సమాచార హక్కు చట్టం, 2005/ఉపోద్ఘాతం
సమాచార హక్కు చట్టం, 2005
2005 మే 11న లోక్‍సభ ఆమోదించిన రీతిలో
ప్రతి అధికారయంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకూ, పౌరులకున్న సమాచార హక్కును చట్టబద్ధం చేయడం కోసం, కేంద్రసమాచార కమిషన్‍ను నెలకొల్పడం కోసం, సంబంధిత ఇతర అంశాల కోసం ఉద్దేశించినది ఈ చట్టం.
భారత రాజ్యాంగం గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా, ప్రభుత్వాలూ, వాటి అంగాలూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా ప్రజాస్వామ్యంలోని పౌరులకు విషయ పరిజ్ఞానం ఉండడం, సమాచారంలో పారదర్శకత చాలా ముఖ్యం. అయితే సమాచారాన్ని బహిర్గతం చేయడం అన్నది ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వ కార్యక్రమాల సమర్థత, పరిమిత ద్రవ్యవనరుల సమర్థ వినియోగం, సున్నిత సమాచారం గోప్యతను కాపాడడం వంటి ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా మారే అవకాశం ఉంది. అందువల్ల సమాచార హక్కు అన్న ప్రజాస్వామ్య ఆశయానికి పెద్దపీట వేసే క్రమంలో ఈ వైరుధ్యాలను తొలగించాల్సిన అవసరం ఉంది.
కాబట్టి, పౌరులు కోరే సమాచారాన్ని వారికి అందించే విధానం రూపొందించాల్సి ఉంది.
ఈ కింద రూపొందించిన విధానానికి భారత రిపబ్లిక్ 56వ సంవత్సరంలో పార్లమెంట్ చట్ట రూపం ఇచ్చింది.