సమర్థ రామదాసు/ఎనిమిదవ ప్రకరణము

ఎనిమిదవ ప్రకరణము

మతము - రాజ్యపాలనము

అన్నిటికంటె మొదటిది సర్వశక్తు డగు భగవంతుని పూజ. రెండవది రాజ్యపాలన. మూడవది తక్కిన విషయములలో విరివిగా జ్ఞానముండుట. ఈ విషయములు దాసబోధలో పదునొకండవ అధ్యాయములో నాలుగు, ఐదు శ్లోకముల యందు ఉన్నవి. ఈప్రకరణమునందు రామదాసుని మతము యొక్క మూలసిద్ధాంతములను పాఠక మహాశయులకు గ్రమ క్రమముగా దెలియ బరచుచున్నాము. కాని రామదాసుడు భగవంతుని యవతారపురుషుడు కాడని స్పష్టీకరించుచున్నాము. రామదాసుని జీవితచరిత్ర మహారాష్ట్రభాషలో ననేకులు వ్రాసిరి. కాని వారందఱు మూడవిశ్వాసము గల వారై యా చరిత్రములను ఛాందసముగా వ్రాసిరి. వారందఱు రామదాసు యొక్క సమకాలికులే. వారి వ్రాతలలో రామదాసుడు భగవంతుని యవతారమూర్తి యనియు నందుచేత యనేకాద్భుతములు చేసెననియు వ్రాసిరి. ఆ యద్భుతములు మానవ శరీరములకు సాధ్యమయినవి కావు. ప్రకృతిశాస్త్రము మిక్కిలి యభివృద్ధి చెందిన యీ కాలములో నటువంటి మహిమలు జనులు నమ్మరు. మహాపురుషుల కిట్టి మహిమ లారోపించుట లోకమున నూతన విషయము కాదు. వా రవతార పురుషులని చెప్పుటయు నూతన విషయము కాదు. అద్వైత మత స్థాపకుడైన శంకరాచార్యులు శివుని యవతార మని యద్వైతు లందరు. వైష్ణవ మతోద్ధారకులైన రామానుజుల వారు శేషుని యవతార మని విశిష్టాద్వైతులు నమ్ముదురు. అట్లే మధ్వరాయలవారు వాయుదేవుని యవతారమని ద్వైతుల విశ్వాసము. లింగమత స్థాపకుడైన బసవేశ్వరుడు శివుని వాహనమైన నందియొక్క యవతారమూర్తి యని లింగధారులు దృడముగా నమ్ముదురు. వంగదేశమున వైష్ణవమతము స్థాపించిన చైతన్యస్వామి శ్రీకృష్ణ పరమాత్ముని యపరావతారమని యా దేశస్థులు గాడముగ విశ్వసింతురు. ఈనాటి హేతువాద పరాయణులు రామదాసుడు భగవంతుని యవతారము కా దనియు నతడు పవిత్ర చరితుడైన యొక ఋషియనియు నొప్పుకొందురు. మహిమలు మొదలయిన యమానుష కృత్యములు దీసివేసిన యెడల వా రాతని చరిత్రము నాదరభావమున జూతురు. అతిశయోక్తులు, మహామహిమలు దూరముగా ద్రోసివేసిన యెడల రామదాసుడు రచియించిన దాసబోధ యను గ్రంథము నుండియే యాతని చరిత్రమును మనము గ్రహింపవచ్చును. అదృష్టవశమున దాసబోధలో శిష్యులు గాని మరి యితరులు గాని రామదాసు రచియింపని క్రొత్త పద్యములను జేర్చలేదు. ఈలాగున జేర్చుట మన పురాణములలోను భారత రామాయణాది గొప్ప గ్రంథముల లోను జరిగినది. అట్టి యవస్థ దాసబోధకు బట్టలేదు. ఆ కారణమున నది విశ్వసింపదగిన గ్రంథముగ నున్నది. ఇతరులు వ్రాసిన యతని జీవిత చరిత్రముకంటె దాసబోధనే మన మాధారముగ జేసికొని యతని జీవితచరిత్రము గొంతవఱకు లిఖింపవచ్చును. రామదాసునియొక్క అభీష్టదైవతము మారుతి, అనగా హనుమంతుడు. హనుమంతుడే రామదాసున కాదర్శదైవతము. నిరాడంబర జీవనము గంభీరమైన తత్త్వవిచారము ముఖ్యముగ నుండవలయు నని రామదాసునియొక్క యాశయము. గంభీరమైన తత్త్వవిచారమునకు నాదర్శమైన దైవతముండితీరవలెను. ఆ దైవతము రామదాసు మత ప్రకారము మహోత్కృష్ట పురుషుడైన హనుమతుండే. హనుమంతుడు శ్రీరామభక్తు డని జగత్ప్రసిద్ధమేగదా! అటువంటి మహాదైవతము నందు విశ్వాసము లేకపోవుటచే మహారాష్ట్ర దేశము బహు కష్టముల పాలైనది. ఈ దైవతమును నమ్మిన తరువాత జనుల కనేక కష్టములు దొలగినవి. మారుతి బలభీము డని రెండవ పేరు గలదు. ఈ దైవతమును రామదాసుడు పండ్రెండు సంవత్సరములు ధ్యానించి తుదకు మారుతిలో లీనములై యున్న మహాశక్తులను గొన్నింటిని దనయందు సంక్రమింప జేసికొనెను. జనులను మహోత్సాహభరితులను జేయవలసి వచ్చినప్పుడు మారుతియే పరమదైవతమని జనులకు బోధించెను. ఆతడు దుష్టజన భయంకరు డని మహాభక్తు డని గొప్ప మేధావి యనియు లోక మెఱుంగును కదా! పిల్లలకు భూత భేతాళ పిశాచములు సోకకుండ హనుమద్విగ్రహముచెక్కిన బిళ్లలు బిడ్డల మెడలలో వ్రేలాడుచుండుట మన మెఱుంగుదుము. శ్రీరామునివలన యోగవిద్యను హనుమంతు డుపదేశము పొందినట్లు 'సీతారామాంజనేయము' అను గ్రంథములో నున్నదిగదా! భారత యుద్ధములో గౌరవులను జయించుటకై యర్జునుడు తన ధ్వజము మీద హనుమంతుని విగ్రహము నిలుపు కొనినట్లు మహాభారత యుద్ధపర్వములో ననేకచోట్ల జెప్పబడి యున్నది. ఒక జాతిని బలసమేతముగాను మహోత్సాహవంతముగాను జేయుటకై యాతని యందే శక్తికల దని రామదాసుని నమ్మకము. ఆ దేవుని యొద్ద మూడు శక్తులు కలవు. అవి యేవనగా నొకటి దేహశక్తి. రెండు మనశ్శక్తి. మూడు ఆత్మశక్తి. దుష్టభూయిష్ఠ మైన ప్రపంచము దేహశక్తి వల్లనే లోబఱచుకోవలెను గదా! దేహశక్తి లేనియెడల జనులకు స్వాతంత్ర్యముగాని శాంతిగాని సౌఖ్యముగాని స్వప్నవార్తలు గదా. ఇతర శక్తులెన్ని యున్నను దేహశక్తి లేకున్న నవి, యన్ని నిరర్థకములుగానె, దృడమైన మనశ్శక్తి లేకపోయిన యెడల నీ దేహశక్తి కేవలము పశుబలముగ బరిణ మించును. దేశమును నాగరికముగ నుంచుటకు గ్రమపద్ధతిగ నడుపుటకు, దేహబలముతోపాటు మనోబలము జ్ఞానబలము కూడ నుండవలెను. దేహబలము, మనోబలమే మానవ జాతియొక్క యభ్యుదయమునకు జాలునని యీ నాటివారి నమ్మకము.

కాని పాశ్చాత్య మతమునకు మన ప్రాచ్యమతమునకు నీ విషయమున విశేష భేదము కలదు. దేహ మనశ్శక్తు లాత్మశక్తితో గలసియుండని యెడల బ్రపంచము పశుబలమున కధీనమై నానాబాధలు పడవలసి వచ్చును. అందు చేతనే ప్రాచ్యదేశస్థులైన మహర్షులు పరమోత్కృష్టమైన యాత్మశక్తి మొట్ట మొదటిదిగాను, దేహ మనశ్శక్తు లప్రధానములుగాను బరిగణించిరి. మారుతి నాదర్శ దైవతముగ బెట్టుకొన్న యెడల దమ దేశస్థుల కీ మూడు శక్తులు చులకనగ నలవడు నని రామదాసు యొక్క నిశ్చితాభిప్రాయము. భగవంతుని యారాధనము మొట్టమొదట జేసి పిమ్మట దేశ రాజ్యాంగ విషయములు చూచుకొన వలెనని రామదాసు బోధ. మన జీవిత మీరెండు విషయములతో గూడి యుండవలెనని యాతని యాశయము. మానవ కృత్యము లన్నింటిలో మతము ప్రధానముగ నుండవలె ననుమాట భౌతికవిషయ పరాయణులైన పాశ్చాత్యులచెవికి మిక్కిలి వింతగా దోచవచ్చును. ఏలయన వారిబుద్ధి వినశ్వరమైన యీ భౌతిక ప్రపంచమును దాటి ఎన్నడు బోలేదు. దేహమనశ్శక్తుల సహాయమున సౌఖ్యమును శాంతిని బొంది జీవితము గడపవచ్చునని వారి నమ్మకము. వారిమతము యొక్క యసంపూర్ణస్థితి దృష్టిగోచరములైన పదార్థముల మీదికేగాని మరణానంతర జీవితముయొక్క స్థితినిగూర్చి వారి కాలోచన పోకపోవుటచే వారట్లు నమ్మిరి. కాని ప్రాచ్య దేశస్థులమైన మనము మతమే ముఖ్యముగ జేసికొన్నాము. మతమునకు, రాజకీయమునకు సంబంధము లేదని పాశ్చాత్యుల యభిప్రాయము. మనవారి కట్టి యభిప్రాయము లేదు. అందుచేతనే గాంధి మహాత్ముడు జాగ్రత్తతో నహింస సత్యము మొదలైన మతధర్మములను రాజకీయ విషయములతో గలిపెను. హిందువులకు మతమే ప్రధానము. బిడ్డపుట్టినప్పుడు జాతకరణ నామకరణాది కర్మలు మతముతో సంబంధించి యున్నవి. మనుజుడు మృతినొందినపు డుత్తర క్రియలు మతముతోనే కలిసి యుండును. వివాహాది శుభకార్యములు కూడ మతమును విడిచియుండవు. దీనినిబట్టి మన ప్రాచీనులు మతమునకే ప్రాధాన్యమిచ్చి రని తేలుచున్నది. అందుచేతనే రామదాసుడు లోకవ్యవహారములకంటె మతమునే ముఖ్యముగ నెంచెను. ఇప్పటి ప్రకృతిశాస్త్రవేత్తల యభిప్రాయము మతమునకు ఇతరవిషయములకు మధ్య గీటుగీచి రెండింటిని వేరుచేయవలయుననియు, మతము పనిపాటులు లేనివారు తీరుబడిగా గూర్చుండి చర్చింపవలసిన విషయమనియు, మనుష్యుడు భూలోకమందు దేవుని ప్రతినిధియగుటచే నీశ్వరగుణ సంపర్కముచే గాని యతడు లౌక్యవ్యవహారములలో నెఱవేరలే డని యతడు చెప్పుచుండును. మూడు శక్తులు కలసి యున్నప్పుడే మానవుడు తన లోపల శత్రువులను పైశత్రువులను జయింపజాలునని యతడు పలుమాఱు జెప్పుచుండును. జాతిక్షీణించినప్పుడు దాని ధర్మము కూడ క్షీణించును. అందుచేత నవి బాహ్యంతర శత్రువులకు త్వరగా లొంగిపోవును. క్రమముగా నది బానిసతనమున బడిపోవును. అట్టితఱి మతమొక్కటే జాతిని బ్రతికించి యుద్ధరించునది. అందుచేత మానవ సముద్ధరణమునకు మతమే సర్వవిధముల నవలంబనీయమని రామదాసుడు నొక్కివక్కాణించుచుండును. పడిపోవుచున్న మనుష్యులు కఱ్ఱనూతగొని నిలుచునట్లు పడిపోవుచున్న జాతి మతము నూతగా గొని నిలువబడవచ్చునని యాత డుపదేశించు చుండును. అతడు రాజకీయ విషయముల గుఱించి యంతగా బనిచేయలేదు. దానికి రెండవ స్థానమిచ్చి మతమునకే ప్రధాన స్థానమిచ్చెను. రాజ్యాంగవిషయము పాశ్చాత్యులకు జీవనాధారము. దానిని వారు రాణిగా బూజింతురు. మతమే మనకు ముఖ్యమగుటచే గ్రీకులు పారశీలకులు క్రైస్తవులు మహమ్మదీయులు మొదలగు విదేశీయులు మనపై బలుమాఱు దండయాత్రలు సలిపినను మనమతము దేశమును జెక్కుచెదరక నిలిచి యున్నవి. భరతఖండమునకు బడమటనున్న ఆఫ్‌గనిస్థానము పారశీకము మున్నగు దేశములు మహమ్మదీయ దేశము లయ్యెను; అమెరికా ఖండము పూర్తిగా క్రైస్తవదేశ మయ్యెను. మతము దేశవ్యవహారము నీరక్షీరములట్లు, ఎట్లు కలిసి యుండవలెనో యతడు జనులకు నేర్పెను. ఆ రెండును చదరంగములో గుఱ్ఱములవలె నొకదాని నొకటి కాచుచుండును. ఒకటి నాశనమైన పక్షమున రెండవది కూడ నాశనమగును. మనము చరిత్ర శ్రద్ధగా జదివిన పక్షమున గ్రీసు దేశము జ్ఞానమునకు నిధియని తెలిసికొనవచ్చును. ఆ జ్ఞానము క్రమ క్రమముగ రోముదేశమునకు, అటనుండి యింగ్లాండు దేశమునకు నటనుండి యమెరికా దేశమునకు వ్యాపించెను. నేటి కాలమున జపానీయులు ఆ జ్ఞానవృక్షము నంటు గట్టుకొని తమ దేశమున నాటు కొనిరి. ఆత్మజ్ఞానవిరహితమైన యీనాటి విజ్ఞానము గ్రామములను బరశురామప్రీతి చేయుటకును బిడ్డ లనక స్త్రీ లనక వృద్ధులనక మనిష్యులను వినాశము చేయు విమానములను ఫిరంగులను బాంబులను జేయుటకు బనికివచ్చుచున్నది. ఇంతకన్న శోచనీయమైన యవస్థ లేదు. ఆత్మజ్ఞానము లేకపోవుటయే దీనికి ముఖ్యకారణము. రామదాసుడు మతవ్యాప్తితో గూడ మహారాష్ట్రులకు స్వరాజ్యమును గూడ సంపాదింపవలెనని తలంపు గలిగి యుండెను. రామదాసుని మతము నవలంబించినవారు విరక్తులై యుండవలెనని యాతని శాసనము. విరక్తు లనగా సన్యాసులు కావలెనని యాతని యభిప్రాయము కాదు. మనుష్యులు గృహస్థులై సంసారముచేయుచు కేవలము లోకవ్యవహార నిమగ్నులుగాక యీశ్వరభక్తి గలిగి ధర్మమార్గమున సంచరించు చుండవలె నని యతని బోధన సారము. ప్రతి మనుష్యుడు ధర్మమును దాను ముం దాచరించి చూపి పిదప జనులకు బోధింపవలసినదని యాతని యుత్తరవు. ఆచరణతో గూడని మాటలు వట్టి బూటకములు. వట్టిమాటల పోగులు కుక్క మొఱగుల వంటివి. ధర్మాచరణము చేసిన వారు బోధించినప్పుడే ప్రజలా ధర్మము నాచరింతురు గాని వట్టి మాటలచే గాదు.


_______