సత్యశోధన/నాల్గవభాగం/16. మహమ్మారి - 2
16. మహమ్మారి - 2
ముందుగా అనుమతి తీసుకోకుండా ఇంటి తాళం బద్దలు కొట్టి అందు రోగులను చేర్చి వారికి సేవా శుశ్రూష చేసినందుకు టౌన్‌క్లర్కు మమ్మల్ని అభినందించాడు. “ఇటువంటి సమయంలో ధైర్యం చేసి మీరు చేసిన విధంగా ఏర్పాటు చేసే చొరవ మాకు లేదు. మీకు ఏవిధమైన సాయం కావలసివచ్చినా చెప్పండి. టౌన్‌కౌన్సిలు చేతనైన సాయం చేస్తుంది.” అని మనస్పూర్తిగా చెప్పాడు. మున్సిపాలిటీ వారు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. రోగుల సేవ విషయంలో వాళ్ళు ఆలస్యం చేయలేదు.
రెండో రోజున ఖాళీగా వున్న పెద్ద గోడౌను మాకు అప్పగించారు. అందు రోగులనందరినీ చేర్చమని చెప్పారు. దాన్ని శుభ్రం చేసే బాధ్యత మునిసిపాలిటీ వహించలేదు. ఆ గోడౌను మురికిగాను, అపరిశుభ్రంగాను ఉంది. మేమంతా కలిసి దాన్ని శుభ్రం చేశాము. ఉదార హృదయులగు భారతీయులు మంచాలు వగైరా ఇచ్చారు. అక్కడ ఒక ఆసుపత్రి వాతావరణం ఏర్పడింది. మునిసిపాలిటీ వారు ఒక నర్సును పరిచారికను పంపించారు. బ్రాందీ సీసాలు, మందులు వగైరా వారికిచ్చి పంపారు. డాక్టర్ గాడ్‌ఫ్రే మొదటివలెనే మాతోబాటు వుండి చికిత్స చేస్తున్నారు. నర్సును, మేము రోగుల దగ్గరికి పోనీయలేదు. ఆమెకు ఏమీ ఇబ్బంది కలుగలేదు. ఆమె స్వభావం మంచిది. అయితే ఎవ్వరికీ ప్రమాదం కలుగకూడదని మా అభిప్రాయం. రోగులకు బ్రాందీ పట్టమని సలహా ఇచ్చింది. వ్యాధి సోకకుండా మీరు కూడా కొద్ది కొద్దిగా బ్రాందీ తాగమని నర్సు మాకు సలహా ఇచ్చింది. ఆమె బ్రాందీ త్రాగుతునే వున్నది. రోగులకు బ్రాందీ పట్టడానికి నా మనస్సు అంగీకరించలేదు. ముగ్గురు రోగులు బ్రాందీ త్రాగకుండా వుండటానికి అంగీకరించారు. డా. గాడ్‌ఫ్రే గారి అనుమతితో వారికి మట్టిపట్టీల చికిత్స చేశాను. గుండెలో నొప్పిగా వున్నచోట మట్టి పట్టీలు వేశాను. వారిలో ఇద్దరు మాత్రం బ్రతికారు. మిగతావారంతా చనిపోయారు. ఇరవై మంది రోగులు ఆ గోడౌనులోనే చనిపోయారు.
మునిసిపాలిటీ వారు మరో ఏర్పాటు చేశారు. జోహన్సుబర్గుకు ఏడు మైళ్ళ దూరాన అంటురోగాలు తగిలిన వారి కోసం ప్రత్యేక ఆసుపత్రి వున్నది. అక్కడ డేరా వేసి ముగ్గురు రోగుల్ని తీసుకువెళ్ళారు. ప్లేగు తగిలిన మిగతా రోగుల్ని కూడా అక్కడకు తీసుకొని వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు. దానితో మాకు ముక్తి లభించింది. పాపం ఆ నర్సు కూడా ప్లేగు వ్యాధి సోకి చనిపోయిందని కొద్దిరోజుల తరువాత మాకు తెలిసింది. కొద్దిమంది రోగులు బ్రతకడం, మేము ప్లేగువాత బడకుండా మిగలడం విచిత్రమే. ఇలా ఎందుకు జరిగిందో చెప్పలేము. అయితే మట్టి చికిత్స మీద నాకు శ్రద్ధ, ఔషధ రూపంలో బ్రాందీ మొదలగువాటి ఎడ అశ్రద్ధ పెరిగింది. ఈ శ్రద్ధకు, అశ్రద్ధకు ఆధారం ఏమీ లేదని అనవచ్చు. నాకు ఆ విషయం తెలుసు. కాని ఆనాడు నా మనస్సు పైబడిన ముద్రను తొలగించలేను. ఈనాటికీ ఆ ముద్ర అలాగే ఉన్నది. అందువల్లనే ఇక్కడ ఆ విషయాన్ని వ్రాయడం అవసరమని భావించాను.
ఈ నల్ల ప్లేగు వంటి భయంకర వ్యాధి ప్రబలగానే నేను పత్రికల్లో మునిసిపాలిటీ వారు లొకేషను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత చూపిన అశ్రద్ధను గురించి వివరంగా వ్రాసి ఇట్టి వ్యాధి రావడానికి వారి బాధ్యతను నొక్కి వక్కాణిస్తూ జాబు ప్రకటించాను. నా ఆ జాబు మి. హెనరీ పోలక్‌ను నాకు పరిచయం చేసింది. కీ.శే. జోసఫ్‌డోక్‌తో పరిచయం కావడానికి సాధనంగా ఉపయోగపడింది.
గత ప్రకరణంలో నేను భోజనం నిమిత్తం ఒక మాంసాహార రహిత భోజనశాలకు వెళుతూ వుండేవాడినని వ్రాశాను. ఆక్కడ మి. అల్బర్టువెస్ట్‌తో పరిచయం కలిగింది. మేము సాయంత్రం పూట ఆ భోజనశాలలో కలుస్తూ వుండేవారం. అక్కడ ఆహారం తీసుకొని షికారుకు వెళ్ళేవారం. ఆయన ఒక చిన్న ప్రెస్సులో భాగస్వామిగా వుండేవాడు. పత్రికల్లో మహమ్మారిని గురించిన నా జాబు చదివి, భోజనశాలలో నేను కనబడక పోయేసరికి కంగారు పడిపోయాడు. నేనూ, నాతోటి అనుచరులు రోగులకు సేవచేస్తున్నప్పుడు భోజనం పూర్తిగా తగ్గించివేశాం. ప్లేగువంటి వ్యాధులు ప్రబలినప్పుడు పొట్ట ఎంత తేలికగా వుంటే అంత మంచిదని అనుభవం వల్ల తెలుసుకున్నాను. అందువల్ల సాయంకాల భోజనం మానివేశాను. మధ్యాహ్నం పూట భోజనం చేసి వచ్చేవాణ్ణి. భోజనశాలలో భోజనం మానివేశాను. మధ్యాహ్నం పూట భోజనం చేసి వచ్చేవాణ్ణి. భోజనశాల యజమాని నన్ను బాగా ఎరుగును. ఆయనకు ముందుగానే నేను ప్లేగు సోకిన రోగుల సేవ చేస్తున్నాను, నా వల్ల ఎవ్వరికీ ఏ విధమైన యిబ్బంది కలుగకూడదు అని చెప్పాను. అందువల్ల నేను భోజనశాలలో వెస్ట్‌గారికి కనబడలేదు. రెండోరోజునో లేక మూడో రోజునో ఉదయం పూట నేను బయటకు వెళ్ళబోతున్నప్పుడు నేనుండే గది దగ్గరికి వచ్చి తలుపుకొట్టగా నేను తలుపు తెరిచాను. నన్ను చూచీ చూడగానే “మీరు భోజనశాలలో కనబడనందున మీకేమైనా అయిందేమోనని గాబరాపడ్డాను. ఈ సమయంలో తప్పక దొరుకుతారనే భావంతో వచ్చాను. అవసరమైతే చెప్పండి. రోగులకు సేవ శుశ్రూషలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నా పొట్ట నింపుకోవడం మినహా నాకు మరో బాధ్యత అంటూ ఏమీ లేదని మీకు తెలుసుగదా అని అన్నాడు.
నేను వెస్ట్‌గారికి ధన్యవాదాలు సమర్పించాను. నేను ఆలోచించేందుకు ఒక్క నిమిషం సేపు కూడా వృధా చేయలేదు. “మిమ్మల్ని నర్సుగా తీసుకోను. మేము జబ్బు పడకపోతే రెండుమూడు రోజుల్లో మా పని పూర్తి అవుతుంది. ఒక్క పని మాత్రం ఉన్నది” అని అన్నాను. “ఏమిటది” “దర్బను వెళ్ళి ఇండియన్ ఒపీనియన్ ప్రెస్సుపని మీ చేతుల్లోకి తీసుకోగలరా? మదనజీత్ ప్రస్తుతం ఇక్కడ పనిలో మునిగి ఉన్నాడు. అక్కడికి ఎవరైనా వెళ్ళడం అవసరం. మీరు వెళితే ఆ చింత నాకు తొలగుతుంది“ “నా దగ్గర ప్రెస్సు వున్నదని మీకు తెలుసు. ఏ సంగతీ సాయంకాలం చెబుతా. సరేనా! సాయంత్రం వాహ్యాళికి వెళదాం మాట్లాడుకోవచ్చు” నాకు ఆనందం కలిగింది. ఆ రోజు సాయంత్రం మాట్లాడాం. ప్రతిమాసం వెస్ట్‌కు పది పౌండ్ల జీతం మరియు ప్రెస్సులో డబ్బు మిగిలితే దానిలో భాగం ఇవ్వడానికి అంగీకరించాను. నిజానికి వెస్ట్‌దొర జీతానికి ఒప్పుకునే వ్యక్తికాదు. అందువల్ల జీతాన్ని గురించి ఆయన పట్టించుకోలేదు. రెండో రోజు రాత్రి మెయిలుకి వెస్ట్ బయలుదేరి వెళ్ళాడు.
అప్పటినుండి నేను దక్షిణ ఆఫ్రికా వదిలి వచ్చేవరకు కష్టసుఖాల్లో నాతోబాటు వుండి ఆయన పనిచేశాడు. వెస్ట్‌దొర ఇంగ్లాండులో లౌథ్ అను గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. స్కూల్లో సామాన్య శిక్షణ పొంది, కష్టపడి పైకి వచ్చి అనుభవం అనే పాఠశాలలో శిక్షణ పొందినవాడు. పొందికగల సంయమశీలి, భగవంతునికి భయపడేమనిషి, ధైర్యశాలి, పరోపకారి. ఆయనను గురించి, ఆయన కుటుంబాన్ని గురించి రాబోయే ప్రకరణాల్లో వ్రాస్తాను.