సత్యశోధన/నాల్గవభాగం/38. యుద్ధరంగంలో
38. యుద్ధరంగంలో
ఇంగ్లాండు చేరిన తరువాత గోఖలేగారు పారిస్‌లో చిక్కుకు పోయారని తెలిసింది. పారిసుతో రాకపోకలు ఆగిపోయాయి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆరోగ్యం కోసం గోఖలేగారు ఫ్రాన్సు వెళ్ళారు. యుద్ధం కారణంగా వారు అక్కడ చిక్కుబడిపోయారు. వారిని కలవకుండా దేశం వెళ్ళడం సాధ్యం కాని పని. అయితే ఆయన ఎప్పుడు రాగలిగేది చెప్పగల వారెవ్వరూ లేరు.
ఈ లోపున నేను ఏం చేయాలి? యుద్ధంలో నా పాత్ర ఏమిటి? దక్షిణ ఆఫ్రికా జైల్లో నా అనుచరుడు, సత్యాగ్రహి అయిన సోరాబ్‌జీ ఆడాజనియా ఇంగ్లాండులో బారిష్టరీ చదువుతూ వున్నాడు. ఉత్తమోత్తమ సత్యాగ్రహిగా ఆయనను బారెట్లా చదవమని అక్కడి వాళ్ళు పంపించారు. ఆయన నా స్థానాన్ని భర్తీ చేస్తారన్నమాట. ఆయన ఖర్చు దాక్టర్ ప్రాణ జీవరాజ్ మెహతా గారు భరిస్తున్నారు. నేను వారిని సంప్రదించాను. ఇంగ్లాండులో నివసిస్తున్న హిందూ దేశస్థుల సమావేశం ఏర్పాటు చేయించి వారికి నా అభిప్రాయాలు తెలియజేశాను. ఇంగ్లాండులో నివసిస్తున్న హిందూ దేశస్థులంతా యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించాలని నాకు తోచింది. ఆంగ్ల విద్యార్థులు యుద్ధంలో పాల్గొని సేవ చేస్తామని ప్రకటించారు. హిందూ దేశస్థులు ఎందుకు వెనకబడాలి. ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా చాలా కారణాలు పేర్కొనబడ్డాయి. మనకు ఆంగ్లేయులకు మధ్య ఎంతో తేడా వున్నదని, ఒకరు బానిసలైతే మరొకరు ప్రభువులని, అట్టిస్థితిలో బానిసలు ప్రభువుకు ఆపదసమయంలో స్వేచ్ఛగా ఎలా సాయం చేయగలరని కొందరు ప్రశ్నించారు. బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావిస్తున్న బానిస యజమాని ఆపదల్లో చిక్కుకున్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పేమిటి అని కూడా అన్నారు. ఈ తర్కం అప్పుడు నాకు మింగుడు పడలేదు. మనం పూర్తిగా బానిసత్వంలో లేమనే అభిప్రాయంతో అప్పుడు నేను వున్నాను. అసలు ఆంగ్ల ప్రభుత్వ విధానంలో లేదని, దాన్ని అమలుపరుస్తున్న ఆంగ్ల అధికారుల్లో దోషం అధికంగా వున్నదని ప్రేమద్వారా ఆదోషాన్ని తొలగించుకోవచ్చని భావించాను. ఆంగ్లేయుల సాయంతో మనస్థితిని చక్క దిద్దుకోవాలని మనం భావిస్తూ వుంటే ఆపద సమయంలో వారికి సాయం చేసి తద్వారా పరిస్థితి చక్కదిద్దుకోవాలని అభిప్రాయపడ్డాను. రాజ్యవిధానం దోషమయంగా వున్నప్పటికీ ఆ రోజుల్లో అది యిప్పటివలెనే నాకు పెద్దదిగా కనబడలేదు. అయితే ఇప్పుడు ఆంగ్ల రాజ్య విధానం మీద విశ్వాసం నాకు పూర్తిగా సడలిపోయింది. అందువల్ల ఇప్పుడు నన్ను సాయం చేయమంటే చేయలేను. అదేవిధంగా ఆంగ్ల రాజ్య విధానం మీద, ఆంగ్ల అధికారులుమీద పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిపోయినవారిని సాయం చేయమంటే చేస్తారా? సాధ్యమా?
ఆంగ్ల రాజ్య విధానంలో మార్పు కోరడానికి యిది మంచి తరుణమని వారు భావించారు. కాని నేను అందుకు అంగీకరించలేదు. యుద్ధ సమయంలో హక్కులు కోరకూడదని, ఆ విషయమై సంయమం పాటించడం మంచిదని, అది దూరదృష్టితో కూడిన పని అని భావించాను. నా అభిప్రాయం మీద గట్టిగా నిలబడినవారి పేర్లు నమోదు అయ్యాయి. అన్ని మతాల, అన్ని ప్రాంతాల వారి పేర్లు ఆ పట్టికలో వున్నాయి.
లార్డు క్రూ పేరట జాబు వ్రాశాను. హిందూ దేశస్థుల పేర్లు మీరు మంజూరు చేస్తే యుద్ధరంగంలో గాయపడ్డ వారికి సేవ చేసేందుకు, అందుకు అవసరమైన శిక్షణ పొందేందుకు సిద్ధంగా వున్నామని ఆ జాబులో తెలియజేశాను. కొద్దిగా చర్చలు జరిగిన తదుపరి లార్డ్ క్రూ అందుకు అంగీకరించాడు. కష్టసమయంలో ఆంగ్ల ప్రభుత్వానికి సాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. పేర్లు యిచ్చిన వారంతా ప్రసిద్ధ డాక్టరు కేంటలీ గారి అజమాయిషిలో గాయపడ్డవారికి సేవ చేసే ప్రాధమిక శిక్షణ పొందసాగారు. మా దళానికి ఆరువారాలపాటు చిన్న శిక్షణా కార్యక్రమంలో గాయపడ్డ వారికి సేవాశుశ్రూషలు చేసే ప్రాధమిక విధానం పూర్తిగా నేర్పారు. సుమారు 80 మందిమి ఆ క్యాంపులో చేరాము. ఆరువారాల తరువాత పరీక్ష పెట్టారు. ఒక్కడు మాత్రమే ఫేలయ్యాడు. ప్యాసైనవారందరికి ప్రభుత్వం పక్షాన కవాతు గరిపేందుకు ఏర్పాటు చేశారు. కర్నల్ బెకర్‌కు యీ కవాతు కార్యక్రమం అప్పగించారు. ఆయనను మా గ్రూపుకు నాయకునిగా నియమించారు. అప్పటి ఇంగ్లాండు పరిస్థితులు తెలుసుకోతగినవి. ప్రజలు భయపడలేదు. అంతా యుద్ధానికి ఏదో విధంగా సాయం చేసేందుకు పూనుకున్నారు. శరీరదార్ఢ్యత గలిగిన యువకులు సైన్యంలో చేరారు. అశక్తులు, వృద్ధులు, స్త్రీలు ఏం చేయాలి. వారికి కూడా పనులు అప్పగించవచ్చు. యుద్ధంలో గాయపడ్డ వారికోసం చాలామంది దుస్తులు కుట్టడం ప్రారంభించారు. అక్కడ లైసియమ్ అను స్త్రీ క్లబ్బు ఒకటి వున్నది. ఆ క్లబ్బుకు చెందిన స్త్రీలు యుద్ధశాఖకు అవసరమైన బట్టలు అందజేసేందుకు పూనుకున్నారు. సరోజినీ దేవి కూడా ఆ క్లబ్బు సభ్యురాలు. ఆమె యీ పనికి గట్టిగా పూనుకున్నారు. నాకు అక్కడే ఆమెతో మొదటి పర్యాయం పరిచయం ఏర్పడింది. ఆమె బోలెడన్ని బట్టలు నా ఎదుట కుప్పలుగా పడవేసి, వాటిలో సాధ్యమైనన్ని బట్టలు కుట్టించి తనకు అప్పగించమని చెప్పింది. నేను ఆమె కోరికను పాటించి సాధ్యమైనన్ని గుడ్డలు కుట్టించి ఆమెకు అప్పగించాను.