15. నేను పడ్డ మధన
క్రైస్తవ మిత్రుల వల్ల నాకు కలిగిన అనుభవాల్ని వివరిస్తాను.
బేకరు గారికి నా భవిష్యత్తును గురించి ఆతురత ఎక్కువైంది. ఆయన నన్ను వెల్లింగ్టన్ పట్టణంలో జరిగిన సభకు తీసుకువెళ్లారు. ప్రొటెస్టెంట్ తెగవారు ధర్మ ప్రభోదానికి, ఆత్మ పరిశుద్ధికి, కొన్ని సంవత్సరాలకు ఒక్కో పర్యాయం అట్టి సమ్మేళనాలు జరుపుతూ వుంటారు. ఇవి ధర్మపునరుద్ధరణకు, ధర్మ పునః ప్రతిష్టకు నిర్దేశింపబడిన సమ్మేళనాలు. దానికి అధ్యక్షుడు రివరెండు ఆండ్రూమురే. ఆయన ఆ పట్టణంలో ప్రధాన మతాచార్యుడు. ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఆ సమ్మేళనంలో జరిగే మతప్రబోధం, అచ్చటికి వచ్చేవారి మహోత్సాహం, దాని పవిత్రత మొదలగు వాటిని చూచి నేను ఏసుమతంలో తప్పక కలిసిపోతానని బేకరుగారు భావించారు.
బేకరుగారికి ప్రార్ధనా బలమే మహాబలం. ప్రార్ధనపై ఆయనకు అమిత విశ్వాసం, హృదయ పూర్తిగా చేయబడే ప్రార్ధనను భగవంతుడు తప్పక వింటాడని ఆయన విశ్వాసం. ఐహిక సంబంధమైన కోరికలు కూడా ప్రార్ధన వల్ల నెరవేరుతాయని నమ్మే బ్రిస్టల్ నివాసి జార్జి ముల్లర్ వంటి వారిని ఆయన ప్రమాణంగా పేర్కొంటారు. ప్రార్ధనా మహిమను గురించి ఆయన చెబుతూ వుంటే నేను తటస్థభావంతో వినేవాణ్ణి. అంతరాత్మ గనుక ప్రబోధిస్తే నేను తప్పక ఏసు మతంలో చేరతాననీ, అట్టి స్థితిలో ప్రపంచమందలి ఏ శక్తీ నన్ను ఆపలేదని బేకరు గారికి చెప్పాను. యీ విధమైన వాగ్దానం చేయుటకు నేను సందేహించలేదు. అప్పటికే నేను అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోవడం ప్రారంభించాను. అంతరాత్మ చెప్పిన రీతిగా నడుచుకోవడమంటే నాకు ఆనందంగా వుండేది. వాస్తవానికి విరుద్ధాచరణ కష్టదాయకం. దుఃఖప్రదం కూడా.
మేము వెల్లింగ్టన్ పట్టణం వెళ్లాము. నా వంటి నల్లవాడిని వెంటబెట్టుకు వెళ్లడం వలన బేకరు గారికి చాలా కష్టాలు కలిగాయి. దారిలో ఆయనకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి. మధ్యలో ఆదివారం వచ్చినందున మా ప్రయాణం ఆగిపోయింది. బేకరు గారు, వారి బృందంలోని వారు ఆదివారం నాడు ప్రయాణం చేయరు. మేము ఒక స్టేషనులో ఆగాము. అక్కడి హోటలు యజమాని వాద ప్రతివాదాలు జరిగిన తరువాత నాకు భోజనం పెట్టేందుకు అంగీకరించాడు. అయితే భోజనశాలలో అందరి సరసన కూర్చోనిచ్చేందుకు అతడు అంగీకరించలేదు. బేకరుగారు సామాన్యంగా మెత్తబడే రకంకాదు. హోటలుకు వచ్చే అతిధుల హక్కుల్ని గురించి ఆయనను నిలదీశాడు. బేకరు గారికి కలిగిన కష్టం నాకు బోధపడింది. వెల్లింగ్టన్ పట్టణంలో కూడా నేను బేకరుగారితోనే వున్నాను. నా వల్ల తను పడుతున్న కష్టాలు నాకు తెలియకుండా వుంచాలని ఆయన తపన. కాని నాకు అవన్నీ తెలుస్తూనే వున్నాయి.
ఈ సభలో పాల్గొన్న క్రైస్తవులందరూ చాలా శ్రద్ధాళువులు. వారి భక్తి నాకు ఎంతో ఆనందం కలిగించింది. నేను రివరెండు ముర్రే గారి దర్శనం చేసుకున్నాను. అక్కడ చాలామంది నా కోసం భగవంతుణ్ణి ప్రార్ధించడం చూచాను. వారి భజనలు కొన్ని మధురాతి మధురంగా ఉన్నాయి.
వెల్లింగ్టన్‌లో సభ మూడు రోజులపాటు జరిగింది. అచ్చటికి వచ్చిన వారి మత విశ్వాసం నేను బాగా గమనించాను. కాని అంతమాత్రాన నా మత విశ్వాసాన్ని నేనెందుకు పరిత్యజించాలి? ఏసు మతంలో కలియకపోతే స్వర్గం గాని, ముక్తిగాని కలుగవు అని అనడం, దాన్ని నమ్మడం సరికాదు. క్రైస్తవ మిత్రులకు నేనీ విషయం చెప్పేసరికి వారి ప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది. కాని అందుకు నేనేం చేయగలను?
నా కష్టాలు యింకా పెరిగాయి. జీససు దేవుని ఏకైక పుత్రుడని అనడం, వారిని నమ్మిన వారికే అమృతత్వం కలుగుతుందని అనడం నా విశ్వాసానికి మించిన మాటలు. నిజానికి దేవునికి పుత్రులే గనుక వుంటే మనమంతా ఆయనకు పుత్రులమే గదా! జీససు భగవత్సముడు గాని లేక సాక్షాత్తు భగవంతుడే అయితే మనమంతా భగవత్సములమే లేక భగవంతులమే కదా! జీససు తన మృతిచేత, మరియు తన రక్తము చేత జగత్తు నందలి పాపాల్ని కడిగివేశాడను వాక్యాల అర్ధం నాకు బోధపడలేదు. వ్యంగ్యార్ధం కొంత సత్యం కావచ్చును. క్రైస్తవ మత ప్రకారం మనుష్యునికే ఆత్మ వుంటుంది. జంతువులు మొదలుగా గల వాటికి ఆత్మ వుండదు. వాటికి చావుతో సరి. యీ విషయం నాకు నచ్చలేదు.
జీససు త్యాగి, మహాత్ముడు, మహాగురువు అంగీకరిస్తాను. కాని అతడొక అద్వితీయ పురుషుడు కాడు. సిలువపై ఆయన ప్రపంచానికి ఒక మహా దృష్టాంతం. కాని ఆయన మృతి యందు ఏదో రహస్యం లేక చమత్కారం లేక ప్రభావం వున్నదని చెబితే నా హృదయం అంగీకరించదు. ఇతరులీయజాలని ఏ మహాప్రసాదము క్రైస్తవుల పవిత్ర జీవితాలు నాకు ప్రసాదించలేదు. ఇతర ధర్మాలలో కూడా నాకు క్రైస్తవ సంస్కారాలు కనబడ్డాయి. సిద్ధాంత దృష్టితో పరిశీలిస్తే ఏసు సిద్ధాంతాలలో అలౌకికత నాకు కనబడలేదు. త్యాగంలో హిందువులు క్రైస్తవులను ఎన్నో రెట్లు మించిపోతారని నాకు విశ్వాసం కలిగింది. క్రైస్తవ మతమే సంపూర్ణమని ఇతర మతాల కంటే శ్రేష్టమైనదని నాకు నమ్మకం కలుగలేదు.
సమయం దొరికినప్పుడల్లా క్రైస్తవ మిత్రులకు నా హృదయంలో సాగిన యీ మధనను గురించి వివరించాను. వారిచ్చిన సమాధానాలు నాకు సంతోషం కలిగించలేదు.
ఈ విధంగా క్రైస్తవ మతం శ్రేష్టమైనదని కూడా నాకు నమ్మకం కలగలేదు. హిందూమత మందలి దోషాలు నా కండ్లకు కనబడసాగాయి. అస్పృశ్యత హిందూమతంలో ఒక భాగమైతే, అది జీర్ణమై పోయిన భాగం లేక అత్యాధునిక దురాచారం. ఇన్ని వర్ణాలు, ఇన్ని శాఖలు ఎందుకో నాకు బోధపడలేదు. వేదాలు అపౌరుషేయాలు అయితే బైబిలు, ఖురానులు అపౌరుషేయాలుకావా?
క్రైస్తవ మిత్రులు నన్ను ఏసు మతంలో కలపాలని ఎలా ప్రయత్నించారో, అలాగే మహమ్మదీయులు తమ మతంలో కలుపుకునేందుకు ప్రయత్నించారు. అబ్దుల్లా సేఠ్ మాటిమాటికీ ఇస్లాం మత గ్రంధాలు చదవమని మరీమరీ చెబుతూ వుండేవాడు. ఆయన ఎప్పుడూ ఇస్లాం మత ప్రాశస్త్యాన్ని గురించి చెబుతూ వుండేవాడు.
ఈ విషయాలన్నీ కవిరాయచంద్ భాయీకి జాబు ద్వారా తెలియజేశాను. భారత దేశమందున్న యితర విద్వాంసులకు కూడా జాబులు వ్రాశాను. సమాధానాలు కూడా చాలా వచ్చాయి. రాయచంద్‌భాయి వ్రాసిన జాబు నాకు కొంత సంతృప్తిని కలిగించింది, “ఇంకా లోతుగా హిందూమతాన్ని తెలుసుకో” అని రాయచంద్ వ్రాశారు. “పక్షపాతం మాని పరిశీలిస్తే హిందూమత సిద్ధాంతాల యందున్న సూక్ష్మత, గాంభీర్యం, ఆత్మ వివేకం, దయ, ధర్మ నిర్ణయం వంటి విశేషాలు ఇతర మతాల్లో కనబడవు” అని కూడా ఆయన వ్రాశారు.
సెల్‌గారి ‘ఖురాను’ అనువాదం చదివాను. మరికొన్ని ఇస్లాం మత గ్రంథాలు కూడా సంపాదించాను. ఇంగ్లాండు నందలి క్రైస్తవ మిత్రులకు ఉత్తరాలు వ్రాయసాగాను. ఆ మిత్రులలో ఒకరు నాకు ఎడ్వర్డు మెయిట్లండుగారిని పరిచయం చేశారు. వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. అన్నా కింగ్స్‌ఫోర్డు గారును, తానును కలిసి వ్రాసిన “ది పరఫెక్ట్ వే” అను గ్రంధం ఆయన నాకు పంపించారు. ఇప్పుడు ప్రచారంలో వున్న క్రైస్తవ మత ఖండన ఆ గ్రంధంలో వుంది. మెయిట్లండు గారు ‘ది న్యూ ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ బైబిల్’ అను గ్రంధం హిందూమత విధానంలో వుంది. టాల్‌స్టాయి గారి “ది కింగ్‌డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు” అను గ్రంథం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఆ గ్రంథం నా మనస్సులో అంకితమై పోయింది. అందలి స్వతంత్ర్య యోచనా విధానం, ప్రౌఢ విధానం, శుద్ధ సత్యం వీటిని బట్టి పరిశీలించి చూస్తే యీ గ్రంధం ఎదుట కోట్సుగారిచ్చిన గ్రంధాలన్నీ దండుగేనని అనిపించింది.
ఆ గ్రంధ పఠనం వల్ల నేను క్రైస్తవ మిత్రులెన్నడును ఊహించని దారిలో పడ్డాను. మెయిట్లండుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చాలాకాలం నడిచాయి. శాశ్వతంగా కన్ను మూయనంతవరకు రాయచంద్‌భాయి గారికి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. వారు పంపిన గ్రంధాలు చదివాను. వాటిలో పంచీకరణం, మణిరత్నమాల, యోగవాసిష్ఠమునందలి “ముముక్షు ప్రకరణం” హరిభద్రసూరి విరచిత “షడ్దర్శన సముచ్ఛయం” మొదలగు గ్రంధాలు పేర్కొనదగినవి.
నేను నా క్రైస్తవ మిత్రులు ఉహించని దారిని పడినప్పటికీ వారి సాంగత్యం వల్ల నాకు కలిగిన ధర్మ జిజ్ఞాస అధికం. అందుకు నేను వారికి రుణపడ్డానని చెప్పగలను. వారి పరిచయం నాకు సదా గుర్తుంటుంది. మధురం, పవిత్రం అయిన యిట్టి స్నేహ బంధాలు క్రమంగా పెరుగుతూ వున్నాయే కాని తరగలేదు.