23. మళ్లీ దక్షిణ-ఆఫ్రికా
మణిలాలుకు పూర్తిగా నెమ్మదించింది. గిరిగాము నందలి గృహం వాసయోగ్యంగా లేదని అనుకున్నాను. ఇల్లంతా తేమ. తగిన వెలుగులేదు. అందువల్ల నేను రేవాశంకరుగారితో మాట్లాడి మంచి చోట గాలివచ్చే ఇల్లు తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. బాంద్రా, శాంతాకృజ్ వగైరాలన్నీ తిరిగాము. బాంద్రాలో కసాయి దుకాణం వుండటం వల్ల అక్కడ నివసించడానికి నాకు బుద్ధి పుట్టలేదు. ఘల్‌కోపర్ వగైరాలు సముద్రానికి దూరమని అనిపించింది. శాంతాకృజ్‌లో ఒక అందమైన బంగళా దొరికింది. అక్కడ కాపురం పెట్టాను. ఆరోగ్యదృష్ట్యా సురక్షితం అని భావించాను. చర్చిగేటు వరకు వెళ్లడానికి ఒక మొదటి తరగతి రైలు పాసు తెప్పించుకున్నాను. మొదటి తరగతి బండిలో అనేక పర్యాయాలు నేనొక్కడినే ప్రయాణించినట్లు గుర్తు. అందువల్ల నాకు కొంచెం గర్వంకూడా కలిగింది. చాలాసార్లు బాంద్రానుండి చర్చిగేటుకు సరాసరి వెళ్లే బండిని అందుకోవడం కోసం శాంతాక్రజ్ నుండి బాంద్రాకు నడిచి పోతూ వుండేవాణ్ణి. నాకు రాబడి బాగానే ఉంది. దక్షిణ-ఆఫ్రికా క్లయింట్లు కూడా కొంచెం పని ఇస్తూ వున్నారు. అందువల్ల నా ఖర్చులకు సొమ్ము సరిపోతున్నది.
ఇంతవరకు నాకు హైకోర్టుతో పనిపడలేదు. కాని ఆ రోజుల్లో అక్కడ ‘సూట్’ (చర్య) జరుగుతూ వుండేది. దానికి వెళుతూ వుండేవాణ్ణి. అందులో పాల్గొందామంటే ధైర్యం చాలదు. అందు జమీయత్‌రామ్ నానా భాయిగారు ప్రధాన స్థానం ఆక్రమించుతూ వుండేవారని గుర్తు. క్రొత్త బారిస్టర్లందరివలె నేను కూడా హైకోర్టుకు కేసులు వినడానికి వెళుతూ వుండేవాణ్ణి. అచ్చట ఏదో ఒకటి వినడానికి బదులు సముద్రం మీద నుండి మెల్లమెల్లగా వచ్చే చల్లగాలికి కునికిపాట్లు పడి ఆనందం అనుభవిస్తూ వుండేవాణ్ణి. నా వలెనే కునికిపాట్లు పడే ఇతరుల్ని కూడా అక్కడ చూచి సిగ్గు పోగొట్టుకున్నాను. అక్కడ అలా నిద్రించడం కూడా ఒక ఫాషనేనని తలపోశాను. హైకోర్టులో గల గ్రంథాలయాన్ని ఉపయోగించడం ప్రారంభించాను. అక్కడ కొందరితో పరిచయం చేసుకోసాగాను. ఇక కొద్ది కాలంలోనే హైకోర్టులో పని ప్రారంభించగలనని భావించాను.
ఈ మధ్య వృత్తి నిర్వహణను గురించిన చింత కొంచెం కొంచెం తగ్గసాగింది. మరోవైపున గోఖ్లేగారి కండ్లు నా మీద వున్నాయి. వారానికి రెండు మూడు సార్లు నా ఛేంబరులోకి వచ్చి నా యోగక్షేమం తెలుసుకొని వెళ్ళసాగారు. అప్పుడప్పుడు తన మిత్రుల్ని కూడా తీసుకొని వస్తూ ఉండేవారు. పనిచేసే విధానం నాకు తెలుపుతూ ఉండేవారు.
అయితే నా భవిష్యద్విషయాన్ని గురించి ఒక్క సంగతి చెప్పడం మంచిదని భావిస్తున్నాను. నేను మొదట ఏమి చేయదలచుకొనేవాడినో ఈశ్వరుడు దాన్ని సాగనిచ్చేవాడు కాదు. తానొకటి తలిస్తే దైవమింకొకటి తలచినట్లు నా విషయంలో జరుగుతూ ఉంది. నేను స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. కొంచెం స్వస్థుణ్ణి కూడా అయ్యాను. ఇంతలో హఠాత్తుగా దక్షిణ ఆఫ్రికా నుండి తంతి వచ్చింది. “చేంబర్లేనుగారు ఇచటికి రానున్నారు. నీవు వెంటనే రావాలి” ఇది ఆ తంతి సారం. నేను వారికి చెప్పిన మాటలు గుర్తున్నాయి. నేను మళ్ళీ తంతి పంపాను. “నా ఖర్చులు సిద్ధం చేయండి. బయలు దేరి వస్తాను” అని. వెంటనే డబ్బు వచ్చింది. అక్కడ ఒక ఏడాది పడుతుందని అనుకున్నాను. బంగళా నాక్రిందనే వుంచుకొని భార్యాబిడ్డల్ని అందు వుంచి వెళదామని నిర్ణయించుకున్నాను. ఈ దేశంలో పని దొరకని చిన్నవాళ్ళు, విదేశాలకు వెళ్ళేందుకు సాహసించడం మంచిదని అప్పుడు నాకు తోస్తూవుండేది. అందువల్ల నా వెంట నలుగురైదుగురిని తీసుకువెళ్లాను. వారిలో మగన్‌లాల్‌గాంధీ కూడా ఒకరు.
గాంధీ కుటుంబం పెద్దది. ఇంకను వృద్ధి అవుతూ ఉంది. వీరిలో స్వాతంత్ర్యం కోరేవారిని స్వతంత్రుల్ని చేయాలని నా భావన. మా తండ్రిగారు వారినందరినీ జమీందారీ నౌకరీలో బెట్టి ఏదో విధంగా పోషిస్తూ వుండేవారు. వాళ్ళు తమంతట తాము సంపాదించుకోగల స్వతంత్రులు కావాలని నా కోరిక. మగన్‌లాల్ గాంధీని సిద్ధం చేయగలిగాను. ఈ విషయం ముందు వివరిస్తాను.
భార్యాబిడ్డల వియోగం, స్థిరపడిన వకీలు పనిని త్రెంచి వేయడం, నిశ్చిత వస్తువు నుండి అనిశ్చిత వస్తువునందు ప్రవేశించడం, ఇదంతా ఒక నిమిషం పాటు బాధాకరం అనిపించింది. కాని నాకు అనిశ్చిత జీవనం అలవాటు అయిపోయింది. ఈ ప్రపంచంలో భగవంతుడొక్కడే సత్యం. మిగిలినదంతా అనిశ్చితం. మన చుట్టుప్రక్కల కనిపించేదీ జరిగేది అంతా అనిశ్చితం. క్షణికం. దీనియందు నిశ్చిత రూపమైన ఏ పరమతత్వం విలీనమై ఉన్నదో దాని ప్రదర్శనం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం మీద నమ్మకం వుంచితే మన జీవనం సార్ధకం కాగలదు. ఈ అన్వేషణే పరమ పురుషార్థం అని అంటారు
నేను దర్బనుకు ఒకరోజు ముందుగా వెళ్ళలేకపోయాను. నేను చేయవలసిన పని అంతా తయారు చేసి ఉంచారు. చేంబర్లేనుగారిని చూచుటకు తేదీ నిర్ణయించబడింది. వారికి అందజేయవలసిన అర్జీ వ్రాసి నేను డిప్యుటేషనుతో వెళ్ళాలి.
* * *