రాయబడినది.
  8. దనుసైఁపక
    పలుతెఱఁగుల ననఁగ నట్టిబ్రదుకోర్వకతా
    గెలఁకుల గ్రేళ్ళుఱికెనొ యన
  9. హస్రశిఖర రమ్య మౌచు నెపుడు
    భూమి గగనభాగపూర్ణమై ద్విజకుల-
  10. యార్భాటించి
  11. గతిగానక యతనికీడు గనుగొనఁబడియెన్
  12. మేలుఁజేయ మదిగానక
  13. ఒకతేజి కేడుపేరులు
  14. శిరోమణి వీవు
  15. నీదు నప్రియము పెంపును జేకుర
  16. ఏమితగవు చేసి
  17. పుణ్యపురుషుఁడు వినం బుణ్యపురుష
  18. వసంతలక్ష్మి
  19. తుంటవిల్లుచే మానసంబు పేటెత్త. చి. సూ.
  20. విరవిర విరహాగ్ని విరియఁజొచ్చె
  21. పిచ్చగిల్లిన; పెచ్చు పెరిఁగిన
  22. చుంయనియెన్; చుఱుకంటెన్
  23. దోఁబుట్టువౌటంజుమీ; నౌటంగదా
  24. చొప్పడు నేదీని బ్రదుకు చి. సూ. తప్పదు యేపనియైనను ముప్పవు
    మున కేమియైన మోసమువచ్చున్
  25. క. మనసిజునియేపు జాఱఁగఁ ...తన రుచి దివిగలయ బాలతపనుఁడు పొడిచెన్.
  26. నె, నరునాటంజూపె మన్ననంజడమాటై. చిఱికునఁ బెడమరిచూచిన నెఱసఖిఁజేరిననాగనె
  27. తన్మూలంబుగాఁ బెడమఱిమాచిన మన్మథుండు తెగఁజూచుట లోకోపకారంబయ్యె.
  28. ఈక్రిందివి దశావస్థలకందములు.
  29. మది, గోచరమగు ఠావులేక గొంకుచునుండున్
  30. చేతనంబ్రాలుగాఁగ
  31. వాసుకీసుతులు నివాళింపఁగా. నిర్ణకాంతలు నిపళింపఁగా.
  32. నిర్భరహాని
  33. బ్రదుకు
  34. కుటిలప్రచారులము
  35. ననద ననాథు నార్తు శరణాగతు
  36. చా వపకీర్తి యశంబు నిజాప్తులు హీనజంతువుల్
  37. యుండరా
  38. ధర్మజ్ఞులకున్
  39. వడిఁ బొంగి
  40. నైతి నేమి
  41. నహీంద్రులఁ దిందువు
  42. పోఁగడంగి యచటి కేఁగుదెంచి-చావఁదలఁచి యచటి క్రేవవచ్చి.
  43. నున్నారటంచు నేనుంటిఁగాక
  44. ధర్మైకనిరత
  45. సద్భక్తి సేయ వేసరితివో యోయన్న
  46. చెఱుకు చేతికోల చిన్నికూన
  47. అన్నువ, అధ్యత
  48. కిద్దఱకుం
  49. యెత్తున నమరాసనంబు వెసఁ ద్రొక్కఁగ వచ్చునె
  50. క. ఆకాశసాగరాంతర ....... శ్లోకుఁడు పురందరుండీ, లోకము
    గొనియాడ దానలోలుం డయ్యెన్
  51. సమున్నతి ధనమునఁ జొప్పడు హీనత దారిద్ర్యమున వచ్చు
  52. బుద్ధులు గలవే
  53. వినిపించెదనని
  54. మహార్తరవము- చి. సూ.
  55. బృథ్వీపాలక దీనికతము దేవర యెఱుఁగున్
  56. కాటుకమలక = మసిమూఁకుడు
  57. మొఱగగు వచ్చితి
  58. టసుర నిపుడె చెండి
  59. ఆలమునఁ బడిన
  60. నావాలునఁ బడితివి
  61. బెదరి
  62. బెట్టిదమున
  63. కెందలిరుతేజమునను
  64. మెండుకొనఁగ
  65. కులము చెడితి మిగులఁ గుటిలనైతి
  66. ఇంతిదా నహంతవ్య
  67. వెస నీపాపమున కదియె వీడ్కో లరయన్
  68. పరికెచెట్టు (బరివెంకకుఁ బక్కె నామాంతరము. పరికె వృక్షవిశేషము.)
  69. పరువుదవ్వున
  70. ననురాగంబున