రెండవ భాగం
1. రాయచంద్ భాయి
బొంబాయి రేవు దగ్గర సముద్రం అల్లకల్లోలంగా వున్నదని గత ప్రకరణంలో వ్రాశాను. జూన్, జూలై మాసాల్లో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా వుండటం సహజం. ఓడలో వాళ్ళంతా జబ్బుపడ్డారు. నేను మాత్రం జబ్బు పడలేదు. డెక్ మీద వుండి సముద్రంలో రేగిన తుఫానును చూస్తూ వున్నాను. ప్రొద్దుటి భోజనంలో నాతోబాటు యిద్దరు ముగ్గురు పాల్గొన్నారు. పళ్లాలు జాగ్రత్తగా పట్టుకొని వరిగల పిండితో తయారైన గంజి త్రాగుతున్నాము. పళ్లెం జాగ్రత్తగా పట్టుకోకపోతే అది తన దారి తాను చూచుకొనే స్థితిలో వుంది. తుఫాను అంత తీవ్రంగా వుందన్నమాట.
బయటి తుఫానుకు, నాలో వీస్తున్న తుఫానుకు భయపడని నేను లోపలి తుఫానుకు చలించనని పాఠకులకు బోధపడేవుంటుందని భావిస్తున్నాను. బొంబాయి చేరి ఇంటికి వెళ్లగానే కుల బహిష్కారం సిద్ధంగా వున్నది. ప్లీడరు వృత్తికి నేను తగనని గతంలో వ్రాశాను. నేను సంస్కర్తను. కనుక ఏఏ విషయాలు ఏఏ విధంగా సంస్కరించాలా అని ఆలోచించసాగాను. కాని తర్కానికి కొరుకుడు పడని కొన్ని సమస్యలు నాకోసం ఎదురుచూస్తున్నాయి.
నన్ను కలుసుకునేందుకు మా పెద్దన్నగారు బొంబాయి రేవు దగ్గరకు వచ్చారు. డా. మెహతాగారితోను, వారి పెద్దన్నగారితోను ఆయనకు అదివరకే పరిచయం ఏర్పడింది. డా. మెహతాగారు తమ ఇంటికి రమ్మని గట్టిగా పట్టు పట్టడం వల్ల మేమంతా వారి ఇంటికి వెళ్ళాము. ఆంగ్లదేశంలో ఏర్పడిన మా పరిచయం వృద్ధి అయింది. ఇక్కడ గల వారి కుటుంబానికీ, మా కుటుంబానికీ సంబంధాలు బాగా పెరిగాయి.
మా “అమ్మ”ను త్వరగా చూడాలని తహతహప్రారంభమైంది. కాని ఆమె లోకాన్ని వీడిపోయిందను వార్త మా అన్నగారు ముందు నాకు తెలియచేయలేదు. ఓడ దిగిన తరువాత చెప్పారు. నేను సూతక స్నానం చేశాను. నేను ఇంగ్లాండులో వున్నప్పుడే ఆమె చనిపోయింది. యీ సంగతి తెలిస్తే బాధపడిపోతానని మా అన్నగారు నాకు తెలియజేయలేదు. యి వార్త విన్నప్పుడు నాకు అపరిమితమైన దుఃఖం కలిగింది. ఏడుపు పెల్లుబికింది. కాని యిప్పుడు యిక ఆ గాధ అప్రస్తుతమే కదా! మా తండ్రిగారు గతించినప్పుడు కలిగిన వ్యధకంటే యిది అత్యధికం. నా కోరికలన్నీ గొంతెమ్మ కోరికలే అయ్యాయి. కాని అప్పుడు దుఃఖానికి కళ్ళెం వేసుకున్నట్లు గుర్తు. నేను కంట తడిబెట్టలేదు. మా అమ్మగారు చనిపోనట్లే వ్యవహరించి, నా వ్యవహారాలు నేను చక్కదిద్దుకోసాగాను. డా. మెహతాగారు చాలామందిని నాకు పరిచయం చేశారు. వారిలో దేవాశంకర్ జగజీవన్‌గారు ఒకరు. వారి మైత్రి యావజ్జీవిత మైత్రిగా మారింది. అప్పుడే మెహతాగారు నాకు రాయచంద్ కవి లేక రాజచంద్ర కవిగారిని పరిచయం చేశారు. వీరు డా. మెహతాగారి పెద్దన్న గారి అల్లుడు. దేవా శంకర్ జగజీవన్‌గారి నగల దుకాణంలో భాగస్వామి. నాకు వారితో పరిచయం కలగడం పెద్ద విశేషం. వారికి అప్పుడు ఇరవై అయిదేండ్లు. చూడగానే వారు నిర్మల చరిత్రులని, విద్వాంసులని తెలుసుకోగలిగాను. వారు శతావధానులు. డా. మెహతా గారు రాజచంద్ర కవిగారి ధారణా పటిమను కొంచెం చూడమని చెప్పారు. నాకు వచ్చిన పాశ్చాత్య భాషాపాండిత్యాన్ని అధికంగా ఆయన ముందు ఉపయోగించాను. నేనెట్లా చదివితే రాజచంద్ర కవిగారు అట్లా చదివారు. ఆయన సామర్ధ్యం చూచి నేను తట్టుకోలేకపోయాను. ధారణ, శతావధానం, అను శక్తులకు నేను ముగ్ధుడిని కాలేదు. నన్ను ముగ్ధుణ్ణి చేసిన విశేషం తరువాత బోధపడింది. అది వారి విశాల శాస్త్రజ్ఞానం. నిర్మలమైన వారి నడత. ఆత్మజ్ఞానం యెడ వారికి గల తీవ్రమైన తపన, యీ చివరి దానికోసమే వారు తన జీవితాన్ని వినియోగించారని తరువాత తెలిసింది. శ్రీముక్తానందుడు రచించిన క్రింది ఛందం ఆయన సదా స్మరిస్తూ వుండేవారు. వారి హృదయంలో యీ గేయం అంకితమై పోయింది.
హనుతాం రమతాం ప్రగట హారి దేఖుంరే, మారుం జీవ్యూం సఫల తవ లేఖుంరే,
ముక్తానందనో, నాధ విహారీరే. ఓధా జీవనదోరీ అమారీరే.
(నవ్వుతూ ఆడుతూ పాడుతూ ప్రతిపనిలో హరిని దర్శించితేనే నా జీవితం ధన్యమని భావిస్తాను. నా ప్రభువు భగవంతుడే. ఆయనే నా జీవితానికి సూత్రం. యిది ముక్తానందుని కథనం). ఆయన వ్యాపారం లక్షలమీద సాగుతున్నది. ముత్యాల, వజ్రాల, రత్నాల వ్యాపారమందతని ప్రజ్ఞ అసామాన్యం. ఎంతటి చిక్కు సమస్యనైనా యిట్టే పరిష్కరించగల శక్తి ఆయనకు వుంది. కాని నిజానికి బుద్ధి లౌకిక వ్యవహారాల్లో చిక్కుకొని వుండిపోలేదు. ఆయన ఎప్పుడూ పురుషార్ధం, ఆత్మ సాక్షాత్కారం, హరిదర్శనం అంటూ ఆ భావనలో లీనమైయుండేవాడు. ఆయన వ్రాత బల్లమీద చిఠ్ఠాలతో పాటు ఏదో ఒక వేదాంత గ్రంథం, దినచర్య (డైరీ) వ్రాసుకొనే పుస్తకం వుండేవి. వ్యవహారం ముగియగానే ఆ రెండిటిలో ఒక పుస్తకం తీసుకొనేవారు. యీ డైరీ నుంచి సమీకరించి ఆయన పలు గ్రంథాలు ప్రకటించారు. ఆయన లక్షల కొద్ది వ్యాపారస్తులతో లావాదేవీలు జరిపిన తరువాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన గూఢ విషయాలు వ్రాస్తూ వుండేవారు. ఆయన సామాన్య వర్తకుడు కాడు. జ్ఞానకోటి లోనివాడు. దుకాణంలో వ్యాపారం సాగుతూ వుండగా ఆయన ధ్యానమగ్నుడై పుండటం అనేక పర్యాయాలు నేను చూచాను. ఆయన అందరితోను సమానంగా వ్యవహరించేవాడు. ఆయనకు నా విషయంలో స్వార్థం ఏమీలేదు. వారితో గాఢ పరిచయం కలిగింది. నేను అప్పటికి పనిపాటలు లేని బారిస్టరును. నేను వారి దుకాణానికి వెళ్ళినప్పుడు వేదాంత చర్చ దప్ప మరో చర్చ జరిగేదికాదు. నాకు అప్పటికి వేదాంత విషయాల్లో అంతగా ప్రవేశం లేదు. అయినా వారి మాటలే నాకు మంత్రాలుగా వుండేవి. తరువాత నేను అనేకమంది మతాచార్యుల్ని దర్శించాను. ప్రత్యేకించి విశేష ప్రజ్ఞ కలిగిన ఆచార్యుని కోసం అన్వేషించాను. కాని రాయచంద్‌భాయి యిచ్చే ఉపదేశాల వంటివి ఎక్కడా లభించలేదు. వారి ఉపదేశం సూటిగా హృదయంలో నాటుకునేది. వారి బుద్ధి యెడ, వారి ప్రామాణికత్వం యెడ నాకు అపారమైన ఆదరణ ఏర్పడింది. ఆయన నన్ను అన్యమార్గానికి తీసుకుపోడనే నమ్మకం నాకు కలిగింది. తన హృదయంలో వుండే భావాలు కొన్ని నాకు ఆయన చెబుతూ వుండేవాడు. భగవంతుణ్ణి గురించి తెలిసీ తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన అండగా కనిపించేవాడు. రాయచంద్‌భాయి యెడ నాకు యింత గౌరవం వున్నా ఆయనను ఆధ్యాత్మిక గురువుగా నేను భావించలేకపోయాను. నా హృదయమందలి ఆ సింహాసనం యింకా ఖాళీగానే వున్నది. నా అన్వేషణ యింకా సాగుతూనే వున్నది.
హిందూ వేదాంతం గురువు అను పదానికి ఎంతో మహత్తు కల్పించింది. దాన్ని నేను అంగీకరిస్తాను. గురువు లేనిదే ముక్తిలేదన్న విషయం సత్యం. అక్షర జ్ఞానం కలిగించే గురువు అజ్ఞాని అయినా ఫరవాలేదు. కాని ఆధ్యాత్మిక గురువు అసమర్ధుడైతే సాగదు. గురువు పదవికి పూర్ణ జ్ఞానియే అర్హుడు. జ్ఞానప్రాప్తి కోసం సదా సర్వదా శోధన ఆవసరం. శిష్యుని యోగ్యతననుసరించి గురువు లభిస్తాడు. తన తన యోగ్యతను బట్టి ప్రతి సాధకుడు ప్రయత్నించవచ్చు. అట్టి అధికారం అతనికి వుంటుంది. ఫలితం ఈశ్వరాధీనం. నేను రాయచంద్‌భాయిని నా ఆధ్యాత్మిక గురువుగా భావించక పోయినప్పటికీ ఎన్నోసార్లు ఆయన నాకు మార్గదర్శకుడుగాను, సహాయకుడుగాను తోడ్పడి సహకరించారు. ఆ వివరం రాబోయే ప్రకరణాల్లో మీకు తెలుస్తుంది. నా జీవితంలో తమ గాఢముద్రను హత్తిన వారు ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు ఆధునిక యుగానికి చెందినవారే. రాయచంద్‌భాయి ప్రత్యక్షసాంగత్యం వల్ల నా హృదయంలో నాటుకుపోయారు. రెండవవారు టాల్‌స్టాయి. వారు రచించిన “వైకుంఠం నీ హృదయంలోనే” (the kingdom of God is within you) అను గ్రంధం ద్వారాను, మూడవవారు రస్కిన్. తాము రచించిన ‘సర్వోదయం’ (unto this last) అను పుస్తకం ద్వారాను నా హృదయంలో నిలిచిపోయారు. సమయ, సందర్భాలను బట్టి వివరాలు తరువాత చెబుతాను.