18. బిడియం డాలుగా పనిచేసింది
అన్నాహారమండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి మీటింగుకి హాజరవుతూ వుండేవాణ్ణి. కాని మాట్లాడటానికి నోరు తెరుపుడు పడేదికాదు. డాక్టర్ ఓల్డ్‌ఫీల్డు ఈ విషయం గమనించి “నీవు నాతో బాగా మాట్లాడతావు కాని సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు. అందువల్ల నీకు మొగతేనెటీగ అను పేరు పెట్టవచ్చు” అని అన్నాడు. నాకు ఆయన వ్యంగ్యం అర్థమైంది. ఆడతేనెటీగలు ఎప్పుడూ శ్రమపడుతూ ఉంటాయి. కాని మొగతేనెటీగ తినడం తాగడమే కాని పనిచేయదు. సోమరిపోతన్నమాట. కమిటీ మీటింగులో అంతా తమ తమ అభిప్రాయాలు చెబుతూ వుండేవారు. కాని నేను మాత్రం నోరు తెరిచేవాణ్ణి కాదు. మాట్లాడాలనే కాంక్ష లేక కాదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడాలి! నాకంటే మిగతా మెంబర్లంతా ఎక్కువ తెలిసిన వారుగా కనపడేవారు. ఒక్కొక్కప్పుడు విషయం మీద మాట్లాడాలని సిద్ధపడేవాణ్ణి కాని ఇంతలో మరో విషయం మీద చర్చ ప్రారంభమయ్యేది.
ఈ పద్ధతి కొంతకాలం దాకా నడిచింది. ఒక పర్యాయం గంభీరమైన సమస్య కమిటీ ముందుకు వచ్చింది. ఆ సభకు వెళ్ళకపోవడం అనుచితం. ఏమీ మాట్లాడకుండా వోటు ఇవ్వడం పిరికితనం. థేమ్స్ ఐరన్ వర్క్సు కంపెనీ అధ్యక్షుడు హల్స్‌గారు ఆ సభకు అధ్యక్షులు. అతడు నీతివాది. ఆయన ఇచ్చే ధనసహాయంతోనే ఆ సంఘం నిలచియున్నదని చెప్పవచ్చు. సభ్యుల్లో చాలామంది ఆయన గొడుగు నీడలో వుండునట్టివారే. శాకాహార విషయంలో ప్రసిద్ధికెక్కిన అల్లిన్సన్ గారు కూడా కార్యవర్గ సభ్యులు. డాక్టర్ అల్లిన్సన్ గారికి సంతాన నిరోధం ఇష్టం. దాన్ని గురించి జనానికి ప్రబోధిస్తూ వుండేవాడు. ఈ పద్ధతులు నీతివంతమైనవి కావనీ హిల్స్‌గారి అభిమతం. ఈ శాకాహార సంఘం కేవలం శాకాహారాన్ని గురించియే గాక నీతిని గురించి కూడా ప్రచారం చేయాలని ఆయన ఉద్దేశ్యం. విపరీత భావాలుగల అల్లిన్సన్‌గారి వంటి వారి నీతి బాహ్యాలైన ఉద్దేశ్యాలు కలవారు సంఘంలో వుండరాదని హిల్స్‌గారి తలంపు. కావున అల్లిన్సన్‌గారిని ఆ సంఘాన్నుంచి తొలగించాలనీ ఒక ప్రతిపాదన తెచ్చారు. ఈ చర్య నా హృదయాన్ని ఆకర్షించింది. సంతానం కలగకుండ ఉపాయాలు చేయాలని అల్లిన్సన్‌గారి ఉద్దేశ్యం భయంకరమైనదని నేను భావించాను. అయితే హిల్స్‌గారు నీతివాదియగుట వలన అల్లిన్సన్‌గారికి వ్యతిరేకం కావడం కూడా సరియేయని భావించాను. హిల్స్‌గారి ఔదార్యం చూచి వారియెడ నేను ఆదరణ కలిగి యుండేవాణ్ణి. అయితే నీతి విషయంలో అభిప్రాయ భేదం ఏర్పడినంత మాత్రాన ఒక పెద్ద మనిషిని శాకాహార సంఘాన్నుంచి తొలగించడం మంచిది కాదని అభిప్రాయపడ్డాను. హిల్స్‌గారు నీతివాది కావడం వల్ల ఇటువంటి అభిప్రాయాన్ని వ్యతిరేకించవచ్చు. కాని దానికీ, శాకాహార సంఘ ఉద్దేశ్యానికీ సంబంధం లేదని నా అభిప్రాయం. శాకాహార సంఘ లక్ష్యం శాకాహార విధానాన్ని ముమ్మరం చేయడమే కాని నీతివాదాన్ని ప్రచారం చేయడం కాదు. అందువల్ల నీతికి సంబంధించిన అభిప్రాయాలు ఎలా వున్నప్పటికీ శాకాహార సంఘాన్నుంచి ఒకరిని తొలగించకూడదనే నిర్ణయానికి నేను వచ్చాను.
ఈ విషయంలో సంఘ సభ్యుల్లో ఎక్కువమంది నాతో ఏకీభవించారు. అయితే ఈ విషయం నేనే సమావేశంలో మాట్లాడాలని భావించాను. అది ఎలా సాధ్యం? నాకు సాహసం లేదు. అందువల్ల కాగితం మీద వ్రాసుకొని వెళ్లాను. దాన్ని చదవడానికి కూడా సాహసం చాలక అధ్యక్షుడికి ఆ కాగితం అందజేశాను. ఆయన నా కాగితం ఇంకొకరిచేత చదివించాడు. డాǁ అల్లిన్సన్‌గారి పక్షం ఓడిపోయింది. ప్రథమ ప్రయత్నంలో నాకు అపజయం కలిగింది. అయినా నా అభిప్రాయం సరియైనదేనను అభిప్రాయం కలిగి నాకు తృప్తి కలిగింది. తరువాత నాకు ఆ సమితిలో సభ్యత్వం వద్దని కోరినట్లు గుర్తు. ఆంగ్లదేశంలో వున్నంతకాలం నన్ను సిగ్గు బిడియం వదలలేదు. మిత్రుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు కూడా పదిమంది చేరితే నోరు మెదపలేకపోయేవాడిని.
నేను ఒకసారి వెంటసన్ అను ఊరు వెళ్ళాను. నా వెంట మజుందార్ కూడా వున్నాడు. ఒక శాకాహారి ఇంట్లో బసచేశాం. “ది ఎతిక్స్ ఆఫ్ డైట్” అను గ్రంథం రచించిన హోవర్డుగారు కూడ అక్కడే నివసిస్తున్నారు. ఇది రేవు పట్టణం. ఆరోగ్యవంతమైన ప్రదేశం. మేము హోవర్డుగారిని కలిసి మాట్లాడాము. ఆయన శాకాహార ప్రవర్తక సభలో ఉపన్యసించమని మమ్మల్ని ఆహ్వానించారు. అట్టి సభలో వ్రాసుకొని వెళ్ళి చదవడం తప్పుకాదని తెలుసుకున్నాను. పరస్పర సంబంధం పోకుండా వుండేందుకు, ప్రసంగం క్లుప్తంగా వుండేందుకుగాను చాలామంది అట్లా చేస్తారని తెలిసింది. ఆశువుగా ఉపన్యసించడం అసంభవం. అందువల్ల అనుకున్న విషయమంతా వ్రాసి తీసుకువెళ్లాను. ఒక ఫుల్‌స్కేపు టావు కంటే అది ఎక్కువగా లేదు. కాని లేచి నుంచునేసరికి కళ్ళు తిరిగాయి. వణుకు పట్టుకుంది. అప్పుడు మజుందార్ నా కాగితం తీసుకొని చదివారు. ఆయన ప్రత్యేకించి ఉపన్యాసం కూడా చేశారు. అపుడు శ్రోతలు కరతాళ ధ్వనులు చేశారు. నాకు బాగా సిగ్గు వేసింది. నా అసమర్ధతకు విచారం కూడా కలిగింది. ఆంగ్ల దేశం విడిచి వచ్చేటప్పుడు చివరి ప్రయత్నం కూడా చేశాను. అప్పుడు కూడా అంతా అస్తవ్యస్తం అయింది. శాకాహారులగు మిత్రులకు హర్‌బర్న్ రెస్టారెంటులో డిన్నరు ఏర్పాటు చేశాను. అది శాకాహార రెస్టారెంటు కాదు. అయినా దాని యజమానికి చెప్పి శాకాహారమే తయారుచేయించాను. నా మిత్రులీ క్రొత్త పద్ధతికి చాలా సంతోషించారు. డిన్నర్లు చాలా వైభవంగాను, సంగీతాలతోను, ఉపన్యాసాలతోను జరుగుతాయి. నేను ఏర్పాటు చేసిన ఆ చిన్న డిన్నరులో కూడా అట్టి కార్యక్రమాలు కొన్నింటిని ఏర్పాటు చేశాను. కొన్ని ఉపన్యాసాలు జరిగాయి. నా వంతు రాగానే నేను లేచి నిలబడ్డాను. ఆలోచించి ఆలోచించి మాట్లాడదలచిన విషయాన్ని కొన్ని వాక్యాల్లో ఇముడ్చుకొని మాట్లాడడం ప్రారంభించాను. మొదటి వాక్యంతో ప్రసంగం ఆగిపోయింది. గతంలో అడిసన్‌గారిలా అయింది. హౌస్ ఆఫ్ కామర్సులో ఆయన ఉపన్యసించాలని లేచి నిలబడ్డారు. “నేను కనుచున్నాను. నేను కనుచున్నాను. నేను కనుచున్నాను” అంటూ ఆగిపోయారు. ఇక మాటలు పెగలలేదు. అది చూచి ఒక వినోదప్రియుడు లేచి నిలబడి “వీరు మూడుసార్లు కన్నారుగాని ఏం పుట్టిందో కనబడటం లేదు?” అని అన్నాడు. ఆ ఘట్టం నాకు జ్ఞాపకం వచ్చింది. హాస్య పద్ధతిలో మాట్లాడాలని భావించాను. అందుకు శ్రీకారం చుట్టాను కూడా. కాని వెంటనే ఉపన్యాసం ఆగిపోయింది. రెండో వాక్యం నోట వెలువడలేదు. అంతా మరిచిపోయాను. అందర్నీ నవ్వించాలని భావించి నేను నవ్వుల పాలైనాను. చివరికి తమరు దయతో విచ్చేసినందుకు వందనాలు అంటూ ముగించివేశాను.
నన్ను ఈ బిడియం చాలా కాలం వదలలేదు. దక్షిణాఫ్రికా వెళ్ళిన తరువాత అక్కడ చాలావరకు తగ్గిపోయింది. ఆశువుగా నేను మాట్లాడలేను. కొత్తవారిని చూస్తే నాకు సంకోచం కలుగుతుంది. మాట్లాడకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించేవాణ్ణి. ఇప్పటికి కూడా గాలి పోగుచేసి మాట్లాడటం నాకు చేతగాదు.
అప్పుడప్పుడు పరిహాసానికి పాల్పడటమే గాని దానివల్ల నాకు కలిగిన హాని ఏమీ లేదని చెప్పగలను. అప్పుడు విచారం కలిగించిన ఆ పద్ధతి తరువాత ఆనందం కలిగించింది. మితంగా మాట్లాడటం, అంటే తక్కువ పదాల్ని ప్రయోగించడం జరిగిందన్నమాట. నా నోటినుండి కాని, నా కలాన్నుండిగాని పొల్లుమాట ఒక్కటి కూడా వెలువడలేదని నాకు నేను సర్టిఫికెట్టు ఇచ్చుకోగలను. నా మాటలోగాని, నా వ్రాతలో గాని తప్పు దొర్లడం జరగలేదని గుర్తు. సత్యారాధకునికి మౌనం అవసరమని నాకు కలిగిన అనుభవం. సామాన్యంగా అబద్ధం చెప్పడం, తెలిసో తెలియకో అతిశయోక్తులు పలకడం, సత్యాల్ని మెరుగుపరచడం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం. అయితే మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతాడు. మాట్లాడటానికి ఆరాటపడేవారిని మనం చూస్తుంటాము. మేమంటే మేము అని ఉపన్యాసాలిచ్చేందుకై అధ్యక్షుణ్ణి వత్తిడి చేస్తుంటారు. అనుమతి ఇవ్వగానే వక్త సామాన్యంగా సమయాన్ని అతిక్రమించడం జరుగుతుంది. ఇంకా సమయం కావాలని కోరుతూ ఉంటారు. అనుమతి ఇవ్వకపోయినా ఉపన్యసిస్తూనే ఉంటారు. ఇలా మాట్లాడేవారివల్ల మేలేమీ జరగదు. పైగా కాలహరణం జరుగుతుంది. అందువల్ల బిడియం నాకు డాలుగా పనిచేసింది. సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది.