సత్యశోధన/రెండవభాగం/26. రాజభక్తి



26. రాజభక్తి

నాకు రాజభక్తి అధికం. అంతటి రాజభక్తి మరొకరికి వుందని నేను అనుకోను. సత్యం మీద నాకు గల స్వాభావికమగు ప్రేమయే యిట్టి రాజభక్తికి కారణమని భావిస్తున్నాను. ఇట్టి రాజభక్తి విషయంలోగాని, మరే విషయంలో గాని నటన అనునది నాకు చేతకాదు. నేటాలులో నేను పాల్గొనే ప్రతి సభలోను జనం గాడ్ సేఫ్ ది కింగ్ అను పాట పాడి వెళ్లిపోతూ వుండేవారు. వారితో కలిపి పాడటం నా విధియని భావించేవాణ్ణి. బ్రిటిష్ పరిపాలనా దోషాలు నాకు తెలుసు. బ్రిటీష్ పరిపాలకుల యొక్క నీతి మొత్తం మీద మేలైనదని భావించేవాణ్ణి.

దక్షిణ - ఆఫ్రికాలో గల వర్ణద్వేషం బ్రిటీష్ వారి సంప్రదాయం కాదని నా భావం. అందువల్ల రాజభక్తిలో తెల్లవారిని కూడా మించిపోయాను. గాడ్ సేవ్ ది కింగ్ అను పాట కూడా నేర్చుకున్నాను. అందరూ లేచిపాడుతూ వున్నప్పుడు నేను కూడా లేచి నిలబడి ఆ పాట పాడుతూ వుండేవాణ్ణి. రాజభక్తి అవసరమని ప్రతి సమయంలోను నేను స్పష్టంగా ప్రకటిస్తూ వున్నాను.

జీవితంలో నేను ఎన్నడూ నా రాజభక్తిని అమ్ముకోలేదు. దాని ద్వారా ఎన్నడూ స్వప్రయోజనం సాధించాలని భావించలేదు. రాజభక్తి ఒక విధియని భావించాను. దానివల్ల ప్రతిఫలం నేనెన్నడూ ఆశించలేదు. పొందలేదు. నేను ఇండియాకు వచ్చిన రోజుల్లో విక్టోరియా రాణి “డైమండ్ జూబ్లీ” మహోత్సవం ఆరంభమైంది. రాజకోటలో ఏర్పాటుచేయబడ్డ ఒక సంఘంలో చేరమని నాకు పిలుపు వచ్చింది. నేను అంగీకరించాను. ఆ ఉత్సవం కూడా పైన పటారం లోన లొటారమే. అంతా మోసం. చాలా బాధపడ్డాను. ఆ సంఘంలో సభ్యునిగా వుండటమా, మానడమా అను ప్రశ్న బయలుదేరింది. చివరికి యోచించి యోచించి ‘పనిలో మాత్రం సత్యంగా వ్యవహరిద్దాం’ అను నిర్ణయానికి వచ్చాను.

ఆ ఉత్సవాల్లో చెట్లు నాటటం ఒక కార్యక్రమం. చాలా మంది డాబు కోసం, పై అధికారుల మెప్పుకోసం, మొక్కలు నాటుతూ వున్నారని తెలిసింది. చెట్లు నాటడం ఒక విధి కాదు, అందువల్ల దీనికి బదులు మరో కార్యక్రమం చేపట్టమని వారికి మరీ మరీ చెప్పి చూచాను. కాని వాళ్ళు నా మాటను పట్టించుకోలేదు. నా పాలబడిన మొక్కను మాత్రం జాగ్రత్తగా నాటి, నీరు పోసి పెంచినట్లు గుర్తు. మా పిల్లలకు కూడా గాడ్ సేవ్ ది కింగ్ అను పాటను నేర్పాను. రాజకోట యందలి ట్రైనింగ్ కళాశాల విద్యార్థులకు కూడా యీ పాట నేర్పినట్లు గుర్తు. కాని అది జూబిలీలోనో లేక ఎడ్వర్డు పట్టాభిషేక సమయంలోనో సరిగా చెప్పలేను. కాని తరువాత ఆ పాటను నేను వ్యతిరేకించాను. నా మనస్సునందు ఆ హింసను గురించి చర్చ అధికమైన కొద్దీ నేను జాగ్రత్తపడ్డాను.

“రాజ శతృవులను చంపుము ఆ మోసగాండ్ర మోసాలను ద్రుంపుము” అను పాటయందలి వాక్యాలు నాకు గిట్టలేదు. నా మిత్రుడు డాక్టరు బూధ్ గారికి నాయీ సంశయం తెలియజేశాను. ఆయన కూడా అంగీకరించి అహింసావాది ఎవ్వరూ ఇందుకు అంగీకరించరని, అట్టివారు దీన్ని పాడటం కష్టమని అన్నారు. ఈ పాటలో శతృవులని ఊహించబడిన వారు మోసగాండ్రని ఎలా అనగలం? శతృవులైనంత మాత్రాన తప్పంతా వారిదేనా? పరమేశ్వరుని వద్ద మనకు న్యాయం లభించును కదా! డాక్టరు బూధుగారు నా వాదాన్ని సమర్ధించడమే గాక వారి సమాజంలో ఈ పాటకు బదులు మరో పాటను రచించి గానం చేయసాగాడు.

రాజభక్తితో బాటు రోగులకు ఉపచారం చేయడం నాకు అలవాటు అయిపోయింది. మిత్రులైనా, పరులెవరైనా వారికి ఉపయోగపడటమంటే నాకు ఎంతో ప్రీతి.

రాజకోటలో దక్షిణ - ఆఫ్రికాను గురించి కరపత్రం వ్రాస్తున్నప్పుడు నేను ఒక పర్యాయం బొంబాయి వెళ్లవలసి వచ్చింది. పెద్ద పెద్ద పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి యీ విషయమై ప్రజాభిప్రాయం సేకరించాలని నా అభిలాష. అందుకు ముందుగా బొంబాయిని ఎన్నుకొన్నాను. జడ్జీ రేవడేగారిని కలసి మాట్లాడాను. నేను చెప్పిందంతా విని, చివరికి ఫిరోజ్‌షా మెహతాగారిని చూడమని చెప్పారు.

తరువాత జడ్జీ బదురుద్దీన్ తైయబ్జిగారిని చూచాను. వారు కూడా అదే విధంగా చెప్పి “రేనడేగారు, నేనూ ఏమీ చేయలేము. మాస్థితి నీకు తెలుసు. ప్రజా వ్యవహారాల్లో మేము కల్పించుకోకూడదు. నీ పనికి మేము అనుకూలురం. యీ విషయంలో నీకు సాయం చేయగల వారు ఫిరోజ్ షా మెహతాగారొక్కరే” అని చెప్పారు.

నేను ఫిరోజ్ షా మెహతా గారి దర్శనం చేసుకోవాలని మొదటనే భావించాను. ఈ పెద్దలు వారి సాయం పొందమని చెప్పడం వల్ల ప్రజల్లో వారికి ఎంత పలుకుబడి వున్నదో బోధపడింది. నేను వారి దగ్గరికి వెళ్లి వారిని కలిశాను. వారిని చూచేసరికి కళ్లు మిరిమిట్లుగొన్నంత పని అయింది. వారి పేరుతో బాటు ప్రచారంలో వున్న బిరుదులు చాలా విన్నాను. బొంబాయి కేసరి అని, మకుటంలేని బొంబాయి పాదుషా అని బిరుదులు వారికి పున్నాయి. కాని బొంబాయి పాదుషా అనుకున్నంత భయంకరంగా లేడు. పితృవాత్సల్య భావంతో ఎదిగిన కుమారుణ్ణి ఆదరించినట్లు ఆయన నన్ను ఆదరించాడు. మేమిద్దరం వారి గదిలో కూర్చున్నాం. మిత్రులు, అనుయాయులు ఆయన చుట్టూ ఉన్నారు. వారిలో డి ఇ వాచాగారొకరు. కామాగారు మరింకొకరు. ఆ యిద్దరికీ నేను పరిచయం చేయబడ్డాను. లోగడ వాచాగారిని గూర్చి విని వున్నాను. అతడు మెహతాగారికి కుడిభుజం. ఆయన లెక్కల్లో గట్టివాడని వీరచంద్ గాంధీ చెప్పారు. మనిద్దరం కలిసి మాట్లాడాలి అని వాచాగారన్నారు.

రెండు నిమిషాల్లో యిదంతా జరిగింది. మెహతాగారు నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. నేను రనడే గారిని, తైయబ్జీగారిని చూచానని వారికి చెప్పాను. “గాంధీ! ముందుగా ఒక పని జరగాలి. నీ పనికి నేను తప్పక సహాయం చేస్తాను” అని మెహతాగారు వెంటనే తన కార్యదర్శి మున్షీగారిని పిలిచి సభాదినం నిర్ణయించమని అన్నారు. సభాదినం నిశ్చితమైంది “సభ రేపు జరుగుతుందనగా నీవు నాకొక్కసారి కనపడు” అని మెహతాగారు నన్ను పంపివేశారు. వారి సంభాషణ విన్న తరువాత నాకు భయం పోయింది. సంతోషంతో ఇంటికి చేరాను.

మా బావ బొంబాయిలోనే వున్నాడు. ఆయనను చూచేందుకు వెళ్లాను. ఆయన జబ్బుపడి వున్నాడు. బీదవాడు. నా సోదరి వల్ల ఆయనకు ఉపచారం జరగడం కష్టంగా వుంది. నాతో రాజకోటకు రమ్మని అన్నాను. అతడు అంగీకరిచాడు. నా సోదరిని, బావను తీసుకొని రాజకోట చేరాను. వ్యాధి ఎక్కువైంది. రాత్రింబవళ్ళు ఆయనకు ఉపచారం చేశాను. రాత్రిళ్లు మేలుకొని వుండవలసి వచ్చింది. ఆయనకు ఉపచారం చేస్తూనే దక్షిణ ఆఫ్రికాను గురించి వ్రాస్తూ వున్నాను. చివరికి ఆయన కన్నుమూశాడు. తుదికాలంలో ఆయనకు ఉపచారం చేసే అవకాశం లభించినందున నా మనస్సుకు శాంతి లభించింది.

ఈ విధంగా రోగులకు ఉపకరించాలనే కోరిక ముందు ముందు బాగా ఎక్కువైంది. రోగుల సేవలో వున్నప్పుడు నా మిగతా పనుల విషయంలో జాగ్రత్తపడుతూ వుండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు నా భార్యనేగాక యింటివారందరినీ ఆ పనులకు వినియోగిస్తూ వుండేవాణ్ణి. ఈ ప్రవృత్తిని నేను కోరిక అని అంటాను. ఏ మంచిపని అయినా సకాలంలో ఉపయోగపడితే అది తక్షణం ఆనందం కలిగిస్తుంది. అది నా అనుభవం. దంభంతో లేక పరభీతితో చేసే పని చివరికి అతణ్ణి అణచివేస్తుంది. అట్టివాళ్లు మాసిపోతారు. ఏ సేవ హృదయానికి ఆనందం కలిగించదో అది సేవచేసేవానికి, సేవ చేయించుకొనే వానికి కూడా ఆహ్లాదం కలిగించదు. సేవ ముందు భోగాలు, ధనోపార్జన మొదలుగా గల కోరికలన్నీ తుచ్ఛమైనవిగా తోస్తాయి.