ప్రస్తావన

నాలుగు లేక అయిదు సంవత్సరాల క్రితం తోటి అనుచరుల పట్టుదల వల్ల నేను ఆత్మకథ వ్రాయుటకు అంగీకరించాను. వ్రాయటం ప్రారంభించి ఒక ఫుల్ స్కేప్ పేజీ పూర్తి చేశానో లేదో ఇంతలో బొంబాయిలో రగడ ప్రారంభమైంది. దానితో నా ఆత్మకధ ఆగిపోయింది. తరువాత పనుల్లో నిమగ్నమయ్యాను. చివరికి యరవాడ జైల్లో నాకు సమయం దొరికింది. జయదాస్ రామ్ భాయి కూడా అక్కడ వున్నారు. మిగతా పనులన్నీ ఆపి ఆత్మకధ పూర్తి చేయమని ఆయన నన్ను కోరారు. అప్పటికే నా నిత్యకార్యక్రమాలు నిర్ణయమైపోయాయి. అట్టి స్థితిలో ఆత్మకధ వ్రాయడం కుదరదని చెప్పాను. అయితే శిక్షాకాలం పూర్తి అయ్యేంతవరకు యరవాడ జైల్లో వుండే అవకాశం లభిస్తే మాత్రం ఆత్మకధ వ్రాయవచ్చని అనుకున్నాను. అందుకు యింకా ఒక సంవత్సరం మిగిలివుంది. అంతకు పూర్వం ప్రారంభించిన ఆత్మకథ ముందుకు సాగలేదు. ఆరంభించగానే ఆగిపోయింది. ఇప్పుడు స్వామి ఆనంద్ ఆత్మకథ వ్రాయడం తిరిగి ప్రారంభించమని కోరారు. ఈలోపున నేను దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర పూర్తిచేశాను. అందువల్ల యిక ఆత్మకధ ప్రారంభించవచ్చునని భావించాను. నేను ఆత్మకధను త్వరగా వ్రాసి గ్రంధరూపంలో ప్రకటించాలని స్వామి ఆనంద్ కోరిక. అయితే త్వరగా వ్రాయడానికి అవసరమైన సమయం నా వద్ద లేదు. అందుకు ఒకటే మార్గం. నవజీవన్ పత్రికకు ఏదో కొంత వ్రాయక తప్పడం లేదు. అట్టి స్థితిలో నవజీవన్ కోసం ఆత్మకధనే వ్రాయవచ్చు కదా అని అభిప్రాయపడ్డాను. స్వామి ఆనంద్ నా అభిప్రాయాన్ని అంగీకరించారు. ఇక ఆత్మకధ వ్రాయడం ప్రారంభించాను.

ఆనాడు సోమవారం. నాకు మౌనదినం. ఒక మంచి మనస్సుగల అనుచరుడు నా దగ్గరకు వచ్చాడు. ‘మీరు ఆత్మకథ వ్రాయాలని ఎందుకు అనుకుంటున్నారు? యిది పాశ్చాత్య విధానం. ప్రాచ్య దేశాల్లో ఎవరూ ఆత్మకథ వ్రాసినట్లు కనబడదు. అయినా మీరు ఏం వ్రాస్తారు? ఈనాడు మీరు అంగీకరిస్తున్న సిద్ధాంతాన్ని రేపు అంగీకరించక పోవచ్చుకదా! ఇవాళ మీరు చేస్తున్న పనుల్లో రేపు మార్పు చేయాల్సి వస్తే? మీ రచనను ప్రామాణికమని భావించి కొందరు తమ ఆచరణను రూపొందించుకొంటారు గదా! వాళ్ళు తప్పుదోవనపడితే! అందువల్ల మీరు ఆత్మకథ వ్రాయకుండా వుండటం మంచిదేమో కొంచెం ఆలోచించండి’ అని అన్నాడు. అతని మాటలు నా మనస్సుమీద కొంత పనిచేశాయి. ఈ విషయమై బాగా యోచించాను. నేను ఆత్మ చరిత్ర వ్రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో ఎన్నో సత్యప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మచరిత్రగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితం అట్టి ప్రయోగాలతో నిండి వుంది. వాటన్నింటిని లిపిబద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందలి ప్రతిపుట సత్యప్రయోగాలతో నిండి వుంటే నా యీ చరిత్ర నిర్దుష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన సత్యప్రయోగాలన్నింటిని ప్రజల ముందుంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది నాకు కలిగిన మోహమే కావచ్చు. నేను రాజకీయరంగంలో చేసిన ప్రయోగాలు భారతదేశానికి తెలుసు, నా దృష్టిలో వాటివిలువ స్వల్పమే. ఈ ప్రయోగాల వల్లనే నాకు “మహాత్మ” అను బిరుదు వచ్చింది. నా దృష్టిలో ఆ బిరుదుకు గల విలువ స్వల్పమే. ఆ బిరుదువల్ల అనేక పర్యాయాలు నాకు విచారం కూడా కలిగింది. ఆ బిరుదును తలుచుకొని ఉబ్బితబ్బిబ్బు అయిన క్షణం నా జీవితంలో ఒక్కటి కూడా వున్నట్లు గుర్తులేదు. రాజకీయరంగులో నాకు శక్తి చేకూర్చిన, నాకు మాత్రమే తెలిసిన నా ఆధ్యాత్మిక ప్రయోగాలను యితరులకు కూడా తెలపడం నాకు యిష్టం. అవి నిజంగా ఆధ్యాత్మికాలైతే ఆందు గర్వానికి తావులేదు. పెరిగితే వినమ్రత పెరగవచ్చు. నా గతజీవితాన్ని పరిశీలించి చూస్తే అందునాకు లఘుత్వమే గోచరిస్తుంది.

గత ముప్పది సంవత్సరాలనుండి జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ ఆత్మదర్శనం కోసమే. ఈశ్వర సాక్షాత్కారం కోసమే. మోక్షం కోసమే. నా రచనా వ్యాసాంగమంతా అందుకోసమే. రాజకీయరంగంలో నా ప్రవేశం కూడా అందు కోసమే. ఒకరికి శక్యమైంది అందరికీ శక్యం కాగలదనే నా విశ్వాసం. అందువల్ల నా ప్రయోగాలు నా వరకే పరిమితం కావు. కానేరవు. ఆ ప్రయోగాలను అందరికీ తెలిపినందువల్ల వాటి ఆధ్యాత్మికత తగ్గుతుందని నాకు అనిపించడంలేదు. అయితే ఆత్మకే తెలిసినట్టి, ఆత్మలోనే శాంతించునట్టి విషయాలు కొన్ని వుంటాయి. అట్టి విషయాలను వివరించడం నా శక్తికి మించినపని. నా ప్రయోగాలు ఆధ్యాత్మికాలు, అనగా నైతికాలు. ధర్మం అంటే నీతి. ఆత్మదృష్టితో పిన్నలు, పెద్దలు, యువకులు, వృద్ధులు నిర్ధారించగల విషయాలు ఈ కథలో వుంటాయి. ఈ నా కథను తటస్థుడనై, అభిమానరహితుడనై వ్రాయగలిగితే సత్యాన్వేషణా మార్గాన పయనించి ప్రయోగాలుచేసేవారందరికీ కొంత సామగ్రి లభిస్తుందని నా విశ్వాసం. నా ప్రయోగాలు పూర్ణత్వం పొందాయని నేను సమర్ధించుకోవడం లేదు. వైజ్ఞానికుడు బుద్ధి కుశలతతో యోచించి పరిశోధనలు చేస్తాడు. అయితే వాటి ఫలితాలే చివరివని భావించడు. వాటిమీద నమ్మకం ఏర్పడినా తాను మాత్రం తటస్థంగా వుంటాడు. నా ప్రయోగాలు కూడా అటువంటివే. నేను ఆత్మనిరీక్షణకూడా చేసుకున్నాను. ప్రతి విషయాన్ని పరీక్షించి చూచాను. విశ్లేషించి చూచాను. వాటి పరిణామాలే అందరికీ అంగీకారయోగ్యాలని, అవే సరియైనవని నేను ఎన్నడూ చెప్పదలచలేదు. అయితే యివి నా దృష్టిలో సరియైనవని, యీ నాటికి యివి చివరివని మాత్రం చెప్పగలను. అలా విశ్వసించకపోతే వీటి పునాదిమీద ఏవిధమైన భవనం నిర్మించలేము. చూచిన వస్తువులను అడుగడుగునా పరిశీలించి ఇవి త్యాజ్యాలు, ఇవి గ్రాహ్యాలు అని రెండు రకాలుగా విభజిస్తాను. గ్రాహ్యాలనుబట్టి నా ఆచరణను మలుచుకుంటాను. ఆ విధంగా మలుచుకున్న ఆచరణ ఎప్పటివరకు నాకు, నా బుద్ధికీ, నా ఆత్మకు తృప్తి, సంతోషం కలిగిస్తూవుంటుందో అంతవరకు దాని శుభపరిణామాలను విశ్వసిస్తూవుంటాను.

కేవలం సిద్ధాంతాలను అనగా తత్వాలను గురించిన వర్ణనే ముఖ్యమని భావిస్తే ఈ ఆత్మకథ వ్రాయవలసిన అవసరం లేదు. కాని ప్రయోగాలపై చేసిన కృషిని పేర్కొనాలి. అందువల్లనే నేను నా కృషికి ప్రధమంగా సత్యశోధన అని పేరు పెట్టాను. ఇందు సత్యానికి భిన్నమనీ భావించబడే అహింస, బ్రహ్మచర్యం మొదలుగాగలవాటిని గురించిన ప్రయోగాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం సత్యమే అన్నింటిలోను గొప్పది. అందు పలువిషయాలు నిహితమై వుంటాయి. ఈ సత్యం స్థూలంగా వుండే వాకృత్వం కాదు. ఇదీ వాక్కుకు సంబంధించినదేగాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పిత సత్యంగాక సుస్థిరత కలిగిన స్వతంత్రమైన అస్తిత్వంగల సత్యం. అంటే సాక్షాత్ పరబ్రహ్మమన్నమాట.

పరమేశ్వరునికి వ్యాఖ్యలు అనేకం. గొప్పతనాలుకూడా అనేకం. ఆ గొప్పతనాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. కొద్ది సేపు నన్ను మోహింపచేస్తాయి. నేను సత్యస్వరూపుడగు పరమేశ్వరుని పూజారిని. అతడొక్కడే సత్యం. మిగిలిందంతా మిధ్యమే. ఆ శోధన కోసం నాకు ఎంతో ప్రీతికరమైన వస్తువును సైతం త్యజించివేయుటకు నేను సిద్ధమే. ఈ శోధనాయజ్ఞంలో శరీరాన్ని సైతం హోమం చేయడానికి నేను సిద్ధమే. అట్టి శక్తి నాకు కలదనే నమ్మకం వున్నది. ఆ సత్యసాక్షాత్కారం కలుగనంతవరకు నాఅంతరాత్మదేన్ని సత్యమని నమ్ముతుందో ఆకాల్పనిక సత్యాన్ని ఆధారం చేసుకొని, దాన్ని దీపంగా భావించి, దాని ఆశ్రయంలో జీవితం గడుపుతాను. నిజానికి ఇది కత్తిమీద సాము వంటిది. అయినా నాకు సులువు అనిపించింది. ఈ మార్గాన నడుస్తున్నప్పుడు భయంకరమైన పొరపాట్లు కూడా నాకు తుచ్ఛమైనవిగా కనబడతాయి. అట్టి పొరపాట్లు చేసికూడా రక్షణ పొందాను. నాకు తెలిసినంతవరకు ముందుకేసాగాను. విశుద్ధ సత్యపు వెలుగురేఖ దూరాన లీలగా కనబడుతూ వుంది.

ఈ జగత్తులో సత్యం దప్ప మరొకటి ఏమీ లేదనునమ్మకం రోజురోజుకు నాలో పెరుగుతూవున్నది. ఎలా పెరుగుతూవున్నదో నా ప్రపంచపు అనగా నవజీవన్ మొదలుగాగల పత్రికల పాఠకులు తెలుసుకొని యిష్టమైతే నా ప్రయోగాలలో భాగస్వాములు అవుదురుగాక. అంతేగాక నాకు శక్యమైన వస్తువు ఒక బాలునికి సైతం శక్యం కాగలదని నా నమ్మకం. అందుకు బలవత్తరమైన కారణాలు అనేకం వున్నాయి. సత్యశోధనకు సంబంధించిన సాధనాలు ఎంత కఠినమైనవో అంతసరళమైనవికూడా. ఆ అహంకారికి అశక్యాలు, కాని కల్లాకపటం ఎరుగని బాలునికి శక్యాలు. సత్యాన్వేషకుడు ధూళికణం కంటే చిన్నగా వుండాలి. ప్రపంచం అంతా ధూళికణాన్ని కాలిక్రింద త్రొక్కి వేస్తుంది. అయితే సత్యాన్వేషకుడు ధూళికణం కూడా తొక్కి వేయలేసంత సూక్ష్మంగా వుండాలి. అప్పుడే అతనికి సత్యం లీలగా గోచరిస్తుంది. ఈ విషయం విశిష్ట విశ్వామిత్రులకథలో స్పష్టంగా చెప్పబడింది. క్రైస్తవ, ఇస్లాంమతాలుకూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.

నేను వ్రాస్తున్న ప్రకరణాల్లో పాఠకులకు అహంభావపు వాసన తగిలితే నా అన్వేషణలో ఏదో పెద్ద పొరపాటు వున్నదనీ నేను కనుగొంటున్ను వెలుగు రేఖ ఎండమావియేనని గ్రహించాలి. నా వంటి పలువురు శోధకులు మగ్గిపోయినా సత్యం మాత్రం సదా జయించాలి. అల్పమైన ఆత్మను కొలుచుటకు సత్యమనే కొలబద్ద ఎన్నటికీ తరిగిపోకూడదు. నా ప్రకరణాలను ప్రామాణికమని భావించవద్దని అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను పేర్కొన్న ప్రయోగాలను దృష్టాంతాలుగా భావించి అంతా తమతమ ప్రయోగాలు శక్త్యానుసారం, తమకు తోచిన విధంగా చేయాలని కోరుతున్నాను. నా ఆత్మకధవల్ల ఏదో కొంత ప్రజలకు లభించగలదని విశ్వసిస్తున్నాను. ప్రకటించుటకు అనుకూలమైన ఏ ఒక్క విషయాన్ని కూడా నేను దాచలేదని మనవి చేస్తున్నాను. నా దోషాలన్నింటిని పూర్తిగా పాఠకులముందు వుంచానని విశ్వసిస్తున్నాను. సత్యపు ప్రయోగాలను వివరించడమే నా లక్ష్యం. నా గుణగణాలను వర్ణించుకోవాలనే కోరిక నాకు తిలమాత్రమైనా లేదు. ఏకొలబద్దతో నన్ను నేను కొలుచుకోవాలని భావిస్తున్నానో, ఏ కొలబద్దను మనమంతా ఉపయోగించవలసిన అవసరం వున్నదని నమ్ముతున్నానో ఆ కొలబద్ద ప్రకారం క్రింది సూక్తిని ఉటంకిస్తున్నాను.

మో సమ్ కౌన్ కుటిల్ ఖల్ కామీ?
జిన్ తన్ దియో తాహి బిసరాయో
ఐసో సమక్ హరామీ. (సూరదాసు)

(నావంటి కుటిలుడు, ఖలుడు, కాముకుడు మరొకడెవ్వడుగలడు? ఏ ప్రభువు ఈ తనువును యిచ్చాడో అతనినే మరిచాను. నేను అంతటి కృతఘ్నుణ్ణి) నేను ఎవరినీ నా శ్వాసోచ్చ్వాసలకు ప్రభువని భావిస్తున్నానో, ఎవరి ఉప్పు తిని బ్రతుకుతున్నానో, ఆ ప్రభువుకు యింకా దూరంగా వున్నాననే బాధ ప్రతిక్షణం నన్ను వేధిస్తూవున్నది. అందుకు కారణాలైన నాయందలి వికారాలను చూడగలుగుతున్నానే కానీ ఇంకా తొలగించుకోలేకపోతున్నాను.

ఇక ముగిస్తున్నాను. ప్రస్తావనయందు సత్యశోధనలకధ లో ప్రవేశించను. ఆ కధంతా ముందు ప్రకరణాల్లో వివరిస్తాను.

ఆశ్రమం, సబర్మతి
ది, 26 నవంబరు 1925

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ