సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆక్వినాస్ థామస్

ఆక్వినాస్ థామస్  :- ఇతడు ఇటలీ దేశస్థుడు. స్కౌలాన్టిసిసమ్ (scholasticism) అను తత్వశాస్త్రశాఖకు చెందినవాడు. ఆక్వినోయను సుప్రసిద్ధ వంశమువాడు. నేపిల్సు పట్టణమున జన్మించెను. మాంటి క్యాసినో నేపిల్సు లలో విద్య నభ్యసించి, డామినికన్ మతసంస్థలో చేరెమ. ఆల్బర్టప్ మ్యాగ్నస్ అను ప్రఖ్యాత పురుషు డితని గురువు. ఆరిస్టాటిల్ మతపంథకు చెందినవారిలో ఆక్వినాసు అగ్రగణ్యుడనదగును. చాల కాలము ఇతని గ్రంథముల కెక్కువ ప్రచారము లేకపోయెను. కాని 19వ శతాబ్దము నుండి వీటికి అత్యంతమైన ప్రాముఖ్యము లభించినది.

మధ్యయుగపు క్రైస్తవ మతాచార్యులలోను, విద్వాంసులలోను ఆక్వినాను అగ్రగణ్యుడు. జీవితము నందలి సమస్త విషయములను సమన్వయించి సృష్టిక ర్తకును, మానవునికిని, ప్రకృతికినిగల అంతరంగిక సంబంధమును వెలి బరచుటయే మధ్య యుగపు పండితుల ఆశయ మన వచ్చును. ఈ సమన్వయమును ఆక్వినాను కన్న సంపూర్ణముగ నేవ రును సాధించలేదనుట అతిశయోక్తి కానేరదు.

ఉత్కృష్టతను సాధించుట జీవితము యొక్క ధర్మమనియు, ప్రతి జీవియు తన స్వభావముచే ప్రేరేపింపబడి ఉత్కృష్టతను సాధించుననియు ఆక్వినాను బోధించెను. సృష్టి యందలి జీవులలో శ్రేష్ఠతర కక్ష్యయనియు, శ్రేష్ఠతమ కక్ష్యయనియు, రెండు కక్ష్యలను ఏర్పరచవలెననిన, జీవులు తమ ధర్మములను ఎంతవరకు సాధింపగలుగుదురో యనునదియే మనకు ప్రమాణము. ఈ రీతిగా జూచినచో సృష్టికర్తనుండి జీవకణము వరకును గల ఆంతరంగిక సంబంధమును, పరంపరయును గుర్తింపనగును. ఈ సృష్టి పరంపరయందు మానవుని స్థానము ముఖ్యమైనది. ఎందుకన అతనికి కేవలము భౌతిక లక్షణములేగాక ఆధ్యాత్మిక లక్షణములును కలవు. వివేకము అతని ప్రత్యేక లక్షణము.

ప్రకృతికిని, మానవ సంఘమునకును పోలిక గలదు. ప్రకృతియం దెట్లో అట్లే సంఘమునందును ఆశయములును, తదనుగుణములైన సాధనములును గలవు. ఆశయముల నెక్కువగ సాధింపగలవా రితరులకు మార్గదర్శకులై వారిని ఏలవచ్చును. సంఘము మానవవాంఛల సంతృప్తి కొరకు ఏర్పడినదనియు, సంఘమునందు ప్రతి వ్యక్తి కిని ప్రత్యేక లక్షణములును, సామర్థ్యములును గలవనియును, ప్రతియొకరును తమ తమ ప్రత్యేక కార్యములను, ధర్మములను ఆచరించుచు ఇతరులతో సహకరించిననే సాంఘిక శ్రేయము చేకూరుననియు ఆక్వినాను సూచించెను. అన్యోన్య శ్రేయమును చేకూర్చుటయే మానవుల ఆశయము, ధర్మము.

ప్రజల హితమును పెంపొందించుట ప్రభుత్వ కర్తవ్యము. అధికారమును ప్రభువు ఒక నిధిగ పరిగణింప దగును. పరిపాలకు లీరీతి ప్రవర్తించినచో ప్రజలకు ఇహపర సుఖములు రెండును లభించును. ఐహిక సుఖములు రాజ్యమునకు సంబంధించినవి. అంతకన్న మహత్త్వముకల పారలౌకిక సుఖములు మతసంస్థకు చెందిన విషయములు. కాని పరిపాలకులు రాజధర్మమును చక్కగ నెరవేర్చినచో ఇహమునుండి పరము కూడ లభించును.

రాజ్యమునందలి అధికారము నైతిక ప్రమాణముల ననుసరించియుండవలెనని ఆక్వినాను స్పష్టపరచెను. వాటికి విరుద్ధముగ ప్రవర్తించు ప్రభుత్వమున కెదురు తిరుగుట ప్రజల హక్కు. కాని ప్రభుత్వోల్లంఘనము వలన తాత్కాలి కోపద్రవముకన్న ఎక్కువకీడు పొందరాదనుట ప్రజలు ముఖ్యముగ గమనింపవలయును. కాని ఈ యంశమును గూర్చి ఆక్వినాను విశదముగ వ్రాయలేదు. న్యాయము ప్రజల హితము కొరకు మానవుని వివేకము నుండి జనించినదనియు, ప్రజాహితమే తమ ధర్మముగ నెంచు ప్రభువులచే నిర్దేశింపబడినదనియు ఆక్వినాను నిర్వచించెను. సృష్టి యంతయు క్రమబద్ధమైనదనియు, మానవ నీతిధర్మములకును, దైవసంకల్పమునకును అత్యంతమైన సంబంధము కలదనియును, ఆక్వినాను యొక్క ఆశయము.

జి. ఎన్. ఎస్.

[[వర్గం:]]