సర్వలక్షణసారసంగ్రహము
తృతీయాశ్వాసము
రేఫద్వయనిర్ణయము
|
మద్ధరణీధరక
న్యామానసపద్మభృంగనయగుణసంగా
సామజదనుజవిభంగా
కోమలభసితావృతాంగ కుక్కుటలింగా.
| 1
|
వ. |
దేవా యవధరింపు మింక రేఫఱకారములప్రకరణం బెరంగిం
చెద నందు రేఫంబు లెవ్వియనిన.
| 2
|
క. |
అరియప్ప నమరి సింజిని
యరదంబరవాయి యరిటి యరగ న్ననఁగా
నరయుట యరణంబను పురి
కరుగుట యరిగెయును రేఫ లహిపతివలయా.
| 2
|
క. |
ఇర వనగ నునికిప ట్టగు
నిరువది యన నిదు రనంగ నిరువు రనంగా
నిరవన్నెపసిడి యిరసయు
నిరుగుడుమ్రా నఁనగ రేఫ లిభచర్మధరా.
| 3
|
క. |
ఉరులొడ్డుట యురియూడుట
యురళించుట యురువడించు టురువలి యనఁగా
బరగు నివియెల్ల రేఫలు
శరదిందునిభద్రకాశ శైలనివేశా.
| 4
|
క. |
ఎరగలి బిచ్చకు జిత్తం
బెరియుట మే కెరు వనంగ నెరమ్రింగెను సొ
మ్మెరవిమ్మెరపరికెము నా
బరుపడి నివి రేఫలయ్యె బాలేందుధరా.
| 5
|
ఆ. |
ఒరు లనంగ నన్యు లొండొరు లోరిమెయు
నొరిమెకెయును సొమ్ము లొరయుటిల్ల
మొరయు టొక్కరుండు నొరగంట రాచుట
రేఫలయ్యె ధవళవృషతురంగ.
| 6
|
సీ. |
కరివాడితూఁపులు కరిసేముకృషిపైడి
గరగుట కరణియు కరువలియును
కరవాలుఖడ్గంబు కరకలుకరకరి
కరువున బోయుట కనికరంబు
కరకర గ్రాలుట కరమొప్పుటయు కూడు
కరడు కట్టుట లక్క కరవటంబు
కరిగోరుటయు వానఁ గురియుట కెరలుట
కొరబ్రాణమును నాఁగ బరగునట్టి
|
|
గీ. |
పలుకులందెల్ల బరికింప ప్రౌఢకవుల
యనుమతంబున లఘురేఫ లమరియుండు
|
|
|
గురుతరోల్లాస పీఠికాపురనివాస
కాశధవళాంగ శ్రీకుక్కుటేశలింగ.
| 7
|
సీ. |
గరితపతివ్రత గరకరియును మేను
గరుదాల్చుటయుఁ బెండ్లి గరగగరికి
గరువతనంబును గరిడియు గరపచే
ల్లిరగిర వ్రాయుట గురుగుగూర
గురబోతు సవరపుగురుజులు గురివింద
గురువులు వారుట గురువురొడ్డు
గురుగులు పిడతలు గొరవంక పిట్టలు
గొరగొరనడుచుట గొరిజుమోపు
|
|
గీ. |
నాఁగ దగుశబ్దములయందు నలువు మీఱు
నట్టివన్నియు లఘురేఫ లగుచునుండు
బన్నగాధీశ కేయూరభవవిదూర
కుముదహితకోటిసంకాశ కుక్కుటేశ.
| 8
|
క. |
చిరుగుట చిత్తరుబొమ్మలు
చెరువులు చెచ్చెరయు గోకచెరగులు చేటం
జెరుగుట జెరువుట చొరవయుఁ
జొరకుండుట రేఫలయ్యె సుమశరహరణీ.
| 9
|
సీ. |
తరచియాడుట యేటితరగలు తరతర
తరములచుట్టలు తరముగామి
తరచినమజ్జిగ తరువాయిదేహంబు
తరలబారుటయును తరబడియును
తిరుగుట తిరియుట తిరుగ గ్రమ్మరనంట
తెరతెరవచ్చుట తెరువుతోడు
తెరలుకట్టుట రెండుతెరగలు తెగలగు
తెరలగ్రాగిననెయ్యి తొరయుటయును
|
|
గీ. |
తొరగుటయు ననుపలుకుల దొరలియున్న
వన్నియును రేఫలని కవు లెన్నుచుండ్రు
భూనుతవిలాస పీఠికాపురనివాస
కుముదహితకోటిసంకాశ కుక్కుటేశ.
| 10
|
గీ. |
దరికొనుట దరిద్రొక్కుట దరిదరియుట
దురము దురటిల్లుటయు దురదుర నెదురుట
దొరయు దొరకొంట దొరలుట దొరకొలుపుట
దొరసుటయు దొరకుట రేఫ లురగభూష.
| 11
|
క. |
నరము లన నురుము లనఁగా
నెరపుట యన నెరి యనంగ నెరసు లనంగా
నెరసుట నెరసినతల యనఁ
బరగు న్రేఫంబు లగుచు భావజదమనా.
| 12
|
సీ. |
పరువులు వెట్టుట పరిచనుదెంచుట
పరపుట నించుట పరపు నిడుపు
పరిపరి పరువడి పరిమార్చుటమ్ములు
పరగించుటయు మరి పరిణయంబు
పరుసదనంబును పురపుర బొక్కుట
పురికొల్పుటయు తుట్టెపురుగు తనకుఁ
బురు డెవ్వఁ డనుటయుఁ బురుటాలుగుమ్మడి
పెరడాల పెరుగు మెన్వెరుగుటయును!
|
|
గీ. |
పొరుగు పొరిగొంట పొరిఁబొరి పొరలుటయును
పొరలు పొరిబొచ్చమును మరి పొరిగరుఁగుట
యాదిగాఁగలశబ్దంబులందు రేఫ
లమరియుండును శైలకన్యాధినాథ.
| 13
|
గీ. |
బరులు బరిమెను బరిగట్టె బరడు బరువు
బరువసం బనుబరుజులు బిరుదు బిరుసు
|
|
|
బురద బురబుర బొరగుట బెరయుటయును
బెరకు బొరసును రేఫమ్ము లురగహార.
| 14
|
గీ. |
మరులు మరియాద మరలుట మిరియములును
మురువు మురమురలాడుట మురియుటయును
మురుగు మురియలు మెరమెర మొరపనేల
మొరడు మొరయుట రేఫలు గిరినిశాంత.
| 15
|
ఆ. |
రచ్చ రజ్జులాఁడి రమ్మంట రంకెలు
రమణ రవణి రంతు రహియు రంగు
రిత్తయగుట రెండు- రెట్టవెట్టుటయును
రొదయు రేఫలయ్యె మదనమధన.
| 16
|
గీ. |
వరపు వరుజులు వరువుడు ల్వరియు వరగ
వరుస విరవిరఁబోవుట విరియుటయును
విరియఁజల్లుట విరులును విరివి వెరవు
వెరసులును రేఫలై యొప్పు గరళకంఠ.
| 17
|
గీ. |
సరకులమ్ముట సరిసరుల్ సరకుగొనమి
సరగ నరుదుట సరసను సరవి సరిగె
సిరి సురటి సురె సురుగుట సెరబడియును
సొరదియును రేఫములు ధరాధరనివేశ.
| 18
|
క. |
హరివాణము తెలిహరువన
నరయఁగ హురుమంజిముత్తియంబుహొరంగుం
బరికింపఁగ రేఫములగు
గిరితనయాధీశ గగనకేశ మహేశా.
| 19
|
సీ. |
చక్కెర జక్కర ముక్కెర మువ్వురు
నలువురు పయివురు నగరు తొగరు
జేగురు తొలకరి చీపురు బంగరు
మార్తురు నెత్తురు మదురు కుదురు
|
|
|
తలవరి జూదరి తనరుట దేవర
కొబ్బరి వెరవరి యబ్బురంబు
క్రమ్మర తామర కనరెవ్వరియ్యరు
వివరము మోహరం బివురు సవురు
|
|
గీ. |
డిప్పరంబును పొగరును చప్పరంబు
వేగిరం బోగిరంబును వెదురు కదురు
సదరు మొదలగు పదముల తుదలఁ గొన్ని
రేఫ లగుచుండుఁ బార్వతీప్రియ మహేశ.
| 20
|
క. |
ఇవి కురుచలపై రేఫలు
భువి నెన్నఁగ నింక దీర్ఘములపై రేఫల్
వివరింతుఁ జిత్తగింపుము
కువలయమిత్రోత్తమాంగ కుక్కుటలింగా.
| 21
|
క. |
ఆరుట నిండుట యారెకు
లారాటం బారగించు టారట మెదలో
నారయుట రేఫ లయ్యెను
క్రూరాహితమదవిభంగ కుక్కుటలింగా.
| 22
|
క. |
ఈరికె లెత్తుట యీరెలు
నీరేడుజగంబులందు నీరననిరదౌ
నీరస మీర్ష్యము దానం
బీరే యన రేఫలయ్యె నిభదైత్యహరా.
| 23
|
క. |
ఈరనఁగ గ్రామనామం
బూరార్చుట యూరకుంటయును రేఫములౌ
నేరీయన నేరికియన!
నేరాయన రేఫలయ్యె నిందువతంసా.
| 24
|
క. |
ఓరసిక యోరసిల్లుట
యోరుచుకొను టోరెమిడుట యోరీ యనుటల్
|
|
|
ధారుణి లఘురేఫము లగు
గౌరీహృత్పద్మభృంగ కంధినిషంగా.
| 25
|
సీ. |
కారులు కల్లరు కారు మెరుంగులు
కారించుటయును ముక్కారుపంట
కారాకులును పట్టుగారు కారాటము
కూరుకు నిద్రచే కూరుటయును
కూరిమి యమ్మెలుగూర నేయుట మన్నుఁ
గూరుటయును తోటకూర నెనరుఁ
గూరిచియుండుటఁ గూరుట పొగలుట
కేరుట కోరడి కోరికయును
|
|
గీ. |
కోరు నాఁబన్ను వెట్టుట కోరగిన్నె
పందికోరాడుటయు ననం బరగు నట్టి
నుడువులం దెల్ల రేఫము లడరుచుండు!
శమితకీనాశ నగతనూజాహృదీశ.
| 26
|
క. |
గారాము గారపట్టుట
గారాబము గారవంబు గారెలు నాగా
గారయనఁ దరువిశేషము
గోరులనన్ రేఫలయ్యె గోపతిగమనా.
| 27
|
సీ. |
చీరికిఁ గొనకుంట చీరలుఁ గోకలు
చీరట పిల్చుట చించుటయును
చూరయనంబొడి చూరీలు చేరుట
చేర చేరుచుకొంట చేరికయును
చేరువ ప్రోగును చెంతయుముత్తెఁపు
చేరును రేఫలై చెలఁగు మరియు
తారసిల్లుటయును దారు దారనుటయుఁ
దీరనిక్కినదియుఁ దూరుపుదెస
|
|
గీ. |
తేరన రథంబు తేరకు తేరగంజి
తేరు తేరోరి యచటి కేతేరఁబోకు
తోరమై యొప్పె సందిటితోర మనెడు
పలుకు లెల్లను రేఫముల్ పార్వతీశ.
| 28
|
ఆ. |
దారిఁజనుట పట్టుదారము దూరులు
పలుకుటయును దోరబళ్లు శిలలు
దోరవెట్టుటయును దోరుటయును దోర
గల్లు రేఫలయ్యె గరళకంఠ.
| 29
|
గీ |
నారచీరలు సింగాణినారి పోర
నీరగుట చచ్చుటగుఁ దేటనీరు నాఁగ
నేరుపును గంగనేరెడు నోరనంగఁ
బరగునవి యెల్ల రేఫలు ఫాలనేత్ర.
| 30
|
క. |
పూరేడు పూరి పెరుగుట
పేరెద పేరెములు పూసపేరుల జేరుల
బేరుం బోరచి పోరుం
బోరామియుఁ బోరితంబు భువి రేఫ లజా.
| 31
|
ఆ. |
బార బారి బారు బీరము బూరుగ
బూరటిలుట బూర బూరి దేర
ములును బేరజంబు బోరగిలుట బోర
బోరుగొండ రేఫములు గిరీశ.
| 32
|
గీ. |
మారిమసఁగుట మారేడు మారటహరి
మారుతు రనంగ రిపులు వేమారు మీరు
మూర మేరయు మోరయు మోరతోపు
ననెడునుడువులు లఘురేఫ లగసుతేశ.
| 33
|
సీ. |
రాణ రాణించుట రాయిడి రాయఁడు
రాచూలి రాయంచ రాపొడియును
|
|
|
రాముల్కపండులు రాము రాగిల్లుట
రారాపు రాచుట రావిమ్రాను
రాణువ రాయుట రాజుట రాలుట
రామి రానట్టుట రాచబంటు
రీతి రూపుట రూక రేయి రేఁగుట రోఁత
రోయుట వెదకుట రోవెలంది
|
|
గీ. |
రోలు రోకలి రోజుటం చోలిఁబలుకు
పలుకులన్నియు రేఫలై పరగుచుండు
కుధరజాసంగకలశ నీరధినిషంగ
ఇభదనుజభంగ శ్రీకుక్కుటేశలింగ.
| 34
|
క. |
దారని కోపము వారక
వారించుట వారువంబు వారకులును కూ
డ్వారుచుట వారకంబును
వారు న్వీరనెడుతీరువలు రేఫ లజా.
| 35
|
గీ. |
సారెలును పెళ్ళిసారె వేసారుటయును
సారెకును సూరెలును సేరు సైరణయును
సరవి సోరణగండ్లును సౌరు నాఁగఁ
బరగు నివియెల్ల రేఫ లంబరశిరోజ.
| 36
|
క. |
ఇది రేఫప్రకరణ మిఁక
ముద మొదవఁగ శకటరేఫములు తెరగెల్లన్
విదితంబుగ నెఱిఁగించెద
సదమలనుతి చిత్తగింపు జగదీశ శివా.
| 37
|
శకటరేఫప్రకరణము
క. |
మేర చెడకుండ రేఫ ఱ
కారంబుల తెరగెఱింగి కబ్బంబులలోఁ
గూరుపవలయున్ సుకవులు
సారెకుఁ దద్భేదములు విచారించి శివా.
| 1
|
ఆ. |
ఎన్నిలక్షణంబు లెఱిఁగిన రేఫలు
బండిఱాలు నెఱుఁగకుండునట్టి
కవి కవిత్వమెల్ల గవ్వకుఁ గొఱగాక
కొరఁతఁ జెందు రజితకుధరనిలయ.
| 2
|
సూ. |
"నాన్యేషాం వైధర్మ్యం లఘ్వలఘూనాం రయోస్తు నిత్యం స్యాత్"
|
|
వ. |
అని వాగనుశాసనుఁడు చెప్పినాడు గనుక.
|
|
గీ. |
జ్ఞాతి వైరంబులంది ప్రాసంబులందు
విశ్రమములందుఁ దమలోన వేఱు గలిగి
దేవదానవులట్లన దెనుఁగులందు
మించి ఱేఫఱకారముల్ మెలఁగు గృష్ణ.
| 3
|
ఆ. |
సొరది భోజకన్య నరదంబుపై నిడి
రేయి దెచ్చెననఁగ రేఫమయ్యె
మఱఁది యనక సిగ్గు పఱచి రుక్మిణి జాల
ఱట్టుపరచెననఁగ ఱాముకుంద.
| 4
|
వ. |
అని ముద్దరాజు రామన్న చెప్పినాడు.
|
|
ఆ. |
ఱజ్జులాడి యీగి ఱాపడి సభలోన
ఱేసిపోరిలోన ఱిచ్చఁబొఱసి
ఱెన్నమడుగు పుడమిఱేల నేల నుతింప
మనకు విశ్వనాథుఁ డొనరియుండ.
| 5
|
వ. |
అని పెద్దిరాజు చెప్పినాడు.
|
|
ఆ. |
మరునితండ్రి లోకమహితుండు యాదవ
రాజసింహు డార్తరక్షకుండు
ఱాగలేలు పనఁగ ఱంపిల్లు నెక్కటి
వళ్ళు నాగ నిట్లు వనజనాభ.
| 6
|
వ. |
అని యనంతుఁడు చెప్పినాడు. అటువలెనే మహాకవులు రేఫఱకారములుఁ గలియకుండం బ్రయోగించినారు.
|
|
గీ. |
దేవదానవులట్ల ద్వేష మెపుడుఁ
గలిగియుండును రేఫఱకారములకు
నట్లు గావున నది గలియంగనీక
కావ్యములఁ గూర్పవలయు సత్కవు లెఱింగి.
| 7
|
క. |
నన్నయభట్టాదులు కృతు
ల న్నిలిపినలక్ష్యములును లక్షణము లెఱుం
గన్నేరక యిది కల్లని
యెన్నుదు రొకకొంద రిందు కేమి యనజనున్.
| 8
|
క. |
వెల్లంకి తాతయార్యుఁడు
తెల్లమిగా శకటరేఫ దీర్ఘంబులపైఁ
జెల్లదని పలికె నదియుం
గల్ల వితర్కింపఁ బ్రౌఢకవిసమ్మతులన్.
| 9
|
ఆ. |
పదము మొదల నిడుద తుది దద్భవంబుల
రేఫ కాని శకటరేఫ కాదు
నిక్కమనుచు సుగుణనిధి దిట్టకవి వేంక
టార్యవరుడు నుడివె నది హుళక్కి.
| 10
|
గీ. |
పదముమొదల నిడుద తుది గురురేఫలు
గలిగియుండు గృతుల గాటముగను
|
|
|
తెలియవలయు దీనితెరఁగెల్ల సుకవులు
తేటపరుతు వినుము త్రిపురమధన.
| 11
|
క. |
కగచజతదనలపబమల
దగవసలన్ ద ఇ ఏ ఓల దక్కఁగ నెందున్
మిగిలినవర్ణంబులపైఁ
దగులవుగద బండిఱాలు ధనపతిమిత్రా!
| 12
|
1 లక్షణము
సీ. |
అఱవఱలఱగఱలఱిముఱి యఱచుట
యఱుముట యఱిచెయ్యి యఱపుకొనుట
యఱకటబెట్టుట యఱమఱయఱ లేక
యఱువుడు కుప్పసం బఱుగులరిసె
ఎఱుఁగుట తక్కువ యఱవది యఱసోర
దఱమూతయిల్లఱళ్ళక్కఱపడి
యఱకమ్ముటమఱంటు లఱవళు ద్రావిళు,
లఱకమ్మనఁగ నన్న మఱుగకుంట
|
|
గీ. |
యఱుగుట తఱుగుట యయ్యె రూపఱ పొలుపఱి
క్రచ్చఱయు నన నివియెల్ల నచ్చుమీఁద
శకటరేఫలు రాజతాచలనివేశ
భవవియత్కేశ పార్వతీధవ మహేశ.
| 13
|
వ. |
ఇందులో అరచెయ్యి అరకాలు అరవది యనునప్పుడు అర యనుట రేఫఱకారములు రెండున్నయ్యేటట్టుగాను మహాకవులు ప్రయోగించినారు. అందుకు ఉదాహరణము.
|
|
రేఫ యగుటకు
క. |
అరకాలు ముల్లుగొనకిదె
తిరిగి రఘుస్వామి యేఁగుదెంచుం న్మదిలో
|
|
|
దరుణీ వెఱువకు విపినాం
తరముననను విడిచిపోవదగదిక నాకున్.
| 14
|
క. |
అరపైకంబును జేయని
హరివాసరమునకు నైనిజాత్మజు దునుమన్
గరవాలు చేతఁబూనిన
కరణి యినుపమొలకు మేడ గాల్చుటసుమ్మీ.
| 15
|
సీ. |
అరవిడుగొప్పులవిరులవాసనకుఁ దో
రపుటూర్పుగాడ్పులు ప్రాఁపుగాఁగ
|
|
క. |
గరివంకబొమలపై గ
స్తురిఁ దీర్చిన తిలకరేఖ సుదతికిఁ బొలిచెన్
మరుఁడు వెడవింటఁ దొడిగిన
యరవిరినునునల్లగల్వయమ్మును బోలెన్.
| 16
|
చ. |
అరవిరిగుత్తులం బొలిచి యల్లన గాడ్పుల నీఁగు నీరతన్
దరహసితోదయంబున.....
| 17
|
క. |
అరచందమామ నేలిన
దొరగా నెన్నుదురు నెన్నుదురు బిత్తరికిన్.....
| 18
|
శకటరేఫ యగుటకు
సీ. |
కరువలి సుడియమి గదలక చెన్నొందు
నఱవిరిదమ్ముల నుఱకఁ దెగడి
| 19
|
క. |
పిఱుదంగురుధరణీపతి
యఱచేతం బ్రాణములుగ నరినృపతిబలం
బుఱు తెగువముందటం బే
ర్గొఱలుట చిత్తమునఁ బెట్టుకొని హరియించున్.
| 20
|
క. |
అఱపు లుడిగి పోపోనీ
యఱచేతం బళ్ళు వచ్చినప్పుడు మమ్ముం
గఱచెదవు గాని తగునెడ
మొఱయిడునది యెట్టిదైవములు వినియెడినో.
| 21
|
క. |
అఱబోరకురుచచేతులు
నొఱవశరీరంబు గలిగి యొరులకుఁ జూడం
గొఱగాకుండియు మన్మథు
నొఱపులఁ బడియెడు నితండు యువతీ ప్రీతిన్.
| 22
|
క. |
అఱవదికోటులుకపివరు
లుఱక జగత్రయము నొకట ను వ్వెత్తుగొనన్
దఱిగొన్నయట్ల నడువఁగ
నెఱసి కుముదుఁ డరుగుదెంచి నృపవరుఁ గనియెన్.
| 23
|
ద్విపద. |
అఱగౌను లసియాడ నలసి యానముల
మెఱుపుగోయిలతలై మెయిదీగె లొలయ...
| 24
|
క. |
ఉఱికి భుజాయుద్ధమునకుఁ
దఱమినఁ గైదువులు విడిచి దట్టించుచుఁ బి
ట్టఱచేత బిట్టుచరచిన
|
|
|
నొఱిగొఱిగి యతండు నతనియురుమస్తకముల్
| 25
|
2 లక్షణము
క. |
ఇఱియుట యిఱికిగొనుట కూ
డిఱిసిచనుట యిఱకటంబు నిఱులనఁ జీఁక
ట్లిఱుకును గ్రిక్కిఱియుట బం
డిఱుసును గురురేఫలయ్యె నిభచర్మధరా.
| 26
|
వ. |
ఇందులో నిరులు చీక ట్లనుటకు గురురేఫకు నుదాహరణ చింత్యము.
|
|
లఘురేఫ యగుటకు
సీ. |
ఇసుక వెట్టిననేల నేఁచి యర్కాంశులఁ
జొరనీక దట్టమై యిరులు గవయ.....
| 27
|
సీ. |
కన్నులపండువు గ్రహసార్వభౌముండు
సురలయాఁకటిపంట యిరులదాయ...
| 28
|
క. |
ఇరులు బలియుచును సలుపులు
కర మరుదై కరడుఁగట్టి కదసినకరణిం
బరగఁగ దోముడు కాటుక
కరవటముంబోలె నిజ్జగంబుఁ దనర్చెన్.
| 29
|
చ. |
పెరిగిన యీశునన్ నెమలిపించములన్ బురివిప్పఁబోలు నీ
సరసిరుహాక్షి వేనలికి సాటిగ నిల్వఁగ నోడిచొచ్చె నిం
దిరశరణంబు తేటిగమి నీలము లింద్రుని పేరు గాంచె పె
|
|
|
న్నిరులు గుహాశ్రమంబుఁ గనియె న్నెరిగల్గినవారి కోర్తురే.
| 30
|
సీ. |
నిండుఁజందురునవ్వు నెమ్మోము సిరితోడ
నిరులు గ్రమ్మెడు వేణిభరముతోడ....
| 31
|
3 లక్షణము
గీ. |
ఉఱడునగైకొన డుఱుకుట యుఱుము లుఱక
యుఱిది బిగ్గెఱ యుఱుమిక్కి లుఱవుకొంప
లుఱియు టుఱుకఱి యుఱియయు నుఱని తెగువ
యుఱుతపిల్లలు బండిఱా లురగహార.
| 32
|
క. |
ఎఱకలు ఱెక్క లెఱుంగుట
యెఱపఱికెం బెఱుకువాఁడు నెఱు పెఱుఁగుట సొ
మ్మెఱవిడుట యెఱచుమాంసం
బెఱికతయును బండిఱా లహీనవిభూషా.
| 33
|
వ. |
ఇందులో నెఱవనుట రేఫఱకారములు రెంటం జెప్పినాడు. ఱకారమున కుదాహరణ చింత్యము.
|
|
రేఫకు
చ. |
ఎరవుగఁ జూడఁజాగె హరిణేక్షణ బిన్నటనాటనుండియుం
బరిచితిఁ బూని మంజుగతి మాధురియు న్మృదువాగ్విభూతియు
న్వరుసన తెల్పి........
| 34
|
క. |
ఇమ్ము నరేశ్వర మాతుర
గమ్ముల నీకార్యమయ్యెఁ గాదే కడులో
భ మ్మొనర నొరులసొమ్ములు
|
|
|
రమ్మనిన న్వచ్చునే యెరవు సతమగునే.
| 35
|
క. |
హరి పలికిన విధమంతయు
నెరవైయున్నయది వింటె యీమాటతెరం
గరయుదము......
| 36
|
4 లక్షణము
ఆ. |
డిఱకటంపుత్రోవ యొఱగాల నిల్చుట
డిఱగువంక కత్తియొఱ యొఱయుట
యొఱగుబిళ్ళ లొఱపు లొఱవ దేహం బిది
శకటరేఫ లుదధిశయనబాణ.
| 37
|
సీ. |
కఱపుట నేర్చుట కఱవు దుర్భిక్షంబు
కఱఁతలు పోకిళ్ళు కఱటిమంకు
కఱుదులు బుద్ధులు కఱకు కాఠిన్యంబు
కఱికప్పు బెబ్బులి గఱచుటయును
కిఱువుట కుఱుమాపు కుఱుగంటు కుఱుగడ
కుఱుకొని కుఱుకులు కుఱువు కుఱులు
కుఱకుఱమన్నిలు కుఱుగలి కుఱుచయు
కెఱయుఱుక్కెఱయు పక్కెఱయు కొఱఁత
|
|
గీ. |
కొఱడు కొఱలుట కొఱగామి కొఱకు కొఱవి
కొఱుకుటయు కొఱకొఱయును గుఱుతు మీఱ
క శకటరేఫంబులని తొంటి సుకవు లండ్రు
శమితకీనాశ గిరితనూజాహృదీశ.
| 38
|
వ. |
ఇందులో కుఱులనుటయు బక్కెఱనుటయు ఱకారము లగుటకు ఉదాహరణ చింత్యము.
|
|
రేఫయగుటకు
పంచచామరము. |
సరు ల్పెనంగొనంగ జీల్గు జన్ను గప్పుమీఱఁగా
గురు ల్వెస న్నొస ల్వొసించి కూడి చాల మీఱఁగాఁ
దరు ల్బెడంకుచుండ నాని తారసిల్ల నేఁగి క్రొ
వ్విరు ల్గురించికోసె నోర్తు వెంటఁజానలంటఁగాన్.
| 39
|
గీ. |
ఇరులఁ గెలచిన యంతఃపురేందుముఖుల
కురులు మరుఁడనువేఁటకాఁ డురులు సేసి
మరులు గొలుపంగఁలేడయ్యె మనుజవిభుని
సరులు లేనిదృగంబున శాబకములు.
| 40
|
వ. |
ఇవి రేఫప్రయోగములు. మఱియు.
|
|
సీ. |
ఇందుబింబముమీఁది కందుచందంబునఁ
గురులు నెమ్మొగమున నెరసియుండ...
| 41
|
గీ. |
కురులు కెంపులు బొగడలు నెరయదువ్వి
| 42
|
వ. |
ఇందులో నెరసుటను ఒరసుటను రేఫఱకారములు రెంటం గలవు గనుక చింత్యము. కురులనుట రేఫఱకారముల రెంటం గలవు. పక్కెఱ ఱకారమగుటకు చింత్యము.
|
|
రేఫకు
సీ. |
పన్నగాశికి నెదుర్పడి రెండురెక్కలు
ధరియించెననఁగ బక్కెర జెలంగె...
| 43
|
5 లక్షణము
సీ. |
గఱికె నట్టులు గఱగఱికెయు గఱుగుగా
యలు బరికింపఁ జింత్యములు మఱియు
గఱుని డగ్గఱియంప గఱిపగఱియుమోట
గిఱకయు గిఱుమెట్లు గిఱిగొనుటయు
గిఱులు వ్రాయుటయును గిఱుపుటగుఱు కాని
గుఱుకువెట్టుటయును గుఱిగడచుట
గుఱుకొండి గుఱగుఱ గుఱువెట్టుటయు గుఱి
గుఱుసులు గింజలు గుఱుతు గొఱియ
|
|
గీ. |
గుఱుకుకట్టెలు గొఱవంక గొఱుగుటయును
మొదలుగాఁ గలపలుకులు గదసియుండు
నట్టివన్నియు గురురేఫలై తనర్చు
భవవిరూపాక్ష త్రిపురదానవవిపక్ష.
| 44
|
వ. |
ఇందులో గరగరి యనుటను గొరవంక పిట్ట లనుటను రేఫఱకారముల రెంటం జెప్పినాడు, గురురేఫ కుదాహరణ చింత్యము.
|
|
లఘురేఫ యగుటకు గరగరికకు
క. |
సిరివంటిది బడెబీబీ
విరిబోఁడికి వెన్నుఁ డనఁగ వెలయుచు మిగులన్
గరగరికలఁ దనరెడు రా
సిరులొందు నమీనుఖాను చెలుపములగనీ.
| 45
|
క. |
పరమసుమనోమనోజ్ఞత
గర మాత్మారామవరవికాసము దనరన్
గరువఁపుజరితలగరితలు
|
|
|
గరగరికల గరిమనగరి గరిమకు నమరున్.
| 46
|
గొరవంక లఘురేఫ యగుటకు
మ. |
శరసంధానముతోనె కొన్నియడుగుల్ జౌజౌవునం బారియా
ధరణిం గాల్గొని ద్రోణము ల్దివిచి దోర్దండంబులం జేసి యే
సిరిబోయ ల్టినుమంచు నార్చుపరచున్ జెట్టాసల న్డాయుచున్
గొరవంక ల్మొరవెట్టినట్లు గుణము ల్ఘోషింప రోషంబునన్.
| 47
|
క. |
మరు డపుడు బేసితూఁపులు
ధరియించియు నేమి జెప్పఁ దరుణిన్ నరునిన్
సరిగోలలు వడనేసెన్
గొరవంకరొద ల్సెలంగఁ గ్రొన్ననవింటన్.
| 48
|
6 లక్షణము
సీ. |
చఱచుట యఱచేతఁ జఱచుట గొడ్డలి
చఱచుట బిట్టుగా చఱచుటయును
చఱులు బిచ్చఱమంట చిఱుతది చిఱునవ్వు
చిఱుకొట్టుటయును ముచ్చిఱతనంబు
చిఱిమి దేహంబెల్ల చుఱచుఱ గాల్చుట
చుఱుకుపుట్టుటయును చెఱిసగంబు
చెఱకులు చెఱసాల చెఱుముట చెఱుగులు
చెఱచుట చెఱలాట చెఱకబట్టి
|
|
గీ. |
చెఱువున ద్విజుల్ భుజించుట చెఱుపుటయును
చెఱు వనఁ దటాక మగు నివి చెప్ప శకట
రేఫములు సుమ్ము పీఠపురీవిహార
|
|
|
యురగపరివృఢకేయూర దురితదూర.
| 49
|
వ. |
ఇందులో చెఱగు లనుటను చెఱు వనుటను చెఱువు లనుటను రేఫఱకారములు రెంటం జెప్పినాడు.
|
|
చెరగు రేఫయగుటకు
,
చ. |
రవి యనుదివ్వె కేతువుచెరంగున మూసి కృతోర్ధ్వయంత్రవా
రవిరళఘర్మయైకలరవాల్పరనోక్తుల నొత్త...
| 50
|
ఉ. |
రంగు మెరంగు బంగరుచెరంగుల రెంటెము నాల్గుకొంగులన్
| 51
|
శకటరేఫ యగుటకు
మ. |
చెఱగుల్ పూతపసిండివ్రాతపసిమిన్ జిత్రాతిజిత్రంబులై
మెఱయన్ రత్నపుగుచ్చులంచుల బడె న్మించ దువాళించు క్రొ
మ్మెఱుగుల్ చంద్రిక కాటపట్టు సురభూమీజార్పితం బిచ్చె నా
దఱచున్గన్నులవేల్పుపట్టి వసుగోత్రామండలస్వామికిన్.
| 52
|
గీ. |
అవని గంపింప లలితపీతాంబరంబు
చెఱఁగుదూలఁజకాంతులు దుఱగలింప...
| 53
|
సీ. |
కనకమేఘల గ్రుచ్చి కట్టై నెవ్వఁడు లీల
జెఱఁగున బూషార్కు మెఱఁగుపళ్ళు......
| 54
|
వ. |
చెఱు వనుట శకటరేఫ యగుట చింత్యము.
|
|
రేఫ యగుటకు
చ. |
కరమున నున్న శూలమునఁ గ్రమ్ముమెరంగులు శత్రుసంఘభీ
కరములుగా గజాశ్వభటకాయములన్ గుదిగ్రుచ్చినట్లుగా
|
|
|
జెరువుచు వచ్చువానిఁ పురుసింహుఁడు జూచి మంధాంధసింధురో
త్కరరభసాతిభీషణముగాఁ గవిసెం బటువిక్రమోద్ధతిన్.
| 55
|
సీ. |
రిక్కలో యివి గావు రేచామతురుముపైఁ
జెరివినమల్లిక్రొవ్విరులు గాని
| 56
|
చెరువు రేఫ యగుటకు
గీ. |
దనరు బకపఙ్క్తులకు జూ నుదఘ్న మయ్యె
చెరువుగమి యుడుములనరెల్ దిరిగి కుక్క
పసికి.....
| 57
|
శకటరేఫ యగుటకు
చ. |
చెఱకుందోటలఁ బెంచి శాలిమయసుక్షేత్రస్థలుల్ నించి య
క్కఱలేకుండగ బూగనాగలతికాకాంతారముల్ ద్రోచి యే
డ్తెఱనం తంగుముదోత్ఫలాబ్జవనవాటీగోటి బాటించి పె
న్జెఱువుల్ వోల్చెఁ బురంబులన్ దెసలఁ బ్రస్ఫీతాంబుపూర్ణస్థితిన్.
| 58
|
క. |
చెఱువులు గట్టిన పుణ్యులు
తఱపక ధాన్యంబు లమ్ము ధన్యులు ప్రజలం
జెఱ విడిపించిన సుకృతులు
నెఱి నర్కతనూజరారు నీపురమునకున్.
| 59
|
7 లక్షణము
గీ. |
జఱిజఱియు బూజఱియును పూజఱి జఱిగొని
జఱపుటయు చేతఁ జమఱుట జఱజఱయును
|
|
|
జిఱజిఱను ద్రిప్పుటయును జుంజుఱునెఱులును
జొఱజొఱయు బండిఱా లగు సోమమకుట.
| 60
|
సీ. |
తఱుగుట కోయుట తక్కువ యగుటయు
తఱఁగరి బేహాఱి తఱిగొలుపుట
తఱలుట పుచ్చున తఱకలు శత్రుల
దఱియుట తఱుముట తఱులు తఱపి
తఱుచుదట్టము తఱితఱి గొనినడచుట
తిఱుగుట త్రిమ్మఱి తిఱివె నచట
తుఱగలితుఱుము వాతెఱ యేడ్తెఱయుకను
దెఱచుట తెఱవలు తెఱగొలుపుట
|
|
గీ. |
తెఱపి తెఱలిన వాసన తెఱకువయును
తెఱఁగు తెప్పిఱి తొఱలుట తొఱగుటయును
పలుకులెల్లను శకటరేఫంబు లగును
రజతధరణీధరవిహార భుజగహార.
| 61
|
వ. |
ఇందులో తరలుటను తరు లనుటను తిరుగుటను వాతెర యనుటను తొరగుటను రేఫఱకారంబుల రెంటం జెప్పినాడు.
|
|
తరలుట రేఫ యగుటకు
చ. |
అరిజయకీర్తిసాంద్రుడగు నయ్యళిరామనరేంద్రసోదరున్
తిరుమలదేవరాయని నుతింపఁ దరంబె తదీయహేతిశాం
కరియతిలోహితావయవగాథను నాత్మహృదంతరంబులన్
దరలక తాల్చువారలకుఁ దార్చు సురీవరణీయవైకరుల్.
| 62
|
వ. |
మఱియును రేఫ యగుటకు బహుళముగాఁ గలవు.
|
|
ఱకార మగుట
చ. |
ఒఱగె వసుంధరాస్థలి మహోరగనాథుఁడు వంగెఁ గూర్మమున్
దఱలె నభంబు మ్రోసె సురదంతులు మ్రొగై దిగంతరంబుల
|
|
|
త్తఱి నదరెన్ మరుత్సుతుఁడు దర్స మెలర్ప నహార్య ముధ్ధతిన్
బెఱుకఁగ గోత్రశైలములు పెల్లగిలెం గలఁగెం బయోనిధుల్.
| 63
|
తరులు రేఫ యగుటకు
చ. |
మురియుచుఁ దమ్మిచూలి మది ముంద రెఱింగినయట్ల నేర్పుతో
దరులను పైఁడికంట్లిడిన దాన దిరంబయియుండెఁగాక యే
వెరవున నిల్చు దీనివగువ్రేఁకపుజన్నులవ్రేఁగునం బయల్
దొరసినయట్టినెన్నడుము తోరపునల్వ కడంక మెచ్చితిన్.
| 64
|
శకటరేఫ యగుటకు
చ. |
తఱు లఱనిక్కఁ బూప నెఱతావియ చిక్క నపాంగమాలికల్
మెఱుఁగులు గ్రక్క నూరుపులమేలిమిదేటులు చొక్కహారము
ల్కుఱుచలు ద్రొక్క మున్గురులు క్రొంజెమటం బదనెక్క నేలుపుం
దెఱవయొకర్తు చేదిజగతీపతికిన్ శిరసంటె నేర్పునన్.
| 65
|
చ. |
చఱివడి తీవ్రఘర్షణవశంబున నొక్కట తీఁగె చుట్టి నె
త్తఱులయియున్న పాపతరి ద్రాటిమలంకలనిర్ఝరాంబువు
ల్గిఱిగొని మీదనుండి దిగ కిన్నరకంఠి పయోధి ధర్చు న
త్తఱి ఫణిరాజు చుట్టినవిధంబున నున్నది చూడు మిగ్గరిన్.
| 66
|
తిరుగుట రేఫ యగుటకు
చ. |
తిరిగెడుపుట్టలన్ బొదల ద్రిమ్మఱు పాముల రోసిరోసి ని
ష్ఠురభుజదీర్ఘదండమున డొల్లఁగ వ్రేయుచు......
| 67
|
శకటరేఫ యగుటకు
గీ. |
ఉడుకుకన్నీరు దడియంగ నొరలుచును వి
చేష్టయై యూరకుండుచు జెలులుతోడ
దిఱిగి పొగులంగ వేసరి నెఱియమనల
యవులఁ దిరుగుచునున్నది యక్కటకట.
| 68
|
క. |
తిఱిగినకపులం గనుగొని
వెఱవకుడని విల్లుపూని విభుఁ డది యనికిన్
దఱియనిగంధర్వాస్త్రం
బఱిముఱి నరి బోసి యేసె నసురులమీదన్.
| 69
|
మ. |
ఉఱుకుంగుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు బాదంబులన్
దిఱుగుంగండము లెన్నుదన్ను నెగయున్ హేలాగతిం వాలముం
జఱుచు న్నుగ్గుగఁ దాఁకు ముంచు మునుగు న్శల్యంబులు న్దంతము
ల్విఱుగ న్వేయుచుఁ బొంచిపొంచి కదియు న్వేదండయూధోత్తమున్.
| 70
|
వాతెర రేఫ యగుటకు
క. |
గురువిందజైత్రుదొడ్డిన
కరములు కన్మావి యవుడు కరచిననును వా
తెరమీఁదఁ గాననగు పలు
వరుప యనన్ ననలు పల్లవముపై మొనసెన్.
| 71
|
ఱకార మగుటకు
.
చ. |
నెఱిగుఱులు న్విలోలసితనేత్రయుగంబును నొప్పులొప్పు వా
తెఱయును దీనియాననము తెల్పుఁ గరంబు మనోముదంబు నే
నెఱిగినయంత నుండియును నిట్టిలతాలలితాంగిఁ జూచి యే
నెఱుఁగ సురేంద్రకన్యకలు నిట్టిద రూపవిలాససంపదన్.
| 72
|
సీ. |
చెఱుకుబా లొదవువాతెఱ యీనిచో గంతు
చెఱుకుపా లౌదునో చిగురుబోఁడి....
| 73
|
తొరగుట రేఫ యగుటకు
సీ. |
పొర లెత్తి ఘనసారతరువులఁ దనుదానె
తొరగెడు పచ్చకప్పురపువిడెము.....
| 74
|
క. |
పరిజనములు గన్నీరులు
దొరుఁగఁగ నడలొందువారితోడం జను న
ప్పరసున...
| 75
|
చ. |
చరణహతిన్ లతాతరులు చాల్పడి జర్ఝరితంబులై మహిం
దొరుఁగఁగ నిట్టు లొండొరులతోఁడ మదోద్ధతి షష్టహాయన
ద్విరదములట్ల.......
| 76
|
సీ. |
పరమాత్మపదములఁ దొరగిపారెడు నేటి
తరగలపైఁ లీల దాటిదాటి.......
| 77
|
ఱకార మగుటకు
చ. |
మఱియొక టేను చెప్పెద నమానుషవిక్రమలీల నల్గడన్
జఱపియుఁ జంపియు న్రిపునృపాలకసైన్యమురూ పడంచి మెన్
దొఱగుట యొప్పదే తనువు తూటులుగా గడుబేరు వాఁడి......
| 78
|
గీ. |
తొఱగు వోకుండ మెకములు కఱువకుండ...
| 79
|
గీ. |
పొగడమ్రాకులమొదలను పుష్పరసము
తొఱగి నెత్తావి యందున నెఱియనొప్పె......
| 80
|
8 లక్షణము
గీ. |
అంద ఱిందఱు కొందఱు ముందఱ యన
బెద్దఱిక మిద్దఱద్దిఱ గద్దిఱ యన
పదఱు టెదుఱుట యనఁదగు పల్కులెల్ల
శకటరేఫంబు లుడురాజశకలమౌళి.
| 81
|
వ. |
ఇందులో నెదుఱుట ఱకార మగుట కుదాహరణము చింత్యము.
|
|
రేఫ యగుటకు
క. |
ఒకమరి కిరీటికట్టెది
రికి గ్రమ్మన బోయిరేని రెండవమా రి
య్యకొనుట కోర్వక...
| 82
|
క. |
మగటిమి వారికి వీఁ డెదు
రుగ నమ్మి సుయోధనుఁడు విరోధము గొని.......
| 83
|
9 లక్షణము
సీ. |
నఱుజు కొంచెము చెట్టు నఱుకుట నిఱుబేద
నుఱుముసేయుట వడ్లు నుఱుపుటయును
నెఱకులాయంబులు నెఱులు వెంటృకలగు
నెఱసుట నిండుట నెఱియమిగుల
నెఱిబాగునీటులు నెఱపుట నెఱపును
నెఱలేనిమిత్రుఁడు నెఱిక కాసె
నెఱదొడ్డు గొప్పలై నెగడును నెఱబంటు
నెఱజాణ నెఱజక్కి నెఱకటారి
|
|
గీ. |
యనఁగ దగి ప్రౌఢసుకవుల యనుమతమున
బరగు నివియెల్ల శకటరేఫమ్ము లగుచు
రజతధరణీధరవిహార భుజగహార
పురనిశాచరమదహార దురితదూర.
| 84
|
వ. |
ఇందులో నెరసుటను నెరపుటను రేఫఱకారముల రెంటం గలిగియుండు.
|
|
నెరసుట లఘురేఫ యగుటకు
క. |
తరళనయనాబ్జదళములు
నెరయఁగ మైమున్ను చల్లి నృపసుతుఁ బూజిం
చిరి.......
| 85
|
క. |
నెరసె నెరసంజ చక్రక
సరసీరుహవిరహఖేదసంసూచకమై.......
| 86
|
మ. |
అరవిందోదరమూర్తి భానుఁ డపు డూష్మాంతంబునన్ సంకుచ
త్సరసీజేక్షణుఁడై పయోనిధి చొరన్ సంధ్యాతటిత్పూర్వమైం
|
|
|
నెరసెన్ జీకటి కార్మొగుల్ జగతిపై నిమ్నోన్నతాభోగముల్......
| 87
|
శకటరేఫ యగుటకు
ద్విపద. |
అఱిముఱి బుచ్చి హేమ్నాగ్నిలో వైచి
నెఱసి యార్చిరి దైత్యనికరంబు బెదఱ......
| 88
|
నెరపుట రేఫ యగుటకు
సీ. |
పరిమిళస్పర్శంబు నెరపె సింధురవల్లి
గృచ్చిఁదావులు సోఁకఁ గ్రోవిరెమ్మ........
| 89
|
క. |
వరమకుటరత్నకిరణ
స్ఫురణ ప్రతిఘట్టనమున భుగ్నాగ్రములై
మరలు తనుద్యుతు లనుమతి
నెరపె సుపర్వులకు విభుని నిటలాలకముల్.
| 90
|
శకటరేఫ యగుటకు
చ. |
ఎఱుగవుగాక యొక్కపు డొకించుక మార్మొగ మిడ్డకూర్మికిన్
గొఱఁతయ యెంత జెప్పినను కోమలి నేరవ యల్క దెచ్చుకో
నెఱియన దీన వౌ టెరిగి నేడిది కైకయి కోక మిక్కిలిన్
నెఱపె నతండు నీవు విన నేర్చెదె మాపలు కిప్పుడేనియున్.
| 91
|
గీ. |
మెఱపువిల్లు విలాసంబు నెఱపునిల్లు....
| 92
|
గీ. |
వత్సరంబున గడచను వ్రతము నాకు
దాని నీపాల జిలిపియుత్సాహవృత్తి
|
|
|
మెఱయ నీకుఁ గృతజ్ఞత నెఱపి తొల్లి
యెగ్గు చేసినవారి జయింపఁబోదు.
| 93
|
గీ. |
ఆయుధంబులు విడిచితి నంతమీఁద
మెఱసి బలవిక్రమంబులు నెఱుపువాఁడ......
| 94
|
10 లక్షణము
సీ. |
ప్రవహించుటయు వేఁగఁ బరువిడుటయును సే
యుటయును నగుఁబఱచుట యనంగ
పఱపఱఁ జించుట పఱుసదనము పఱ
పఱియులు పఱికెలు పఱిగొనుటయు
పఱతెంచు టమ్ములు పఱపుట శత్రులఁ
బఱపు టంపఱయు వెంపఱయు పఱుపు
పఱిమార్చుటయును తెప్పఱ పఱితోవుట
పఱువైనపువ్వు చూపఱపిఱుంద
|
|
గీ. |
పిఱిచనుట పిఱివోవుటఁ బిఱికితనము
పిఱుఁదు తెప్పిఱి పుఱియమే బెఱుగుటయును
పెఱయు పెఱసనిపోవుట పెఱుకుటయును
పెఱికెలును బండిఱాలు భూభృన్నివేశ.
| 95
|
వ. |
ఇందులో పరుసదన మనుటయు, పరతెంచుటయు, పరిమార్చుటయు, పరువగుటయు, చూపర యనుటయు, పెరగుటయు రేఫఱకారముల రెంటం గలవని ప్రాచీనలక్షణకారుడు చెప్పినాడు. అందు.
|
|
పరుసదనము రేఫ యగుటకు
సీ. |
కల్యాణగోత్రంబు గరిమవంచినదూరు
సరసుల నింకించు పరసుదనము...
| 96
|
క. |
తురగముఁ దురగము గలిగరి
నరుఁడు నరునిఁ దేరుఁ దేరు నలిఁదాకిన న
ప్పరుసదన మేమి చెప్పుదుఁ
బొరి మిడుగురు లెగసెఁ గైదువులపొడి రాలెన్.
| 97
|
ఱకార మగుటకు
ఆ. |
ఎల్లవారు నెరుఁగ నొల్లనిధర్మువు
లేల నీకు నెరుగ నేలవలసె
జిఱుతవాని కింతపఱుసదనమ్ములు
సన్నె వృద్ధజనము లున్నచోట.
| 98
|
పరతెంచుట రేఫ యగుటకు
క. |
ఒరసుకొనిపోవ నత్తఱి
సురసైన్యం బార్చుటయును జూచితి తిరముం
గర మచ్చెరువుగఁ గ్రక్కనఁ
బరతెంచుడు నసురకొడుకు బరతెంచి వడిన్.
| 99
|
ఱకార మగుటకు
క. |
వెఱచఱవ నీరిలో న
క్కెఱగా నొకముసలి చూడ్కికి నగోచరమై
|
|
|
పఱతెంచి కుంభసంభవ
చిఱుదొడి వడిఁ బట్టుకొనియె శిష్యులు బెదరన్.
| 100
|
క. |
నెఱియఁగ నసహ్యమగు న
మ్మొఱ వీనులఁబడిన మిన్నుముట్టు నెలుఁగుతోఁ
బెఱవకు వెఱవకు మిది నే
బఱతెంచితి సత్వరమున భామిని యనుచున్.
| 101
|
సీ. |
చఱచి నిబ్బరముగా బఱతెంచు ఖగరాజు
ఱెక్కగాడ్పులు మింట రింగు రనఁగ...
| 102
|
ద్విపద. |
ఉఱక నీరుగఁ జేసి యుగ్రవేగమునఁ
బఱతెంచుగతిఁ జూచి భానువంశజుఁడు
| 103
|
వ. |
పరిమార్చుట ఱకార మగుట కుదాహరణ చింత్యము.
|
|
రేఫ యగుటకు
సీ. |
పరిమార్పఁజాల రెవ్వరు పెక్కుభంగుల
మాటలాడక మరుమాటకేల...
| 104
|
క. |
గురుభీష్మకర్ణసైంధవ
గురుతనయులతోడఁ గూడ గురుపతిబలమున్
బరిమాడ్చునట్టిసత్త్వము
పురుహూతా యిమ్ము కరుణ పొంపిరివోవన్.
| 105
|
క. |
పరిభవకరుఁడగుకీచకు
బరిమార్చుట యిపుడు గడువబడియెనెయిమ్మై
దురిటిల్ల నేల వ్రేల్మిడి
బొరిగొని నీమనము కలఁకబుత్తు లతాంగీ.
| 106
|
వ. |
పరువనుట ఱకారమనుటకు చింత్యము.
|
|
రేఫకు
క. |
తరుణీ యీతరుశాఖాం
తరలోలదుకూలమారుతము లింద్రాణీ
పరివారవారసతులకు
బరువపువిరిగోఁత బొడము బడలిక కడఁచున్.
| 107
|
సీ. |
పరువంబు దప్పిన వీరులు దాల్చుచుఁ దరు
చయము చుక్కలరేనిచంద మఱయ.
| 108
|
సీ. |
పరువంపుమంకెనవిరివంపు నరవంపు
వాతెర చింద్రెంపువాన గురియ...
| 109
|
చూపర రేఫ యగుటకు
మ. |
గురుబంధుల్ దను జుట్టిరా దిగిచి యాక్రోశింప నిశ్చేష్టుఁడై
యొరులం దన్ను నేరుంగలేక యసుహృద్యూఢార్తి మున్జెంది చూ
పరత న్మ్రోయుచు బో వివర్ణత మెయిం బాటిల్ల.......
| 110
|
ఱకార మగుటకు
క. |
కొఱవియు కొఱవియు దాఁకిన
తెఱఁగున నర్జునుఁడు సురనదీసూనుఁడు చూ
పఱ వొగడన్ దాకుట ని
ద్దఱిదిక్కులసైన్యములునుఁ దలపడియె వడిన్.
| 111
|
క. |
మెఱయు వెలిమావులుం గడు
మెఱుగారెడు నరదములును మింటను మంటల్
వఱపెడు వాలమ్ములు చూ
పఱ నత్తొలుతాకు వెరఁగుపడఁజేసె నృపా.
| 112
|
వ. |
పెరుగుట శకటరేఫ యగుటకు చింత్యము.
|
|
రేఫ యగుటకు
సీ. |
ధృతరాష్ట్రునొద్ద దత్సుతులతో నొక్కటఁ
బెరుగుచు భూసురవరులవలన...
| 113
|
చ. |
పెరిఁగినయీసున న్నెమలిపింఛములన్ బురివిప్పఁబోలు నీ
సరసిరుహాక్షి వేనలికి సాటిగ నిల్వఁగనోడి....
| 114
|
11 లక్షణము
క. |
బఱబఱ నీడ్చుటయును ద
బ్బఱ బిఱబిఱఁ ద్రిప్పుటయు వివాహములతఱిన్
బిఱుసులుఁ గాల్చుట కోటకు!
బుఱుజులు వెట్టుటయు ఱాలు బురదైత్యహరా.
| 115
|
సీ. |
మఱచుట మఱునాడు మఱదలు మఱఁది యే
మఱుపాటు పలుమఱు మఱియు మఱుఁగు
మఱవ మృద్భాండంబు మఱుగుట వేమఱు
మఱుపడి మఱలేక మఱుఁగు లేక
మఱగాలు మఱల త్రిమ్మఱుటయు పడమఱ
మిఱిచూపులును మిఱిమిట్లుఁగొనుట
ముఱిముఱిచీఁకటి ముఱిముఱి బడిబడి
ముఱిమొండె మఱిముఱి మొఱము విడుట
|
|
గీ. |
మెఱపు మెఱయుట మెఱుఁగు కన్మొఱఁగుటయును
మొఱకతనమును వేపులు మొఱఁగుటయును
మొఱయ మొఱమొఱలాడుట మొఱక వెలితి
మొఱసుటయు బండిఱాలు సముద్రతూణ.
| 116
|
వ. |
ఇందులో పలువురు వేమరు ననుశబ్దములు రెంటం గలిగియుండును. అందు.
|
|
పలుమరు రేఫ యగుటకు
చ. |
ఇరువురు సిగ్గు లగ్గలపుటేవఁ గచాగచిఁ బైకొనన్ ముఖాం
బురుహయుగంబు వాంచి తలపుల్ మది నువ్విళులూరఁ జూపు లొం
డొరులపదంబులన్ దొరయ నొండునెపంబున మోము లెత్తి ప
ల్మరు మరువెట్టి చూపునెడనున్ గుడి నేయఁదొడంగెఁ గంతుఁడున్.
| 117
|
ఱకార మగుటకు
క. |
విఱుఁగుట నొచ్చుట మనదెసఁ
దఱుచుగ నాడెదవు పాండుతనయులబల మే
డ్తెఱఁ దఱుగక పెనఁగుట బ
ల్మఱుఁ జెప్పెదవగుట యేమి మాయయొ తలపన్.
| 118
|
మ. |
మఱియు న్వచ్చిరి ధాత్రిగల్గు నగసామ్రాజ్యైకధౌర్యేయులన్
దఱుదద్భూరిభరాప్తి గృంగ నపనిన్ దా మృత్ఫణారాజి బ
ల్మఱు సంధింపుచునుండె గాని వసుకల్యాణంబు వీక్షింపగా
వెఱచెన్ శేషుఁడు శేషవృత్తి కగునే విస్రంభసంభారముల్.
| 119
|
వేమరు ననుట రేఫ యగుటకు
క. |
మరుఁడల నెలకడ డాచిన
విరితూఁపును నల్లచెఱకువిండ్లునుబలె వే
మరు నలరు చేరుచుక్కయు
నరుదగు కనుబొమలు మిగుల నతివకు నమరెన్.
| 120
|
ఱకార మగుటకు
పంచచామరము. |
మెఱుంగుబోడి కిట్లు చెల్వమీఁద జేసినన్
గుఱంగటన్నిలంగ రానికూర్మి వెచ్చవెచ్చఁగాఁ
దుఱంగలించు వేడ్కతోడ దూరి పల్కి రంత వే
మఱున్ మరున్ మరున్మృగాంకమత్తకోకిలాదులన్.
|
|
."
వ. |
మరలుట రేఫఱకారముల రెంటం జెప్పినాఁడు.
|
|
రేఫకు
క. |
పరిజనములు కన్నీరులు
దొరుగగ నడలొంది వారితోడన్ జను ని
ప్పరుసునఁ దనదుతనూజుల
మరలమికిన్ బాండురాజమహిషి మరుగుచున్.
| 122
|
క. |
గిరితటము దాకి తిరిగెడు
తరంగిణియుబోలె దేవతాపతియాజ్ఞన్
మరలి వియచ్చరవాహిని
మురహరునింబొదలి ఘోరముగఁ బోరుతరిన్.
| 123
|
క. |
అరిగి సమత్ప్రసవకుశాం
కురపక్వఫలోత్కరంబుఁ గొని గృహమునకున్
మరలి యట వచ్చునప్పుడు
ధరణీసురనందనుండు దనగట్టెదురన్.
| 124
|
ఱకార మగుటకు
చ. |
నెఱియఁగ నీప్రసాదమున నిర్జరలోకలలామ నాకు నే
గొఱతయు లేదు కోరగల కోరిక యెద్దియు గాన నైన నా
కొఱకు రణంబులోన కపికుంజరు లీల్గినవారు వారలన్
మఱలగ వేగనిచ్చుటయె మన్నన దీననె సంతసిల్లుదున్.
| 125
|
12 లక్షణము
సీ. |
ఱట్టువొందుటయును ఱంపిల్లుటయు ఱంకు
ఱవఱవల్ కోపము ఱవళి ఱవికె
ఱంతులు వజ్రపుఱవలును ఱంపము
ఱికిరించుటయు ఱిచ్చ ఱిక్కలిడుట
ఱివ్వున నెగయుట ఱింగున మ్రోయుట
శిలలఱుప్పుటయును చిలుకఱెక్క
ఱెల్లుగడ్డియు కనుఱెప్పలు మూయుట
పూఱెమ్మలును ఱొమ్ము పొలుపుమీఱ
|
|
గీ. |
శకటరేఫమ్ములై మహాసుకవివరుల
కావ్యములయందుఁ దఱుచుగ గ్రాలుచుండుఁ
జక్రధరబాణ భువనరక్షాధురీణ
దురితనిర్నాశ పీఠికాపురనివాస.
| 125
|
వ. |
ఇందులో రవళి ఱకార మగుట కుదాహరణ చింత్యము.
|
|
రేఫ యగుటకు
సీ. |
ఎల్లప్పుడును బిక్కటిల్లుబేరులమ్రోఁత
రహిమించుతరగలరవళి గాఁగ....
| 126
|
మ. |
నవలావణ్యపయోధిఁ జిత్తమను మంధానాద్రికిం జంద్రికా
పవనాశిం దరిత్రాడుఁగాఁ బెనచి యబ్జాతాసనుం దీర్చినన్
రవళిం గోకిల కీరము ల్దరువ నారత్నాకరంబందు ను
ద్భవముంబొందిన లక్ష్మి గానలయు నప్పద్మాక్షి నీక్షింపఁగన్.
| 127
|
పిల్లలమఱ్ఱివీరన్న శకుంతలాపరిణయము
ఱవికె ఱకార మగుటకు
చ. |
ఱవికెయుఁ బట్టుపుట్టము చెఱంగుమరుంగయి యున్కిజేసి గౌ
రవపరిమాణమున్ దెలియరామికి...
| 128
|
వ. |
రంతనుట రేఫఱకారముల రెంటం గలిగియుండును.
|
|
రేఫ యగుటకు
ఉ. |
అంగడివీథిఁ బల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచు
న్జంగమువారిపిన్నది పిసాళితనంబునఁ జూచెఁబో నిశా
తాంగజబాణకైరవసితాంబుజమత్తచకోరబాలసా
రంగతటిన్నికాయముల రంతులు చేసెడి వాడిచూపులన్.
| 129
|
శా. |
రంతు ల్సేయకు కుక్కుటాధమ దరిద్రక్షుద్రశూద్రాంగణ
ప్రాంతోలూఖలమూలతండులకణగ్రాసంబుచేఁ గ్రొవ్వి దు
ర్దాంతస్వానిలభిన్నహృత్ఫణిఫణాంతర్మాంసమాధుర్య మే
చెంతంగ్రోలు ఖగేంద్రుచెంగటను నీజంఝాటము ల్సాగునే.
| 130
|
ఱకార మగుటకు
రగడ. |
ఱం తేమిటికి గొరుంతే మల్లెల
వంతుల కాసే వంతుల చెల్లెల
| 131
|
సీ. |
ఱంతుతో మేఱమీఱ దొకప్పుడును ఘన
శ్రీలఁ బొంగియును నీసింధుకన్య.......
| 132
|
ఉ. |
ఱంతులు మీరి మిక్కిలిగఱాగ్రతనంబున దొమ్మిచేసి దు
ర్దాంతపరాక్రమోన్నతులు దానవదైత్యులు.......
| 133
|
వ. |
ఱికిరించుటను, ఱింగు రగుటను, ఱెక్క యనుటను, ఱిచ్చ యనుటను.
|
|
ఱకారము లగుటకు
సీ. |
ఱికిరించుకొనియున్న ఱెక్కమొత్తముతోడ
నొడలు జాడించి నెవ్వడి విదుర్చు......
| 134
|
సీ. |
చరచి నిబ్బరముగా బఱతెంచు ఖగరాజు
ఱెక్కగాడ్పులు మింట ఱింగురనఁగ...
|
|
ఉ. |
ఱెక్కలతో సరాగము నెఱింబరికింపడు వేడ్కఁజెందియో
యక్కనకాచలంబు విబుధాధ్వమునం జనుదెంచుచున్న.......
| 136
|
."
ఉ. |
ఱింగను మ్రోతఁ మ్రోయుచును ఱెక్కల పాములవోలె శౌరిచే
సింగిణివింటివెల్లిగొను చిత్రశరంబులు.....
| 137
|
ఉ. |
ఒక్కడు మాకులంబున సముద్ధతి చూపిన జాతరోషుఁడై
ఱెక్కలుఁ ద్రుంచి వేలుపులఱేఁ డటు పాపముఁ జేసెఁ గాని యా
ఱెక్కలు నేడుఁగల్గిన నెఱి న్గగనంబునఁ బారుతెంచి బి
ట్టెక్కనె జూటకోటితటు లెల్లను నుగ్గులుఁగాఁగ మేరువున్.
| 138
|
ఱిచ్చ యనుటకు
క. |
కని యుత్తరుండు గరుపా
ఱిన మేనును దలఁకు మనము ఱిచ్చవడిన చూ
పునునై తొట్రువడుచు ని
ట్లనియె దిగులుచొచ్చి యాబ్రుహన్నలతోడన్.
| 139
|
క. |
చిచ్చునకుఁ డోడు కరువలి
వచ్చినక్రియ భీముకడకు వాసవి యిమ్మై
వచ్చిన మనయోధావలి
ఱిచ్చవడియె వారిమొన దఱిమికొనవచ్చెన్.
| 140
|
ఱెప్ప యనుట ఱకార మగుటకు
ఉ. |
అప్పుడు ముద్దరాలిఁ జెలు లక్కునఁ జేర్చి ముఖాబ్జ మెత్తి కన్
|
|
|
ఱెప్పల బాష్పము ల్దుడిచి ఱేఁపె నృపాలుఁడు గారవింప......
| 141
|
ఉ. |
ముప్పిరిఁగొన్న వాసవులమోహ మొకింతయుఁ గప్ప నీదు కన్
ఱెప్పలుఁ గప్ప నీదొకతఱిన్ జమరారఁగ నీదుమేన.....
| 142
|
ఉ. |
ఱెప్పలు వ్రాల్ప కప్పుడమిఱేని మనోహరమూర్తిఁ గన్నులన్
దప్పక చూచిచూచి విబుధప్రమదల్ ప్రముదంబు లాత్మలన్.....
| 143
|
ఉ. |
ఎప్పుడు నెయ్యెడన్ బొదవి యిందకుంఱదగ నీవు కంటికిన్
ఱెప్పయపోలె మాటయు నెఱిన్ బనులారసి యొజ్జచాడ్పునన్
జెప్పుచు....
| 144
|
వ. |
ఱొమ్ము గురురేఫ యగుట చింత్యము.
|
|
రేఫ యగుటకు
ద్విపద. |
నీరొమ్ముఁగొనికాఁడ నేర్తునా చూడ
నీరాజ్యగతిఁ జూడ నేరుతుఁగాక....
| 145
|
వ. |
తక్కిన విట్లే గ్రహించునది.
|
|
13 లక్షణము
గీ. |
వఱత వఱదయు వఱలుట వఱడు వఱుగు
విఱుగు విఱివోటు విఱిగాలి విఱివిడియును
వెఱపు నివ్వెఱ వెఱబొమ్మ వెఱచఱుచుట
వెఱఁగు గురురేఫ లుష్ణాంశువిధురథాంగ.
| 146
|
క. |
సుఱసుఱ స్క్రుక్కుటయునుఁ బెం
పఱి యసుఱుసురనుట యారయఁగ గురురేఫల్
మఱి నిడుపుల గురురేఫము
లెఱిఁగించెద చిత్తగింపు మిందువతంసా.
| 147
|
ఉ. |
ఆఱనితేజ మాఱడియు నాఱికెపంటయు నాఱు షట్కమూ
టాఱినముత్తియంబు తడియాఱెను పాపము లాఱె జిల్గు నూ
గాఱు వెలంది కొప్పె ననునట్టిపదంబులయందు పెద్దఱా
ల్మీఱుచునుండుఁ గబ్బముల మేరుమహీధర రాజకార్ముకా.
| 148
|
వ. |
ఇందులో ఆఱుట యనఁగ నిండుటకును అడంగుటకును అర్థ
మగును. నిం డెనను యర్థముఁ జెప్పునపుడు లఘురేఫయును, అడంగెనను యర్థముఁ జెప్పునపుడు గురురేఫయు నగును.
|
|
నిండెనను యర్ధమునందు లఘురేఫ యగుటకు
క. |
కౌరవులు సేయు నపకృతి
కారణమునఁ గోప మొత్తు కర్ణుని వదనాం
భోరుహముఁ గనుఁగొనఁగ శమ
మారు న్నావశముఁ గాక యంతనబుద్ధిన్.
| 149
|
వ. |
శమ మారు ననఁగా శాంతము నిండు ననుట.
|
|
అడంగునను నర్ధమునకు గురురేఫ యగుటకు
క. |
కారడవిఁ బరచు మృగముల
నూఱటకున్ డిగిచి డస్సియు న్నతనిశ్రమం
బాఱగ నెదఁ బరితాపము
దీఱఁగఁ బైవీఁచె నన్నదీపవనంబుల్.
| 150
|
; "
వ. |
శ్రమ మాఱఁగ ననఁగా నలయిక యడంగగా ననుట.
|
|
ఆరడి ఱకార మగుటకు
ఉ. |
ఆఱడియార నీరసధనాధిప లోకము నిండ్లు వాకిళుల్
దూఱుటమాని శ్రీనగము తూరుపు వాలి విదూఱిపాపముల్
నీఱుగఁ జేసె గంధవతినీళ్ళను గ్రుంకి మనంబులోని చి
చ్చాఱఁగఁ జేయుటొప్పు త్రిపురాంతక దీవునికై నమస్కృతుల్.
| 151
|
ఉ. |
ఆఱడి బోకయున్ ఫలము లందుటయుం గని పల్కనేరమిం
మాఱట నోరిదాననని మాటలు చిత్తమునం దలంప కే
కాఱులు వల్కెదన్ వినుఁడు కర్జము నెగ్గునుఁ గాన నల్కమై
వీఱడియైనమానిసికి వెండివివేకముఁ గల్గనేర్చునే.
| 152
|
ఆరు సంఖ్యాపరమైనప్పుడు గురురేఫ యగుటకు
క. |
ఆఱమ్ము లతనిమేనం
దూఱంగా నేసి నాల్గు తురగాంగములన్
గీఱించినఁ గని ద్రోణుం
డూఱట ధర్మజునిదెసకు నున్ముఖుఁడయ్యెన్.
| 153
|
ఉ. |
ఆఱురసంబులుం జవులయందలి క్రొత్తలువుట్ట నిచ్చలున్
లేఱొకభంగిఁ బాకములు విన్ననువొప్పఁగఁ జేసి చేసినన్
మీఱఁగ బాసి నీ కొకరు నింబురి గాననియట్లుఁ గాగ మే
న్గాఱియఁ బెట్టియైన నొడికంబుగఁ వండుదుఁ గూడుఁగూరలున్.
| 154
|
నూగారు ఱకార మగుటకు
సీ. |
వెడవెడ నూఁగాఱు వింతయై యేర్పడ
దాఱనివళులుతో నాఱు నిగుడ.....
| 155
|
14 లక్షణము
క. |
ఊఱడియనఁ జాలించుట
యూఱుంగాయలను జలము లూఱుటయును బం
డ్లేఱుట యేఱువసీమయు
నేఱును గురురేఫ లయ్యె నిందుకిరీటా.
| 156
|
ఊరట గురురేఫ యగుటకు
సీ. |
కోలుమసంగెడు కోర్కులు వెనువెంట
బాఱుచు నునికి నూఱటయు....
| 157
|
క. |
కాఱడవి బఱచుమృగముల
నూఱటకుం దిగిచి డస్సియున్నతని.....
| 158
|
ఊఱుట ఱకార మగుటకు
ఉ. |
మంచిగ మేనయత్తలు సమాదరణం బడరంగ బెట్టి పు
ల్డించిన మంచికజ్జములు తేనియనేతను దోఁచితోఁచి భ
క్షించుచు దల్లిఁదండ్రిఁ దనచిన్నికరాంగుళి వంచివంచి యూ
ఱించుచు నాడె మిన్నగమిఱేఁడుకుమారకు డింటిముంగటన్.
| 159
|
క. |
ఆఱేఁడువగలచారుల్
నూఱువిధంబుల రసావళుల్ వేయు వహు
ల్లూఱలు బచ్చళ్ళు ర్బిం
డూఱంగాయలకు లెక్కయు న్మరి కలదే.
| 160
|
|
నాటుల్వోసిన విలోకనమ్ములు నాఱు
ల్నూఱాఱువగల బెట్టిన
యూఱుంగాయలు ఘటించి రొండొరు లెడలన్.
| 161
|
ఏఱుట ఱకార మగుటకు
గీ. |
తాను నల్పురు జని తృణధాన్య మల్ప
మేఱికొనివత్తు ఱాకలి దీరకుండు...
| 162
|
క. |
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోసము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ.
| 163
|
."
ఏఱనుట ఱకార మగుటకు
క. |
ఈరముల గుబురుకొనునెడ
దాఱును వారేఁగుతెరవు దప్పి చెమటమై
నేఱులుగఁ గాకిదూఱని!
కాఱడివిం బరచుచో నొకచోటన్...
| 164
|
గీ. |
వినుము సత్త్వాదిగుణము నాననమయాత్మ
తత్త్వమున లీనములు సేయఁ దన్మయత్వ
దర్శనము దాన నది మహోదధి నడంగు
నేఱు లట్లన రూపఱు వేఱు లేక.
| 165
|
15 లక్షణము
గీ. |
కాఱడవి కాఱుపోతులు కాఱుటయును
కాఱియల బెట్టుటయు హొంతకాఱిపాము
కోఱలును పండ్లు గీఱుట గీఱు టనగ
నాడుటయు బండిఱాలు పన్నగవిభూష.
| 166
|
కాఱు అనుట ఱకార మగుటకు
క. |
కాఱడవి బరచుమృగముల
నూఱుటకుం దిగిచి....
| 167
|
సీ. |
మీఱుచు నేట్లాడు కాఱుపోతులకొమ్ము
చప్పుళ్ళ బులుగుల కుప్పఁగూల...
| 168
|
కాఱుటయును కోఱట యనుటయు ఱకార మగుటకు
ఉ. |
కోఱలు గీటుచున్న యనకోణములన్ దహనస్ఫులింగముల్
గాఱుఁగ నూర్పులం జదలు గాలికి నొక్కట తూల బాహువుల్
నూఱును బూఁచి మై వెనిచి నూఱుశిరంబుల నూర్ధ్వదిక్తుటుల్
దూఱగ గాలనేమి రణదోహలియై కడఁగెన్ సముద్ధతిన్.
| 169
|
వ. |
యఱ్ఱాప్రగడ హరివంశమునందు నిట్లే గలదు.
|
|
కాఱియ ఱకార మగుటకు
ఉ. |
పాఱిన జూచి కౌరవనృపాలఁడు సూతతనూజుతోడ నీ
కాఱియ మద్బలంబునకుఁ గాదగునే వివిధాస్త్రసంపదన్
మీఱిన నీవు సూఁడఁ గనమేయపరాక్రమ నీకు పాండవు
ల్మాఱె తలంప నీతగుబలంబును జేవయు జూపు మిత్తఱిన్.
| 170
|
క. |
పాఱిన నాతని వెనుకన
పాఱితి సంప్రార్ధనప్రభాషణములతో
దేఱి మఱలి యమ్ముని మిముఁ
గాఱియబెట్టితిగదే? యకట యనుచు దయన్.
| 171
|
వ. |
కారు లనుటను కూర లనుటను బ్రాచీనలక్షణకారుడు రేఫలు
గానే జెప్పెంగాని ఱకారకారములలో జెప్పినాడు కాడు. మహాకవులు ఱకారములుగా బ్రయోగించినారు. ఉదాహరణము.
| 172
|
కాఱు లనుటకు
ఉ. |
ఆఱడి బోకయున్ ఫలము లందుటయున్ గని పల్కనేరమి
న్మాఱటనోఱిదాననయి మాటలు చిత్తమునం దలంప కే
కాఱులు పల్కెదన్ వినుము కర్జము నెగ్గును.....
| 173
|
కూఱ యనుటకు
క. |
ఆఱేడువగలచారు
ల్నూఱువిధంబుల రసావళుల్ వేయువహుల్
కూఱలు బచ్చళ్ళూ ర్బిం
డూఱంగాయలకు లెఖ్కయు న్మఱి గలదే.
| 174
|
కాకమానసరాయని బహులాశ్వచరిత్రము
గీఱుట ఱకార మగుటకు
ఉ. |
వేఱొకచాప మెత్తి పృథివీవరధర్మతనూజు డింతతో
దేఱగజేయుదున్ బగయతి ప్రకటంబుగ నంచు సూతు మై
దూఱ తురంగమాంగములు దూటులు వోవఁగ శల్యు నంగముల్
గీఱశిడంబు గాడబరగించె సముజ్జ్వలచండకాండముల్.
| 175
|
16 లక్షణము
ఆ. |
చాఱుఁ ద్రావుటయును చాఱలబెబ్బులి
చాఱపప్పు సఖులఁ జీఱుటయును
చూఱఁగొనుట యుట్టిచేఱు చేఱెడు చొఱ
మీలు బండిఱాలు శూలపాణి
| 175
|
చాఱు ద్రావుట ఱకారమగుటకు
ఉ. |
జోఱున వర్షముల్ గుఱియ సువ్రతుఁ డాచిఱుతొండనంబి దై
వాఱెడు భక్తి పెట్టు శివభక్తుల కర్ధిఁ జతుర్విధాన్నముల్
తాఱనియెల్పుపప్పును ఘృతంబును తియ్యనిపానకంబులున్
జాఱులు పిండివంటలును శర్కరయున్ దధియున్ యథేచ్ఛగన్.
| 176
|
చీఱుట పిల్చుట యగునప్పుడు ఱకార మగుటకు
ఉ. |
పాఱడు లేచి దిక్కులకు బాహుల నొడ్డడు బంధురాజిలో
దూఱడు ఘోరకృత్య మని దూఱడు తండ్రిని మిత్రవర్గమున్
జీఱడు మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిన్
దాఱడు కావరే యనుడు తాపము నొందడు కంటగింపడున్.
| 177
|
చీఱుట చించుట యగునప్పుడు రేఫ యగుటకు
ఉ. |
సారథిఁ గూల్చి యశ్వములఁ జంపి రథంబు వగిల్చి కేతువున్
జీరి శరాసనంబు వొడి నేసిన......
| 178
|
వ. |
చూఱ యనుట రేఫఱకారముల రెంటం గలిగియుండును. అందుకు.
|
|
రేఫ యగుటకు
ద్విపద. |
ఏసి బంగారంపుటిళ్ళలోఁ జొచ్చి
రాసు లర్ధములు చూరలుఁ జల్లువారు.
| 179
|
సీ. |
వందిమాగధుల కైవారంబుఁ శుభతూర్య
వారరవంబులఁ జూరఁగొనఁగ.....
| 180
|
శకటరేఫ యగుటకు
క. |
నూఱుదెరంగుల నెరసులు
మీఱఁగ నీవిభ్రమములు మెరయించి మునిం!
గాఱగఁజేయుము మేనక
చూఱకొనదె యతనిఁదెలివి సొమ్ములు మున్నున్
| 181
|
క. |
వేఱుగఁ గనినం బ్రకృతిం
జూఱవిడచినట్ల తనదు సుజ్ఞానమున
క్కాఱువిడచి తనకంటెను
మీఱ నొకటిలేమి కాన్పు మేకొనవలయున్.
| 182
|
ఉ. |
మీఱినభద్రనాగములమీఁదికి దాటి తదీయకుంభము
ల్చూఱలు పట్టుకేసరికిశోరనఖావళినుండి రాలి యా
ఱాఱనిమౌక్తికంబులు ప్రియంబున నేఱి కిరాతబాలిక
ల్గీఱినగింజ లాడుదురు కేలిదలిర్పఁగ బక్కణంబులన్.
| 183
|
వ. |
చేరనుట శకటరేఫ యగుటకుఁ జింత్యము.
|
|
రేఫ యగుటకు
ఉ. |
క్రిందను మీఁదనుం బడియుఁ గించిదసూయఁ బెనంగులాడు న
ర్ధేందుఁడు నుల్లసత్ఫలసమృద్ధతమిస్రమువోలెఁ జాలఁ జె
న్నొందెడు ఫాలము న్గబరియు న్పరిపాపిటముత్తియంపుచే
రుం దిలకంబుఁ గస్తురియు రూఢిగ బాహులలీల నొప్పఁగన్.
| 184
|
వ. |
చేరె డనుట శకటరేఫ యగుటకు చింత్యము.
|
|
17 లక్షణము
క. |
జాఱుట యనఁగ బజాఱు హ
జాఱము మొగసాల మఱి తుజాఱులు ధనికుల్
జోఱున వానలుఁ గురియుట
మీఱును గురురేఫ లగుచు మిహికాంశుధరా.
| 185
|
జాఱు శకటరేఫ యగుటకు
ఉ. |
జాఱుటయు దదూరుయుగసాంద్రరుచుల్కటిమీఁదనుండి దై
వాఱినఁ గాంచి పంచశరపంచశరీపరికంపితాత్ముఁడై
పాఱుడు దా బహుశ్రుతము బల్మియు భావవిశుద్ధకల్మియు
న్మీఱిన నెమ్మనంబుఁ గడిమిం నిలు పోపఁగలేక లోలతన్.
| 186
|
18 లక్షణము
గీ. |
తాఱుటయు తీఱుటయు తీఱు తీఱిమయును |
తూఱుటయు తేఱుటయుఁ గడి దేఱుటయును
తేఱి చూచుట ధర్మంబు దేఱుటయును
తేఱుదు రనంగ బండిఱాల్ త్రిపురవైరి.
| 187
|
తాఱుట గురురేఫ యగుటకు
శా. |
తాఱం గాగిననేల తంపఱతఁ బాతాళంబుఁదాకం జనం
దూఱం జెల్మిఱి మిన్నుఁదాఁకి తరగల్ దోరంబులై నల్గడల్
బాఱం బెల్లుగ నేఱు లుబ్బఱముగా బైపైన నీఱెక్కి దై
వాఱన్ జెర్వులు చెన్ను మీఱె నఖిలప్రాణుల్ ముదం బంచగన్.
| 188
|
తీఱుట ఱకార మగుటకు
క. |
తీఱడితనంబు వెట్టుచు
దూఱంబని లేదు నిన్నుఁ దొల్లిటి చెయ్వుల్
దీఱనది యనుభవింపక
వేఱుండునె పూర్వజన్మవివిధకృతంబుల్.
| 189
|
వ. |
తీరనుట రేఫఱకారముల రెంట నుండును. అందు.
|
|
రేఫ యగుటకు
క. |
ఈ రాజున కివముగ నొక
తీరున గావించి సేదఁ దీర్పమిఁదగునా...
| 190
|
ఱకాఱ మగుటకు
ఆ. |
సందియంబు వడ విచారంబునకుఁ జొర
మాఱువల్క నొండుతీఱు సేయ
వెఱఁగుఁ గాఁగఁ బిడుఁగు వ్రేసినయట్లైన
మాటకియ్యకొనుచు జోటిబలుకు.
| 191
|
తీఱుటకు
ఉ. |
మీఱినకోఱలున్ మిగుల మింటికి బర్వినపల్వవెంట్రుకల్
తీఱిన మిట్టగ్రుడ్డు నతితిగ్మతరంబగునట్టి సాహసం
బాఱనితేజమున్ దిశల నంటినచేతులు లోకరాజిలో
నేఱిన మేటిరూపరుల నెంతయు నేర్చిరి రాక్షసు ల్వడిన్.
| 192
|
తేఱుటకు
క. |
తేఱుదురు రిఫులు నక్కఱ
వాఱుదురును నిపుడు మూర్ఛ మెయి నిట్టున్నా
ఱాఱనితేజంబులతో
నీఱుపయిం గవిసియున్న నిప్పులువోలెన్.
| 193
|
తేఱిచూచుటకు
క. |
మీఱినభయమున రాముని
దేఱి కనుంగొనఁగ నోడి-ధృతిమాలి కడు
న్వెఱవరి తేఱిపైఁ బడి
బాఱి యతఁడు లంక సొచ్చెఁ బౌరులు బెదరన్.
| 194
|
వ. |
రకారలమీఁద దూఱుట ఱకార మగును. అందుకు ఉదాహరణములు మునుపే బహుళముగాఁ జెప్పినాము.
|
|
19 లక్షణము
గీ.- |
నాఱు విడుచు టుల్లినాఱు సొన్నాఱియు
నీఱునిప్పులందు నెఱయుబూది
నూఱుసంఖ్య పసపు నూఱుటయును బెద్ద
ఱాలు జాతరూప శైలచాప.
| 195
|
నాఱు వోయుట ఱకార మగుటకు
క. |
కాఱు మెఱగ తను నారుల్
నాఱుల్ వోసిన విలోకనమ్ములు నారుల్
నూఱాఱువగలఁ బెట్టిన
యూఱుంగాయలు ఘటించి రొండురు లెడలన్.
| 196
|
నీఱనుటకు
క. |
తేఱందురు రిపులు నక్కఱ
మీఱుదురును నిపుడు మూర్ఛమెయి నిట్లున్నా
రాఱనితేజంబులతో,
నీఱుపయిం గవిసియున్న నిప్పులువోలెన్.
| 197
|
నూఱు సంఖ్యాపరమైనప్పుడు గురురేఫ యగుటకు
ఆ. |
నూఱుగతుల నీవు వాఱు దేనన్నియు
నెఱుఁగు బుల్గులెల్ల నెట్లు వారు....
| 198
|
చ. |
అనుటయు భీతి వేఁడుకొను యావులు వేయును నెడ్లు నూఱు నూ
బును రథముల్ శతంబును మెఱుంగులమొత్తము వోనియంగ నా
జనశతకంబు దంతిశతసప్తకముం గొని శాంతిఁ బొందవే
యనినను మానడయ్యె వసుఛామరుకోపము తీవ్రరూపమై.
| 199
|
19 లక్షణము
క. |
పాఱుడు నది వాఱుటయును
బాఱుట మేనెల్ల గగఱుపడుటయు యింకన్
|
|
|
బాఱుట పేఱుట పెనఁగుట
పోఱడు నా శకటరేఫములు వృషభాంకా.
| 200
|
పాఱుడును, పాఱుటను శకటరేఫ లగుటకు
గీ. |
అరుగుదెంచితిననియు ధనార్థిననియు
నిట్లు వినుపించుటయు రాక్షసేశ్వరుండు
తేఱకొనఁజూచి యాత్మని పాఱుఁ డదముఁ
డగుటఁ దోచుచునున్నది యడుఁగవలయు.
| 201
|
క. |
పాఱెడునీ రెడదద్వగ
దారి బెడిదమైన యండ దనుకఁగ నిదురన్
బాఱి మడువంత వేడుక
కాఱులు జాలరులు చూచి క్రందుకొనంగన్.
| 202
|
21 లక్షణము
గీ. |
బీఱువోవుట గురురేఫ మాఱుమొగము
మాఱి మసగుటయును మాఱు మాఱడగుట
మాఱుపడుటయు వేమాఱు మాటలాడ
మీఱుటయు బండిఱాలు సుమేరుచాప.
| 203
|
బీఱు వోవుట ఱకార మగుటకు
గీ. |
బీఱు వోయె రథ్యంబులు మాఱుమొగము
పడిన చానొచ్చియుండియు నడచి శౌరి...
| 204
|
మారుమొగ మనుటకు
ఆ. |
అమరసైన్యములునుఁ దమయంత వర్తింప
నేరకునికి నాకు మారుమొగము
|
|
వ. |
ఇందులో మారుమొగ మనుట రేఫగా ప్రయోగించినాడు గనుక బీరువోవుటను మారుమొగ మనుటను రేఫఱకారముల రెంటనుఁ గలవు.
|
|
మాఱుదల, దూఱుకొని, పెక్కుమాఱులు, మాఱాడుట, వేమాఱు, మీఱుట ఱకారము లగుటకు
చ. |
గదతోడ న్గద చుట్టి రాదిగుచుచున్ గండొప్ప లంఘించి మా
ఱుదలుల్ గైకొనుచున్ గడంగి పలుమాఱున్ దాఁకుచుం వాయుచున్ ...
| 206
|
వ. |
ఇందులో మాఱుదల, పలుమాఱు ననుటకు నున్నవి.
|
|
మాఱుకొనుటకు
గీ. |
పాండవులసైన్యమును సముద్దండలీల
మాఱుకొనినంతకును మూర్ఛఁదేరి నకులు
తమ్ముఁ డమ్మామపైఁ బడి.....
| 207
|
పెక్కుమాఱు లనుటకు
గీ. |
ఓరిదుష్టాత్మ నే నిప్డుఁ బోరఁ బెక్కు
మాఱు లెగువంగ సిగ్గఱి పాఱుచుండు
దట్టి నీకున్న యునికి న.......
| 208
|
మాఱాడుట యనుటకు
క. |
వేఱొకతెఱఁగున నొరులకు
మాఱాడక యునికి లెస్స మనుజేంద్రుకడన్
|
|
..
|
దీఱమిఁగలచోట్లం దా
మీఱి కడఁగివచ్చి పెంపు మేకొనవలయున్.
| 209
|
వేమాఱు ననుటకు
క. |
మీఱినమౌనులకినుకను
మాఱగకయున్న మీసమగ్రక్షమ వే
మాఱు గొనియాడఁగాఁదగు
గీఱువ సాత్వికులబుద్ధి కిల్బిషచయముల్.
| 210
|
ఉ. |
కోఱలు నుగ్గునుగ్గయిన క్రూరఫణీంద్రుగతిన్ దరంగముల్
మాఱిన భూరివారిధిక్రమంబున రాహుకరాళవక్త్రమున్
దూరిన తీవ్రభానుక్రియ దోర్బలసైన్యతఁ బుత్రహీనతన్
| 211
|
ఉ. |
గీఱి పరాభవాదిగతి గీడ్పడి భూపతి నెమ్మనంబునన్....
| 212
|
వ. |
మాఱిమసగుట ఱకార మగుటకు చింత్యము.
|
|
రేఫ యగుటకు
ఆ. |
అనిన నతఁడు పాండవాగ్రజు గవలనుఁ
దాఁకి విపులబాహుదర్ప మొప్ప
నారసములఁ బొదవి మారి మసంగిన
ట్లైనఁ జూచి నరుఁడు ననిలసుతుఁడు.
| 213
|
మీఱుటకు
ద్విపద. |
మీఱి ఇంద్రాదిసమితి గిట్టి నూఱు
మాఱులు గెలిచిన మగటమివాఁడు
| 214
|
చ. |
చనుగవ వ్రేగునన్ మిగులసన్నఁపుగౌ నసియాడఁ గెంపుమీ
ఱిన నునుబట్టుచేలకటి ఱింగులు వాఱగఁ గట్టి భూమిభృ
త్తనయ ప్రసూసగుచ్ఛములుఁ దాలిచి లేజిగురు ల్ధరించి వ
చ్చిన నడదీగవోలె నిలిచెం దరుణేందుకిరీటిసన్నిధిన్.
| 215
|
22 లక్షణము
ఆ. |
ఱాచుటయును ఱాయి ఱాఁగ ప్రేఱేచుట
ఱెప్ప ఱేవు ఱేసి ఱేకు ఱేఁడు
ఱేల ఱేచు గుక్క ఱేఁగు ఱోయుట ఱోత
ఱోలుటయును బండిఱాలు శర్వ.
| 216
|
వ. |
ఇందులో ఱాచుట ఱకార మగుటకు చింత్యము.
|
|
రేఫ యగుటకు
ఉ. |
రాహువుఁ గాను ని న్నరయ రాచిన శూలినిఁ గాను నీతను
ద్రోహము చేసినట్టి యల రోహిణితండ్రిని గాను తజ్జగ
న్మోహిని నీలనీలకచ ముద్దులచక్కెరబొమ్మఁ గూర్ప క
య్యో హరిణాంకతావక మయూఖముఖంబుల నేచ నేటికిన్.
| 217
|
మాదయగారిమల్లన రాజశేఖరచరిత్ర
వ. |
మఱియు నుదాహరణములు రేఫ లగుటకు బహుళముగా
గలవు.
|
|
గీ. |
రాయియనెడుచోట బాయక రేఫయం
చాద్యులై బ్రసిద్ధు లైనకవులుఁ
గృతుల నిలిపి రమలమతి తిక్కనయు గురు
రేఫఁ గాఁగ నిలిపెఁ గృతి నుమేశ.
| 218
|
రాయి రేఫ యగుటకు
గీ. |
మరునియురు లనఁదగు తేఁటిసిరుల వఱలు
తెఱవ కుఱులకు సరిగామి దివిరి గాక
కడిమి దమపెంపువో పూరిఁ గఱవ నేల
రహి యలర వేలుపుల రాచరాలకెల్ల.
| 220
|
క. |
నీలంపుమేనిసూత్రపు
రాల కనుంగవయు పుష్యరాగపుటెన్నున్
గ్రాలెడు చొక్కపుతుమ్మెద
తాళీయొకలేమ పేరె దన్నెల కొల్పెన్.
| 221
|
సీ. |
రాయైనతబిసి పేరంటాలి గ్రమ్మర
గలిగించునడుగుచే వెలసినాడు.
| 222
|
ఉ. |
జాయను జూపవేమి యనుజా యను నవ్విధి యెంతఁ జేసె నౌ
రా యను నాదుగుండె బలురాయను....
| 223
|
శకటరేఫ యగుటకు
క. |
నాయుల్ల మరయ నిను మో
ఱాయో కాకిట్లు రూపఱకవిన నోర్చె
న్సాయకసముదయఖర భవ
దీయవచనచయము గవియు దేఱందిరమై.
| 224
|
క. |
పోక నడుకొట్టి తేనియు
ఱాకింతుజుమీ మొగంబు ఱాచట్టుపయిన్
|
|
|
శ్రీకాశిక నిందించిన
నీ కింతట నేల పోవు నీచచరిత్రా.
| 225
|
ఆ. |
ఱజ్జులాడి యీగి ఱాపడి సభలోని
ఱేసిపోఱిలోన ఱెచ్చఁబొఱసి.....
| 226
|
ఱాగ యనుట శకటరేఫ యగుటకు
ఉ. |
ఱంతులు మీఁదిమిక్కిలిగ ఱాగతనంబున దొమ్మి చేసి దు
ర్దాంతపరాక్రమోన్నతులు దానవదైత్యు లు.....
| 227
|
ఱెప్ప, ఱేపు అనుటకు
ఉ. |
అప్పుడు ముద్దరాలిఁజెలు లక్కునఁ జేర్చిముఖాబ్జ మెత్తి క
న్ఱెప్పల బాష్పము ల్దుడిచి ఱేఁపె నృపాలుఁడు గారవింప....
| 228
|
ఱేవనుటకు, ఱేసి యనుటకు
ద్విపద. |
ఱేసి చూడగరాని ఱేవు చక్కటికి
డాసిన పొదలలో డాఁగి యే నుండ...
| 229
|
చ. |
అనఘ యకంపమై విమలమై పరిపూర్తియు లోఁతు దియ్య ము
న్ఘనతయుఁ గల్గి సజ్జనమనస్సదృశస్థితిఁ జాల నొప్పు మీ
ఱినయదియన్న దీజలము ఱేవును మంచిది....
| 230
|
ఱేఁడు, ఱేసి యనుటకు
క. |
దానిఁ గని వచ్చి పైఁబడు
వానిని బల్లెములఁ గొంగవాలు లసు రెలన్
|
|
|
మేనులువాలిచి పెంపున
ఱేనికి సంతసము చేసి ఱేసిరి కడకన్.
| 231
|
ఉ. |
వీఁడె నలుండు విశ్వపృథివీవలయైకవిభుండు వచ్చుచు
న్నాఁడని భీమభూమివరనందన నూరడిలంగఁ బల్కి పూఁ
బోఁడులమాట నేర్చుకొని ప్రోది శుకాంగన యట్ల పల్కిన
న్ఱేడిది నన్ను నేక్రియ నెఱింగెనొకో యనుచుండె నాత్మలోన్.
| 232
|
ఱేకనుట ఱకార మగుటకు
సీ. |
కబరికాభరముపైఁ గన్నెగేదంగిపూఁ
ఱేకులతోఁగూడ ఱేని జెరివి
| 233
|
ఉ. |
ఱెక్కలు చించి కంఠమున ఱేకులు వాసి సిరంబు వ్రచ్చి పే
రుక్కున గ్రాంచి చందమగు-నొడ్డణముంగలఁగంగఁ భీష్ముఁ డే
దిక్కున దానయై....
| 234
|
ఱేల యనుట ఱకార మగుటకు
ఉత్సాహ. |
చాలుఁజాలు నెంతకైనఁ జాలు నున్నగన్నెరల్
ఱేలపూల కేల గోల ఱేయ నిందులోనఁ బో
ఱేల తాళుమన్న నన్ను నెట్టి తిట్టె దక్కటా
మేలు మేలు ముద్దరాల మెచ్చువచ్చె నామదిన్.
| 235
|
ఱేగు ఱకార మగుటకు
గీ. |
మహితకమలమధురమధురసాస్వాదన
పరవశాత్మయైన భ్రమరకాంత
|
|
|
ఱిచ్చబుద్ధి నకట ఱేఁగుబువ్వులరస
మాను నెట్లు బేలవైతి గాక.
| 236
|
వ. |
రోయుట ఱకార మగుటకు చింత్యము.
|
|
రేఫ యగుటకు
క. |
పులికి బలుసు వాఱినక్రియ
నలవుజలము సిగ్గు విడిచి య ట్లొక్కనికో
ల్తల కోర్వక విరిగిన పు
త్త్రుల నేమని విందు నేను రోయక యింకన్.
| 237
|
ఉ. |
క్రూరత కోర్చియించుకయు రోయక పైకొని యెల్లభంగులన్....
| 238
|
ఱాలుట ఱకార మగుటకు
ఉ. |
కాలను కేలనుం జదిపి గంధకరిన్ దెగటార్చు సింహమున్
బోలుచుఁ బేర్చియాద్రుపదభూపసుతున్ సమయించి వేదనల్
ఱాలగ ఱోఁజగాఁ బలుమఱున్ బొరలంబడ.....
| 239
|
23 లక్షణము
క. |
వేఱుపడుట వీఱడియున్
వేఱొకటియు బండిఱాలు వెరవొప్పఁగఁ బ
ల్మాఱు నిది యెఱుఁగకుండెడు
వీఱడి రచియించుకవిత వృధగద శర్వా.
| 240
|
వీఱడి యనుట గురురేఫ యగుటకు
క. |
వీఱడితనంబు వెట్టుచుఁ
దూఱంబనిలేదు నిన్నుఁ దొల్లిటిచెయివుల్
|
|
|
దీఱ నది యనుభవింపక
వేఱుండునె పూర్వజన్మవివిధకృతంబుల్.
| 241
|
వేఱనుటకు
క. |
వేఱొకవిలుఁ గొని యమ్ములు
గీఱ మెఱఁగునారసములు గిఱికొల్పిన నో
టాఱి మెయిన్ గ్రొన్నెత్తురు
వాఱ నతఁడు తేజిమీఁదఁ బడి మూర్ఛిల్లెన్.
| 242
|
24 లక్షణము
గీ. |
అరయ గురురేఫ హల్లుతో బెరసినపుడు
ప్రాసముల విశ్రమములు రేఫములతోడఁ
గలసియుండును సుకవిపుంగవులగృతుల
జగదవనసూత్ర గిరితనూజాకళత్ర.
| 243
|
ఉదాహరణము
ఉ. |
నూఱ్వురు నొక్కచందము మనోగతి సైరణ చేసి నన్ను నా
సర్వకులంబు నుత్తమయశంబున నుంచితి రమ్మలార మీ
కుర్విని పాటియే యబల లొండొరుదేవతలున్ బటుక్షమా
నిర్వహణం బొనర్చుటకు నేరరు మర్త్యులఁ జెప్ప నేటికిన్.
| 244
|
క. |
కార్చిచ్చు గవసి మృగముల
నేర్చుకరణి నేఁడు భీష్ముఁ డేచిన కడిమిన్
బేఱ్చి మనభీముఁ బొదవె శ
రార్చులు నవ్వీరుఁగ న్ను లారంగంటే.
| 245
|
సీ. |
హయమేధపర్యంత మైనశ్రౌతము బహు
స్మృతులుఁ బుత్త్రునకు వేఱ్వేఱఁ దెలిపె...
| 246
|
క. |
చెలఁగి పటుసింహనాదం
బులు ఱంకెలుఁ గాఁగ వారు వొలిచిరి వృషభం
బులక్రియ నొండొరులకు మా
ఱ్మలయుచుఁ దాఁకుచు నుదాత్తరభసోజ్వలులై.
| 247
|
క. |
అలసానిపెద్దకవి పిం
గళిసూరన రామభద్రకవివర్యుఁడు పి
ల్లలమఱ్ఱివీరభద్రుఁడు
గలపిరిగద గృతుల ఱాలుఁ గడురేఫములన్.
| 248
|
వ. |
పెద్దన్న రేఫఱకారములఁ గలుపుటకు.
|
|
శా. |
శ్రేణు ల్గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు లుష్ణాంశు పా
షాణవ్రాము కోష్ణ మయ్యె....
| 249
|
మ. |
ఇలకు న్వ్రేగుగ బండుదీర వనపుండ్రేక్షుచ్ఛటల్ దీపు ల
గ్గలమై వ్రాల నురుస్వరంబు లెసఁగన్ గాఁద్రిప్పు రాట్నంపుగుం
డ్రలు నాదేనెకొలంకులం బొగలి పాఱన్ విచ్చు పంకేరుహం
బుల నాడెన్ దొలుసంజ దేఁటివలయంబుల్ తారఝంకారముల్.
| 250
|
మ. |
పునుకుం దావిన నోదనంబు మిరియంపుంబొల్లతోఁ జట్టి చు
య్యన నాదారని కూరగుంపు ముకుమందై పేర్చు నావన్ జిగు
|
|
|
ర్కొను పచ్చళ్లును పాయసాన్నములు నూఱుంగాయలున్.....
| 251
|
చ. |
ముదిముదిఁ దప్పి తోటం మునిముఖ్య భవత్తనయన్ గృహంబునన్
బదిలను చేసి వచ్చి మఱి బట్టబయల్ వెడదూరు దూరె దా
సదనమి కొక్కమా టరసి చంచలలోచనఁ గానకున్న దూ
ఱెదు మది కానిబుద్ధి విపరీతతఁ బొందకపోయి చూడుమా.
| 252
|
ఆదిఱకారమునకు
శా. |
ఱేవుల్ మావుమతంగజంబును మణిశ్రీఖండముక్తాళియున్
రావాణిజ్యముఁ బెంచి యేలఁగ నగున్.....
| 253
|
సీ. |
కానలో దారు మృగంబులకైవడిఁ
గైకొని యసమాస్త్రకర్మకలన.....
| 254
|
వ. |
ఇందులో గానలో దారు = తమరు అనునర్థమునందు లఘురేఫయు, తారుట = యడుంగుట అనునర్ధమునందు గురురేఫయు నగును. అందుకు వెల్లంకి తాతంభట్లు నిడుపులమీఁద బండిఱా లేదనినాడు. తారుట రేఫమే అని రాఘవపాండవీయమునకు టీక వ్రాయుచున్న ముద్దరాజు రామన్న సమ్మతి వాసినాడు. అది కాదు. తారుట ఱకారమే సిద్ధము. మఱియు.
|
|
సీ. |
రేఖలై మీఁదటిఱేవులై యొప్పు ప
న్నాగంపుగడవళ్ళబాగు నెఱప
| 255
|
క. |
గ్రక్కునఁ జని వ్రాలుదునో
ఱెక్కలుఁ గట్టుకొని దివిజరిపుమేడలపై
నక్కొమ్మ జూచు టెపుడెపు
|
|
|
డొక్కొయనునంత తమక మున్నది మదిలోన్.
| 256
|
ఉ. |
సైరిభవారిభద్విరదశాసనఖడ్గఖరాదిరూఢులై
దారలు బూరగొమ్ములును తప్పెటలున్ బటహంబులున్ బదుల్
నూఱులు వేలు మ్రోయ గమనుల్వడి వెల్వడి హత్తి యుత్తర
ద్వారమువంక దార కిరువంకల పౌఁజులు దీర్చి రయ్యెడన్.
| 257
|
కవిరామభద్రుని రామాభ్యుదయము
.
ఉ. |
...............................................................ఠీవి మీ
ఱంగ నటించు గొబ్బురిపురప్రభురంగనకీర్తి రంజిలున్.
| 258
|
ఉ. |
తూరుపు తెల్లవాఱుటయుఁ దోడన మంగళపాఠకస్తుతుల్
మీఱఁ దదీయరాగముల మేల్కని కాల్యసమంచితక్రియల్
దీఱిచి పాండుపుత్ర వసుదేవసుతుల్ ప్రమదంబు మోములం
దేఱగ వేడ్కతో నరుగుదెంచి సభాస్థలి నిల్చి రయ్యెడన్.
| 259
|
పిల్లలమఱ్ఱివీరన్న జైమినీభారతము
గీ. |
వనధి సర్వంకషం బయ్యు వలయు పనికి
ఱేవులనకాని చొఱరాని రీతిఁ దనరి
విశ్వరూపకుఁ డయ్యు శ్రీవిభుఁడు కూర్మ
రూపముల సేవ్యుఁ డగు నారురుక్షులకును.
| 260
|
సంకుసాల నరసింగయ్యకవి కవికర్ణరసాయనము
వ. |
నా న్యేషాం వైధర్మ్యం లఘ్వలఘునాం రయోస్తునిత్యం స్యాత్
"అని ఆంధ్రవ్యాకరణసూత్రమునకు టీక వ్రాసి రేఫఱకారము లునుపరాదని చెప్పిన బాలసరస్వతి చంద్రికాపరిణయమునందు."
|
|
ఉ. |
అక్కమలేక్షణన్ సవినయంబున గాచుము నాదుమాఱుగా
మ్రొక్కుము సేమ మాభువనమోహిని నీ కని పల్కుమార్తిచే
|
|
|
జిక్కితి వేఁగ బోవుమని చెప్పుము పొమ్మిక తేటిరాయ నీ
ఱెక్కలమాటున న్నను భరించి లభింపుము కీర్తిపుణ్యముల్.
| 261
|
వ. |
ఇటువలెనె మహాకవులకును రేఫఱకారములపట్ల బరిశీలన లేకపోయినది.
|
|
ఆ. |
కాకనూరియప్పకవి యహోబలపతి
ముద్దరాజు రామముఖ్యు లెల్ల
పోతరాజుకబ్బమున రాలు రేఫలు
గదిసెనంచు బలికి రది హుళిక్కి.
| 262
|
ఉ. |
బమ్మెఱపోతరాజకృతభాగవతంబు సలక్షణంబుగా
కిమ్మహి నేమిటం గొదవ యెంతయు నారసి చూడ నందు రే
ఫమ్ములు ఱాలునుం గదసి ప్రాసము లైనకతంబునంగదా
యిమ్ముగ నాదిలాక్షణికులెల్లను మాని రుదాహరింపగన్.
| 263
|
క. |
పురసతులవిలోకనములు
సరసాలాపములు నర్మసంభోగంబుల్
మఱిగి హరి మనల నెల్లడు
నరవరు లోయమ్మ నూతనప్రియులుగదే.
| 264
|
వ. |
అని పోతరాజు చెప్పినాడని యహోబలపతి వ్రాసినాడు. మరియు గొందఱు లాక్షణికులును ఆలాగే యన్నారు గాని పోతరాజు లాక్షణికుం డగుటను కాకుండుటను పరిశీలనము లెస్సగాఁ జేసినారు కారు.
|
|
సీ. |
అఖిలవేదాంతవిద్యారహస్యవిదుండు
సహజపాండిత్యవిశారదుండు
మత్తక్షితీశాధమస్తోత్రవిముఖుండు
శంభుపదాబ్జపూజారతుండు
|
|
|
పటుతరకవితానిభాసితప్రతిభుండు
సకలాంధ్రలక్షణచక్రవర్తి
రఘుకులేశనిదేశరవితమహాభాగ
వతపురాణుఁడు పుణ్యవర్ధనుండు
|
|
గీ. |
బుధజనహితుండు బమ్మెరపోతసుకవి
యెన్న రేఫఱకారంబు లెఱుగ డనుచు
నజ్ఞు లొకకొంద రాడుదు రమ్మహాత్ము
కవిత కెందును లోపము గలుగ దభవ.
| 265
|
సీ. |
ఘనుడు పోతనమంత్రి మును భాగవతము ర
చించి చక్రి సమర్పించునెడల
సర్వజ్ఞసింగయక్ష్మావరుం డది దన
కిమ్మని వేఁడిన నిడకయున్న
నలిగి యాపుస్తకం బవని బాతించిన
జివికి యందొకకొంత శిథిలమయ్యె
గ్రమ్మర నది వెలిగందల నారప
రాజును మరి బొప్పరాజు గంగ
|
|
గీ. |
రాజు మొదలగు కవివరు ల్దేజ మెసఁగ
జెప్పి రాగ్రంథములయందె తప్పు లొదవె
గాని పోతకవీంద్రునికవితయందు
లక్షణం బెందు దప్పదు దక్షహరణ.
| 266
|
వ. |
పోతరాజు చెప్పినవి ప్రధమస్కంధమును ద్వితీయస్కంధమున కొంతయు షష్టసప్తమాష్టమనవమస్కంధములును దశమస్కంధము పూర్వభాగము కొంతయు నున్నది. అందులో రేఫఱకారసాంకర్యము లేకుండుటకు వ్రాయుచున్నాము.
|
|
దీర్ఘములమీది ఱకారములకు
ఉ. |
మాఱుపడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱనిపిన్నపాపల నతిత్వరితంబునఁ ద్రుంచెఁ గ్రూరుడై
పాఱఁడు గాని పాతకుడు ప్రాణభయంబున వెచ్చనూర్చుచుం
బాఱెడు వీనిఁ గావుము కృపామతి నర్జున పాపవర్జనా.
| 267
|
కుఱుచలమీది ఱకారములకు
చ. |
వెఱచినవారి దైన్యమున వేదురునొందినవారి నిద్రమై
మఱచినవారి సౌఖ్యమున మద్యముద్రావినవారి మగ్నులై
పఱచినవారి సాధుజనభావమువారినిఁ గావుమంచు వా
చఱచినవారిఁ గామినులఁ జంపుట ధర్మము గాదు ఫల్గునా.
| 268
|
నిడుదలమీది ఱాలకు
ఉ. |
పాఱడు లేచి దిక్కులకు. బాహుల నొడ్డఁడు బంధురాజిలో
దూఱడు ఘోరకృత్యమని దూఱడు తండ్రిని మిత్రవర్గమున్
జీఱఁడు మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిన్
దాఱఁడు గానరే యనడు తాపము నొందఁడు కంటగింపడున్.
| 269
|
ఆదిఱకారమునకు
ఉ. |
ఱెక్కలు రావు పిల్లలకు ఱేపడనుండియు మేత గానమిన్
బొక్కెడుగూటిలో నెగసిపోవగ నెరవు మున్ను దల్లి యా
దిక్కుననుండి వచ్చునని త్రిప్పటిచూడ్కుల నిక్కినిక్కి నల్
దిక్కులు చూచుచున్న దతిదీనత నెట్లు భరింతు నక్కటా.
| 270
|
కుఱుచలమీది ఱకారములకు
|
ఎఱుఁగడు జీవనౌషధము లెవ్వరు భర్తలు లేరు బాధలన్
దఱలడు నైజతేజమున తథ్యము జాడ్యము లేదు మిక్కిలిన్
|
|
|
మెఱయుచునున్నవాఁ డొకనిమేషము దైన్యము నొంద డింక నే
తెఱఁగున ద్రుంతు వేసరితి దివ్యము వీనిప్రభావ మెట్టిదో.
| 271
|
మ. |
ఉఱుకుంగుంభయుగంబుపై హ రిక్రియన్ హుమ్మంచు బాదమ్ములన్
దిఱుగుంగండము వెన్నుదన్ను నెగయున్ హేలాగతి న్వాలమున్
జఱుచు న్నుగ్గుగ దాఁకు ముంచు మునుగుం న్మల్యంబులు న్దంతము
ల్విఱగ న్వ్రేయుచు బొంచిపొంచి కదియున్ వేదండయూధోత్తమున్.
| 272
|
క. |
ఒఱపగునురమును బిఱుదును
నెఱిదోఁకయు ముఖము సిరియు నిర్మలఖురముల్
కుఱుచచెవు ల్తెలిగన్నులు
తలుచగుకంఠంబు చూడదగు నాహరికిన్.
| 273
|
క. |
వెఱచుచు నంగుచు వ్రాలుచు
నఱిముఱి గుబుఱులకు జనుచు హరిహరి యనుచున్
మఱుచ చు నులుకుచు దిఱుగుచు
కుఱుమట్టపుపడచువడుగు గొంత నటించెన్.
| 274
|
చ. |
ఎఱిగితి మద్దిరయ్య తడ వేటికి గుర్రపుగొంగ బట్టుడీ
జఱభిని బట్టి చంపు డతిసాధుమునీంద్రుడపోలె నేత్రముల్
దెఱవక బొక్కినోరు మెదలింపక బాసిక వెట్టియంచు న
య్యఱువదివేవురుం జని కరాయుధముల్ ఝడిపించి డాయుచున్.
| 275
|
నిడుదలమీది ఱకారమునకు
క. |
పాఱుదురు గికురు పొడుచుచు
దూఱుదురు భయంబులేక తోఱపుదిఱముల్
|
|
|
జాఱుదురు ఘనశిలాతతి
మీఱుదు రెన్నంగరాని మెలకువుల నృపా.
| 276
|
కుఱుచులమీది ఱకారములకు
క. |
తెఱవ యొకతె నిద్రింపఁగ
నెఱిగట్టినవలువ విడిచి నేడొకతేలున్
గఱపింప నీకుమారుఁడు
వెఱుచుచు నవి పఱువనగుట విహితమె సాధ్వీ.
| 277
|
చ. |
వెఱుమఱ లేని మేటిబలువీరుఁడు గృష్ణకుమారుఁ డొక్కచేఁ
జఱచి ఖగేంద్రుచందమునఁ జక్కఁగ దౌడలు వట్టి కన్నులం
జొఱజొఱ దుర్విషానలము నుబ్బి వధింపక యెత్తి లీలతో
జిఱజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషితదర్పముఁ గ్రూరసర్పమున్.
| 278
|
క. |
కఱచిన భుజగము రదములు
విఱగంగ వదనముల విషము వెడలఁగ శిరముల్
పఱియలుగ నఁడచె గరుడుఁడు
తఱిమి కనకరుచులు గలుగు తనదాఱెక్కన్.
| 279
|
వ. |
ఇది పోతరాజుకవిత్వము వెలిగందల నారపరాజు చెప్పిన కవిత్వములో.
|
|
రేఫఱకారసాంకర్య మగుటకు
చ. |
హరివచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁ డో
పరమపదేశయోగిజనభావన యీనిఖిలోర్వియందు నీ
వెఱుఁగనియట్టియర్ధ మొకటేనియుఁ గల్గునె యైన నామదిన్
బెరసినకోర్కె నీకు వినుపింతు దయామతి జిత్తగింపవే.
| 280
|
క. |
ఎఱుఁగమినైనను భూసుర
వశులధనం బపహరింపవలువదు పతికిన్
|
|
|
మఱపున ననలము ముట్టిన
దరికొని వెస గాల్పుకున్నె తను వెరియంగన్.
| 281
|
సీ. |
కరుణాపయోనిధి మఱియొకయింటిలో
జెలి గూడి ముచ్చటల్ జెప్పుచుండ
| 282
|
క. |
హరిపదసేవకుఁ డరిభీ
కరుఁ డర్జునువలన మిగులఁ గార్ముకవిద్యల్
గఱచినబలియుఁడు సాత్యకి
వఱలిన సుఖలీలనున్నవాఁడె ధరిత్రిన్.
| 283
|
చ. |
మఱియు సరోజలోచనుని మంగళదివ్యకథానులాపని
ర్భరపరితోషబాష్పకణబంధురచారుకపోలగద్గద
స్వరపులకీకృతాంగులగువారును నిస్పృహచిత్తులు న్నహం
కరణవిదూరు లున్నగు సుకర్ములు నుండడుపుణ్యవాసముల్.
| 284
|
చ. |
సరసిజగర్భ యోగిజనసర్వసుపర్వమునీంద్రహవ్యభు
క్పరమఋషిప్రజాపతులు భక్తిమెయిం జనుదెంచియుండు న
త్కరితరుణార్కతేజుడగు దక్షుఁడు వచ్చిన దత్సభాసదుల్
తఱమిడి లేచి రప్పుడు పితామహభర్గులు దక్క నందఱున్.
| 285
|
క. |
హరినాముఖమున నీకు
న్నెఱిఁగింపదలంచి నాకు నెఱగించెను సు
స్థిరమతి విను మంతయు
హరివాక్యముగా దలంచి యవనీనాథా.
| 286
|
బొప్పరాజు గంగరాజు పంచమస్కంధము
క. |
వలనుగ రేఫఱకారం
బులతెఱఁగంతయును సుకవిపుంగవు లిందున్
|
|
|
దెలుసుకొని కబ్బములలో
నిలుపందగు దేవదేవ నీలగ్రీవా.
| 287
|
గీ. |
శాలివాహనశకవర్షసంఖ్యకరర
సాంగశశిసౌజ్ఞ నలరు రౌద్ర్యబ్దమునను
భాద్రపదశుక్లపంచమివరకు బూర్ణ
మయ్యె నీకృతి నీపేర నగసుతేశ.
| 288
|
క. |
కవివరులయిండ్ల నెపుడు,
న్శివకరమై యసమలీలచే నీకృతి యా
రవిశశితారార్కముగన్
భువిఁ బ్రబలుచునుండుఁగాక భూతేశ శివా.
| 289
|
చ. |
రతిపతిదర్పభంగ మునిరాజమనస్సరసీజభృంగ సం
తతకరుణాంతరంగ నిజదాసజనావవచంగ పద్మినీ
హితసితరుగ్రధాంగ నిలయీకృతపర్వతశృంగ విస్ఫుర
త్కుతలశతాంగ పీఠపురకుక్కుటలింగ భుజంగ మాంగదా.
| 290
|
గద్యం
ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధ
సరసకవితాసామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర
కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్య
పుత్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశ
లాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతంబయిన
లక్షణసారసంగ్రహంబను గృతియందు
రేఫఱకారప్రకరణంబనునది సర్వం
బును దృతీయాశ్వాసము. శ్రీశ్రీశ్రీ.
శ్రీ పరమేశ్వరార్పణమస్తు.