సంపూర్ణ నీతిచంద్రిక/ఉపోద్ఘాతము

సంపూర్ణ నీతి చంద్రిక

ఉపోద్ఘాతము

భారత భూమియందు బ్రవహించుచుండు పవిత్రనదులలో గంగానది మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఆనది యొడ్డున సంపదలతో నిండిన పాటలీపుత్ర మను నగరము గలదు. సమస్తమయిన ప్రభుగుణములు గలిగిన సుదర్శను డను రాజానగరము బరిపాలించుచుండెను.

ఒకనా డొక బ్రాహ్మణుడు పఠించుచున్న రెండు శ్లోకము లారాజు వినుట సంభవించెను. ఆ శ్లోకములభావ మిది:

"మానవులకు సందేహము లన్నియు బోగొట్టి, సామాన్యదృష్టి కందని విషయములను గోచరింపజేయు నయనము శాస్త్రము. అది లేనివాడు కను లుండియు గ్రుడ్డివాడే. యౌవనము, ధనసంపద, ప్రభుత్వము, నవివేకము నను నాల్గింటిలో నే యొక్కటియైన ననర్థము గలిగింప జాలును. ఈ నాలుగు విషయములు నొక్కచోట గూడి యున్నచో వేఱుగా జెప్పనవసరము లేదు."

సుదర్శనుని కుమారులు శాస్త్రము లభ్యసింపక యెల్లపుడు జెడుదారుల సంచరించుచు నాటపాటలం దాసక్తులై యుండిరి. బ్రాహ్మణుడు చదివిన శ్లోకములు విని రాజు తన కొమరులను గుఱించి యిట్లు తలపోసెను.

"విద్వాంసుడుకాని పుత్రుడు జనించిన బ్రయోజన మేమియులేదు. కంటిబాధయేకాని గ్రుడ్డికంటివలన నుపయోగ మేమి యుండును? గుణవంతులలో లెక్కకురాని సుతుని గన్న తల్లియు బుత్రవతియే యనిపించుకొన్న యెడల నింక గొడ్రా లన నెవరు? దానమున, దపమున, విద్యయందు, నర్థలాభమున బ్రశస్తినొందని సుతుడు గలుగుట కేవలము తల్లుల కడుపు జేటుకాదా?

వేలకొలదిగా నుండు తారలకంటె జందమామ యొక్కడే చీకటి సంపూర్ణముగా హరింప గలుగును. అటులే గుణహీనులగు పలువురు సుతులకంటె గుణవంతుడగు కుమారు డొక్కడే కులమునకు గీర్తి తేకలుగును. ధార్మికుడు, గుణవంతుడు, చెప్పినమాట వినువాడు నగు పుత్రుడు మహాతప మొనరించిన వారికేకాని లభించుట కష్టము. ధనలాభము, ఆరోగ్యము, ప్రియురా లగు భార్య, చెప్పుచేతలలో నుండు సుతుడు, నర్థసంపాదమునకు బనికివచ్చు విద్యయు లోకమున దుర్లభములు. పండితుడు గాని పుత్త్రుని బుత్త్రు డనుటకంటె శత్రు డనుట యుక్తము. ఎట్టి వంశమున జనించినను విద్వాంసు డైనయెడల బూజితు డగును. ఉన్నతవంశమున జననమొందినను బండితుడుకానివానికి గౌరవము కలుగనేరదు. సద్వంశజనితమైనను గుణరహితమగు ధనువునకు విలువ యుండదు గదా! ఆహారము, నిద్ర మున్నగులక్షణములు మానవులకు నితరజంతువులకు సమానములే. ధర్మాధర్మముల వివేకమే మానవునియందలి విశేషము. ఆ వివేకమునకు విద్యయే మూలము. విద్యలేని మానవుడు వింతపశు వన బడును" అని కొంతసేపు దు:ఖించెను.

మరల "సర్వవిధముల యత్నించి సుతులను సుగుణ వంతులుగా జేయదగును. వట్టికోరికలతో నూరకుండక తగువిధమున బ్రయత్నించిన దేవుడును సాయపడకపోడు. కుమారులకు విద్యాభ్యాసము చేయింపకున్న దోసము తలి దండ్రులది. ఒంటిచక్రమువలన రథమునకు నడక గలుగని యట్లు పురుష యత్నము, దైవసాహాయ్యము గూడిరానిచో గార్యములు సిద్ధింపవు. కావున దగిన ప్రయత్న మొనరించెదను" అని దీర్ఘముగా నాలోచించి మఱునాడు పండితు లందఱను రావించి సభగావించి వారితో నిట్లు పలికెను.

"విద్వాంసులారా! విద్యాహీనులై యెల్ల వేళల జెడుదారుల దిరుగుచున్న నాసుతులకు నీతిశాస్త్ర ముపదేశించి గుణవంతులను జేయజాలు పండితులెవరైన గలరా?"

ఇట్లు ప్రశ్నింపగా మహాపండితు డగు విష్ణుశర్మ యను భూసురుడు "రాజా! ఉత్తమకులమున జనించిన నీసుతులను విద్వాంసులుగా జేయుట యెంతపని? నీకులమున నపండితు లెట్లు పుట్టుదురు? ఎంతయత్నించినను బకమును మధురముగా బలికింపలేముగాని, చిలుకను బలికించు టేమికష్టము? నీకుమారుల నాఱుమాసములలో నీతిశాస్త్రజ్ఞుల నొనరించి యొప్పగింపగలను" అని బదులు పలికెను.

అందులకు రా జెంతయు సంతసించి యిట్లనెను. "గాజు బంగారముతోడి సంబంధమున మరకతమణికాంతి నొందును. అట్లే సజ్జనస్నేహము నొందిన మూర్ఖుడును నేర్పు సంపాదింప గలడు గదా! కీటకము కుసుమ సంపర్కమున సుజనుల శిర మెక్కును. సత్పురుషులు ప్రతిష్ఠించుటవలన బాషాణమే దైవత్వము నొందును. నదీగతములగు జలములు సుఖముగా ద్రాగుటకు యోగ్యములు. సముద్రగతములగు నా సలిలములే త్రావుట కయోగ్యము లగును. ఆడువారి కనులయం దుంచబడిన నల్లని కాటుకయు నందము నొందునట్లు దుర్జనుడును మంచివారి యాశ్రయమువలన రాణించును. మిము బోలు పండితులకడ జేరి నాసుతులు నీతివిదు లగుట వింతకాదు. కావున వారలకు విద్యయొసగు భారము మీయదియే." యని పలికి బహుమాన పూర్వకముగా విష్ణుశర్మకు సుదర్శనుడు తనకుమారుల నొప్పగించెను.

పిమ్మట విష్ణుశర్మ యారాజకుమారుల నొక సుందరమైన భవనమునకు గొనిపోయి సుఖముగా గూరుచుండ జేసి వారితో నిట్లు పలికెను. "సుజనులు కావ్యశాస్త్రవినోదమున గాలము గడుపుదురు. మూర్ఖులు నిద్రావ్యసనకలహములతో గడుపుదురు. కావున మీకు వినోదముకొఱకు విచిత్రమయిన చక్కని నీతి శాస్త్రకథలు చెప్పుదును. అందు మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధి యను నాలుగు భాగములు గలవు. వానిలో ముందు మిత్రలాభము దెలుపుదును. ఆ భాగమున గాక కూర్మాదులు స్నేహమువలన నెంతయో లాభమొందినవి. వాని కథ కడుంగడు విచిత్రము. వినుడు."