సర్పపురమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము

శ్రీశారదామ్బాయై నమః

సర్పపురమాహాత్మ్యము

ద్వితీయాశ్వాసము



లలనాభూలలనా
నీళా మహిళాసనాథ నిరుపమమేధా
లీలాకటాక్షవీక్షణ
పాలితనతయూధ సర్పపత్తననాథా.

1


తే.

అవధరింపు మగస్త్యసంయమివరుండు, శౌనకున కిట్లనియె నట్లు సకలదేశ
ములఁ జరించుచు నారదమునివరేణ్యుఁ, డురుతరామోదహృదయుఁ డై యొక్కనాఁడు.

2

నారదుండు సర్పపురము చేరుట

చ.

చని చని కాంచె సిద్ధసురచారణయక్షభుజంగకన్యకా
జనకుచకుంభసంభృతవిశంకటసంకుమదైణనాభిచం
దనఘనసారసౌరభనితాంతసుగంధిసరోభిరామమున్
ధనకనకప్రకీర్ణమణిధామము సర్పపురీలలామమున్.

3


సీ.

వేదవేదాంతప్రవీణవిప్రకులంబు, పరశుభాగవతవిభ్రాజితంబు
దీపితనవరత్నగోపురప్రకరంబు, సరసపుణ్యాంగనాసంవృతంబు
పల్లవఫలపుష్పబంధురోద్యానంబు, పావనానంతసరోవరంబు
దివ్యదేవాగారదేదీప్యమానంబు, భర్మనిర్మితహర్మ్యభాసురంబు


తే.

భూరిగారుత్మతద్వారతోరణంబు, గురుతరానర్ఘ్యమాణిక్యకుట్టిమంబు
లాలితోదగ్రహరినీలజాలకంబు, పుణ్యనిలయంబు శ్రీసర్పపురవరంబు.

4

వ.

అప్పట్టణంబు ప్రవేశించి యం దొకరాత్రి వసియించి మఱునాఁడు ప్రభాతసమ
యంబున లేచి.

5

నారదుం డొకకొలనియందు మునింగి స్త్రీయగుట

క.

బృందారకముని సంధ్యా, వందన మొనరింపఁ గోరి వరజలములకై
యందందు వెదకుచుండెన్, మందానందమున నంత మహిమ దలిర్పన్.

6


తే.

అతనిగర్వం బడంగింప నాత్మఁ దలఁచి, యచట నద్భుతచేష్టితుం డైనహరి మ
నోహరంబుగ నొక్క పెన్గొలను సరగఁ, గల్పితము చేసె నాశ్చర్యకరము గాఁగ.

7


వ.

అది యమందపిచుమందమందారకుందచందనపాలరసాలహింతాలతమాలమాలతీ
పనసఘనసారకదళీకదంబజంబుజంబీరపున్నాగనాగరంగాశ్వత్థామలకప్రము
ఖానేకానోకహాకీర్ణతటతలవనాంతరాళసమర్హవిపులఫలకిసలయాహారలీలా
విహరమాణహారిహారీతకీరశారిపారావృతపరభృతప్రభృతివివిధగరుద్రథరాజరాజి
కూజితభాజితంబును, మందానిలసముద్ధూతవీచికాబిందుసందోహసమాకీర్ణం
బును, బ్రఫుల్లహల్లకేందీవరకుముదకువలయవిమలకమలాస్తోకమరందపానానంది
తేందిందిరబృందమందమధురఝంకారనినాదమేదురంబును, హంసకారండవక్రౌంచ
బకచక్రవాకాదికోజ్జ్వలవిహంగరాజివిరాజితంబును, బ్రాసూనరేణుసంపర్కారు
ణాంభఃపూరసుశీతలంబును, నిరంతరదివ్యసుగంధబంధురంబును, మత్స్యకచ్ఛపశిలీ
ఢులీకుళీరముఖాశేషాంభశ్చరకులసంకులంబును, బాంథలోకశ్రమాపనోదకవిమలో
దకపూరితంబును, సకలజనమనోహరంబును నగునక్కాసారంబు గనుంగొని నార
దుం డత్యంతాద్భుతస్వాంతుం డగుచుఁ దత్తీరంబున వీణాకమండలువులు పెట్టి జలా
వగాహనార్థం బక్కొలంకు సొచ్చి మునుంగుచుం దేలుచుఁ గొంతతడవు విహరించి యంత.

8


సీ.

కొదమతుమ్మెదదిమ్ము నదలించుపెన్నెఱుల్, కెందమ్మివిరుల నేల్ కేలుగవయు
జక్కవకవ నుల్లసములాడుచనుగుబ్బ, లలఁతిచీమలబారుఁ గలఁచునారుఁ
బున్నమరేఱేని నెన్నుముద్దుమొగంబుఁ, బగడాల నళికించు తొగరుమోవి
కలువఱేకులసౌరు గెలుచువాల్గన్నులుఁ, బొన్నక్రొన్ననఁ గేరు పొక్కిలియును


తే.

జికిలిక్రొమ్మించుటద్దంబుఁ జిన్నవుచ్చు, తళుకుఁజెక్కులు మొల్లమొగ్గలహొరంగుఁ
దెగడు పలుచాల్పుఁ దిన్నెల నగుపిఱుఁదులుఁ, గలిగి యబ్రంపునెఱరాచకలికి యయ్యె.

9


తే.

ఏమి సెప్పుదు నహహ లక్ష్మీశుమహిమ, యెఱిఁగి వాక్రువ్వ జగముల నెవ్వఁ డోపు
నబ్రముగ నారదున కప్పు డాఁడురూపు, వచ్చె నద్దేవవిభుప్రభావంబువలన.

10

తే.

తనదుపూర్వప్రకారమంతయును మఱచి, తనకు స్త్రీరూప మెపుడు కల్గె నదె కాఁగఁ
దలఁచుకొని యంతఁ దత్సరస్తటముఁ జేరఁ, బదియునాఱేండ్లలేముద్దుఁబడఁతి యగుచు.

11

నారదుఁడు స్త్రీయై సుదతి నాఁబరఁగి తనకు భర్తను వెదకికొనుట

తే.

దైవవశమున నట్లయి తమి దలిర్ప, సుదతి యనుపేరు గల్గి యా సుదతి దనకుఁ
దగినపురుషునిఁ జక్కనిసొగసుకాని, వెదకికొనుచు నదభ్రసమ్మదముతోడ.

12


సీ.

కరకంకణంబులు గల్లుగల్లని మ్రోయఁ, బదముల నందియల్ రొద యొనర్పఁ
గాంచికాఘంటికాఘణఘణధ్వను లొప్ప, ముత్యాలచేర్చుక్క మొగి నటింపఁ
దాటంకమణిరుచుల్ తళుకుఁజెక్కులఁ బర్వఁ, గ్రొమ్ముడి వీఁపున గునిసియాడఁ
గులుకుగుబ్బలు పైఁట నెలసి పింపిసలాడ, నలఁతిచెమ్మట మేన నంకురింప


తే.

హారకేయూరకటకరత్నాంగుళీయ, కారవమ్ములు తద్దయు హరువు చూపఁ
గడిఁదికలపంబు నెత్తావి గ్రమ్ముకొనఁగ, వనిఁ జరించుచునుండె నవ్వనజవదన.

13


తే.

మేఘమధ్యంబునందుఁ గ్రొమ్మెఱుఁగువోలె, నింపురాణింప నటఁ జరియించుచుండె
నవ్విధమున నవ్వనజాయతాక్షి, మెలఁగుచో వేళ యొకకొంత మించుచుండె.

14

నికుండరాజచరిత్రము

తే.

అంత సోమాన్వయోద్భవుం డైనవీర, బాహుపౌత్త్రుండు శ్రుతకీర్తి బాహుజాగ్ర
గణ్యుపుత్త్రుండు నిస్తులపుణ్యఖని ని, కుండుఁ డనియెడునరపాలకుంజరుండు.

15


ఉ.

భానుఁ డుదగ్రతేజమున భావభవుండు విలాసలీల వై
శ్వానరుఁ డుగ్రరోషమున వాసవుఁ డాతతకీర్తిచే మహా
సేనుఁ డదభ్రవీర్యమున శేషుఁడు వాగ్విభవంబునన్ రమా
జాని కృపాగుణంబున రసాస్థలి నిస్తులశాంతివైఖరిన్.

16


సీ.

తనవినిర్మలమనోవనరుహంబునకు శ్రీ, రమణీవిభుఁడు మనువ్రతము గాఁగఁ
దనమండలాగ్రప్రతాపానలంబున, కరిరాజతతి తృణోత్కరము గాఁగఁ
దనకీర్తినర్తకీతరుణీలలామకు, బ్రహ్మాండములు రంగభవనములుగఁ
దనదానవిఖ్యాతఘనఘనాఘనమున, కభిలార్థులును జాతకావళులుగ

తే.

నలరె రఘువర భృగువర నల దిలీప, సగర పురుకుత్స శిబి హరిశ్చంద్ర నహుష
భరత శశిబిందు నిభశుభప్రాభవుండు, నయవిదుండు నికుండభూనాయకుండు.

17


తే.

అమ్మహీపతిమణి తండ్రి యట్ల ప్రజలఁ, బ్రోదిసేయుచు నక్షత్త్రభోగలీలఁ
బీఠికాపట్టణంబు సంప్రీతితోడ, నేపు దైవాఱ నెమ్మది నేలుచుండె.

18


సీ.

దేవదేవుండు కుంతీమాధనస్వామి, దలఁగ కేపురమున నిలిచియుండె
దివిజనాయక సంప్రతిష్ఠితుం డై కుక్కు, టేశ్వరుఁ డేవీట నిరవుకొనియెఁ
బృథుతరాష్టాదశపీఠంబులకుఁ బెద్ద, పురుహూతికాంబ యేప్రోల వెలసెఁ
బరమపావన మైన పాదగయాక్షేత్ర, మేరాజధానియం దేపు మీఱె


తే.

సేతుకాశీప్రయాగాద్యశేషదివ్య, తీర్థరాజంబులట్ల ప్రతిష్ఠఁ గాంచె
నేమహాపట్టణం బది యెన్న నలరు, భువనసారంబు పీఠికాపురవరంబు.

19


సీ.

వివిధశాస్త్రపురాణవేదవేదాంతసం, విదులయి వెలసిన విప్రవరులు
హయమతంగజశతాంగారోహణక్రియా, ప్రౌఢి గాంచిన మేటిబాహుజులును
ధనధాన్యవిస్ఫూర్తి దానవిద్యాభ్యాస, పారీణులైనట్టి యూరుజులును
బాఁడిపంటలచేత భాగ్యసంపన్నులై, సుస్థితి నలరొందు శూద్రజనులు


తే.

మఱియుఁ గొదలేనికలుములఁ గొఱలి వఱలు, నితరవర్ణజనంబులు నతితరముగఁ
గలిగి యేప్రొద్దు శుభలీలఁ జెలఁగుచుండు, భూరివిభవంబు పీఠికాపురవరంబు.

20


క.

ఆనగరి కధీశ్వరుఁడై, పూనిక నిప్టోపభోగములఁ దనియుచు ధా
త్రీనాథమణి నికుండుం, డానగరిపుకరణి ఠీవి నలరుచు నుండెన్.

21

శరద్వర్ణనము

శా.

అంతన్ భ్రాంతసరస్సమగ్రబిసనాళాహారలీలాపరి
భ్రాంతానంతమరాళికానిచయసుశ్రావ్యస్వనాకర్ణనా
శ్రాంతాత్యంతకుతూహలోల్లసితభాస్వచ్ఛాలిపాలీజన
స్వాంతం బై శరదాగమంబు దనరెన్ సర్వంసహామండలిన్.

22


సీ.

విమలపయోదఖండములు మింటఁ జరించె, కలమమంజరులెల్లఁ దలలు వంచెఁ
గొలఁకుల నలినముల్ గలువలు వికసించె, మదమరాళంబుల రొదలు మించె
వృషభగుల్ ఱంకెలు వేయుచు నెదిరించె, శైవలినీతతుల్ సన్నగించెఁ
గేకిసంఘాతంబు కేకలు చాలించెఁ, బొనఁగఁ ద్రోవలను రొంపులు నశించె

తే.

విలసితంబుగఁ బైరులు విస్తరించె, సాంద్రచంద్రాతపంబు తేజము వహించె
నధిపులకు వెంటఁ దమి మది నంకురించె, జనమతము లైనయాశరద్దినములందు.

23

నికుండరాజు సుదతి యున్నవనంబున కరిగి వేఁటాడుట

వ.

ఆసమయంబున నొక్కనాఁడు కందర్పసుందరుండును గదనశూరుండును శత్రునిషూద
నుండును జతుర్దశవిద్యాప్రవీణుండును జతురుండును సంతతదానకళాపారీణుండును
సమగ్రలక్ష్మీకుండును సర్వాలంకారభూషితుండును సముదగ్రగంభీరుండును నగునికుండ
నరేంద్రచంద్రుండు మృగయావిహారలంపటస్వాంతుఁ డగుచుఁ దురగఖురపుటాంచ
లోద్ధూతస్ఫీతధరాపరాగం బంబురుహబంధుమండలంబు మాయంబుసేయ పత్త్యశ్వ
రథద్విరదసంఘాతసంఘట్టనంబుల వసుంధరాభాగంబు సంచలింపఁ బరశుగదాప్రాస
తోమరభిందిపాలకరవాలప్రముఖపాధనప్రభాజాలంబులు చూడ్కుల మిఱుమిట్లు
గొలుప సముత్తంగతురంగహేషాఘోషంబులును గజబృంహితధ్వానంబులును శింజినీ
టంకారవిరావంబులును రథాంగనిర్భరనినాదంబులును నుద్భటభటపటలకోలాహ
లారావంబులును భేరీపటహకాహళనిస్వనంబులును దిగిభకర్ణపుటంబులం జెవుడ్పడం
జేయఁ గనకమయాందోళికారూఢుండై తరలి చని తద్వనాంతరంబు ప్రవేశించి
యచ్చట.

24


క.

తమి మీఱఁ బారశీకో, త్తమతురగము నెక్కి హాళి దైవాఱ వడిన్
దుమికించి పరువువైచుచు, సముదంచితలీల మెలఁగు సమయమునందున్.

25


ఆ.

మృగయు లడవిఁ దూఱి మిగుల గగ్గోలుగా, సొరిదిఁ గూఁత లిడుచుఁ జొచ్చుటయును
మృగకులంబు బెగడి మొగి బయల్వెడలి భూ, కాంతమౌళిచెంతఁ గదియుటయును.

26


సీ.

పందులఁ జిందఱవందఱగా మోది, దుప్పులఁ బోనీక తునిమివైచి
సారంగముల బీర మారంగ నుగ్గాడి, శశములఁ బనచెడ సమయఁగొట్టి
కడఁతుల నుమ్మడిఁ గడువడిఁ బొరిగొని, యేదులబలితంపుటేపు మాపి
తఱిమి పెల్లునఁ గొండగొఱియలఁ జక్కాడి, మనుఁబోతులను సదమదము సేసి


తే.

కన్నెలేళ్లు నెమిళ్లును గారుకోళ్లుఁ, బోలుగలుఁ గౌఁజు లాదియౌ పులుఁగుగముల
మేటరిగఁ జంపెఁ బరిగొని వేఁటలాడి, చిత్త మిగురొత్త నారాజశేఖరుండు.

27


ఉ.

కొందఱు లేళ్ల దుప్పులను గొందఱు కొందఱు మన్నుఁబిళ్లులం
గొందఱు భల్లుకంబులను గొందఱు బెబ్బులులన్ సివంగులం

గొందఱు కొంద ఱిఱ్ఱులను గొందఱు పందుల నేదుపందులం
గొంద ఱమందశౌర్యమునఁ గూల్చిరి బంట్లు కడంక మీఱఁగన్.

28


క.

కుందేళ్లఁ గొండగొఱియలఁ, బందుల దుప్పులను లేడిపదువుల నిర్లం
జిందఱవందఱగ శునీ, బృందంబులు గఱచి చంపెఁ బెల్లడలంగన్.

29


క.

సేనాధిపు లొకకొందఱు, శ్యేనంబుల విడిచి రాజసింహుఁడు మెచ్చన్
నానావిహగోత్కరముల, సేనగఁ బరిమార్చి యార్చి చెలఁగిరి నెమ్మిన్.

30

నికుండరాజు వనిం జనుచు సుదతిం గని వర్ణించుట

సీ.

అంతట మృగయావిహారంబుఁ జాలించి, వసుధాతలేంద్రుండు వలనుమీఱఁ
దప్తచామీకరోద్యత్పరిష్కారస, మున్నతమేరుశృంగోపమంబు
వజ్రగోమేధికవైడూర్యమరకత, హరినీలపుష్యరాగాబ్జరాగ
మాక్తికప్రముఖాచ్ఛమణిగణసమలంకృ, తము నగుఘనతురంగమము డిగ్గి


తే.

సూర్యసమతేజులును మహాశూరు లనిల, వేగులును దివ్యభూషణాన్వితులువైన
వీరపురుషులతోఁ గూడి విపినవీథి, నెలమి దైవాఱ నందందు మెలఁగుచుండె.

31


సీ.

హారీతశుకశారికారవాక్రాంతంబు, పరభృతకూజితభ్రాజితంబు
సరసగానకళానిశభ్రమద్భ్రమరంబు, ప్రమదనృత్యన్మత్తబర్హిణంబు
నికటసరోహంసనిస్వనాకీర్ణంబు, సాంద్రపుష్పపరాగసంకులంబు
ఫలభారకుసుమస్తబకలసద్భూజంబు, మృదులమరందఝరీపరీత


తే.

మతితరామోదమేదురాత్యంతశీత, లానిలకిశోరవారసమాదృతంబు
నైనయక్కాననంబు భూజాని కపుడు, మోదమును గూర్చె గణితంపుసేదదీర్చి.

32


వ.

అట్లు సుఖావహం బగునవ్వనంబున విహరించుచుం జని చని యొక్కచోట.

33


మ.

కనియెన్ భూపకుమారమాళి యొకరాకాచంద్రబింబాననం
గనకాంగిం గలకంఠకంఠిఁ గలికిం గస్తూరికాసౌరభం
గనదంభోజదళోపమాననయనన్ గంధేభకుంభస్థలిన్
ఘరసారాచ్ఛదరస్మితన్ ఘనకచం గాంతాజనగ్రామణిన్.

34


క.

కని మెల్లన డాయం జని, వనజాయతనేత్రరూపవైభవములకున్
మనమున నద్భుత మొందుచు, జననాయకమౌళి దానిసౌరు నుతించెన్.

35

క.

అద్దిర దీనియొయారం, బద్దివిజవధూమణులకు నహికులపుజగా
ముద్దియలకు మానినినెఱ, ముద్దులగుమ్మలకుఁ గలదె ముల్లోకములన్.

36


చ.

బలురతనంపుగోవ యని పల్కినఁ దావులు సిల్కుచుండె ను
న్గళుకుఁబసిండిబొమ్మ యని కాంచినఁ బల్కులు నేర్చి యుండెఁ గ్రొం
దొలకరిమించుఁదీవ యని తోఁచిన నిల్కడ గల్గి యుండె నీ
కలికికడిందిజవ్వనము కన్నులపండువ యయ్యె నద్దిరా.

37


సీ.

చిన్నారిజాబిల్లి కన్నెమామిడిగున్న, మరునివాల్దూపు చేమంతిబంతి
తళుకుబంగరుబొమ్మ తొలకరికొమ్మించు, కులుకుమిటారి వెన్నెలకొటారు
తెలిముత్తియపుగోవ వెలలేనిమానికం, బలఁతి వెన్నెలనిగ్గు పల్కుఁజిల్క
కపురంపుబరణి చొక్కపునిల్వుటద్దంబు, తావిగేదఁగిపువ్వు తమ్మికొలను


తే.

నాఁగ గొనబారునియ్యెల నాఁగబాగు, నాగగంధర్వయక్షకిన్నరనిలింప
గరుడఖచరాప్సరస్సిద్ధకామినులకుఁ, గలదె పరికింప మూఁడులోకములయందు.

38


సీ.

అలులు లేనెల విండ్లు తిలపుష్ప ముత్సల, దళములు మగఱాలు తమ్మికెంపు
ముకురముల్ శ్రీకారములు దరంబు బిసంబు, లబ్దముల్ జక్కవ లాకసంబు
భుజగంబు తరఁగలు పొన్నపూ వచలంబు, పులినంబు లశ్వత్థదళ మనంటి
కంబముల్ కాహళుల్ కచ్ఛపంబులు తార, కలు పల్లవంబులు కాంచనంబు


తే.

కప్పురము గూర్చి సరసిజగర్భుఁ డిట్లు, చేసెఁ గాఁబోలు నిమ్ముద్దుఁజిగురుఁబోఁడి
నట్లు గాకున్న నీభువనైకమోహ, నాద్భుతాకారవైభవం బవలఁ గలదె.

39


క.

బంగారుబొమ్మతెఱఁగునఁ, బొంగారుచు మదికి నాసఁ బొదలించెడునీ
శృంగారవతివిలాసం, బంగజుపట్టంపురాణికైనం గలదే.

40


సీ.

కరికుంభములతోడఁ గలహంబు గావించి, మారేటిపండ్లతో మచ్చరించి
క్రొవ్విరిచెండ్లతోఁ గొదుకక వాదించి, పసిఁడికుండలతోడఁ బ్రతిఘటించి
గిరిశృంగములతోడ మరలక యెదిరించి, బలుబొంగరాలతోఁ బంతగించి
గజనిమ్మపండ్లతోఁ గవగొని జగడించి, తమ్మిమొగ్గలతోడఁ దారసించి


తే.

ముద్దుజక్కవకవలతో మొగ్గరించి, పొన్నకాయలతోఁ బగల బుండ్రగించి
యతితరం బైనచెలువున నలరె నౌర, యబ్బురంబుగ దీనిచన్గుబ్బదోయి.

41


సీ.

కనకకుంభము లెంతకాఁకచేఁ బెరిఁగిన, దరము లేతెఱఁగున మొరయుచున్న
గరటికే లెంతవంకరగా మెలంగినఁ, గడుఁజక్కిలము లెంత యుడుకుచున్న

భుజగంబు లేరీతిఁ బొర యూని పొరలిన, మృగకులాధిపుఁ డెంత యెగిరిపడినఁ
గలికితేం ట్లెంతఝంకారంబు చూపిన, మీ లెంతపొల సెక్కి మిట్టిపడిన


తే.

నౌర యిక్కొమ్మకుచకంధరోరుకర్ణ, రోమవల్లీవలగ్నశిరోజనయన
ముల నెదుర్కొని యొక్కింత గెలువఁగలవె, మరునిక్రొంబువ్వుములికి య య్యరిదికలికి.

42


వ.

అని కొనియాడుచున్నసమయంబున.

43

సుదతి నికుండరాజుం గని వలచి వర్ణించుట

క.

రాజానన గనుఁగొనియె వి, రాజన్మణిభూషణాభిరామశరీరున్
రాజకుమారున్ జితసుర, రాజకుమారేందురాజ రాజకుమారున్.

44


క.

వనజాతనయన యటువలెఁ, గనుఁగొని యెనలేనివలపు గడలుకొనఁగ నా
తనిచెలువమునకుఁ దద్దయుఁ, దనమదిలో నద్భుతంబు దనరారంగన్.

45


క.

కంతుఁడొ మఘవసుతుండొ వ, సంతుఁడొ నలకూబరుండొ జలజాహితుఁడో
సంతస మయ్యె నహా యి, క్కాంతాజనమోహనాంగుఁ గనుఁగొన్నంతన్.

46


సీ.

దరములఁ దఱుమునిద్దంపుఁగుత్తుకవాఁడు, హరినీలముల నేలు కురులవాఁడు
గజతుండముల మించు భుజదండములవాఁడు, గురుకవాటముఁ బోలు నురమువాఁడు
చిగురుటాకుల నెన్ను తొగరువాతెరవాఁడు, గబ్బిసింగము గెబ్బు కౌనువాఁడు
తమ్మిఱేకులఁ బాఱఁజిమ్ముకన్గవవాఁడు, మినుకుబంగరుఁ గేరు మేనివాఁడు


తే.

జాతిమగఱాలఁ దెగడుపల్ చాల్పువాఁడు, చికిలిక్రొమ్మించుటద్దంబుఁ జిన్నవుచ్చు
చెక్కుఁ గలవాడు బళిర యీక్షితివరుం డ, టంచు నాతనిసోయగం బెంచుచుండె.

47


క.

అపు డానృపతనయునిపైఁ, జపలేక్షణపై మరుండు సమసుమశరముల్
శపథం బూని పొరింబొరి, విపరీతము గాఁగ నేసి వివశులఁ జేసెన్.

48

నికుండరాజు సుదతిం దనపురికిఁ గొనిపోవుట

వ.

అప్పు డప్పుడమిఱేఁ డచ్చేడియం గనుంగొని యిట్లనియె.

49


ఉ.

ఎక్కడిదాన వీవు కమలేక్షణ నీవు వసించునున్కిప
ట్టెక్కడ నీమనోరమణుఁ డెవ్వఁడు నీతలిదండ్రు లెవ్వ రీ

చక్కనిజాళువాపసిఁడిచాయలఁ గేరెడు మేను గందఁగా
నొక్కతె విక్కడం దిరుగుచుండఁగఁ గారణ మేమి చెప్పుమా.

50


సీ.

అనిన నచ్చాన యనంగనారాచసం, తప్తయు నాచ్ఛాదితస్వదేహ
లతికయ నిర్భరలజ్జానిమీలిత, నయనయు నై మహీనాథు సారెఁ
గడగంటిచూపులఁ గనుఁగొంచు నొకతరు, పార్శ్వంబునం దుండి పాదపంబు
కొనగోళ్ల వాయించుకొనుచు నౌదల వాంచి, యొక్కింత మాటాడ కూరకుండె


తే.

వీతరాగుండు తత్త్వసంవిదుఁడు నిస్పృ, హుండు నగు నారదుం డప్పు డోలి రాగ
కామలజ్జాధికత్వముల్ గలిగియుండె, నహహ దైవకృతం బెన్న నద్భుతంబు.

51


వ.

అని యగస్త్యుండు వెండియు శౌనకున కిట్లనియె న ట్లయ్యాగంతుకాంగనారత్నంబు
మదనవిహ్వలమానస యగు టెఱింగి తానును మదనావిష్టుం డై నృపాలుండు దాని
కిట్లనియె.

52


తే.

వనజముఖి నీవు కన్యక వనుచు మదిని, దోఁచుచున్నది చూడ నద్భుతము నీదు
రూప మిట న న్వరింపు మారూఢవాంఛ, సఫల మగుఁ జుమ్ము నీయెలజవ్వనంబు.

53


సీ.

కలహంసగామిని కరటికుంభస్తని, కర్పూరదరహాస కంబుకంఠి
కలకంఠకలవాణి కాహళికాజంఘ, కహ్లారదళపాణి కమలవదన
కాసారనిభనాభి కంఠీరవవలగ్న, కనకకోరకనాస కైరవాక్షి
కస్తూరికాగంధి కచ్ఛపచరణాగ్ర, కార్ముకభ్రూవల్లి కాంచనాంగి


తే.

కదళికాస్తంభరుచిరోరుకాండయుగళ, కల్పభూజాతనవలతాకలితబాహ
కాలజీమూతనీకాశఘనశిరోజ, కామినీమణి ననుఁ బ్రేమఁ గవయు మిపుడు.

54


క.

కొమ్మా నెమ్మది నాతో, రమ్మా వూపురికి సకలరాజ్యంబును నీ
సొమ్ముగఁ జేసెద ననుఁ జే, కొమ్మా మరుకేలి నేలుకొమ్మా నెమ్మిన్.

55


తే.

అనుడు నబ్భూమిపరుమాట లాలకించి, మెత్తఁబా టూని యన్నులమిన్న కన్ను
నన్నల నలంతినవ్వుల నున్నతెఱుఁగు, వన్నె దైవాఱ నెఱిఁగించి మిన్నకుండె.

56

వ.

అప్పు డమ్మహీతలవల్లభుండు దానికరంబు పట్టుకొని సుఖాసనంబునం గూర్చుండం
జేసి యమందానందకందళితహృదయారవిందుం డగుచు వరూథినీపరివృతుండై దివ్య
తూర్యఘోషంబులు సెలంగ నిజపట్టణంబు ప్రవేశించి.

57

నికుండుఁడు సుదతితో నిష్టోపభోగము లనుభవించుట

తే.

అంత నంతఃపురంబున కరిగి దివ్య, మందిరంబున నవ్వధూమణిని నిలిపి
యిందుముఖిఁ గూడుకొన నెపు డెప్పు డంచు, నురుతరామోదహృదయఁఁడై యుండె నంత.

58


సీ.

తరణి పశ్చిమసముద్రప్రాంతమునఁ గ్రుంకె, గడితంపుసాంధ్యరాగంబు పర్వెఁ
గటికిచీఁకటులు దిక్తటముల గిఱికొ నెఁ, దార లంబరవీథి దళముకొనియెఁ
గొలఁకులఁ దొగలును గలువలు వికసించె, జలజాతవిసరముల్ దలలు వాంచెఁ
గుముదబంధుఁడు తూర్పుగుబ్బలి నుదయించెఁ, గోకదంపతు లార్తిఁ గూరి పఱచెఁ


తే.

జెలఁగి బలితంపుఁబండువెన్నెలలు గాసె, విటవిటీజను లెనలేనివేడ్కతోడఁ
దవిలి విహరింపఁ జాగి రుద్దామలీల, నఖిలజంతుసుఖావహం బయ్యె నపుడు.

59


సీ.

పవడంపుఁగోళ్లచప్పరపుమంచము హంస, తూలిక నించిన పూలపఱుపు
ప్రక్కద్రిం డ్లలఁతిహొంబట్టుతలాడ మా, నికపుఁగీల్బొమ్మలు నిలువుటద్ద
ములు తావిసురటీలు మొకమాలుచందువా, మేలిముత్యాలజాలీలు పసిఁడి
దివ్వెగంబములు క్రొంజవ్వాజివంకిణీ, లడపంబు గందంపుగుడిక లగరు


తే.

కరవటంబులు కస్తురిబరణి తమ్మ, పడగ యత్తరుకుప్పెలు పైఁడిగద్దె
వీటికాపేటికలును బన్నీటిగిండ్లుఁ, కలిగి వెలుఁగొందు కేళికాగారమునను.

60


క.

కాంతారత్నముతో భూ, కాంతాగ్రేసరుఁడు ప్రేమ గడలుకొనంగాఁ
గంతుక్రీడావైభవ, సంతుష్టస్వాంతుఁ డగుచు నరవిఁ జెలంగెన్.

61


వ.

మఱియును.

62


తే.

రత్నశయ్యావితానవిరాజమాన, మందిరంబుల మణికుట్టిమస్థలములఁ

బుష్పవనములఁ బ్రాసాదములఁ గడంక, నువిదయును దాను గ్రీడించుచున్నయంత.

63


క.

ఆఱేఁడుఁ జెలియుఁ గూరిమి, మీఱఁగ సుఖలీల నట్లు మెలఁగఁగ వరుసన్
నూఱుగురు సుతులు వుట్టిరి, తాఱనిగడితంపుఁగడిమిఁ దనరెడుబలిమిన్.

64

సుదతిమగఁడును గొడుకులును యుద్ధములోఁ జచ్చుట

వ.

వారందఱు నతితరసత్త్వసంపన్నులు నఖండవీరపరాక్రములు నపరిమితతేజోవిరాజి
తులు నభినవయౌవనారంభులు నశేషశస్త్రవిద్యావిశారదులు నై ప్రవర్తించుచున్న
సమయంబున నొక్కనాఁడు.

65


సీ.

అపరాబ్ధితీరంబునందు రిపుంజయుఁ, డనురాజు దనరు నన్వర్థనామ
కుఁడు తదాత్మజులు ముగ్గురు పరంతపపరా, స్కందులు పరవిశోషకుఁ డనంగ
వెలయుదు రమ్మహావీరవర్యులు ప్రాక్ప, యోధిజిగీషఁజమూరుగణస
మేతులై వచ్చి సమీపధాత్రీభాగ, మున దండు విడియించి మొనయుటయు ని


తే.

కుండనరపతి నిజపుత్త్రకులును దాను, బేర్మిఁ జతురంగబలసముపేతుఁ డగుచుఁ
దరలి మొనకట్టి ఘోరయుద్ధంబు చేసె, నప్పు డుభయబలంబులు ననికిఁ దొడరి.

66


క.

పరశుగదాపట్టిసము, ద్గరతోమరభిందిపాలకౌక్షేయశర
చ్ఛురికాదిసాధనంబులఁ, గర మరుదుగ భటులు దుమురు గావించి రొగిన్.

67


క.

పృధుబలసంయుతులు జగ, త్కథితమహాయశులు ఘోరగర్వోద్ధతులుం
బ్రధనజయదర్పితులు నగు, రథికులు పోరాడి రధికరభసం బెసఁగన్.

68


తే.

చిత్రవైఖరి నిశితకౌక్షేయకములు, పెఱికి జవఘోటకంబులఁ బఱపి బిట్టు
నఱకు లాడిరి రాహుతు లుఱక నిబిడ, రక్తధారాప్రవాహం బురవడిఁ బర్వ.

69


క.

గిరులును గిరులును దార్కొను, కరణిన్ మదవారణములఁ గదనంబునకుం
బురికొల్పి వేటులాడిరి, కరివాహకు లపు డఖర్వగర్వోద్ధతు లై.

70


వ.

మఱియుం దురగఖురపుటాంచలోద్ధూతస్ఫీతధరాపరాగరింఛోళిచ్ఛాదితారుణాంశు
మండలం బగునబ్భండనంబు భూరిభేరీపటహనిస్సాణకాహళారవంబువలనను వీరభటో
త్కటసింహనాదంబువలనను నిష్ఠురధనుష్టంకారంబువలనను మదోన్నిద్రభద్రదంతావళ
బృంహితంబువలనను సముత్తుంగతురంగహేషారవంబువలనను నసంఖ్యశంఖనాదంబు
వలనను నభంగశతాంగనిర్ఘోషంబువలనను గ్రందుకొని రోదోంతరాళంబు బధిరీకృతం

బై యుండె నందు ఘోరంబుగఁ బో రొనరించి కరితురగవీరభటనికాయంబులు
కాయంబులం బాసి పడియున్న సంగరాంగణంబు పుష్పితపలాశారణ్యంబుతెఱంగునం
బొలిచె రక్తధారాప్రవాహంబు లుప్పొంగి యంబునిధికి జాగి పాఱె నప్పుడు.

71


తే.

రాజు లెదిరించి ఘననమరాజిరమున, నందఱును మ్రగ్గుటయు నికుండాధిపతియుఁ
దారసిలి బిట్టు ఘోరయుద్ధంబు చేసి, కొడుకుఁగుఱ్ఱలతోఁ గూడి పుడమిఁ గూలె.

72

చచ్చినమగనినిగుఱించియుఁ గొడుకులగుఱించియు సుదతి యేడ్చుట

ఉ.

అంత నికుండమానవధరాగ్రణిచేడియ తత్ప్రకార మా
ద్యంతము వీనుల న్విని రయంబున నాహవభూమి కెంతయు
న్వంత దలిర్ప నేఁగి కదనస్థలిఁ ద్రెళ్లినపాణనాయకున్
బంతిగఁ గూలియున్నసుతవర్గముఁ గన్గొని శోకమగ్న యై.

73


క.

హానాథ హామనోహర, హానిరుపమధర్మశీల యమితవిభోగా
హానరపాలశిఖామణి, దీనునిక్రియ నిట్లు ద్రెళ్లితే కద నోర్విన్.

74


తే.

అమలమణిమయభర్మహర్మ్యాంతరమునఁ, దతమృదులహంసతూలికాతల్పమున సు
ఖించునీయొడ లీరణక్షితిని బొరలు, చున్న దిపు డేమి సేయుదుఁ జెన్ను దఱిఁగి.

75


వ.

అని కుమారవర్గంబు గనుంగొని పయింబడి ముంగురులు సెదరఁ గరంబుల నౌదల
మోఁదుకొనుచు నెలుం గెత్తి హాబిడ్డలారా యిట్టిఘోరదురవస్థం బొందితిరే యని
వెక్కి వెక్కి యేడ్చుచుఁ బుడమిం బడి పొరలాడుచు నుస్సురనుచు నుమ్మలించుచు
సొమ్మగొనుచు ధూళిధూసరశరీర యై పెద్దయుందడవు దుఃఖించి బడలి యడలుచు క్షు
త్పిపాసాపరవశ యై యేమియుం దోఁపక వనంబునఁ ద్రిమ్మరుచున్నసమయంబున.

76

సుదతి యాఁకలిగొని మామిడిపండు గోయంబూనిన నది యెట్లును నందకుండుట

తే.

సౌకుమార్యంబుఁ దేజంబు సౌష్ఠవంబు, సౌరభంబును గల్గి యాశ్చర్యలీల
నలరు నొకచూతఫల మందుఁ గలుగఁజేసె, హరి యదియు నట్టు లాఁకటఁ దిరిగి తిరిగి.

77

క.

చేరువ నమ్మామిడిపం, డారూఢిగఁ గొమ్మయందు నందినయటులే
తోరముగఁ గానిపించినఁ, గోరికఁ జే సాఁచి యందుఁ గొనఁబోవుటయున్.

78


తే.

ఫల మొకించుకయెడఁ గనంబడి కరమున, కందకుండిన వే నిక్కి యవ్వధూటి
కోర్కి నప్పుడు వెండియుఁ గోయఁబోవ, నటులె యెడఁ జూపి కేలికి నంద దయ్యె.

79


వ.

అప్పు డప్పొలఁతి నితాంతజఠరానలసంతప్తసకలావయవ యగుచు సమీపంబునం
బడియున్నపుత్త్రకు నొక్కనిం దెచ్చి వైచి యెక్కి యందుకోనం బోయినఁ దత్ఫలం
బందక యంతరంబు గలిగియుండె నట్లు క్రమక్రమంబునఁ బుత్త్రశతంబు సోపానపద్ధ
తిఁ గావించి కోయంబోవుచున్న నది యెప్పటియట్ల యందకున్న నత్యంతదీనానన యై
కన్నుల నశ్రుకణంబు లురల నేమియుం దోఁపక చీకాకుపడి ఫలం బెగదిగం
జూచుచున్నసమయంబున.

80

విష్ణువు వృద్ధవిప్రుఁడై వచ్చి సుదతికి మేలు చేసి యంతర్హితుం డగుట

సీ.

చినిఁగిననీర్కావిచిన్నదోవతియును, దట్టంపుఁదెలిజన్నిదములగుంపు
రదనహీనవిశాలవదనగహ్వరమును, రహి మించుదండంబు రాగిచెంబు
దళముగా నరసిన తలయు గడ్డంబును, జెప్పులు దావళి దుప్పటియును
మడతలఁ దేఱుచామనిచాయనెమ్మేను, మందయానము జపమాలికయును


తే.

గొనబుమీఱెడుగోపిచందనమృదూర్ధ్వ, పుండ్రమును గల్గి యప్పుడు భూసురోత్త
మాకృతి ధరించి చెచ్చెర నచ్చెరువుగ, వచ్చె నచ్చటి కిందిరావల్లభుండు.

81


క.

చనుదెంచి యశ్రుముఖియును, ఘనశోకాన్వితయు క్షుద్వికారార్తయు నై
వనిఁ ద్రిమ్మరునమ్మానినిఁ, గని యావృద్ధద్విజుండు కరుణం బలికెన్.

82


క.

ఏమిటి కేడ్చెద వివ్వన, భూమిం ద్రిమ్మరుచు ముగుద పొలఁతీ మూలం
బేమి యిటు లార్తి నడలఁగ, నీమదిఁ గలవగపుతెఱఁగు నిక్కమ చెపుమా.

83


తే.

అనుడు సతి పల్కె నీ వెందు నరుగఁగలవొ, పొమ్ము నాతోడ నీ కేల భూసురేంద్ర
యని తిరస్కారముగ వచించిన నతండు, హితవచోరూఢి వెండియు నిట్టు లనియె.

84


తే.

వనిత యిటు లొక్కతెవు నీవు వనములోన, నలమటించుచుఁ దిరుగుట యరసి చూచి
తెలిసికొనిపోవు టుచితరీతిగఁ దలంచి, వచ్చితి నెఱుంగఁ జెప్పు నీవర్తనంబు.

85


సీ.

అనవుడు నచ్చాన యతని కిట్లని పల్కె, విను భూసురేంద్ర నా విన్నపంబు
సూర్యోపమానతేజోనిధి యైనని, కుండధాత్రీనాథకుంజరునకు

భార్య నై బహుభోగభాగ్యంబు లారూఢి, ననుభవించుచు మనోజాకృతులును
శస్త్రాస్త్రవిద్యావిశారదు లగునూర్వు, రాత్మజులను గాంచి యతితరప్ర


తే.

హర్షమునఁ గ్రాలుచో నిపు డాహవాంగ, ణమున మగఁడును గొడుకులు విమతవరుల
చేత హతు లైనఁ దద్వియోగాతత్వార్తి, దుఃఖమున నిందుఁ దిరిగెద దొసఁగు లెసఁగ.

86


తే.

అంతకంటెను ఘనతరం బగుక్షుదార్తిఁ, దివిరి వనియెల్ల నెముకుచుఁ దిరిగితిరిగి
యక్కజంబుగఁ గొమ్మపై నొక్కమావి, పండు గనుఁగొంటిఁ గన్నులపండువుగను.

87


క.

ఆపండు గోయఁబోయిన, నేపగిదిన్ దొరకకున్న నెడ యొదవనిసం
తాపమున బడలుచుండితిఁ, దాపసవర నాయవస్థ దైవం బెఱుఁగున్.

88


వ.

అనిన నాద్విజపుంగవుం డంగనామణి కిట్లనియె.

89


తే.

పతితనూజవియోగార్తి బడలుచుండి, యతితరం బైనక్షుద్బాధ నడలుచుండి
యశుచితో నుండి పండు గోయంగఁ జనిన, నబ్బునే బేల యిత్తెఱఁ గర్హ మగునె.

90


తే.

సరసి కేతెంచి యందుల స్నాన మాడి, నిర్మలస్వాంత వై యున్న నీకు నపుడె
సకలదుఃఖాపహారి యౌ సత్ఫలంబు, కరతలాగత మగుఁజుమ్ము కమలవదన.

91


వ.

అనిన నమ్మగువ యిట్లనియె.

92


క.

దీనజనావన కరుణాం, భోనిధి నాతండ్రి నీకుఁ బుత్త్రిని న న్నీ
మాననియాఁకట బడలం, గానీయక వేగ ప్రోది గావింపఁగదే.

93


తే.

అనఘ స్నానంబువలన నయ్యబ్బురంపు, ఫలము చేతికి నెట్లు రాఁ గలదు పుణ్య
సరసి యెచ్చోట నున్నది సరగ నాకుఁ దెలుపవేయని మ్రొక్కి ప్రార్థించుటయును.

94


ఆ.

బ్రాహ్మణుండు పలికెఁ బరమదయాళుఁడై, ముగుద యనతిదూరమున సమగ్ర
నిర్మలోదకముల నెరయుచు నొకకమ, లాకరంబు లీల నలరుచుండు.

95


తే.

కుముదకహ్లారకువలయకోకనదస, రోరుహేందీవరాకీర్ణ మై రణన్మ
దాళిసంకీర్ణమై కౌంచహంసకోక, సంకులంబయి నెఱి నక్కొలంకు దనరు.

96


సీ.

కుంద చందన పిచు మంద వందక పట, మందార తిందుక సిందువార
గాల వాంకోలతక్కోల తమాల హిం, తాల తాల రసాల సాల తూల

కురువక మరువక సరళ క్రకర పుర, కరవీర ఖది రామ్లికా కరీర
నారంగ లికుచ ఖర్జూర జంబీర హ, రీతికీ కేతకీ మాతులుంగ


తే.

పనస ఘనసార కదళికా ప్రముఖవివిధ, ఫలకుసుమగుచ్ఛకిసలయభరనమత్ప్ర
కృష్ణభూజాతజాతప్రకీర్ణ మగుచు, వఱలుఁ దత్తీరమున నొక్కవనము తరుణి.

97


మ.

సరసీనిర్మలనీరబిందుకణముల్ సమ్యగ్గతిం బూని వి
స్ఫురదారామలతాంతసౌరభరజఃపుంజంబుఁ గైకొంచు ని
ర్భరమందానిలశాబకప్రకరముల్ పల్మాఱు నక్కోనలోఁ
దిరుగుం బాంధజనశ్రమాసహరణోద్వృత్తిం బ్రకాశించుచున్.

98


తే.

తరుణీ నీ వచ్చటికి నేఁగి తత్తటాక, నీరముల స్నాన మొనరింప నీకు ఫలము
చేతి కబ్బును బొ మ్మంచుఁ బ్రీతిఁ జెప్పి, యంత నంతర్హి తుం డయ్యె నాద్విజుండు.

99


వ.

అని కుంభసంభవుండు శౌనకమునీంద్రునకుం జెప్పిన నతం డతని నవ్వలికథావిధానం
బెట్లని యడుగుటయును.

100


శా.

పారావారవిహార హారహిమరుక్పాటీరడిండీరమం
దార క్షీర తుషార పారద మరుద్గంధేభ తారా సుధా
పూరేందూపల హీర సార శరదంభోదాభ్రగంగానదృ
గ్గౌరస్ఫారయశఃప్రసార హితసంఖ్యావత్కులోద్ధారకా.

101


క.

శంఖార్బుదసంఖ్యాహిత, పుంఖప్రాణాపహరణ భూరిరణాంచ
ఛ్ఛంఖగదాచక్రాయుధ, శంఖాణీకృతపరిష్ఠ గరుడశ్రేష్ఠా.

102


మాలిని.

కథితశుభచరిత్రా కంజమిత్రాబ్జనేత్రా
మథితఖలసమాజా మండితాఖండతేజా
పృథులగుణవిహారా కృత్తమత్తారివీరా
ప్రథనవిగతశంకా పక్షిరాజోజ్జ్వలాంకా.

103

గద్యము. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్య
ధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్యపుత్త్ర
సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ
తిమ్మకవిపార్వభౌమప్రణీతం బైనసర్పపురక్షేత్ర
మాహాత్మ్యం బనుపుణ్యచరిత్రంబునందు
ద్వితీయాశ్వాసము.