9. నేను పడిన కష్టాలు
ప్రొద్దుటికి రైలు ఛార్లెస్ టౌను చేరింది. ఆ రోజుల్లో చార్లెస్ టౌనుకు, జోహాన్సుబర్గుకు మధ్య రైలు లేదు, రాక పోకలకు గుర్రపు బండ్లు వున్నాయి. గుర్రపు బండి త్రోవలో స్టాండర్టన్ అను ఊళ్లో రాత్రి పూట ఆగుతుంది. నా దగ్గర గుర్రపు బండి టిక్కెట్టు వుంది. మారిట్జుబర్గులో ఒక రోజు నేను వుండిపోయాను. ఆ టిక్కెట్టు రద్దుకాలేదు. అబ్దుల్లాసేఠ్ చార్లెస్ టౌనులోగల గుర్రపు బండ్ల ఏజంటుకు తంతి కూడా పంపాడు.
కాని ఆ ఏజంటు సరియైన వాడుకాడు. వాడు నన్ను దండుకోవాలని భావించాడు. నీ టిక్కెట్టు చెల్లదని అన్నాడు. నేను అందుకు తగిన సమాధానం చెప్పాను. బాటసార్లకు బండిలో చోటు యివ్వాలి. లోపల చోటువున్నా వాడు నన్ను బాధించాలనే భావంతో వ్యవహరించాడు. లీడర్ అను గుర్రపు బండ్ల అధికారి నన్ను తెల్లవారితోబాటు బండిలో కూర్చోనీయకూడదని అనుకున్నాడు. ఆ బండికి ముందుభాగాన రెండు వైపుల రెండు సీట్లు వున్నాయి. లీడరు ఆ రెండు సీట్లలో ఒకదాని మీద కూర్చుంటాడు. కాని యివాళ అతడు లోపలి సీట్లో కూర్చొని నాకు బయట తన సీటును చూపించాడు. అది శుద్ధ అన్యాయమనీ, అవమానకరమనీ నాకు బోధపడింది. కాని అవమానం మ్రింగడమే మంచిదని భావించాను. బలవంతం చేసి లోపల దూరడానికి వీలు వుండదు. నేను అక్కడ కూర్చోను అని అంటే అతడు నన్ను అక్కడే వదలి బండి తోలుకుపోతాడు. అక్కడ నేను వుండిపోతే ఆ రోజంతా వృధాయే. మర్నాడు ఏమవుతుందో ఆ భగవంతుడికే ఎరుక. కాబట్టి మనసులో ఎంత గుంజాటన పడుతూవున్నా నోరుమూసుకొని బండితోలేవాడి ప్రక్కన కూర్చున్నాను.
సుమారు మూడు గంటలకు బండి పార్డీకోవుకు చేరింది. అక్కడ ఆ గుర్రపు బండి అధికారికి నేను కూర్చున్నచోటున కుర్చోవాలని బుద్ధి పుట్టింది. అతడు సిగరెట్ కాల్చుకోవాలి. అతడికి తెరపగాలి కావాలి. అతడు బండి తోలేవాడి దగ్గర ఒక మైల గోనె సంచి తీసుకున్నాడు. దాన్ని నేను కూర్చున్న సీటు ముందు క్రింద పరిచాడు. “సామీ! నీవు దీని మీద కూర్చో. నేను బండి తోలు వాడి సీటు ప్రక్కన కూర్చుంటా” అని అన్నాడు. నేను ఆ అవమానం భరించలేక పోయాను. భయపడుతు భయపడుతు “లోపల కూర్చోవలసిన నన్ను యిక్కడ కూర్చోబెట్టావు. నేనెట్లో సహించాను. నీవు యిక్కడ కూర్చొని సిగరెట్ కాల్చుకునేందుకు నన్ను నీ కాళ్ల దగ్గర కూర్చోమంటున్నావు. నేను యిక్కడ కూర్చోను. బండి లోపలికి వెళ్లి కూర్చుంటాను.” అని అన్నాను.
ఈ మాటలు నానోటి నుండి బయటికి వచ్చాయో లేదో వాడు వెంటనే నా గూబ పగల కొట్టసాగాడు. నాచేయి పట్టుకుని క్రిందికి ఈడ్చి వేయడానికి ప్రయత్నించాడు. నేను ఆ బండి చువ్వల్ని గట్టిగా పట్టుకున్నాను. మణికట్లు విరిగినా సరే చువ్వల్ని వదలకూడదని నిర్ణయించుకున్నాను. వాడు బండబూతులు తిట్టాడు. క్రిందకి పడత్రోసేందుకు ప్రయత్నించాడు. నేను మాత్రం బండి చువ్వల్ని వదలలేదు. అతడు బలిష్టుడు. నేను దుర్బలుణ్ణి. నా బాధ చూచి ప్రయాణీకులకు దయ కలిగింది. వారు కల్పించుకొని “పాపం, అతడిని విడిచి పెట్టు. అతడు చెప్పింది నిజం. అతని తప్పులేదు. అక్కడ కాకపోతే మాదగ్గరికి లోపలికి పంపు. మాకేమీ యిబ్బంది లేదు. లోపల సీట్లో కూర్చుంటాడు.” అని గట్టిగా అన్నారు. దానితో అతనికి అవమానమైంది. నన్ను కొట్టడం మానివేశాడు. “ముందున్నది ముసళ్ల పండగ, పద నీ అంతు తేలుస్తా” అంటూ అప్పుడు నన్ను వదిలి పెట్టాడు. బండికి ఆవలి ప్రక్కన కూర్చున్న సేవకుణ్ణి ఆ గోనె మీద కూర్చోబెట్టి అతని చోట తాను కూర్చున్నాడు.
ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నారు. ఈల మ్రోగింది బండి కదిలింది. నా గుండె దడదడ కొట్టుకున్నది. ప్రాణాలతో ఆ ఊరు చేరగలనా అని సంశయం కలిగింది. నడుమ వాడు నావంక కొరకొర చూస్తూ స్టాండర్టన్‌లో దిగు! అక్కడ నిన్నేమి చేస్తానో చూద్దుగాని, అని చిర్రు బుర్రులాడుతూ వున్నాడు. నేను మౌనం వహించి కూర్చున్నాను. దైవమా! సాయపడు అని లోలోన భగవంతుణ్ణి ప్రార్ధించసాగాను,
చీకటి పడింది. బండి స్టాండర్టన్ చేరింది. అక్కడ హిందూదేశస్థుల ముఖాలు కొన్ని కనబడ్డాయి. నా గుండె దడ కొద్దిగా తగ్గింది. నేను బండి దిగగానే వాళ్లు నాదగ్గరికి వచ్చి “మేము మీకోసమే వచ్చాము. ఈసా సేఠ్‌గారి దుకాణానికి వెళదాం. అబ్దుల్లా సేఠ్ గారు మాకు తంతి పంపారు.” అని అన్నారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. సేఠ్ ఈసా హాజీసుమర్‌గారి దుకాణానికి వెళ్లాము. ఆ సేఠ్, ఆయన గుమాస్తాలు నాచుట్టూ మూగారు. నేను జరిగిందంతా చెప్పాను. వాళ్లు విచారం వెలిబుచ్చారు. తాము పడ్డ కష్టాలన్నీ చెప్పి నన్ను ఓదార్చ ప్రయత్నించారు.
గుర్రపు బండ్ల కంపెనీ ఏజంటుకు జరిగిందంతా వ్రాసి పెద్దజాబు పంపించాను. లీడరు చేసిన దురాగతాన్ని గురించి, వాడి బెదిరింపును గురించి కూడా వ్రాశాను. మరుసటి రోజు బండిలో సరియైన ఏర్పాటు చేయమని వ్రాశాను. అందుకు వెంటనే ఆ ఏజంటు సమాధానం పంపాడు. “ఇక్కడి నుండి మీరు బయలుదేరిన బండి కంటే పెద్దబండి రేపు వస్తుంది. దాన్ని నడుపువాడు క్రొత్తవాడు. మిమ్ము బెదిరించినవాడు రేపు రాడు, మీరు బండి లోపలే కూర్చోవచ్చు.” అని అతడు పంపిన సమాధానంలో వుంది. నాకు బెంగ సగం తీరిపోయింది. నన్ను కొట్టిన వాడి మీద కేసు పెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. అందువల్ల యీ వ్యవహారం అంతటితో ముగిసిపోయింది.
మర్నాడు ప్రొద్దున్నే ఈసా సేఠ్ గారి నౌకరు వచ్చి నన్ను గుర్రపు బండి ఎక్కించాడు. లోపల మంచి సీటు లభించింది. ఆ రాత్రికి సుఖంగా జోహాన్సుబర్గు చేరాను.
స్టాండర్టన్ చిన్న వూరు. జోహాన్సుబర్గుకు నారాకను గురించి తంతి యిచ్చారు. అచ్చట మహమ్మద్ కాసిం కమరుద్దీన్ గారి నౌకరు నన్ను తీసుకు పోయేందుకు వచ్చాడు. కాని నేను అతడిని చూడలేదు. అతడు నన్ను పోల్చలేదు. కమరుద్దీన్ గారి దుకాణం చిరునామా వివరం అబ్దుల్లాగారు నాకు తెలియజేశారు. యిక ఏదైనా హోటలుకు వెళదామని భావించాను. ఆ పట్టణంలోని కొన్ని హోటళ్ల పేర్లు నాకు తెలుసు. బండి కుదుర్చుకొని గ్రాండ్ నేషనల్ హోటలుకు వెళ్లాను. హోటలు మేనేజర్ని కలిసి ఒక గది యిమ్మని కోరాను. అతడు కొద్ది సేపు నన్ను ఎగాదిగా చూచి వినమ్రంగా గదులు ఖాళీ లేవు అని చెప్పి సలాం కొట్టి వెళ్లిపోయాడు. అప్పుడు కాసింకమరుద్దీన్ గారి దుకాణానికి వెళ్లాను. అచ్చట నా కోసం ఎదురు చూస్తున్న అబ్దుల్‌గనీ సేఠ్ గారిని కలుసుకున్నాను. వారు నన్నెంతో ఆదరించారు. నాకు హోటల్లో జరిగిన మర్యాదను గురించి చెప్పాను. ఆయన పకపకనవ్వి ‘హోటల్లో మీకు ప్రవేశం ఎలా లభిస్తుందని అనుకున్నారు?’ అని ప్రశ్నించారు.
“అదేమిటి?”
“ఇక్కడ కొన్నాళ్లుంటే మీకే అర్థమవుతుంది. మేము యీ దేశంలో గతిలేక వుంటున్నాము. కేవలం డబ్బు మీదగల ఆశచే ఎన్ని అవమానాలైనా సహించి యిక్కడ పడివుంటున్నాం.” అని దక్షిణ ఆఫ్రికాలో భారత దేశస్థులు పడుతున్న కష్టాల్ని గురించి వివరించారు.
అబ్దుల్ గనీ గారిని గురించి ముందు యింకా వివరంగా వ్రాస్తాను.
ఆయన మళ్లీ ఇట్లన్నారు - “ఈ దేశం మీబోటి వారు వుండడానికి తగిందికాదు. రేపు మీరు ప్రిటోరియాకు బయలుదేరుతారు కదా! ఇక మూడో తరగతి బండిలోనే వెళ్లవలసి వుంటుంది. నేటాలులోను యింతే. ట్రాన్సువాలులో మరీ అధ్వాన్నం. యిక్కడ ఒకటి రెండు తరగతుల టిక్కెట్లు హిందూ దేశస్థులకి యివ్వరు.”
“మీరు అందుకు వ్యతిరేకంగా తగిన ప్రయత్నం చేయలేదా?” “చేయకేం చేశాము. ఎన్నో అర్జీలు పెట్టాం. కాని మనవాళ్లే ఆ తరగతుల్లో ప్రయాణించేందుకు ఒప్పుకోరు.”
నేను రైల్వే నిబంధనలు చదివి చూచాను. అందొక లోపం వుంది. ట్రాన్సువాలు శాసనాల భాష సరిఅయింది కాదు. స్పష్టంగా వుండదు. ముఖ్యంగా రైల్వే నిబంధనలు “నాడు మొదటి తరగతిలోనే ప్రయాణం చేద్దామని వుంది. వీలుకాకపోతే ప్రిటోరియాకు సరాసరి గుర్రపు బండి కుదుర్చుకుంటాను. ముప్పది ఏడు మైళ్ళే కదా!” అని సేఠ్ గారితో అన్నాను.
బండి మీద వెళితే ఎంత సమయం, ధనం వ్యర్ధమవుతుందో ఆయన వివరంగా చెప్పారు. మొదటి తరగతిలోనే వెళ్లమని చెప్పారు. వెంటనే స్టేషను మాష్టరుకు “నేను బారిస్టరును. ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణం చేస్తాను. రేపు ప్రిటోరియాకు మొదటి తరగతిలో ప్రయాణం చేయదలిచాను. నేను వచ్చి మిమ్ము కలుస్తాను, టిక్కెట్టు సిద్ధం చేసి వుంచండి.” అని వ్రాశాను “క్షమించండి” అని సమాధానం వ్రాస్తాడని భయం పట్టుకున్నది. నేను బారిస్టరు వేషంలో టిప్‌టాప్‌గా వెళ్లి ఇంగ్లుడు ఇంగ్లీషులో మాట్లాడితే టిక్కెట్టు తప్పక యిచ్చేస్తాడని భావించాను. ఫ్రాంక్ కోటు తొడుక్కున్నాను, నెక్ టై కట్టుకున్నాను. టీకుటాకుగా వెళ్లి బల్లమీద “కాసు” పెట్టి టిక్కెట్టు యిమ్మని కోరాను. నా వ్యవహారం గమనించి ఆయన జాలిపడ్డాడు. “అయ్యా! నేను ట్రాన్సువాల్ నివాసిని కాను. హాలండు నివాసిని. నాకు మీరు చెప్పిన మాటలు అర్థమైనాయి. మీ ఎడ మాకు సానుభూతి వుంది. మీకు ఫస్టుక్లాసు టిక్కెట్టు యిస్తాను. కాని త్రోవలో గార్డు వచ్చి దిగిపొమ్మంటే మీరు దిగి మూడో తరగతిలో కూర్చోవాలి. అలా అయితేనే టిక్కెట్టు యిస్తాను. ఆ తరువాత మీరు రైల్వే వారి మీద దావా వేయకూడదు.” అని చెప్పి మొదటి తరగతి టిక్కెట్టు నాచేతిలో వుంచాడు. నేను ఆయనకు ధన్యావాదాలు తెలిపి మీ మాటకు బద్ధుణ్ణి అని కూడా చెప్పాను. సేఠ్ అబ్దుల్‌గనీ గారు నన్ను పంపడానికి స్వయంగా స్టేషనుకు వచ్చారు. జరిగినదంతా విని ఆశ్చర్యపడ్డారు. యిలా అన్నారు. “ఇంత వరకు బాగానే వుంది. కాని త్రోవలో గార్డు మిమ్ము చూచి దించివేస్తాడు. ఒకవేళ గార్డు దించకపోతే తోటి తెల్లజాతి ప్రయాణీకులు ఊరుకోరు. దించివేస్తారు.”
నేను మొదటి తరగతి పెట్టె ఎక్కాను. రైలు బయలుదేరింది. జర్నిస్టస్ స్టేషనులో గార్డు టిక్కెట్టు పరిశీలించేందుకై వచ్చాడు. నన్ను చూడగానే మండిపడ్డాడు. వెంటనే లేచి మూడో తరగతి పెట్టెలోకి పొమ్మని వ్రేలితో సౌంజ్ఞ చేశాడు. నేను నా టిక్కెట్టు చూపించాను. “అయితే ఏం? మూడో తరగతి పెట్టెలోకి పో” అంటూ గద్దించాడు.
ఆ పెట్టెలో ఒక్క తెల్లవాడే వున్నాడు. ఆయన గార్డును ప్రతిఘటించి “ఎందుకు పెద్ద మనిషిని బాధిస్తావు? మొదటి తరగతి టిక్కెట్టు కొన్నాడు. కనబడటం లేదా? వారి ప్రక్కన కూర్చునేందుకు నాకు యిబ్బందేమీ లేదు.” అని నావంక చూచి “అక్కడే హాయిగా కూర్చోండి” అని అన్నాడు. “కూలీతో కూర్చునేందుకు మీకే యిబ్బంది లేకపోతే నాకా యిబ్బంది!” అంటూ గొణుగుతూ గార్డు వెళ్లిపోయాడు.
రాత్రి ఎనిమిది గంటలకు రైలు ప్రిటోరియా చేరింది.