13. కూలి వృత్తి
ట్రాన్సువాలు ఆరెంజి ఫ్రీస్టేటులోని భారతీయుల స్థితిగతులను గూర్చి పూర్తిగా వ్రాయడానికిది తావు కాదు. తెలుసుకోదలచినవారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర చదవడం మంచిది. ఆరెంజి ఫ్రీ స్టేటుయందు 1888వ సంవత్సరంలోనో లేక అంతకు ముందో పుట్టిన ఒక శాసనం వల్ల భారతీయుల స్వాతంత్ర్యమంతా హరించిపోయింది. ఒకవేళ భారతీయులెవరైనా అచ్చట వుండదలిస్తే హోటళ్లలో సేవకులుగానో లేక మరేదైనా బానిస వృత్తియో చేస్తే వుండవలసిందే. పేరుకు మాత్రం కొద్దిగా ముదరా యిచ్చి భారతీయ వ్యాపారస్థుల్ని వెళ్లగొట్టారు. వారు అర్జీలు పెట్టుకున్నారు. ప్రార్ధనా పత్రాలు పంపుకున్నారు. కాని వినిపించుకునే నాధుడు లేడు. 1885వ సంవత్సరంలో ఒక కఠిన శాసనం అమలుచేశారు. 1886లో అందులో కొద్దిగా మార్పు చేశారు. ఆ శాసనం ప్రకారం భారతీయులు ట్రాన్సువాలులో ప్రవేశించాలంటే మూడు పౌండ్లు టాక్సు చెల్లించాలి. ప్రత్యేకించిన స్థలాల్లో తప్ప మరెక్కడా వారికి భూములు వుండకూడదు. భూములున్నా వాటిమీద హక్కు ఉండదు. వారికి వోటు హక్కు లేదు. ఆసియా ఖండ వాసుల కోసం యిట్టి శానసం చేయబడింది. తదితర శ్వేతేతర జాతుల వారి కోసం నిర్మించబడ్డ శాసనాలు కూడా ఆసియా ఖండవాసులపై ప్రయోగించసాగారు. యీ శాసనం ప్రకారం భారతీయులు రోడ్డు మీద నడవకూడదు. రాత్రి తొమ్మిది గంటల తరువాత భారతీయులెవ్వరూ బయటకి పోకూడదు. తిరగకూడదు. భారతీయులపై ఒక్కొక్కప్పుడు యీ శాసనం ప్రయోగించ బడుతూ వుండటం, ఒక్కొక్కప్పుడు ప్రయోగించకుండా వుండటం కూడా కద్దు. యీ పరిస్థితిలో కొందరు భారతీయ మహమ్మదీయులు తాము అరబ్బులమని చెప్పుకొని తప్పించుకునేవారు. భారతీయులకు అనుమతి కావలసివస్తే పోలీసుల దయాధర్మం మీద ఆధారపడవలసిందే.
ఈ శాసనాల్ని చదవవలసిన అవసరం కలిగింది. నేను రాత్రులందు కోట్సుగారితో కలిసి షికారుకు పోతూ వుండేవాణ్ణి. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి పదిగంటలయ్యేది. పోలీసులు పట్టుకుంటే యిక నాగతి ఏమిటి ? యీ విషయంలో నాకంటే కోట్సుగారే ఎక్కువ విచారపడుతూ వుండేవారు. ఆయన తన దగ్గర పనిచేసే నీగ్రో సేవకులకు పాసు యివ్వగలడు. అది చెల్లుతుంది. కాని నాకు యివ్వలేడు. వాస్తవానికి అతడు సేవచేసే వారికి అనుజ్ఞా పత్రం యివ్వవచ్చు. కాని అది నా విషయంలో చెల్లదు.
అందువల్ల కోట్సుగారో, వారి మిత్రులో నన్ను క్రౌజ్‌గారి దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన ప్రభుత్వ వకీలు. మేము సహాధ్యాయులం. ఒకరి ముఖం మరొకరం ఎరుగుదుము. ఒక్క “ఇగ్” కు సంబంధించిన బారిస్టర్లం. తొమ్మిది గంటలు దాటితే నాకు పాసు అవసరం అని విని ఆయన బాధపడ్డాడు. నా బాధలో కొంత తానూ పంచుకున్నాడు. నాకు పాసు యివ్వడానికి బదులు ఒక చేఉత్తరం వ్రాసి యిచ్చాడు. దానితో నాకు తిరిగేందుకు స్వేచ్ఛ లభించింది. పోలీసుల బెడద తగ్గింది. ఆ ఉత్తరం నా దగ్గర వుంచుకున్నాను. అయితే దాని అవసరం కలుగలేదు. ఆ విధంగా అవసరం కలుగకపోవడం కేవలం దైవికమే.
డాక్టర్ క్రౌజు తన యింటికి నన్ను ఆహ్వానించాడు. మాకు స్నేహం కుదిరింది. నేను తరచు వారి యింటికి వెళుతూ వుండేవాణ్ణి. వారి ద్వారా ప్రసిద్ధికెక్కిన వారి సోదరుని పరిచయం కలిగింది. వారి సోదరుడు జోహాన్స్‌బర్గ్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటరు. బోయర్ యుద్ధంలో ఒక ఉద్యోగిని ఖూనీ చేయుటకు కుట్ర పన్నాడని నేరం మోపి ఆయనకు ఏడేండ్ల కారాగార శిక్ష విధించారు. ఆయన పట్టా కూడా రద్దు చేశారు. యుద్ధం ముగిసిన తరువాత ఆయనను విడుదల చేశారు. తిరిగి ఆదరించి ఆయనను కోర్టులో చేర్చుకున్నారు. ఆయన మళ్లీ ప్లీడరు పని చేయసాగారు.
ఈ పరిచయాలు తరువాత ప్రజాసేవ చేయడానికి పూనుకున్నప్పుడు నాకు ఉపయోగపడ్డాయి.
రోడ్డు మీద నడుచుటకు సంబంధించిన శాసనం కూడా ఎంతో యిబ్బంది కలిగించింది. నేనెప్పుడూ ప్రెసిడెంటు వీధికి ఆవలనున్న మైదానానికి షికారుకు పోతూ పుండేవాణ్ణి. యీ వీధిలోనే ప్రెసిడెంట్ క్రూగరు గారి గృహం ఉంది. ఆ గృహం నిరాడంబరంగా వుండేది. దాని చుట్టు తోటగాని, దొడ్డిగాని లేదు. సామాన్య గృహంలా వుండేది. ప్రిటోరియాలో కోటీశ్వరుల యిండ్లు దివ్య భవనాలు. వాటియందు నందనవనాలు అధికంగా వుండేవి. కాని ప్రెసిడెంటుగారు నిరాడంబరులు. ఆ యింటి ముందు పోలీసుల కాపలా వుండటం వల్ల అది రాజ్యాధికారి గృహమని తెలుస్తుంది. నేనెప్పుడూ ఆ పోలీసుల ప్రక్కగా వెళుతూ వుండేవాణ్ణి. అయితే ఆ పోలీసులు ఎప్పుడూ నా జోలికి రాలేదు.
అక్కడ వంతుల ప్రకారం పోలీసులు మారుతూ వుంటారు. ఒకనాడు ఒక పోలీసు నన్ను చూచాడు. కనీసం ముందుగా హెచ్చరిక అయినా చేయకుండా తిన్నగా మీదికి వచ్చి కొట్టి నన్ను నెట్టివేశాడు. నేను నివ్వెరబోయాను. దెబ్బలు తగిలాయి. నేను ఆ పోలీసును ఏమీ అనలేదు. ఇంతలో గుర్రం మీద అటుగా వెళుతున్న కోట్సు దొర అక్కడకు వచ్చి “గాంధీ! నేనంతా చూచాను. నీవు వీనిపై కేసు పెట్టు. నేను సాక్ష్యం యిస్తాను. నీమీద యితడు చెయ్యి చేసుకున్నందుకు విచారిస్తున్నాను” అని అన్నాడు.
“ఇందు విచారించనవసరం లేదు. పాపం ఆ పోలీసు వాడికేమి తెలుసు? అతడికి నల్లవాళ్ళంతా సమానులే. అతడు నామీద చెయ్యి చేసుకున్నట్లే నీగ్రోల మీద కూడా తప్పక చెయ్యి చేసుకుంటాడు. నాకు ఏ అపాయం కలిగినా కోర్టుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల యితని మీద కేసు పెట్టను” అని అన్నాను.
“నీ పద్ధతి నీదే. ఆలోచించుకో. ఇట్టివాడికి ఒక్క పర్యాయం శాస్తి చేయడం అవసరం” అని కోట్సుగారన్నాడు. ఆ తరువాత ఆయన పోలీసువాణ్ణి కోప్పడ్డాడు. పోలీసు డచ్చివాడు. వారిద్దరు డచ్చి భాషలో మాట్లాడుతున్నారు. నాకు వారి మాటలు అర్థంకాలేదు. చిట్ట చివరికి ఆ పోలీసు నన్ను క్షమాపణ కోరాడు. కాని అతడు క్షమాపణ కోరనవసరమే లేదు. నేను అతణ్ణి మొదటనే క్షమించి వేశాను.
అటు తరువాత నేనా వీధికి పోలేదు. అయినా మిగతా పోలీసులకు యీ విషయం తెలియదు కదా! వాళ్ల చేతుల్లో నేను దెబ్బలు తినడం ఎందుకు అని భావించి యితర వీధులగుండా షికారుకు పోవడం ప్రారంభించాను.
ఈ విషయమై భారతీయులను గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించాను. ఈ శాసనాన్ని గురించి బ్రిటిష్ ఏజంటుతో మాట్లాడదామనీ, అవకాశం చిక్కితే ఒక దావా వేసి చూద్దామనీ భారతీయులతో చర్చించాను. యీ విధంగా భారతీయుల బాధల్ని గురించి వినడం చదవడమే గాక స్వయంగా కూడా నేను వాటిని అనుభవించాను. ఆత్మగౌరవం నిలుపుకోవాలని భావించే భారతీయులకు దక్షిణ ఆఫ్రికా అనువైన చోటు కాదనే నిర్ణయానికి వచ్చాను. ఈ పరిస్థితిని ఎలా మార్చడం?
అయితే ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి? దాదా అబ్దుల్లాగారి దావా వ్యవహారం చూడటమేకదా! కనుక అందుకు పూనుకున్నాను.