సంపూర్ణ నీతిచంద్రిక/స్వయంకృతాపరాధమువలన జెడిన రాజకుమారుని కథ
స్వయంకృతాపరాధమువలన జెడిన రాజకుమారుని కథ
సింహళ దేశరాజయిన జీమూతకేతునకు గందర్పకేతు డను నొక కుమారుడు గలడు. ఆత డొకనా డుద్యానవనమున నుండగా నొక యోడబేరగాడు వచ్చి "ప్రభూ! సముద్ర మధ్యమున మొన్నటి చతుర్దశినాడు డొకకల్ప వృక్షము బయలు దేఱినది. ఆవృక్షముక్రింద రత్నకాంతులతో దేదీప్యమానముగా నున్న పానుపుపై సర్వాలంకారములు ధరించి వీణవాయించుచు లక్ష్మివలె నుండు నొక కన్య కానబడినది." అని చెప్పగా రాజకుమారునకు గుతూహలము గలిగి యాతనితో సముద్రతీరమునకు బోయెను.
సరిగా వణిజుడు చెప్పిన చొప్పున నున్న కన్యకా మణింజూచి యామె రూపలావణ్యములచే రాకొమరు డాకర్షింపబడెను. వెంటనే యాతడు మహాసాహసమున నాబాలా మణియొద్ద కుఱికెను. అట్లుఱుకుటయే తడవుగా నాతడు బంగరుమేడలతో నిండిన యొకపట్టణమునకు బోయి యందొక సుందరసౌధమున విద్యాధరకన్యలచే సేవింప బడుచున్న యా సుందరాంగిం జూచెను.
ఆమెయు రాకొమరుని దూరమునుండియే చూచి యాతనితో మాటలాడుటకై తనచెలికత్తె నంపెను. చెలికత్తె యాతనికడకు బోయి "రాజకుమారా! మాచెలి కందర్ప కేళియను విద్యాధరచక్రవర్తి కూతురు రత్నమంజిరి. 'ఎవడు తనంతట దానీ సువర్ణనగరముం జూచి చేరవచ్చునో యాతని బెండ్లి యాడవలయు' నని యామెసంకల్పము. కావున నీవామెను గాంధర్వ విధిచే వివాహమాడుము" అని పలికెను.
కందర్ప కేతు 'డట్లే' యని యంగీకరించి రత్నమంజరిని వివాహమాడి యచటనే హాయిగా సమస్తసుఖములు ననుభవించుచుండెను. ఒకనా డామె యాతనితో "స్వామీ! యీసర్వైశ్వర్యము నీయధీనము, నీయిచ్చవచ్చినట్లు దీని ననుభవింప వచ్చును. ఈచిత్రపటమందలి యాకృతిస్వర్ణ రేఖయను విద్యాధరకన్యది. దీనినిమాత్రము నీవెన్నడు దాకవలదు. అట్లు తాకినయెడల మహాప్రమాదము సంభవింప గలదు. అని పలికెను.
కొంతకాల మట్లు కడచిన పిమ్మట నొకనాడు కందర్ప కేతుడు కుతూహలము నిలుపుకొనలేక యా స్వర్ణ రేఖను జేతితో దాకెను. వెంటనే యది చిత్రమే యయినను నామె తన చరణముచేత నారాజకుమారుని దన్నెను. అత డెప్పటివలె దన రాష్ట్రమందలి యుద్యానవనమున బడి యెన్నడు నిక రత్నమంజరి జాడగానజాలక దు:ఖపీడితు డయ్యెను. ఇంక సన్న్యాసి కథ వినుము.