పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సమాధి పాదము)
జ్ఞానము. :



1. అథ యోగానుశాసనమ్

మార్చు

(అథ యోగ అను శాసనమ్) - యోగసాధన విధానము తెలుసుకొనుటకిది సమయము (సాధకుని జీవితంలో తగిన సమయము)

2. యోగశ్చిత్త వృత్తి నిరోధః

మార్చు

(యోగః చిత్తవృత్తి నిరోధః) - యోగమంటే చిత్తవృత్తులను నిరోధించడం.

నిరోధమంటే యోగసాధనకంతరాయమైన చిత్తవృత్తులను గుర్తించి, వాటిప్రభావములకు లోను కాకుండా యోగసాధన కొనసాగించడం.

3.తదా ద్రష్టుస్స్వరూపేఽవస్థానమ్

మార్చు

(తదా ద్రష్టుః స్వరూపే అవస్థానమ్) - ఆ విధంగా చిత్తవృత్తులనధిగమించగలిగిన వాడు యోగస్థితిలో తనను తాను దర్శించగలడు.

4. వృత్తి సారూప్యమితరత్ర

మార్చు

(వృత్తి సారూప్యమ్ ఇతరత్ర) - ఇతరులాచిత్తవృత్తులే తామనుకుంటూ వాటిప్రభావాలకి లోనై, ప్రవర్తిస్తారు.

5. వృత్తయః పంచతయ్యః క్లిష్టాఽక్లిష్టాః

మార్చు

(వృత్తయః పంచతయ్యః క్లిష్టాః అక్లిష్టాః) - ఈ చిత్తవృత్తులైదు విధములు. తేలికగానధిగమించగలిగినవి కొన్ని. శ్రమతో కూడినవి కొన్ని.

6. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః

మార్చు

అవి - సత్యము, సత్యము అనిపించే అసత్యము, భ్రాంతి (ఊహాజనితము), నిద్ర, స్మృతి


7. ప్రత్యాక్షానుమానాఽగమాః ప్రమాణాని

మార్చు

(ప్రత్యక్ష అనుమాన ఆగమాః ప్రమాణాని) - ప్రమాణములు ప్రత్యక్షముగా చూచినవి (తెలుసుకొన్నవి), తర్కముద్వారా తెలుసుకొన్నవి, పరంపరానుగతముగా శాస్త్రములలో సత్యముగానంగీకరించబడినవి.

8. విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూపప్రతిష్ఠమ్.

మార్చు

(విపర్యయః మిథ్యా జ్ఞానమ్ అతత్ రూప ప్రతిష్టమ్) - అసత్యమును సత్యమని భ్రమ పడడం విపర్యయము.


9. శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యః వికల్పః

మార్చు

(శబ్ద జ్ఞాన అనుపాతీ వస్తుశూన్యః వికల్పః) - వస్తువు శబ్దమాలంబనగా రూపాన్ని సంతరించుకుంటున్నది. వస్తువు లేకపోతే పదానికర్థం లేదు. వస్తువు శూన్యమయినప్పుడు (లేనప్పుడు) శబ్దమునే వస్తువనుకోడం వికల్పం.

10. అభావ ప్రత్యయాఽలంబనా వృత్తిర్నిద్రా.

మార్చు

(అభావ ప్రత్యయ ఆలంబనా వృత్తిః నిద్రా) - పరిసరములను గమనించకుండా తామస ప్రవృత్తిలో వుండడం నిద్ర.

11. అనుభూతవిషయాఽసంప్రమోషః స్మృతిః

మార్చు

(అనుభూత విషయాః అసమ్ప్రమోషః స్మృతిః) - అనుభూతమయిన విషయములు మనసుపై వేసిన ముద్రలే స్మృతులు లేక వాసనలు.

12. అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః

మార్చు

(అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధః) - ఈ వృత్తులను నివృత్తి చేయడం (అదుపులో వుంచడం) అభ్యాసమువలన, వైరాగ్యమువలన సాధ్యం.

13. తత్ర స్థితౌ యత్నాభ్యాసః

మార్చు

(తత్ర స్థితౌ యత్నః అభ్యాసః) - ఆ స్థితి ప్రయత్నము వలన సాధ్యం.

14. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాఽసేవితో దృఢభూమిః

మార్చు

(స తు దీర్ఘకాల నైరంతర్య సత్కారః ఆసేవితః దృఢభూమిః) - ఆ సాధన దీర్ఘ కాలమంతరాయాలు లేకుండానూ, భక్తిప్రమత్తులతోనూ కొనసాగించినప్పుడు మాత్రమే సుస్థిరంగా సాగుతుంది.

15. దృష్టాఽనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం

మార్చు

(దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యమ్) - తాను చూస్తున్నవి, పరంపరానుగతంగా వింటున్నవైయిన విషయాలలో యిచ్ఛ లేకపోవడమే వైరాగ్యం (వైరాగ్యానికి చిహ్నం).

16. తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యమ్.

మార్చు

(తత్ పరం పురుష¬ ఖ్యాతే గుణ వైతృష్ణ్యమ్) - త్రిగుణాలలో (సత్వ, తమస్సు, రజస్సు) విముఖుడయిన సాధకునికి పరమ పురుషునిగూర్చి కలిగిన జ్ఞానమే పరమోత్తమ జ్ఞానము.


17. వితర్క విచారాఽనందాస్మితాస్వరూపానుగమాత్సంప్రజ్ఞాతః

మార్చు

(వితర్క విచార ఆనంద అస్మితా స్వరూప అనుగమాత్ సంప్రజ్ఞాతః) - తర్కం, నిశిత పరిశీలన, బ్రహ్మానందము, అహమిక(అస్మిత) – ఈ నాలుగు పద్ధతులు ప్రజ్ఞతో కూడిన సమాధికి మార్గములు. ఈ పద్ధతిలో సాధించిన స్థితి సబీజసమాధి. ఈ స్థితిలో "నేను సమాధిస్థితిని పొందాను" అన్న యెఱుక వుంది.

18. విరామప్రత్యయాభ్యాసపూర్వస్సంస్కారశేషోఽన్యః

మార్చు

(విరామ ప్రత్యయ అభ్యాసపూర్వః సంస్కారశేషః అన్యః) - ఎఱుకతో ప్రయత్నం చేస్తూ యితర సంస్కారాలను (చిత్తవృత్తులను) వెనుకకు మళ్ళించి సాధన చేయడం మరొక పద్ధతి.

19. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానామ్

మార్చు

(భవ ప్రత్యయః వి దేహ ప్రకృతి లయానామ్) - ప్రకృతిలో లయమయినవారికి, విదేహులకు (స్థూలశరీరము నశించినతరవాత మిగిలిన సంస్కారశేషము) మరు జన్మలో సమాధిస్థితి లభిస్తుంది. (ఈ సమాధిస్థితి వెనకటిజన్మలో సమాధి కంటే పైస్థాయైయినా, సంపూర్ణ సమాధి కాదు.)

20. శ్రద్ధావీర్యస్మృతిసమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషామ్

మార్చు

(శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞా పూర్వకః యితరేషామ్) - తదితరులు శ్రద్ధ, తేజస్సు, తపోబలం, స్మృతులు, జ్ఞానముద్వారా క్రమంగా సమాధి స్థితి సాధించగలుగుతారు.

21. తీవ్రసంవేగానామాసన్న:

మార్చు

(తీవ్ర సంవేగానాం ఆసన్నః) - తదేకదృష్టితో నిష్ఠతో సాధన చేసేవారికి సంప్రజ్ఞత త్వరితగతిని సిద్ధిస్తుంది.

22. మృదు మధ్యాధిమాత్రత్వాత్తతోఽపి విశేషః

మార్చు

(మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతః అపి విశేషః) - ఆ సాధన మూడు స్థాయిలలో సాగవచ్చు – అచంచల దీక్షతో, మధ్యమస్థాయిలో, లేదా అతి సాధారణస్థాయిలో.

23. ఈశ్వర ప్రణిధానాద్వా

మార్చు

(ఈశ్వర ప్రణిధానాత్ వా) - ఈశ్వరునియందు తదేకనిష్ఠ నిలిపి ధ్యానించడం ద్వారా కూడా చేయవచ్చు.


24. క్లేశకర్మవిపాకాఽశాయైరపరామృష్ట పురుషవిశేషేశ్వరః

మార్చు

(క్లేశ కర్మవిపాక ఆశాయై అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః) - దుఃఖము, కర్మఫలములు, పూర్వజన్మలో సంతరించుకున్న స్మృతుల తాలూకు ఛాయలు – వీటికన్నింటికతీతుడయిన పరమపురుషుడే, ఈశ్వరుడు.

25. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం

మార్చు

(తత్ర నిర్ అతిశయం సర్వజ్ఞ బీజమ్) - ఆ పరమపురుషునిలో సంపూర్ణ జ్ఞానబీజము ప్రతిష్ఠమై వున్నది.

26. స ఏషః పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్

మార్చు

(పూర్వేషాం అపి గురుః కాలేన అనవచ్ఛేదాత్) - ఆ పరమపురుషుడు యే వొక్క కాలానికి చెందనివాడు. అంటే పరంపరానుగతంగా వస్తున్న గురువులందరికీ కూడ యతడే గురువు.

27. తస్య వాచకః ప్రణవః

మార్చు

- ఓంకారము ఈశ్వరునికి సంజ్ఞాపూర్వకమైన శబ్దము.


28. తజ్జపస్తదర్థభావనమ్.

మార్చు

(తత్ జపః తత్ అర్థ భావనమ్) ఈశ్వరభావమునందు దృష్టిని నిలిపి ఓంకారమును సదా జపించాలి.

29. తతః ప్రత్యక్చేతనాధిగమోఽప్యంతరాయాభావశ్చ

మార్చు

(తతః ప్రత్యక్ చేతన అధిగమః అపి అంతరాయ అభావః చ) - ఆ జపముద్వారా సాధకుని చేతనంతర్ముఖమై ఆటంకాలనధిగమించగలదు.

30. వ్యాధి స్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాంతిదర్శనాలబ్ధభూమికత్వానవస్థిత్వాని చిత్తవిక్షేపాస్తేంతరాయాః

మార్చు

(వ్యాధి స్త్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతిదర్శన అలబ్ధభూమికత్వ అనవస్థిత్వాని చిత్తవిక్షేపాః తే అంతరాయాః) - వ్యాధి, తామసం (కాలయాపన), సంశయం, నిర్లక్ష్యం లేక అలసత్వం, భోగలాలసత, అవాస్తవాన్ని వాస్తవంగా భ్రమించడం, యోగసాధన యేకోన్ముఖంగా కొనసాగించలేకపోవడం, స్థిరత్వం లోపించడం – యివన్నీ యోగసాధనకాటంకాలు.

31. దుఃఖ దౌర్మనస్యాంగమే జయత్వశ్వాసప్రశ్వాసా విక్షేప సహభువః

మార్చు

( దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాసాః విక్షేపసహ భువః) - దుఃఖము, నిస్పృహ (నిరాశ), శరీరంలో వణుకు, క్రమబద్ధం కాని వుచ్ఛ్వాసనిశ్వాసాలు. – ఇవి మనసుని నిలకడ లేకుండా చేస్తాయి.

32. తత్ప్రతిషేధార్థమేకతత్త్వాభ్యాసః

మార్చు

(తత్ ప్రతిషేధ అర్థం ఏక తత్త్వ అభ్యాసః) వీటినధిగమించి ధ్యానం కొనసాగించడానికి సాధకుడొక పద్ధతినెంచుకుని యా పద్ధతిలో దృఢచిత్తంతో సాధన కొనసాగించాలి.

33. మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనాతః చిత్తప్రసాదనమ్.

మార్చు

(మైత్రీ కరుణా ముదిత ఉపేక్షాణాం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణాం భావనాతః చిత్త ప్రసాదనమ్) - సుఖదుఃఖాలు, పాపపుణ్యాలవిషయంలో వుదాసీనతతోనూ, స్నేహం, కరుణ, ప్రసన్నతవంటి సుగుణాలతోనూ వుంటే చిత్తము ప్రశాంతమై యోగసాధన సాగుతుంది.

34. ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య

మార్చు

- ఉచ్ఛ్వాసనిశ్వాసాలను నియంత్రించి కూడా చిత్తమునదుపులోనుంచుకొనవచ్చు.

35. విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా మనసః స్థితినిబంధినీ

మార్చు

(విషయవతీ వా ప్రవృత్తిః ఉత్పన్నా మనసః స్థితినిబంధినీ) - ఇంద్రియాలద్వారా పొందే యనుభూతులలోనొకదానిపై చిత్తమును స్థిరంగా నిలపడంద్వారా కూడ యితర విషయాలనుండి దృష్టి మరలి చిత్తము స్థిరము కాగలదు.

36. విశోకా వా జ్యోతిష్మతీ

మార్చు

- దుఃఖానికతీతమైనంతర్జ్యోతి మీద దృష్టి నిలపడానికి ప్రయత్నించడం మరో పద్ధతి.

37. వీతరాగ విషయం వా చిత్తమ్

మార్చు

- మమతానురాగములను వదులుకోడంద్వారా కూడా స్థిరచిత్తము కలుగుతుంది.


38. స్వప్న నిద్రా జ్ఞానాఽలంబనం వా

మార్చు

(స్వప్న నిద్రా జ్ఞాన ఆలంబనమ్ వా) - స్వప్నములు లేని గాఢనిద్రద్వారా లేదా నిద్రలో వచ్చిన కలలను విశ్లేషించుకోవడంద్వారా కూడా చిత్తశాంతిని పొందవచ్చు.


39. యథాఽభిమత ధ్యానాద్వా

మార్చు

(యథా అభిమత ధ్యానాత్ వా) - ఎవరికి వారు తమకనుకూలమైన పద్ధతిలో చిత్తమును దృఢపరుచుకొనవచ్చు.

40. పరమాణు పరమ మహత్వాంతఽస్య వశీకారః

మార్చు

(పరమ అణు పరమ మహత్వ అంతః అస్య వశీకారః) - ఆ అభ్యాసమువలన సాధకునికి అణువునించి బ్రహ్మాండంవరకూ సమస్తమూ స్వాధీనము కాగలదు. అంటే చిత్తవృత్తుల ప్రభావమునుండి తప్పుకుని, సాధన కొనసాగించగలడు.


41. క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేః గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్థ్స తదఞ్జనతా సమాపత్తిః

మార్చు

(క్షీణ వృత్తేః అభిజాతస్య ఇవ మణేః గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్థ్స తత్ అఞ్జనతా సమాపత్తిః) - అవాంతరములయిన చిత్తవృత్తులు పరిహరించినతరువాత – గ్రహించినవాడు, గ్రహణశక్తి, ఆ గ్రహణానికి కేంద్రమైన వస్తువు – ఈ మూడు అంశాలను సమస్థితిలో దర్శించగలుగుతాడు. స్వచ్ఛమైన మణిపూస ఏ వస్తువుమీద ఉంచితే ఆ వస్తువు రంగును ప్రతిఫలించినట్టు సాధకుడి చిత్తము పరమాత్మస్వరూపాన్ని గ్రహించడానికి సిద్ధముగా ఉంటుంది.


42. తత్ర శబ్దార్థ జ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః

మార్చు

(తత్ర శబ్ద అర్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః) - సమాపత్తి అంటే శబ్దము, అర్థము, వస్తువు – ఈ మూడింటిని గూర్చి తర్కించుకొను సమయంలో గల మానసిక స్థితి.


43. స్మృతిపరిశుద్ధౌ స్వరూపశూన్యేవ అర్థమాత్రనిర్భాసా నిర్వితర్కా

మార్చు

(స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యా ఇవ అర్థమాత్ర నిర్భాసా నిర్వితర్కా) - సాధనద్వారా చిత్తము పరిశుద్ధమైన అనంతరం వస్తురూపం, అర్థం, శబ్దాలకు సంబంధించిన తర్కం కూడా ముగుస్తుంది.


44. ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా

మార్చు

(ఏతయా ఏవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా) ఇంతవరకూ పై సూత్రాలద్వారా సవిచార సమాధి, నిర్విచార సమాధి, తద్వారా సూక్ష్మవిషయానికి సంబంధించిన జ్ఞాన సముపార్జన వివరించడం జరిగింది.


45. సూక్ష్మవిషయత్వం చ అలింగపర్యవసానం.

మార్చు

ఆ సూక్ష్మవిషయంగురించిన అవగాహనద్వారా ఆ సూక్ష్మవిషయానికి మించిన రూపము లేని ఉత్కృష్ట పరమపురుషుడు ధ్యేయము కాగలడు.


46. తా ఏవ సబీజః సమాధిః

మార్చు

- ఇది బీజముతో కూడిన సమాధి. ఈ సాధనలో సాధకుడు సూక్ష్మవిషయాలను అధిగమించినా సాధకుడి చిత్తములో ఒక రూపము (బీజము) ఆలంబనముగా ఉంటుంది.

47. నిర్విచార వైశారద్యే అధ్యాత్మప్రసాదః

మార్చు

- ఈ నిర్విచారస్థితి పొందిన అనంతరం సాధకుడికి అధ్యాత్మికజ్ఞానం కలుగుతుంది.


48. ఋతంభరా తత్ర ప్రజ్ఞా

మార్చు

- సాధకుని చిత్తము పరమోత్కృష్టమైన ఋతము (సత్)తో నిండిపోతుంది.


49. శ్రుతానుమానప్రజ్ఞాభ్యాం అన్యవిషయా విశేషార్థత్వాత్

మార్చు

(శ్రుత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయా విశేషార్థత్వాత్) - పై సాధనలవలన పొందిన బ్రహ్మానందము - అనుశ్రుతంగా అభ్యసించినది, తర్కంద్వారా గ్రహించినది, తనకు తానుగా అవగాహన చేసుకొన్నది – స్థిరమైనదీ, సమతౌల్యము సాధించినదీ అవుతుంది.


50. తజ్జ సంస్కారోఽన్యసంస్కార ప్రతిబంధీ

మార్చు

(తత్ జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధీ) - ఆ తరవాత పొందిన ఆత్మజ్ఞానము సాధకునికి గల పూర్వ ప్రవృత్తులను, స్మృతులను నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు కూడా సాధకునికి తానొక జ్ఞానమును పొందేను అన్న స్పృహ అంతర్గతంగా ఉంటుంది.


51. తస్యాపి నిరోధే సర్వన్నిరోధాన్నిర్బీజస్సమాధిః

మార్చు

(తస్య అపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః) ఆ జ్ఞానమును నిరోధించినతరవాత పొందిన స్థితి నిర్బీజసమాధి.



పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సమాధి పాదము)
జ్ఞానము. :


మూస:పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము