సంపూర్ణ నీతిచంద్రిక/నూవుల బ్రాహ్మణి కథ
నూవుల బ్రాహ్మణి కథ
పూర్వము నేనొక బ్రాహ్మణుని యింటికి భిక్షకై వెడలి యుంటిని. ఆయింటి బ్రాహ్మణుడు "ఱేపటి దిన మమావాస్య. బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసియున్నది. పదార్థము లేవి సమకూర్చియుంటి" వని భార్య నడిగెను.
"పురుషులు తమ సామర్థ్యముచేత బదార్థములు సంపాదించి యింటికి దేవలయును. అపుడు స్త్రీలు గావలసిన పనులకు వాని నుపయోగింతురు. మీరు తేకుండిన నే నేమి చేయగలను?" అని యామె బదులు పలికెను.
దాని కా బ్రాహ్మణుడు కోపగించి "పదార్థములు సంపాదింప వలయునన్నమాట నిజమేకాని బ్రాహ్మణునకు విస్తారముగా సంపాదింపవలయు ననెడి కోరిక యుండరాదు. అట్లని విధాయక కృత్యముల కత్యవసర మైనవానిని భద్రపఱుపక పోవుట తప్పుకాదా?" యని భార్యను మందలించెను. అపు డామె భర్తతో "నువ్వులు, బియ్యము గొంచెము కూడబెట్టి యుంచితిని. ఱేపు తిలాన్నము జేయుదును లెండు" అని చెప్పి నువ్వులు బాగుగా గడిగి యెండ బోసెను. ఒక కోడివచ్చి యానువ్వులు కాళ్ళతో జిమ్మెను. బ్రాహ్మణు డది చూచి బ్రాహ్మణ భోజనమున కీనువ్వులు పనికిరావు. కాబట్టి యవి తీసికొనిపోయి మార్చి తీసికొనిరమ్మని భార్యకు జెప్పెను. తరువాత నామె నేను భిక్ష కేగిన యింటికి వచ్చి "నువ్వు పప్పు దీసికొని నువ్వు లిచ్చెదరా?" యని యా యింటివారి నడిగెను. ఆ యింటి యిల్లా లామాటలు విని సంతసించి యింటిలోనుండి నువ్వులు తీసికొని వచ్చి నువ్వుపప్పు పుచ్చుకొనుచున్న సయమున నాయింటి బ్రాహ్మణు డెచటి నుండియో యింటికివచ్చెను. "భార్యను జూచి నీవేమి బేరమాడుచున్నావని ప్రశ్నించెను. ఆమె చెప్పిన సంగతి విని "వెఱ్ఱిదానా? చేరుడు నువ్వులు దీసికొని దంచిననువ్వు లిచ్చువా రెక్కడనైన నుందురా? ఈమె యిట్లు వచ్చుట కేదో కారణ ముండితీరును." అని యాబ్రాహ్మణుడు చెప్పుచుండగా భిక్షార్థ మచటనున్న నే నామాటలు విని యుంటిని. ఈ మూషికమును దగిన కారణము లేనిదే యిచట నింతధైర్యముగా గాపురముండదు."
ఇట్లు వీణాకర్ణుడు చెప్పిన కథ విని వెంటనే చూడాకర్ణు డొక గునపము దెచ్చి నేను నివసించు కలుగును ద్రవ్వి చిరకాలమునుండి సంపాదించిన నా ధనమునంతను దీసి వైచెను. నాటినుండి యుత్సాహ మంతయు బోయి యాహారమైనను సంపాదించుకొను శక్తిలేనివాడనై దిగులుపడి మెల్లమెల్లగా దిరుగుచుంటిని.
చూడాకర్ణు డట్టియవస్థలో నొకనాడు నన్ను జూచి తన మిత్రునితో నిట్లనెను. "లోకమున ధనము గలవాడే బలవంతుడు. పండితుడు నాతడే. గ్రీష్మకాలమున నదు లింకిపోయినట్లు ధనములేనివాడు చేయదలపెట్టు కార్యములన్నియు జెడిపోవును. ధనముగలవారికే బంధువులు, మిత్రులు నిలిచియుండుదురు. బిడ్డలులేని యిల్లును, చుట్టములులేని దేశము, మూర్ఖుని మనస్సు శూన్యముగా నుండును. దారిద్రునకు సర్వము శూన్యముగ నుండును. దారిద్ర్యముకంటె జావు మేలు. మరణము తత్కాలమున మాత్రమే బాధ గలిగించును. దారిద్ర్యము బ్రదికియున్నంతకాలము బాధించు చుండును. అన్నిలక్షణములును వెనుకటివలెనే యున్నను ధనము తొలగినంతనే వేఱుమనుజునివలె నయిపోవును. ఈ సంగతి యెంతయు జిత్రమయినది. ధనము:గోలుపోయి యీ యెలుక యెంత నిరుత్సాహ మొందినదియో చూడుము."
అది విని నేనిట్లాలోచించితిని. "ఇంక నే నిచట నుండుట దగదు. ఈ వృత్తాంత మెవ్వరికి జెప్పను దగదు. "ధననాశము, మనోవ్యథ, యింటిగుట్టు, మోసము, పరాభవము నెవ్వరికి జెప్పరాని" వని పెద్ద లందురు. దైవము మిక్కిలి ప్రతికూలమై పౌరుషము చెడిపోయినపు డభిమానము గలవానికి వనమే శరణ్యము. అభిమానవంతుడు మరణమైన నొందును గాని దైన్యము నొందడు. నిప్పు, నీరు చిలుకరించినను వెంటనే వేడిమి గోలుపోవదుగదా! మానవంతుడు పూలగుత్తివలె నందఱి శిరముల మీదనైన నుండవలయును. లేదా అడవిలో మంటియందుబడి నశించిపోవనైన బోవలయును. ఇచటనే యుండి యాచించుకొని బ్రదుకుట కంటె నెందైనబడి చచ్చుట మేలు.
దారిద్ర్యము సర్వాపదలకు మూలము. కల్లలాడుట కంటె మౌనము మేలు. పరసతుల గూడుటకంటె బురుషుడై పుట్టకుండుట మేలు. యాచించి జీవించుటకంటె జావుమేలు. దుష్టవృషభము లుండుటకంటె గోశాల శూన్యమై యుండుట లెస్స. అవినీతురాలైన భార్యకంటె వేశ్య మేలు. అవివేకి పరిపాలనమున నుండుటకంటె వనవాసము మేలు. అధముల జేరుటకంటె మరణమే మేలు.
వెన్నెల చీకటిని హరించును. ముదుసలితనము లావణ్యమును హరించును. హరినామము పాపములను హరించును. యాచన సర్వసుగుణములను హరించివేయును. కావున నే నేల జీవనమునకై యితరులను గాచుకొని యుండవలయును. అట్లుండుటన్న మాఱురూపమున మృత్యువు నొందియుండుటయే>" అని యెంతో యాలోచించియు దిరిగి లోభమునకు లొంగినవాడనై ధనము సంపాదింప దలచి మరల గలుగు నిర్మించుకొంటిని. లోభ మెంతపాడుగుణము? దానివలన మతి చలించును. దాన దు:ఖము గలుగును. నే నట్లు మెల మెల్లన దిరుగు చుండగా జూడాకర్ణుడు చూచి యీమాఱు నన్ను గఱ్ఱతో గట్టిగా గొట్టెను.
"ఎవనిమానసమునకు సంతుష్ఠి కలుగదో వానికి సర్వాపదలును సంభవించును. తృప్తిగలవానికి సకల సంపదలు నున్నట్లే యుండును. చెప్పులుదొడిగిన కాళ్ళకు లోకమంతయు జర్మమయముగ దోచును. సంతుష్టుడైన వానికి గలుగు సుఖ మెంతధనమున్నవానికి గలుగనేరదు. తృప్తి గలవానికి సర్వమునొడగూడును? తృష్ణకు వశుడైనవాడు దూర మనుకొనక నూఱుయోజనములైన దిరుగును. సంతుష్టుడు ధనము మోకాలిదగ్గఱికి వచ్చినను లెక్కసేయడు. వనములో ఫలమూలాదులు దిని సెలయేటినీరు ద్రావి తృణ శయ్యపై బరుండి బ్రదుకుట మేలగునుగాని ధనహీనుడై బంధు మిత్రాదుల నడుమ నుండ దగదు." అని యెంచి యాస్థల మంతటితో విడిచి నిర్జనవనముంజేరితిని. పుణ్యవశమున గొంతకాలమున కిట్టి మిత్రుడు లభించెను. నాయదృష్టమువలన జివరికి నీయాశ్రయ మనెడి స్వర్గమే లభించినది. సంసార మనెడి విష వృక్షమునకు గావ్యామృత రస మనుభవించుట, సుజనులతో సాంగత్యముచేయుట యనునవి రెండే రసవంతములయిన ఫలములు." అని హిరణ్యకుడు వివరించిన సంగతులన్నియు వినిమంథరు డిట్లుపలికెను. "అర్థములు నిలుకడ గలవికావు. యౌవనము సెలయేటి నీటివంటిది. జీవితము నీటిబుడగవంటిది. తగినకాలమున ధర్మ మాచరింపనివాడు వార్ధక్యమొంది పశ్చాత్తాప మనెడి యగ్నిచే దహింపబడును. నీ వతి సంపాదనము జేసితివి. అందుచేతనే బాధకలిగినది. తటాకజలముపొంగి గట్లు త్రెంచి వేయకుండుటకు జలమును విడుచు తూఱ యవసరమైనట్టు సంపాదింపబడిన ధనమునకు దానమనెడి రక్షణ మావశ్యకము. ధనము పాతఱలో దాచుట దాని నాశనమునకు దారి చూపుటయే.
తన సుఖము లెక్కింపక ధనము సంపాదించువాడు పరులబరువు మోయువానివలె శ్రమకుమాత్రమే పాలగును. దానభోగములే ధనమునకు ఫలములు. అవిలేని ధనికుడు దరిద్రునికంటె నధికుడుగాడు ధనమున్నను సుఖముగా ననుభవింపనివాడు దరిద్రునితో సమానుడే. సంపాదించుట యందును రక్షించుటయందును శ్రమ మాత్ర మాతనికి విశేషము. మంచిమాటలతోడి దానము, గర్వములేని జ్ఞానము, నోర్పుతోడి పౌరుషము బ్రశస్తములు. ధనసంపాదన మవసరమే యైనను దానియం దతివాంఛ దగదు. పూర్వ మొక నక్క యెక్కువ సంపాదింపగోరి వింటి దెబ్బచే మరణించెను. నీకా కథ చెప్పుదును వినుము.