సంపూర్ణ నీతిచంద్రిక/మిత్రభేదము
మిత్రభేదము
అనంతరము రాజపుత్రులు విష్ణుశర్మతో "ఆర్యా తమదయవలన మిత్రలాభము వినియుంటిమి. ఇక మిత్రభేదము విన గుతూహలముతో నుంటి" మని పలికిరి. విష్ణుశర్మవారికిట్లు చెప్పదొడగెను.
"దక్షిణదేశమున సువర్ణపురమను నగరముగలదు. ఆనగరమున వర్ధమానుడను వణిజుడు నివసించుచుండెను. అతడు ధనికుడే యైనను దనకంటె నైశ్వర్యవంతులయిన బంధువులను జూచి వారికంటె నెక్కువ ధనము సంపాదింప వలయునని యూహించెను. తనకంటె దక్కువవాని జూచిన నెవ్వడైన నధికుడేయగును. తనకంటె నధికులను గుఱించి యాలోచించినపు డెంతవాడైన దాను దరిద్రుడుగనే యుండును.
"మహాపాతక మొనరించిన ధనముగల నరుడు పూజింపబడును. చంద్రునివలె స్వచ్ఛమయిన వంశమున బుట్టిన వాడైనను నిర్ధనుడు నిరాదరింప బడును. కావున ధర్మముదప్పని యేమార్గమున నైన ధనము సంపాదింపవలయును. ధర్మార్థకామమోక్షము లనెడి నాలుగు పురుషార్థముల లోపల నర్థమే ముఖ్యమయినది. అట్టిధనము సంపాదించి దానిం గాపాడి పెంపొందింప వలయును. పెంపొందిన దానిని సరియైన విధమున నుపయోగింపవలయును. ధన ముండియు సరిగా గాపాడకున్నచో నది నశించి పోవును. లభించినధనము వృద్ధినొందింపని యెడల గొంచెముగా ఖర్చుపెట్టుచున్నను గాటుకవలె హరించిపోవును. ధనముండియు ననుభవమునకు రానిచో నది నిరుపయోగము దానభోగముల కుపయోగింపని ధనమును, శత్రువిజయము సంపాదింపలేని బలమును, ధర్మమాచరింపని వాని పాండిత్యమును, నింద్రియజయములేనివాని బుద్ధివిశేషమును నిరుపయోగములు.
జల బిందువులను సేకరించుటవలన ఘటము పూరింపబడునటులు సకలవిద్యలు, ధర్మము, ధనము క్షణక్షణము గణము కణముచొప్పున సంపాదింపవలయును. దానోపభోగములు లేక రోజులు వెళ్ళబుచ్చువాడు చర్మముతో జేయబడిన కొలిమితిత్తివలె శ్వాసగలిగియున్నను జీవములేనివాడే.
అట్టిధనము సంపాదించు మార్గములలో వాణిజ్యమే యుత్తమ మయినది. అవసరమయిన యెడల దూరదేశముల కేగియైన వాణిజ్యము చేయవలయును. ఆలస్యము, స్త్రీసేవ, రోగము, జన్మభూమి విడువకుండుట, యల్పసంతుష్టి, భయము నను నవి యభివృద్ధికి బ్రతిబంధకములు." ఈవిధముగ నాలోచించి వర్ధమానుడు వాణిజ్య మొనరించి విశేషధనము సంపాదింప నిశ్చయించుకొనెను.
ఒక మంచిముహూర్తమున నందక సంజీవకము లనెడి రెండెద్దులను గట్టించి వర్ధమానుడు బండి సిద్ధము చేయించెను. కాశ్మీర దేశమున దక్కువగానుండి తనదేశమున బుష్కలముగా నుండు విలువయైన వస్తువులను సేకరించి తన బండియం దుంచుకొనెను. ఇంకను విస్తారమయిన పలురకములయిన వస్తువులను సంపాదించి పెక్కు బండ్లనిండ వేయించెను. మరికొన్ని సామగ్రులను కావళ్ళతో గొనిరా సేవకులను నియోగించెను. ఈవిధముగా దగుపరివారమును గూడబెట్టుకొని వర్ధమానుడు వాణిజ్యమునకై కాశ్మీరదేశమునకు బయనమాయెను. సమర్థులకు జేయరాని పనియు, నుద్యోగులకు దూరభూమియు, బండితులకు బరదేశమును, బ్రియమైన మాట లాడువారికి శత్రువులును గలుగరు.
వర్ధమాను డటులు బయలుదేఱి సుదుర్గపర్వత సమీపమందలి యడవి మీదుగా బోవుచుండెను. ఆ యరణ్య ప్రదేశమున దారి సమముగా నుండక మిట్టపల్లములుగా నుండుటవలన నొక చోట సంజీవకము కాలుజాఱి పడిపోయెను, ఈవిధమున గాలు విఱిగి పడిపోయిన సంజీవకముం జూచి వర్ధమాను డిట్లు చింతంచెను.
"పురుషు డెంతప్రయత్నము జేసినను దైవానుకూల్యమును బట్టియే యది ఫలించుచుండును. ఊరక విచారించిన నించుకంతయు బ్రయోజనములేదు. కావున బురుషుడు వృథావిచారము మాని కార్యసిద్ధికై మరలమరల యత్నింపవలయును." ఇట్లు నిశ్చయించి సంజీవకము కాడికట్టు వదలించి సేవకులను బంపి యచ్చటికి సమీపమునున్న ధర్మపుర మను గ్రామమునుండి బలిష్ఠమైన యెద్దును గొని తెప్పించి దానిని బండికి గట్టించుకొని సంజీవకము నచ్చట దిగవిడచి ముందునకు సాగిపోయెను.
సంజీవకము దైవవశమున గ్రూరజంతువుల బారిబడక యచటి పచ్చిక దిని, సమీపమందలి వాగులోని నీరుద్రావి క్రమక్రమముగా గాలినొప్పి తగ్గి విఱిగినకాలు తిన్నబడి యిటునటుం దిరుగులాడ జొచ్చెను. ఆయువు గట్టిగా నున్నయెడల సముద్రమున మునిగినను, బర్వతము మీది నుండి పడినను, మహాసర్పముకాటు దిన్నను బ్రాణములు పోవు. కాలము రానంతవఱకు బాణశతములచే గొట్టినను చావు గలుగదు. కాలము సమీపించినపుడు దర్భముల్లు తాకినంత మాత్రముననే ప్రాణము లెగిరిపోవును. దిక్కులేక యడవియందు విడువబడిన వాడైనను నెట్లో జీవించును. దైవము సాయపడనిచో నింటియందు సకలోపచారములు నుండియు మరణించును.
కొంతకాల మైన పిమ్మట సంజీవకము స్వేచ్ఛగా విహరించుచు బలిసిన శరీరము గలది యయ్యెను. ఒక్కనా డుత్సాహాతిశయమున గుహలు ప్రతిధ్వనించునట్లు మిక్కిలి గట్టిగా ఱంకె వైచెను.
ఆవనమున బింగళకుడను నొక సింహము కలదు. అది తనబలముచేత నచటి జంతువు లన్నిటిని లోబఱచు కొని సుఖముగా నా యడవి నేలుకొనుచుండెను. ఆసింహ మానాడు దప్పిగొని పానీయములు ద్రావుటకై యమునానదికి బోవుచు సంజీవక మొనరించిన యకాల మేఘ గర్జనమువంటి యఱపువిని భయపడి పానీయములు గ్రోలకయే వెనుకకు మరలి తనతావునకు బోయి "ఇది యేమై యుండు" నని యాలోచించుచు విన్న బోయి యుండెను.
ఆవనములోనే నివసించుచున్న కరటక దమనకము లనెడి రెండు జంబుకములు పింగళకుడు నీరు ద్రావబోయి భయపడిన విధము గమనించినవి. అందులో దమనకుడు కరటకుని జూచి "సఖుడా! మన రాజైన పింగళకుడు దప్పిగొనియు జలములు గ్రోలక వెనుదిరిగి పోయి వెఱపుతో నుండెను. కారణ మేమియై యుండును? విషయము కనుగొని యాతని భయము మాన్పి యాతని యాశ్రయము సంపాదింప వీలు పడునేమో?" అనగా గరటకుడు "మన మాతని సేవించుట లేనపు డాతని చేష్టలు విమర్శించుట మన కనవసరము. మఱియు నీరాజు, పూర్వ మీతని సేవలు చేయునపుడు నిరపరాధులమగు మనల నవమానించి యున్నాడు. జీవనార్థియై పరులను సేవించుటలో ననుభవించు శీతవాతాతపక్లేశములో నాల్గవపాలు సహించి, తప మొనరించి సుఖము పడయ వచ్చును. ఎవరి జీవనము పరుల కధీనమై యుండదో వారి జన్మము సఫలము. పరాధీనులై జీవించుటకంటె మరణించుటమేలు. "లెమ్ము, రమ్ము పొమ్ము, మాటాడకుము, చెప్పుము" అని సేవకులను రాజులు బాధించుచుందురు. పణ్యస్త్రీలవలె మూర్ఖులు ధనలాభము కొఱకు మాటిమాటికి దమ యాత్మను సంస్కరించి సంస్కరించి పరుల కుపకరణము గావింతురు. సహజముగా జంచలము, దగని విషయములపై బ్రసరించు నదియు నగు యజమానుల దృష్టిని సేవకులు కడుంగడు గౌరవించుచుందురు.
ఔన్నత్యముం గోరి యడగి యుండవలయును. జీవనముంగోరి ప్రాణములు విడచుట కైనను సిద్ధపడవలయును. సుఖముంగోరి దు:ఖము దెచ్చి పెట్టుకొనవలయును. ఇట్టివిధమున సేవకుడు కాగోరు మూఢు డెవ్వ డుండును" అని పలుకగా విని దమనకు డిట్లనెను.
"మిత్రుడా! అట్లనుట యుచితముగాదు. సంతుష్టినొంది సకలమనోరథములు దీర్పగల ప్రభువులను సేవించుటలో దప్పేమియు లేదు. రాజులకు శ్వేతచ్ఛత్రము, హస్తి తురగాది సైన్యము, చామర వీజనాది సంపదలు ప్రజాసేవను బట్టియేకదా లభించుచుండును?" అన, విని మరల గరటకుడిట్లనెను.
"ఏమయినను నది మనపనిగాదు. సంబంధము లేనిపనికి సిద్ధపడినవాడు మేకు నూడబెఱికిన కోతివలె మృతినొందుట నిజము. నీకా కథ చెప్పెదను, వినుము.