11. క్రైస్తవులతో పరిచయం
మర్నాడు ఒంటి గంటకు బేకరుగారి చర్చికి వెళ్లాను. హారీస్ కుమారితోను, గాబ్ కుమారితోను, కోట్సు మొదలగు వారితోను పరిచయం అయింది. అంతా ప్రార్ధన కోసం మోకరిల్లారు. నేను వారిని అనుకరించాను. తమ కోరికలను గురించి ఈశ్వరుని వేడుకోవడం అక్కడి ప్రార్ధనా విశేషం. “ఈ దినం శాంతంగా గడుచుగాక అనిగాని, ఓ పరమేశ్వరా! నా హృదయద్వారాన్ని తట్టుదువుగాక” అనిగాని ప్రార్ధించడం అక్కడ మామూలు. కాని ఆ రోజున మాత్రం వారంతా “క్రొత్తగా వచ్చిన మా మిత్రునకు మార్గం చూపుము ఓ ప్రభూ! మాకు కలిగించిన శాంతినే అతనికి కూడా కలిగింపుము. మమ్ము రక్షించిన ఏసు రక్షకుడే ఇతనిని కూడా రక్షించుగాక. ఏసునాథుని పేరనే మేము యీ ప్రార్ధనలు చేస్తున్నాము.” అని వారంతా పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. ఈ సమాజంలో భజన కీర్తనలు లేవు. సంగీతం లేదు. ప్రతిదినం ప్రార్థన కాగానే అంతా వెళ్లిపోయేవారం. సరిగ్గా అది భోజనాల సమయం, ప్రార్ధనకు అయిదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు.
హారిస్, గాబ్ అను యిద్దరూ పెండ్లికాని ప్రౌఢలు. కోట్సుగారు క్వేకరు తెగవారు. పై స్త్రీలిద్దరూ ఒకేచోట నివసిస్తూ వుండేవారు. ప్రతి ఆదివారం నాలుగు గంటలకు తన యింట టీ త్రాగడానికి నన్ను ఆహ్వానించారు. ఆదివారాలందు కోట్సుగారూ, నేనూ కలిసినప్పుడు ఆవారం నేను చదివిన గ్రంధాల జాబితా తెలుపుతూ వుండేవాణ్ణి. వాటిని గురించి నా అభిప్రాయాలు కూడా తెలుపుతూ వుండేవాణ్ణి. కోట్సు హృదయం పరిశుద్ధమైనది. అతడు బోళావాడు, పట్టుదల గలవాడు. ఈయనకు నాకు స్నేహాం కలిసింది. తరుచు మేమిద్దరం కలిసి షికారుకు వెళుతూ వుండేవారం. ఆయన ద్వారా నాకు చాలామంది క్రైస్తవులతో పరిచయం కలిగింది. మా పరిచయం పెరిగిన కొద్దీ నా అల్మారాలో ఆయనిచ్చిన గ్రంధాల సంఖ్య పెరగసాగింది. ఆయన ఎడ గల శ్రద్ధ వల్ల వాటి నన్నింటినీ చదువుతూ వున్నాను. చదివి అందలి విషయాన్ని గురించి ఆయనతో చర్చిస్తూ వుండేవాణ్ణి. 1893లో అట్టి గ్రంధాలు చాలా చదివాను. వాటి పేర్లన్నీ యిప్పుడు నాకు గుర్తు లేవు. ‘సిటీ టెంపుల్’ అను గ్రంధాన్ని గురించి పార్కరుగారు వ్రాసిన వ్యాఖ్యానం, పియర్సన్ గారు వ్రాసిన “ఇన్‌ఫొలిబిల్ ప్రూఫ్స్” బట్లరుగారు వ్రాసిన ‘అనాలజీ’ మొదలగునవి కొన్ని గుర్తువున్నాయి. ఈ గ్రంథాల్లో కొన్ని భాగాలు నాకు అర్థం కాలేదు. కొన్ని నచ్చాయి. కొన్ని నచ్చలేదు. నా ఉద్దేశ్యాలు కోట్సుగారికి తెలుపుతూ వుండేవాడిని. బైబిల్ మతం పరమ ప్రమాణం అనడమే ఇన్‌పాల్‌బిల్ ప్రూఫ్ గ్రంధకర్త ఉద్దేశ్యం. యీ పుస్తకం నాకు నచ్చలేదు. పార్కరుగారి టీక నీతి వర్ధకమే గానీ ప్రచారంలో నున్న ఏసు మతం మీద విశ్వాసం లేని వారికది నిష్ప్రయోజనం. బట్లరుగారి అనాలజీ క్లిష్టమైన గంభీరమైన గ్రంథం. దీన్ని అయిదారుసార్లు చదవాలి. నాస్తికులను ఆస్తికులుగా మార్చడం యీ గ్రంధోద్దేశ్యం అని అనుకుంటాను. దేవుడు కలడు అని చెప్పే గ్రంధాలు నాకు లాభకారి కావు. నేను నాస్తికావస్థలో లేను. ఏసు ఒక్కడే అద్వితీయమైన అవతార పురుషుడనీ, అతడే మానవులకు, ఈశ్వరునకు సంధానకర్తయనీ చెప్పే సిద్ధాంతాలు నాకు హృదయంగమం కాలేదు.
కోట్సుగారు అంత మాత్రాన అపజయం అంగీకరించే రకం కాదు. ఆయనకు నాపై అమిత ప్రేమ ఏర్పడింది. ఒకనాడు ఆయన నా మెడలో తులసి దండ చూచాడు. చూచి ఖిన్నుడయ్యాడు. “ఈ గ్రుడ్డి నమ్మకం నీకు తగదు. దండ త్రెంపి ఇలా యివ్వండి” అని అన్నాడు.
“చూడండి యిది మా అమ్మగారి ప్రసాదం. అందు నమ్మకం వుందా లేదా నాకు అనవసరం. అందలి రహస్యం నాకు తెలియదు. దాన్ని ధరించకపోతే కీడు కలుగుతుందని నేను భావించను. ఆమె నా శ్రేయస్సు కోరి ప్రేమతో వేసిన యీ దండను ప్రబలమగు కారణం లేనిదే తీసివేయను. కాలం పక్వమై, అది జీర్ణమై తనంతటతాను తెగిపోతే మరోతులసిదండ వేసుకుందామనే లోభం నాకు లేదు. కాని దీన్ని మాత్రం తెంచడానికి వీలు లేదు.” అని చెప్పివేశాను. ఆయనకు నా వాదం నచ్చలేదు. నన్ను అజ్ఞాన కూపాన్నుండి బయటకు తీయటానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. మతాంతరములందు కొంత సత్యం వున్నా పూర్ణ సత్యం ఏసు మతమందే కలదనీ, ఆ మతం స్వీకరించనిచో మోక్షం చేకూరదనీ, ఏసునాధుడు మధ్యవర్తియై అడ్డుపడకపోతే పాపప్రక్షాళనం జరగదనీ, పుణ్యకర్మలతో ఏమీ ప్రయోజనం లేదనీ అతడు వాదించి నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే వున్నాడు. గ్రంధాలతో బాటు అతడు ఏసుభక్తుల్ని కూడా చాలామందిని నాకు పరిచయం చేశాడు. ఇట్టి పరిచయస్థులలో ప్లీమత్ బ్రదరన్ కుటుంబం కూడా ఒకటి.
ప్లీమత్ బ్రదరన్ అనునది ఒక ఏసు సంప్రదాయం. కోట్సుగారి ద్వారా నాకు పరిచయమైన వారంతా బాగా చదువుకున్నవారు. పాపభీరువులు. కాని యీ కుటుంబంలో ఒకరు యీ క్రింది విధంగా వాదించారు.
“మా మత సౌందర్యం నీవెరుగవు. మానవుడు తన పాపాలకు ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నీ వాదన అయితే జీవితమంతా ప్రాయశ్చిత్తాలతోనే గడిచిపోతుంది. ఎడతెగని యీ కర్మకాండ నుంచి ఎలా ముక్తి లభిస్తుంది? ఎన్నటికీ శాంతి లభించదు. మనమందరం పాపులం అని నీవూ అంటున్నావు. చూడు మాకెంత విశ్వాసమో! మన ప్రయత్నాల వల్ల ముక్తి వ్యర్ధం కాకూడదు. యీ పాపభారం ఎలా మోయగలం? దానిని ఏసుమీద వేయాలి. అతడొక్కడే పాపరహితుడు. అతనొక్కడే భగవానుని కుమారుడు. ఎవరు తనను నమ్ముదురో వారి పాపాలు పటాపంచలయిపోతాయని ఆయన వరం యిచ్చాడు. అది దేవుని అగాధమగు ఉదారతత్వం. ఏసు ముక్తి నీయగలడని నమ్ముదుమేని పాపాలు మనకంటవు. మనం పాపం చేయక తప్పదు. యీ ప్రపంచంలో పాపస్పర్శ తగలకుండా వుండేదెలా? కావున ఏసు ఒక్కడే రక్షకుడు అని నమ్మిన వానికే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. కావున శాంతి మీకా! మాకా?”
ఈ వాదం నాకు నచ్చలేదు. “నేను యీ ఏసు మతాన్ని అంగీకరించలేను. పాపాలు చేసి తత్ఫలం నాకంటరాదని నేనెన్నడూ ప్రార్ధించను. పాపకర్మ నుండి, పాప ప్రవృత్తినుండి విముక్తుడనగుటకు ప్రయత్నిస్తాను. అట్టి స్థితి చేకూరేదాకా నాకు అశాంతియే ప్రీతికరం” అని అన్నాను. అతడు బదులు చెబుతూ - “ఇదంతా నిష్ప్రయోజనం. మళ్లీ నేను చెప్పిన మాటల్ని బాగా ఆలోచించు.” అని అన్నాడు. పాపం అతడు బుద్ధిపూర్వకంగా పాపాల్ని అనుష్టించాడు. అంతటితో ఆగక వాటివల్ల తన మనస్సునకేమీ చింత లేదని మరీ మరీ చెప్పాడు.
ఇట్టి సిద్ధాంతాలు క్రైస్తవులందరికీ సమ్మతం కాదని వీరితో పరిచయం కాక పూర్వం నుండే నాకు తెలుసు. కోట్సు పాపభీరుడు. నిర్మలుడు. సాధనచే హృదయం శుద్ధమగునని అతని నమ్మకం. ఆ కుమారికల నమ్మకం కూడా అదే. నేను చదివిన గ్రంధాల్లో కొన్ని భక్తిపరమైనవి. ప్రీమత్ సోదరుని ప్రసంగం వల్ల నా బుద్ధి ఎలా మారునోయని కోట్సు భయపడ్డాడు. కాని అట్టి భయానికి అవకాశం లేదనీ, అతడేదో అన్నాడని ఏసు మతం మీద నాకు ఈర్ష్యాద్వేషాలు కలుగవని నచ్చచెప్పాను. నాకు గల తపన బైబిలును గురించియే, దాని తత్వార్ధాన్ని గురించియే.