21. మూడు పౌండ్ల పన్ను
బాలసుందరం కేసుతో గిరిమిటియాలతో నాకు సంబంధం పెరిగింది. అటు ప్రభుత్వం కూడా ఎక్కువ పన్నులు వసూలు చేసి వారిని బాధించడం ప్రారంభించింది. అందువల్ల వారిని గురించి చదువవలసి వచ్చింది.
1894వ సంవత్సరంలో నేటాలు ప్రభుత్వం వారు గిరిమిటియాలు సాలీనా తలకు 25 పౌండ్ల చొప్పున అంటే 375 రూపాయలు పన్ను కట్టాలని బిల్లు తయారుచేశారు. దీన్ని చూచి నిర్విణ్ణుడనయ్యాను. ఈ విషయం కాంగ్రెస్ సమావేశంలో చర్చకు ప్రవేశ పెట్టాను. అందు యీ బిల్లును వ్యతిరేకంగా గట్టి ప్రయత్నం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది.
ఈ పన్నుకు అసలు కారణం ఏమిటో యిక్కడ కొద్దిగా వివరిస్తాను. 1860లో నేటాలు నందలి తెల్లవారు అక్కడి భూములు కొన్నారు. అక్కడి భూములు చక్కెర తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే కూలీలు దొరకడం కష్టమైంది. ఆ దేశంలో కూలివాళ్లను రప్పించడం అవసరమని భావించారు. అందువల్ల నేటాలు ప్రభుత్వం వారు బ్రిటిష్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి భారత దేశాన్నుండి కూలివారిని వలస తీసుకొనిపోయేందుకు అనుమతి సంపాదించారు. ఈ కూలి జనం నేటాలులో అయిదేండ్లు పని చేయుటకు అంగీకరిస్తూ గిరిమిటు మీద (కరారునామా) సంతకం చేయాలి. గడువు దాటిన తరువాత వారి యిష్టం. అంటే అక్కడే నివసించదలిస్తే నివసించవచ్చు. శక్తి వుంటే భూమి కొనుక్కోవచ్చు. ఈ విధంగా తెల్లవాళ్లు గిరిమిటీలకు ఆశ పెట్టారు. అయిదు సంవత్సరాల తరువాత కూడా భారతదేశ కూలీలు కాయకష్టంచేసి ప్రయోజనం పొందవచ్చునని తెల్లవాళ్లు ప్రకటించారు.
అయితే భారతీయులు తెల్లవారనుకున్న దానికంటే ఎక్కువ లాభం పొందారు. వారు రకరకాలైన కూరగాయలు విరివిగా పండించసాగారు. ఇండియా నుండి మంచి కూరగాయల విత్తనాలు వెంటతీసుకొని వెళ్లి తద్వారా బాగా కూరగాయలు పండించి అక్కడ చవుకగా జనానికి అందచేశారు. మామిడితోటలు పెంచారు. వర్తకం కూడా చేయడం ప్రారంభించారు. ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు కొన్నారు. కొందరు కూలీలు భూస్వాములైనారు. భారతదేశపు వర్తకులు కొందరు వీరితోబాటు వెళ్లి అచ్చట పాతుకుపోయారు. ఇట్టివారిలో కీ.శే, సేఠ్ అబుబకర్ అమద్ గారు ప్రధములు. వారు కొద్ది కాలంలోనే తమ వ్యాపారాన్ని వృద్ధికి తెచ్చారు.
ఇదంతా చూచి తెల్లవ్యాపారస్థులు కంగారుపడిపోయారు. నల్లవాళ్లను పిలుచుకు వెళ్లినప్పుడు తెల్లవాళ్లకు వీళ్ల వ్యాపార రహస్యాలు తెలియవు. భారతీయులు వ్యవసాయదారులైతే ఫరవాలేదుగాని వ్యాపారంలో సైతం పోటీకి దిగేసరికి తెల్లవాళ్లు సహించలేకపోయారు. భారతీయుల యెడ అసూయ కలగడానికి ఇదే ముఖ్య కారణం. దీనికి మరిన్ని ఇతర కారణాలు కూడా తోడు అయ్యాయి. నల్లవారి రకరకాల జీవన పద్ధతులు, కొంచెం వ్యయమైనా మప్పితంగా గృహ నిర్వహణ కావించుకోగల స్థితి, అల్ప లాభ సంతోషం, ఆరోగ్య నియమాలను గురించిన ఉదాసీనత, చుట్టుప్రక్కల్ని శుచిగా వుంచుకోవడంలో అశ్రద్ధ, ఇండ్లను మరమ్మత్తు చేయించి బాగా వుంచుకొనడంలో పిసినారితనం మొదలుగా గల వ్యవహారాలన్నింటి వల్ల వర్ణ ద్వేషమనే చిచ్చు బాగా రేగింది. ఈ ద్వేషం తరువాత వోటు హక్కు తొలగించే బిల్లు రూపంలోను, ఆ తరువాత గిరిమిటియాలు మూడు పౌండ్ల తలసరి పన్ను చెల్లించే బిల్లు రూపంలోను ప్రత్యక్షమైంది. ఈ శాసనాలే గాక అనేక చిక్కులు అదివరకే ఏర్పడి వున్నాయి. గిరిమిటియాలను, గిరిమిటియా కాలం అయిదేండ్లు ముగియక మునుపే ఆ గడువు ముగిసినట్లు భావించి బలవంతంగా పంపివేయడానికి పూనుకున్నారు. కాని అందుకు ఇండియా ప్రభుత్వంవారు అంగీకరించలేదు. తరువాత కొన్ని షరతులు ప్రవేశ పెట్టబడ్డాయి.
(1) గిరిమిటియాలు తమ నియమిత కాలం పూర్తికాగానే ఇండియాకు వెళ్లిపోవాలి. అలా వెళ్లని యెడల
(2) రెండేండ్లకు ఒక్కసారి క్రొత్త ఒడంబడిక వ్రాస్తూ వుండాలి. ఒడంబడిక వ్రాయబడినపుడు జీతం కొంచెం కొంచెం పెంచబడుతూ వుంటుంది.
(3) క్రొత్త ఒడంబడిక వ్రాయక, ఇండియాకు తిరిగిపోకుండా నేటాలులోనేవుంటే సాలుకు 25 పౌండ్లు అనగా 375 రూపాయలు పన్ను రూపంలోచెల్లిస్తూ వుండాలి.
ఈ షరతుల్ని ఇండియా ప్రభుత్వం వారిచే అంగీకరింపచేయుటకు సర్ హెన్రీ బిన్, మిస్టర్ మేసను అనువారు ఇండియాకు వచ్చారు. అప్పుడు లార్డ్ ఎల్గిన్ ఇండియా వైస్రాయిగా వున్నారు. అతడు 25 పౌండ్ల పన్ను అంగీకరించాడు. ఇది వైస్రాయి చేసిన పెద్ద తప్పిదం. అప్పుడూ యిప్పుడూ కూడా నా అభిప్రాయం ఇదే. ఈ విధంగా నిర్ణయించి అతడు ఇండియాకు ఈషణ్మాత్రమైనా మేలు చేయలేదు. నేటాలు తెల్లవాళ్లకు ఆ విధంగా లాభం చేకూర్చడం వైస్రాయికి పాడిగాదు. మూడు నాలుగేండ్లలో ప్రతి గిరిమిటియా తనకు, తన భార్యకు, పదహారేండ్ల కొడుక్కు, పదమూడేండ్ల కుమార్తెకు మూడు మూడు పౌండ్ల చొప్పున పన్ను చెల్లించాలి. నెలకు వారి ఆదాయం 14 షిల్లింగులు మాత్రమే. అంతకంటే మించి సంపాదించని భార్యాభర్తలకు, వారిద్దరి పిల్లలకు కలపి కుటుంబానికి సాలుకు 12 పౌండ్లు అంటే 180 రూపాయల పన్ను వేయడం ఏ దేశంలోను కనీవినీ ఎరుగని అత్యాచారమే.
ఈ పన్నును ప్రతిఘటిస్తూ మేము ఉద్యమం ప్రారంభించాము. ఈ విషయంలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ మౌనం వహించియుంటే ఇండియా వైస్రాయి 25 పౌండ్లు మంజూరు చేసియుండేవాడే. 25 పౌండ్లు 2 పౌండ్లకు తగ్గడం కూడా నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారు జరిపిన ఉద్యమ ప్రభావమే కావచ్చు లేక నా భావం పొరపాటే కావచ్చు. కాంగ్రెసువారు ఉద్యమం నడిపినా నడపకపోయినా ఇండియా ప్రభుత్వం వారు 3 పౌండ్ల పన్ను మంజూరు చేసియుందురని అనవచ్చు. ఏది ఏమైనా ఇది భారతీయుల యెడ అనుచిత చర్యయే. భారతదేశ యోగక్షేమాలను పరిరక్షించవలసిన వైస్రాయి అమానుషమైన యిట్టి పన్నును మంజూరు చేసి యుండకూడదు. ఈ పన్ను 25 పౌండ్ల నుండి అనగా 375 రూపాయల నుండి 3 పౌండ్లకు అనగా 45 రూపాయలకు తగ్గింపబడినా అది నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారికి గౌరవప్రదం కాదు! గిరిమిటియాలకు ఏమీ మేలు జరగలేదను విషయం స్పష్టం. అది నిర్వివాదాంశం. ఈ పన్నును రద్దు చేయించి ముదరా యిప్పించాలని కాంగ్రెసు వారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని వారు ఎన్నడూ విడిచి పెట్టలేదు. అయితే యీ నిర్ణయం నెరవేరడానికి ఇరవై సంవత్సరాల కాలం పట్టింది. ఒక్క నేటాలు నందలి భారతీయులేగాక దక్షిణ ఆఫ్రికాలో నివసిస్తున్న భారతీయులంతా కలిసి ఏకోన్ముఖంగా పెద్ద ఉద్యమం నడిపితేనే గాని ఆ పన్ను రద్దుకాలేదు. గోఖలే గారికి రద్దు చేస్తామని మాట యిచ్చి కూడా చివరికి నెరవేర్చక పోయేసరికి తుది సమరం ప్రారంభించవలసి వచ్చింది. ఆ సమరంలో గిరిమిటియాలంతా పూర్తిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వారు తుపాకులు కాల్చినందున చాలామంది గిరిమిటియా భారతీయులు ప్రాణాలు అర్పించారు. పదివేల మందికి పైగా నిర్బంధింపబడి జైళ్లకు వెళ్లారు.
అయితే చివరికి సత్యమే జయించింది. భారతీయుల బాధల రూపంలో సత్యం అక్కడ ప్రత్యక్షమైంది. అచంచలమైన ఓర్పు, నమ్మకం, విసుగు విరామం లేని పట్టుదల, పూనిక వల్ల ఆ యుద్ధంలో జయం లభించింది. లేకపోతే జయం లభించియుండేది కాదు. ఆ పోరాటం జరుపకుండా మానివేసివున్నా, లేక నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారు ఆ విషయం మరిచిపోయినా తల పన్ను గిరిమిటియాల మీద పడియుండేదే. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతీయ గిరిమిటియాలు చెల్లిస్తూ వుండేవారే. ఆ అపయశస్సు దక్షిణ ఆఫ్రికా యందు నివసిస్తున్న భారతీయులకే గాక భారతదేశంలో నివసిస్తున్న సమస్త భారతీయులకు కూడా ఆపాదించి యండేది.