21. నిర్బలుడికి బలం రాముడే
నాకు హిందూ మతంతోను ప్రపంచమందలి ఇతర మతాలతోను కొంచెం పరిచయం కలిగింది. కాని విషమ సమయంలో అజ్ఞానం ఉపయోగపడదని నేను గ్రహించలేదు. ఆపత్సమయంలో ఏ వస్తువు మనిషిని రక్షిస్తుందో ఆ వస్తువు మనిషికి కనబడదు. ఆపద తొలగడానికి అతని స్వభావమే కారణం అని కొందరు భావిస్తారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు యోచిస్తున్నారు. కాని రక్షణ పొందినపుడు మాత్రం తనను తన సాధనయే రక్షించిందో లేక మరొకడెవడైనా రక్షించాడో తెలుసుకోలేరు. కొందరు తమ నిష్ఠాబలం గొప్పదని భావిస్తారు. కాని నిష్ఠాబలం ఆపత్సమయంలో ఎందుకూ కొరరాదు. అట్టి సమయంలో అనుభవం లేని శాస్త్రజ్ఞానం వృధా అవుతుంది.
కేవలం శాస్త్రజ్ఞాన ప్రయోజనం నాకు కొంతవరకు అర్థమైంది. ఆంగ్లదేశంలో అంతకు ముందు జరిగిన విషయాలలో నాకు రక్షణ ఎలా కలిగిందో చెప్పలేను. అప్పటికి నేను చిన్నవాణ్ణి, కాని ఇప్పుడు నాకు ఇరవైఏళ్ళు. గృహస్థాశ్రమ అనుభవం కూడా కలిగింది. పెళ్ళాం వున్నది. పిల్లవాడు కూడా పుట్టాడు.
నాకు బాగా గుర్తు, ఆంగ్లదేశంలో నేనున్న చివరి సంవత్సరం ఆది. 1890 పోర్టు సుమత్‌లో శాకాహారసభ జరిగింది. నేను నా మిత్రుడు ఆ సభకు ఆహ్వానింపబడ్డాం. పోర్టు సుమతు సముద్రపు రేవు. ఆ ఊళ్ళో నావికజనం ఎక్కువగా వున్నారు. అచట చెడునడత గల స్త్రీలు వున్నారు. అయితే వాళ్ళు వేశ్యలు కారు. కాని వాళ్ళకు నీతి నియమం ఏమీలేవు. అట్టి వాళ్ళ యింట్లో మేము బస చేశాము. సన్మానసంఘం వారికి ఆ విషయం తెలియదు. ఎప్పుడో ఒకసారి పోర్టు సుమతు వంటి పట్టణానికి వచ్చి వెళ్లే మావంటి బాటసార్లకు అక్కడ ఏది మంచి బసయో, ఏది చెడు బసయో తెలుసుకోవడం కష్టం. సభలో పాల్గొని రాత్రి మేము ఇంటికి చేరాము. భోజనం అయిన తరువాత మేము పేకాట ప్రారంభించాము. ఆంగ్లదేశంలో గొప్పగొప్పవారి ఇళ్ళల్లో కూడా గృహిణిలు అతిథులతో పేకాట ఆడటం ఆచారం. సామాన్యంగా పేకాటలో అంతా ఛలోక్తులు విసురుకుంటూ వుంటారు. అయితే అందు దోషం ఉండదు. కాని మా పేకాటలో భీభత్స వినోదం ప్రారంభమైంది.
నా స్నేహితుడు ఇట్టి వ్యవహారంలో ఆరితేరినవాడని నాకు తెలియదు. నాకు కూడా ఈ వినోదంలో ఆనందం కలిగింది. నేను కూడా అందులో దిగాను. మాటలు దాటి వ్యవహారం చేతల్లోకి దిగింది. పేక ప్రక్కన పెట్టివేశాం. ఇంతలో భగవంతుడు నా స్నేహితుని హృదయంలో ప్రవేశించాడు. “నీవా! ఈ ఘోరకలిలోనా? ఈ పాపకూపంలోనా! నీకు ఇక్కడ చోటులేదు. పో! లేచిపో!” అని అరిచాడు. సిగ్గుతో నా తల వంగిపోయింది. అతడి ఆదేశాన్ని శిరసావహించాను. హృదయంలో అతడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మా అమ్మగారి ముందు చేసిన ప్రమాణం జ్ఞాపకం వచ్చింది. నేను లేచి బయటికి పరిగెత్తాను. నా గదిలోకి దూరాను. వేటగాని బారినుండి తప్పించుకున్న లేడిలా గుండె గజగజ వణికిపోయింది.
పరాయి ఆడదాని విషయంలో ఈ విధంగా ప్రధమ పర్యాయం నాకు వికారం కలిగింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. అనేక ఆలోచనలు నన్నావహించాయి. ఈ ఇంటి నుంచి పారిపోనా? ఈ పట్టణం వదలి వెళ్ళిపోనా? నేనున్నదెక్కడ? నేను జాగ్రత్తగా వుండకపోతే నా గతి ఏమవుతుంది? ఈ రకమైన ఆలోచనలతో సతమతం అయి, తరువాత నుండి అతి జాగ్రత్తగా మసలుకోసాగాను, ఆ ఇంటినేగాక వెంటనే పోర్టు సుమతును వదలి వెళ్ళిపోవడం మంచిదని భావించాను. సభలు ఇంకా రెండు రోజులు జరుగుతాయని తెలిసింది. ఆ మర్నాడు సాయంత్రమే నేను పోర్టుసుమతును వదిలివేసినట్లు నామిత్రుడు మరికొంత కాలం అక్కడే ఉన్నట్లు గుర్తు.
ఆ సమయంలో నాకు మతాన్ని గురించి గాని, దేవుణ్ణి గురించిగాని, దైవసహాయాన్ని గురించిగాని తెలియదు. నన్ను అప్పుడు దేవుడే రక్షించాడని అనుకోవడం తెలిసీ తెలియని స్థితే. నిజానికి ఇక్కట్ల సమయంలో ఎన్నో పర్యాయాలు నన్ను భగవంతుడే రక్షించాడు. జీవితంలో అనేక రంగాల్లో ఇట్టి అనుభవం నాకు కలిగింది. “భగవంతుడు నన్ను రక్షించాడు” అను మాటకు సరియైన అర్థం ఇప్పుడు నాకు బాగా బోధపడింది. అయినా యింకా పూర్తిగా తెలుసుకోలేక పోతున్నానని కూడా నేను ఎరుగుదును. అనుభవం ద్వారా ఆ విషయం తెలుసుకోవడం అవసరం. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయత్నాల యందును, లాయరు పనియందును, సంస్థల్ని నడపడంలోను, రాజకీయ వ్యవహారాల్లోను అనేక విషమ ఘట్టాలలోను భగవంతుడు నన్ను రక్షించాడని చెప్పగలను. ఉపాయాలు అడుగంటినప్పుడు, సహాయకులు వదిలివేసినప్పుడు, ఆశలుడిగినప్పుడు ఎటునుండో ఆ సహాయం అందుతుందని నా అనుభవం. స్తుతి, ఉపాసన, ప్రార్థన ఇవి గ్రుడ్డి నమ్మకాలు కావు. అవి ఆహార విహారాదుల కంటే కూడా అధిక సత్యాలు. అవే సత్యాలు, మిగతావన్నీ అసత్యాలే అని కూడా అనవచ్చు. అది అతిశయోక్తి కాజాలదు,
ఈ ఉపాసన, ఈ ప్రార్థన కేవలం వాక్ ప్రతాపం కాదు. దీనికి మూలం జిహ్వకాదు, హృదయం. అందువల్ల భక్తితో నింపి హృదయాన్ని నిర్మలం చేసుకుంటే మనం అనంతంలోకి ఎగిరిపోగలం, ప్రార్థనకు జిహ్వతో పనిలేదు. అది స్వభావానికి సంబంధించినది. అదొక అద్భుతమైన వస్తువు, విశాల రూపాలలో నున్న మలాన్ని, అనగా కామాది గుణాల్ని శుద్ధి చేయుటకు హృదయపూర్వకమైన ఉపాసన ఉత్తమ సాధనమని చెప్పుటకు నేను సందేహించను. అయితే అట్టి ఉపాసన అమిత వినమ్రతా భవంతో చేయాలి.