7. బ్రహ్మచర్యం - 1
ఇది నా బ్రహ్మచర్య వ్రతాన్ని గురించి వ్రాయతగిన సమయం. పెండ్లి రోజునే నా మనస్సునందు ఏకపత్నీవ్రతమను భావం నాటుకుంది. అది నా సత్యవ్రతంలో ఒక భాగం కూడా అయింది. గార్హ్యస్థ్య జీవితం గడుపుతున్నప్పటికీ బ్రహ్మచర్యం యొక్క ఆవశ్యకత దక్షిణ - ఆఫ్రికాలో నాకు బోధపడింది. ఏ సందర్భంలో ఏ పుస్తక ప్రభావం చేత యిట్టి ఆవశ్యకత బోధపడిందో నాకు గుర్తులేదు. రాయచంద్‌భాయి యిందుకు ప్రధాన కారణం అయివుండవచ్చని మాత్రం గుర్తు.
మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒకటి యిప్పటికీ గుర్తు వున్నది. ఒకసారి నేను గ్లాడ్‌స్టన్ గారి యెడ వారి భార్యకు గల ప్రేమను గురించి ప్రస్తావించాను. హౌస్ ఆఫ్ కామన్సులో వున్నప్పుడు కూడా ఆమె తన భర్తకు తేనీరు కాచి ఇస్తూ వుండేదని ఎక్కడో చదివాను. నియమనిష్టలతో జీవితం గడిపే ఆ దంపతుల జీవితంలో ఇది గొప్ప విశేషం. ఈ విషయం ఆ కవికి చెప్పి దాంపత్య ప్రేమను స్తుతించాను. రాయచంద్ భాయి నా మాటలు విని “గ్లాడ్‌స్టన్ గారి భార్య గ్లాడ్‌స్టన్ గారికి పరిచర్య చేసిందనీ, అది గొప్ప విషయమనీ మీరు అంటున్నారు. సరే, ఆమె గ్లాడ్‌స్టన్‌గారి సోదరిగాని, పనిమనిషిగాని అని అనుకోండి. అట్టి ప్రేమతో తేనీరు కాచి ఇచ్చారనుకోండి. అట్టి స్థితిలో భార్య పరిచర్య గొప్పదా? సోదరి పరిచర్య గొప్పదా? పనిమనిషి పరిచర్య గొప్పదా? ఇట్టి సోదరి లేక పనిమనిషి యొక్క ఉదాహరణలు మనకు లేవా? ఈ ప్రేమ స్త్రీ జాతిలో గాక పురుష జాతిలో కనబడితే మీకు ఆనందాశ్చర్యాలు కలుగవా? ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచించి చూడండి” అని అన్నాడు.
రాయచంద్ భాయి వివాహితుడే. ఆ సమయాన వారి మాటలు నాకు కఠోరంగా ఉన్నాయి. కాని వారి మాటలు సూదంటురాయిలా నన్ను ఆకర్షించాయి. భార్యకుగల స్వామిభక్తి యొక్క విలువకంటే పరిచారకుని స్వామిభక్తి యొక్క విలువ ఎక్కువ కాదా? భార్యాభర్తల మధ్య ప్రేమ వుండటంలో ఆశ్చర్యం ఏముంది? స్వామి సేవకుల మధ్య యిట్టి ప్రేమ అభిలషణీయం. రాయచంద్‌భాయి మాటల సారం యిదే కదా? వారి మాటలు నన్ను బాగా వశపరచుకున్నాయి. “నేను నా భార్యతో ఎట్టి సంబంధం ఏర్పరుచుకోవాలి!” అను ఆలోచన నాలో ప్రారంభమైంది. భార్యను భోగ సాధనంగా భావించడం సబబా? అప్పుడు ఏకపత్నీవ్రతానికి విలువలేదు. యిది గమనించతగిన విషయం. నా భార్య నన్ను ఎన్నడైనా మోహవశుణ్ణి చేసిందా? లేదే! ఈ దృష్టితో నేను యిప్పుడు బ్రహ్మచర్య వ్రతాన్ని తేలికగా పాలించగలనని నిర్ణయించుకున్నాను. అయితే అందుకు అడ్డంకి కామాసక్తియే. కామం విషయంలో జాగ్రత్తగా వుందామని ప్రయత్నించాను. అయినా రెండు పర్యాయాలు పొరపాటు చేశాను. ప్రయత్నం చేస్తున్నానే గాని ఓడిపోతున్నాను. ఈ ప్రయత్నానికి ముఖ్యమైన హేతువు అంత గొప్పదికాదు. సంతానం కలుగకుండుటకు సంతానం కలుగకుండ చేసుకునేందుకు బాహ్యోపకరణాలు వున్నాయని ఇంగ్లాండులో వున్నప్పుడు చదివాను. డాక్టరు అలిన్సనుగారి అభిప్రాయాల్ని గురించి, వారు తెలిపిన ఉపాయాల్ని గురించి గతంలో కొద్దిగా వ్రాశాను. కొంతకాలం, అది మంచిదేనని అనుకున్నాను. కాని డాక్టర్ హిల్స్ గారు దాన్ని ఖండించి సంయమమే మంచిదని చెప్పారు. ఆ విషయం నా మనస్సులో అప్పుడే నాటుకున్నది. కాని అప్పుడు ఆ విషయాన్ని గురించి ఎక్కువగా యోచించలేదు. ఇప్పుడు యిక సంతానం వద్దనే నిర్ణయానికి వచ్చాను. దానితో ఇంద్రియ నిగ్రహాన్ని గురించి ఆలోచించసాగాను.
ఇందుకు నేను పడిన పాట్లు చాలా వున్నాయి. మా మంచాలు దూరం అయ్యాయి. పని చేసి బాగా అలసి పోయిన తరువాత నిద్రించడం ప్రారంభించాను. ఎంతగా ప్రయత్నించినా విశేష ఫలితం ఏమీ అప్పుడు కనబడలేదు. కాని భూతకాలపు ఘట్టాల్ని పరిశీలించి చూసుకుంటే చేసిన ప్రయత్నాలు ప్రారంభంలో సఫలం కాక పోయినా చివరికి బలం పుంజుకొని సఫలం కావడం గుర్తుకొచ్చింది.
గట్టి నిర్ణయం 1906వ సంవత్సరంలో చేసుకున్నాను. అప్పటికి సత్యాగ్రహ సమరానికి విఘ్నేశ్వర పూజ కాలేదు. బోయరు యుద్ధం ముగిసిన తరువాత నేటాలులో జూలూ తిరుగుబాటు జరిగింది. అప్పుడు నేను జోహాన్సుబర్గులో వకీలుగా వున్నాను. ఆ తిరుగుబాటు సమయంలో నేటాలు ప్రభుత్వానికి సహకరించాలని భావించాను. నేనీ విషయం విన్నవించుకోగా ప్రభుత్వం వారు అందుకు అంగీకరించారు. ఆ విషయం ముందు వ్రాస్తాను. అయితే యీ సేవకు ఫలితం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించాను. నా స్వభావాన్ని బట్టి మిత్రులతో యీ విషయం చర్చించాను. బిడ్డల్ని కనడం, వారిని పోషించుకోవడం యీ రెండు పనులకి మరి ప్రజా సేవకు సంబంధం లేదని అభిప్రాయపడ్డాను. యీ తిరుగుబాటు సమయంలో జోహాన్సుబర్గు నుండి మకాం ఎత్తి వేయాల్సి వచ్చింది. అలంకరించుకున్న ఇంటిని, అమర్చుకున్న గృహోపకరణాల్ని ఒక నెల అయినా పూర్తికాక ముందే వదలివేయవలసి వచ్చింది. భార్యా బిడ్డల్ని ఫినిక్సులో ఉంచాను. తరువాత నేను గాయపడ్డవారికి శుశ్రూష ప్రారంభించాను. సైన్యంలో చేరి యిట్టి దళాన్ని నడిపించాను. ఆ యుద్ధంలో అసిధారా వ్రతానికి పూనుకోవలసి వచ్చింది.
అప్పుడు లోక సేవా పరాయణుడనైతే యిక పుత్రేషణ, ధనేషణ విరమించుకొని వానప్రస్థాశ్రమం స్వీకరిద్దామన్న సంకల్పం కూడా నాకు కలిగింది.
తిరుగుబాటు సమయంలో మాసంన్నర రోజుల కంటే ఎక్కువ కాలం పట్టలేదు. ఆ ఆరువారాల కాలం నా జీవితంలో ఎంతో అమూల్యమైనది. అదివరకటి కంటే శపథానికి గల విలువ ఏమిటో నాకు బాగా బోధపడింది. శపథం చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి అని ఆలోచన బయలుదేరింది యింత వరకు చేసిన ప్రయత్నాలకు కలిగిన ఫలితం ఏమిటా అని యోచించాను. ఏమీ కనబడలేదు. అసలు నాకు నిశ్చలత కుదరలేదని తేల్చుకున్నాను. ఒక నిర్ణయం మీద నిలబడతాననే విశ్వాసం కలుగలేదు. అందువల్లనే నా మనస్సు అనేక వికారాలకు, అనేక యోచనా తరంగాలకు లోనవుతూ వున్నదని తెల్చుకున్నాను. ఈశ్వరుడు కరుణిస్తాడనే నమ్మకం కూడా లేదు. శపథం చేయకుండా వుండేవాడు మోహంలో పడిపోతాడని తెలుసుకున్నాను. శపథంచే తనను తాను బంధించుకుంటే అది వ్యభిచారంలో పడకుండా మనిషిని ఏకపత్నీవ్రతంలో నిలిపి వుంచుతుందని అనుభవంవల్ల తెలుసుకున్నాను. ప్రయత్నం మంచిదే, కాని శపథ బంధనం మంచిది కాదనుకోవడం దౌర్బల్య సూచకమని తెల్చుకున్నాను. అందు కొద్దిగా భోగేచ్ఛ వుంటుంది. చేయరాని పనిని విడనాడితే కలిగే నష్టం ఏమిటి? పాము కాటు వేయబోతున్నదని తెలిస్తే తప్పక పరుగెత్తుతాము. పరుగెత్తేందుకు ప్రయత్నం మాత్రమే చేస్తూ కూర్చుంటే చావు తధ్యం. అయితే ఆ నిజం తెలుసుకోనప్పుడు ప్రయత్నం చేస్తూ వుంటాం. అందువల్ల ఫలానా అలవాటు మానుకోవాలని నిర్ణయించుకొనీ అందు నిమిత్తం ప్రయత్నం మాత్రమే చేస్తూవుంటే, దాన్ని మానుకోవలసిన ఆవశ్యకతను మనం గుర్తించనట్లే. అసలు మన ఊహలు మారిపోతాయేమో అని శంకించి అనేక సార్లు శపథం చేయడానికి మనం వెనకాడుతూ వుంటాం. ఇదంతా స్పష్టమైన దృక్పధం లేకపోవడం వల్ల జరుగుతూ వుంటుంది. నిష్కలానందుడు దీన్ని గురించి యిలా అన్నాడు. “త్యాగనటకేరేవైరాగవినా” “ఎన్ని ఉపాయాలు చేసినా విషయవాసనలను విడనాడనిదే నీకు త్యాగం అలవడదు సుమా”. అందువల్ల ఎప్పుడు ఏ విషయం యెడ పూర్ణ వైరాగ్యం కలుగుతుందో అప్పుడు శపధం పూనడం మంచిదని, అది దానంతటదే అనివార్యం అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చాను.