సమర్థ రామదాసు/మొదటి ప్రకరణము

సమర్థ రామదాసు

మొదటి ప్రకరణము

శ్లో|| యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌.

శ్లో|| పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌.
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే.
                               (భగవద్గీత అధ్యాయము 4 శ్లో|| 6, 8)

ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మమునకు వృద్ధి కలిగినప్పుడును, నన్ను నేను సృహించుకొందును. (శ్లో|| 6)

సాధుజనులను రక్షించుటకును, దుర్జనులను నాశనము చేయుటకును, ధర్మమును సంస్థాపించుటకును, యుగయుగంబున నేను పుట్టుచుందును. (శ్లో|| 8) అని పై రెండు శ్లోకముల యభిప్రాయము.

ఈ పై వాక్యముల సత్యము ప్రతి యుగమునందు సకకల దేశములందు వ్యక్తమగుచున్నది. యూదుమతము భ్రష్టమైపోయినకాలమున నాదేశస్థులను బాగుచేయుటకై భగవంవంతుడు సలకలధర్మమూర్తియగు యేసుక్రీస్తును బంపెను. అలాగుననే అరేబియాదేశము నీతిభ్రష్టమై ధర్నశూన్యమైన కాలమున పరమేశ్వరుడు నీతిమంతుడును బరమ భక్తాగ్రగణ్యుడును నైన మహమ్మదును బంపెను. ఆమహమ్మదు, నీతిని ఏకేశ్వరారాధనమును ధర్మమును అరేబియా దేశమున నెలకొల్పెను. ఆవిధంబుననే భరఖండవాసులు యజ్నముల పేరుబెట్టి వేలకొలది జంతువుల హింసిచుచు ధర్మభ్రస్టులై పాదైపోవుచున్నపుడు గౌతమబుద్దుడు జనించి హిందూదేశ మున బౌద్ధమతము స్థాపించెను. బౌద్దమతము హీన దశలో నున్నకాలమున శంకరాచార్యులు, రామానుజాచార్యులు జన్మించి ఆస్తిక మతస్థాపనజేసి దేశీయుల నుద్ధరించిరి. ఆ విధముగనే మహారాష్ట్రదేశము విదేశీయుల పాలనకు లోబడి దేశస్వాతంత్ర్యమును మతధర్మములను గోల్పోయినతఱి దేశాభిమానియు రామభక్తాగ్రగణ్యుడును నైన సమర్థ రామదాసుడు జన్మించి మహారాష్ట్రులను మంచిమార్గమున బ్రవేశపెట్టెను. మహారాష్ట్ర దేశమున సతారా మండలమున జాంబ్ అని యొక గ్రామము కలదు. ఆ యూరిలో నిరువది యొక్క తరములనుండి ధొసరా కుటుంబమువారు నివసించుచుండిరి. రామదాసు డాకుటుంబములోని వాడే. వారివృత్తి గ్రామపౌరోహిత్యము, వారప్పుడప్పుడు కరణములుగ గూడ పని జేయుచుండిరి. ఆ వంశవృక్షములో మనకథానయకుడైన రామదాసుని తండ్రి సూర్యాజీ యిరువది రెండవ పురుషుడు. ఆయన భార్య పేరు రాణూబాయి. ఆ వంశస్థులందఱు మొదటి నుండియు రామభక్తులై యుండిరి. పూర్వుల మార్గము తప్పకుండ సూర్యాజీకూడ రామపదభక్తుడై యుండెను. ఆ దంపతులకు రాముని మీద నెంత భక్తి యనగా శ్రీరాముడే వారికి సాక్షాత్కరించుచుండు ననియు నతడే వారికి రామమంత్రోపదేశము చేసెననియు లోకులు చెప్పుకొందురు. వారి పవిత్రజీవనము గ్రామవాసులందఱకు మార్గదర్శకముగ నుండెను. ఆ దంపతులు ప్రాచీన మహర్షులచేత రచింపబడిన సకల గృహస్థధర్మములు నిత్యము నిర్వర్తించు చుండిరి. అందుచేత గ్రామవాసులేగాక యితర ప్రదేశ నివాసులు గూడ వారిని మిక్కిలి గౌరవించుచుండిరి. ఆ వంశము యొక్క ప్రతిష్ఠ నిలుపుటకై యా దంపతులకు వారి తప:ఫలములో యనునట్లు కుమారులిద్దఱు గలిగిరి. అందు మొదటివాడు శ్రేష్ఠుడు. రెండవవాడు రామదాసుడు. మంచి దంపతులకు మంచిబిడ్డలే పుట్టుదురు. దుష్ట దంపతులకు సాధారణముగ దుష్టులే జనించుచుందురు. సూర్యాజీవంతునకు మొదటికుమారుడైన శ్రేష్ఠుడు క్రీస్తుశకము 1605 సం||న జన్మించెను. ఆ కుమారునకు మొట్టమొదట గంగాధరుడని పేరు పెట్టిరి. అతడు సంతానములో జ్యేష్ఠుడును, గుణములచేత శ్రేష్ఠుడు నగుటచేత శ్రేష్ఠు డను పేరం బరగెను. అతని కీ రెండవ పేరు మహారాష్ట్ర దేశపు భక్తులలో నుత్తముడైన యేకనాథస్వామి ప్రతిష్ఠానపురమునబెట్తెను. ఈ శ్రేష్ఠుడు తల్లిదండ్రుల పావన గుణములను గలిగి వర్దిల్లెను. 1614 సం||న అనగా నా బాలకునకు దొమిదేండ్ల వయస్సున శ్రీరామదేవుడు ప్రత్యక్షమై స్వయముగ మంత్రోపదేశము చేసెనని చెప్పుదురు. అతడుగూడ ననేక మతసంబంధములైన గ్రంథములువ్రాసెను. వానిలోనతడు రామీరామదాసుడను పేరు వేసికొనుచుండెను. సూర్యాజీ మహాపురుషుడయ్యెను. అతని గర్భమున శ్రీరామపాదారవింద భక్తుడను, వానర వల్లభుడునైన మారుతి (హనుమంతుడు) జన్మించునని సిద్ధులు సెలవిచ్చిరట. జనులీ మాట విశ్వసించి యట్టియవతారపురుషుని కొఱకు నెదురు చూచుచుండిరి. మహారాష్ట్రదేశమున నా కాలమున చాలమంది భక్తులు జనించిరి. వారందఱిలొ బ్రతిష్ఠాన పురవాసియైన యేకనాథస్వామి మిక్కిలి గొప్పవాడు. ఆయన రాణోజీబాయి సోదరుడైన భానోజీకి గురువు. ఏకనాథుని యొక్క గురువు పేరు జనార్దనస్వామి. గురువుగారి గురువుయొక్క తిథి ప్రయోజనమునకై ప్రతిసంవత్సరము భానీజీరావు ప్రతిష్ఠానపురము వెళ్ళుచుండును. అతడు సోదరియైన రాణోజీబాయిని తనవెంట దీసికొని పోవుచుండును. పరమభాగవతుల యెడల మిక్కిలిభక్తిగల సూర్యాజీ యేటేటభార్యతో గలసి యేకనాథుని సేవ జేయుటకై ప్రతిష్ఠానపుర మరుగుచుండును. ఆయాత్రలో బలుసారులు మహానుభావుడైన ఏకనాథుడు హనుమంతుడు వారి గర్భమున దప్పక యవతరించునని నొక్కి వక్కాణించుచు వచ్చెను. ఆత డొక్కడేగాక యేకనాథునివలెనే మహారాష్ట్ర దేశభక్తు లందఱు నట్టి యవతార పురుషుడు తమ దేశము నలంకరించునని వాక్రువ్వజొచ్చిరి. అట్లే క్రీ.శ. 1608 వ సం.న సూర్యాజీవంతు రామాయణపారాయణము జేయుచుండగా రెండవకుమారుడు గలిగెనని శుభవార్త దెలిసెను. సూర్యాజీవంతు శ్రీరామనవమి మహోత్సవము చేయనారంభించి నవమినాడు మధ్యాహ్నము రెండు జాములవేళ రామవిగ్రహముపై నవపుష్పములు వైచి పూజ చేయుచుండెను. ఆ పుణ్య సమయముననే రెండవపుత్రు డుద్భవించెను. అతని యానందమునకు మేరలేదు. శ్రీరామనవమి నతుడు మునుపటికంటె రెట్టింపు భక్తితోను, సంతోషముతోనుజేసి గ్రామవాసులందఱకు మధురపదార్థములనుబంచి పెట్టి పుత్రోత్సవము గావించెను. ఆబాలుని మొట్టమొదటి పేరు నారాయణుడు. ఆ తరువాత నతడు రామదాసు డనియు సమర్థరామదాసు డనియు లోకమున వ్యవహరింపబడెను. మరుసటి సంవత్సరము సూర్యాజీవంతును రాణోజీ బాయియు యాత్రార్థమై ప్రతిష్ఠానపురమునకరిగిరి. తల్లిదండ్రుల వెంట కుమారులిద్దరు పోయిరి. ఆంజనేయస్వామి యవతరించునని ఏకనాథస్వామి చెప్పుచుండుటచేత భార్యాపుత్రసమేతుడై సూర్యాజీ వచ్చుచున్నాడని విని ఏకనాథుడు మిక్కిలి సంతోషించెను. అతడు మేర మీరిన సంతోషముతో నా యవతార పురుషు నెదుర్కొనుటకు బోయెను. ఏకనాథుడు రామదాసు నెత్తుకొని యానందపారవశ్యమున నాట్యముచేసి యిటువంటి కుమారుని గన్న తల్లిదండ్రులు ధన్యులు. ఈ దేశము ధన్యదేశము. మీ నోములు పండినవి. మీతపము ఫలించినది యని ప్రశంసించి యా బాలుని దీవించెను. శివుని యనుగ్రహమున నీ నందను డుదయించెను. ఇతడు నూతనశకమును స్థాపించి లోకుల బాధలు తొలగించి దేశము నుద్దరించెను. ఇటువంటి మహాపురుషుడు మనమధ్యమున జన్మించెను గాన నా జీవితము గూడ ధన్యమైనది. ఇంక నేను నా జీవితరంగముమీది కట్ట కడపటి తెఱ పడవై చెదను అనికూడ ఏకనాథుడు వచించెను.

_______