6. నేటాల్
ఆంగ్ల దేశానికి వెళ్లినప్పుడు కలిగిన వియోగ దుఃఖం దక్షిణ ఆఫ్రికాకు వెళ్లుతున్నప్పుడు నాకు కలుగలేదు. మా అమ్మగారు యిప్పుడు లేరు. నాకు లోకానుభవంతో బాటు సముద్రయానానుభవం కూడా కలిగింది. బొంబాయి రాజకోటలకు తరచుగా రాకపోకలు సాగిస్తూ వున్నాను.
ఈసారి భార్యను విడిచి వెళ్లడానికి కొంచెం కష్టం కలిగింది. ఇంగ్లాండు నుండి వచ్చిన తరువాత ఒక పిల్లవాడు పుట్టాడు. మా ప్రేమ యింకా కామవాంఛ నుండి విడివడలేదు. కాని మెల్లమెల్లగా మెరుగుపడసాగింది. ఇంగ్లాండు నుండి వచ్చిన తరువాత మేము కలిసి కొద్ది కాలం వున్నాము. ఆమెకు ఉపాధ్యాయుడనై ఏదో విధంగా కొన్ని సంస్కారాలు నేర్పడానికి పూనుకున్నాను. ఆ శిక్షణ పూర్తికావాలంటే ఇద్దరం కలిసి వుండటం అవసరం అని అనుకున్నాము. కాని దక్షిణ ఆఫ్రికాకు వెళ్లే మహోత్సాహంలో వియోగ దుఃఖం అంతగా బాధించలేదు. ఒక సంవత్సరంలో మళ్లీ కలుద్దామని చెప్పి భార్యను ఊరడించి రాజకోట నుండి బొంబాయికి బయలుదేరాను.
దాదా అబ్దుల్లా కంపెనీ వారి ఏజంటు ద్వారా టిక్కెట్టు రావాలి. ఓడలో కాబిన్ ఖాళీగా లేదు. యిప్పడు బయలుదేరి వెళ్లకపోతే ఒక మాసం రోజులు బొంబాయిలోనే వుండాలి. మేము మొదటి తరగతి టిక్కెట్టు కోసం చాలా ప్రయత్నం చేశాము. కాని లాభం లేకపోయింది. మీరు వెళ్లదలచుకుంటే డెక్ మీదనే వెళ్ళాలి. మొదటి తరగతి భోజనం మాత్రం ఏర్పాటు చేశాము. ఆ ఏజంటు చెప్పాడు. అవి నా మొదటి తరగతి ప్రయాణం రోజులు. బారిస్టరు డెక్ మీద ప్రయాణం చేయడమా? అందుకు నేను అంగీకరించలేదు. మొదటి తరగతి టిక్కెట్లు సంపాదించాలని నేను నిర్ణయించుకున్నాను, నేను ఓడ మీదకు వెళ్లి ముఖ్యాధికారిని కలిసి మాట్లాడాను. అతడు దాపరికం లేకుండా యిలా చెప్పాడు. “మా ఓడలో యిదివరకెన్నడూ యింత వత్తిడి లేదు. మొజాంబిక్ గవర్నరు గారు యీ ఓడలో వస్తున్నారు. బెర్తులన్నీ వారే పుచ్చుకున్నారు.” “ఏదో విధంగా నాకు ఒక్కడికి చోటు చేయలేరా” అని అడిగాను. అతడు నన్ను ఎగాదిగా చూచాడు. చిరునవ్వు నవ్వి “ఒక్క ఉపాయం ఉంది. నాగదిలో మరొక బెర్తు ఉంది. అది ప్రయాణీకులకిచ్చేది కాదు. అయినా నీకిస్తాను.” అని అన్నాడు. నేనందుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళి ఏజంటును వెంట తీసుకొని వచ్చాను. 1893 ఏప్రిల్ నెలలో దక్షిణ ఆఫ్రికాలో నా అదృష్టం ఎలా వుంటుందో అని యోచిస్తూ మహోత్సాహంతో బయలుదేరాను.
మొదటి రేవు లామూ. అక్కడికి వెళ్లడానికి 13 రోజులు పట్టింది. త్రోవలో నేను, ఓడ కెప్టెను మంచి స్నేహితులమైనాము. అతనికి చదరంగమంటే యిష్టం. క్రొత్తగా నేర్చుకున్నాడు అందువల్ల అతనితో ఆడటానికి మరొక సరిక్రొత్త వాడు కావాలి నన్ను పిలిచాడు. నేను చదరంగాన్ని గురించి చాలా విన్నాను. కాని ఆట ఎరుగను. చదరంగంలో తెలివితేటలు చాలా అవసరం అని నేర్పరులు చెప్పగా విన్నాను. ఆ కెప్టెను నాకు నేర్పుతానన్నాడు. నాకు ఓర్పు వుండటం వల్ల మంచి శిష్యుడు దొరికాడని అతడు చాలా సంతోషించాడు. ప్రతి ఆటలోను నేనే ఓడిపోతూ వున్నాను. ఓడిన కొద్దీ నాకు బోధించేందుకు అతనికి ఎక్కువగా ఉత్సాహం కలుగుతూ వున్నది. నాకు ఆ ఆట యెడ అభిరుచి కలిగింది. కాని ఆ ఓడ దిగిన తరువాత ఆ అభిరుచి నిలవలేదు. చదరంగంలో నా ప్రవేశం రాజును, మంత్రిని నడుపుట కంటే మించలేదు. లామూ రేవులో ఓడ మూడు లేక నాలుగు గంటలు ఆగింది. నేను రేవు చూద్దామని దిగాను. కెప్టెను కూడా దిగాడు. “యిక్కడి ఈ సముద్రం దగాకోరు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీరు వెంటనే తిరిగి వచ్చివేయండి” అని కెప్టెను గట్టిగా చెప్పాడు. .
ఆ రేవు చాలా చిన్నది. నేను పోస్టాఫీసుకు వెళ్లి అక్కడ గుమాస్తాలుగా పనిచేస్తున్న హిందూదేశం వాళ్లను చూచాను. నాకు సంతోషం కలిగింది. వాళ్లతో మాట్లాడాను. ఆఫ్రికా వాసులు కొంతమంది కనబడగా వారి యోగక్షేమాల్ని గురించి అడిగి తెలుసుకున్నాను. యీ పనులకు కొంత సమయం పట్టింది.
డెక్ మీద ప్రయాణం చేస్తున్న కొందరితో అక్కడ పరిచయం కలిగింది. వారు ఒడ్డున తీరికగా వంట చేసుకొని భోజనాలకు కూర్చున్నారు. వారు ఓడ దాక పోవడానికి ఒక నావ కుదుర్చుకొనగా నేను కూడా దానిలోకి ఎక్కాను. యింతలో హఠాత్తుగా సముద్రంలో పోటు హెచ్చింది. రేవు అల్లకల్లోలం అయింది. మేమెక్కిన నావ మీద బరువు పెరిగింది. ఓడ నిచ్చెనకు మా నావను కట్టి నిలపడానికి వీలు లేనంత బలంగా నీరు పొంగుతూ వుంది. నావ నిచ్చెన దగ్గరకు వెళ్లేసరికి నీటి ప్రవాహం వచ్చి నావను దూరంగా నెట్టివేస్తూ వుంది. ఓడ బయలుదేరుటకు మొదటి ఈల అప్పుడే మోగింది. నాకు తొందర పెరిగింది. కెప్టెను పైనుండి మా అవస్థ చూచాడు. మరో అయిదు నిమిషాలు ఓడను ఆపమని ఆదేశించాడు. నా మిత్రుడొకడు ఓడ దగ్గరగా వున్న ఒక నావవాడికి పదిరూపాయలిచ్చి నన్ను తీసుకురమ్మనగా ఆ నావవాడు దగ్గరకు వచ్చి నన్ను బలవంతాన తన నావలోకి లాక్కున్నాడు. అప్పటికి ఓడ పైకి ఎక్కి వెళ్లే నిచ్చెనను తొలగించి వేశారు. దానితో ఒక మోకు పట్టుకొని నేను పైకి ప్రాకవలసి వచ్చింది. ఓడ వెంటనే బయలుదేరింది.
మొదటి నావలో వున్న సహ యాత్రీకులంతా అక్కడే దిగబడిపోయారు. కెప్టెను మాటలకు గల విలువ ఏమిటో ఇప్పుడు బోధపడింది.
లామూ దాటిన తరువాత మొంబాసా చేరాము. తరువాత జాంజిబారు. అక్కడ ఓడ పదిరోజులు వరకు వుంటుందని, అక్కడ మరో ఓడలోకి మారాలని తెలిసింది.
కెప్టెనుకు నాపై గల ప్రేమ వర్ణనాతీతం అయితే ఆ ప్రేమ మరో వికృత కార్యానికి కారణభూతమైంది. తన వెంట ఆయన నన్ను, మరో తెల్లవాడిని రమ్మన్నాడు. మేము ముగ్గురం ఆయన నావ మీద తీరానికి చేరాం. విహారానికి వెళదాం అన్నాడు. విహారమంటే వాళ్ల భావం ఏమిటో నాకు బోదపడలేదు. ఆ విషయంలో నేనెంత తెలివితక్కువవాడినో ఆయనకు తెలియదు. ఒక తార్పుడుగాడు మా ముగ్గురినీ నీగ్రో స్త్రీల పేటకు తీసుకు వెళ్లాడు. ముగ్గురికి మూడు గదులు చూపించాడు. నేను గదిలో స్త్రీని చూచి సిగ్గుతో కుంచించుకుపోయాను. పాపం, ఆమె నన్ను గురించి ఏమనుకొన్నదో ఆ దేవునికి తెలియాలి. కెప్టెను కొంత సేపైన తరువాత నన్ను పిలిచాడు. నేను వెళ్లిన వాణ్ణి వెళ్లినట్లు బయటకి వచ్చాను. నా చేతగానితనాన్ని అతడు పసిగట్టాడు. మొదట కొంచెం నాకు చిన్నతనంగా వుంది కాని ఆ తర్వాత ఆ విషయం తలచుకుంటేనే భయం వేసింది. ఆడది ఎదురుగా వుంటే జారిపోకుండా వుంచమని భగవంతుణ్ణి ప్రార్థించాను. హృదయ దౌర్బల్యాన్ని తలచుకొని బాధపడ్డాను. ముందే గదిలోకి వెళ్లనని ధైర్యంగా చెప్పి యుంటే బాగుండేది కదా” అని అనుకున్నాను నా జీవితంలో యిది మూడో అనుభవం. కల్లాకపటం ఎరుగని చిన్నవాళ్లు సాపలిప్తులవుతారు. అయినా నేను లోపలికి వెళ్లడం తప్పుగదా! లోపలికి వెళ్లి ఊరుకోవడం పురుషార్ధం కాదు. ముందే వెళ్లనని చెప్పి బయటనే వుండి వుంటే అది నిజంగా పురుషార్ధం. యీ ఘట్టం భగవంతుని మీద గల నా విశ్వాసాన్ని బాగా పెంచిందని చెప్పగలను. ఈ రేవులో ఏడు రోజులకు పైగా వుండవలసి రావడం వల్ల నేను పట్టణంలో బసచేసి చుట్టుప్రక్కల చూచి వచ్చాను. జాంజిబారు వృక్షాలకు నిలయం. మలబారులా వుంటుంది. అక్కడి చెట్ల ఎత్తును, ఆ చెట్లకు కాచే పండ్ల నిగనిగల్ని చూచి ఆశ్చర్యపడ్డాను.
తరువాత మా ఓడ మొజాంబిక్‌లో ఆగింది. మే నెలాఖరుకు నేటాలు చేరుకున్నాము.