సంపూర్ణ నీతిచంద్రిక/తీతువు సముద్రుని సాధించిన కథ
తీతువు సముద్రుని సాధించిన కథ
దక్షిణసముద్రతీరమున నొకపు డొక తీతువు, దాని భార్యయు నొక చెట్టుమీద గూడు కట్టుకొని నివసించు చుండెను. భార్యకు బ్రసవదినములు సమీపింపగా నొకనాడది భర్తతో నిట్లు సంభాషణము సాగించెను.
భార్య - నాథా! ప్రసవమునకు దగినచోటు వెదుకుము,
భర్త - ఇది తగిన స్థలము గాదా?
భార్య - ఇది సముద్రము నానుకొని యున్నది.
భర్త - సముద్రముచే బీడింప బడునంత యసమర్థులమా మనము?
భార్య - మనకును సముద్రునకును భేదము చాలగలదు. యుక్తాయుక్తములు, శక్యాశక్యములు దెలియ పరిజ్ఞానము గలుగువా డెన్నడు దు:ఖము పాలుగాడు. మఱియు దనకు గలుగ బోవు పరాభవము దొలగించుకొన గలుగును. అనుచితమైన పనులు చేయుట, బలవంతునితోడి పగ, స్త్రీల యెడ నమ్మకము ననునవి మృత్యువునకు ద్వారములు.
ఇట్లు సంభాషణము జరిగిన వెనుక భర్త భయములేదని భార్యకు నచ్చ జెప్పెను. తుదకు భార్య యచటనే ప్రసవించెను.
ఆదంపతుల సంభాషణము లన్నియు విన్నవా డగుటచేత సముద్రునకు వారి శక్తి యెఱుగవలయునని తలపు గలిగెను. తన తరంగములచే వాని గ్రుడ్లున్నియు నపహరించెను.
అందు కాడుతీతువు మిక్కిలి విచారించెను. మగతీతువు భార్య నోదార్చి తనజాతిపక్షుల నెల్ల రావించి తనకు గలిగిన హాని వానికి వివరించెను. వాని సానుభూతి సంపాదించి వాని నన్నిటిం దీసికొని గరుత్మంతునికడ కేగెను. వినయపూర్వకముగా వందన మొనరించి "ప్రభూ! తప్పేమియు జేయకున్నను సముద్రుడు నా కపకార మొనరించినాడు. నాసంతతిని నాశన మొనరించినాడు" అని విచారమున బలికి తనకు గలిగిన కష్టములు వివరించెను.
గరుత్మతుంతు డీమాటలు విని జాలినొంది తనస్వామియగు విష్ణువునకు వృత్తాంత మంతయు నివేదించెను. సేవకుని మనవి యాలకించి విష్ణువు సముద్రుని దండించుట కాజ్ఞ యొసగెను.
సముద్రు డా సంగతి విని భయపడి పక్షిగ్రుడ్లన్నియు బంగారు పాత్రమున నిడి తీసికొనివచ్చి యా తీతువునకు సమర్పించెను. కాబట్టి సంజీవకుని క్షుద్రుడని తేలికగా జూడరాదు. తాము పరాకున నున్నపుడు దర్పమున గొమ్ములతో బొడువ వచ్చినపుడే యా సంజీవకుని స్వభావము గుఱుతింపవచ్చును." అని శక్య మయినంత వఱకు బోధించి సెలవు బుచ్చుకొని దమనకుడు మెలమెల్లగా సంజీవకుని కడకు బోయెను.