సమర్థ రామదాసు/అనుబంధము
అనుబంధము
రామదాసుయొక్క వ్రాతలలోనుండి కొన్ని యాంధ్రీకరించి యీ క్రింద బొందుపఱచుచున్నాను.
1. రాజధర్మం
రాజధర్మమును గుఱించి యీ క్రిందివిధముగ రామదాసు వ్రాసెను.
అంతరాయములకెల్ల నంతకు డగు గణేశ్వరుని, విజ్ఞానాధిదేవతయైన సరస్వతిని మా యిలవేల్పైన శ్రీరాముని స్తవము జేసి రాజధర్మమునుగుఱించి యీ క్రిందివిధముగ జెప్పుచున్నాను. వినువారి కెవరికైన నిష్టములేనిపక్షమున దానిని త్రోసివేయుడు. వివేకమునుబట్టి సౌఖ్యము గలుగును. కార్యసిద్ధులు పున:పున: ప్రయత్న ఫలములు. ఏమనుష్యునిగాని కొలువులో బెట్టకమునుపు వానినిగుఱించి బరీక్షించి వాని గుణములు గ్రహింపవలెను. పనికిమాలినవాండ్రను దూరముగ నుంచవలెను. ప్రతి కార్యముయొక్క సర్వభావమును, పర్యాప్తిని గ్రహించి చేసినపక్షమున నది తప్పిపోక చేసినవానికి శ్రమ లేకుండ జేయును. కార్యమారంభించిన వానియొక్క గుణమును బట్టియు శక్తినిబట్టియు గార్యసిద్ధి కలుగుచుండును. కొందఱు మందవర్తనులు తలబిరుసువాండ్రు కొలువులో నుందురు. కాని వారితప్పులను మహోదారమనసుతోను బ్రసన్నచిత్తముతోను క్షమించవలెను. రాజద్రోహులను వెంటనే యడచి వేయవలెను. తగినవిచారణ లేక నిరపరాధిని వట్టి యనుమానముమీద నడచివేయగూడదు సేవకులను సదా సంతుష్టులుగాను, సంతోషవంతులుగాను జేయుటచేత మన యదృష్టము వృద్ధిబొందును. కాని కొన్నిసమయములయందు సేవకులలో గొందఱు కఠినపద్ధతుల కర్హులై యుందురు. మనుష్యులనే సమయముల నెట్లు ఉపయోగించవలెనో మనసులో నుంచుకొనవలెను. మనకు మనుష్యబల మెల్లప్పుడు మిక్కిలి యవసరము. కనుక వారిలోపముల నెప్పుడు క్షమించవలెను. న్యాయమునకు బద్ధులము గావలెను. న్యాయము నుపే---చిన యెడల మనము నాశనము నొందుదుము. వివేకమును ధర్మము-- దాటవద్దు. న్యాయము లేకుండ యే సత్కార్యమును గాదు. తన ధర్మము నెడల ప్రాలుమాలినవాడు భాగ్యవంతుడు గానేరడు. మంచిసమయమున ధైర్యము విడనాడుట వినాశ హేతువు కష్టపరంపరచేత విసుగు చెందవద్దు. ఉత్సాహము గోలుపోవద్దు. కార్యభంగ మయినప్పు డుత్సాహముతో బున:ప్రయత్నము జేసిన నీకు గొఱత యుండదు. నీ ప్రభుత్వపువ-- జాగ్రత్తగ బన్ని గొప్ప రాజనీతిధురంధురులకు గూడ నాశ్చర్యము గల్గునట్లు మెలగుము. కాఠిన్యము ప్రభుత్వము యొక్క ముఖ్యకీలకము. కాఠిన్యము కొంచెము తగ్గినపక్షమున బ్రభుత్వ మంతయు క్షణములో శిధిల మగును. యుద్ధభూమిని రాజు శత్రువుల కెట్టయెదుట నెప్పుడు నిలువగూడదు. అట్లు నిలుచుట రాజనీతికి విరుద్ధము. వందలకొలది మనుష్యులకు రాజు వేషములు వేసి వారే రాజు లని భ్రమపుట్టునట్లు చేయవలెను. అట్టివారిని యెట్టయెదుట నిలుపవలెను. మనుష్యబలము మిక్కిలి బలిష్ఠముగాను దగినంతగాను నుండవలెను. కాని యందఱును నొక్క విధముగా యాదరింప గూడదు. వారి వారి శక్తినిబట్టి వారికి జిన్నతనము --కుండ వేఱువేఱు పనులు వారి కొప్పగింపవలెను. మహావీరు డాతని గౌరవము చేతను మహోత్సాహముచేతను బురికొల్పబడినప్పుడు వాడు తనప్రాణములనైన దెగించును. అట్టి శురులను గలిసి యేక ముఖముగ బనిచేయుటకై నిలువలో నుంచుము. భయంకరమైన బెబ్బులిబొబ్బ గొఱ్ఱె నెట్లు చెల్లాచెదరుగ జయునో చూడుము! తెగ బలిసిన దున్నపోతు లగుటవలన లాభము లేదు. మీరు పెద్దపులులు గండు. రాజులు రాజధర్మము గమనింపవలెను. క్షత్రియులు తమధర్మమయిన యుద్ధమును జేయవలెను. బ్రాహ్మణులు తమమతధర్మములను నిర్వర్తింపవలెను. రాజు సంగ్రామశాస్త్రమును నశ్వశాస్త్రమునుగూడ బఠింపవలెను. శత్రువులను జయించుట క-- సాధనము గనుక, మిక్కిలి యవసరము. నా ప్రభువైన శ్రీరామునిచేత బ్రేరేపింప బడి నా నేర్చినకొలదిని రాజధర్మమును గూర్చి పలికితిని. 2. యుద్ధవీరుల ధర్మము.
రాజుధర్మమునుగుఱించి సంగ్రహముగ మాటలాడితిని. ఇప్పుడు క్షత్రియధర్మమునుగుఱించి ప్రసంగించెదను. ఆ ధర్మము నెఱవేర్చుట మిక్కిలి కష్టము. ప్రాణభయము గలవారు యుద్ధవీరులవృత్తిలో బ్రవేశించగూడదు. వారు మఱియొక వృత్తివలన జీవయాత్ర గడుపవలెను. రణరంగమునుండి వెన్నిచ్చి పరుగెత్తినవాడు నరకదు:ఖము ననుభవించును. యుద్ధములో మగతనము జూపక యింటికి బారిపోయినవాడు బహుపాపములు చేసినవాడగును. యుద్ధములో జచ్చిపోయిన వానికి వీరస్వర్గము సిద్ధముగ నుండును. నీవు జయించి గృహమునకు బోయితివేని యింటిలోగూడ నీకు మహానందము గల్గును. పురుషుడు విశేష శౌర్యము మహోత్సాహము గలిగియున్న పక్షమున, దేశకాలపరిస్థితుల నెఱింగిన పక్షమునను విజయము స్వయముగ వచ్చి వానిపాదములపై బడును. తాను చేయదలచిన కార్యముయొక్క స్వభావమును, బ్రాముఖ్యమును గ్రహింపని నిర్భాగ్యుడు రణరంగమున నేమి చేయగలడు. జనులను సంతోషపఱచినప్పుడే యుద్ధమును చేయవచ్చును. గెలువవచ్చును ఇప్పుడు చూడుదు! పుణ్యక్షేత్రము లన్నియు మైలపఱుపబడినవి. ప్రతిస్థలములోను మత మగౌరవింపబడి యణగ ద్రొక్కబడుచున్నది. ఇటువంటి దురవస్థ చూచుచు బ్రతికి యుండుటకన్న మీరందఱు చచ్చిపోవుట మేలు. కావున "నేను మహారాష్ట్రుడను" అని చెప్పుకొను ప్రతిమానవుడు పదిమందితో గలిసి నడుముగట్టి సేనలో జేరి నడువవలయును. మన మహారాష్ట్ర ధర్మమును తిరిగి వ్యాపింపజేయుటకు సకల ప్రయత్నములు చేయవలెను. ఈవిషయమున నే మాత్రము సందేహము మీకు గలిగినను మీపితృపితామహ ప్రపితా మహాదుల శాసనములు మీతలపై బడును. మీరు మరణము తప్పించుకొనలేరు. కావున మంచి యాలోచనతో శక్యమయినంత పని మీరేల చేయరాదు? మేము గొప్పవారము ముఖ్యులము అనుకొనువారందఱు నొక్క జెండాక్రింద జేరవలెను. అట్లు వారు చేరనిపక్షమున వారు తమ తప్పునకు ముందుముందు పశ్చాత్తాపము నొందుదురు. తన జాతిని తన ధర్మమును వదలినవాడు గొప్పవాడ నని యెట్లనుకొనగలడు? నా వాక్యములు మీలో గొందఱ కాగ్రహము దెప్పించవచ్చును; గాని క్షమింపుడు. భగవంతునికి ద్రోహులైనవారు. కుక్కలుగాని మనుష్యులు కారు. ఆట్టివారిని తన్నివేయుడు. ధర్మమతు లైన దేవభక్తులే విజయము గాంతురు. మతసంస్థాపనకొఱకు దేవునిపాదములను మీశిరస్సులమీద ధరించి మీయుత్సాహపూరితము లైన పనులతో దేశ మంతయు బ్రతిధ్యనించునట్లు చేయుడు. చుఱుకుగ నుండుడు. మంచి యాలోచన గలిగియుండుడు. ఏ ప్రయత్నమును జేయ మానకుడు. జగన్మాత యైన "తుల్యభవాని" వరముచేతనే శ్రీరాముడు రావణుని సంహరించె నన్నమాట మనసులో నుంచుకొనుడు. ఓ మిత్రులారా! ఈ తుల్యభవాని శ్రీరామునికి వరములిచ్చి ప్రసిద్ధికెక్కినది. అందుచేతనే రామదాసు డని ప్రసిద్ధిజెందిన నే నామెను గొలుచుచుందును.
3. శ్రద్ధ.
ఈప్రసంగము రామదాసుడు శివాజీకి భగవత్ పతాక నిచ్చినప్పుడు చేయబడెను.
ఎవరిని నమ్మవద్దు. నీ పన్నాగములు నీవే స్వయముగ నాలోచించుకొని పన్నుకొనవలెను. నీ ప్రయత్నము లన్నిటిలోను నిశ్శంక మైన ధైర్యము వహింపుము. శరీరబాధలు వచ్చినప్పు డధైర్యము బూనకుము. సమస్తచికిత్సలు చేయింపుము. అంతట నీకు దప్పక సుఖము కలుగును. కఠినసమస్యలను నీ వేకాంతముగ గూర్చుండి యాలోచించి సాధింపుము. నీ జ్ఞాపకశక్తిని జక్కగ నిలుపుకొనుము. శత్రువులను మిత్రులను కఠిన శోధనల జేయుము. ఏప్రయత్నమును మానకుము. భోగములపొంత బోకుము. నేర్పుగల యుపాయములు పన్నునట్లు వ్యవహరింపుము. నాయకుడు శౌర్యమునందు వెనుకబడగూడదు. తన కార్యములలో ముఖ్యసూత్రములవిషయమై యశ్రద్ధ చేయగూడదు. అత డెప్పుడు సోమరియై యుండగూడదు. అట్లుండిన బశుప్రాయ డగును. ఎవడు తన ధర్మమువిషయమై ప్రాలుమాలి యుండునో, యాలోచించుట మానునో, వాడు మానవజాతిలో నధము డగును. కార్యమునందు గట్టిపూనిక గలవానికి నేకార్యము నసాధ్యమై యుండదు. మనుష్యు లెంత సమర్థులైనను, నెంత తెలివిగల వారైనను వారిని దూరముగ నుంచి వారిపని యవసర మైనప్పుడే వారిం జేర బిలువవలెను. చూడగనే యే మనుష్యుని యందును విశ్వాస ముంచవద్దు. నీవు నీ విశ్వాసములోనికి దీసికొనక ముందు ప్రతిమనుష్యుని కఠినపరీక్ష చేయవలెను, మీద దైవ మున్నాడు, అతనిదయవలన మంత్రశక్తి బలవత్తర మగును. పూర్వము గొప్పవారైన వారందఱు నిరంతరము పాటుపడుటవల్లనే ఘనులైరి. నీ మనస్సును వశపఱచుకొనుము. ఇతరుల మనస్సులను బరిశోధింపుము. వారు తొండవలె రంగులు మార్చుకొనకుండ జూడుము. రాజకార్యవిషయములలో నితరులు గమనించునట్లు గమనింపుము. వారు పోయిన పోకడలు పొమ్ము, సంజ్ఞలవలన జేయదగిన పనిని నోటితో బలికి చెప్పకుము. మాటలాడదగిన విషయము లిఖితపూర్వకముగ జేయకుము. ఆలోచించి చేయదగిన విషయములను తొందరపడి నోటితో జెప్పకుము.
4. మహారాజా ఛత్రపతి శంభాజీకి రామదాసుడు వ్రాసిన లేఖ.
శంభాజీ మహారాష్ట్రప్రభు వైన శివాజీ కుమారుడు, పితురనంతరము నితడే సింహాసన మెక్కెను. కాని యితడు శివాజీవంటివాడు గాడు. దుర్వ్యసనాసక్తుడై తాను పాడై రాజ్యమును బాడుచేసెను.
నీ వెప్పుడును శ్రద్ధగ నుండుము. విషాదమునకు నీ హృదయమున స్థాన మీయకుము. ముఖ్యవిషయములను నీ వేకాంతముగ గూర్చుండి శోధించుచుండుము. భయంకరమైన క్రూరమైన నీ ప్రస్తుతస్వభావమును విడిచిపెట్టుము. శాంతము వహింపుము. విదేశీయుల కుట్రలనుండి నీ దేశమును దప్పించుటకు నీ హృదయమును సిద్ధముగ నుంచుము. పూర్వపు మంత్రుల నందఱను క్షమించి వారల మరల రప్పించుము. వారల హృదయములను సంతుష్టిపఱచి వారిపూర్వపు టుద్యోగముల వారి కిమ్ము. ప్రవాహమున కడ్డగట్టు గట్టినయెడల నీరు ప్రవహింపదు. జనసామాన్యముల మనస్సులు నిర్భంధము లేకుండ స్వేచ్ఛ గనున్నప్పుడే ఘనకార్యములు సాధింపబడును. జనసంఘములు, పలుతావులయందు నిరోధింపబడినప్పు డపాయము సన్నితమై యుండును. నీ పెద్దలు సంపాదించిన ప్రశాంతి చెడగొట్టి వివాదములు కలహములు పెంచుట వినాశ కారణ మగును. నీ శత్రువు లా సందు గనిపెట్టి నిన్ను చెఱుపజూతురు; కావున దానిని దప్పించుకొనుము. రెండు కుక్క లొకయెముకకొఱకు బోరాడినయెడల మూడవకుక్క దాని నెత్తుకొనిపోవు నను లోకోక్తి నీవు వినలేదా ఇది? చక్కగ విచారించి, నడుముగట్టి చేయవలసిన మహాకార్యములను జేయుము. ధైర్యహీనత నాశనమునకు దారితీయును. సకలజనుల మన:క్షేత్రములందు శాంతిబీజములను జల్లుము. జను లందఱిని జేరదీసి, వా రేక కార్యముఖులై యుండునట్లు చేసి వారిచేత శత్రువులను బాఱదోలింపుము. ఇందువలన నీ కీర్తి ప్రపంచమం దన్ని దిక్కులయందు వ్యాపించును. ప్రపంచ మంతయు నీ కత్తికి జడిసి, నీ పేరు చెప్పిన భయమున గడగడ వడంకి లోబడును. నీ విట్లు చేయని పక్షమున రాజ్య మెప్పుడో యొకప్పుడు కూలిపోవును. దేశకాలపరిస్థితులను గమనించి, క్రోధమునకు తావొసంగకుము. క్రోధ మణచుకోలేనిపక్షమున శాంతికవచనమునైన దొడుగుకొని, నీలో కోప మున్నట్లు ప్రజలకు దెలియనీయకుము. ప్రజలు తమ హృదయములలో నిన్ను గుఱించి భయపడగూడదు. లెక్కలేని సైన్యమును బోగుచేసి వారిచేత మ్లేచ్ఛులను బాఱదోలింపుము. ప్రస్తుత మున్న దానిని రక్షించి నూతనరాజ్య మార్జించి దానికిం గలిపి మహారాష్ట్రప్రభ దేదీప్యమానమై శాశ్వతముగ వెలుగునట్లు చేయుము. అనంతమైన యుత్సాహశక్తిని గలిగియుండును. నీ శౌర్యముకొలది నీ ఖడ్గమును బ్రయోగింపుము. నీ వొక మహారాజువై మహోన్నతదశను బొందుదువు. నీవు శివాజీమాట జ్ఞాపక ముంచుకొని యీ ప్రపంచమునను బరలోకమునను నీ కీర్తి శాశ్వతముగ నుండునట్లు ప్రయత్నింపుము. నీ ప్రాణములను తృణప్రాయముగ నెంచుము. శివాజీ యొక్క యెడతెగని యుత్సాహమును, నసమాన ఘనతను జ్ఞాపక ముంచుకొనుము. అవియే యతనిని మృతజీవుని జేసినవి. అతని కార్యము లెట్లుండినవి? అతని వాజ్మాధుర్య మెట్లుండెడిది? అన్యుల మనసులను వశపఱచుకొనుటలో నత డెంత యనుభవశాలి? భోగముల నొకమూలకు ద్రోసి యీ యోగసిద్ధికై పాటుపడుము. రాజ్యాంగవిషయమైన గొడవ యెప్పుడు నిట్లే యుండును, సుప్రసిద్ధుడైన నీతండ్రి చేసిన దానికంటె నెక్కువ చేయుటకు బ్రయత్నింపుము. నీకు నే నింతకంటె నేమి వ్రాయగలను?
- _______